శప్తభూమి: వీరమంటపం మీద అస్ర నైవేద్యం!

‘రాయలసీమ చారిత్రక నవల కాదు, రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవల’ అని చదివిన ప్రతి పాఠకుడి గుండె స్పందించడం కోసం!

విత్వానికి సంబంధించి William Wordsworthప్రసిద్ధమైన కోట్- ‘కవిత్వమంటే ప్రశాంతతలో జ్ఞప్తి తెచ్చుకునే ఉద్వేగం (emotion recollected in tranquility)’ ని బదాబదలు చేస్తూ T S Eliot తన ‘Tradition and the Individual Talent’ అనే వ్యాసంలో ఇలా అంటారు: “Poetry is not a turning loose of emotion, but an escape from emotion; it is not the expression of personality, but an escape from personality.”

ఇది కూడా ఎంతో ప్రాచుర్యం ఉన్న ఉల్లేఖనే. ప్రపంచ ఆధునిక కవిత్వానికి దిశా నిర్దేశం చేసిన ఆ మహా సాహితీ సృష్ట చేసిన ఈ వ్యాఖ్య నన్ను వదలక వెంటాడుతూ, దాన్ని సమన్వయం చేసుకునే స్వానుభవం చాలని పెనుగులాటలో సహానుభవాల కోసం వెదుకులాడేలా చేసింది.

ఉద్వేగం నుంచి తప్పుకోవడం, వ్యక్తిత్వ వ్యక్తీకరణ పరిమితుల్ని దాటగలగడం కవిత్వానికే కాకుండా, మొత్తం సాహిత్యానికే అన్వయించుకోవాల్సిన అవసరముందనిపించింది. అది నాకే తోచిన విషయం కాదు, అదే వ్యాసంలో ఎలియట్ తానే అన్నారు: “The progress of an artist is a continual self-sacrifice, a continual extinction of personality.”

కవే కాదు, రచయితే కాదు, ఏ రంగానికి సంబంధించిన ఏ సృజనశీలికైనా ఇది వర్తిస్తుంది- ఒక నిరంతర ఆత్మత్యాగం!

వీరమంటపం ఎక్కి శ్రీశైలం మల్లన్నకు తనను తాను అర్పించుకొంటాడు బిల్లే ఎల్లప్ప. ‘శప్తభూమి’ కోసం అక్షర వీరమంటపం మీద ఒక్కొక్క అవయవాన్నే తెగనరుక్కొని ‘a continual extinction of personality’ అంటే ఏమిటో నాకు తెలిసివచ్చేలా చేశారు బండి నారాయణస్వామి. ఇలా ‘అనల వేదిక ముందు అస్ర నైవేద్యం’ని నాకు అనుభవంలోకి తెచ్చిన అతి తక్కువ తెలుగు రచయితల్లో అతి ముఖ్యులు నారాయణస్వామి.

ఆ మధ్య ‘శప్తభూమి ‘ మీద చర్చని సాహిత్య నౌకా విహార కార్యక్రమంగా నిర్వహించారు ‘ప్రైడ్ ఓవర్ ప్రెజుడీస్ ‘ సాయి పాపినేని గారు. డా. కేతు విశ్వనాథరెడ్డి ప్రధాన ప్రసంగం చేసిన ఆ చర్చలో ‘శప్తభూమి’ని ‘రాయలసీమ చారిత్రక నవల’ అని కాకుండా, ‘రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవల’ గా ‘కుదించడం’, ఆ నవలని దళిత సాహిత్యానికి ‘పరిమితం’ చేయడం గురించి చాలా అభ్యంతరాలు వచ్చాయి. ‘దళిత నవల’ అంటే దానిని categorize చేసి తగ్గించడమని, ‘అందరికీ చెందినది’ అంటే దానికి ‘విస్తృతి’ కల్పించడమనే దురభిప్రాయాలు తెలుగు సాహిత్యంలో బాగానే చెలామణిలో ఉన్నాయనడానికి ఆనాటి చర్చ ఒక ఉదాహరణ మాత్రమే.

దళిత వాదమంటే విభజించడం, చీల్చడం, ఒక మూసలో కూరుకుపోవడంగా ప్రత్యర్థులు అపోహపడుతుంటే, అనేకానేక సమస్యల్లో ముందు అంతుచూడాసిన అంశంగా దళిత వాదానికి ప్రాధాన్యతలు కేటాయించే దగ్గరే ఆగిపోతుంటారు అనుకూలురు! దళిత వాదం ఇంకా సమగ్రమైనది, ఇంకా చెప్పాలంటే బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనని కూడా అధిగమించి (అధిగమించడం అంటే విడనాడటం కాదు) ఇంకా మున్ముందుకి నడిచినది. ఆర్థిక, సామాజిక అసమానతల్నే కాదు, లింగ వివక్ష (gender discrimination) ని కూడా దళిత వాదం ఉద్దేశిస్తుంది, పట్టించుకుంటుంది. ఎక్కువ- తక్కువ కులస్థులుగా చీలి, మెజారిటీ- మైనారిటీ మతస్థులుగా చెదిరి, ఆడ- మగ అణిచివేత- ఆధిక్యతలుగా వేరైన అందరినీ, వారి ప్రత్యేకతలు, వారి వైవిధ్యాలు, వారి వారి సంస్కృతుల భిన్నత్వాన్ని నిలుపుతూనే కలిపే బహుముఖీనత- దళిత వాదం! దళితం అంటే విదళితం కాదు, కందళితం! అంబేద్కర్ కలలుగన్న దళిత భారతం అంటే అదే. ఆ egalitarian సమాజం ఏర్పడాలంటే, అసమానతలకి కళ్ళు మూసుకొని, ‘అంతా ఒక్కటే, అందరూ సమానమే’ అనే ఒట్టొట్టి మాటల so-called ఆదర్శవాదం పనికిరాదు. వేల సంవత్సరాల దాష్టికాన్ని, దౌర్జన్యాన్ని తరచి తరచి చూడాలి, పీడన ఒక ధర్మంగా చెలామణి అయిన కాలాన్ని పట్టి పరిశీలించాలి, పైన ఎలియట్ అన్నట్టు సహజోద్వేగాలు, రాగద్వేషాల్నుంచి తప్పించుకొని, ఒక ఎత్తైన స్థలం నుంచి గమనించాలి, మహాభారత యుద్ధాన్ని బర్బరీకుడి ఖండిత శిరస్సు పరికించినట్టు.

‘శప్తభూమి’ – ఎంతో పెద్ద కాన్వాస్, ఎన్నెన్నో పాత్రలు- పాలెగాడు సిద్ధరామప్ప నాయుడు అతని దళవాయి సుబ్బరాయుడు, చార్లెస్ బ్రౌన్ వంటి కొందరే వాస్తవం- అగ్రహారీకుడు నాగప్ప ప్రగడ నుంచి అట్టడుగు వర్ణాల కంబళి శరభుడి వరకూ ఎక్కువ పాత్రలు అధివాస్తవం. అగ్రకులస్థులు అమర నాయకుడు నల్ల నాగిరెడ్డి, అతని నాన్న వీరనారాయణ రెడ్డి, తమ్ముడు ఎర్ర నాగిరెడ్డి, కురమ కులం ఎల్లప్ప (జెట్టీ), అతని మామ బాలకొండ బీరప్ప, ఎల్లప్ప ఇష్టపడిన మామ కూతురు ఇమ్మడమ్మ, ఆమె మనసుపడిన కోడె నీలడు, బోయ హరియక్క, దేవదాసీ పద్మసాని, ఆమె పెంపుడు కూతురు నాగసాని, కొడుకు మన్నారు దాసు, తిక్కస్వామి, నిడుమాడు స్వామిగా మారిన మాదిగ గురవడు వంటి అనేకానేక పాత్రల, కథల, ఉపకథలతో ఉపరితలాల్ని చీల్చుకొని, అంతర చిత్రాన్ని చూసినప్పుడే అసలైన సత్యం కనబడుతుంది; ఆ profound సత్యపు లోతులు తెలియాలంటే అధివాస్తవ దృష్టే ఆసరా అవుతుంది.

చరిత్రలో, ముఖ్యంగా రాయలసీమ చరిత్రలో ఒక కాలవ్యవధిని – 1775 -1788 మధ్య, బర్బరీకుడిలానే చూశారు నారాయణస్వామి. కురుక్షేత్ర యుద్ధ ధర్మంలో అధర్మం అర్థమయ్యింది కనుకనే బర్బరీకుడి తల ఆక్రోశిస్తూ నేలరాలిపోయింది. ఆ ఆక్రోశమే ‘శప్తభూమి’ రచన, అలా తల నేలరాలిపోవడమే ఆ రచనలో ‘ continual extinction of నారాయణ స్వామి personality’ అని నేను అర్థంచేసుకున్నాను.

దీన్నే మరికొంత వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను: తెలుగు ఆధునిక సాహిత్యంలో బండి నారాయణస్వామి స్థానం చాలా ప్రత్యేకం. తన రచనల ద్వారా ఆయనని ఒక దళిత బహుజన పక్షపాతిగా గుర్తింపుపొందారు. ‘శప్తభూమి’ కూడా అందుకు మినహాయింపు కాదు. రచయిత దళితపక్షపాతే కావచ్చు, అణగారిన ప్రజల ప్రతినిధే కావొచ్చు. కానీ, రచన అనే సాధనలో, సత్యశోధనలో ఏదో ఒక వర్గం, సమూహం వైపు చేరిపోవడం సృజనసూత్రాలకి పూర్తివిరుద్ధం. అది సత్యశోధన కింద రాదు, తాను ముందుగానే నిర్ధారించుకున్న నిజం దిశగా తర్కాన్ని తరలించడం, వాస్తవాల్ని వక్రీకరించడం, తీర్పులతో తయారైపోవడం. కానీ, నిజమైన సృజనకారుడు manipulator కాలేడు. ముఖ్యంగా చరిత్రని అర్థంచేసుకోవాలని, తనకు తేటతెల్లమైనది ప్రపంచానికి తెలియజెప్పాలని చూసే నిబద్ధ రచయిత- పిండిబొమ్మల్లాంటి హీరోల్ని- విలన్లనీ కల్పించడు. నారాయణ స్వామి అత్యున్నతస్థాయి రచయిత కావడం వల్లనే ఆయన కూడా కథని చెప్పుకుంటూ పోయారే గానీ, సజీవమైన పాత్రల్ని పరిచయం చేస్తూ సాగారే గానీ, value judgments కి, వ్యాఖ్యానాలకీ పోలేదు. ఇదే ఎలియట్ అన్న – ‘self- sacrifice’, ‘extinction of personality’.

ఈ తాటస్థ్యం- రచయిత సహజ ఔన్నత్యంగా అర్థమౌతుందే తప్ప, పనిగట్టుకొని రచయిత చూపిన బాధ్యతగా, లేదా విధిలేక తలకెత్తుకున్న academic సూత్రంగా చదవరికి అనిపించదు. అలాగని, నిర్మమత్వం పేరిట రాజు నొప్పిని, బంటు బాధని ఒకే తరాజులో తూచే షరాబుగా ఎక్కడా లేరు నారాయణస్వామి ఈ నవలలో. రచయిత నిల్చింది బానిసలకి బాసటగా, పతితుల పక్షాన, దళితులకు దన్నుగా అని తెలుస్తూనే ఉంటుంది, కానీ, అది వాచ్యంగా ఉండదు. అది రచయిత శిల్పచాతుర్యం. ఆ శిల్పం కూడా ‘art sake’ కాదు; అధోజనుల కోసం ఎంతో ఆరాటపడి, ఆ తన బాధని ప్రపంచపు బాధగా చేయడం కోసం; ‘శప్తభూమి ‘ – ‘రాయలసీమ చారిత్రక నవల కాదు, రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవల’ అని చదివిన ప్రతి పాఠకుడి గుండె స్పందించడం కోసం!

**      **      **

 

నరేష్ నున్నా

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అధిగమింౘు : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
    సం. స.క్రి.

    1. చదువు;
    2. తెలియు;
    3. పొందు.

    अधिगम m. adhigama profit
    अधिगम m. adhigama mastery
    अधिगम m. adhigama study
    अधिगम m. adhigama act of attaining
    अधिगम m. adhigama knowledge
    अधिगम m. adhigama acquisition
    अधिगम m. adhigama mercantile return
    अधिगम m. adhigama acquirement
    अधिगमन n. adhigamana study
    अधिगमन n. adhigamana acquisition
    अधिगमन n. adhigamana marriage
    अधिगमन n. adhigamana finding
    अधिगमन n. adhigamana copulation
    अधिगमन n. adhigamana acquirement
    अधिगमन n. adhigamana reading

  • చాలా బాగుంది.
    నవల స్థాయిని అందుకున్న, అందించిన విశ్లేషణ .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు