‘భద్రాచలంలో రాబోయే ఏప్రిల్ 15 న నీ కచ్చేరీ, అభ్యంతరం ఏమీ లేదుగా’
అని నాన్నగారు అడగ్గానే నా చుట్టూ వున్న అన్ని శబ్దాలూ నిశ్శబ్దమయ్యి కేవలం అతి వేగవంతమైన నడకలో మారుమ్రోగుతున్న నా గుండె చప్పుడు ఒక్కటే చెవుల నిండా వినిపించింది. ఇంతలేసి ఇసుకదిబ్బల మధ్య నుంచి గుంభనంగా ప్రవహించే గోదావరి కళ్ళ ముందు కనిపించింది. అంతర్వాహినికి దగ్గరగా వెళ్ళినప్పుడు చూసిన అలల తాకిడి, ఇప్పటికిప్పుడు నాలోపలే స్పురించింది.
ఇక్కడినుంచి భద్రాచలానికి 939 కి.మీ. దూరం, 16 గంటల 17 నిమిషాల ప్రయాణం, నిజంగా అంత దూరంలో ఉన్నానా? కొన్నిక్షణాల క్రితమే వెళ్ళివచ్చినట్టు, యుగాలక్రితం విడిచి వచ్చినట్టూ ఎప్పుడూ నా మనసు కొట్టుమిట్టాడే తీరం అది.
నేనివాళ అదే గోదావరీనది పుట్టిన చోట ఉన్నాను మహారాష్ట్ర లోని ‘నాసిక్’ లో, ఆగ్రాలో హిందుస్థానీ సంగీతం ఐదేళ్ళు నేర్చుకున్న తరువాత ‘తుకారాం అభంగాలు’ నేర్చుకొనేందుకు కొన్ని నెలల క్రితమే నాసిక్ కి వచ్చాము.
నాన్నగారికి జవాబు చెప్పానో, లేదో గుర్తులేదు. మనసుతో పాటూ నేనూ వెనక్కి వెళ్ళాను. ‘అతని’ స్థిరమైన తలపొకటి వచ్చి చెయ్యిపట్టుకొని గతంలోకి తీసుకొని వెళ్తోంది.
నేను పుట్టి పెరిగింది భద్రాచలంలోనే, సంగీతాన్ని శ్వాసగా, భగవత్సేవగా భావించే యజుర్వేదుల రఘురామశర్మగారు మా తాతగారు. ఆయన వద్దనే నా స్వరాభ్యాసం మొదలైంది. నిద్ర లేవడానికి కాస్త ముందు నుంచీ నిద్రలోకి జారుకొనేంత వరకూ వినిపించేది సంగీతమొక్కటే!
సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పుస్తకాల బ్యాగ్ పడేసి, సంగీతం పాఠానికి వచ్చే వారికి పొగడ చెట్టు కింద చాపలు వేయడం, తాతగారి సంధ్యావందనం అయ్యేలోపు, ముందురోజు పాఠాన్ని టీచరమ్మలాగా వారితో వల్లెవేయించడం, నిజంగా ఏ బాధా లేని బాల్యం, సరళీస్వరసహిత బాల్యం. పన్నెండేళ్ళు నిండేసరికి, తంబుర పట్టుకొని తాతగారితోపాటూ కచ్చేరీకి వెళ్ళడం గొప్ప జ్ఞాపకం. అలా కచ్చేరీకి వెళ్ళేటప్పుడు అమ్మ నాకు పెద్ద పెద్ద జూకాలు, పొడవాటి గొలుసూ వేసేది. చిక్కగా కట్టిన మల్లెదండ తలలో పెట్టేది. దర్జాగా చేతులు కట్టుకొని కూర్చుంటే వేడి వేడి ముద్దలు తినిపించి కొంగుతో మూతి తుడిచి పంపేది. తాతగారితో కారులో వెనక సీట్లో కూర్చొని సంగీతం గురించే మాట్లాడుకుంటూ వెళ్ళడం!
“తల్లీ! నిద్రలేచాక దినచర్యలోకి, ఒక నిజమైన మెలకువలోకి రావడం ‘భౌళి ‘ రాగంతో సులభం అవుతుంది. అలసిపోయిన మనసును సేద తీరుస్తుంది. రోజును ఈ రాగంతో ప్రారంభిస్తే మనసుకు ఎనలేని శక్తి వస్తుంది. ‘కాపీ రాగం’ ఒక బంధాన్ని, శాంతినీ చెప్తుంది. షణ్ముఖ ప్రియ మెదడుకు ధైర్యాన్ని ఇస్తుంది”, ఇట్లా లెక్కలేనన్ని విషయాలు, ఏ నిమిషమూ వృధాపోలేదు తాతగారితో నాకు.
పదహారేళ్ళప్పుడు, సంగీతం నోట్సు పట్టుకొని తాతగారి దగ్గరకెళ్ళాను.
‘ఒక్క సారి వరాళి రాగం నేర్పండి తాతగారూ, రెండోసారి నేనే పాడుకుంటాను’ అని అడిగాను.
ఆయన పెద్దగా నవ్వి
” ‘వరాళి’ అని పేరు పెట్టుకున్నావ్, అర్ధమూ, ఉద్దేశ్యమూ తెలీకుండానేనా! వరాళి గురువులు నేర్పని రాగం. ఇది పాడే స్థాయి వచ్చిందీ అంటే విని సొంతంగా నేర్చుకోగల స్థాయి వచ్చినట్టే. ఈ రాగం నేర్పితే గురు శిష్య సంబంధం బెడుస్తుందని కూడా ఒక మాట ఉందనుకో” అని ఆగి
“ఏమీ మనసు విప్పి చెప్పకుండానే సొంతంగా శ్రద్ధతో తెలుసుకోవలసినది ఈ మూసిన ముత్యం, నా మనవరాలు కదా! నువ్వేమీ నోరు తెరచి చెప్పకుండానే నీ చుట్టూ ఉండేవారూ, మీ శ్రీవారూ నిన్ను అర్ధం చేసుకొని మసలుకోవాలని నా ఆశ తల్లీ, అందుకే నీకు ఆ పేరు పెట్టాను” అని గట్టిగా నవ్వేశారు, నేనూ నవ్వుతూ అర్ధమయ్యీ కాని స్థితిలో కాసేపు తాతగారి దగ్గరే కూర్చున్నాను.
***
ఆరోజు పుష్యమాసం, కృష్ణ పంచమి, శ్రీ త్యాగరాజస్వామి వారి 140 వ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ, తాతగారి శిష్యులూ, తెలిసిన వారూ, దగ్గరి బంధువులూ అందరితో ఇల్లంతా హడావిడిగా ఉంది. మేడమీదికి తాతగారిని పిలుచుకురావడానికి నాన్నగారు వెళ్ళారు. మరో నిమిషానికి ఆయన గట్టిగా అరుస్తూ అందరినీ పిలిచారు
‘నాన్నగారికి ఏమైందో చూడండ్రా!!’ అని,
అక్కడే ఉన్న డాక్టరు గారు కూడా పైకి వెళ్ళారు అందరితోపాటూ.
తాతగారి కళ్ళు వెలుగుతూ ఉన్నాయి, ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు, నెమ్మదిగా ఆయన కుడిచేతి వైపున్న పుస్తకం చూపించారు, నాన్న చేతిలో నా చేయి పెట్టి కన్నీరు పెట్టుకున్నారు, నేను చూస్తూనే వున్నాను రెప్పవేయకుండా, తాతగారి చేతిని కాస్త గట్టిగానే పట్టుకున్నాను, ఆయన చేయి మాత్రం క్షణంలో పట్టు సడలి పోయింది. అందరూ ఒక్కసారిగా ఏడుపు. నేను మాత్రం ఏ స్పందనా లేని దిగులులోకి జారిపోయాను. పుట్టిబుద్ధెరిగినప్పటి నుంచీ అలవాటు పడిన సందడి ఒక్కసారిగా మాయమైంది.
తాతగారి మొదటి మాసికం రోజున, ఆయన ఆఖరుగా చూపించిన పుస్తకం చేతిలో పట్టుకొని కూర్చున్నాను. లక్షప్రశ్నలకు ఒక్క సమాధానమూ లేని మెదడుతో తెరిచాను. అందులోని మొదటి పేజీలో తాతగారి దస్తూరీతో రాసుంది
‘సంగీత జ్ఞానము, భక్తి వినా!’ ‘తల్లీ వరాళీ, నా సంగీత జ్ఞానమంతా రంగరించి నీకు ఉగ్గు పోశాను, నీ ఊపిరున్నంతకాలం సాధన చెయ్యి, సంగీత ప్రపంచంలో నిన్ను అత్యున్నత స్థాయిలో చూడాలని ఈ తాత కోరిక. సంగీతనేపథ్యం లేని కుటుంబంలోకి వెళ్ళి ఈ బంగారుతల్లి మూగబోతుందేమో అని నా భయం. అది నేను ఊహించనేలేను. సప్తస్వరాలతో నిన్ను నువ్వు ఆవిష్కరించుకొనే జీవితం ఎంచుకో, శుభం తల్లీ !!’ అని రాసి ఉంది .
ఆయన ఎంతో మమకారంతో నా గమ్యాన్ని ఆశించారు, నిర్దేశించారేమో !
***
తాతగారు పోయిన చాన్నాళ్ళకి ఓ రోజు రాములవారి గుడిలో చూశాను అతనని, కవిసామ్రాట్ విశ్వనాథ వారిలా ఇంత భారీ వ్యక్తి, ఆయనలానే ఎడమచెయ్యి చెంపకింద పెట్టుకొని తల వంచుకొని ఏదో రాసుకుంటూన్నప్పుడు చూశాను.
తర్వాత కొద్దిరోజులకి నేను రాములవారి కోనేటి దగ్గర ‘సామజ వరగమన … ‘ పాడుకుంటూ వుంటే వచ్చి ఎదురుగా కూర్చున్నారు.
నా పాట పూర్తవ్వగానే తనే పరిచయం చేసుకున్నారు
”నమస్కారం, ఎంత బాగా పాడుతున్నారండీ, మీ గొంతు చాలా శ్రావ్యంగా ఉంది, దేవుడు మీ గొంతుని శృతి చేసి భూమి మీదకు పంపినట్టున్నాడు. ఎప్పటినుంచీ నేర్చుకుంటున్నారు?” కొన్ని అభినందనలు, మరికొన్ని ప్రశ్నలు. కాస్త ఆశ్చర్యపడుతూనే సమాధానం చెప్పాను
“మాట్లాడడం రాకముందు నుంచీ పాడటం నేర్చుకుంటున్నానండీ, యజుర్వేదుల రఘురామశర్మగారి మనవరాల్ని”
“ఓహ్, ఎంత అదృష్టవంతులండీ! నా పేరు శ్రీరామచంద్ర, హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో పి.హెచ్.డి. చేస్తున్నాను. నాన్నగారికి ఇక్కడి తాలూకాఫీసుకి ట్రాన్స్ఫర్ అయితే వచ్చాము”
పరిచయాలు జరుగుతుండగానే సన్నగా తుంపర మొదలైంది
“వస్తానండీ” అని నేను బయల్దేరుతుంటే
“మీ పేరు చెప్పలేదు, ఇంటికెళ్ళి ఎవరి పాట విన్నానని రాసుకోను?” అని అడిగారు,
ఎక్కడా చూడని వింత దిగులు అతని మొహంలో చూసి నవ్వు ఆపుకోలేకపోయాను.
‘వరాళి’ అని రాసుకోండి’ అని బదులు చెప్పి వచ్చేశాను.
ఇక నా సాయంత్రాలన్నీ తనవే,
‘వరాళీ, ఈ కీర్తన ఒక్కసారి పాడవా!’
‘ఈ వ్యాసం చదువు’
‘ఆ కీర్తన వెనక ఎంత ఆర్ధ్రత ఉందో చూడు’
’ఈ పుస్తకం చదివావా?’
‘దీని అర్ధం తెలుసా?’
‘ఈ కీర్తన ఊహించుకొని పాడవూ’
‘రాముణ్ణి గట్టిగా తలచుకొని, సందర్భంలోకి నెమ్మదిగా వెళ్ళి పాడు’
వేలవేల అభ్యర్ధనలు. ఒక్కోసారి పాడుతుంటే చేతులు జోడించి కంటతడి పెట్టుకొనేవారు. ప్రక్కరోజు ఒక కాగితం మీద అందమైన పూవులు లతలు వేసి మధ్యలో ముత్యాలు పేర్చినట్టు కొన్ని ప్రియమైన వాక్యాలు నా కోసం రాసి ఇచ్చేవారు.
ఇక నా కాలమంతా తనే
‘వరాళీ, నీకోసం చిన్న కానుక’ చేతిలో పెద్ద తురాయి పూల కొమ్మ,
‘హబ్బ, ఎంత బావున్నాయో!’ అని నేనంటే
‘నీతో పోల్చుకొని ఇప్పటికే కొన్ని ముడుచుకున్నాయి చూడు’ అని తను
‘ముడుచుకున్నవన్నీ మీ నవ్వులు చూసి వెన్నెలనుకొని విచ్చుకుంటాయిలే!’ అని నేను
మాటలు ఎటు పోతున్నాయో, మనసులు ఎటు ఒరుగుతున్నాయో చూసుకున్నదెవరు?
మరుసటి రోజు సాయంత్రం సన్నజాజుల దండ కట్టుకొని గుడికి బయల్దేరేటప్పుడు నాన్నగారు పిలిచారు
‘వరాళీ! వాళ్ళు ఎవరో, ఏమిటో, వాళ్ళ నేపథ్యం ఏమిటో తెలియకుండా అంత కలుపుకోవడం నీకూ ఇంటికీ మంచిది కాదేమో, ఆలోచించి నడువు తల్లీ, చిన్నదానివి కాదు కదా!’ అనేసి వెళ్ళిపోయారు.
ఎవరి గురించి చెప్తున్నారో తెలుస్తోంది, నేనూ, నా ఆలోచనలూ నేరుగా కోనేటి మెట్లమీదికి వెళ్ళాం.
‘వరాళీ, అల్లుకున్న సన్నజాజిదండ నీ దగ్గరే ఉంచుకుంటే, నీ భక్తి రాముడికెలా తెలుస్తుంది చెప్పు?’
అతను నవ్వుతూ అడుగుతుంటే, దేనికో అన్వయించుకొని నా కళ్ళలో నీళ్ళు కదిలాయి ఒక్క క్షణం.
‘అదేంటి చందమామకు మబ్బులు కమ్మాయి, ఏమైంది?’
‘కాస్త నలతగా ఉంది’ అని తలతిప్పుకోబోయాను
‘కాదులే చెప్పు, మరేదో, నీ కళ్ళు నన్ను చూడట్లేదు, ఏమైంది? నాకు చెప్పవూ!’
అతను కంగారుగా బ్రతిమాలుతుంటే చూసుకున్నాను కళ్ళ నిండా అతన్ని, ఏమనుకుంటున్నాను ఇతని గురించి నేను? తనేం అనుకుంటున్నారు నా గురించి? సంగీత తరంగాల మీదుగా ఒకరి చేతులు ఒకరం పట్టుకొని కాలాన్ని దాటేస్తున్నామే కానీ, ఇది శాశ్వతమా, కాదా అని యోచించింది ఎవరు?
ఎట్లా అడగడం, ‘మీరేమిటి’ అని?
సరిగ్గా అప్పుడే … నల్లబల్ల మీద పసివాళ్ళు రాసుకున్న కవిత్వాన్నంతా ఒక్కసారిగా ఎవరో తుడిపేసినట్టు అక్కడికి నాన్నగారు వచ్చారు, పరిచయాలు ప్రతినమస్కారాలు అయ్యాక వారిద్దరూ మాట్లాడుతుండగా అనాలోచితంగా ఇంటికి వచ్చేశాను.
అదే అతనిని చూడడం ఆఖరుసారి అవుతుందనే స్పృహ ఉండిఉంటే వెలితిలేకుండా మరోసారి చూసుకొనేదాన్నేమో … తను నాతో ఏమైనా చెప్పాలనుకున్నారేమో? నేనేదైనా అడిగిఉండేదాన్నేమో … ఒక్క నిమిషం ఆగి ఉంటే కొన్ని యేళ్ళ తరబడి ఇలా కనురెప్పల మధ్యన లంగరు వేసుకొని మేలుకొని ఉండేదాన్ని కాదేమో …! అదే వారంలో హిందూస్థానీ సంగీతం నేర్చుకొనేందుకు ఆగ్రా ప్రయాణం కావడంతో, ఏదీ మాట్లాడే అలవాటులేని నా మనోసంప్రదాయం చివరికి అక్కడితో పూర్తిగా మూగబోయింది. నాకేది కావాలో ఎందుకు కావాలో ఎలా అడగాలో తెలియని కాలం అది.
అప్పటినుంచీ లోకమంతా వెలుతురూ చీకటీ ఏదీకాని బూడిదరంగులో కనిపించేది. ఏ శబ్దమూ పూర్తిగా వినిపించేది కాదు. నా ప్రతి స్వరం వెనుక ఎదో తెలియని విషాదం పలుకుతోందని పాట విన్న ప్రతిఒక్కరూ ఫిర్యాదు చేసేవారు, చివరికి అదే విషాదపుఛాయ అనుకోని పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది వద్దనుకున్నా. ఆ అతనితోనే నా సంతోషాన్నీ స్పందననీ పంపేశానేమో! కావాలనుకున్నానో లేదో తెలియని మీమాంసలోనే మిళితమైపోయిన ఎదురుచూపులు, అలవాటైపోయిన ఎదురుచూపులు, వెనక్కి పోలేని దిగాలు చూపులు మిగిలాయి. తాతగారు అన్నట్టు నోరుతెరచి చెప్పకుండానే అర్ధం చేసుకోవాలనుకోవడం తప్పేమో? కాస్త సమయం తీసుకొని ఉండాల్సింది. ఇంకాసేపు అక్కడే ఆగివుంటే తెలిసేది కదా ఏమయ్యేదో? ఇప్పటికీ పాడుతున్న ప్రతి పాటలోని ఆర్ద్రత వెనుక నా దిగులు చెప్తున్నాననే అనుకుంటున్నాను, ఎవరికీ వినిపించట్లేదేమో, నిత్యం కరుగుతున్న ఆశలు ఈ చెంపలపై జారేటప్పుడూ కనిపించట్లేదేమో!
ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు, బరువెక్కిన కనురెప్పలు తెరచి మెల్లగా చుట్టూ చూశాను. తెల్లవారిపోయిందా! నేను రాత్రి నుంచీ ఇలా నేలమీదే పడి ఉన్నానా ! లేచి తలుపు తీశాను. శాంతి, నాకు సాయంగా నాతోనే ఉండేందుకు నాన్న గారు పెట్టిన అమ్మాయి. మంచి శాస్త్రీయ సంగీతపుశ్రోత కూడా, కాఫీ కప్పుతో వచ్చి, నా స్థితి అర్ధంగాక
‘నిద్ర పోలేదా అమ్మా!’ అని అడిగి నేల మీద పడున్న పాత పుస్తకాలూ కొన్ని విడి కాగితాలూ చూసి
‘అయ్యో! రాత్రంతా చదువుకున్నారా, కాఫీ తాగండి, నేను చిటెకలోచక్కబెట్టే స్తాను’ అని గదంతా సర్ది వెళ్లి పోయింది. (పిచ్చి మాలోకం రాత్రంతా నేను తవ్వుకున్న కనబడని గతాన్ని చక్కబెట్టగలిగేది ఎవరని?)
పగలూ రాత్రీ నేనిట్లా పరధ్యానంలో మునిగిపోతే కాలం ఆగిపోతుందా, ఏప్రిల్ వచ్చేయదూ!
“రేపే భద్రాచలం ప్రయాణం తల్లీ, అన్నీ సర్దుకున్నావా?” నాన్నగారు అడుగుతున్నారు,
తలూపాను, సర్దుకున్నాను, ‘అతని’కి ఇష్టమైన ఆకుపచ్చ రంగుకి బంగారు అంచు ఉన్న కాంచీపురం చీర, అతని చేతి వ్రాతతో ‘త్యాగయ్య కీర్తనల నోట్సు’ అని రాసున్న పుస్తకం, అతనికిష్టమైన రామదాసు కీర్తనలు కొన్ని పాడి చూసుకొని అప్పటి గొంతు ఇప్పుడు మరోసారి సర్దుకున్నాను. ఎందుకివన్నీ? నాకింకా ఇవే లోకం అని చూపించడానికా? నేనింకా ఆ కాస్త వసంతాన్ని మర్చిపోలేదు అని చెప్పడానికా? అయినా ఎవరికి చెప్తాను? దూరంగా ఉండి నిలువెత్తున నాలో జ్ఞాపకంగా మసలుతున్న వారికా? అన్నీ తెలిసి నా గుర్తింపు కోసం అన్నింటికీ దూరం చేసి అతి దగ్గరగా ఉన్నవారికా? ఎవరికి చెప్పగలను?
మనసెటో ప్రవహిస్తోంది. జీవితకాలాన్నిరెండుగా విభజిస్తూ
***
ఏప్రిల్ 13 న నేను, అమ్మ, నాన్న, శాంతి భద్రాచలం బయల్దేరాము. ఖమ్మం వరకు రైలు, అక్కడి నుంచి కారులో వెళ్తుంటే
‘కాసేపైనా నిద్రపోండమ్మా, కచేరీకి గొంతు సహకరిస్తుంది. భద్రాచలం దగ్గరవ్వగానే నేను లేపుతాగా!’ అని శాంతి నా పేలవమైన కళ్ళు చూసి బ్రతిమాలుతోంది.
నాకు నవ్వాగలేదు, కళ్ళలో దాచుకున్న నీళ్ళూ ఆగలేదు
‘భద్రాచలం వస్తే నువ్వు లేపటం ఏమిటి శాంతీ, నాకే తెలిసిపోదూ!’ అని మాత్రం అనగలిగాను.
గుండె వేగం పెరుగుతోంది, ఇంత తెల్లవారుఝామున ‘వీధుల్లో ఎందుకు తిరుగుతారు?’ అయినా సరే ప్రతీ ముఖానికి దీపం వేసి వెదుక్కుంటున్నాయి కళ్ళు .
భద్రాచలరాములవారి మాడవీధిలోని నా జ్ఞాపకాల కోటకి వచ్చేశాము,
ఇన్నేళ్ళ నుంచీ నాకోసం చేతులు చాచుకొని, చాచుకొని అలసిపోయినట్టు ఉంది ఆ ఇల్లు.
‘వరాళీ నీ గది సిద్ధంగా ఉంది, కాస్త విశ్రాంతి తీసుకో’ అని ఈ ఇంటిని సంరక్షిస్తున్న మేనత్త సాదరంగా పలకరించింది. తాతగారు పోయాక మేడ మీది ఆయన గదిని నేను తీసుకున్నాను. ఎందుకనో చాలా హడావిడిగా వుంది నా లోపల! వీలైనంత త్వరగా సిధ్ధపడి కిందకి వచ్చి
‘నాన్నగారూ, నేను గుడి వరకూ వెళ్లి వస్తాను ‘ అని చెప్పి బయల్దేరాను.
ఎప్పుడో రాసుకున్న కవిత గుర్తొస్తోంది
‘నిజం చెప్పనీ ప్రభూ!
నీవున్నప్పుడు కాలం శాశ్వతం అనుకున్నానని
నీవు లేనప్పుడు కన్నీరయ్యానని
నీవు తిరిగే దారులలో అబద్ధాన్నై
నీ కోసం వెదికానని, నిజం చెప్పనీ!’ అని
‘వరాళీ, వరాళీ’ అని ఎవరో పిలుస్తున్నారు, పలకరిస్తున్నారు, నేనూ బదులు నవ్వులు నవ్వుతూనే ఉన్నాను, ఒక పూర్తి అన్వేషణలో కూడా.
‘ఈ పూజారిగారు ఇంత ముసలి వారైపోయారే !’అనుకుంటుండగా ఆయనే ఎదురొచ్చి
‘ఎంత పెద్ద దానివైపోయావ్ తల్లీ, రామ్మా, రాముడికి ఒక్క పాట వినిపించు’ అని రాములవారి దర్శనానికి తీసుకెళ్ళారు. తనివితీరా సీతారాముల్ని చూసుకొని, ఎందుకో
‘శ్రీ రామచంద్ర కృపాళు భజమన’ మనసుతీరా పాడుకొని లేచాను.
ఏమో అతని పేరు పలికేయాలని తొందరపెడుతోంది మనసు.
‘సాయంత్రం నీ కచేరీ ఉందటగా తల్లీ, మాకు ఇన్నాళ్ళకి మళ్ళీ నీ గొంతు వినే అవకాశం వచ్చింది. శుభం’, అడక్కుండానే అందరి ఆశీస్సులు.
ఈ ధ్వజస్తంభంకి కుడి వైపున మండపంలోనే కదా అతనిని మొదట చూసింది ! గుడిలోనుంచి గోదావరిలోకి మెట్లదారి, ఇక్కడే కదా మొదటిసారి తను నా పాట విన్నది! గుడిగోడల మీదికి వంగిన తురాయి కొమ్మలు, ఇక్కడేగా తనిచ్చిన పూలకు మాటలివ్వమని రాముణ్ణి నేను వేడుకొన్నది! కలలా గడిచిపోయింది కదూ, కలలోనే మిగిలిపోయింది కదూ! తనింకా ఇక్కడే ఉన్నారా? తనకి నేను గుర్తున్నానా?
ఏ దిక్కుకి వెళ్తే చూడగలను ఆ బంగారు పువ్వులాంటి నవ్వుని?
‘అమ్మా, మీ కోసం ఎవరో వచ్చారు, నాన్నగారు మిమ్మల్ని ఇంటికి తీసుకు రమ్మన్నారు’ శాంతి ఆయాసపడుతూ వచ్చి చెప్పింది.
తను నా కోసం ఇంటికి వచ్చారా? తనే అయ్యుంటారా? లోపలి ప్రశ్నల కంటే వేగమైన నడక.
ఇంటికి వచ్చి చూస్తే ఒక్కసారిగా నిరాశ, ఈ కచేరీ ఏర్పాటు చేసిన వారట, నమస్కారం చేసి నా గదికి వచ్చి కూర్చున్నాను.
అలసటవల్లనో… అంతులేని నిరాశ వల్లనో నిద్ర పట్టేసింది.
సాయంత్రం 5 గంటలు కావస్తోంది, మిగిలిన కాస్త ఆశతోనో కాస్త మనోధైర్యం కోసమో వెంటతెచ్చుకున్న ఆకుపచ్చరంగు చీర తీసుకొని సిద్ధపడ్డాను. మనసులో మెదడులో మొత్తం నిరాశే, అదేమిటో ఉన్నట్టుండి నాకు నేను యంత్రంలాగా అనిపించాను. బయల్దేరుతూ నాన్నగారికీ, మేనత్తకీ నమస్కారం చేశాను
“కాస్త నవ్వుతూ పాడమ్మా, మా తల్లి కదూ” మేనత్త గడ్డం పట్టుకొని మురిపెంగా అడిగింది.
అప్పటికి బదులుగా నవ్వి బయల్దేరాను.
దారిలో నాన్న చెప్పారు
“రామచంద్ర మూర్తి గారని, ఒకాయన గొప్ప పాండిత్యం గలవారట. ఆయన రచించిన ‘రామదాసు కీర్తనలు – విశ్లేషణలు’ అనే పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ ఉదయం జరిగిందట., ఆయనని నీ కచేరీకి ప్రత్యేకంగా ఆహ్వానించాము” అని.
ఒక్కసారిగా ఆపలేనంత వెలుగు లోపలా, బయటా!! ‘రామచంద్రమూర్తి?? ‘తన పేరు కూడా అదే కదా? ఈ రామచంద్ర మూర్తి తన శ్రీ రామచంద్రమూర్తి ఒకరేనా? అలా అయ్యుండొచ్చా? ఈ ఉత్సాహం ఆశా రెండూ దాచేందుకు చిన్న నవ్వు సాయం వచ్చింది. నేరుగా వేదిక మీదకి వెళ్ళాల్సి వచ్చింది. గొంతు సవరించుకున్నాను, కళ్ళు వెదుకుతున్నాయి. వేదిక నుంచి ముందు వరుసలలో అటు నుంచీ అలా వెనుకకి, వెనుకకి కళ్ళు వెదుకుతూనే ఉన్నాయి, తెలీదు తనిక్కడ ఉన్నారో లేదో, ఈ శ్రోతల్లో తను ఉండాలనే ఆశిస్తున్నాను. నిజానికి ఇవాళ రాముడికి క్షమాపణలు ‘అతను’ వినాలనే పాడబోతున్నానేమో!!
“ఆడమోడి గలదె రామయ్య మాటలాడ మోడి గలదే!” చారుకేశి రాగంతో మొదలు పెట్టాను.
ఆ కాస్తలోనే దిగులు, అభేరి లోకి మళ్ళాను “నగుమోము గనలేని నా జాలి” అని,
కాస్త ఉక్రోషం ఏం భూమిని మోసే రాముడికి, నా చిన్ని గుండె చప్పుడు వినిపించలేదా? అని,
బహుదారి రాగంలో “బ్రోవ భారమా రఘురామా బ్రోవ భారమా” పాడుకున్నాను
చివరి చరణాల్లో రాముని చరణాలను మరొక్కసారి తలచుకొని బ్రతిమాలుకున్నాను. ఎందరి కోసమో ఎన్నో చేసావు కదా తండ్రీ .. నన్ను బ్రోవ భారమా!!? అని
అతన్ని వెతికి వెతికి అలసిపోయాను … కళ్ళలో కాసిన్ని కన్నీళ్ళు – కళావతి రాగంలోకి ఒరిగిపోయాయి
“ఎన్నడు జూతునో ఇనకుల తిలకా నిన్నెన్నడు జూతునో, పున్నమ చందురుని పోలిన ముఖంబును … ఎన్నడు జూతునో”అని
అప్పుడు చూశాను అదే వేదిక మీద నాకు కుడివైపుగా నాన్నగారితో మాట్లాడుతూ తనే, అతనే, ఖచ్చితంగా. కనుబొమ్మల మధ్యన తీరుగా పొడవాటి తిలకం, ఖద్దరు ధోవతీ, నుదుటిమీది నుంచి కాస్త వెనకకు జరిగిన రింగుల జుట్టు, పోల్చుకున్నాను, పోల్చుకోవలసిన ఆకాస్త చిరునవ్వుని కూడా పోల్చుకున్నాను.
గుర్తులేదు ఆ కొన్ని క్షణాలు నేను పాడుతూనే ఉన్నానో లేక ఊరుకుండిపోయానో !
ఒక్కసారి గట్టిగా ఊపిరితీసుకుని ‘సదా మదిన్ తలతు గదరా!’ అని గంభీరవాణి రాగంలో ప్రశాంతంగా చెప్పదలచుకున్న మాటని ఒక్క పల్లవిలోకి తెచ్చుకొని పాడుకున్నాను,
నిజానికి పరిగెత్తి పరిగెత్తి గమ్యం చేరేసరికి అలసిపోయిన గుండె మరేదో పాడుతోంది, ఇంకేం లేదు నేను అడిగేందుకు, చెప్పేందుకు.
తలతిప్పి చూసినప్పుడు తనూ చూస్తున్నారు, చిన్న నవ్వు కలిపి, ఆ చూపుల్లో ఎటువంటి ఆత్రుత
లేదు కానీ అంతకు మించిన ఎదో శాంతి, నెమ్మదిగా అదే శాంతి నాదాకా ప్రవహించింది.
నాకర్ధమవుతోంది ఈ చివరి అంకపు తరువాతి కొత్త ప్రారంభం!
చేతులు జోడించి చివరి కీర్తనగా, పునర్జీవనాన్ని ప్రసాదించమని రాముడిని వేడుకున్నాను
‘నా జీవనాధారా నా నోము ఫలమా’ అని!
నాన్నగారి వైపు తిరిగి ముగిస్తున్నట్టు సైగ చేశాను.
ఆయన తిరిగి సైగ చేశారు … కన్నీళ్ళు తుడుచుకొమ్మని.
కరతాళధ్వనులు, వ్యాఖ్యాతలెవరో అభినందనలు,
నా మానసిక అలసటంతా ముఖం మీదికి వచ్చిపడిందేమో నాన్నగారు హడావిడిగా వచ్చి చెయ్యిపట్టుకున్నారు, ఎందుకో తెలీదు ఇన్నేళ్ళు ఈ స్పర్శ మీద లేని నమ్మకం ఇవాళ కలిగింది. ఆయనకి తెలిసిందో లేదో కానీ బ్రతిమాలుకుంటున్నాను నా మౌనంలో ఉన్న ఆ ఒక్క మాట ఎలాగోలా వినమని. నాన్నగారు నవ్వుతున్నారు నా భుజం చుట్టూ చెయ్యివేసి విడవకుండా, కుడిచేత్తో అతనిని కూడా దగ్గరకు రమ్మని సైగ చేశారు, దగ్గరలో ఉన్న మైక్ దగ్గరకి తీసుకెళ్లారు, ఆయన మాట్లాడుతున్నారు
“ఈమె నా ఏకైక కుమార్తె ‘వరాళి’. తల్లిదండ్రుల అభిప్రాయాలకు, సాంప్రదాయాలకు, సంస్కృతికి, ఆశలకు ఆశయాలకు తనను తాను అంకితమిచ్చుకున్న చిన్నారి. మా భయాలతో తన రెక్కల్ని విరిచినా భంగపడలేదు. తన సంతోషాన్ని, ఆశలను చెరిపివేసిన వారిని కూడా క్షమించించిన బంగారు తల్లి. ఈమె ఇన్నాళ్ళ వేదనకు నేను ప్రత్యక్షసాక్షిని. పిల్లలే కాదు పెద్దల కోసం త్యాగం చేయవలసింది. పెద్దలు కూడా పిల్లల సరైన ఆశలను అర్థం చేసుకోవాలని మాకు ఆలస్యంగా అర్ధం అయ్యింది. ఈ వరాళి మౌనమే మాకు ఎన్నో నేర్పింది. ఆ రాముడి దయవలన ఈ శ్రీరామచంద్రమూర్తి ఈమె కోసం కాచుకున్నాడు కనుక సరిపోయింది. లేకపోయుంటే ఎన్ని జన్మలకు మా పశ్చాత్తాపం కొనసాగించబడేదో అనిపిస్తోంది. ఈ సంగీత సాహిత్యాలను రేపు ప్రొద్దున శ్రీ సీతారాముల సన్నిధిలో ఒకటి చేయబోతున్నాము, ఆ సరస్వతికి సేవ చేసుకోమని ఆశీర్వదిస్తూ, మీ ఆశీస్సులు కూడా కోరుకుంటున్నాను.
కొందరు కలవడం అనేది యాదృచ్ఛికం కాదు. గతజన్మలలో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న మాటలు నెరవేర్చుకోవడానికేమో అనిపిస్తుంది వీరిని చూస్తే. కాలాన్ని వెనక్కి తిప్పి ఈ పసివారిని ఆ కోనేటి మెట్లమీద విడిచి పెట్టాలని ఎన్నిసార్లు అనిపించిందో. అయ్యా, ‘ఆయనేమిటో, ఏ కులానికి చెందిన వారో ‘ నేను అడగలేదు, మీరూ అడగొద్దు, వీరు సాహితీవేత్త ఈమె ఒక సంగీత సుమం. అంతే అక్కడే ఆగండి. వారి దారిన వారిని పోనివ్వండి. ఈమె తండ్రిగా నేను ఆలోచించినన్ని రోజులు నా దృష్టి సంకుచితం, ఈమెకు సంరక్షకుడిని మాత్రమే అనుకున్నప్పుడు అదే దృష్టి వికసించింది. కొన్ని మెట్లు దిగివచ్చేలా చేసింది. ఇంతకంటే ఈమెకు నేను చేయవలసినది ఆమె కోరుకునేదీ మరేదీ ఉండదని భావిస్తున్నాను. ఒకే చోట బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, మా కుటుంబాన్నీ, సంప్రదాయాన్నీ ఆదరించినవారూ, అభిమానులూ ఉన్నారనే చనువుతో ఈ నాలుగు మాటలు చెప్పగలిగాను. అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు” అని ముగించారు.
నా చెవులనీ, కళ్ళనీ అదృష్టాన్నీ దేనినీ నమ్మేస్థితిలో నేను లేను, ఆ గడచిన దుఃఖాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకో మరి, తలెత్తి అతనిని ఇంతకు ముందు చూసినంత చనువుగా చూడలేకపోయాను. బహుశా ఉన్నఫళంగా నా ప్రేమ అతనిముందు వికసితం అయినందుకు, దాచుకున్నాను అనుకున్న నా ప్రేమ పెద్దలచే ఇంత కనిపెట్టబడిందా? అనేమో!
ఇంతలోనే అమ్మ, మేనత్త అమాంతం వచ్చి ‘నీ తపస్సు పండింది’ తల్లీ అని, దగ్గరివారి కరచాలనాలూ, పెద్దవారి నవ్వుముఖాలు.
అతన్ని ఇక వెదకలేదు. రేపటి నుంచి నిర్భయంగా ఎక్కడ ఉన్నా పరుగెత్తుకెళ్లి అతని ఎదురుగా నిలబడి ‘కళ్ళెత్తి చూడు, నా బొమ్మ చూసుకోవాలి’ అనే స్వాతంత్య్రం రాబోతోంది కదా!
పట్టపగటి వెలుగులు మా ఇంట్లో, ఈ ఇల్లు పొద్దున నేను వచ్చినపుడు కూడా ఇలానే ఉండి ఉంటుందేమో, ఇప్పుడు నా కళ్ళకి ఇలా కనిపిస్తోందేమో, అందరి చేతులు కలిసి ఆ రాత్రంతా పెళ్ళిపనులు. తెలిసినవారెవరో గోరింటాకు రుబ్బి తీసుకువచ్చి చేతులకు పెడుతున్నారు. అసలు దీని స్పర్శా, రంగూ మరచిపోయాను కదా!
జీవితంలో ఇలాంటి వైభవోపేతమైన సూర్యోదయాలు సంభవిస్తాయని కలనైనా అనుకోలేదు.
ఎవరో అంటున్నారు “మల్లెలు మోయలేదు, కనకాంబరాలతో జడ అల్లండి” అని,
నిజమే బండబారినవన్నీ ఒక్కరాత్రిలో సౌకుమార్యం సంతరించుకున్నాయి కదా.
దించిన కనురెప్పలమీదనే తంతు అంతా జరుగుతోంది. పురోహితులు అంటున్నారు
“తల్లీ, ఒకరి కళ్ళలోకి ఒకరు చూడండి, మరేదీ లేనట్టు” అని,
“శ్రీరామ శ్రీరామ, అని చెప్పుకోమ్మా, శుభముహుర్తం ఇది” అని,
తలంబ్రాలు, అరుంధతీ దర్శనం అయ్యాక, శ్రీ సీతా సమేత రామభద్రునికి నమస్కరించుకుని కోనేటి మెట్లమీదకు వెళ్ళి కూర్చున్నాము. విడిపోయిన చోటే ముడిపడి.
తనే సంభాషణ మొదలు పెట్టారు
“వరాళీ, నిన్న కచేరీలో గంభీరవాణి ఎంత బాగా పాడావో, చాలా సాధన చేశావు. ఇప్పుడు నీ గొంతులో ఎంత పరిపక్వత ఉందో తెలుసా, హిందూస్థానీ నేర్చుకోవడం వల్ల నీ స్వరపరిమళమే అద్భుతంగా మారిపోయింది.”
“అవునా, చాన్నాళ్ళకి వినడంవల్లనేమో అలా అనిపించడం. మీకు తెలుసా, పొద్దున నుంచీ లలిత మెదులుతోంది నా మనసులో ‘ఎట్లా దొరికితివో రామా తనకెట్లా దొరికితివో రామా’ అని”
“హిందూస్థానీ లో సురభి అంటారు కదా లలిత రాగాన్ని? చదివాను ఎక్కడో”
“హా, అడగడం మరచేపోయాను నిన్న మీ రామదాసు కీర్తనల విశ్లేషణ పుస్తకం ఎన్నాళ్ళు పట్టిందేమిటి?”
”నువ్వు నాకోసం కాచుకున్నన్నినాళ్ళు”
“ఎంత పుస్తకం ఏమిటి?”
“రెండు చేతులలో సరిపోయేంత, చిన్న గుప్పిట్లో ఇమిడిపోయేంత”
“నేను మీ పుస్తకం గురించి అడుగుతున్నాను”
“నేను నువ్వు దాచుకున్న పుస్తకాన్ని ఇప్పటికైనా చదవనివ్వమని అడుగుతున్నాను, నువ్వు చెప్పకపొతే మాత్రం తెలియదా, నేను నీకేమిటో? మీ నాన్నగారిని బ్రతిమాలి బ్రతిమాలి తెచ్చుకున్నాను ఈ ఒక్క వరాళి రాగాన్ని నాకివ్వమని”
“నిజంగానా?”
“మరి, మన లోకాన్ని మనం గుర్తించడమే అరుదు, గుర్తించాక చూస్తూ చూస్తూ ఎలా వదులుకోగలం చెప్పు”
“దాటేశాం కదా ఆ కాలాన్ని, దూరాల్ని?”
“ఇక ఎక్కడికీ పోనివ్వడాలు లేవు కానీ, ఏదీ, నీ చేతులకు గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో చూడనీ”
తలంబ్రాలపసుపు అంటిన రెండు చేతులను నలుగుతాయేమో అన్నంత సుకుమారంగా తీసుకొని కళ్ళద్దుకున్నారు.
భాగ్యం నాదో, తనదో తేలలేదింకా. పాతికేళ్ళ క్రితం కథ.
ఇప్పటికీ ప్రతీ పేజీలో కొత్తగా పరిమళిస్తూ, ఎవరికెవరూ నేర్పని రాగమొకటి సుజీవనసారమై హృదయానికి దగ్గరగా వినిపిస్తూనే ఉంది స్పష్టంగా!
*
సుకుమార మైన కల. ఎటు కదిలితే కల చెరిగిపోతుందేమో నన్న భయం. “మల్లె లు మోయలేదు, కనకాంబరాలయితే సరి……..”
నిజమే, ఇంకా కలేమో ఇదంతా అని భయమే ఆమెకు. మీ ‘delicate’ స్పందనకు ధన్యవాదాలండీ!!
I enjoyed every word, every sentence. Thank you for giving such real treat. Such a nice love story between equals, who are so devoted and honest in their feelings. Going to read again and again.
Thank you so much sujata garu, చాలా సంతోషం మీ స్పందన!!
రేఖ జ్యోతి గారు,
అద్భుతమైన కధ, సంగీత సాహిత్యాల అద్భుత సంగమము.
ధన్యవాదాలు రాజేశ్వరి గారు!
Brilliant storyteller. నాకు బాగా నచ్చిన తెలుగు కథల్లో ఇది కూడా ఉంటుంది ఇకనుంచి
Thank you so much Suresh Garu,
చాలా చాలా బావుంది రేఖా… ఒక్క మాటలో చెప్పాలంటే కనుల ముందు పాత్రలూ కదలండి, కదల్చివేసి, కలవరపెట్టీ, మరలా కలయికతో కనులు చెమర్చి ఆ కన్నీటి బిందువులు రాముని పదములోని కడగాలని తపనపడేంత అందంగా ఉంది…
శిరీ, థాంక్యూ!! కథ లోకి రావడానికి ముందు ఈ ఊహ చాన్నాళ్లు కళ్ల ముందే కదలాడి చుట్టూ తిరిగింది. ఎలాగో చివరకిలా…
పొగ కమ్మి నీళ్ళు కారే కళ్ళ మసకకు ఎర్రటి పొద్దులా మలుపు చివర తురాయి చెట్టు. ఎండిపోయిన గొంతులోకి అడక్కుండా వచ్చి దూకిన ఆకాశగంగ. ఏమి చెప్పాలింకా? వరాళి పాటలే తప్ప మాటల్రాని మూగ పిల్ల. మీరూ అంతే 🙂 Love you!
Thank you so much సంతు, ఈ ఊహ మనసులో మెదులుతూ ఉండడం వల్లనే మీరు “సదా మదిన్” పాడినప్పుడు కళ్ళ నీళ్ళు ఆగలేదు… Thank you too Santhu!!
సాహితీ సుమగంధాల సాధకురాలు రేఖా జ్యోతి! . . . కర్ణాటక సంగీత రాగ ‘ జ్యోతి స్వరూపిణి ‘గా ఆలాపిస్తున్నారని ( త్యాగ రాజ స్వామి ‘జ్యోతి స్వరూపిణీ’ రాగం ఆలాపిస్తే కొడిగట్టిన దీపం వెలిగిందనీ ఒక కథుంది ) ఏ పెద్దలకు, ఏ విజ్నులకు తెలియజెయ్యాలి? చెప్పు గొరుసన్నా ! మధుర గాయకుడు ఎ.ఎం. రాజా లా పాడగల . . . మాయమ్మ ” గజయీతరాలు ” ని ఆవిష్కరించిన గొరుసన్నా ! చెప్పు!!
తన పాటల్లో సన్నజాజుల సౌకుమార్యం, సంపెంగపూల సౌరభం కలిపిన మల్లాది వారికా ( మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికా ) ? సహస్ర వేణునాద స్వరార్ణవంలో ఆనందంగా తేలిపోయేలా చేసిన ‘కానుక’ నిచ్చిన ముళ్లపూడి వారికా ( ముళ్ళపూడి వెంకటరమణ గారికా )? కర్నూలు వేణయ్యకు? ( కాశీభట్ల వేణుగోపాల్ గారికి ) కాకినాడ అక్కయ్య గారికి?! ( డా. వాడ్రేవు వీరలక్ష్మిదేవి గారు )
సంగీత, సాహిత్యాలను సంధించే సవ్యచాచి త్రిపుర గారి కనక ప్రసాద్ బాబుకా? మూలా సుబ్రతో కా ? ( డా. మూలా సుబ్రహ్మణ్యం కా ? ).
రిషీవ్యాలి రాజశేఖర్ పిడూరి గారికా ? కర్నూలు సాహితీ పెద్దలు ఇంద్రగంటి వెంకటేశ్వర్లు గారికా ?
నిమగ్న సాహితీ వ్యాస భారతి డా. మైథిలి గారికా ? జలంధరమ్మకా? ( తెలుగు మాటలకు “పున్నాగ పూల” తావిని అద్దిన వారు. జీవితాన్ని జీవితంతోనే వ్యాఖ్యానించాలన్న సహజ సౌందర్య జిజ్ఞాసి జలంధర చంద్రమోహన్ గారికా ), ఆకాశానికీ కలువపూలకీ వంతెన వేస్తారెవరో అన్న స్వాతి తల్లికా ? ( బండ్లమూడి స్వాతి కుమారి ), పద కవితా పితామహుడు అన్నమయ్య సంకీర్తనల అభిమాని అవినేని భాస్కర్ కా?
ఎందరో మహాను భావులు . . . అవధరించమని విన్నతి అందరికీ?!
స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా
స్వరరాగ గంగా ప్రవాహమే! అంగాత్మ ధాన యోగమే!!
మనసులోతులనుండి వస్తున్న స్వరరాగాలు, గంగా ప్రవాహంలా జీవుని అంగము (శరీరము), ఆత్మలను సంధాన చేసేవిధంగా మహా ఉదృతితో వస్తున్నాయి.
“ప్రాప్తే వసతేతి కాలే, పలికే కుహు గీతిక, గాన సరసీరుహ మాలిక”
వసంతకాలంలోనే గళం విప్పి మనసారా పాడే కోయిలలు కుహు గీతాలు, గానమనే పద్మాల మాలికను అందిస్తున్నాయి .
~ త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు
రామయ్య గారూ, ధన్యవాదాలు , మీ ద్వారా మీరు ప్రస్తావించిన పెద్దలందరికీ నమస్సులు.
అద్భుతం చిన్నమాట ఈకధకు. దాన్ని మించిన ఏదో ఆరోహణ అవరోహణాలు చదువుతున్నంతసేపూ. ప్రేమగాఢత, ప్రేమలదూరమైన ఆమెలో ఆ తీవ్రవేదన
ఆమె అణువణువూ అహర్నిశలూ అతని తలపులేఅయి….. చివరకు ప్రియాసంగమంతో సుఖాంతం చెయ్యడం…. ఓహ్! ఒక చక్కని అనుభూతి మిగిల్చిన కధ. కధంకా నేపథ్యసంగీతంలా సంగీతమే! విశ్వనాధుని సినిమా చూసినంత సంతృప్తి!
శశికళ గారూ, ధన్యవాదాలండీ!
మీ కథలో ప్రతి పదం కొత్తగా పరిమళిస్తున్నాయి,
తెలియనిరాగమేదో స్పష్టంగా వినిపిస్తునే వుంది, కథ చదివినతరువాతకూడా!!
[…] కథ ఇక్కడ […]