తేట తేనియలు!

‘దేవుడు వొక్కడే కదా?’ అన్నట్టు చూశాడు దేవుడు. ఆ మాట వాళ్ళతో అనలేదు. అంటే యెక్కడ కొంప మునుగుతుందోనని.

వెహికల్స్‌కు రెడ్ సిగ్నల్ పడ్డాక వాకర్స్‌కు గ్రీన్ సిగ్నల్ పడింది.

ఆ పొద్దుటి వేళలో పనులకూ స్కూళ్ళకూ వెళ్తూ వుమ్మిరిగావున్న పాదచారులు జీబ్రాచారల మీదుగా గబగబా రోడ్డును దాటుతున్నారు. అదే సమయంలో అతివేగంగా వచ్చిన కారొకటి రెడ్ సిగ్నల్ దగ్గర ఆగకుండా దూసుకుపోయింది. పోతూ స్కూలుకు వెళ్ళే వో పాపను గుద్దుకుంటూ పోయింది.

పాప పడిపోయింది. ఒకరొకరూ చుట్టూచేరి గుంపయ్యారు. ప్రాణం వుందో పోయిందో తెలీక అంతా గుండెలు కొట్టుకుంటూ వుండగా వొంగి చూస్తున్నారు. కొందరు చూసి, చూడలేక తల తిప్పుకున్నారు. ఎవరో ధైర్యంచేసి ముక్కు దగ్గర వణుకుతున్న వేలుపెట్టి చూశారు. గాలి ఆడుతోంది అన్నట్టు తలూపుతూ “బతికేవుంది,” అన్నారు. అప్పటికే నెత్తురు యెక్కడి నుండి వస్తోందో తెలీదు కాని స్కూలు బ్యాగు కిందకు ధార కడుతోంది.

“ప్చ్… దేవుడు యిలా రాశాడు,” అందో పెద్దావిడ.

‘నేనా? పసి పిల్లని యిలా చావమని… నేను రాసానా?’ దేవుడుకి యెంత గింజుకున్నా మాట రాలేదు, షాక్ వల్లేమో.

అందర్లోనూ వున్న దేవుడు ఆ సమయంలో బయటకువచ్చి యెవరిలో అసలుదేవుడు వున్నాడో అన్నట్టు వెతుకుతూ చుట్టూ చూశాడు.

“చర్చికి తీసుకు వెళ్ళండి,” అన్నారెవరో. ఆమాటకు మద్దతుగా “అవును, ఆ పాప చదివేది క్రిస్టియన్ స్కూలే,” అన్నారు మరెవరో, ఆ పాప యూనిఫామ్‌ని చూసి కన్ఫామ్ చేస్తూ. “ఆ పోయే ప్రాణమేదో ప్రభువు సన్నిధిలో పోతే, వారి కుటుంబం సంతోషిస్తుంది,” అన్నారు యింకెవరో. “అవును, నుదిటిమీద బొట్టులేదు, ఖచ్చితంగా క్రిస్టియన్నే…” రూఢిగా అన్నారు కొందరు సేవకులు.

“లేదు… గుడికి తీసుకుపోదాం,” అన్నారెవరో. ఆ మాటకు మద్దతుగా “అవును, ఆ పాప పక్కా హిందువే,” అన్నారు మరెవరో, ఆ పాప అలంకరణ చూసి కన్ఫామ్ చేస్తూ. “ఆ పోయే ప్రాణమేదో యీశ్వరుని సన్నిధిలో పోతే, వారి కుటుంబం సంతోషిస్తుంది,” అన్నారు యింకెవరో. “అవును, ఆ చేతికి కట్టిన తాయత్తు చూడండి, అనుమానం లేదు హిందువే,” రూఢిగా అన్నారు కొందరు దాసులు.

“లేదు లేదు… మసీదుకు తీసుకెళ్ళాలి,” అన్నారెవరో. ఆమాటకు మద్దతుగా “అవును, ఆ పాప గ్యారంటీ ముస్లిమే,” అన్నారు మరెవరో, ఆ పాప తలకు కట్టుకొనే స్కార్ఫ్ చూసి కన్ఫామ్ చేస్తూ. “ఆ పోయే ప్రాణమేదో అల్లా సన్నిధిలో పోతే, వారి కుటుంబం సంతోషిస్తుంది,” అన్నారు యింకెవరో. “అవును, ఆ మెహిందీ చూడండి, సందేహం లేదు ముస్లిమే,” రూఢిగా అన్నారు కొందరు విశ్వాసులు.

‘మతంకన్నా ముందు నేను మనిషిని’ అని రక్తమోడుతున్న పాపా అనలేదు. కాని ఆ బిడ్డ వొళ్ళు క్షణాల్లో కంపించడం మొదలైంది. ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుంటూ వుంది.

“చర్చికి తీసుకు పదండి… ప్రభువే చూసుకుంటాడు,” అని కొందరు. “మసీదుకు తీసుకు పదండి… అల్లా పిలుస్తున్నాడు,” అని కొందరు. “ఎక్కడికి తీసుకు వెళ్తార్రా? చేసిన మత మార్పిడిలు చాలవా? చచ్చినా వదలర్రా?” అని కొందరు. బోరలు విరిచారు. కర్రలు తీశారు. కండువాలు బిగించారు.

మతం తేలితే కాని అక్కడి నుండి ఆ పాపను కదలనిచ్చేలా లేరు. అది తేల్చడానికే అంతా వొకరి మీదికి వొకరు కలబడ్డారు. కయ్యమాడారు. వాదన చేశారు. వేదన పడ్డారు. రెచ్చగొట్టారు. కొట్టారు. కొట్టించుకున్నారు. కాశారు. రాళ్ళు రువ్వుకోవడం మొదలుపెట్టారు.

ఇదంతా చూసిన దేవుడు ఆ జనంలోంచి మెల్లగా దొంగలా పక్కకువచ్చి పాపను యెత్తుకొని ఆటోలోకి యెక్కించాడు. మరెవరో యిద్దరు సాయపడుతూ ఆటో యెక్కి అపస్మారకంగావున్న పాపను చెరోపక్కా వూతమై పట్టుకున్నారు.

“ఆసుపత్రికి పోనీ,” అన్నాడు దేవుడు, ఆటో మీద చరిచి. ఆటోవాడు వొక్కక్షణం భయపడి మరుక్షణం తెగించాడు.

పెద్ద శబ్దం చేస్తూ ఆటో కదిలి పరిగెత్తింది.

కుమ్ముకుంటున్న మూకలు తలతిప్పి చూశాయి. పాప అక్కడ లేదు. అక్కడున్న భక్తుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది.

ఇవేమీ గమనించకుండా “సమయానికి దేవుడిలా వచ్చావు. పాప ప్రాణాలు కాపాడడానికి ఆసుపత్రికి పంపించావు. ఎవరివో గాని నువ్వు…” అన్నదా పెద్దావిడ, చేతులు జోడిస్తూ. ‘ప్రాణాలు పోసావు…’ అన్నట్టు ఆమె కళ్ళనిండా తడి.

“నేను దేవుణ్ణి,” చెప్పాడు.

ఆ మాట విన్నవాళ్ళు టక్కున తలతిప్పి చూశారు. మొదట యెగాదిగా. ఆపై అనుమానంగా.

“వీడెవడో దేవుడంట!” అందరికీ వినపడేలా అన్నాడొకడు.

“ఏ దేవుడ్రా నువ్వు?” అని కొందరు అడిగారు. కాదు, అరిచారు.

“పాపని తీసుకెళ్ళడానికి నువ్వు యే దేవుడూ అంట?” అని దేవుణ్ణి నిలదీస్తూ మరికొందరు.

దేవుడు కరుణ నిండిన కళ్ళతో చూసిన చూపుకి మతములన్నియు మాసిపోలేదు, మతములన్నియు వొక్కటయ్యాయి. నిలిచి వెలిగాయి.

‘దేవుడు వొక్కడే కదా?’ అన్నట్టు చూశాడు దేవుడు. ఆ మాట వాళ్ళతో అనలేదు. అంటే యెక్కడ కొంప మునుగుతుందోనని.

“నువ్వే దేవుడు?” అడిగారెవరో.

దేవుడుకి కూడా సమాధానం తెలీనట్టుంది. నీళ్ళు నమిలాడు.

“నువ్వు… యే-దే-వు-డు-?” వొక్కో అక్షరం వొత్తి వొత్తి అడిగారు మరెవరో.

దేవుడికి ఆ క్షణం అనిపించింది. ‘నేను అనవసరంగా దేవుణ్ణి అయ్యాను, అంతకంటే దెయ్యాన్ని అయినా బాగుణ్ణు’ అని. ‘అప్పడు యే దెయ్యం అని అడగరు కదా’- అని కూడా అనుకున్నాడు.

‘ఏదో వొకటి చెప్పురా తండ్రీ…’ అన్నట్టు చూసింది యిందాకటి పెద్దావిడ. ఏదో కీడు జరగబోతున్నట్టు తోచిందామెకి. ఆమె కళ్ళలో భయం తొంగిచూసింది.

దేవుణ్ణి అంతా పిచ్చోన్ని చూసినట్టు చూస్తున్నారు.

“నువ్వు యీశ్వరుడివా?”

దేవుడు చెవిటివాడిలా చూశాడు.

“నువ్వు యేసువా?”

గద్దించేసరికి దేవుడు మూగవాడిలా అడ్డంగా తలూపాడు.

“నువ్వు అల్లావా?”

అందరూ అరిచేసరికి దేవుడు వెర్రివాడిలా అడ్డదిడ్డంగా తలూపాడు.

ఏమంటే యేమి వస్తుందోనని దేవుడు బెంగటిల్లి చూశాడు. సైగాగా తలని అడ్డంగా చిన్నగా వూపుతోంది పెద్దావిడ, కనుగుడ్లు పెద్దవి చేసి. అంటే- ‘యేమి చెప్పినా యిరుక్కుంటావు సుమా…’ అన్నట్టు, హెచ్చరిస్తున్నట్టు.

“ఏ దేవుడు నువ్వు?” చాలా వోపికగా వున్నట్టు సహనం నశిస్తున్నట్టు తనజుట్టు తనేపీక్కుంటూ అడిగాడు వొకడు. “ష్…” కొడుతూ.

ప్రశ్న అర్థమయ్యింది. కాని కానట్టు “యే దేవుడంటే?” చాలా అమాయకంగా అడిగాడు దేవుడు.

“నీదేమతం?” భక్తుడు తిరిగి దేవుణ్ణి ప్రశ్నించాడు.

“నేను దేవుణ్ణి!” అని చాలా దిగ్భ్రమతో అన్నాడు దేవుడు. తననే చూస్తూ చుట్టుముట్టిన మూకను చూసి “అంటే… మతం అనేది మనుషులకు, దేవుళ్ళకు మతం వుండదు…” దేవుడు చాలా శాంతంగా అంతకుమించి మృదువుగా చెప్పాడు. అర్థం చేసుకుంటారన్న ఆశతో చూశాడు. శాంతిని సాధించొచ్చు అనుకున్నాడు. సామరస్యం నింపొచ్చు అనుకున్నాడు. మతములన్నీ కలపొచ్చు అనీ అనుకున్నట్టున్నాడు.

కాని భక్తులందరూ పగలబడి నవ్వుతున్నారు.

ఎందుకు నవ్వుతున్నారో వెర్రి దేవుడికి అర్థం కాలేదు, బేలగా చూశాడు.

“మతం లేకుండా దేవుడు వుంటాడా?” భక్తజనుల మాట వొకటికి పదిసార్లు దేవుని చెవుల్లో మారుమోగింది. దేవుడు కూడా ఆలోచనల్లో పడినట్టున్నాడు.

“సరే, నిన్ను దేవుడే అనుకుందాం. మరి నిన్ను యెలా గుర్తుపట్టాలి?” భక్తుల మాటలు నిజంగానే దేవుణ్ణి పరీక్షకు పెట్టినట్టున్నాయి. ‘నిజమే కదా, ఆచారాలూ అలంకరణలూ వస్త్రాలూ అన్నీ మత ఆధారితమైనవే కదా?’ దేవుడికి తలతిరిగిపోతోంది.

“మతం లేకుండా దేవుడు లేడు!”

ఆ మాటతో కొయ్యబారిపోయాడు దేవుడు.

“మతం లేకుండా నీకు వునికి లేదు!”

దేవుడి దగ్గర కూడా సమాధానం లేదు.

“మతం లేకుండా నీకు భక్తులు లేరు!”

కారు గుద్దకుండానే దేవుడికి గాయాలయినట్టున్నాయి. వంటిమీద చెమట స్థానంలో రక్తం చిమ్ముతోంది. కాని యెందుకో యెవరూ గుర్తించినట్టు లేరు?!

“ఆ పాపని దేవుడి సమక్షంలోకి పోకుండా అడ్డుకున్నావ్… తప్పు చేశావ్…” అని సేవకులు, “ఆ కుటుంబానికి పాప యెలాగూ లేదు, నువ్వు ఆ కుటుంబానికి సంతోషం లేకుండా చేశావ్…” అని దాసులు, “ఆ పాపకు జన్నత్ లేకుండా చేసినావ్, జహన్నమ్ మిగిల్చినావ్…” అని విశ్వాసులు అంతా కలిసి దేవుణ్ణి నేరస్తుణ్ణి చేసేశారు!

దేవుడు దోషిలా తలదించక తప్పలేదు.

“దేవుడా… నువ్వే ఆ పాపని కాపాడడానికి వచ్చావ్, నిన్నే దేవుడు కాపాడతాడు?” అని గొణుక్కుంటూ తడిచిన కళ్ళని వొత్తుకుంది పెద్దావిడ.

“పాప ప్రాణం పోవాలి, యిక్కడ నీ ప్రాణం తీస్తాం” హెచ్చరికగా దేవుడి కాలరు పట్టుకొని వెనక్కి తోశాడొక భక్తుడు.

“ఆ పాప యెవరో యేమిటో తేలకుండా వీడెవడన్నా హాస్పిటల్‌కు పంపడానికి?” దేవుడి చెయ్యి పట్టుకు నులిమితిప్పాడు వొకడు. “దేవుడట!” అని దేవుడి మెడ మీద చెయ్యి వేశాడొకడు.

దేవుడు కుప్పకూలిపోయాడు!

అంతే, అంతా కలిసి అతని మీద కుప్పగా పడ్డారు, అంతు చూడాలన్నట్టు. మూకుమ్మడిగా దాడికి దిగబడినట్టు.

ఆవేశాల అగ్ని రాజుకుంది. భక్తి మహోధృతమై లావాలా ప్రవహించింది!

అక్కడ అన్ని మతాలకూ వుమ్మడి శత్రువుగా మారాడు ‘దేవుడు’!

“దేవుడా… నువ్వు పారిపో,” అంది పెద్దావిడ, పేరు తెలీక అన్నదో ‘దేవుడు’ అని అన్నందుకు అన్నదో కాని అన్నది. ‘దేవుడి హత్య’ అని పేపర్లో రేపటి వార్తని కూడా ఆమె ఆ క్షణాన వూహించింది.

ఊహించిన దానికి భిన్నంగా జరిగింది.

మూకల బారిన పడ్డ దేవుడు తప్పించుకున్నాడని అనుకున్నారు, కాని చిత్రంగా ‘దేవుడు’ మాయమైపోయాడు?!

“ప్చ్… కొడుకు మిస్సయ్యాడు, దొరికుంటేనా… హు… దేవుణ్ణి చూపించేవాళ్ళం!” అని అనుకున్నారు ఆయా మతాలకు ప్రతినిధులుగా నిలిచిన భక్త బృందాలు!

కొందరయితే దేవుణ్ణి వెతుకడం మొదలుపెట్టారు!

*

బమ్మిడి జగదీశ్వరరావు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి కథ

    భక్తులకు గుణపాఠం నేర్పే కథ

    Congratulations brother 🎉

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు