ఇప్పుడిప్పుడే వద్దులే అనుకున్నాను!

కథలంటే ఊహలు, ట్విస్టులు, సర్ప్రైస్ లు ఉండాలనుకుంటున్న నాకు కేవలం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా కథలు రాస్తారని, మంచి చదువరుల మెప్పు కూడా అలాంటి కథలకే లభిస్తుందనీ తెలిసి ఆశ్చర్యమేసింది.

నా మొదటి కథ కబుర్లు చెప్పడమంటే నా సంతోషాన్నిపంచుకోవడమే. నాకు గొప్పనమ్మకాన్ని,పదిమంది పరిచయాల్ని కలిగించిన కథ. “ గొర్రె చచ్చింది” అనే ఆ కథ జూలై 12,1998 లో ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలో ప్రచురింపబడింది.

చిన్నప్పటినుండీ వార, మాస పత్రికలు బాగా చదవడం వల్ల కథలమీద ఆసక్తి కలిగింది. ఇంటర్ ముగిసేలోపల ఐదారు కథలు రాసి పెట్టుకున్నాను. అప్పట్లో రచనలో వచ్చే సాహితీ వైద్యం క్రమం తప్పకుండా చేదివేవాడిని. ఏదో ఒక రోజు మన కథ వసుంధర గారి కళ్ళలో పడాలి అనుకునేవాడిని. శార్వరి సంపాదకత్వంలో కథలెలా రాస్తారు అనే పుస్తకం చదివాక కథలు ఇప్పుడిప్పుడే వద్దులే అనుకున్నాను.

కట్ చేస్తే, ఎంటెక్ పూర్తి చేసి కర్నూల్లో పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు డా.తుమ్మల రామకృష్ణతో  తద్వారా కర్నూల్లో కథాసమయం మిత్రులతో పరిచయం కలిగింది. కథలంటే ఊహలు, ట్విస్టులు, సర్ప్రైస్ లు ఉండాలనుకుంటున్న నాకు కేవలం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా కథలు రాస్తారని, మంచి చదువరుల మెప్పు కూడా అలాంటి కథలకే లభిస్తుందనీ తెలిసి ఆశ్చర్యమేసింది. ‘ఓస్, ఇంత ఈజీనా’ అనుకుని రాయడానికి ఉపక్రమించబోతుండగా ఎప్పుడో రాసిన గ్రూప్ 1 ఫలితాలు రావడం, నేను ట్రైనింగ్ నిమిత్తం కడపకు వెళ్ళి పోవడంతో ఆ ప్రయత్నం వెనుకబడి పోయింది.

మళ్ళీ కట్ చేస్తే, 1998 ఏప్రిల్ .. నేను ఆదోనిలో పనిచేస్తూ కర్నూలుకు వారానికి ఒక సారి వచ్చేవాడిని. అలా వచ్చిన ఒక వారం ఒక కథ రాసుకుని కథాసమయం సమావేశంలో (తుమ్మల రామకృష్ణ గారి ఇంటి మిద్దె పైన) వినిపించాను. గొర్రెల పెంపకం స్కీములో చేరి కొంత డబ్బులు పోగొట్టుకున్న స్వీయానుభవంతో రాసిన కథ అది. అప్పటివరకూ అన్నీసీరియస్ కథల చర్చలే ఉన్నందుకు కాబోలు, సరదాగా,వ్యంగ్యంగా సాగిన ఈ కథని మిత్రులంతా నవ్వుతూ ఎంజాయ్ చేశారు. చివర్లో రాప్తాడు గోపాలకృష్ణ ఈ కథని దేనికి పంపుతారనడిగితే నేను సిన్సియర్ గా రచనలో సాహితీ వైద్యానికి పంపుదామనుకుంటున్నానన్నాను. గోపీ నవ్వుతూ, కథ కేమైనా జబ్బు చేస్తే వైద్యం చేయాలి అని, నాకు ఫెయిర్ కాపీ పంపండి. నేను జ్యోతికి పంపుతానన్నాడు.

మరోమారు కట్ చేస్తే, 1998 మేలో బదిలీ మీద హైదరాబాద్ కు వచ్చాను. జూలై 12 ఆదివారం – ఉదయం అలవాటుగా ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుని తిరగేస్తుంటే ఈ వారం కథ శీర్షికలో అక్బర్ చేతిరాతతో “గొర్రె చచ్చింది” అని కనబడింది. నమ్మలేని సంతోషంతో కళ్ళు చికిలించి చూస్తే – కింద నిలువుగా జి. ఉమామహేశ్వర్ అని కూడా కనిపించింది. పట్టలేని ఆనందం కలిగింది.

అప్పట్లో (ఇప్పట్లో కూడా) ఆంధ్ర జ్యోతిలో కథ రావడమనేది గొప్ప అవార్డు లాంటిదని భావించేవాళ్ళు. అలాంటిది మొదటి కథే అలాంటి గౌరవం పొందటం గొప్ప థ్రిల్ కలుగచేసింది. ఒక వారం తరువాత ఆఫీసులో ఉంటే నా ఫోన్ మోగింది. అవతల ఆరెం ఉమామహేశ్వరరావు. ఆంధ్రజ్యోతి సండే ఇన్ఛార్జి. మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చి,చాలా ఉత్తరాలు వస్తున్నాయి అంటూ అభినందనలు తెలిపాడు.  ఆ తరువాత వారం వారు ప్రచురించిన ఆరు ఉత్తరాలలో ఐదు ఈ కథ గురించి ఉండటం గొప్ప సంతోషం. అందులో ప్రత్యేకించి థింసా పేరుతో పి.సి.రాములు గారి ఉత్తరం మరచిపోలేని జ్ఞాపకం.

*

జి.ఉమామహేశ్వర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.