ఫ్యాషనబుల్ బ్లౌజ్ కాదు ఈ ‘రవిక’

ఈ కవితలలో కన్నీటి మరకలే కాదు వెన్నెల చారికలూ ఉన్నాయి, ఖాళీ దేహాలూ, కన్నీటి సంచులూ ఉన్నాయి. కులాలూ, మతాలూ, రాజకీయాలూ ఉన్నాయి!

ఒక్క పేజీ తిప్పగానే – ఇది మగ్గం వర్క్‌ చేసిన ఫ్యాషనబుల్‌ రవిక కాదు… ఒకప్పటి స్త్రీ మాన మర్యాదలను కాపాడే రవిక లేని తనాన్ని ప్రశ్నించి, ఎందరి మనసులలో మండుతున్న జ్ఞాపకాలను నివురులా కప్పి చల్లార్చిన రవిక అని తెలిసింది. నాకు మొట్టమొదట గుర్తుకొచ్చింది –

ఘండికోట బ్రహ్మాజీరావుగారి నవల ఒకదానిలో విడోలమీద చూపే వివక్ష గురించి, రవిక వేసుకోని ఒక విడో అత్తవారింట్లోనే చాకిరీచేసి చేసి మగ్గిపోతూ, తన భర్త ఆబ్దీకానికి వడ్డన సమయంలో పయ్యెద రవంత తొలగినందుకు బ్రాహ్మణవర్గం యావత్తూ భోజనాలను బహిష్కరించడం, ప్రాయశ్చిత్తంగా మరింత ధనమో ఏదో వసూలు చేయడం .. ఇలా చదివినట్లు గుర్తు! నేను చదివిన ఆయన పుస్తకాలు రెండు, మూడింటిలోనూ విడో వివక్షగురించి ఉండడం కాకతాళీయమే అనుకుంటాను!

రేణుక గారి పుస్తకం తీసుకున్నానే గానీ ఒక వెరపు – విశ్లేషణలు రాయడం అలవాటు తప్పింది, అదొక కారణం అయితే – మరొకటి సమయాభావం, కొంత బద్ధకం! ఇంకో అసలు కారణం – కవిహృదయాన్ని పట్టుకుని విశ్లేషణ రాయగలగడం ఎలా అని! ఈ సబ్జెక్టు నాకంతగా పరిచయం లేనిది కాబట్టి! ముందుగా రేణుక గారు ఒక వెటరన్‌ కవయిత్రి – ముఖ్యంగా స్త్రీవాద కవయిత్రి! బహుశా స్త్రీవాదం అనేది స్వంత అనుభవాలనుండి మాత్రమే కాక, కొని్న సంఘటనల వల్ల విసిగిపోవటం నుంచి, సమాజపు అవహేళనలనుంచి, గుచ్చుకునే చూపుల నుంచి, దాక్కోలేనితనం నుంచి, అభద్రతాభావపు ఉప్పెనల నుంచి, రక్షణ కరువైన రోజుల నుంచి కూడా పుడుతుంది!

పృథ గురించి రేణుకగారు దీర్ఘకావ్యం రాసినపుడు కుంతిని తెలుగుతనంలోకి, అక్షరాలుగా మార్చి చదివించినపుడు ఎప్పటికీ అది ఆకళింపు చేసుకోలేని కౌరవుల సంతతి ఉంటూనే ఉంటుందని అర్థమైంది! ఈ పుస్తకం రవిక అనే పేరుతో నా చేతిలోకి వచ్చినపుడు, ఇది మగ్గం వర్క్‌ చేసిన ఫ్యాషనబుల్‌ రవిక కాదు… ఒకప్పటి స్త్రీ మాన మర్యాదలను కాపాడే రవిక లేని తనాన్ని ప్రశ్నించి… ఎందరి మనసులలో మండుతున్న జ్ఞాపకాలను నివురులా కప్పి చల్లార్చిన రవిక… అని తెలిసింది!

ఈ కవితలలో కన్నీటి మరకలే కాదు వెన్నెల చారికలూ ఉన్నాయి, ఖాళీ దేహాలూ, కన్నీటి సంచులూ ఉన్నాయి. కులాలూ, మతాలూ, రాజకీయాలూ ఉన్నాయి! రేణుక గారు స్పృశించని అంశం ఏదీ లేదు.. నేను ఏ కవితనూ ప్రత్యేకించి కోట్‌ చేయడం లేదు – దేనికదే విభిన్నం! ఏది నచ్చిందనో ఏది నచ్చలేదనో రాయడం కష్టం!

ఈ కవితలలో అమ్మతనమే కాదు, గొడ్రాలితనమూ ఉంది.. ముఖం లేని వేళ్ళతో ఉత్తరం రాయడం ఉంది, సముద్రానికి అవసరం లేని నదులున్నాయి! ఏది ఏమైనా – వైధవ్యపు ముసుగున రవికన నిరాకరించిన పురుషస్వామ్యపు రోజులను పరిహసించిన కవిత్వం ఇందులో ఉంది!

తెలుసుకోవాలనుకుంటే చదవాలి! తప్పకుండా చదవాల్సిన కవిత్వం ఇందులో ఉంది!

*

గీతా వెల్లంకి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • క్లుప్తంగా విశ్లేషణ
    రవిక ఫ్యాషనబుల్ కాదని
    రవిక నాగరికత కు తొలి మర్యాద

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.