ఆ పదహారేళ్లకూ నాలో నీలో….

పెళ్లిళ్లకు ఫంక్షన్లకు పోబుద్ది కాకుండే. ఇంటికెవరన్న కొత్త వాళ్లొస్తే పిచ్చిలేస్తుండే. వంటింట్లోకి పోయి కూచుంటుంటిమి.

ఈమధ్య మా పిల్లల స్కూల్లో ఏడాది పండగ  జరిగింది. మా అబ్బాయి దాంట్లో డాన్స్  చేయను, టీచర్ కు చెప్పు అని నన్ను రోజు అడుగుతుండే. వాడు నిజానికి  డాన్స్ బాగా చేస్తడు, స్టేజీ అంటే భయం  కూడా లేదు. బద్ధకమేమోనని, నేను లేదమ్మా చేయాలి స్కూల్ అయిపోతే ఇంక తర్వాత నువ్వెప్పుడు చేస్తావు అని కాస్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేసిన.

కానీ వాడు వినలేదు. మొత్తానికి టీచర్కి ఏదో చెప్పి డాన్స్ చేయడు అని చెప్తే  అందరూ తప్పనిసరిగా  చేయాలి కాబట్టి వాడిని ఏదో ఒక పాటల  గ్రూపులో పెట్టింది. కానీ వాడు ఎందుకట్ల అంటున్నాడో నాకు ఆ  ప్రోగ్రాం చూసినంక అర్థమైంది. తొమ్మిది, పదవ తరగతుల పిల్లల  ప్రోగ్రాం కు వాళ్ళు తీసుకున్న థీమ్ “తారుణ్య”, అంటే యవ్వనం, జవ్వనం, లేతదనం  అన్న అర్ధాలున్నయి.  టీనేజ్ పిల్లలకి ఎదురయ్యే రకరకాల ఎమోషనల్ ఛాలెంజెస్, కష్టాలు, గందరగోళం వాళ్లను తల్లిదండ్రులు ఎట్ల హ్యాండిల్ చేయాలనేది పాటల రూపంలో చాలా బాగా చేసినరు.

అప్పటివరకు హాయిగా బిందాస్ గా ఉండే పిల్లలకు  టీనేజ్ మొదలైతూనే హటాత్తుగా అన్నీ ఇబ్బందిగ అనిపిస్తయి. అవసరానికి మించిన self-consciousness వచ్చేస్తుంది. తను చూడ్డానికి ఎట్లున్నడు, బట్టలు ఎట్లున్నయి,  తన నడక ఎట్లుంది , తన వాయిస్ ఎట్లుంది, తను మాట్లాడే విధానం ఎట్లుంది, ఎప్పుడూ ఇవే ఆలోచనలు. ఆడపిల్లలకు ఇంకొన్ని ఎక్కువ సమస్యలు వుంటయి. దీండ్లలో ఏవో కొన్ని బాలేవన్న బాధ మనసులో పీకుతూనే ఉంటుంది. ప్రతొక్కరూ తననే చూస్తున్నరు, తన ప్రతి యాక్షన్ గమనిస్తున్నరు అని అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు అంత బావుంది పరవాలేదని ఎంత చెప్పినా కానీ వాళ్లకు తృప్తినియ్యదు.

మావోడు కూడా అందరూ డాన్స్ చేస్తుంటే నన్నే చూస్తరు, ఆ ఒక్క రోజు స్టేజ్ మీదనే  కాదు రిహార్సల్ చేస్తుంటే రోజూ చూస్తరు, బాలేకుంటే నవ్వుతరు అన్న కారణం తో చేయలేదు. అదేం కాదని మనమెంత చెప్పినా గాని వీళ్లకు అర్థం కాదు. అసలు లాజికల్ రీజనింగ్ అనేది ఇక్కడ పనే చేయదు. అదంతే, అదే టీనేజ్. ఆ వయసులో చూడ్డానికి బాలేమనిపిస్తే లేదా డ్రెస్సులు బాలేకుంటే వేరే టాలెంట్సెన్ని ఉన్నా  వృధా. ఈ టీనేజ్ పిల్లల్ని అర్థం చేసుకోవాలంటే మనము ఒకసారి మన టీనేజ్ ని గుర్తు తెచ్చుకోవాలనుకుంటా.

అందరి విషయం తెలియదు కానీ నాకు టీనేజ్ చాలా ఇబ్బందికరమైన వయసు.

నేను హై స్కూల్ చిన్న టౌన్ లో( వనపర్తి) గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లో చదివిన.  స్కూల్లో, ఫ్రెండ్స్ దగ్గర, ఇంట్లో, క్లోజ్ బధువుల దగ్గర ఉన్నప్పుడు బానే ఉంటుంది. ప్రాబ్లమ్ అంతా కొత్త వాళ్లున్నప్పుడే. ఆ టైంలో శరీరంలో కొత్తగా వస్తున్న మార్పుల వలన ఆడపిల్లలు చాలామంది వంగి నడుస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోకుండా పెద్దవాళ్లు చక్కగా నడవమని తిట్టడం, కొంచెం క్లోజ్ గా ఉన్నవాళ్లయితే ఎక్కిరించడం చేస్తుంటరు. ఇంక రోడ్డు మీద నడుస్తున్నప్పుడయితే కుంచించుకొని పోతుంటిమి. అసలే అట్లాంటి టౌన్లలో సాయంత్రం పూట రోడ్లమీద అక్కడక్కడ గుంపులు గుంపులుగా మగపిల్లలు నిలబడి దార్ల పోయే వాళ్ళని చూస్తూ ఉంటరు. దూరం నుంచి ఒక గుంపు కనపడిందంటే తల నేలలోకి దించుకోవడమే. వాళ్ళు చూస్తున్నరో లేదో తెలియదు కానీ ఈ టీనేజ్ సెల్ఫ్ కాన్షియస్ వలన మనకు మాత్రం వాళ్ళు చూస్తున్నట్టే అనిపిస్తుంది.అసలెంత ఇబ్బంది వుంటుండే అంటే అది మాటల్లో చెప్పలేము. ఒకవేళ మంచి కామెంట్స్ చేస్తే అప్పుడు ఇబ్బంది పడినా తర్వాత బానే అనిపిస్తుందేమో కానీ, నెగటివ్ కామెంట్స్ చేస్తే మాత్రం తట్టుకోలేము.

పెళ్లిళ్లకు ఫంక్షన్లకు పోబుద్ది కాకుండే. ఇంటికెవరన్న కొత్త వాళ్లొస్తే పిచ్చిలేస్తుండే. వంటింట్లోకి పోయి కూచుంటుంటిమి. అయినా మా నాన్న వదిలిపెట్టకుండ బయటికి తీసుకొచ్చి పరిచయం చేస్తుండే. వాళ్లు నన్ను పై నించి కిందకు ఏదో చిన్న చూపుతో చూసినట్టనిపించి నాన్న మీద కోపమొస్తూండే. తర్వాత అందరికీ ఎందుకు పరిచయం చెయ్యాల్నని నాన్నతో కొట్లాడుతుంటి. ఎందుకో ఇప్పుడర్థమైతుంది నాకు. కానీ నా విషయం గుర్తొచ్చి పిల్లలనెక్కువ బలవంతం చెయ్యననుకోండి.

స్కూల్ తర్వాత మరీ అంత ఇబ్బంది లేకున్నా కానీ,  వివిధ కారణాలవల్ల అది ఆల్మోస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ తర్వాత ఒక పెద్ద సఫోకేటింగ్ చాంబర్లో నుంచి బయటికొచ్చినట్టు హాయిగా అనిపించిందబ్బా నాకు. అందుకేనేమో ఇప్పటికీ నాకు టీనేజ్ పిల్లల్ని చూస్తే పాపమనిపిస్తుంది. ఆ రోజు అన్యువల్ డే లో స్టేజి పైన డాన్స్ అంత బాగా రాని పిల్లలు, ఫిజికల్ గా చూడ్డానికి మన సొసైటీ అంచనాల ప్రకారం లేని పిల్లలని చూస్తే చాలా బాధనిపించింది. వాళ్ళు ఏమేం ఎదుర్కొంటరు, వేరే పిల్లలెంత ఏడిపించుంటరు, లోపల ఎంత బాధ పడుతుంటరని.

ఈ కాలం టీనేజీ పిల్లలకి ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. exposure ఎక్కువ ఉండడం వల్ల ఒత్తిడి ఎక్కువ ఉంది. ఇప్పుడు వచ్చే సినిమాలతో, ఇష్యూస్ తో, వెబ్ సిరీస్ తో, ఇంగ్లీష్ పాటలతో,  సోషల్ మీడియా లో టీనేజర్స్ వాడే భాషతో  అన్నిటితో వాళ్ళు అప్డేటెడ్ గా ఉండాలి. దీండ్లలో  ఏది తెలియకపోయినా ఫ్రెండ్స్ బాగా బుల్లీ చేస్తరు. అందుకని సోషల్ మీడియాలో ఉండాలన్న పియర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మళ్లీ దాంట్లో ఉండే కొద్దీ బయటి వాళ్ల వాలిడేషన్ ఇంకా ఎక్కువ అవసరమనిపిస్తుంది. అది ఇంకా ఎక్కువ స్ట్రెస్ కి గురి చేస్తుంది. ఇదొక విష వలయం. అదీ కాక ఎప్పుడూ ఫోన్ చూస్తున్నావని తల్లిదండ్రులు టీచర్స్ నినుంచి కంప్లైంట్స్. ఇంటర్మీడియట్ పిల్లలకైతే వీటన్నిటితో పాటు ఏ కెరియర్ తీసుకోవాలనే ఒత్తిడి కూడా ఉంటుంది. మన దేశంలోనే ఇంత చిన్న వయసులో అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలి.పదహారేళ్లకు హాయిగా ఉండాల్సిన వయసులో మొత్తం ఫ్యూచరంతా తేల్చుకోమనడం ఎంత ఘోరం కదా.

అయితే మా పిల్లల స్కూల్ ప్రిన్సిపల్ టీనేజ్ పిల్లల్ని టాడ్లర్స్ని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. నిజమే కదా. ఒక్క క్షణం మనం చూడకుంటే చిన్న పిల్లలు పోయి ఎదురుగా ఏది ఆకర్షణీయంగా కనిపిస్తే దాన్ని పట్టుకుంటరు. వాళ్లతో ఎంత పేషంట్ గా ప్రేమగా ఉంటామోవీళ్ళతో కూడా అట్ల ఉండాల్సిందే. వాళ్లనెంత జాగ్రత్తగా గమనిస్తూ కాపాడుకుంటమో వీళ్ల మీద కూడా ఒక కన్నేసి డ్రగ్స్, సోషల్ అబ్యూస్, సైబర్ క్రైమ్ లాంటి వాటి నించి కాపాడుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ వయసులో వాళ్ళ మనసులో ఏదన్నా నెగిటివ్ ఎఫెక్ట్ పడితే అది జీవితాంతం వదిలిపెట్టదు.

ఉదాహరణకు ఈ వయసులో వాళ్ళని ఎవరన్నా చూడ్డానికి బాలేవనో,  నీకు సరిగ్గా మాట్లాడ్డం రాదనో, ఇంకెవైనా నెగటివ్ కామెంట్స్ చేస్తే వాళ్లు పెద్దగైనాక చూడ్డానికి బావున్నా, అన్నీ వచ్చినా ఆ విషయాల్లో వాళ్ళ ఆత్మవిశ్వాసం మాత్రం పెరగదు. ఎందుకంటే వాళ్ళకి వాలిడేషన్ చాలా అవసరమైనప్పుడు అది దొరకలేదు కాబట్టి. దాదాపు మనందరికీ ఇట్లాంటి ఏదో ఒక అనుభవమయ్యే వుంటుంది కదా. అది గుర్తు పెట్టుకొని టీనేజ్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ వయసులో ఆపోజిట్ సెక్స్ పైన ఆకర్షణ  చాలా సహజమని గుర్తు పెట్టుకుని పిల్లలని తిట్టకుండా కౌన్సెల్ చెయ్యాలి. ఇవన్నీ అనుభవించే వచ్చినమన్న విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

మాలతి పల్లా

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.