సరికొత్త జీవితాల అన్వేషణ తెలంగాణ కథ

సంగిశెట్టి శ్రీనివాస్, శ్రీధర్ వెల్డండి సంపాదకత్వంలో వెలువడిన తెలంగాణ కథల సంకలనం “పగిడి” లో కొన్ని కథల నేపథ్యం ఇది!

 ఆన్ లైన్ ఆట.. ఆట కాదు వేటనే!

సామాజిక అంశాలపై పత్రికలకు వ్యాసాలు రాసే క్రమంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు నన్ను వెంటాడుతాయి. కేవలం వ్యాసాల ద్వారా ఆ భారం దిగి పోదు. ఆ విషయాన్ని కథగా మలిచి పాఠకులతో పాటు నేను కొంత సాంత్వన పొందుతాను. అలాంటిదే ఈ కథ. ఆన్ లైన్ గేమ్స్ వల్ల జరుగుతున్న అనర్థాలను ఎత్తి చూపాలనే ప్రయత్నం ఇది. దాదాపుగా ఒక గ్రామీణ కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటనల సమాచారమే ఈ కథా, కథనం అంతా.
ఆన్ లైన్ ఆట.. ఆట కాదు వేటనే.  వేటను ఆటలా ప్రచారం చేసి వలలో చిక్కించుకోవడమే ఆన్ లైన్ గేమ్ అసలు పన్నాగం. నిజానికి వీటి బారిన పడి యువత నష్టపోతున్న వార్తలు ఎవరినైనా కదిలిస్తాయి. ఆన్ లైన్ ఆటలను నిలిపివేయాలని కొందరు కోర్టుకు వెళ్లినా వారికి నిరాశే మిగిలింది. ఈ క్రీడలు జూదం లెక్కలోకి రావు. తెలివి, నైపుణ్యంతో ఆడే అన్ని ఆటల్లాంటివే ఇవి అని న్యాయస్థానం పలికింది. చట్టం కూడా కట్టడి చేయలేని సామాజిక ద్రోహం ఇది.
మన సమాజంలో జూదాలు, వ్యసనాలు ఈనాటివి కావు. వాటి నుండి ఎవరిని వారు కాపాడుకోవలసిందే. అందుకు తగిన జాగరూకత, విజ్ఞత అందరికీ అవసరం. కుటుంబం, విద్య, స్నేహాలు, పరిసరాలు అన్నీ.. చెడు దారుల విషయంలో స్వీయ నియంత్రణ ఏర్పడేలా ఆవరించగలగాలి. ప్రమాద హెచ్చరికల్లా పని చేయాలి. ఇలాంటి ఆటల బోనులో చిక్కుకోకుండా పిల్లలు ఉండాలని, పెద్దలు ఈ విషయాన్ని గ్రహించాలని ఈ కథ ద్వారా చెప్పాలనిపించింది. అందుకోసం ఈ గేమ్స్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని వాటిని    పరిశీలించాను. అందువల్లే కథలోని మురళి పాత్రను, ఆయన్ని చుట్టుకున్న వలను సహజంగా చెప్పగలిగానని నా అభిప్రాయం.
                                                — బద్రి నర్సన్ 

 

ఎడారి దేశాలలో బికారిగా…

మా నాన్నగారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. తపాలాశాఖలో సబ్ పోస్టుమాస్టర్ గా పనిచేసేవారు. అప్పట్లో దుబాయ్, మస్కట్, బహ్రెయిన్ నుండి ఆ పల్లెవాళ్ళకు ఫారిన్ ఇన్లాండ్ లెటర్స్ వచ్చేవి. మంచి క్వాలిటీ గల పార్సిళ్ళలో ఖరీదైన వాచీలు, సెంటు సీసాలు, ట్రాన్సిస్టర్ రేడియోలు, బొమ్మలు, బ్యాగులు, పర్సులను వాళ్ళింటి ఆడోళ్ళకు పంపేవారు. మా నాన్నగారి ఆఫీసుకు బహ్రెయిన్ పోయి వచ్చినోళ్ళు అప్పుడప్పుడు వస్తూ కాస్తో కూస్తో ఇంగ్లీషూ మాట్లాడేవారు. చిన్నన్నప్పటినుండీ వాళ్ళు చెప్పే మాటల్ని వింటూ పెరిగానేమో నాకు తెలియకుండానే  ఎడారి దేశాల జీవన విధానం పట్ల ఆకర్షితురాలినయ్యా.

అక్కడి ఓయాసిస్సులను వాడి అంటారని అవన్నీ ఖరీదైన నగరాలని, కువైట్ కరెన్సీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదై  నదని   తెలంగాణా గ్రామీణ వలసలను ఆకర్షించే  ఈ ఎడారి నగరాలు నన్నొక వదలని వ్యామోహంగా బాల్యం నుండే వెంటాడేవి. అలాగే నేను ప్రస్తుతం పని చేస్తున్న ఉన్నత పాఠశాలలోని పిల్లల తల్లితండ్రులు ‘బాహర్'(విదేశం) వోయి అచ్చినమని చెప్పే వాళ్ల కష్టాలు నన్నెంతో కలిచివేశాయి. అక్కడి న్యాయమూ శిక్షలు ఎంతో కఠినమైనవని అదాలత్, జుర్మానా,ఫత్వా,నితాఖత్, ఫర్మానా, దియా,జమానత్ .. లాంటి పదాలు వాళ్ళు మాట్లాడే పల్లె భాషలో దొర్లేవి. తెలంగాణా జిల్లాలలో చాలా ప్రాంతాలలో ఇప్పటికీ వీసా గడువు ముగిసినా అప్పుల ఊబిలో కూరుపోయి, ఇటు సొంత ఊరికి రాలేక ఎడారి దేశాలలో బికారిగా మిగిలిపోతున్న వారు ఎందరెందరో. దళారుల చేతిలో చిక్కి, వీసా ముగిసినా (ఖల్లివెల్లి) గా ఉంటూ పట్టుబడితే ఆయా దేశాలలోని జైళ్ళలో మగ్గుతున్న శ్రామిక జీవుల కన్నీటి వ్యథ ఇది.

-బి.కళాగోపాల్

మంకు లొల్లి కథ వెనక కథ

ఈ కథ ఒక గ్రామంలోని చింతచెట్టు చుట్టూ తిరిగే మానవ సంబంధాల సంక్లిష్టతను, స్వార్థం–అనుబంధాల మధ్య జరిగే సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. నగరంలో సినిమా రంగంలో పనిచేస్తున్న కుమార్, ఊరిలో జరిగిన చిన్న గొడవ కారణంగా తిరిగి తన గ్రామానికి వస్తాడు. ఆ గొడవకు కేంద్రబిందువుగా మారిన చింతచెట్టు, తరతరాలుగా నీడనిచ్చిన తల్లి లాంటి గుర్తుగా నిలుస్తుంది. కానీ అదే చెట్టు అన్నదమ్ముల మధ్య విభేదాలకు, పోలీసు కేసులకు, పంచాయితీలకు దారి తీస్తుంది. సమస్యను పరిష్కరించాల్సిన పెద్దలు, అసలు మూలకారణాన్ని పక్కన పెట్టి చెట్టునే నరికి వేయాలనే తీర్మానం చేస్తారు. చెట్టు కూలిపోవడంతో పాటు, మానవ సంబంధాలు కూడా క్రమంగా కూలిపోతున్నాయనే బాధ కుమార్‌ను కలచివేస్తుంది. అయినా, అస్తమించే సూర్యుడిలా క్షీణించిన బంధాలు మళ్లీ కొత్త మొలకలా పునరుద్ధరిస్తాయనే ఆశతో కథ ముగుస్తుంది.

-కుమారస్వామి

దర్భశయ్య చెప్పిన కథ

మా పాల్వంచ సమీప గ్రామంలో ఓ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన దంపతులకు నలుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు వున్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వేరు పడిపోయారు. ఎవరి సంసారం వారిదయ్యింది. ముసలోళ్ళిద్దరూ ఓ చుట్టు గుడిసెలో వండుకుతింటూ వుంటున్నారు.

కొన్నాళ్లకు ముసలాయన కాలంచేశాడు. అతని అంత్యక్రియలకు సంబంధించిన ఖర్చుల దగ్గరి నుండి ప్రతి విషయంలోనూ అన్నదమ్ముల మధ్య గొడవలు. ఆడబిడ్డల రోదనలు మొదలయ్యాయి.

కర్మకాండలు ముగిసిన తరువాత ముసలమ్మ ఒక్కతే వుంటూ వచ్చింది. జంట బాసిన ముసలమ్మ ఆదరించని సంతానం తీరుకు నొచ్చుకుని, తన తదనంతరం అంత్యక్రియల ఖర్చు కూడా కొడుకుల చేత పెట్టించుకో గూడదన్న ఉద్దేశ్యంతో తన కర్మ కాండలకు కావాల్సిన సమస్తం తనే ఏర్పాటు చేసుకుని తలాపున గండ దీపం పెట్టుకొని, గడ్డి మీద పడుకుని ప్రాణాలు ఉగ్గబట్టి స్వచ్ఛందంగా అసువులు బాసింది.

ఇది వాస్తవ ఘటన. నా కథకు ప్రేరణ.

-శిరంశెట్టి కాంతారావు

మీరే పరిష్కారం చెప్పండి!

ఒకవైపు మానవుని ఆలోచనలు, ఆవిష్కరణలు అంతరిక్షం వరకు సాగినా! మరోవైపు  మూఢత్వంలోనూ అంతే అథమస్థానంలోకి దిగజారుతున్నాయి. మనిషి నిత్య జీవితంలో శాస్త్ర సాంకేతికతను విరివిరిగా వాడుతున్నా వాటి మర్మం గ్రహించలేక పోతున్నాడు. మంత్రాలకు చింతకాయలు రాలవు అనే సామెత నిగూఢార్ధం అవగతం చేసుకోలేకపోతున్నాడు. సైన్స్ ఉపయోగించి మనిషిని బతికిస్తే, మూఢ నమ్మకాలు  మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. నింద కథ ఒక యదార్థ సంఘటన. పుకార్లు ఎలా పడుతాయి, ఎలా వ్యాప్తి చెందుతాయి, మంది చెప్పే  చెడు మాటలు ఎంత ప్రమాదకరమో ఈ కథ ఎర్కజేస్తుంది.

మన ఆలోచనలను మూఢ నమ్మకం కబ్జా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ కథ చదివితే అర్థం అవుతుంది. పిలగానికి పానం బాగలేకపోతే దవాఖానకు తీసుకపోవాల్సిన వాళ్ళు  మంది మాటలు విని పొలగాన్నీ పోగొట్టుకుంటారు. అంతటితో ఆగకుండా  మరో దారుణానికి ఒడిగాడుతారు. ఒక అపనమ్మకం వ్యవస్థను ఎంతటి చిన్నాభిన్నం చేస్తుందో  ఈ కథ చదివితే తెలుస్తుంది. ఈ కథలో బాధితుడు చెప్పే మాటలు మనల్ని ఆలోచనలో పడేస్తుంది. మనకు ఎన్నో ప్రశ్నలు ఎదురైతాయి. సమాజాన్ని నిలదీస్తాడు. ఇలాంటి ఆలోచనలు మనకు ఎందుకు రాలేదని నిందితుని పాత్ర ప్రశ్న వేసుకుంటుంది. ఇంతటి దారుణాలకు  నిరక్షరాస్యత కారణం అందామా? అంటే చదువుకున్న  వారిలోనూ ఈ ఈ థోరణి కనిపిస్తోంది. ఇలా ఈ కథ  పలు ప్రశ్నలు మన ముందు ఉంచుతుంది. మీరే పరిష్కారంచూపమని సవాల్ విసురుతోంది!

-బద్ది గణేష్

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.