అందమైన కల ’వరాళి’

రాళి ఒక రాగం పేరు.

వరాళి ఒక అమ్మాయి పేరు.

వరాళి రాగంలో వియోగ వేదన హృదయాన్ని పిండేలా పలుకుతుంది. ఆ ప్రేమ ప్రేయసీ ప్రియుల నడుమ కావచ్చు, భక్తులకీ భగవంతుడికీ నడుమ కావచ్చు. ‘ఏటి జన్మమిది..’ అంటూ రాముడి కోసం త్యాగరాజస్వామి తపించినట్టే, శ్రీరామచంద్ర కోసం వరాళి దుఃఖపడింది, రేఖాజ్యోతి రాసిన ‘వరాళి’ కథలో.

ఆరేళ్ల వియోగానంతర సుఖాంత ప్రేమ కథ ‘వరాళి.’  ఈ కథ చదువుతూవుంటే కె.విశ్వనాథ్‌ తీయకుండానే వెళ్లిపోయిన సినిమా కళ్లకు కడుతుంది.

వరాళి కథ ఇక్కడ చదవండి.

భద్రాచలం పిల్ల వరాళి. సంగీతాన్ని శ్వాసించే యజుర్వేదుల రఘురామశర్మ మనుమరాలు. మాట రాని వయసులోనే పాట ఒంటబట్టిచ్చుకున్న నిండుగోదారి. తాతే గురువు. సంగీతమే ఆమె ప్రపంచం. ‘వరాళి రాగం నేర్పించు తాతయ్యా’ అని మనుమరాలు నోరు తెరిచి అడిగినా, గురుశిష్య బంధాన్ని భగ్నం చేసే ఆ రాగాన్ని అతను నేర్పనేలేదు.  త్యాగరాజస్వామి 140వ వర్ధంతి రోజున వరాళిని ఒంటరిని చేసి తాత వెళ్లిపోయాడు. దిగులు గూడుగా మారింది ఆమె.  పాట ఒక్కటే తోడుగా మిగిలింది. ముసురు ముసురు చీకటిగప్పిన ఒక సాయంత్రం, రాములవారి గుడిలో పాట ఆమె దగ్గరకు అతన్ని తీసుకువచ్చింది.  పుస్తకం, సంగీతం వారిద్దరి నడుమా స్నేహానికి వారధిగట్టాయి. గోదారిలా గలగలా సాగుతున్న రోజులవి. ఆ ఉధృతి చూసి తండ్రి ఆందోళన చెందాడు. ‘అతను ఎవరో, ఏమిటో’ అని ఆమెను వారించాడు. శ్రీరామచంద్రతో ఆమె సంగీత తరంగాల మీద సవారీ చేస్తున్న ఒక రోజు నాన్న అక్కడకి వచ్చాడు. అతనితో నాన్న  మాట్లాడిన ఆ మరుసటి రోజు నుంచీ శ్రీరామచంద్ర జాడలేదు. ఆమె అడగలేదు. అందబోతున్నదేదో జారిపోయింది. ఆ చందమామ మరింత మూగబోయింది. పాడడానికి తప్ప నోరు విప్పని మౌనసంప్రదాయంలో పుట్టిన కలువ ఆమె. హిందుస్థానీ సంగీతం నేర్చుకునేందుకు ఆమె మకాం ఆగ్రాకు మారింది. ఆ తర్వాత నాసిక్‌.. ఆమె స్వరంలో తెలియని విషాదం ఏదో కొత్తగా జతచేరింది. ‘వెలుతురూ చీకటీ ఏదీ కాని బూడిదరంగు’ ప్రపంచానికి ఆ విషాదపుజీర నచ్చింది. అదే ఆమెకు పేరు తెచ్చింది. ఏళ్లు గడుస్తున్నా తెలియని ఆశ ఏదో ఆమెలో రెపరెపలాడేది. అది ఆమె చెంపల మీదుగా జారేది.

ఆరేళ్ల తర్వాత ఇసుక దిబ్బల గోదారి ఆమెను రమ్మని పిలిచింది. భద్రాద్రిలో ఆమె కచ్చేరీ ఖాయమైంది. ఒక ఉలికిపాటు.. అతను మళ్లీ కనిపిస్తాడేమో అనే ఆశ.. కనిపించడేమో అనే ఆందోళన.. ‘ఇన్నేళ్ల నుంచీ చేతులు చాచుకొని, చాచుకొని అలసిపోయినట్టున్న ఆ ఇంటికి’ చేరుకోగానే ఆమె రాములవారి గుడికి పరుగుతీసింది. గొప్ప గాయకురాలిగా ఆమెకు పలకరింపులు ఎదురవుతున్నాయి. ఆమె ఎదురు చూస్తున్నది అది కాదు.  ధ్వజస్తంభానికి కుడివైపున మండపంలో అతన్ని తొలిసారి చూసిన తావు, గుడిలోంచి గోదారిలోకి నడిపించే మెట్లదారి, గుడి గోడల మీదకు వంగిన తురాయి కొమ్మలు.. కలలాంటి కాలంలోకి ప్రయాణించింది ఆమె. అతనితో కలిసి తిరిగిన ఆ ప్రదేశాల్లో నడుస్తూవుంటే గుండె ఊగిసలాడుతోంది. తనలాగే అతనూ వస్తాడేమో.. తారసపడుతాడేమో.. వట్టి పిచ్చి.. కాదు, నిజమేనేమో!  ఆశనిరాశల కల్లోల సముద్రంలా ఉంది ఆమె.

ఆ సాయంత్రం కచ్చేరీ మొదలైంది. ‘అతనికి ఇష్టమైన ఆకుపచ్చ రంగుకి బంగారు అంచు ఉన్న కాంచీపురం చీర’తో వేదిక ఎక్కింది.  ముందు వరుసల్లో ఉన్న జనాన్ని ఆమె కళ్లు దుర్బిణీ వేసి వెతుకుతున్నాయి. రామయ్యని మన్నింపులు కోరుతూ ‘ఆడమోడి గలదె రామయ్య మాటలాడ మోడి గలదే’ మన్నింపులతో అన్వేషిస్తోంది. ఏ వరుసలోనూ అతని జాడ లేదు. దిగులుతో ‘నగుమోము గనలేని నా జాలి’ అని వేదనను పరిచింది. ‘బ్రోవ భారమా రఘురామా’ అంటూ  బహుదారి రాగంలో ఉక్రోషం పలికింది. వెతికి వెతికి వరాళి కళ్లు అలసిపోతున్నాయి. కన్నీళ్ళతో కళావతి రాగంలో ‘ఎన్నడు జూతునో ఇనకుల తిలకా నిన్నెన్నడు జూతునో..’ అంటూ దుఃఖపడింది.  అప్పుడు కనిపించాడతను, వేదికమీదే నాన్న పక్కనే ఆశీనుడై, ‘రామదాసు కీర్తనలు -విశ్లేషణ’ రాసిన గ్రంథ రచయితగా.

గోదారి ఉరకలెత్తింది, ‘సదా మదిన తలతు గదరా’ అంటూ గంభీర వాణిలో. అతని చిరునవ్వుతో ఆమెలో గొప్ప శాంతి. ఆ తర్వాత జరగబోయేదేమిటో తెలిసిపోతుండగా ఆమె,  ‘నా జీవనధారా నా నోము ఫలమా’ అంటూ చేతులు జోడించి కచ్చేరీ ముగించింది. కరతాళధ్వనులు..అభినందనల నడుమ నాన్న మైకు మందు నిలబడ్డాడు, ‘ఈమె ఇన్నేళ్ల వేదనకు నేను ప్రత్యక్ష సాక్షిని’ అంటూ. ‘పిల్లలే కాదు, పెద్దల కోసం త్యాగం చేయవలసింది, పెద్దలు కూడా’ అని పశ్చాత్తాప ప్రకటన చేశాడు. ‘అతను ఎవరో’ అని ఆరేళ్ల కిందట సందేహించి, అభ్యంతర పెట్టిన నాన్నే.. ‘ఆయనేమిటో, ఏ కులానికి చెందినవారో నేను అడగలేదు. మీరూ అడగొద్దు’ అని సభాసదులకు విజ్ఙప్తి చేశాడు. ‘ఆయన సాహితీ వేత్త. ఈమె సంగీత సుమం’ వీరిద్దరికీ రేపు ఇదే భద్రాద్రి సన్నిధిలో పెళ్లి అని వెల్లడించాడు.

అట్లా ఒక్కటైన ఆ జంట శ్రుతి తప్పని రాగంలా 25 ఏళ్లుగా జీవిస్తున్నారు అని రచయిత్రి కథకు శుభం పలికారు.  అంటే 1987లో మొదలైన కథ 2012లో ముగిసింది.

కవిగా రేఖాజ్యోతి నాకు తెలుసు. కథలు రాస్తారని తెలియదు. సారంగలో వచ్చిన ఈ కథ గాక ఇంకేమైనా రాశారో, లేదో కూడా తెలియదు. అడగాలనీ ఎందుకో అనిపించలేదు. ఆమె కవిత్వంలో వినిపించే విషాద ఏకాంత వేదనా స్వరమే ‘వరాళి’ కథలోనూ నాకు వినిపించింది. చక్కని వచనం రాయగల చేయి. పుల్లా పురుగూ, ఆకూ, తీగా..ప్రతి దానిలోనూ అందాన్ని చూసే కన్ను ఆమెది. వాకిటవాలే పిచుకపిట్టల గురించి ఆమె రాసే పోస్టులకు నేను అభిమానిని. రాలిన దాసాని పూలతో కాసిన కొబ్బరి నూనె కురులకు పట్టించి, జడ అల్లినట్టుగా ‘వరాళి’ కథను ఆమె రాగాలతో మేళవించి రాసిన తీరు అద్భుతం. తెలుగులో సంగీత వస్తు ప్రధానంగా వచ్చిన కొద్ది కథల్లో ఒక మంచి కథ ‘వరాళి’.  ఈమె మనో ప్రపంచం రాగ, వర్ణశోభితమైనది అని ‘వరాళి’ని చదివితే అర్థమవుతుంది.  కథ సుఖాంతంగా ముగియడంతో గొప్ప ఊరట కలుగుతుంది. మంచి ప్రేమ కథ చదివిన ఆహ్లాదంతో మనసు నిండుతుంది.

కథ మూసేశాక, ఇంతకీ శ్రీరామచంద్ర ఎవరు? అనే ప్రశ్న పుడితే మాత్రం మనసు వికలం అవుతుంది. రచయిత్రిని మన్నింపులు కోరుతూ ఈ వికల సందేహాలను కూడా ప్రస్తావిస్తాను.

కథలో సంప్రదాయ బ్రాహ్మణ పిల్లగానే వరాళి పాఠకులకు పరిచయం అవుతుంది. శ్రీరామచంద్ర బ్రాహ్మణ యువకుడు కాదని తండ్రి అభ్యంతరంతో అర్ధం అవుతుంది. నిజానికి అతను ఎవరో ఆమెకూ తెలీదు. స్నేహ మాధ్యుంలో తెలుసుకోవాలనే ఎరుక ఆమెకు కలుగలేదు. చిక్కబడి ప్రేమగా మారే క్రమంలో కులం అడ్డువస్తుందనే  కలవరం కలిగినా, ‘మీరేమిటీ?’ అని అడగలేక పోయింది. ఒకవేళ అతనూ, తానూ ఒక్కటే అని తెలుసుకుని ఉంటే పేచీ ఉండేది కాదేమో అని ఆశపడ్డ అమ్మాయి. కులాతీతంగా జీవించేంత తగిన తెగువగల పిల్ల కాదు వరాళి. అందుకే సంగీతం, సంప్రదాయం తప్ప మరో ప్రపంచం ఎరుగని వరాళి మౌనంగా హిందుస్థానీ నేర్చుకోవడానికి ఉత్తరాదికి వెళ్లిపోయింది. మౌనం, ఆమెలోపలి ప్రేమను తొక్కిపెట్టగలిగిందిగానీ, చంపలేకపోయింది. ఎన్నేళ్లయినా ధిక్కారం పలకని వరాళి వియోగ దుఃఖాన్ని చూసిన తండ్రే జాలిపడి దిగివచ్చాడు. తన సంప్రదాయ కుల కవచాలను వదులుకున్నాడు.

మరి  ఒకవేళ శ్రీరామచంద్ర దళితుడు అయ్యుంటే ?

కథలో అతని పాత్ర వ్యవహార శైలిని బట్టీ అతను దళితుడు మాత్రం కాదు అని అర్థం అవుతుంది. అగ్రవర్ణ శూద్రుడు కాబట్టి ఆ మాత్రం అయినా కవచాలు సడలాయా అనిపిస్తుంది.  పరువు హత్యల కాలంలో వరాళి కథ సుఖాంతం అయ్యే అవకాశం ఏ మాత్రం కనిపించదు. కొందరికి గుచ్చుకున్నా సరే ఇది వాస్తవం.

ఇక వరాళి కళావంతుల పిల్ల అయ్యుంటే ఏం జరిగేదా అని కూడా ఒక ఊహ మెదిలింది. పరాయి అస్తిత్వంలోకి పరకాయప్రవేశం చేసిన భారతరత్న  ఎంఎస్‌ సుబ్బలక్ష్మి గుర్తుకువచ్చింది అప్పుడు. కులం బలం ముందు సంగీతం, సాహిత్యం, సిద్ధాంతం కూడా చిన్నబోతున్న కాలంలో వరాళి ఒక అందమైన ఒక కల మాత్రమే! నిజమైతే బావుణ్ణన్న  రచయిత్రి ఆశగా నాకు ఈ కథ అర్థం అయ్యింది.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ గురించి మీ వ్యాసం చదివి, కథ పూర్తిగా చదివి ఆస్వాదించాక ఎంతో ఆనందంగా అనిపించింది. కథ చదువుతుంటే రాగాలేవో వింటున్న అనుభూతి. మీరన్నట్టు
    కళాతపస్వి విశ్వనాధ్ గారి సినిమా చూస్తున్న ఫీలింగ్. ఒక అద్భుతమైన కథను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    Every month I look eagerly for your column Sir.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు