వందేళ్ల విలువల వంతెన

ఆమె ఇప్పటిదాకా మానసికంగా అలర్ట్‌గా ఉండడానికి ఆ కాలమే ఆమెను తీర్చి దిద్దింది

కొండపల్లి కోటేశ్వరమ్మ గారిని మొదటిసారి 1982లో బెజవాడలో ఆమె ఇంట్లో చూశాను. మాకు కరుణ ఇల్లుగా తెలిసిన ఆ ఇల్లు అంతకుముందు ఆమెదే. ఇంకా ముందటితరానికి ఆమె తల్లి అంజమ్మది. నిజం చెప్పాలంటే అది అంజమ్మ తన చేతులు నెత్తుర్లుకారి పుండ్లుకట్టగా రాళ్లు, రప్పలు, ముళ్లు ఏరి మొగల్రాజపురంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కట్టుకున్న ఇల్లు. మూడో తరంలో నాకు పరిచయమై ఆమె కూతుళ్లనాటికి అది కరుణ నిలయమైంది. ఇపుడు కోటేశ్వరమ్మ నూరో యేట ప్రవేశిస్తున్నదంటే అప్పటికే ఆమె అరవై దాటుండాలి. కనుక ఇంక కాకినాడలోనే పనిచేస్తూ ఉండిఉండాలి. అక్కడి నుంచి సెలవులకు వస్తున్న సందర్భంలోనే అనుకుంటాను ఒకటి రెండు సార్లు కలిశాను. ఆమె గంభీర మౌన ఆకారం, వేదనాభరితమైన ప్రశాంత వదనం చూడగానే గౌరవం కలిగింది. చాల మెత్తటి పలకరింపు. చాల ముక్తసరి. ఆచితూచిన మాట. ఎంతో మన్నన, దయతో కూడిన చూపు. అప్పటికే ఆమె ఎంతో జీవితాన్ని చూసింది. అప్పటికింకా పుత్రికాశోకాన్ని తప్ప అన్నీ అనుభవించింది. ఏ ఒక్కటీ అనుభవించవలసిన వయసులో అనుభవించింది కాదు.

భర్త అంటే ఏమిటో తెలియని ఐదో యేట వితంతువు అనిపించుకుని అందువల్ల కూడా ఏ ఫీలింగ్‌ కలగకుండా పది పన్నెండో యేటనే ప్రత్యక్షంగా పామర్రులో గాంధీజీని చూసి తన ఒంటి మీది నగలను ఒలిచి ఇచ్చింది. ఇంటికి వచ్చి ఈ దేశ భక్త్యావేశ చర్యకు తల్లితో చీవాట్లు తిని, తండ్రి మెప్పు పొందింది. స్త్రీగా ఒక వ్యక్తిత్వం వికసించకముందే ఆమె రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది.

భర్త అంటే గురజాడ చెప్పినట్లు ప్రాణ స్నేహితుడని, తనకు కెఎస్‌తో వితంతు వివాహం చేసిన చండ్ర రాజేశ్వర రావు నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ చెప్పినట్లు కామ్రేడ్‌ అని గ్రహించి, చైతన్యపూర్వకంగా భావించి అటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండగానే అటువంటి సాహచర్యం ఆమెను వదిలేసింది. కూతురు కరుణ, అల్లుడు రమేశ్‌ ఢిల్లీలో వైద్య వృత్తి మాత్రమే కాకుండా తెలుగు సమాజాన్నంతా ఒక సాహిత్య, కళా, సాంస్కృతిక ఆరోగ్యకరమైన వాతావరణంలోకి తెస్తూ తలలో నాలుకలాగా ఉంటున్నారని సంతోషపడే సమయానికి అల్లుడు రమేశ్‌ కూడా పోయాడు. నేను ఆమెను చూసేనాటికి ఆ దు:ఖం ఇంక పచ్చిగా ఉన్నది. తన కళ్లముందే ఆ వియోగంతో చిక్కి శల్యమై తిరుగుతున్న కూతురు ఉన్నది. తండ్రిని పోగొట్టుకున్న ఇద్దరు మనవరాళ్లు అనురాధ, సుధ ఉన్నారు. తనకు ఇది అదనపు శోకం.

పురుష సంబంధమైన రెండు దు:ఖాలు ఆమెను జీవితమంతా వెంటాడాయి. కోటేశ్వరమ్మ వ్యక్తిత్వం అంతా ఆ రెండింటిని అధిగమించి ఆమె తనదైన ఒక స్వతంత్ర వ్యక్తిత్వాన్ని రూపొందించుకుని తనకు నచ్చిన జీవితాన్ని గడపడంలో ఉన్నది. ఒక విధంగా ఆమె వాములో కాలిన మట్టి వలె బయటికి ఎంతో గట్టిగా కనిపించే మెత్తని మానవసారమైంది.

మొదటిది కొడుకును పోగొట్టుకున్న దు:ఖం. అయితే అప్పటికే భర్త సాహచర్యం పోయింది. విచిత్రమో, విషాదమో కానీ ఇద్దరూ కమ్యూనిస్టులు. విప్లవకారులు. ప్రపంచానికంతా ఒకరి అమరత్వం, ఒకరి పోరాటం ఎంతో ఆదర్శప్రాయమైనవి. తానూ కమ్యూనిస్టే. కాని కొడుకు అమరుడయి మృతదేహంగానైనా ఇంటికి తిరిగిరాలేదు. పైగా ఎన్‌కౌంటర్‌ వార్త కూడా వినలేదు. పోలీసులు చెప్పిన వార్తనో, పార్టీ చెప్పిన సమాచారమో తప్ప ఒక మనిషి జీవితంలో అత్యంత విలువగా నమోదు చేయవలసిన ముగింపు గురించి ఎక్కడా రికార్డు లేదు. నక్సల్బరీ విప్లవోద్యమ ఆరంభ కాలంలోనే వరంగల్‌ ఇంజినీరింగ్‌ కాలేజిలో చదువుతూ జన్నారం నుంచి శ్రీకాకుళ ఉద్యమం వరకు ప్రయాణం చేసి పార్వతీపురం కుట్ర కేసులో ముద్దాయి అయి అదృశ్యమైన వ్యక్తి. బహుశా 50ఏళ్ల నక్సలైటు ఉద్యమంలో తెలుగు నేల మీద తొలి ‘మిస్సింగ్‌’ కేసులలో ఒకటి. విప్లవ పార్టీకి అది పోలీసులు కిడ్నాప్‌ చేసి చంపేసిన ఎన్‌కౌంటర్‌. రాజ్యం దాన్ని ఉరివేసుకున్న ఆత్మహత్యగా చిత్రించింది. కాకపోతే ‘ఇవి నీ కొడుకు బట్టలేనా?’ అని పోలీసులు తెచ్చి ఇచ్చారు. అవి ‘చందువే’ అని గుండెలకు హత్తుకున్నది. బెజవాడ ఇంట్లో చందు నాటిన కరివేపాకు చెట్టు పెరిగి, పూసి, రెమ్మలు ఆకులయి తెంపినపుడల్లా ఆ చందు స్పర్శను అనుభవిస్తూ ఉంటుంది. అతడు సిఆర్‌, కెఎస్‌ ఇద్దరూ ఇష్టంగా పెట్టుకున్న పేరుగల చంద్రశేఖర్‌ ఆజాద్‌. వరంగల్‌ రీజినల్‌ ఇంజినీరింగ్‌ కాలేజిలో అమరుడు మువ్వ రవీంద్ర నాథ్‌తో కలిసి తొలితరం విప్లవ విద్యార్థి ఉద్యమం నిర్మాణం చేసినవాడు. శివసాగర్‌తో కలిసి సాంస్కృతికోద్యమ నిర్మాణం చేసినవాడు. కృష్ణా జిల్లా ప్రజానాట్య మండలి అనుభవంతో కెఎస్‌ జన్నారం నుంచి తలపెట్టిన తొలి విప్లవ కళా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నవాడు. ‘నిర్జన వారధి’ చదువుతూ ఉంటే అన్నింటికంటే ముఖ్యంగా తనతో ఉన్నంతకాలం మాత్రమే కాదు, ‘అన్నీ వదులుకున్నా కొండపల్లి అనే ఇంటి పేరు వదులుకోవద్ద’ని చెప్పి ఆఖరి శ్వాస దాకా కుటుంబంలో తన పక్షం ఉన్నవాడు. ఆ ఆఖరి శ్వాస స్పర్శను ఆమె అనుభవించలేదు.

అదిగో ఇన్ని విషాదాలు మూర్తీభవించిన కోటేశ్వరమ్మను నేను 1982లో చూశాను. అయితే బహుశా అప్పటికే కాదు, ఆ ఇంట్లోనే కెఎస్‌ ఆఖరి శ్వాస తర్వాత ఆయన పార్థివ శరీరాన్ని చూసేదాకా ఆయన నడయాడిన లేదా రాజకీయ ప్రభావాలు నడయాడిన నేల మీద ఆమె ఇంచుమించు యాభై ఏళ్ల పాటు ఆయనకేమీ కాదు. కాని ఐదో యేటనే పోయి భౌతికంగాను, మానసికంగాను తనకేమీ కాని తన జీవితంలో పూర్తిగా తుడిచివేయబడిన, ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించబడవలసిన అవసరం కూడా లేని మనిషి వంటివాడు కాదు ఆయన. ఇంక తిరగి రాడని తెలిసిన కొడుకు వంటివాడూ కాదు. తన సాహచర్యం తన యుక్త వయసు వచ్చిన తర్వాత చేపట్టినవాడు, అక్కడి నుంచి కలిసి బతుకుతూ కమ్యూనిస్టు చైతన్యంతో మానవులుగా రూపొందుతూ రాజకీయాల్లో, కళల్లో, సాంస్కృతిక రంగాల్లో రాటుదేలుతూ ఒక నూతన ప్రపంచ నిర్మాణంలో పాల్గొంటూ వేరైనవాళ్లు. అది కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు విరమించిన కాలం కూడా.

కోటేశ్వరమ్మ గురించి వినడం మాత్రం కెఎస్‌తో పరిచయం అయిన కొద్ది కాలం నుంచే సహజంగానే జరిగింది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో కెఎస్‌ పొందిన శిక్షణ అంతా చండ్ర రాజేశ్వర రావు నుంచి వచ్చిందని స్వయంగా కెఎస్‌ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. 1940ల ఆరంభంలో మంతెనవారి పాలెంలో నెలరోజులకు పైగా జరిగిన కమ్యూనిస్టు పార్టీ రాజకీయ తరగతుల్లోనే చండ్ర రాజేశ్వర రావే కెఎస్‌, కోటేశ్వరమ్మల పెళ్లి చేశాడు. ఒక దశాబ్దంపాటు, కాస్త మించి 1955 ఎన్నికల వరకు చూసినా అదే ఆమె జీవితం. అంటే సాహచర్యంతో కూడిన జీవితంగా చెప్పాలంటే అదే ఆమె జీవితం. అయితే అది ఎంతో గగుర్పాటు అయిన జీవితం. ఎంతో ఉత్తేజకరమైన జీవితం. ఎంతో ఆదర్శప్రాయమైన జీవితం. నూతన మానవ స్వప్నావిష్కరణ జరుగుతూ విరిగిన జీవితం.

దేశంలోనే, కమ్యూనిస్టు పార్టీలోనే ఒక ప్రయోగంగా కృష్ణా జిల్లా ప్రజానాట్యమండలి సాహసించి రూపొందించిన మహిళా బుర్ర కథల బృందంలో ఆమె ఉన్నది. ఆమె అద్భుతమైన గాయని. ఆ వారసత్వం మనవరాళ్ల దాకా వచ్చింది. ఆమె పాటలు, రచనలు చేసింది. ఈ శిక్షణ అంతా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చినప్పటికీ ఆమె ఒంటరి జీవితానికి ఇవే ఇప్పటిదాక ఆమెకు ఆలంబనలైనవి.

1940లలో కమ్యూనిస్టు పార్టీ నిషేధాల కాలంలో కాని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో కాని ఆమె రహస్య జీవితాన్ని ఎక్కడెక్కడో గడపాల్సి వచ్చింది. మహరాష్ట్రలో, ఛత్తీస్‌ఘడ్‌లో కూడా. అప్పుడు ఎక్కువ కాలం సాహచర్యానికి దూరంగానే, కాని అక్కడ తననెంతో సోదరభావంతో కనిపెట్టుకుని కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తి భార్యగా కూడా నటించవలసి వచ్చింది. 1940లలో కమ్యూనిస్టు పార్టీ అజ్ఞాత రహస్య జీవితంలో తప్పుడుగా వ్యవహరించిన వ్యక్తులు లేరని కాదు. నాయకత్వమూ లేరని కాదు. స్త్రీల పట్ల పితృస్వామ్య భావజాలంతో చూసినవాళ్లు, ప్రవర్తించినవాళ్లు లేరని కాదు. అటువంటి అనుభవాలు ఆమె విన్నవి ఉండొచ్చు. కాని ఆమెకు మాత్రం జీవితమంతా గుర్తుపెట్టుకునే, బహుశా ఇప్పటికీ గొప్ప ఊరటనిచ్చే నాయకత్వం అండ లభించింది. ఎక్కడి రహస్య డెన్‌లో ఉన్నా అంతగా తమ కడుపులో, కళ్లల్లో పెట్టుకుని ఆదరించిన కామ్రేడ్స్‌ లభించారు. తోటి స్త్రీలుగా నాయకత్వ స్థాయిలో ఉన్న రాజమ్మ, సూర్యావతులు, పార్టీ నాయకత్వంలో చండ్ర రాజేశ్వర రావు, సుందరయ్య తాము బతికున్నంత కాలం ఆమెకు ఆశ్వాసం ఇస్తూనే ఉన్నారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉన్నారు. సిఆర్‌ అయితే తర్వాత కూడా ఆయన స్మృతిలో నెలకొల్పిన సిఆర్‌ ఫౌండేషన్‌ రూపంలో ఆమెకు ఆశ్రయాన్నిచ్చాడు. ఆమె ఆయనపై రాసిన ఒక కవితలో ప్రస్తావించింది కూడా.

కమ్యూనిస్టు పార్టీ, ఎర్రజెండా ఆమెకింత మంది మనుషులనిచ్చింది. మనం ఈ వ్యవస్థలోను, ఈనాటి రాజకీయాల్లోను చాల అరుదుగా చూసే విలువలు గల మనుషుల్ని ఇచ్చింది. కఠోరమైన క్రమశిక్షణతో ఎటువంటి కష్టాలనైనా సహించి అధిగమించి ఒక కమ్యూనిస్టుగా జీవించి ఒక మానుషవ్యాపకాన్ని పెట్టుకునే స్ఫూర్తిని, చైతన్యాన్ని ఇచ్చింది. అట్లా ఆమె నిరంతరం అధ్యయనం చేస్తూ తనను తాను సమకాలీన సామాజిక మార్పులతో సంబంధంలో ఉంచుకుంటూ సాహిత్య రచన చేయడానికి నిలబెట్టింది. ఇప్పుడా ఇల్లే కాకపోయినా ఆ కుటుంబం నాలుగో తరం అటువంటి రాజకీయ, సాంస్కృతిక విలువలతో తన కళ్లముందే మసులుకోవడం ఆమె చూస్తున్నది. ఆ విధంగా కొండపల్లి కోటేశ్వరమ్మ జీవితం కోల్పోయినదాన్ని పొందడానికి ఒక స్త్రీ చేసే పోరాటానికి శక్తివంతమైన సందేశం. ఏ పరిస్థితుల్లోను స్వీయ గౌరవం వదులుకోకుండా వ్యక్తిత్వాన్ని నిలుపుకొని ఒక సామాజిక రాజకీయ దృక్పథంతో సార్థకమైన జీవితాన్ని గడపడానికి కూడా ఆమె జీవితం ఒక ఉదాహరణ. బహుశా ఆమె అనుభవించిన కష్టాలు ఆమెకు ఆ పరిణతినిచ్చినవి.

తన జీవిత కథ ‘నిర్జన వారధి’లో ఆమె 1980ల నుంచి కరుణ ఇంట్లో చూసిన రాజకీయ వాతావరణం గురించి రాసింది. నిత్యం విప్లవోద్యమంతో సంబంధం ఉన్నవాళ్లు, విరసం వాళ్లు వస్తూ ఉండేవాళ్లని, రోజుల తరబడి ఉంటూ ఉండేవాళ్లని రాసింది. అట్లాగే వాళ్లెవరూ తనను, తల్లి అంజమ్మను ఎక్కువగా పట్టించుకునేవాళ్లు కాదని అందుకు తాము ఆవేదన చెందేవాళ్లం అని కూడా రాసింది. ఇప్పుడు ఈ అంశాలు చదువుతూ ఉంటే నిజమే కదా అనిపించింది. ఎందుకంటే 1981-85 మధ్యకాలంలో ఆ ఇంటికి తరచుగా వెళ్లి ఎక్కువ కాలం ఉన్నవాళ్లలో నేనున్నాను. వసంత మేఘం పీపుల్స్‌వార్‌గా ఆ ఇంటి మీద కురిసిన రోజులవి. బహుశా అది చైనా విప్లవంలో మావో చెప్పినట్లు తూర్పు-పడమర, దక్షిణ-ఉత్తరాలను ‘ఉప్పెన’ ముంచెత్తిన కాలం కూడానేమో. స్వయంగా కరుణ, ఆమె కూతుళ్లు అనురాధ(చిన్ని), సుధ(చుక్కు) విరసం, జననాట్య మండలి, రాడికల్‌ రాజకీయాలతో, అన్నింటినీ మించి పీపుల్స్‌వార్‌ రాజకీయాలకు ఆ రోజుల్లో పర్యాయపదమైన కెఎస్‌ రాజకీయాలతో ఉన్నరోజులు. ఆ ఉప్పెనలో ఈ రాజకీయాలకు మౌన పరిశీలకులుగా ఉన్నవాళ్లను మేం పట్టించుకోలేదా?

తనకేమైనా కోటేశ్వరమ్మ ఎర్రజెండాను వదలలేదు. అంజమ్మ అయితే చనిపోతూ కమ్యూనిస్టు పార్టీకి తనదగ్గర ఉన్న తృణమో, పణమో ఇచ్చి వెళ్లింది. ఆ కలిసిన కొద్ది రోజులైనా కోటేశ్వరమ్మ నుంచి గానీ, ఎప్పుడూ కలిసే అంజమ్మ నుంచి గాని ఎందుకు నేను ఆ రోజుల అనుభవాలను, ముఖ్యంగా ‘నిర్జన వారధి’లో ఇప్పుడు చదువుకుని ఎంతో అపూర్వంగా నేర్చుకోవాలసిన రహస్య అజ్ఞాత జీవితంలోని క్రమశిక్షణను, విలువలను, కష్ట సహిష్ణుతను ఆ ఇద్దరి ముఖతహా వినడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు. అవకాశం ఉండి పోగొట్టుకున్న నేను, ఆ అవకాశంలేని వాళ్లందరికోసం కోటేశ్వరమ్మ తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన ‘నిర్జన వారధి’ అయినా చదవమని చెప్పడమే ఇప్పుడు చేయగలిగింది. ఆమె ఇప్పటిదాకా మానసికంగా అలర్ట్‌గా ఉండడానికి ఆ కాలమే ఆమెను తీర్చి దిద్దింది.

*

వరవర రావు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కమ్యానిస్ట్ పార్టీ, బెజవాడ – ఈ రెండు పదాలే తెలిసిన పదాలు, మిగిలిన మిగిలిన అన్ని వివరాలూ కొత్తే నాకు.
    ఆత్రంగా చదివేను. నిర్జనవారధి గురించి ఎప్పటినుండో వింటున్నాను, చదివే అవకాశం రాలేదు – దానిని ఏకోణంలో ఎందుకు చదవాలో చాలా నిజాయితీతో చెప్పేరు వరవరరావుగారు. విమర్శని వినయంగా స్వీకరించేరు, సానుభూతి, గౌరవం వాక్యాల్లో వ్యక్తమౌతున్నాయి. కెఎస్ గురించి చేసిన ప్రస్తావనలో – ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్ధమవలేదు. అందరికీ తెలిసిన విషయాలే అని వారి ఉద్దేశమేమో – వావంటి కొత్త పాఠకులూ ఉంటారు కనుక వారి కోసం ఈ కింది వాక్యాలు సవరిస్తే బాగుంటుంది. – కలగాపులగంగా అనిపిస్తున్నాయి.
    “ఆ ఇంట్లోనే కెఎస్‌ ఆఖరి శ్వాస తర్వాత ఆయన పార్థివ శరీరాన్ని చూసేదాకా ఆయన నడయాడిన లేదా రాజకీయ ప్రభావాలు నడయాడిన నేల మీద ఆమె ఇంచుమించు యాభై ఏళ్ల పాటు ఆయనకేమీ కాదు. కాని ఐదో యేటనే పోయి భౌతికంగాను, మానసికంగాను తనకేమీ కాని తన జీవితంలో పూర్తిగా తుడిచివేయబడిన, ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించబడవలసిన అవసరం కూడా లేని మనిషి వంటివాడు కాదు ఆయన. ఇంక తిరగి రాడని తెలిసిన కొడుకు వంటివాడూ కాదు. తన సాహచర్యం తన యుక్త వయసు వచ్చిన తర్వాత చేపట్టినవాడు, “

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు