లంకమల అడవిపల్లె పరిమళం ‘ఓబుల్రెడ్డి ఎద్దులు’

రాజమ్మకి బద్వేలు పెద్దాసుపత్రిలో కవలలు పుట్టారు. ఇద్దరూ మగబిడ్డలే. ఒకరికి దాపట ఓబుల్‌రెడ్డి అనీ, ఇంకొకరికి వలపట ఓబుల్‌రెడ్డి అనీ పేర్లు పెట్టారు. మెడమీద కాడిని మోసే ఎద్దులని దాపటెద్దు, వలపటెద్దు అని అంటారని అందరికీ తెలుసు. మరి మనుషులకి ఇవేం పేర్లు?

ఆ సందేహం తీరాలంటే వివేక్‌ లంకమల రాసిన ‘ఓబుల్రెడ్డి ఎద్దులు’ కథ చదవాల్సిందే!

ఓబులరెడ్డి కన్నబిడ్డలకన్నా ఎక్కువగా చూసుకునే ఎద్దులంటే ఊరందరికీ విచిత్రం. కొంచం కడుపు మంట కూడా. తన పొలంలో తప్ప ఇంకెవరి పనులకూ ఎద్దులను పనిలో దించడు ఓబులరెడ్డి. వాటిమీద అతని ప్రేమను చూసి ఆయన భార్యకీ రగులుతూ ఉంటుంది. అందువల్లే ఇద్దరి నడుమా గొడవలు రేగుతుంటాయి. ఊళ్లోవాళ్లు కూడా ఆ ఎద్దులగురించి ఏదో ఒక మాటజారి, ఆయప్పతో తిట్లు తింటూ ఉంటారు.  చాలా మంది లాగే మునిరెడ్డి కూడా ఒకరోజు ‘బొట్టుదరంగాని వాటెను ఎందుకురా ఆమాయిన బండెద్దుల్ని మేపినట్టు మేపుతాండావు’ అని మందలింపుగా అన్నాడు. ఓబులరెడ్డి  ఊరుకుంటాడా..‘ పెళ్లాలు చేసి పెడ్తే మూడుపూటలా గతికి, మీరేం సెలుగుతాండారంటా? మీ మాద్దిరే అయ్యిగూడా’ అని కడిగేశాడు. అంతటితో ఆగితేనా..‘దోవనబొయ్యే ప్రతి నా కొడుకూ నా ఎద్దులమింద పడి ఏడ్సేవాడే’ అని కూడా భగ్గుమన్నాడు. తనను అంతేసి మాటలన్న ఓబులరెడ్డి పేరునే తన కూతురు రాజమ్మకి పుట్టిన కవల బిడ్డలకి మునిరెడ్డి పెట్టుకున్నాడు. పైగా ఓబులరెడ్డికి ఇష్టమైన ఎద్దులు కూడా గుర్తుకొచ్చేలా వలపట, దాపట అని పేరుకి ముందు తగిలించాడు.

ఎందుకంటే..

మునిరెడ్డి కూతురి ప్రాణాన్నీ, ఆ కూతురు కన్న కవలబిడ్డల ప్రాణాల్నీ ఓబులరెడ్డీ, ఆయన రెండు ఎద్దులూ కాపాడినాయి కాబట్టి.

అదెలాగంటే..

తొలికానుపుకని పుట్టింటికి వచ్చిన రాజమ్మకి నొప్పులు మొదలైనాయి. ఆమె ఆరుపులకు మునిరెడ్డి భార్యకి కాళ్లూ చేతులూ ఆడడం లేదు.  బిడ్డ అడ్డం తిరిగిందని మంత్రసాని పెద్దవ్వ తేల్చి చెప్పింది. ‘బద్దేలు పెద్దాసుపత్రికన్నా తోడుకోని పోదామా?’ అనడిగింది ఆతృతగా. ‘ఈమాత్తరం దానికి బద్దేలిదాంకా ఎందుకమ్మే.. ఎద్దలబండి కట్టి మిట్టన రాళ్లల్లో రోంచేపు తిప్పితే, ఆ అదుర్లకి కడుపులో బిడ్డ క్యార్‌మంటా బయటబడ్డా’ అని సులువు చెప్పింది. యాభై ఏళ్లుగా నాటుకానుపులు చేసిన అనుభవం ఆమెది.  అయితే ఊళ్లో కట్టడానికి బండే దొరకలేదు. ఒకరు బండి బాగాలేదన్నారు. ఇంకొకరు ఎద్దులకు బాగాలేదన్నారు. అందరినీ అడిగి లేదనిపిచ్చుకుని దిగులు ముఖంతో వచ్చిన మునిరెడ్డిని ఓబులరెడ్డి దగ్గరకు వెళ్లమనింది భార్య. ఓబులరెడ్డి ఎద్దుల గురించి కానిమాట అని తిట్లు తిన్న మునిరెడ్డికి ముఖం చెల్లలేదు. అహం మగవాడికేగానీ ఆడదానికి కాదు. ఆమె వెళ్లి అడిగింది. ఆపదొచ్చినపుడు మాటలు నిలవు. ‘నువ్వుబొయి అమ్మిని బెన్నే రెడీ సెయ్యిపో’ అంటూ అతను పరుగున బండి దగ్గరకు వచ్చాడు. ‘కాడిమానుకు పట్టెడలు బిగిచ్చి, తలకాయ ఆనిచ్చి కాడిమానుకు దండం పెట్టుకున్నాడు. రెండు ఎద్దులకు తలకాయ కొద్దిసేపు ఆనిచ్చాడు.’ ఆ ఎద్దులకు అతనేదో చెప్పాడు. ఈ పిచ్చిపనులు చూసే, ఊళ్లోవాళ్లు ఓబులరెడ్డిని ‘ఈన్ది పెద్ద యిపిరి పుచ్చకలే’ అంటారు.

రాజమ్మ, మునిరెడ్డి భార్య, మంత్రసాని పెద్దవ్వ బండి ఎక్కారు. మునిరెడ్డి, ఆయన చిన్నకొడుకు, ఇద్దరు ముగ్గురు వయసు పిలకాయలూ బండి వెనుక నడిచారు. మొగలో కూర్చుని ‘పా..ట్టా..ట్టా’ అంటూ పగ్గాలు కదిలిచ్చాడు ఓబులరెడ్డి. ‘కడుపును మొలికలు తిప్పే నొప్పులకు తోడు పైన కాసే ఎండ’. రాజమ్మ ఏడుపులు, అరుపులకు ఒళ్లంతా పదిరిపోతావుంది మునిరెడ్డి భార్యకి. మంత్రసాని పెద్దవ్వ మాత్రం‘ వాయబ్బ ఇలాంటియి సానా చూసినాలే’ అంటూ వక్కాకు నములుతోంది.  ‘పీతురుమిట్ట, సుద్దబాయి, బద్దెరకుంట, బల్జిబాడవ, వల్తిప్ప మీదుగా కొచ్చెరువు బాట’ పట్టించమని ఆదేశించింది పెద్దవ్వ. గుండీసు రాళ్లు..గజ్జిరాళ్లు..గుండ్రాళ్లు.. ఎక్కి దిగుతూ బండి పరుగులు తీస్తోంది. నొప్పులకు తాళలేక రాజమ్మ అరుస్తోంది. వల్తిప్ప ఎక్కుడెక్కి దిగుట్లోకి వేగంగా జారుతుండగా దాపటెద్దు కుడికాలు రాయిమీద బెసికింది.  కుంటుతోంది. దాని ముందు కాలి లాళం సగం ఊడిపోయింది.‘ అంత బాధలోనూ అట్టనే పరిగెత్తింది బిడ్డ’ అనుకుంటూ బండిని ఆపి ఊడిన లాళం లాగగానే దాని గిట్టల్లోంచి రక్తం బొటబొటా పెరుక్కోని వచ్చింది. ‘నొప్పిని భరించలేక అది కార్చిన కన్నీటి చుక్కలు ఓబుల్రెడ్డి భుజాన్ని తాకాయి’.

‘ఇప్పుడెట్ట మామా?’ అనడిగాడు మునిరెడ్డి దిగులుగా. బండిలో రాజమ్మ మెలికలు తిరుగుతోంది.

‘నా ఎద్దులు తట్టుకుంటాయిలే మామా’ అంటూ ఎగిరి మొగలో కూర్చుని ఎద్దుల్ని అదిలించాడు ఓబులరెడ్డి.

దాపటెద్దు కాలు కుంటతానే వలపటెద్దుకు ఏమాత్రం జోరు తగ్గకుండా బండి లాగుతోంది. బండి పిల్లబాయి కాడికి చేరింది.

‘నన్నిడిపియ్యండే మీయ్యమ్మ కడుపులుగాల.. ఈ నొప్పులు భరించేబొదులు ఆ బాయిలో దూకి సచ్చిపోడం మేలు’ అంటూ అరుస్తూ కాళ్లూ చేతులూ విదిలిస్తోంది రాజమ్మ.

అందరికీ నోట్లో తడి ఆరిపోతోంది.

‘బద్దేలు పెద్దాసుపత్రికన్నా తీసకపోదాం పా’ అన్నాడు మునిరెడ్డి కొడుకు.

‘కానుపుగ్గూడా పెద్దాసుపత్రికేంటికిరా’ అని మళ్లీ అడ్డుకుంది పెద్దవ్వ.

‘నీయ్యమ్మ ముసిల్లంజ ముండా.. ఆడతిప్పి ఈడతిప్పి ఆయమ్మిని నువ్వే సంపిదెంగేట్టుండావు’ అంటూ అగ్గిబరాటా లాగా లేచాడు ఆమె మీదకి.

దాంతో బద్వేలు ఆసుపత్రికి తీసుకుపోవాలని నిర్ణయం అయ్యింది.

అయితే నెత్తురు గాయాల ఎద్దులతో బద్వేలుకు చేరుకోవడం సాధ్యమేనా? రాజమ్మ పరిస్థితి చూస్తే కిందుమీదుగా ఉంది. ఎద్దులకీ అల్తగా ఉంది. నోట్లో నుంచి తెల్లటి నురగ బయటకు కారుతోంది. దారిలో వేపచెట్టుకింద ఆపి నీళ్లు పెడితే, ‘ ఒక్కొక్కటీ నాలుగు బకిడీల నీళ్లు తాగినాయి’.  కాసేపు అలసట తీర్చుకుంటాయని అనుకుంటూ ఉంటే అవి మాత్రం కాడి మాను దగ్గరకు వెళ్లి ‘ఇంగ రా పోదాం బద్దేలికన్నెట్టు’ ఓబులరెడ్డి వైపు చూశాయి.

‘అబ్బా ఏమెద్దుల్రా ఇయ్యి’ అని ముక్కున వేలేసుకున్నారు అక్కడున్నోళ్లంతా.

గుంతమిట్టల్లేదు, ఎగుడు దిగుడుల్లేవు. బద్దేలు వైపు సాగినాయి ఓబులరెడ్డి ఎద్దులు. సగిలేరు దాటినాయి. చెన్నంపల్లె తిప్పను బిగబట్టి ఎక్కినాయి. కాలేజీ మిట్ట ఎక్కే సమయానికి వాటి ఒంట్లో సత్తవ అయిపోయింది. ‘ ఒకసుక్క నీళ్లు తాగింటే బాగుండు గానీ అంత సందు లేకపాయె’.

‘పొద్దటాంచి పరిగెత్తి పరిగెత్తి వచ్చిన వొడి వల్లేనేమో ఒక్కో ఎద్దు నోట్లోనించి పిరికెట్లు పిరికెట్లు నురగ కారి కింద పడ్తోంది. ఆగకుండా బలవంతంగా ఎక్కుతున్నాయి. వాటి ఎగబుస దిగబుసల శబ్దం, బండి వెనుక పరుగు తీస్తున్న మునిరెడ్డికి వినిపిస్తోంది. అదే పరుగున బద్వేలు పెద్దాసుపత్రికి రాజమ్మను చేర్చినాయి ఓబులరెడ్డి ఎద్దులు. ఆమెను కానుపుల గదిలోకి తీసుకుపోయ్యాక తలకాయలలు నేలకు ఆన్చి నాలిక బయటికి పెట్టి ఒగిరిస్తూ చెరో చెట్టు కింద కూలిపోయాయి. వాటి కడుపు ఉబ్బుకుపోయింది. కాళ్లు వదరతావుండాయి.  ‘ఒక చెంబెడు మాయిన వాటి నోటి నుండి కారిన నురగ, జొల్లు నేలమీద పారుతోంది. . బోరింగు దగ్గర నుంచి రెండు బకెట్ల నీళ్లు తెచ్చి వాటిమీద చల్లాడు ఓబులరెడ్డి.  కాస్త తేరుకోగానే నీళ్లు తాగించాడు. ‘రోంత గెడ్డి బేచ్చే పోస పోస పట్టుకుని చిన్నగా నమల్డం మొదలు పెట్టాయి’ ఓబులరెడ్డి ఎద్దులు.

ఇట్లా మట్టిబాటమీద బండి పరుగులాగా సాగుతుంది కథ. ఉగ్గబట్టుకుని చదవాల్సిందే చివరిదాకా. లంకమల అడవి అంచు పల్లెల యాస కథకు పట్టునిచ్చింది. కథను దృశ్యంకట్టి చెప్పినతీరు వెంట నడిపిస్తుంది. పల్లెను అల్లుకుని ఉండే బంధాలను  భద్రంగా కథలోకి బట్వాడా చేశారు వివేక్‌. పాత్ర చిత్రణ మీద ఆయన ఎంత శ్రద్ధ పెట్టారంటే, కథ పూర్తయిన తర్వాత కూడా కథలోని ప్రతి పాత్రా మనతోపాటే ఉన్నట్టే అనిపిస్తుంటుంది. నా మసనును తాకిన తాజా పరిమళం ఈ కథ.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ బాగుంది. కథలో మాండలికం తొనికిసలాడింది. కథనం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అభినందనలు వివేక్.

  • మనిషిని మనిషి అర్థం చేసుకోకపోయినా మూగ జంతువులు అర్థం చేసుకుంటాయని రాసిన గొప్ప కథ

  • Beautiful Sir! మొత్తం పల్లెటూరి పరిమళం. కథ ఎక్కడ చదవొచ్చు??

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు