రెక్కల వాకిలి

అమృత భాండమై వస్తావు నువ్వు..

క్లేశావృతమైన నా హృదయంలోనికి ఒలికిపోవడానికి!

దివాపర్యంతం రెక్కలుడిగిన వాకిలి,

వాకిలికి ఎదురుగా.. నేను.

తడారి, ఎండి, పొక్కులు గట్టిన..

అశ్రు సింహాసనం మీద..

స్వప్నాలు దహనమై రాలిన..

భస్మపు ఉత్తరీయాలను పరచుకుని!

 

క్షితి తలమంతా

క్షత బంధాలే!

అదృశ్య నవనీత లేపనాలే

సత్ బంధాలని చెప్పే భ్రమాబీజాలు!

బ్యాండేజ్ క్లాత్‌లే ఆహార్యాలు!

క్షతం.. ఎప్పటికీ మృతం కాదు.

 

తెగిన పోగులు ముడిపడవచ్చు..

పడిన ముడులు తెగిపోవచ్చు..

ఎన్ని ముడులు పడుతున్నా

ఎన్నిసార్లు తెగుతున్నా

ముడుల్నీ తెగిపోవడాన్నీ

పడుగు పేకల్లా అల్లుకున్నదే జీవితం!

 

బతుకు అనేకానేక గాయాల కుప్ప..

విరళంగా తప్ప స్థిరంగా దక్కేదికాదు విముక్తి!

గాయం కాగల సంభావ్యతకు సమాధి- చావు..

చావుల కడలిలో ప్రతిసారీ పుట్టే గరళం- వియోగం..

వియోగోద్భవమైన దుస్సహ దశ- వేదన!

 

ఆ గరళాన్ని కంఠంలో బిగబట్టిన

నీలకంఠుడు గొప్పోడా?

ఈ గరళాన్ని గుండెల్లో దాచేసిన

కాలహృదయుడు గొప్పోడా?

==

అమృత భాండమై వస్తావు నువ్వు..

క్లేశావృతమైన నా హృదయంలోనికి ఒలికిపోవడానికి!

ప్రేమను వర్షించడానికి!

 

ప్రారంభంలో పలకరింపులు..

మనం కలిసి చేదవేసి తోడుకునే జ్ఞాపకాలు..

వెలిసిపోయిన నవ్వులుగా.. పుట్టి,

ఆ ముసుగులో నెమ్మదిగా జారుకుంటున్న

కాల శకలాలుగా పరివర్తనం చెందుతుంటాయి!

గంట గడుస్తుంది,

సమరస వాతావరణం నెమ్మదిగా

దాడికి, ఆక్రమణకు గురౌతుంది..

విజయ అహంకారంతో నిశ్శబ్దం, మౌనం!

నిన్న మొన్నటి ఏ కలయికలోనూ

అనుభవంలో లేని దుఃఖలీనం!

 

ఒక్కొక్క మాట మధ్యలో విరామం..

స్వరం రుద్ధమౌతుంది!

రెప్పపాటుల మధ్య అలుక్కుపోతున్న చూపులు..

కళ్లు చెలమలౌతాయి!

రాతికత్తిలాగా దిగబడిన చేదుకాలం..

నాటుకున్న దేహాన్నే నివాసం చేసుకుంటుంది!

 

నువ్వు వీడ్కోలు తీసుకుంటావు..

బిగుసుకున్న వాకిలి రెక్కలు గడియ వేసుకుంటాయి..

రాత్రి నెమ్మదిగా శిథిలమైపోతుంది..

వాకిలి రెక్కలు మళ్లీ తెరచుకుంటాయి!

మరొక నువ్వు ప్రవేశిస్తావు!

(దుఃఖం నుంచి తేరుకుంటున్న సాహితీమూర్తిని కలిసి వచ్చిన తరువాత, సారూప్యతలను వెతుక్కుంటూ..)

బొమ్మ : మునిసురేష్ పిళ్లె

మునిసురేష్ పిళ్లె

సురేష్ పిళ్లె స్వతహాగా జర్నలిస్టు. శ్రీకాళహస్తిలో పుట్టి, పెరిగి హైదరాబాదులో స్థిరపడ్డారు. కథలు, కవితలు, రాజకీయ వ్యంగ్య రచనలు, సీరియల్ నవలలు రాశారు. కార్టూన్లు గీస్తారు. వృత్తి ప్రవృత్తి ఒకటే కావడం అదృష్టం. జర్నలిజంలో పీజీ, బీఎల్ చేశారు.
Facebook :: https://www.facebook.com/kamspillai

2 comments

Leave a Reply to Rohini Vanjari Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • జీవిత సత్యాన్ని తాత్వికంగా సత్యవంతంగా సున్నితంగా చెప్పిన అర్థవంతమైన కవిత

  • రాతి కత్తి లాగా దిగబడిన చేదు కాలం.. వీడ్కోలు తర్వాత మరోక ప్రవేశం.. కవిత కన్నీళ్ళు తెప్పించింది అండి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు