రెంటాలవారితో నాది ఆంధ్రప్రభ చుట్టరికం

  కొన్ని ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నమ్ముతారో, నమ్మరో కానీ, నా తొమ్మిదవ ఏట నాకు మొట్టమొదటగా తెలిసిన  పత్రికా రచయిత పేరు రెంటాల గోపాలకృష్ణ. ఆ తర్వాతి పేరు రావూరు సత్యనారాయణరావు. నేను చదివిన తొలి దినపత్రిక అయిన ఆంధ్రప్రభ ద్వారా వీరి పేర్లే నాకు మొదట పరిచయమయ్యాయి.  రావూరివారు ‘ఆషామాషీ’  అనే కాలమ్ రాసేవారు. రెంటాలవారి పేరు అంత చిన్నవయసులోనే నా మనసులో ముద్ర పడడానికి కారణం, ఆయన సినిమా సమీక్షలు. అప్పట్లో విజయవాడలో సినిమా చైతన్యం చాలా ఎక్కువగా ఉండేది. నాకు కూడా సినిమాలపై విపరీతమైన ఆసక్తి,  మోజు ఉండేవి. ఆయన కవిత్వం, నాటకం, నవల సహా అనేక ప్రక్రియల్లో ఎంతో వైవిధ్యవంతమైన రచనలు చేశారనీ, చేస్తున్నారనీ నాకు తెలియని వయసు. అసలు ఆంధ్రప్రభ కాకుండా ఇంకో దినపత్రిక ఉంటుందని కూడా నాకు తెలియదు. పత్రిక అంటే ఆంధ్రప్రభే నా దృష్టిలో. ఆ తర్వాత ఆంధ్రపత్రిక అనేది ఒకటుందని తెలిసినా దానిమీద నాకు చూపు ఆనేది కాదు.

ఆంధ్రప్రభ నాకు పరిచయమవడానికి కారణం, మా నాన్నగారు వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులుగారు ఆంధ్రప్రభకు తరచు రాస్తూ ఉండేవారు. అప్పుడు ప్రభకు సంపాదకులుగా ఉన్న నీలంరాజు వెంకటశేషయ్యగారు, మా నాన్నగారు చాలా దగ్గరి మిత్రులు. నాకు తొమ్మిది పదేళ్ళ వయసునుంచే నాన్నగారితో కలసి ఆంధ్రప్రభ కార్యాలయానికి వెళ్ళేవాడిని. అప్పుడు రెంటాల గోపాలకృష్ణగారితో సహా ఎందరో ప్రముఖులను చూసే ఉంటాను. కానీ వారు ఫలానా అని నాకు తెలియదు. నాకు గుర్తుండిపోయినదల్లా నీలంరాజు వెంకట శేషయ్యగారు, ఆయనకు పీయేగా ఉన్న మానికొండ సుబ్రహ్మణ్యంగారు, నాన్నగారితోపాటు నీలంరాజు వెంకట శేషయ్యగారి ఇంటికి వెళ్లినప్పుడు నేను చూస్తూ వచ్చిన ఆయన కుమారుడైన నీలంరాజు మురళిధర్ గారు.

నాకు అలా తొలిసారి పరిచయమైన ఆంధ్రప్రభలోనే, దాని హైదరాబాద్ ఎడిషన్ లో దాదాపు రెండు దశాబ్దాలపాటు పనిచేయడం తలచుకుంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే, నాకు చిన్నప్పటినుంచీ తెలిసిన మానికొండ సుబ్రహ్మణ్యం గారు నేను పని చేస్తున్న కాలంలో కూడా విజయవాడ ఎడిషన్ లో సంపాదకులకు పీయేగా ఉన్నారు. బహుశా నా చిన్నప్పుడు విజయవాడ ఆంధ్రప్రభ కార్యాలయంలో నేను చూసి ఉండడానికి ఎంతైనా అవకాశమున్న అజంతాగారికి,  రాఘవగారికి ఆంధ్రప్రభ హైదరాబాద్ కార్యాలయంలో నేను సహోద్యోగి నయ్యాను. నేను చిన్నప్పటినుంచీ ఎరిగిన నీలంరాజు మురళీధర్ గారు హైదరాబాద్ లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టర్ గా ఉండడంతో ఒకే కప్పుకింద ఆయనా, నేనూ కలిసి పనిచేసే అవకాశం కలగడమూ ఆశ్చర్యం గొలిపే ఒక యాదృచ్ఛికతే. రెంటాలగారి గురించి మాట్లాడకుండా సొంత కథ చెబుతున్నాడేమిటని ఈపాటికి మీరు అనుకుంటూ ఉండవచ్చు, అక్కడికే వస్తున్నాను. రాఘవ గారి ద్వారానే కాక, విజయవాడలో పనిచేసి, ఎడిటర్ గా హైదరాబాద్ కు వచ్చిన వాసుదేవదీక్షితులుగారి ద్వారా, ఎప్పుడైనా అజంతాగారి ద్వారా విజయవాడలో పనిచేసిన ఆంధ్రప్రభ దిగ్గజాల గురించి వింటుండేవాడిని. వారిలో రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు, జి. కృష్ణ, పండితారాధ్యుల నాగేశ్వరరావు, కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం తదితరుల పేర్లు తప్పనిసరిగా ఉండేవి. ఇంకా వెనక్కి వెడితే నార్ల వేంకటేశ్వరరావు, శ్రీశ్రీల పేర్లు; ఆ తర్వాతి కాలంలో  వేటూరి సుందరరామమూర్తి, గొల్లపూడి మారుతీరావుల పేర్లూ ప్రస్తావనకు వస్తుండేవి. ఇలా ఎంతో మంది పాత్రికేయ, సాహితీ ప్రముఖులతో ముడిపడిన వైభవోపేత చరిత్ర ఆంధ్రప్రభకు ఉంది. అలాంటి ఆంధ్రప్రభలో నేను కూడా పనిచేయడం వల్ల కలిగిన చుట్టరికం ఒక్కటే రెంటాలవారి గురించి మాట్లాడడానికి నాకున్న తొలి అర్హత.

చిన్నప్పుడు విజయవాడలో, ఆ తర్వాత హైదరాబాద్, భీమవరం, కొవ్వూరులలో గంటల తరబడి లైబ్రరీకి అంకితమై ఆవురావురు మంటూ పుస్తకాలను నమిలి తినే రోజుల్లో రెంటాల గోపాలకృష్ణగారి రచనలు తప్పనిసరిగా ఎదురయ్యేవి. అలా వారు అనువదించిన అలెగ్జాండర్ కుప్రిన్ నవల యమకూపం(యమా ది పిట్), రవీంద్రుని నవల గోరా, నికోలాయ్ గొగోల్ నాటకం ఇన్స్ పెక్టర్ జనరల్ వంటి రచనలూ; పురాణఇతిహాసకథలకు, తెలుగు సంస్కృత కావ్యాలకు వారు చేసిన కొన్ని సరళ అనువాదాలూ చదివే అవకాశం కలిగింది. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తిరిగి వాటిలో కొన్నింటినైనా మరోసారి చదివి ఏ కొంచెమైనా సాధికారంగా మాట్లాడే వ్యవధి దొరకనందుకు విచారిస్తున్నాను. రెంటాలవారు దాదాపు రెండువందల పుస్తకాలు రచించినట్టు తాజాగా తెలుసుకుని నేను విస్తుపోయాను. రాసితోపాటు ఎంతో వైవిధ్యాన్నీ ఆయన పోషించారు. ప్రతిక్షణాన్నీ సాహిత్యమే శ్వాసగా జీవిస్తే తప్ప ఒక జీవితకాలంలో ఇన్ని రచనలు చేయగలగడం అసాధ్యం. ఇంకోవైపు పత్రికారచయితగా ఉద్యోగిస్తూనే; అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, గంగినేని వేంకటేశ్వర రావు తదితరుల మైత్రీబంధంతో నవ్యసాహిత్య ఉద్యమంలోనూ భాగస్వామి అయ్యారు. అప్పటికే ఉన్న నవ్యసాహిత్యపరిషత్తు పాతబడడంతో వీరందరూ కలసి నరసారావుపేటలో నవ్యకళా పరిషత్తును స్థాపించారు.

నాటి ఎందరో అభ్యుదయకవులలానే రెంటాలవారి కవితావస్తువును రాజకీయ, సామాజిక ఉద్యమాల వాతావరణమే నిర్దేశించింది. పతితులు, పేదల పక్షం వహిస్తూ, ‘లోకంలో శోకించే/పతితుల ప్రాణాలన్నీ/ నా పాటల వృక్షంపై/పక్షులుగా విశ్రమించు’ నంటారు. ‘అవతరిస్తాను నేను/ ఆకలిప్రాణుల నోట/ అవతరిస్తాను నేను/ అన్యాయం ఉన్నచోట’ అని నొక్కి చెబుతారు. తెలంగాణ సాయుధపోరాట సందర్భంలో- ‘పగలేయి నిజాం కోట/ ఎగరేయి ఎర్రబావుటా/ పగబట్టి త్రాచులా/ పసిగట్టి రేచులా/పడండి విరుచుకుని/విరుచుకుని పడండి’  అంటూ కదనకాహళి మోగిస్తారు.  ‘నవభారతం శుభదాయకం/జననాయకం జయసాధకం/నవభారతం ధ్రువతారకం’ అంటూ స్వాతంత్ర్యాన్ని స్వాగతించిన రెంటాల, ‘ముళ్లు ఉన్న బాట బాగుచేస్తాను/కుళ్లు ఉన్నచోట కడిగివేస్తాను/అబద్ధాన్ని హతమారుస్తాను/నిజాన్ని నిజంగా నిలుపుతాను’ అంటూ గొప్ప ఆశావాదాన్ని చాటతారు. అయితే, అనతికాలంలోనే ఆశావాదం అడుగంటి నిరాశానిస్తేజాలు ఆయన కవిత్వాన్ని కమ్ముకున్న సంగతిని, ‘శివధనువు’ అనే వారి కవితా సంపుటికి రాసిన అభిప్రాయంలో కేవీయార్ (కె. వి. రమణారెడ్డి)ఎత్తిచూపుతారు. స్వాతంత్ర్యం రావడంతో రెంటాల వంటివారిలో మిణుకు మిణుకు మంటూ వచ్చిన ఆశ, మా తరం వచ్చేసరికి పూర్తిగా ఆరిపోయింది. మాది భిన్నమైన వాతావరణం. ‘శివధనువు’ కవితాసంపుటికే ఆరుద్ర ప్రగాఢ పరిచయం రాస్తూ, ‘ఏ చారిత్రకనేపథ్యంలో ఇందులోని కవితలను రచించారో అవి తమను తాము వ్యక్తపరచుకుంటాయి’ అంటారు, అది నిజం.

ఏ రచన మీదనైనా కాలం చేవ్రాలు తప్పనిసరిగా ఉండితీరుతుంది. మాకు ముందు తరంలో, 1930 నుంచి 1970ల వరకు ఉన్న నలభయ్యేళ్ళ కాలంలో రాసిన కవి రచయితల జీవితాలు, వారి రచనలపై ఆ కాలం ముద్రించిన ఆనవాళ్ళు ప్రత్యేకించి నాలో ఆసక్తిని రేపుతూ ఉంటాయి. అప్పటికి రెండు ప్రపంచ యుద్ధాలు గడిచాయి. ప్రపంచాన్ని ఆర్థిక మహామాంద్యం కుదిపివేసింది. అప్పుడప్పుడే ఆ తరం వారి ముందు ఆధునికప్రపంచం బహుముఖాలుగా ఆవిష్కృతమవుతూ వచ్చింది. ప్రపంచసాహిత్యం-అందులోనూ మరీ ఎక్కువగా రష్యన్ సాహిత్యం- తెలుగు నేలను ముంచెత్తాయి. అవి సాహిత్యదృక్పథాన్ని సమూలంగా మార్చివేయసాగాయి. రకరకాల భావజాలాల పరిచయం ఆలోచనా మథనానికీ, అంతర్మథనానికీ దారితీయిస్తోంది. మొత్తం మీద ఎటుచూసినా ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణం. ఆపైన రెండు ప్రపంచయుద్ధాలు తెచ్చిపెట్టిన భౌతిక, మానసికకల్లోలాలు ఉన్నాయి. దేశీయంగా అశాంతికి, అస్థిమితానికి లోను చేసే ఆకలి, అనారోగ్యం, ఆవిద్య, సామాజికమైన హెచ్చు తగ్గులు, అణచివేత లాంటి సమస్యలు ఉండనే ఉన్నాయి. ఈవిధంగా 1930-70 మధ్యకాలానికి చెందిన కవి, రచయితలు ఎదుర్కొన్న సందిగ్ధాలు, సంఘర్షణల తీవ్రత ఎక్కువ. ఒకవైపు ఆర్థిక సమస్యలు, అశాంతి, అరాచకాల మధ్య తమ జీవితాలను కర్పూరంలా మండిస్తూనే కసిపట్టినట్టు వారు రచనలు చేశారనిపిస్తుంది. రెంటాలగారిలో కాదు కానీ, ఆ తరం కవులు చాలామందిలో ఒకవిధమైన అరాచకం కనబడుతుంది.

ఆ తరంవారిలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే, వారికి అటు సాంప్రదాయిక సాహిత్యం తాలూకు వారసత్వం ఉంది; ఇటు ఆధునిక, ప్రగతిశీల ధోరణులను అందిపుచ్చుకోవడమూ ఉంది. ఈవిధంగా వారు సాంప్రదాయికవర్గాలతో కూడా ఘర్షణ పడవలసివచ్చింది. మా తరం దగ్గరికి, మా తర్వాతి తరం దగ్గరికి వచ్చేసరికి ఎవరికి వారు స్పష్టమైన శిబిరాలుగా చీలిపోవడం వల్ల ఈ సాంప్రదాయిక సాహిత్యప్రభావాలతోపాటు సాంప్రదాయిక వర్గాలతో ఘర్షణ కూడా పలచబడింది. కాకపోతే ఇప్పుడు మారిన, మారుతున్న రాజకీయవాతావరణంలో సాంప్రదాయికశక్తులతో తిరిగి వెనుకటి ఘర్షణ ముమ్మరం కావడం చూస్తున్నాం. రెంటాల గోపాలకృష్ణగారు 1930-70ల మధ్య కాలంలో సంపూర్ణంగా  ఇమిడిపోగల సాహిత్యసృజనకారుడు. అచ్చంగా ఆ నాలుగు దశాబ్దాల కాలం సృష్టించిన కవీ, రచయితా.

సాంప్రదాయిక సాహిత్యప్రభావాలు శ్రీశ్రీ తదితరులలో కనిపించినట్టే రెంటాలవారిలోనే కనిపిస్తాయి. శ్రీశ్రీలోలానే పురాణప్రతీకలు, పౌరాణికపదబంధాలూ  ఆయన రచనల్లోనూ విరివిగా చోటుచేసుకున్నాయి. ‘నేటి దౌర్జన్యాలపై/భీషణపర్జన్యమై గర్జిస్తాను/నేటి కౌరవమూకను పార్థుని గాండీవమై ఖండిస్తాను’ అంటారు ఒక కవితలో.  సర్పయాగం, శివధనువు వంటి వారి కవితాసంపుటాల పేర్లు కూడా పురాణప్రతీకలే. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, భాగవతాది పురాణాలు ఆధారంగా ఆయన సృష్టించిన రచనలూ సంఖ్యలో తక్కువ కాదు. అలాగే, రఘువంశం, మేఘసందేశం, కాదంబరి, దశకుమారచరిత్ర, మాలతీమాధవం, మనుచరిత్ర, కళాపూర్ణోదయం, పల్నాటి వీరచరిత్ర వంటి సంస్కృతాంధ్ర కావ్యాల సరళానువాదాలు కూడా. ఆ తరం కవుల్లో అనివార్యంగా కనిపించే వైవిధ్యం ఇది.

రచనలకూ, స్థలకాలాలకూ ఉన్న గరిష్ఠ సంబంధాన్ని స్పృహలో ఉంచుకుంటూ 1930-70 మధ్యకాలం నాటి తెలుగు సాహిత్య చరిత్రను నిర్మించినప్పుడే రెంటాలవంటి వారి సాహిత్యమూర్తిమత్వం ఒక స్పష్టతను, సమగ్రతను తెచ్చుకుంటుంది. ఆ ప్రయత్నాన్ని ఎవరైనా ఇప్పటికే తలకెత్తుకున్నారో లేదో! ఇకనైనా అటు దృష్టి సారించడం అవసరం.

శతజయంతిని పురస్కరించుకుని ఆ శతాధిక గ్రంథ రచయితకు నా భక్తిపూర్వక నివాళి.

*

భాస్కరం కల్లూరి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రెండు వందల పుస్తకాలు రచించారంటే రెంటాల గారి మేధస్సు, పట్టుదల, devotion అద్భుతం. రెండు వందల పుస్తకాలు వ్రాసారంటే ఎన్ని వేల పుస్తకాలు చదివారో! రెంటాల గారికి నివాళి గా ఈ వ్యాసం రాసినందుకు భాస్కరం గారికీ క్రుతజ్ఞతలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు