రుద్రవీణ పలికిన సామ్యవాద రాగం

సినిమా పాటల్ని చిన్నచూపు చూడనక్కర్లేదు. సినిమా పాటల్లో కూడా ఎప్పటికప్పుడు కవిత్వాన్ని చిలకరించవచ్చు.

త్రేయ వంటి కవిని ఆస్థానకవిగా పొంది వరుసగా తన సినిమాలకి పాటలు రాయించుకున్న ఒక గొప్ప దర్శకుడు ఆదర్శవంతమైన ఓ కథని సినిమాగా తీస్తున్నప్పుడు, అందునా ఆ సినిమాలో పాటలతోనే కథనంతా నడిపించాలన్నప్పుడు గేయరచయితని ఎంచుకునే విషయంలో ఆషామాషీగా నిర్ణయం తీసుకొడు కదా? అప్పటికి సినిమా పరిశ్రమలో గేయరచయితగా ఒకటి రెండు సంవత్సరాలే అనుభవం ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నాడంటే ఆ గేయరచయిత ఎంత ప్రతిభావంతుడైయుండాలి?

కథా సన్నివేశాల్లో పస, దర్శకుడిలో సత్తా ఉంటే ఎలాంటి గేయరచయిత చేతయినా మంచి సాహిత్యం రాయించుకోవచ్చు అని అనుకోవచ్చుగాక! కుండలో అమృతముంటేనేగా అబక తోడుకోగలదు? అబక పొడవుగా ఉంటే సరిపోదు. కుండలోకూడా అమృతముండాలి. అవును, కవితామృతాన్ని పుష్కలంగా నింపుకున్న నిండుకుండ ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి. ఆ దర్శకుడు బాలచందర్. తీస్తున్న సినిమా రుద్రవీణ.

ఈ సినిమా కథకి పాటలూ, పాటల్లో సాహిత్యమూ కీలకం. కథంతా సాంప్రదాయ భావాలుగల గొప్ప శాస్త్రీయ సంగీత గాయకుడైన తండ్రికీ, మానవత్వమూ, సామ్యవాద భావాలూ గల కొడుక్కీ జరిగే సంఘర్షణల చుట్టూనే తిరుగుతుంది.

జీవిత పరమార్థం సాధించాలంటే…

సినిమా టైటిల్స్ మొదలవుతుండగానే ఒక చిన్న పిల్లవాడు కోనేటి పవిత్ర గంగలో కాళ్ళు తడుపుకుని గుడిలోపలకి వెళ్తుంటాడు. గుడి మెట్లమీద వృద్ధురాలైన ఒక గుడ్డి బిచ్చగత్తె “ధర్మం చెయ్యండి బాబూ” అంటుంది, అటుగా వెళ్ళే ఓ పూజారి ఓ అరటి పండామె ఆమె ముందుపెట్టి వెళ్ళిపోతాడు. ఆమె ఆ అరటిపండుకై తడుముకుంటుంటే అది కింది మెట్టుమీద పడిపోతుంది. ఇది ఆ పిల్లవాడు చూస్తూనే ఆమెకు ఆ పండు అందించి సాయపడకుండ మంత్రాలు జపించుకుంటూ వెళ్ళిపోతాడు. మరోపక్కనుండి ఇదంతా గమనిస్తున్న ఓ బికారి లేచి వెళ్ళి ఆ పండు తీసి ఆమె చేతబెడతాడు. అక్కడితో ఆగక ఆ పిల్లవాడిని నిలవేసి

“ఆగు బాబూ, నీ పేరేంటి?

పిల్లవాడు మనసులో మంత్రాలు జపిస్తూ నిల్చుంటాడు.

“మంత్రాలు జపిస్తున్నావా?”

అవును అన్నట్టు తలూపుతాడు.

“ఆ గుడ్డిదాని అవస్థ చూశావుకదా?”

జపించడం ఆపకుండ అవును అని తలూపుతాడు.

“తోటి మనిషికి సహాయం చెయ్యకూడదని మంత్రాలు చెప్తున్నాయా?”

కాదని తలూపుతాడు.

“జీవాత్మే పరమాత్మ అని దేవుడే చెప్పాడు కదయ్యా? కుర్రవాడివికదా? నీకు తెలీదు. కానీ విను. దేవుడు నీకిచ్చిన రెండు చేతుల్లో ఒకటి నీకోసం, రెండోది పక్కవాడి చేయూతకోసం”

అన్ని రకాల సిరిసంపదలతో, సాంప్రాదాయ కుటుంబాల్లో పుట్టినా, సమాజంలో ఉండే కుల, మత, ఆర్ధిక పరమైన అసమానత్వాలను చూసి మనసు నీరై అభ్యుదయ భావాలతో ప్రజానాయకులైన చాలా మందికి ఇలాంటి ఒక చిన్న సంఘటనతోనే జ్ఞానోదయం కలుగుతుంది. అక్కడే జీవితం మలుపు తిరుగుతుంది. గాంధీకైనా, బుద్ధుడికైనా, ఈ.వీ. రామస్వామికైనా. ప్రజానాయకులందరూ గాంధీ స్థాయికే ఎదగనక్కర్లేదు. తను చుట్టూ ఉన్న ఓ వందమంది జీవితాలనో, ఒక ఊరినో మార్చగలిగినా గొప్పే.

పిల్లవాడు ఆ ఆలోచనతో గుడిలోపలకి వెళ్ళిపోతాడు. బయటున్న బికారి ఇందాక చెప్పిన మాటలను విస్తరిస్తూ (అంటే చూసే ప్రేక్షకులకి అర్థం అయ్యేలా) పాటగా పాడుతాడు. ఒకే ఒక్క మాటకే జ్ఞానోదయం వచ్చేస్తుందా అంటే, అవును వచ్చేస్తుంది. సరైన మోతాదులో నేతిలో తడిసిన వత్తికి ఊరికే మంట చూపిస్తే చాలు దీపమై వెలగడానికి. ఆ రెండు మాటలు పిల్లవాడి మనసులో పరివర్తనకు సోపానాలయ్యాయి. ఆ గాఢమైన మాటల్లోని భావం సామాన్య ప్రజలు మనసులనూ తాకాలి, నమ్మశక్యంగా ఉండాలి. అదే పాటకి వస్తువు. ఇంత అద్భుతైమన సన్నివేశానికి రాయబడిన ఈ పాటలో పల్లవి, చరణాల్లోని ప్రతి పదంలోనూ కవిత్వం పొంగి పొరలుతుంది అంటే అతిశయోక్తి కాదు.

పల్లవి

చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా

చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా

కళ్ళముందు కటిక నిజం

కానలేని గుడ్డి జపం

సాధించదు ఏ పరమార్థం

బ్రతుకుని కానీయకు వ్యర్థం

ఆధ్యాత్మికమైన జ్ఞానం ఎందుకు పొందాలనుకుంటాము? జీవిత సత్యమెరిగి, కర్మ బంధాలనుండి విముక్తి చెంది భగవంతుడితో ఐక్యమైపోవాలన్న తపనతోనే. ప్రతి జీవాత్మా పరమాత్మేనని గ్రహించకుండ, మడి, పూజలు, పునస్కారాలూ, వేదపారాయణాలూ, మంత్ర జపాలతోనే పరమార్థం దొరకదు. నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడు, ఆ జీవులకి నువ్వు చెయ్యగలిన ఏ సేవ చేసినాకూడా అదీ మంత్రజపమే, వేదపారాయణమే అని ప్రతీకాత్మకంగా చెప్తున్నాడు కవి. అంటే ఆ పిల్లవాడికి పరమార్థం పొందాలన్న ధ్యేయం ఉంది. అయితే అది ఆ మంత్ర జపాలూ, పూజలూ, ఆచారాల్లోనే ఉందని అనుకుంటున్నాడు – అంటే అది ఎక్కడో అందుకోలేని చోటుంది. వాటివల్ల పరమార్థం లభించదని చెప్పడం కాదు, ముందు కిందున్న మెట్లు ఒక్కోటీ ఎక్కితేగానీ పైకి ఎక్కడం అసాధ్యం అని చెప్పి దృక్పథం మరల్చిచూడమని చెప్పడం.

కళ్ళ ముందు కటిక నిజం కనబడుతోంది, అది చూసినా కనిపించలేదన్నట్టు దాటుకుని వెళ్ళిపోతున్నావు అజ్ఞానం వల్ల. అలా చెయ్యడంతో నువ్వు అనుకుంటున్న పరమార్థాన్ని సాధించలేవు, నీ బ్రతుకు వృథా అయిపోతుంది అని హెచ్చరిస్తున్నాడు.

మొదటి చరణంలో –

కోనేట్లో మునకేసి, తడి ఆరకుండానే నియమ నిష్టలతో గుడి మెట్లెక్కి దేవుణ్ణి దర్శించుకుంటే చాలు అన్న ధ్యేయంతో వెళ్తున్నావు. బానే ఉంది. అయితే ఈ ప్రక్రియలో మానవ సహజమైన నీ గుణాలు కోల్పోతున్నావు. అంటే మనిషిగా మిగలకుండ రాయిలా, ఒక యంత్రంలా మారిపోయావు అన్నది ఎత్తి చూపుతున్నాడు.

స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు

సాటి మనిషి వేదన చూస్తూ జాలిలేని శిలవైనావు

కరుణను మరిపించేదా చదువూ సంస్కారం అంటే

గుండె బండగా మార్చేదా సాంప్రదాయమంటే

హేతుబద్ధమైన ఆలోచనా, మానవ విలువలను గౌరవించని చర్యా ఆస్తికవాదం కాదు అని నొక్కి మరీ చెప్పాడు కవి. చదువుకున్నవారు, సంస్కారవంతులం అనిపించుకోవడం అంటే కరుణని మరిచిపోవడం కాదు. జాలి అన్నది లేకుంటే నువ్వు రాతితో సమానమే. కరుణ అన్న గుణం గుండెలో లేకపోతే అది బండరాయే.

రెండో చరణంలో ఇంకాస్త వివరిస్తున్నాడు. ఒక వ్యక్తికి పండితుడని గుర్తింపు ఎలా వస్తుంది? చుట్టు ఉన్నవాళ్ళకు పాండిత్యం లేకపోవటంవల్లే. ధనవంతుడన్న గుర్తింపు ఎప్పుడొస్తుంది? మిగిలినవాళ్ళు పేదలైయుండటంవల్లే.

ప్రఖ్యాత సంగీత విద్వాంసుడన్న గుర్తింపు రావాలంటే అతడి ప్రతిభను గుర్తించేవాళ్ళు ఉండబట్టే. ఒక మనిషికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందంటే మిగిలిన వాళ్ళకి ఆ ప్రత్యేకతలేకపోవడంవల్లనో, మిగిలినవాళ్ళు అతని ప్రత్యేకతని అభినందించి ఆదరించడంవల్లే! అంటే ఏ మనిషికైనా గుర్తింపునీ, హోదానీ ఇచ్చేది సమాజమే. అంటే నువ్వు అన్న ఉనికి సమాజానిది. ఏ మనిషీ సమాజాన్ని వద్దు అని అతీతంగా  self-contained గా బతకలేడు. తినే అన్నం, కట్టుకునే గుడ్డ, నివసిస్తున్న ఇల్లూ అన్నీ సంఘంలో ఉన్న పలువురి కృషివల్లే వస్తుంది. అవసరం ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఆ సంఘానికి నీ వంతుగా నువ్వు తిరిగివ్వాల్సినంత ఇచ్చి తీరాలిగానీ తప్పించుకుని పోకూడదని నొక్కి చెప్తున్నాడు.

నువ్ను తినే ప్రతియొక మెతుకూ ఈ సంఘం పండించిందే

గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది

ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా

తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే

ఒక్కోసారి సాయపడటం, సేవ చెయ్యడం అంటే అదేదో పనిగట్టుకుని చేసే ఒక చర్యే కానక్కర్లేదు, కొన్ని రకాల చర్యలు చెయ్యకుండా ఉండటం కూడా సేవే అన్న భావంకూడా దాగుందనిపిస్తుంది ఆ ముగింపు పదాల్లో!

“ఎక్కొచ్చిన నిచ్చనని కాలదన్నం”, “ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య” వంటి సామెతల సారాంశమూ ఇదే.

ప్రజాధనంకాని కళా విలాసం, ఏ ప్రయోజనంలేని వృధా వికాసం

1960-లలో తమిళ కవితా సాహిత్యంలోకంలో “వానంబాడి ఇయక్కం” అన్న కవుల ఉద్యమం నడిచేది. తమిళ భాషని, కవిత్వాన్ని పాతమూస నుండి మారుతున్న కాలానికి తగ్గట్టుగా సమకాలీన ప్రపంచ సాహిత్యంతో అడుగేసేలా చెయ్యడమే ఆ వానంబాడి సంఘం ఉద్దేశం. ఆ సంఘంలోని కవులు కొందరు సినిమాల్లోకీ వచ్చారు. 1980-లలో తమిళ సినిమా కవి కణ్ణదాసన్ పోయాక ఒక పెద్ద ఖాళీనే ఏర్పడింది. అప్పటి ప్రసిద్ధ వానంబాడి కవులు కొందర్ని సినిమా రంగంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరిగాయి.

అబ్దుల్ రహ్మాన్ అనే ఒక ప్రసిద్ధకవిని అడిగారట, “మీలాంటి గొప్పకవులు సినిమాలకు రాయాలి. చూడండి మీతోబాటే వానంబాడిలో ఉండిన కవులు ఇటు కవితలు రాస్తూనే అటు సినిమాల్లోనూ రాస్తున్నారు, మీరూ రాయండి” అని. దానికి ఆయన “రోళ్ళు, పత్రాలు మలిచివ్వడానికి శిల్పులెందుకు?” అని సినిమాపాటల్ను చిన్నచూపు చూస్తూ జవాబిచ్చారట. పాత్రికేయులు సినిమాలో రాసే కవిని “మీ సాటి కవి ఇలా అన్నారుగా? దానికి మీరేం అంటారు?” అనడిగితే, “సమాజంలో శిల్పాలకంటే రోళ్ళ అవసరమే ఎక్కువున్నప్పుడు నేను శిల్పాలుమాత్రమే చెక్కుతాననకూడదు. రోళ్ళు, పత్రాలు చెక్కడంలో కూడా ఎంతో నైపుణ్యం చూపించవచ్చు” అని చమత్కరించారు. దీని ద్వారా  చెప్పొచ్చేదేంటంటే, ఏ కళైనా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి అన్నదే. సినిమా పాటల్ని చిన్నచూపు చూడనక్కర్లేదు. సినిమా పాటల్లో కూడా ఎప్పటికప్పుడు కవిత్వాన్ని చిలకరించవచ్చు.

ఈ సినిమాలో ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత గాయకులైన గణపతి శాస్త్రిగారబ్బాయి సూర్యం ఒక రోజలా సైకిల్ మీద వెళ్తుంటే అక్కడ అడవిలో చెట్లుకొట్టుకుంటున్న కష్ట జీవుల్ని చూసి ఓ ముసలాయనకి సాయం చేసే ధోరణిలో గొడ్డలి తీసుకుంటాడు. తాళమేసే చేత్తో గొడ్డలట్టుకుంటారేంటి బాబూ, మీ నాన్నగారి కచేరీ వినే అదృష్టం మాకెలానూ లేదు అని అతణ్ణి ఓ పాట పాడమని ఆగుతారు వాళ్ళు. శాస్త్రీయమైన ఆలాపనేదో మొదలుపెట్టగానే వాళ్ళకి అర్థం కాలేదన్నట్టు బిక్కమొహం పెట్టి ఏదైనా ఓ మంచి పాట పాడండయ్యా అంటారు. తన శ్రోతలెవరని గుర్తించిన సూర్యం లలితమైన ఓ గీతమందుకుంటాడు.

మీరు కచేరీకి రాలేకపోతేనేం? కచేరీనే మీదగ్గరకొస్తుందన్న భావంలో పల్లవి ఇలా సాగుతుంది.

తరలి రాదా తనే వసంతం

తన దరికిరాని వనాలకోసం

గగనాలదాక అల సాగకుంటే

మేఘాల రాగం ఇల చేరుకోదా

వసంతాన్ని వెతుక్కుంటూ వనాలెక్కడికీ వెళ్ళనక్కర్లేదు, వసంతమే వనాలను వెతుక్కుంటూ వస్తుంది అన్న భావాన్ని ఆరుపదాల్లో ఇచ్చిన ట్యూన్‌లో అందంగా చెప్పడమేగా గొప్ప కవిత్వం అంటే!

అనుపల్లవి దానికి కొనసాగింపుగా, సముద్రంలో అలలు నిర్విరామంగా ఎగసిపడటం మేఘాలను అందుకోడానికి అన్న ఊహని ప్రపంచ భాషల్లో ఏ కవీ అందుకొని ఉండడు. ఎగసే ఆ అలలు మేఘాలను చేరకపోతేనేం? వాటి ప్రయత్నాలకు మెచ్చుకుని గుండెలు కరిగిన మేఘాలు వర్షంలా వచ్చి పడుతున్నాయనడంలో ఎంత కవిత్వం లేదూ?

మొదటి చరణంలో నిస్వార్థం గురించి ప్రబోధిస్తున్నాడు.

వెన్నెల దీపం కొందరిదా?

అడవిని సైతం వెలుగుకదా?

ఎల్లలులేని చల్లనిగాలి

అందరికోసం అందును కాదా?

ప్రతీమదిని లేపే ప్రభాతరాగం

పదేపదే చూపే ప్రధానమార్గం!

ఏదీ సొంతం కోసం కాదను సందేశం

పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం!

ఇది తెలియని మనుగడ కథ

దిశనెరుగని గమనము కద

ప్రకృతిలో ఏది పక్షపాతంగా, స్వార్థంగా వ్యవహరించట్లేదు. అంతా నిస్వార్థమే. ఆకాశాన కాచే జాబిలి పేదవాడికొకలా, మహరాజుకి మరోరకంగా వెన్నెల కురిపించదు. అడవిలో అయినా అదే వెన్నెలో సముద్రానైనా అదే వెన్నెలే. అలానే చల్లగాలైనా? దానికి పక్షపాతముండదు. ప్రభాతరాగం పాడే దినరాజైనా అంతే. ప్రకృతిలో ఏ ఒక్కటీ తమలోని ప్రత్యేకతని తమకే సొంతం అని దాచుకోవడంలేదు. అవి మనకి చెప్పేది నిస్స్వార్థం అన్న ఆ ఒక్క సందేశమే. ఒక్కవేళ అవి స్వార్థంగా ఉంటే ప్రపంచంలో ప్రగతంటూ ఏముండదు; శూన్యం తప్ప. మనుషులమైన మనం ఇది గుర్తించకుండ స్వార్థంగా వ్యవహరించామో మన జీవితం దిశనెరుగని గమనమే అవుతుంది.

తాళంవేసే చెయ్యి గొడ్డలిపట్టుకుంటే తప్పేంటి? గొడ్డలి పోటులో, గుండె లయలో కూడా తాళం ఉందని సమాధానం చెప్తూ సాగుతుంది రెండో చరణం.

బ్రతుకున లేని శ్రుతికలదా

ఎదసడిలోనే లయలేదా

ఏ కళకైనా ఏ కలకైనా

జీవిత రంగం వేదిక కాదా

ప్రజాధనంకాని కళావిలాసం

ఏ ప్రయోజనంలేని వృధా వికాసం

కూసేకోయిల పోతే కాలం ఆగిందా?

పారే ఏరే పాడే మరోపదం రాదా?

మురళికిగల స్వరములకళ

పెదవిని విడి పలకదుకదా

ఏ ఆకాశంలోనో పుట్టి కళాకారులకు మాత్రమే అందేవి కావు కళలంటే. కళలు జీవితంలోనుండే పుడతాయి. ఆ కళలు మళ్ళీ ప్రజల జీవితాలను వైవిధ్యభరితం చెయ్యడానికి ఉపయోగపడాలి, అలా ఉపయోగపడకుంటే ఆ కళలు వృధాయే. ఈ భావం చాలా చమత్కారమైన పదజాలంతోనూ, క్లుప్తంగానూ ఉంటుంది పాటలో.

నేను కూయనుగాక కూయను అని కోయిల అన్నంత మాత్రాన వసంత ఋతువు రాకుండా కాలం అక్కడే ఆగిపోదు, ప్రకృతికి పాట లేకుండానూ పోదు. సాగే ఏరు తన నీటి పాటని వినిపిస్తుంది. అలానే ఏ కళాకారుడైనా మూర్ఖంగా నేను నా కళను ఎవరికీ పంచనని పంతం పడితే సమాజానికేం నష్టం ఉండదు, నువ్వు కాకుంటే మరొకడు వస్తాడు అన్న ప్రకృతి సహజ గుణంతో పోల్చారు సీతారామ శాస్త్రి. పిల్లనగ్రోవి వల్లే ఇంత శ్రావ్యమైన పాట వినిపిస్తుంది, నేనే గొప్ప అని గర్వంతో ఊదే పెదవులకి దూరమైతే పాటెలా వస్తుంది? కళాకారుడన్నవాడు సంఘాన్ని అంటిపెట్టుకుని సహగమనం చెయ్యాలి మరి.

కష్టం వస్తేనే కద గుండె బలం తెలిసేది?

దైవ సమానమైన సంగీత సేవ తప్ప మరేదీ ప్రధానమైనది లేదు అనుకునే తండ్రీ, సాటి మనిషి ఆర్తనాదాల మధ్యన సంగీత సాధన నేను చెయ్యగలేను అనే కొడుక్కీ సంఘర్షణలు నిర్విరామంగా సాగుతుంటే ఒక దశలో కొడుకుని ఇంటినుండి వళ్ళగొట్టేస్తాడు.

తన సిద్ధాంతాల గురించీ, తనేంటో అర్థం చేసుకో తండ్రివల్ల కలిగిన బాధ గురించీ పంచుకునే సన్నివేశానికి రాయబడిన పాట. ఈ పాట మొత్తం ఒక అర్ద్రత నిండిన కవిత్వంలా సాగుతుంది; దానికి తోడు పాట చివర్లో శ్రీశ్రీ రాసిన “ప్రభంజనం” కవితనుండి “నేను సైతం” అన్న కొన్ని ప్రసిద్ధ లైన్‌లు కలపడం సమంజసంగా అనిపిస్తుంది.

మన కష్టాలను ఆత్మీయులతో పంచుకుంటే సగం భారం తగ్గుతుందంటారు. మనం అలా చెప్తున్నప్పుడు వాటి గురించి కొంచం లోతుగా ఆలోచిస్తాము. ఓస్! ఇంతేనా అనిపించేస్తుంది. ఎదుటి మనిషి లేదా ఆప్తుడు కష్టాలను ఎమోషల్‌గా తీసుకోకుండా, పరిష్కారంకోసం విశ్లేషణాత్మకంగా ఆలోచించి సలహాలూ ఓదార్పులూ ఇవ్వగలరు. పాట సాకీ ఆప్తుడు ఓదార్చే మాటలతో మొదలవుతుంది.

సాకీ:

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం

మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం

కష్టం వస్తేనే కద గుండె బలం తెలిసేది

దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది

మంచైనా చెడ్డైనా పంచుకోను నే లేనా

ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా

ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని

అంతటి ఏకాంతమైన చింతలేమిటండీ

దిగులు లేని మనిషుండడు. ఒంటరిగా నీలో నువ్వే నీ బాధల్ని మోస్తూ తిరిగితే భారమెలా తగ్గుతుంది. పంచేసుకొని బరువు దింపుకో అనేసి ఊరుకోవట్లేదు. కష్టాలు మంచివంటున్నాడు. అలా చెప్పడంలోనే బోలెడంత కవిత్వం దాగుంది. “మౌనం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. తాడే పేడో తేల్చుకోవాలని ఆ కష్టాలని సవాలు చెయ్యాలి. అసలు కష్టాలొచ్చినప్పుడే మన బలమేంటో మనకి తెలిసేది. మన తెలివితేటలు అర్థం అయ్యేది అని ఆత్మీయుడు ఓదార్చగానే హీరో తన బాధలేంటో చెప్పడానికి పల్లవినందుకుంటాడు.

పల్లవి :

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

గుండెల్లో సుడి తిరిగే కలత కథలు

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

చరణం 1 :

కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని

ఐనవాళ్లు వెలివేస్తే ఐనా నేనేకాకిని

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

పాట బాట మారాలని చెప్పడమే నా నేరం

గూడు విడిచిపొమ్మన్నది నన్ను కన్న మమకారం

వసంతాల అందం విరబూసే ఆనందం

తేటితేనె పాట పంచవన్నెల విరితోట

బతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట

మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ల బాటా

 

చరణం 2 :

ఏటి పొడవునా వసంతమొకటేనా కాలం

ఏదీ మరి మిగతా కాలాలకు తాళం

నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు

కంటినీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు

మంచువంచనకు మోడై గోడుపెట్టువాడొకడు

వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదే రాగం

అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం

అని అడిగిన నా ప్రశ్నకు అలిగె మత్తకోకిల

కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా నూతిలోని కప్పలా

బతకమన్న శాసనం కాదన్నందుకు అక్కడ

కరువాయెను నా స్థానం

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది

 

చరణం 3

అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగ ధ్వానం

నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం

ఎడారి బతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు

దిక్కూ మొక్కూ తెలియని దీనుల వ్యధార్థ జీవన స్వరాలు

నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి

ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచెయ్యాలి

జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ

కలలో జీవించను నేను కలవరింత కోరను నేను

కోకిల కుటుంబంలో పుట్టి కాకి అరుపులు అరుస్తున్నావు అని ఇంటినుండి వెలివేశారు. నిజానికి నేను కాకిని కాను. ప్రకృతిలో వసంతఋతువులో విరబూసిన సౌందర్యమే కాదు; తీగెలూ, కొమ్మలూ ఆకులు రాల్చుకున్న బోసితనంకూడా ఒక ఋతువే. తేనెటీగల తీయని గానమే కాదు; గుడ్లగూబల అరుపులూ ఉంటాయి. మానవ జీవిత పుస్తకంలో ఆనందాలనిచ్చే విరుల వనవిహార వర్ణనలు నిండిన పేజీలేకావు, ముళ్ళబాటల నడకల కష్టాలూ లిఖించబడిన పుటలూ ఉంటాయి. అని చెప్పడమే నా దోషం అని ముగిస్తాడు మొదటి చరణం.

నా చుట్టూ ఉన్న సమాజంలో ఒకడు ఆకలితో అరుస్తున్నాడు, అది ఏ తాళం? చాలీచాలని జీవితం జీవిస్తూ నిట్టూరుస్తున్నాడు ఒకడు, ఆ నిట్టూర్పూ ఒక శృతే. తలదాచుకోను చోటులేక చలిమంచులో నిద్రపోతూ మూలుగుతున్నాడొకడు – వీరి గొంతుల్లో పలికే బ్రతుకు పాటలు ఏ రాగం? వీళ్ళను అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం? ఇవి వివరించమని సంగీత పండితుడైన నా తండ్రిని అడిగితే ఇల్లు విడిచి వెళ్ళమన్నాడు. ఈ అసమానతని చూసీ చూడకుండా గుడ్డివాడిలా, వినీ వినకుండా చెవిటివాడిలా వెళ్ళిపోతే నా జీవితం బాగుంటుంది కదా నాకెందుక అని ఆగలేను. అవేవీ పట్టించుకోకుండా నీ జీవితాన్ని నువ్వు జీవించుకుంటూ వెళ్ళు అని శాసించారు; అది నా వల్ల కాదన్నాను. అయితే ఇక్కడుండటానికి వీలులేదు వెళ్ళిపొమ్మన్నారు.

మూడో చరణంలో తన వైఖరి ఇదీ అని చెప్పడానికి మరింత గాఢమైన జీవిత దృష్టాంతాలతో వివరిస్తున్నాడు. సంగీతం తప్ప మరేం పట్టించుకోకు అన్నతండ్రి మాటలు విని నడుచుకోలేను. ఎందుకంటే నాకు అసహాయతతో దడదడలాడే హృదయాల సవ్వడులు నాకు మృదంగలా, వారి శోక జీవితాల పాటలు ఆర్తి గీతాల్లా, వారి దీనమైన అరుపులు స్వరాల్లా వినిపిస్తున్నాయి – వాటిలోని అపశృతులను సరిచెయ్యాలంటే, వారి జీవన శైలీ తీగెలను సవరించాలి. అది మనపని కాదు, నేను వీటికి అతీతుణ్ణి అన్న మిథ్యతో సహజీవనం నాకు చేతకాదు అని మూడో చరణం ముగిస్తాడు.

ఇందులో ఉపమానాలన్నీ సంగీతానికి సంబంధించినవే ఎంచుకోవడంలో కవి ప్రతిభ స్పష్టం అవుతుంది.శాస్త్రీయ సంగీత ప్రతిభగల ఆ తండ్రిని మత్తకోకిలతో పోల్చడం సన్నివేశానికి బాగా నప్పింది.

నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలుపోతాను

నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుక విచ్చిమ్రోస్తాను

నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను

నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను

— శ్రీశ్రీ (చిన్నచిన్న మార్పులతో)

సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియుంచుదాకా

ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా

పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను

నేను సైతం నేను సైతం నేను సైతం

నేను ఎన్నుకుంటున్న ధ్యేయం ఇదీ అని పాత్ర ద్వారా చెప్తూ పాట ముగిస్తున్నాడు కవి. ఇలాంటి మాటలు/పాటలు పాశ్చాత్య  భాషలో గనుక ఉన్నట్టైతే ఈ మూడు పాటలనుండి కనీసం పది, పదుహేను లైన్‌లను Quote Cardsలలో, గోడకి అంటించే వాల్‌పేపర్‌లలో ప్రజల్లో మరింత ప్రచారమయ్యేవి. ఈ తరంలో వాట్సాప్, ఫేస్‌బుక్ స్టేటస్‌లలో టెక్స్ట్ఇమేజ్/మీమ్స్ పెట్టుకునేవాళ్ళు ఇలాంటి పాటల్లో లైన్స్ తీసుకుని పెట్టుకోవచ్చు.

దుఃఖాల్లో  ఉన్నవాళ్ళని ఓదార్చడానికీ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకూ ఈ మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి, ఎందరికో స్ఫూర్తినిస్తాయి అంటే అతిశయోక్తి కాదు.

*

అవినేని భాస్కర్

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అన్నమయ్య సంకీర్తనల అభిమాని ప్రియమైన అవినేని భాస్కర్ గారూ! సామ్యవాద రాగం వినిపిస్తూ, ఆదిలోనే మమ్మల్ని ఇంతలేసి లోతైన ఆలోచనల వైపుకి మళ్లిస్తున్నారు, ధన్యవాదాలు.

    నాలాంటి నేలక్లాసు ప్రేక్షకుడు కూడా మర్చిపోలేని; రుద్రవీణ పై ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి పలికించిన “ పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను – – – నమ్మకు నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని “ క్రింద పొందుపరుస్తున్నా

    సీకటమ్మ సీకటి ముచ్చనైన సీకటి
    ఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటి
    నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
    ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
    పొద్దు పొడుపే లేని సీకటే ఉందిపోనీ
    మన మధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
    రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటెనకా

    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    కమ్ముకు వచ్చిన ఈ మాయని
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    కలలే వలగా విసిరే చీకట్లను
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

    వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు
    రవి కిరణం కనపడితే తెలియును తేడాలన్నీ
    నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
    నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

    ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
    పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
    నిరసన చూపకు నువ్వు ఏనాటికి
    పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
    పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
    ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అది
    నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
    ఆహా నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

    శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
    మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
    ఎవరికి చెందని గానం సాగించునా
    పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
    ఆనాడు వాసంత గీతాలు పలుకును కదా

    నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
    ఆహా నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    కలలే వలగా విసిరే చీకట్లను
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

    • రామయ్య గారు, ధన్యవాదాలు.

      ఆ పాట కూడా ఉంది నా జాబితాలో. ఇంకో వ్యాసంలో (ఎప్పుడని ఇప్పుడు చెప్పలేను) ఈ సినిమాలోని మిగిలిన అన్ని పాటల గురించీ రాస్తాను 🙂

  • క్రితం వారమే మీ వేయి పాటలని తలుచుకున్నానండి, భాస్కర్‌గారు! సారంగలో వస్తాయని చెప్పారు – ఇంకా రాలేదేంటా అని. బావుంది మీరు పాటలని పరిచయం చేసిన తీరు.

  • చాలా బాగుంది. ఎన్నోసార్లు ఇష్టంగా విన్న, పాడుకున్న ఆల్బమ్ ఇది. సంగీతమొకెత్తు, ఈ పాటలోని సాహిత్యమొకెత్తు. వినేవాడిని తన్మయత్వంలోకి తోసేయగల పాటలివి. ఆలోచనల్లోకి అమాంతం దూకేయగల పాటలివి. మీరెంతో లోతుగా పాటల సారం వివరించారు. అయితే, ఈ పాటలు అలా నిలిచిపోవడంలో ఎస్పీబి కాంట్రిబ్యూషన్ కూడా ఎంతో ఉంది. మళ్లీ ఒకసారి వింటున్నాను. థాంక్యూ సో మచ్ భాస్కర్ గారు

  • తెలవారదేమో స్వామి పాటతో కాకుండా, సిరివెన్నెలతో కాకుండా రుద్రవీణతో సీరీస్ మొదలుపెట్టడం… interesting 🤔
    Anyways, great start and looking forward to your detailed analysis on many more wonderful songs.

  • మంచి పాటలు, విశ్లేషణ.
    అలాంటి పాటల వెనుక ఉన్న కె బాలచందర్ పేరు కూడా రాస్తే బావుంటుందేమో!
    KB తరువాత తెలుగులో సినిమా తీసినట్లు లేదు. ఎక్కడో చదివినట్లు గురుతు, ఆత్రేయ పాట లేనిదే సినిమా ఎలా అని KB అన్నట్లు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు