రాళ్ళెత్తిన కూలీగా….

అదేమిటో కానీ నా జాతక బలం ఏమిటో కానీ కొన్ని “మొట్టమొదటి” లేదా చారిత్రాత్మక సంఘటనలలో నా ప్రమేయం కాస్తో, కూస్తో ఉండడం చాలా సార్లే జరిగింది. అలాంటిదే 1970 లో మా గురువు గారు ప్రొ. సుబీర్ కార్ గారు తలపెట్టిన నేషనల్ సొసైటీ ఆఫ్ ఫ్ల్యూయిడ్ మెకానిక్స్ & ఫ్ల్యూయిడ్ పవర్ సొసైటీ అనే సంస్థ. ఆ మాట తెలుగు లో “జాతీయ ద్రవ యంత్రగతి శాస్త్రం మరియు ద్రవ శక్తి సంఘం” అని వ్రాస్తే కాస్త భయం వేస్తుంది కదా!.

అమెరికా లో విస్కాన్సిన్ లో చదువుకున్న మా ప్రొఫెసర్ సుబీర్ కార్ గారు మా ఐఐటి కే కాక అన్ని సాంకేతిక కళాశాలలో ఉన్న విద్యావేత్తలకీ, కనీసం స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ మేన్యుఫేక్చరింగ్ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలూ మొదలైన వాటితో దగ్గర అనుబంధం ఉండి, ఒకరికొకరు రిసెర్చ్ లోనూ, కొత్త పరికరాలూ, యంత్రాలూ కనిపెట్టడం లోనూ, ఉన్నవాటిని మెరుగు పరచడం లోనూ ఎకడమీషియన్స్ తో ఉత్పాదక సంస్థలు భాగస్వాములుగా ఉండాలని చాలా కోరికగా ఉండేది. ఎకడమిక్స్ లో ఉన్న వాళ్ళు ఎవరి ఏకాంత సౌధం లో వారు ఉండడం, ఇంజనీరింగ్ వ్యాపార సంస్థలకీ వారికీ అస్సలు సంబంధం లేకుండా ఎవరి ప్రపంచాలలో వాళ్ళు ఉండడం ఆయనకి నచ్చేది కాదు. ఎలా కలిశారో తెలియదు కానీ సరిగ్గా అలాంటి అలోచనలే ఉన్న రెండు కంపెనీల యజమానులు మా గురువు గారితో జత కలిపాయి. అందులో ఒకటి అమెరికాలో తయారు అయే ఎయిర్ ఫిల్టర్లు, ప్రెషర్ రెగ్యులేటర్లు మొదలైన అనేక ఫ్ల్యూయిడ్ పవర్ కంట్ఱోల్ పరికరాల దిగుమతి చేసి అమ్మే షా-వో నార్గ్రెన్ అనే బొంబాయి కంపెనీ. దాని యజమాని హెచ్.కె. షా. రెండోది బరోడా లో జ్యోతి పంప్స్ అనే పెద్ద పంపుల తయారీ కంపెనీ. దాని యజమాని నానూ భాయ్ అమీన్. ఆలాగే మా ఫ్లూయిడ్ మెకానిక్స్ ..అంటే న్యుమాటిక్స్ & హైడ్రాలిక్స్ విభాగాలలో కిర్లోస్కర్ (పూనా), పి ఎస్ జి ఇండస్ట్రీస్ ( కోయంబత్తూర్) లాంటి కంపెనీలకి వాటి పరికరాలు, పంపులు ఇండియాలో తయారు అయినవి కాబట్టి అవి నాసి రకం అయి ఉంటాయి అని అస్సలు మార్కెట్ ఉండేది కాదు. ఎలాగైనా అంత వరకూ ఇండియాలో “కూపస్థ మండూకాల లా ఉన్న ఇండస్ట్రీ ల వ్యాపార తత్వాన్నీ, ఎకడమిషియన్స్ ల సృజాత్మకతనీ కలపాలని మా గురువు గారు వీరందరినీ కూడగట్టి 1969 లో మా ఐఐటి లో జాతీయ స్థాయి లో నేషనల్ ఫ్లూయిడ్ మెకానిక్స్ & ఫ్లుయిడ్ పవర్ కాన్ఫరెన్స్ చేద్దాం అని తలపెట్టారు. ఆ రోజుల్లో అది వినూత్నమైన ఆలోచనే!

అయితే అటువంటి పెద్ద ఇంజనీరింగ్ సమావేశం ఏర్పాటు చెయ్యడం లో మా గురువు గారికి అనుభవం లేకపోవడం, ఆయనకీ పెద్ద పేరు వస్తుందేమో అని మా డిపార్ట్ మెంట్ లో ఇతర ప్రొఫెసర్ల అసూయ వలనా తగిన వనరుల కేటాయింపు లేక ఆ ప్రయత్నం బెడిసి కొట్టినా, మా గురువు గారు జాదవ్ పూర్ యునివర్సిటీ లో ప్రొ. బి.ఎన్. చందా గారి తో మాట్లాడి, మా ఐఐటి లో జరగ వలసిన ఆ మొదటి సమావేశం అక్కడ జరిగేలా చూశారు. మార్చ్, 1969 లో ఆ కాన్ఫరెన్స్ కి నేనూ, మూర్తీ జాదవ పూర్ వెళ్లి పాత్ర సమర్పణ చేశాం. దేశవ్యాప్తంగా అనేక మంది నిపుణుల మధ్య అలాంటి అనుభవం నాకు అదే మొదటి సారి. అక్కడే నేను ఖరగ్ పూర్ ఐఐటి నుంచి వచ్చిన బందా రామారావు గారిని కలిశాను. తర్వాత చాలా ఏళ్ళకి ఆయన హ్యూస్టన్ లో స్థిరపడి మంచి కుటుంబ మిత్రులు అయ్యారు. ప్రస్తుతం ఆస్టిన్ నివాసులు.

ఆ తర్వాత ఏడు మా గురువు గారే మా డిపార్త్ మెంట్ చైర్మన్ అవడంతో ఇక ఆయన రెచ్చిపోయారు. రెండవ నేషనల్ ఫ్లూయిడ్ మెకానిక్స్ & ఫ్లుయిడ్ పవర్ కాన్ఫరెన్స్ చెయ్యడానికి భారీ స్థాయిలో తలపెట్టడం, దేశం నలుమూలలా అందరినీ కూడగట్టడం, ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడం టక టకా జరిగిపోయాయి. ఆయన తల్లి కోడి, మాస్టర్స్ స్ట్యూడెంట్లు, రిసెర్చ్ స్కాలర్లు అయిన అయిన శివరాం, మూర్తీ, నేనూ వగైరా అరడజను మంది పిల్ల కోళ్లూ. అంతర్జాతీయ సమావేశాల పధ్దతిలో అప్పటి భారత దేశం లో కనీ వినీ ఎరుగని విధంగా మా గురువు గారు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ముందే తయారు చేసి సభలో అందరికీ ఇవ్వాలి అని నిర్ణయించారు. ఆ పని అంతా మా మీద పడింది. అంటే, కంప్యూటర్లు లేని ఆ ద్వాపర యుగం లో వచ్చిన అన్ని సాంకేతిక పరిశోధనాపత్రాలనీ ..అతి క్లిష్టమైన ఈక్వేషన్స్ తో సహా సైక్లో స్టైల్ లో టైపింగ్ చేయించి ఆ సావనీర్ ముద్రించే బాధ్యత మాదే. అత్యంత విజయవంతమైన ఆ కాన్ఫరెన్స్ కి. అందులో నేనూ, మూర్తీ మొదటి వరసలో కూచున్న ఆ కాన్ఫరెన్స్ ఫోటో ఒకే ఒకటి ఇక్కడ జతపరిచాను.

ఈ కాన్ఫరెన్స్ తో వచ్చిన ఊపుతో మా గురువు గారూ, స్థానిక విక్టోరియా జూబిలీ టెక్నికల్ కాలేజ్ లో ప్రొ. మీనన్, ఇతర ఐఐటీ లలో ఆ సబ్జెక్టుల ప్రొఫెసర్ల తో సంప్రదించి 1970 లో నేషనల్ సొసైటీ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ & ఫ్లుయిడ్ పవర్ (NSFMFP) అనే సంస్థ ప్రారంభించారు. అధ్యక్షుడి పదవి కి ఎన్నికలు పెడితే ఆదిలోనే హంస పాడులా తన్నుకు చస్తారు అని వాదించి, మా గురువు గారు ఆ ఒక్క పదవీ నామినేటెడ్ పదవి గానూ, మిగిలివాటికి ఎన్నికల ప్రక్రియ ద్వారానూ ఆ సంస్థ ప్రారంభం అయింది. నానూభాయ్ అమీన్ మొదటి ప్రెసిడెంట్ గానూ, ఆ తర్వాత మా గురువు గారూ ఏకగ్రీవంగా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత ప్రతీ ఏడూ జాతీయ స్థాయిలోనూ, నాలుగేళ్ళకి ఒకసారి అంతర్జాతీయ స్థాయి లోనూ ఆ కాన్ఫరెన్స్ లి జరుపుతూ ఆ సంస్థ ఇప్పటికి 45 పైగా సాంకేతిక సమావేశాలు నిర్వహించడం ఎంతో గర్వ కారణం. ఆ సంస్థ వ్యవస్థాపకుడు గా మా ప్రొ. సుబీర కార్ చరిత్రలో నిలిచిపోయారు. రాళ్ళెత్తిన కూలీలం అయిన మూర్తీ, శివరామ్ నా పేరూ, తదితరుల పేర్లూ ఎవరికీ తెలియవు.

ఆ పరంపరలో నేను ఐఐటీ లో లెక్చరర్ స్థాయిలో ఐఐటి (ఖరగ్ పూర్) లో 1972, ఐఐటి (మద్రాసు)లో 1973 లోనూ పాల్గొనడం, ఆ తర్వాత 1974 చివర్న నేను అమెరికా వలస రావడం జరిగింది. అయితే, నేను అమెరికాలో అదే ప్ల్యూయిడ్ పవర్ కి చెందిన పరికరాల ఉత్పత్తి సంఘం ప్రతినిధిగా, ఒక స్పాన్సర్ గా 1992 లో మళ్ళీ మా బొంబాయి ఐఐటీ లోనే జరిగిన 19వ కాన్ఫరెన్స్ కి ఒక పవిత్ర యాత్రా దర్శనం లాగా వెళ్ళి, ఒక సాంకేతిక పరిశోధనా పత్రాన్ని సమర్పించి, మా గురువు గారు, ఆయన సతీమణీ నీనా గారు, బి. వై. మూర్తి, అతని సతీమణి శారద, అలనాటి మిత్రులు, సహచరులూ అయిన బి.డీ. వ్యాస్, కులదీప్ సింగ్ సయ్యాన్, ఉష పౌళె మొదలైన వారందరినీ కలుసుకుని నాలుగు రోజులు మా కేంపస్ లోనే పాత రోజులు గుర్తు చేసుకుంటూ మహదానంద పడ్డాను. అది కొస మెరుపు. అప్పటి ఫొటోలు కొన్ని ఇక్కడ జతపరుస్తున్నాను. మరొక ప్రత్యేక విశేషం ఏమిటంటే, అప్పటికి నేను అమెరికా భాగస్వామిగా ఉన్న ఇండియా కంపెనీ తరఫున బి.వై. మూర్తి రెండేళ్ళ తరవాత….అంటే 1994 లో ఉస్మానియా యూనివర్శిటీ లో జరిగిన 20 వ కాన్ఫరెన్స్ ని స్పాన్సర్ చేశాడు. నేను వెళ్ళ లేక పోయాను. 2006 లో 33వ దీ, అంతర్జాతీయ స్థాయిలో 2018 లో 45వ “ద్రవ యంత్రగతి శాస్త్రం మరియు ద్రవ శక్తి” సమ్మేళనం మా బొంబాయి ఐఐటీ లోనే జరిగాయి కానీ నాకు ఏమీ సమాచారం లేదు. చెప్పానుగా….మేము రాళ్ళెత్తిన కూలీలం…

ఇక నా పరిశోధనా పత్రాలూ, డాక్టరేట్ పూర్తి అయిన రోజులలో ఇబ్బందుల గురించి…వచ్చే సారి…..

*

వంగూరి చిట్టెన్ రాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు