రాయి మాది, రక్తం మాది. సంపద ఎవరిది?.

వ్యవసాయం తప్ప మరో సాయం లేని 1980ల నాటి రోజులు. మా వూరి నుండి పొద్దున్నే ఓ చేతిలో అన్నం క్యారియర్, మరో చేతిలో పుస్తకాలూ పట్టుకొని రెండు మైళ్ళ దూరంలో వున్న నీలకంఠరావుపేట జిల్లా పరిషద్ హైస్కూలుకు వెళ్ళేవాళ్ళం. మలుపు తిరిగిన రోడ్దును వదిలేసి అడ్డంగా దర్గాస్వామి చేనులో నడవడం అలవాటు. చివరికి చేనులో చెనక్కాయ పంట వున్న రోజుల్లో కూడా అందరూ చేలో అడ్డంగానే నడిచేవారు. చేలో పంటలేని సమయంలో సాయంత్రం బడి వదిలేశాక వస్తూ వస్తూ ఆ చేలోనే కాలిబాటనే అల్లెగా భావించి బలిగూడు ఆడేవాళ్ళం. ఒకరోజు ఆ చేలోంచి అడ్డదోవన వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఏమిటా అని విచారిస్తే అక్కడేదో కంకర మెషీన్ వస్తుందన్నారు. వడ్లను బియ్యంగా మార్చే వడ్ల మెషీను తెలుసు, కానీ ఇదేందా అని అరా తీస్తే పెద్ద పెద్ద రాళ్లను చిన్న చిన్న కంకరరాళ్లుగా మారుస్తుందీ మెషీన్ అన్నారు. అలా మావూరికీ, నీలకంఠరావుపేటకీ మధ్య కంకరమెషీను నిలబడింది. దానితో పాటే అక్కడ మరో వూరి నుండీ వచ్చిన చంద్రారెడ్డి నిలబడ్డాడు. మా వూర్లో ఏ రెడ్డినైనా “రెడ్డీ” అని పిలిచే అలవాటు లేదు, పేరులో రెడ్డి విడదీయలేని భాగమైతే తప్ప. వుదాహరణకు “గంగిరెడ్డి”. అదే కృష్ణారెడ్డి కనపడితే ఏం కృష్ణా ఎక్కడికబ్బా బయలుదేరినావు అంటాం. ఈ రెడ్డిని కూడా అందరూ చంద్రన్న అని పిలవడం మొదలయింది.

చంద్రన్న కంకరమెషీను పెట్టాడు. మెషీను పక్కనే పక్కా యిల్లు కట్టాడు. ట్రాక్టర్లు వచ్చాయి. పర్వతాల్లా నిలబడిన పెద్ద రాతి గుట్టలు పిల్లిగుండ్లను పేల్చడానికి మందుగుండు తెచ్చాడు. పిల్లిగుండ్లలో రంధ్రాలు వేసి, మందుకూరి పేలిస్తే ఎగిరి పడ్డ రాళ్ళతో రోజూ తిరిగే రోడ్డంతా రొచ్చురొచ్చుగా కనపడేది. ఆ పేల్చిన రాళ్ళను ఎత్తి ట్రాక్టర్లలో పోయడానికి, ట్రాక్టర్లు నడపడానికి, కంకరమెషీను దగ్గర పనిచేయడానికీ మనుషులు కావలిసి వచ్చారు. పొలంలో కూలీకి పోయేవారు, “కంకర మెషీను పనికి” పోవడం మొదలయింది. రాత్రిళ్ళు మైలు దూరంలొ వుండే వూర్లోకి కంకరమెషీను ధడధడ చప్పుళ్ళు వినపడేవి. ఆ దారిన వెళ్ళే వాళ్లందరిమీదా మెషీను కన్వేయర్ బెల్టుల మీద నుండీ వచ్చే దుమ్ము పడడడం మామూలయింది. గల్ఫ్ వెళ్ళడానికంటే ముందే కంకరమెషీను పనికి పోవడంతో పొలాలను బీడు బెట్టడం మొదలయిందని చెప్పొచ్చు. ఒకసారి పొలాలు బీడులయ్యాక ఎవర్ని పనిలోకి తీసుకోవాలో ఎవర్ని ఇంటికి పొమ్మనాలో చంద్రన్న ఇష్టమయింది.

నమూనా చిత్రం

తూర్పు కొసనున్న రామస్వామి కొడుకు రమణ, పడమర మొగానున్న వెంకట్రాయుడు కొడుకు నాగరాజా అంటే వ్యవసాయం పనుల్లో దిట్టలని పేరు. వాళ్ళను చూడండ్రా వాళ్ళ నాయనల చేతులకు మట్టి అంటకుండా ఎలా పనులు చేస్తున్నారో అంటూ వూర్లో వాళ్ళు వాళ్ళను వుదహరణగా చూపేవారు. పదిహేనేళ్లయుంటేదేమో నేనొకసారి వూరెళ్ళినపుడు చూస్తే, కోడెదూడ లాంటి నాగరాజా వెన్ను విరిగి మంచం మీద కదల్లేకుండా వున్నాడు. చిన్నబిడ్డలతో వున్న నాగరాజా బార్య కళ్ళలో నీళ్ళు, నోట్లో చెంగు! గుండె గొంతుకు అడ్డం పడ్డట్టయి, ఏమయిందని విచారిస్తే కంకర మెషీను దగ్గర పనిచేస్తున్నపుడు రాయి నడుమ్మీద పడి, నడుం విరిగిపోయిందని చెప్పింది. రెండేళ్ళ తర్వాత నేను తిరిగి వూరెళ్ళేటప్పటికి నాగరాజా లేడు. బిడ్డలను వదిలేసి ఆయన బార్య గల్ఫ్ వెళ్ళిందని తెలిసింది.

కంకరమెషీను కరకురాళ్ళ కింద నడుములు పోగొట్టుకున్న అక్కయ్య, అసలుకే గల్లంతైన నాగయ్య కొడుకు తెలిసిన కొన్ని వుదాహరణలు మాత్రమే. వినపడని రోదనలు, కనపడని కన్నీళ్ళూ ఎన్నో!

మావూరి రాళ్ళ గుట్టల మీద, మావూరి ప్రజల రక్తమాంసాల మీద బతికిన చంద్రన్న మావూరికేం చేశాడు? దోచుకున్న రాళ్ళకేమయినా పన్ను కట్టాడా? నడుములిరిగిన, చేయి విరిగిన వాళ్ళకేమయినా భృతి కల్పించాడా? పైగా మావూరివాడు కాని చంద్రన్న ఇప్పుడు వూరి రాజకీయాల్లో తలదూరుస్తున్నాడు. సర్పంచ్ పదవికి ఎవరు పోటీ చేయాలో, ఎవరు చేయగూడదో చెబుతున్నాడు. మాటవినని వాళ్ళను బెదిరిస్తున్నాడు. ఆయన వీధి వెంట వస్తుంటే పందిళ్ళ కింద మంచాల మీద కూర్చున్నవాళ్ళు లేచి నిలబడుతున్నారట! మునుపు వూర్లోకి కోమట్లు వచ్చినా లేచి నిలబడడం చూడలేదు నేను. డెబ్బై ఏళ్ళ ప్రజాస్వామ్యంలో మావూరు ముందుకెళ్ళిందా, వెనక్కెళ్ళిందా అర్థం కావడం లేదు.
*

ప్రసాద్ చరసాల

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు