ఎన్నో ఉదయాలు

ప్రతి కుంగిన పొద్దు
మరో ఉదయాన్ని
ప్రేమగా నాటి పోతుంది

మొలకెత్తిన ఉదయం
కళ్ళు విప్పార్చి
నెమ్మది నెమ్మదిగా
లోకాన్ని పరికిస్తుంది
ప్రపంచపు చిటికెనవేలు
పట్టుకుని నడక నేరుస్తుంది

ఎన్నో పర్వతశిఖరాలను
ఎక్కుతూ దిగుతూ
లోయల గుండా
సొరంగాల గుండా ప్రయాణిస్తూ
బతుకును బొట్టు బొట్టుగా
చప్పరిస్తూ రుచి చూస్తుంది

దుఃఖపు ఆనవాళ్ళను
ఎప్పటికప్పుడు చెరిపేసుకుంటూ
ఆనందాల ఆమనిని వెతుక్కుంటూ
విడిచి వెళ్ళిన పొద్దుల
జ్ఞాపకాలను నెమరేసుకుంటూ
తన విత్తనాన్ని
భవిష్యత్తుకు కానుక చేస్తుంది

జననమరణాల వెలుగుచీకట్ల
మలుపుల నడుమ
శ్వాసలు ఊయలలూగుతూనే
ఉంటాయి

మరో ఉదయం
కొత్త ఆశలపూలతో
మళ్ళీ విచ్చుకుని
శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది

గత స్మృతుల
అనుభవాల సారాంశం
ఉదయ ఉదయానికి
పాఠాలు నేర్పుతూ ఉంటుంది

అప్పుడు జీవితం
కొత్తగా చిగురించిన
ఉదయం గుప్పెట్లో
మురిపెంగా ఇమిడిపోతుంది.
*

పద్మావతి రాంభక్త

18 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బావుంది.మెత్తని మాటలతో మృదువైన ముగింపు.

  • రోజూ చూస్తూ నిర్లక్ష్యంగా వదిలేస్తున్న అందాల్ని, తను ‘కని’, ఆ ‘పాప’లని మన కంటికి భావుకంగా కనుపింపచేసిన పద్మావతి గారికీ, ప్రచురించిన మీకూ హృదయపూర్వక ఉభయాభినందనలు.

  • చాలా అద్భుతంగా వర్ణించార పద్మావతి గారు..

    నిజంగా మనం కూడా ప్రతిరోజూ ఇలా ఉంటే ఎంత బావుండునో!!

    • ధన్యవాదాలు దివాకర్ గారు

    • ధన్యవాదాలు శ్రీరామ్ గారు

  • ప్రతి ఉదయ గమనాన్ని .. ఆగమన విశేషాలను, అనుభవాలను జీవిత గమనానికి ఆపాదించి చిగురుల ఉదయాన్ని చిన్మయ రూపంగా అక్షరాలతో కనువిందు చేశారు అభినందనలు

  • Well written, mam! After a l ong time I have read a Telugu poem that brings positivity.Chaduvutute Haayiga undi.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు