రాజ్యాధికారం కోసం ‘ద్వాలి’ ధిక్కారం

భారత రాజ్యాంగ రచనలో డా. బి. ఆర్. అంబేద్కర్  ది చాలా కీలకమైన భూమిక. ఒకసారి రాజ్యాంగ పరిషత్ లో టి. టి. కృష్ణమాచారి మాట్లాడుతూ “Out of seven members selected to prepare the draft constitution, one resigned, one died, one left for America, one was busy with his work in the princely state, one or two live away from Delhi, some had to be excused for health reasons. Dr. B. R. Ambedkar was the only one who had to bear the entire burden.” అన్నాడు. బహుశా ఈ స్థానంలో నిమ్న కులానికి చెందిన బాబా సాహెబ్ అంబేద్కర్ కాకుండా మరో ఆధిపత్య కుల నాయకుడెవరైనా ఉండి ఉంటే గడిచిన డెబ్భై ఏళ్ల భారత దేశ చరిత్ర మరోలా ఉండేది. కేవలం ఉన్నత వర్గాలకు, సంపన్న వర్గాలకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి నియంతృత్వం అమలు చేయాలనే వాదనలు వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో కల్పించిన రిజర్వేషన్లు, రాజ్యాంగ ప్రవేశిక చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

నిజానికి రిజర్వేషన్లు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 నుండి కేవలం పది సంవత్సరాలు అంటే 1960 దాకా మాత్రమే ఉండాలని చెప్తుంది రాజ్యాంగం. కాని స్వాతంత్ర్య ఫలాలు దేశ ప్రజలందరికీ సమానంగా అందక పోవడం వలన, మహిళలకు సమాన అవకాశాలు దక్కకపోవడం వలన, ఓటు బ్యాంక్ రాజకీయాలు పెరిగిపోవడం వలన రిజర్వేషన్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు దేశంలో రిజర్వేషన్లు అక్కరే లేదని వాదించే వాళ్ళు కూడా లేక పోలేదు. ఈ నేపథ్యాన్నంతా కాస్త ఘాటుగానే చర్చించిన కథ ‘ద్వాలి’.

ద్వాలి కథ ద్వాలి (1) చదవండి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు వారి వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి రాజ్యాధికారాన్ని చేపట్టే అవకాశం ఇచ్చింది భారత రాజ్యాంగం. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలు పేరుకే ఎన్నికల్లో పోటీ చేసి రాజ్యాధికారాన్ని చేపడుతారు. వాస్తవ అధికారం మాత్రం మళ్ళీ ఆధిపత్య వర్గాల గుప్పిట్లోనే ఉంటుంది. మహిళల పరిస్థితి అయితే మరీ దారుణం. గిరిజన, బంజారా స్త్రీల పరిస్థితి మరింత దారుణం. స్త్రీలు అధికారంలోకి వస్తే వాళ్ళ భర్తలు ఆమె కుర్చీ పక్కన మరో కుర్చీ వేయించుకొని అధికారాన్ని అనుభవిస్తుంటారు. నిర్ణయాలు కూడా తీసుకుంటారు.

దళిత, బహుజన మహిళలు కేవలం వేలిముద్రలకు, లేదంటే చిన్న సంతకానికే పరిమితమవుతారు. ఈ కథలో ద్వాలి భర్త హేమ్లా కూడా అంతే. మరో మహిళ మోతీని ‘కూడుకొని’ ద్వాలిని నిర్లక్ష్యం చేస్తాడు. ఇది సహించక ద్వాలి భర్త నుండి దూరం జరుగుతుంది. కాని పంచాయితీ ప్రెసిడెంట్ కోసం మహిళా రిజర్వేషన్ రూపంలో అదృష్టం ఆమెను వెతుక్కుంటూ వస్తుంది. అయితే పంచాయితీ ప్రెసిడెంట్ గా ద్వాలి గెలిచిందా? ఒక వేళ గెలిస్తే నిజమైన అధికారం హేమ్లా చలాయించాడా? ద్వాలి ఆ గ్రామాన్ని ఎలా పరిపాలించింది? హేమ్లాను ఎదిరించిందా? ప్రజల పక్షాన నిలబడి గ్రామ స్వరూపాన్ని ఏమైనా మార్చిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే మనం ‘ద్వాలి’ కథలోకి వెళ్ళాల్సిందే.

ద్వాలి బాయి నిలువెత్తు ఆత్మవిశ్వాసం పోత పోసిన మనిషి. జీవితంలో నిటారుగా నిలబడి ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కునే వ్యక్తిత్వం. జాలి గుణంతో పాటు బాగా కష్టపడే మనిషి. ఒక్కతే ముగ్గురి పని చేస్తుంది. విశ్రాంతి ఎరుగని మనిషి. చాలా తక్కువ మాట్లాడుతుంది. ఆ మాట్లాడే ఒక్క మాట కూడా చాలా విలువైంది. దీనికి విరుద్ధంగా ఆమె భర్త హేమ్లా విలాస పురుషుడు. పైగా రాజకీయాల పిచ్చి. దీనితో ఇంటి భారం అంతా ద్వాలి పైనే పడేది. భర్త నుండి దూరం జరిగి కొక్యా తండాను విడిచి జింకల తండాలో ఉంటూ పిల్లలకు తండ్రి లోటు తెలియకుండా పెంచుతుంది. పెద్దగా చదువుకోకున్నా గ్రామ రాజకీయాలను బాగా అర్థం చేసుకున్న స్త్రీ. అందుకే ఒక సందర్భంలో భర్త హేమ్లాతో “అయిదేళ్ళ క్రితం నువ్వు ఏ జెండా పట్టుకున్నవో అది ముఖ్యం గాదు. నువ్వు మంది కోసం ఏం జేసినవో గది కావాలె. నువ్వు ఏ రంగు జెండా పట్టుకొని గెలిసినవో ఆ జెండా, ఆ పార్టీ ఇప్పుడు మందికి అవుసరం లేదు. ఇప్పుడు మన రాజ్యం వచ్చింది. ఇగ నీ పాత పార్టీ జెండా పక్కన బెట్టి ముందు మనలను నడిపిస్తున్న పార్టీల.. మనకి అవుసరమైన పార్టీల చేరు.” అని మారిన రాజకీయ పరిస్థితుల్లో అధికారం ఎలా హస్తగతం అవుతుందో చెప్తుంది.

మహిళా రిజర్వేషన్ పుణ్యామా అని హేమ్లా ఒత్తిడి చేస్తే ద్వాలి పంచాయితీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. పంచాయితీ సమావేశాల్లో ద్వాలి పక్కనే హేమ్లాకు కూడా ఒక కుర్చీ వేస్తున్నారు. మెల్లగా అధికారమంతా హేమ్లా చేతిలోకి పోతుంది. నిర్ణయాధికారం హేమ్లాదే అయిపోతుంది. ఇదంతా సహించని ద్వాలి…

“చూడూ! నూరేళ్ళ బతుకు నీ చేతుల పెడితే అది తీసుకోబోయి ఎవరికో అప్పజెప్పినవంటే అది వేరే సంగతి. అప్పుడది పురాగా నా బతుకు. ఇప్పుడు ఈ ప్రజల బతుకులు గూడ నీకు అప్పజెప్పమంటవా? పంచాయితీ ఆఫీసుల ఆ రెండో కుర్చీ ఎందుకు అని ప్రతిపక్షాలోల్లు చర్చకు బెట్టి ఇజ్జత్ తియ్యకముందే ఆ కుర్చీ తీయించిన… ఇగ నీవు రోజు అక్కడకు వచ్చే అవుసరం గూడ ఉండదిగ.” ద్వాలి మాటలు చాలా పదునుగా వచ్చాయి. విస్తూబోయి చూశాడు హేమ్లా.

“ఏమంటున్నావు ద్వాలీ! నేను మీ మొగుణ్ణి” పౌరుషంగా అరిచాడు.

“నువ్వేవరో నీకు తెలుసు సరే! నేనెవరో గూడ నువ్వు జర గుర్తుంచుకోవాలె.” అంటుంది.

బంజారా స్త్రీల రాజకీయాధికారం పైన, చైతన్యం పైన, స్వతంత్ర వ్యక్తిత్వం పైన ఈ కథ ఒక మేనిఫెస్టో లాంటిది. ద్వాలి చైతన్య స్థాయి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అదే సమయంలో మోతి బొలాతనం పైన, ఆమెతో విధి ఆడిన నాటకంపైన జాలి కలుగుతుంది. భార్యలు అధికారంలో ఉంటే భర్తలు రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తించడాన్ని ఈ కథ ప్రశ్నించి, నిలదీసి, అనవసర జోక్యాన్ని చీదరించుకుంటుంది. ఈ కథ నెపంగా రచయిత్రి ఎన్నో విషయాలను చర్చకు పెట్టింది. రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల నిజ స్వరూపం ఎలాంటిది? గిరిజన జాతుల్లో కూడా పురుషుల బాధ్యతా రాహిత్యం ఎంత? తద్వారా స్త్రీలపై ఇంటి భారం, పని భారం, పిల్లల పెంపకపు భారం బరువెంత? సమ్మక్క సారక్క జాతరలోని మరో కోణమేంటి? తన స్వంతం అనుకున్న భర్త జీవితంలోకి మరో స్త్రీ ప్రవేశిస్తే మొదటి భార్య పొందే విరక్తి ఎంత? ఆ తర్వాత భర్తలు చేసే ఉద్దరింపు కాపురాల మాటేంటి?ఎప్పుడూ రాజకీయాల చర్చ జరిగే నాయకుల ఇళ్ళల్లో పిల్ల చదువుల మాటేంటి? వ్యక్తిగత కక్షలకు గ్రామాభివృద్ధిని ఎలా బలి చేస్తున్నారు? ఇలా అనేక విషయాలను ఎంతో లోతుగా చర్చించి మన స్థిర అభిప్రాయాలను పటాపంచలు చేస్తుంది ఈ కథ.

కథలో నెరేషన్ అంతా ప్రామాణిక భాషలో సాగి, సంభాషణలు అన్నీ తెలంగాణ తెలుగులో సాగుతాయి.  ఇదొక శిల్ప మర్యాద. వర్తమానం- గతం- వర్తమానం అనే టెక్నిక్ తో రాసిన కథ కావడం వలన పాఠకుడిని ఆకట్టుకుంటుంది. ఇప్పపూవు లాంటి శిల్పం, ఉర్సు పండుగలాంటి శైలి వలన కథ గోగుపూవులాంటి అందంతో తొణికిసలాడుతుంది. కథలో ప్రధానంగా మూడే పాత్రలు. ద్వాలి పిల్లలు సోని, మాంగ్యా కూడా తెర మీదికి వస్తారు కాని మెరుపులాగా ఇలా మెరిసి అలా మాయమయ్యే పాత్రలు. మూడు పాత్రల్తోనే గిరిజన జీవిత సంఘర్షణ, మహిళా రాజ్యాధికారంలోని డొల్లతనం, స్త్రీ, పురుషుల వైవాహిక జీవితంలోని విభిన్న పార్శ్వాలు, సమాజంలో అసహాయంగా మిగిలిపోయిన స్త్రీల ధైన్య స్థితిని రచయిత్రి ఎంతో పరిణతితో చిత్రించింది. వాస్తవిక జీవితంలోని వ్యక్తుల్నే పాత్రలుగా దిగుమతి చేసుకోవడం వలన కథ చాలా సహజంగా రూపొందింది. ద్వాలి మానసిక సంఘర్షణ మనల్ని జీవితకాలం విడిచిపెట్టదు.

కొంత ఎత్తులో అడ్డంగా వేలాడదీసిన ఒక కర్రకు దారాలతో జిలేబీలను కట్టి వివిధ ఎత్తులలో ఉన్న పిల్లలను కేవలం నోటితో మాత్రమే వాటిని అందుకొమ్మంటే ఎలా అందుకుంటారు? సహజంగానే పొడుగ్గా ఉన్నవాడు ముందుగా అందుకొంటాడు. వాని కన్నా కొంచెం పొడుగు తక్కువ వున్నవాడు పైకి ఎగిరి ఎగిరి కొంత ప్రయత్నం మీద అందుకుంటాడు. మరి ఎంత ఎగిరినా అసలే అందుకోలేని పొట్టి వాళ్ళ సంగతి ఎలా? వాడ్ని పైకి లాగడానికి ఏదో శక్తి కావాలి అందుకే ఈ రిజర్వేషన్లు. ఈ విషయాన్నే చాలా ధ్వన్యాత్మకంగా చెప్తుందీ కథ. భారత మహిళా రాజకీయ చరిత్రలో, ముఖ్యంగా ఆదివాసీ మహిళల సాంఘిక జీవితాల్లో ఈ కథ ఒక మైలు రాయి. దేశ ప్రజలందరికీ ఓటు హక్కు ఉన్నన్నినాళ్ళు, పురుషుల ఆధిపత్య ధోరణి మారనన్నినాళ్ళు, రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ సమానంగా దక్కనన్నినాళ్ళు ఈ కథ మన గుండెల్లో బతికే ఉంటుంది.

మహిళల ఆత్మగౌరవాన్ని, రాజ్యాధికారం వైపు అడుగులు వేయడాన్ని ఎత్తి చూపిన ఈ కథను రాసిన సీనియర్ రచయిత్రి సమ్మెట ఉమాదేవి. తెలుగు కథకు గిరిజన తండాల సొగసునూ, అడవి పూల పరిమళాన్నీ అద్దుతూ వస్తోన్న సమ్మెట ఉమాదేవి ఇప్పటిదాకా వస్తు వైవిధ్యంతో దాదాపు నూరు కథలు రాశారు. అవన్నీ అమ్మకథలు, రేలపూలు, తండావాసుల కథలు, సమ్మెట ఉమాదేవి కథానికలు, జమ్మిపూలు పేర ప్రచురింపబడ్డాయి. ఇతర రచయితలతో కలిసి ‘నాలుగునాళ్ళ పదహారు’ అనే కథల సంకలనం కూడా వెలువరించారు. ఇవేగాక బాల సాహిత్యంలో కృషి చేస్తూ అల్లరి కావ్య, పిల్లల దండు, శ్రీరామకృష్ణ పరమహంస, నిజాయితీ, పిల్లిముసుగు అనే పుస్తకాలను కూడా వెలువరించారు. సమ్మెట ఉమాదేవి సుదీర్ఘ కాలం ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పని చేసి ఇటీవలనే పదవీ విరమణ పొంది పూర్తి స్థాయి సాహిత్య జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కథ మొదట 14 మే 2017లో నమస్తే తెలంగాణ ఆదివారం సంచిక ‘బతుకమ్మ’లో ప్రచురింపబడింది.

*

 

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

28 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ గతంలో నేను చదివిందే. మీ విశ్లేషణ బాగుంది.
    కథ కొత్తగా ఉంది. కథనం చాలా వేగంగా చదివించేస్తుంది. చాలా కథల్లాగా కాకుండా కథ ఒక‌చక్కని పరిష్కారం చూపిస్తుంది. అంటే రచయిత్రిలో కథకు చెందిన అంతిమనిర్ణయం పట్ల ఒక‌ కచ్చితమైన అభిప్రాయం ఉందన్నమాట. అభినందనలు రచయిత్రికినీ, మీకున్నూ

  • కథ కి న్యాయం చేసిన విశ్లేషణ. శ్రీధర్ గారికి , మరోసారి ఉమా దేవి గారికి అభినందనలు.

  • మీ విశ్లేషణ అద్బుతం గా ఉంది శ్రీథర్ గారూ. తనను తాను నిస్సహాయురాలు అనుకునే స్త్రీ , తాను అణచివేతకు గురి అవుతున్నానని గుర్తించిన ప్రతి స్త్రీ ద్వాలి లా మారాలి అనుకుంటున్నాను. ద్వాలికి మాటలు తక్కువ.ఆలోచన ఎక్కువ. నిజానికి, మౌనంగా ఉంటేనే ఆలోచనలు క్రమపద్ధతిలో సాగుతాయి, జీవితంలో ఎదురైన ఆటుపోట్లు ఆలోచనలకు పదును పెడతాయి. పదునెక్కిన ఆలోచనలు మాటకు సూటితనం అంటిస్తాయి.. ద్వాలి విషయం లో జరిగినది అదే, తనకు భర్త వలన ఎలాగూ అన్యాయం జరిగింది, తన పల్లెకు, ్్త్్త్్త్్్్త్్త్్త్్్త్్త్్త్్్్త్్త్్త్్త్్్్త్్త్్త్్్త్్త్్త్్్ తన ప్రజలకు అన్యాయం జరగకూడదని నిశ్చయించుకుంటుంది. ఇక్కడ సరిగ్గా ఆమె తల్లి హృదయం తో ఆలోచించింది. మోతీ విషయంలో కూడా సవతి అని కాకుండా, వదిలేస్తే ఎక్కడకు పోవాలి ఆ పిల్ల అని ఆలోచించింది. ఎలా చూసినా, తీరైన ఆలోచనలు, పదునైన మాట, మృదువైన హృదయం కల మహిళ ద్వాలి. కథ వ్రాసిన సమ్మెట ఉమాదేవి గారికి, సమీక్ష వ్రాసిన మీకు అనేకానేక ధన్యవాదాలు 🙏

  • ఇప్ప పూవులాంటి కథ ,ఉర్సు పండుగలాంటి సమీక్ష,గోగుపూవులాంటి విమర్శ చేశారు.కథ విషయానికి వస్తే కథలో ఇతివృత్తం, నేపధ్యం ,కథనం బాగున్నాయి.కానీ భాషలోకొంత నేటివిటి ఉండాల్సింది.గిరిజనుల భాష,సాంప్రదాయాలను చూపడానికి కథలో మరింత అవకాశం ఉందని నా అభిప్రాయం.

    • ధన్యవాదాలు భద్రయ్య గారూ.. కథల ప్రచురణకు అవసరమయ్యే పరిమిత
      నిడివి ఎప్పుడూ నన్ను దడిపిస్తుంటుందండి. లేకుంటే మరికొంత వర్ణన, సంభాషణలు కూర్చవచ్చు..

  • ద్వాలి కథా విశ్లేషణ చాలా బాగుంది

  • కథ బాగుంది. వివవరణ ఇంకా బాగుంది. ప్రస్తుతం సమాజం లో స్త్రీ రిజర్వేషన్ దగ్గర జరుగుతున్న భర్త ల ఆధిపత్యం కళ్ళకు కట్టినట్లు ఉంది. అందరు ద్వాలి లాగా ధైర్యంగా నిలబడి తే బాగుంటుంది.

    • ధన్యవాదాలు విజయలక్ష్మీ గారూ.. కనీస విద్య, పదవి పొందాక ఇచ్చే శిక్షణ వీరికి ఆత్మ విశ్వాసం ఇస్తుందని నమ్ముతున్నాను.

  • డా: బి ఆర్.అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలను అందుకొని దళిత, గిరిజన , బహుజన
    మహిళలు రాజ్యాధికారం చేపట్టడమే కాదు దాన్ని
    నిలబెట్టుకొని ప్రజల పక్షాన నిలబడి గెలవడం ఎలాగో
    ఈ కథలోని విషయాన్ని మీరు సమీక్ష చేసిన విధానం అద్భుతమం సార్.

  • చదివాను శ్రీధర్ సమ్మెట umadevi మేడం పంపారు
    ద్వాలి పాత్ర బాగుంది ప్రస్తుత సమాజానికి అవసరం

  • కథ చదివించే విధంగా ఉంది. వస్తువు బాగుంది. కాని శ్రీధర్ గారు

    విశ్లేషించినంత లేదు.రిజర్వేషన్ల గురించి తన భావాలను చర్చించడానికి ఈ

    వేదికను ఉపయోగించుకున్నట్టనిపించింది.

    పంక్చువేషన్,స్ట్రక్చర్ల పరంగా కొంచెం శ్రద్ధ పెట్టేదుండె(రచయిత్రి)

    అనిపించింది.

    మంచి కథలను వెతికి పట్టుకుంటూ పరిచయం చేస్తున్న వెల్దండి గారికి ,

    సమకాలీన వికృతులపై సమ్మెట కథనాలు చేస్తున్న ఉమాదేవి గారికి

    అభినందనలు!

    • ధన్యవాదాలు సత్యనారాయణ గారూ… కథ రాసినప్పుడు ద్వాలీ.. ఆమె చుట్టూ వున్న రకరకాల పరిస్థితులను ఎదుర్కొన్న విధానం మాత్రమే మనసులో ఉన్నది సర్. అందులో రిజర్వేషన్లు కూడా ఒక అంశం.. మీరు అన్న స్ట్రక్చర్ గురించి నన్ను నేను సమీక్షించుకుని జాగ్రత్త పడతాను.మరోసారి ధన్యవాదాలు.

  • నా కథ ద్వాలి నిఎంచుకుని మంచి సమీక్ష చేసి నా సాహిత్య యానాన్ని వెన్ను తట్టి ప్రోత్సహించిన వెల్దండి శ్రీధర్ గారికి … ప్రచురించిన సారంగకు .. ధన్యవాదాలు

  • ధన్యవాదాలు పద్మ గారు..కేవలం ఈ రిజర్వేషన్ల వల్ల మారు మూల తండాల్లాలో స్త్రీలలో రాజకీయ చైతన్యం రావడాన్న ప్రత్యక్షంగా గమనిస్తున్నాను. ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి పంచాయితీలో పాదం మోపుతున్న వీళ్ళు.. సంతకాలు చేసే యంత్రాల్లా కాక నిర్ణయాధికారాల వయిపు.. స్వతంత్రత వైపు అడుగులు వేస్తున్నారు…. ప్రారంభదశలో తడబడ వచ్చు.. పొరబడనూ వచ్చు.. ఖచ్చితంగా రేపు రాజ్యమేలేది మాత్రం మహిళలే అన్న ఆశాభావం మాత్రం నాకు పల్లెల్లోనూ తండాల్లోనూ మాత్రమే కనపడుతుంన్నది.

  • ధన్యవాదాలు యాకమ్మ గారు.. కథ రాసిన ఇన్నాళ్ళకు ఒక మంచి సమీక్ష వలన ద్వాలి కథా.. కథ చుట్టూ వున్న పరిస్థితులు ఆమె నిర్ణయం చర్చించి బెడుతున్నాయి… అందుకు శ్రీధర్ గారికి మరీ మరీ ధన్యవాదాలు..

  • డెబ్బై ఏళ్ల స్వాతంత్య్రం నేపథ్యంలో ,గిరిజన తెలంగాణాలో ఇప్పుడిప్పుడే కొత్త చిగురాకులా కనిపిస్తున్న మార్పుకి ద్వాలి ప్రతిబింబం .దుర్వ్యసన పరుడైన భర్త వలన తనకు జరిగిన అన్న్యాయాన్ని సహించింది కానీ సమాజము బలి కాకూడదనేది ద్వాలి యొక్క సామజిక బాధ్యతను తెలియజేస్తుంది .రచయిత కు అభినందనలు .

  • భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సారాలు పూర్తిచేసుకున్న పట్టణ ప్రాంతాల్లో నే అక్షరాస్యత, ఆర్థిక వ్యవస్థ లో పెద్దగా మార్పు రాలేదు. అలాంటిది గ్రామీణ, మరి ముఖ్యంగా ఆదివాసీ గిరిజన, ప్రాంతాల్లో విద్యుత్, నీటి వనరులు సరిగా లేని ప్రాంతాల పరిస్థితులు చెప్పనక్కర్లేదు. ఇవ్వన్నీ తెలిసిన రచయిత్రి సమ్మెట ఉమాదేవి గారు వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చెయ్యడం, స్త్రీల పక్షాన నిలబడి ఈ ధరణి పై, మగువలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూనే, ఇంకా వారీ బ్రతుకులో రావాల్సిన మార్పుల గురించి ఓర్పుగా తన కథలలో తెలియజేస్తున్న రచయిత్రి కి ధన్యవాదాలు.
    కథ మొత్తం చదవ కున్న, మూల కథకు ఏ మాత్రం భంగం కలిగించని శ్రీధర్ సార్ సమీక్ష ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. తెలంగాణ కథలకు కమ్మని కబు లా, రక్తం వేడెక్కించే, లోతైన అలోచలు చేసే మంచి కథలను ఎంపిక చేసి అందిస్తున్న శ్రీధర్ సార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు.

  • కథ , విశ్లేషణ రెండూ బాగున్నాయి. మీకు ,రచయిత్రి కి అభినందనలు

  • పూర్తి నిడివి గల కథను చదవాలనిపించేలా రాసారు సమీక్షను. ఇటువంటి ఇతివృత్తం ఎంచుకోవడమే సాహసం. ఇప్పటికి తండాల్లో నే కాదు పట్టణప్రాంతాలలో కూడా ఈ కుల జాడ్యం, అథి కుల కంపు పోవటంలేదంటే నమ్మండి. ఏ శేనిటైజరు లేదంటే వొట్టు శుభ్రంగా కడుగుటకు… అందుకనే రిజర్వేషను కొనసాగింపుకు మరోకారణం.
    సమాజాన్ని మేల్కోల్పే రచనలు ఎన్నివచ్చిన అణగారినవర్గాల పై వైషమ్యాలు పెచ్చురేగిపోతున్నాయి ఈ ఆథునికం అనుకునేరోజులలోనైనను.
    మంచి పఠిమతోకూడిన రచన…అని అర్థంచేసుకున్నాం. మంచివిశ్లేషణను అందించారు.. సమీక్షకులు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు