తెలుపూ, నలుపు వెనక

రంగుల్లో ఆధిపత్య వాదం  ఉంది, బిజినెస్ ఉంది.

మధ్య కలర్ ఫొటో అని ఒక సినిమా వచ్చింది. నలుపు, తెలుపుల రంగుల వెనకున్న కుల, ఆర్థిక అంతరాలను చర్చించే ఓ ప్రయత్నం. సినిమా సంగతి ఎలా ఉన్నా రంగులలో గొప్ప మర్మం ఉంది.

తెలుపు, నలుపు వెనక ఆధిపత్య భావజాలమే కాకుండా బిజినెస్ ఉంది.

రేసిజం గురించి మనందరికీ తెలిసిందే. తెలుపు రంగు ఆధిపత్యానికి నిదర్శనం. అది చాప కింద నీరులా మెల్లగా ప్రవహించి తెలుపుకి గొప్ప మార్కెట్ తీసుకొచ్చింది.

మనుషుల్లో ఉన్న రేసిజాన్ని మార్కెట్ అందిపుచ్చుకుంది. 90లలో ఫెయిర్ అండ్ లవ్లీ వాడని కాలేజీ అమ్మాయిలు అరుదు. తెల్లని చిన్న ట్యూబ్‌లో అందుబాటు ధరలకే లభించేది. ఇది మార్కెట్లో బాగా అమ్ముడుపోవాలంటే తెల్లదనానికి ఓ క్రేజ్ ఉండాలి. తెల్లటి అమ్మాయిలను సినిమా హీరోయిన్లుగా పెట్టుకోవాలి. వాళ్ల రంగుని ఆశ కలిగించేట్టు చూపాలి. 80ల వరకూ బాలీవుడ్‌లోనూ, సౌత్ సినిమాల్లో కూడా నల్లటి అమ్మాయిలు హీరోయిన్లుగా ఉండేవారు. 90లకొచ్చేసరికి తెల్లటి అమ్మాయిలు సినిమాల్లోకొచ్చారు. తీసుకొచ్చారు. వాళ్లకే ప్రిఫరెన్స్ ఇచ్చారు.

సినిమాలకు, సమాజానికి టూ వే రిలేషన్షిప్ ఉంటుంది. సమాజంలో చలామణీ అయ్యే మెజారిటీ భావజాలాన్ని సినిమాలు మన నెత్తిన రుద్దుతాయి. దృశ్యానికుండే శక్తివల్ల సినిమాల్లో చూపించేది ప్రజల బుర్రల్లోకి దూసుకుపోతుంది. సినిమా సరదాగా చూస్తాం, రెండు గంటలయ్యాక మర్చిపోతాం అనుకుంటాంగానీ అది మెదడు లోపలి పొరల్లో ముద్రలు వేస్తూ ఉంటుంది. మనకే తెలియకుండా మనమీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇలా ఈ వలయంలో పడి మళ్లీ..మళ్లీ నైతిక విలువలు, మెజారిటీ భావజాలాలు సమాజంలో పైకి వస్తూనే ఉంటాయి.

ప్రతీ సినిమాలో తెల్లటి అమ్మాయి కనిపిస్తుంటే తెలుపు మీద కోరిక పెరుగుతూ ఉంటుంది. ఫలితంగా 90ల తరువాత విశేషంగా మార్కెట్లోకొచ్చిన క్రీములు, పౌడర్లు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసాయి.

సినిమాలకూ, సమాజానికి ఉన్న సంబంధంలాంటిదే. బిజెనెస్‌కు, ఆధిపత్యభావజాలానికి ఉన్న సంబంధం. రేసిజం ఉంది కాబట్టి బిజెనెస్ దాన్ని అందిపుచ్చుకుంది. బిజినెస్ జరుగుతోంది కాబట్టి రేసిజానికి ప్రోత్సాహం వస్తోంది.

మళ్లీ ఇక్కడ పురుషస్వామ్యం గురించి కూడా చెప్పుకోవాలి. ఆధిపత్య భావజాలమంటే అన్ని కోణాల్లోనూ, అన్నివైపులనుంచీ ఉంటుంది. అమ్మాయిలే తెల్లగా ఉండాలి. పడక దగ్గర అందంగా కనిపించాలి. అబ్బాయిలు నల్లగా ఉన్నా ఫరవాలేదు. నాకు తెలిసిన ఒకావిడ తెల్లగా ఉన్న కోడలు కావాలని, తన కొడుక్కి 30-40 సంబంధాలు కాదనుకుని తెల్లగా ఉన్న ఒక పిల్లని చేసుకున్నారు. ఆడపిల్లలకి ఎలాగూ ఛాయిస్ లేదు.

నల్లగా ఉన్నవారిని కర్రోడా/కర్రిదానా, బర్రోడా/బర్రెదానా అని పిలవడం, పిలిస్తే నవ్వేసుకోవడం మనకే మాత్రం తప్పనిపించదు.

దీనికి సాహిత్యం మరో రకంగా వంత పాడుతూ ఉంటుంది. కథల్లో పచ్చటి లేత తెల్లటి మేని ఛాయతో ఉండే పార్వతమ్మ, అన్నపూర్ణమ్మ, సుందరమ్మ ఉంటారు. నల్లగా ఉండే మంగి, రంగి, పైడి ఉంటారు. కథలు చదివినప్పుడు నాకనిపిస్తూ ఉంటుంది. ఎందుకు శరీర ఛాయల గురించి మాట్లాడతారు. అవి వర్ణించకుండా రాస్తే మాత్రం కథకేం లోపం వస్తుంది అని? ఈవిడది ఈ కులం, ఆవిడది ఆ కులం అని చెప్పకుండా ఇలా రంగుల ద్వారా కులాల భేదాన్ని చూపిస్తుంటారని చాలారోజులకు అర్థమయ్యింది.

వీటన్నిటి వెనుకా ఆర్థిక కారణాలున్నాయి. 90లలో మనం క్లోజ్డ్ ఎకానమీ నుంచీ ఓపెన్ ఎకానమీకి మారాక, లిబరలైజేషన్ మూలంగా ఆర్థికంగా ఎదగడం మొదలుపెట్టాం. ప్రపంచం మనవైపు చూసింది. దాని ఫలితమే వరుస మిస్ వరల్డ్‌లూ, మిస్ యూనివర్స్‌లూ ఇండియానుంచీ వచ్చారన్నది ఒక వాదన. వాటి వెనకలే బ్యూటీ క్రీములు, తెలుపును పెంచే పౌడర్లు….బ్యూటీ ప్రపంచం మన దేశంలో మార్కెట్ తెరిచింది. దీనిమీద బోలెడన్ని సిద్ధాంతపరమైన అధ్యయనాలూ, ఎంపిరికల్ స్టడీస్ కూడా ఉన్నాయి.

మార్కెట్ ఎప్పుడూ విస్తరించడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. రెండు దశాబ్దాల తరువాత, ఆడవాళ్ల ప్రపంచాన్ని ఫెయిర్‌నెస్ క్రీములు పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత ఫెయిర్‌నెస్ పిచ్చి మగవాళ్లకు కూడా అంటించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మగవాళ్ల కోసం ప్రత్యేకమైన ఫెయిర్‌నెస్ క్రీములు మార్కెట్లోకి రావడం మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడు ఈ ఫెయిర్‌నెస్ క్రీముల గురించీ, రేసిజం గురించీ అవగాహన , చైతన్యం పెరిగి ఫెయిర్ అండ్ లవ్లీని గ్లో అండ్ లవ్లీగా మార్చడం, తమన్నా, అభయ్ డియోల్‌లాంటివారు ఫెయిర్‌నెస్ క్రీముల ప్రకటనల్లో నటించం అని చెప్పడం…పరిణామం ఇంకా మొగ్గ దశలోనే ఉంది. అయితే, మార్కెట్ ఊరుకోదు. మనుషుల్లో ఆధిపత్య భావజాలం ఉన్నంతవరకూ బిజినెస్ దాన్ని అంది పుచ్చుకుంటూనే ఉంటుంది..మరో రూపంలో! బిజినెస్ జరుగుతున్నంత కాలం ఆధిపత్యభావజాలం పచ్చగా కొత్త చిగుర్లు వేస్తూ ఉంటుంది.

పింక్, బ్లూ…మరో రకమైన రంగుల బిజినెస్… ఆడపిల్లలకు పింక్, మగపిల్లలకు బ్లూ బట్టలు వెయ్యడం వెనక కొన్ని ఆసక్తికరమైన సిద్ధాంతాలు, అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఈ కలర్ కోడ్ అనేది 19వ శతాబ్దం మధ్యలో ఆరంభమయ్యిందన్నది ఒక సిద్ధాంతం. పశ్చిమ దేశాల్లో 1920లలో పింక్ కలర్ మగపిల్లలకూ, బ్లూ కలర్ ఆడపిల్లలకూ వాడేవారని కొన్ని పరిశీనల్లో తేలింది. ఎందుకంటే పింక్ కాంతివంతంగా, చురుకుగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఉంటుంది కాబట్టి అది మగపిల్లలకని, బ్లూ కలర్ కొంచం అణుకువగా, లొంగి ఉండేలా డల్‌గా ఉంటుంది కాబట్టి అది అమ్మాయిలకని ఒక ట్రెండ్ నడిచేది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమ్మయిలకు పింక్, అబ్బాయిలకు బ్లూ కలర్ అనే పద్ధతి మొదలయ్యింది. అయితే 1960లలో స్త్రీవాద సిద్ధాంతాలు బయలుదేరడంతో రంగుల్లో లింగ బేధాలు ఉండకూడదని అందరూ ఒకే రంగు వేసుకునేవారట. 1980లలో పింక్ అమ్మాయిలకూ, బ్లూ అబ్బాయిలకు అనే ట్రెండ్ బలంగా స్థిరపడింది.

అయితే, ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కలర్ కోడ్ స్థిరపడడం వెనుక మళ్లీ మార్కెట్ కుయుక్తులున్నాయన్నది ఒక వాదన. మాస్ ప్రొడక్షన్‌కు అనుకూలంగా ఉండేలా ఆడపిల్లలందరికీ పింక్, మగపిల్లలందరికీ బ్లూ బట్టలు, వస్తువులు వాడేలా ఎంకరేజ్ చేసారాన్నది ఒక వాదన. అప్పటినుంచీ ఈ కలర్ కోడ్ పిచ్చి మెల్లిగా ప్రపంచమంతా వ్యాపించి వెర్రి తలలు వెయ్యడం ప్రారంభించింది. ఈ రంగులపై మార్కెట్ పూర్తి ఆధిపత్యం సాధించింది. చిన్న పాపాయిలకి పింక్‌లో తప్ప మరో రంగులో వస్తువులు కానీ బట్టలు కానీ దొరకవు. చిన్న బాబులకి అన్నీ బ్లూ రంగుల్లోనే దొరుకుతాయి. పుట్టగానే పాపలకి పింక్‌ బట్టలు, బాబులకు బ్లూ బట్టలు.. మరో ఆలోచన లేకుండా కొనేసి వేసేస్తున్నారు. పిల్లల్ని చూడ్డానికి వచ్చేవాళ్లు కూడా పాపలకు పింక్ బట్టలు, పింక్ వస్తువులు తేవడం ఆనవాయితీగా మారిపోయింది. ఈ పిచ్చి నగరాలనుంచీ, పట్టణాలకూ, ఇప్పుడు చిన్న టౌన్లకూ వ్యాపించింది. దీనికి పరాకాష్ట స్థాయి ఏమిటంటే…1-5 తరగతుల పిల్లలు వాడుకోవడానికి వీలుగా ఉండే స్టడీ టేబుల్స్ నాలుగే నాలుగు రంగుల్లో వస్తున్నాయి…స్పైడర్ మ్యాన్ బొమ్మలతో నీలం రంగు, బెన్ 10 బొమ్మలతో ఆకుపచ్చ, మినియన్స్ బొమ్మలతో పసుపు, బార్బీ, ప్రిన్సెస్ బొమ్మలతో పింక్ రంగు. అంటే మగపిల్లలకోసం స్పైడర్ మ్యాన్, బెన్ 10…మధ్యస్థంగా మినియన్స్, ఆడపిల్ల్లలకోసం ప్రిన్సెస్ టేబుల్. మరో రంగు మార్కెట్లో లేదు. విశాఖపట్నంలోనూ లేదు, హైదరాబాదులోనూ లేదు, ఢిల్లీలోనూ లేదు. అన్నిచోట్లా పిల్లల దుకాణాల్లో ఈ నాలుగు రంగులు డిజైన్లు మాత్రమే దొరుకుతాయి. మనకి మరొక చాయిస్ కూడా లేదు.

ఎందుకు, ఏమిటి? అని ప్రశ్నించకుండా పింక ఫర్ బేబీ గర్ల్స్, బ్లూ ఫర్ బేబీ బాయ్స్ అని మన మనసుల్లో ముద్ర వేసేసుకున్నాం. మనలో ప్రశ్నించే గుణాన్ని కూడా చంపేసి, బిజినెస్ రంగుల మీద పూర్తి ఆధిపత్యం సాధించింది. విజయవంతంగా కలర్ కోడ్‌ను మన మెదళ్లలోకి ఎక్కించేసింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 17వ శతాబ్దంలో జర్మనీలో సైనుకులకు బ్లూ యూనిఫార్మ్ మొదలుపెట్టడానికి కారణాలు ఏంటంటే…ఆసియా, ఆఫ్రికాల్లో మాత్రమే దొరికే ఇండిగోఫెరా అనే మొక్కనుంచీ సంగ్రహించే నీలం రంగు, యూరోప్ మార్కెట్లోకి ప్రవేశించి ఆధిపత్యం చాలాయిస్తుందనే భయంతో యూరోపియన్లు తయారుచేసే నీలం రంగు (పాస్టల్ కలర్) మార్కెట్‌ను కాపాడడం కోసం ఆర్మీకి బ్లూ యూనిఫాం మొదలెట్టారన్నది ఒక పరిశీలన. మళ్లీ ఇక్కడ బిజినెస్‌దే పైచేయి.

బిజినెస్ బ్రాండ్స్‌లో రంగులు…ఇదో పెద్ద సబ్జెక్ట్. కొన్ని బ్రాండ్స్ కొన్ని రంగులను ఎందుకు ఎంచుకుంటాయి….అవి వినియోగదారుల సైకాలజీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్నది పెద్ద సబ్జెక్ట్. ఉదాహరణకు ఎరుపు…మన ఎమోషన్స్‌ని ఉసిగొల్పే రంగు. ఆహరపదార్థాల బ్రాండ్స్‌, రెస్టారెంట్లకు ఎర్ర రంగు వేస్తే తినాలనే ఎమోషన్‌ని, ఆకలిని పురిగొల్పుతాయని ఒక సిద్ధాంతం. అలాగే ఆడవాళ్లకు సంబంధించిన వస్తువులు పింక్ కలర్‌లో ఉంటాయి. పర్పుల్ అంటే చాలా విలాసవంతమైన వస్తువుల బ్రాండ్. ఎందుకంటే పూర్వం పర్పుల్ రంగు సులువుగా దొరికేది కాదు. రాజులు, రాణులు మాత్రమే ఆ రంగు దుస్తులు ధరించేవారు. ఆస్తికి, విలాసానికి చిహ్నం పర్పుల్. ఇలా ప్రతీ దాని వెనుకా బిజినెస్ ఉంది.

రంగులు – సైకాలజీ….కొంతమందికి ఎందుకు కొన్ని రంగులే నచ్చుతాయి అనే అంశంలో అనేక అధ్యయనాలు ఉన్నాయి. ప్రాథమికంగా రంగులు మనలో ఎమోషన్స్ రేకెత్తించేవి. అందులో లాజిక్ ఏం ఉండదు. చాలావరకూ రంగులకు సంబంధించిన ఎమోషన్ మనలో పెంచి పోషించబడతాయి. పింక్ అంటే అమ్మాయిల రంగు అనీ, నలుపంటే అశుభం అనీ…చిన్నప్పటినుంచీ నూరిపోస్తూ ఉంటే మన మెదళ్లల్లో అవి పాతుకుపోతూ ఉంటాయి.

రంగుల గురించి ఒక చాలా ఆసక్తికరమైన వాదన చదివాను….ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా పుస్తకంలో ఒక సంవాదం ఉంటుంది.

గురువు శిష్యుడిని అడుగుతాడు..”ఆకుల రంగు ఏది?”

శిష్యుడు తడుముకోకుండా “ఆకుపచ్చ” అని చెప్తాడు.

కాదంటాడు గురువు. ఎందుకంటే…సూర్యకిరణాలు ఆకులపై పడినప్పుడు కిరణాల్లో ఉన్న ఎరుపు, ఆరెంజ్, పసుపు, నీలం, వైలెట్ రంగులను ఆకు పీల్చేసుకుంటుంది. ఆకపచ్చను మాత్రం హరించుకోదు. అంటే ఆకువైపునుంచీ చూస్తే ఆకుది ఏ రంగు? అది పీల్చుకున్న రంగులా? వదిలేసిన రంగా? ఆకు వదిలేసిన రంగు ఆకుదెలా అవుతుంది? అని.

కాబట్టి పైకి కనిపించే రంగు అసలు రంగు కాకపోవచ్చు. రంగుల్లో మర్మం తెలుసుకోవాలి….దాని వెనకుండే ఆచార వ్యవహారాలకు, సంస్కృతికి సంబంధించిన విషయాలు ఒకవైపు, బిజినెస్‌కు సంబంధించిన విషయాలు మరోవైపు. నిజానికి ఈ రెండూ ఒకవైపే ఉండి ఒకదాన్నొకటి పెంచి పోషిస్తున్నాయి. రంగుల్లో ఆధిపత్య వాదం  ఉంది, బిజినెస్ ఉంది.

*

ఆలమూరు సౌమ్య

పుట్టిన ఊరు విజయనగరం. ప్రస్తుతం దేశ రాజధానిలో మకాం. కుటుంబంలో సాహిత్యాభిరుచి ఉండడం, తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉండడం వలన చిన్నప్పటినుంచీ తెలుగు సాహిత్యం మీద మక్కువ పెరిగింది. రాయలన్న తపనతో బ్లాగు మొదలెట్టాను. NATS 2013 కోసం కొత్త కథల ఆహ్వానం చూసి మనమూ రాస్తే బావుంటుందే అనిపించి తొలి ప్రయత్నం చేసాను. "ఎన్నెన్నో వర్ణాలు" అనే కథ NATS 2013 లో ప్రచురితమయ్యింది. అదే నా మొట్టమొదటి కథ. ఆ కథను "వాకిలి" సాహిత్య పత్రికలో మలిప్రచురణ చేసారు. అప్పటినుండీ కథలు, సమీక్షలు, వ్యాసాలు, అనువాద కవితలు..అడపదడపా రాస్తూ ఉన్నాను.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆలమూరు సౌమ్య గారి రచన అర్థవంతంగా,వున్నది. బిజినెస్ ప్రమోషన్ ను క్యాపిటల్ ఎలా చేస్తుందో,గూడ్స్ కి ,ప్రచారానికి గల సంబంధం చక్కగా వివరించారు…కంగ్రాట్స్

  • తెలుపు, నలుపు వెనుక.. రంగులు గురించి, బాగా రాశారు.. సౌమ్య గారు 👍., కొన్ని తెల్సిన విషయలు ఆయిన,చదవడానికి అసక్తి కల్గించారు!

  • చాల బాగుంది. సౌమ్య గారికి అభినందనలు. ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో లైట్ పాఠం చదివినప్పటి నుంచీ నాకూ ఈ అభిప్రాయం ఉంది. మనం దేన్నయినా ఏ రంగు అనుకుంటున్నామో వాస్తవానికి అది ఆ రంగు కాదు: విబజియార్ లో ఆ ప్రత్యేకమైన రంగు ను దాచిపెట్టి మిగిలిన రంగులు చూపించడం. అంటే మనం రంగు అనుకుంటున్నది దాచిన, అణచిపెట్టిన రంగు! ఆ తర్వాత చాన్నాళ్లకు మార్క్స్ రూపం సారం విభజన గురించి చెప్పింది చదివినప్పుడు నాకు ఈ వర్ణ దృష్టిలోపం మరింత తెలిసింది. చాల అవసరమైన అవగాహన మీద దృష్టి ప్రసారింపజేసినందుకు సౌమ్య గారికి ధన్యవాదాలు.

  • తెలుపు నలుపు వెనుక బాగా విశ్లేషించారు . ఆసక్తి కలిగేలా రాశారు

  • సింథటిక్ ఇండిగో కనుక్కోవడం వలన ఇండిగో మొక్క నుండి తీసిన రంగుకు డిమాండ్ తగ్గిందని చదివాను.

  • ఈ అధ్యయనానికి ఇంకో కోణం కలుపుకోవచ్చును. మాట్రిమోనియల్ పేజీ లు చూస్తే ఉత్తర దక్షిణ భారతాలలో అందరూ తెల్లగా వుండే అమ్మాయిలే కావాలని అడుగుతారు మగపిల్లలు ఎంత నలుపైనా వాళ్ళకి తెల్లటి అమ్మాయిలేకావాలి. అక్కడ నుంచే మనకి కోడలు నలుపయితే కులమంతా నలుపు లాంటి సామెతలు పుట్టాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు