యెడింబరో: ఒక కవ్యం

నేడు మరణించి మూడు శతాబ్ధాల క్రితం పుట్టడం

లాంటిది యెడింబరో అనుభవం.

శాంతములేని లోకమంత అమరమైన శ్మశాన మాల

అంటుంది యెడింబరో

 

పెక్కింతలుగా పెరిగిపోతూ

తానే పగలగొట్టేసిన కవితగుల్ల పక్కన

పేద్ద నత్తలా పడివుంది యెడింబరో.

కావ్యపు కొన్ని కోణాలనైనా అందుకోలేని

కొన్ని టెంటికళ్ళ ఆక్టోపస్ లా

దిగాలుపడివుంది యెడింబరో.

 

కవితగా వొదగలేని, కావ్యంగా యెదగలేని

కవ్యం యెడింబరో.

కాలపు గాజుకుప్పెలో, హేమంతద్రవంలో

యీదులాడుతున్న

వెయ్యికాళ్ళ యెండ్రకాయ యెడింబరో.

 

తెలుగు ఆరు రుతువులనూ,

యింగ్లీషు నాలుగు రుతువులనూ

యెగతాళిచేస్త్తూ యెడింబరోలో

రెండే రుతువులు రాజ్యం చేస్తాయి:

చలికాలమూ, పండు చలికాలమూ.

సూర్యుడీవూరికి వెన్నుచూపెట్టి  పారిపోయాడు

చంద్రుడీవూరిని చూడలేక మబ్బులవెనక దాక్కున్నాడు.

 

వీళ్ళు సిమెట్రీల హీటర్లతో చలికాచుకుంటూ

రాత్రుల్ని పగల్లుగా వెలిగించుకుంటారు

కెతెడ్రల్ల తలుపుల వురికొయ్యలకానుకుని

బాగ్ పైపర్ పాటల విషాదజీరలకు

పరవశంగా తలలూపుతారు.

కోతినుంచీ మనిషి పుట్టాడని తెలుసుకునేందుకు

యెడింబరో కోటనుంచీ కొత్త అసెంబ్లీ వరకూ

రాయల్ మైల్లో నడిస్తేచాలు.

జాన్ నాక్స్  యింటిపక్క,

యెడింబరో విశ్వవిద్యాలయ గోడలకానుకున్న మసీదు

మతాల మర్మమేదో హజాయిస్తోంది.

 

కాతలిక్కులూ, ప్రొటెస్టంట్ల కురుక్షేత్రంలో

హిందూమందిరం భగవద్గీత భోధిస్తోంది.

సెటెలైట్ గ్రామాల అభద్రతకూ,

నడివీధుల తెంపరితనానికీ

యూనివర్సిటీ లైబ్రరీ పబ్బులో సంధి కుదురుతోంది.

శివార్ల కవతలి మైదానాల్లోని

గొర్రెలమందలవెనకెళ్ళిపోయిన రాబర్ట్ బర్న్స్  కోసం

రీజెంట్ రోడ్డు మాన్యుమెంటు గొంతెత్తి పిలుస్తోంది.

వూరిమధ్యలో వాల్టర్ స్కాట్ను

కాల్పనిక సాలెగూడు బంధించేసింది.

పాత యెడింబరో సంధుల్లో కానన్ డయల్

యింకా షెర్లాక్ హోం కోసం గాలిస్తూనే వున్నాడు.

గమ్యాలులేని నిరంతర యాత్రికులతో  ప్రిన్సెస్ స్ట్రీట్

ప్రపంచపు నమూనాల బతికినకాలేజీ గా తయారయింది.

చలికి గడ్డగట్టుకుపోయిన యిండ్లను

విస్కీ ఫాక్టరీల  వేడి గాలులు కరిగిస్తున్నాయి

ట్రంకుపెట్టెతో వచ్చిన బారిష్టరు  పార్వతీశం  కోసం వెతికేవాళ్ళకు

హోం డెలివరీ డబ్బాలతో

సైకిళ్ళపైన తిరిగే తెలుగు కుర్రాళ్ళే కనబడతారు.

 

తెలుగురాష్ట్రాలు లోతియన్ బస్సుల కం పెనీని

తమ ఆర్టీసీలను లీజుకు తీసుకోమని కోరుతున్నాయి

యెడింబరో కౌన్సిల్లో

పునశ్చరణ తరగతులకు వెళ్ళకతప్పదని

ఫెయిలయినవాళ్ళను

హై లాండ్ మీదుగా గ్రీన్లాండ్ కు తరలిస్తారని

భారతదేశపు బడా రాజకీయ నాయకులు భయపడుతున్నారు.

 

మిస్టర్ హైడ్స్   సమాధి పైన డాక్టర్ జెకిల్ రాసిన అబిచ్యురీ గీతం యెడింబరో

షేక్స్ పియర్ రాయడం మరచిపోయిన అబ్సర్ద్ డ్రామా లండన్

టొబియాస్ స్మాలెట్  రాసి పారేసిన అసంపూర్ణ పికరస్క్ నవల యెడింబరో.

 

*

కవితలో ప్రస్తావించిన పేర్లు:

  1. జాన్ నాక్స్(John Knox): 16 వ శతాబ్ధానికి చెందిన కరుడుకట్టిన ప్రొటెస్టంటు మతాధికారి. అప్పటి స్కాట్లాండు రాణి కాతలిక్కు మేరీ స్టువర్ట్ తో డీకొని ఆమెకు మరణశిక్ష పడేవరకూ నిద్రపోని వాడు.
  2. రాబర్ట్ బర్న్స్( Robert Burns): యింగ్లీషు రొమాంటిక్ యుగానికి ఆధ్యుడుగా గుర్తించే 18 వ శతాబ్ధపు రాబర్ట్ బర్న్స్ ను స్కాట్లాండ్ ప్రజలిప్పటికీ తమ జాతీయకవిగా గౌరవిస్తారు
  3. సర్ వాల్టర్ స్కాట్ ( Sir Walter Scott): 18 అ శతాబ్ధపు వాడైన స్కాట్ ను స్కాట్లాండ్ వాళ్ళంతా తమ మహోన్నత సాహిత్యకారుడిగా గౌరవిస్తారు. చారిత్రిక నవలారచనకు మూలపురుషుడైన స్కాట్ కు యెడింబరో నగరపు ప్రధానకూడలిలో అతిపెద్ద జ్ఞాపకమందిరం కట్టారు. ఆయన మరణించిన అయిదేళ్ళ తర్వాతస్కాట్లాండ్ లోని మరో ప్రధాన నగరం గ్లాక్సో లో 80 అడుగుల స్థంభం పైన ఆయన పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టించారు.
  4. సర్ ఆర్థర్ కానన్ డయల్ (Sir Arthur Conan Doyle): 20 వ శతాబ్ధపు కానన్ డయల్ డిటెక్టివ్ నవలా రచయితగా ప్రపంచ ప్రసిద్ది పొందాడు. ఆయన సృష్టించిన షెర్లాక్ హోంస్ పాత్ర అజరామరమైంది.ఆయన యెడింబరోలోనే పుట్టి పెరిగాడు.
  5. బారిష్టరు పార్వతీశం: మొక్కపాటి నర సిం హ శాస్త్రి గారి బారిష్టరు పారతీశం నవలలో పార్వతీశం యెడింబరో కొచ్చి యూనివెర్సిటీలో మూడేళ్ళు చదువుకుని బారిష్టరు డిగ్రీ తెచ్చుకుని తిరిగి యిండియా కెళ్తాడు.అది దాదాపుగా శతాబ్ధం కింద జరిగిన సంగతి.
  6. డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్(The Strange Case of Jekyll HydeDr. Jekyll and Mr. Hyde),:.పగటిపూట సాత్వికుడైన డాక్టర్ జెకిల్ రాత్రుల్లో మిస్టర్ హైడ్ అనే నరరూప రాక్షసుడుగా మారే వింత కథను నవలగా రాసినవాడు ఆర్ యెల్ స్టీవెన్సన్ (Robert Louis Stevenson). 19 వ శతాబ్ధం లో యెడింబరోలో పుట్టిన యీ మహారచయిత మరో నవల ట్రెజర్ ఐలాండ్ కూడా ప్రసిద్దమైనదే.
  7. టొబియాస్ స్మాలెట్ (Tobias Smollett): 18 వ శతాబ్ధపు తొలి దశాబ్ధాల్లో యెడింబరో దగ్గరి చిన్న గ్రామం లో పుట్టిన స్మాలెట్ నవలాప్రక్రియకు స్థిరత్వాన్ని చేకూర్చిన మహా నవలాకారులు నల్గురిలో ఒకడు. ఆయన రాసిన రొడరిక్ రాండాం, హుంఫ్రీ క్లింకెర్, పెడిగ్రీ పికెల్ మొదలైన పికరెస్క్(Picaresque) నవలలు కొత్త దారుల్ని వేశాయి. పికరో అంటే అనాధ అని అర్థం. అమాయకులూ, నిర్ధనులూ అయిన మామూలు వ్యక్తుల అనుభవాల్ని, హాస్యవ్యంగ భరితంగా చెప్పేవే  పికరెస్క్ నవలలు.

మధురాంతకం నరేంద్ర

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు