మెట్రో ముఖాల ముసుగు తీసి…

నగరమంటే విద్యుత్‌ లైట్లు, మెట్రో ట్రైన్లు, ఫ్లైవోవర్లు, అందమైన అమ్మాయిలు, క్యాబ్‌లు, షాపింగ్‌ మాల్సే కాదు. నిత్యం రాచపుండులా సలపరం పెట్టే ఒక నిత్యనూతన గాయం.

నిజంగా ఇవి నగరాన్ని కాచి వడబోసిన బతుకు శకలాల కథలు. తెలుగు కథ మూస ధోరణిని బద్దలు  కొట్టిన కథలు. శిల్ప పరంగా ఎంతో పరిణతి సాధించిన కథలు. ‘‘ఇవి మనుషులు నిండిన కథలే తప్ప పేర్లు నిండిన కథలు  కావు. ఈ కథలో పాత్రలకు పేర్లు లేవు. కథా రచనలో నామవాచకాలు లేకపోతే సర్వనామాలు ముఖ్యమవుతాయి. అతడు/ఆమెతో కథ నడపాల్సి వస్తుంది.’’ కాని ఈ కథల్లో అతడు/ఆమెను కూడా క్రమేపి పరిహరించడం కనిపిస్తుంది. సంభాషణకు దాదాపు కోట్స్‌ వాడలేదు. ఇదొక కొత్తదనం.  తెలుగు కథ నగర జీవితాన్ని పట్టించుకోవాల్సినంత పట్టించుకోలేదు. ఆ లోటును భర్తీ చేయడానికి పుట్టిన కథలు. డా. పసునూరి రవీందర్‌ ‘అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా’ పేర నగరపు జీవితపు దళిత కోణాన్ని ఆవిష్కరిస్తే మహమ్మద్‌ ఖదీర్‌బాబు రాసిన ఈ ‘మెట్రో కథలు’ నగర జీవితంలోని అనేక కోణాల్ని పట్టిచూపుతాయి. ఇవి తెల్లకాగితాల నుంచి పుట్టిన కథలు కావు.

నగరపు ‘కాలుష్యం’ నుంచి పురుడుపోసుకున్న కథలు. నగరపు చెరకు మిషన్‌లో నలిగి గిలగిలా కొట్టుకుంటున్న మనిషి అసహాయత నుంచి ఉద్భవించిన కథలు. ఒక సంఘర్షణ, ఒక తొక్కులాట నుంచి ఊపిరిపోసుకున్న కథలు. ఒక్కో కథ నగరపు ఒక్కో ముఖాన్ని చూపుతుంది. ఈ అన్ని ముఖాలు కలిసి నగరపు వికృత రూపం, సాలెగూడులో చిక్కుకుపోయి విలవిల లాడే ఒక సగటు మనిషి నొప్పి మన మనసుకు తాకుతుంది. ఖదీర్‌బాబు రాసిన ఇంతకు ముందరి కథలకన్నా ఈ కథలు చాలా ప్రత్యేకమైనవి. గాఢతను, పెనుగులాటను నేరుగా పాఠకుడి గుండెలోకి ఇంజెక్టు చేసే కథలివి. నగరాన్ని ఎన్నో ఏండ్లు పరిశీలించి రక్తంలోకి ఒంపుకుంటే కాని రాయలేని కథలు. ఈ అన్ని కథలను స్త్రీకోణం నుండి చూస్తే ఈ కథల ఆత్మ మన ఆత్మకు తగులుతుంది.

‘‘నగరం ఒక క్యారెక్టర్‌. నగరంలో స్త్రీ ఇంకా ముఖ్యమైన కేరెక్టర్‌. ప్రతి ఫ్లాట్‌లో పవర్‌ పోతే ఇన్వర్టర్లు, అపార్ట్‌మెంట్లకు జనరేటర్లు ఉంటున్నాయి. వెలుతురులో చూస్తున్నాం అనుకుంటున్నాం. కాని స్త్రీలను సరిగానే చూస్తున్నామా? నాలుగు గోడల మధ్యన చీకటి గుయ్యారం వంటి అంతరంగంలో ఉడుకుతున్న అలోచనా ధార, చువ్వను బిగించి పట్టుకున్న వేళ్లలో నిండిన నిస్పృహ, మర్యాదకరమైన పతనం, పతనంలో కూడా కాపాడుకోగలిగిన సంస్కారం, రోదనలా వినిపించే నవ్వు, అగోచర మంటలంటుకుని ఉన్న కుచ్చిళ్లు, భాస్వరాల  కొంగుముడులు, సలపరించే వక్షోజాలు, నెరిసిన వెంట్రుకల తపోతల నిస్సహాయమైన మూలుగు… ఒక నాగరికతలో ఒక కాలపు శాంపిల్‌ కథలు’’ ఇవి. మగజాతి ఎప్పుడైనా స్త్రీని పూర్తిగా అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకునే సరికి జీవితం ఎంతో జారిపోతుంది. మనసు ఒక ‘ఉక్కపోత’కు గురైన సందర్భంలో హృదయం పిడుచగట్టుకుని పోయిన సమయంలో ఒక ఉక్రోషంలో, దేహం సాంతం మెలితిరిగిపోయిన సన్నివేశంలో ఈ కథలు రచయిత కలం నుండి రాలి ఉంటాయి. అందుకే ఏ కథ ముగించినా మన మనసు జ్వరపీడితం అయిపోతుంది. నగరపు స్త్రీని ఎంత తరచి తరచి చూస్తేనోగాని ఈ కథలు రాయలేం. అమ్మమ్మ, సెల్ఫీ, ప్రొఫైల్‌ పిక్చర్‌, నిద్రాసమయం, దీదీ, షీ, టేస్ట్‌, బాచుపల్లి ఫ్లాట్‌, రూటర్‌, ప్రపోజల్‌, థ్యాంక్యూ, పెన్సిల్‌ బాక్స్‌ కథలు చదవుతుంటే రచయిత శక్తి అవగతమవుతుంది. ఇవన్నీ స్త్రీ  మనోగోళంలో రేగుతున్న తుఫానును అక్షరాల్లోకి అనువదించిన కథలు.

బ్రెస్ట్‌ కేన్సర్‌ వచ్చి స్త్రీకి ఒక వక్షోజం తీసేయాల్సి వస్తే ఎంతో క్షోభ మిగుతుంది. సర్జరీ చేసి తొలగించబోతున్న స్తనాన్ని ‘సెల్ఫీ’ తీసి భర్తకు పంపిస్తుంది ఆమె. అతడు దాన్ని చూసి ఫోన్‌చేసి ఎందుకొచ్చింది? అని అడిగాడు. ఏమో నాకేం తెలుసు అని, కొద్ది మౌనం తరువాత ‘‘నువ్వెప్పుడైనా నాతో మాట్లాడుతూ  ఉంటే వచ్చి ఉండేది కాదేమో. నన్ను దగ్గరకు తీసుకుని ఉంటే వచ్చి ఉండేది కాదేమో. ముద్దుపెట్టినా వచ్చేది కాదనుకుంటా. నే..నేను వస్తున్నాను. వద్దు. ఏంటి నువ్వు చెప్పేది? వద్దన్నానా? పెద్దగా అరిచింది. అతడు ఏడవడం మొదలుపెట్టాడు. చాలాసేపు ఏడవనిచ్చి అంది. ఇంక చాల్లే. అయినా నిన్ను పొందాలంటే నేను ఏదైనా కోల్పోవాలా?’’ ఈ ముగింపు చదివిన తరువాత దేహం అంతా వణుకుపుడుతుంది. భర్త ప్రేమ కోసం స్త్రీ ఎంతలా అంగలార్చుకుపోతుంది. ఎందుకు అర్థం చేసుకోదు ఈ మగజాతి?.

స్త్రీ ఎంత కుదించుకోవాలి మగాడి కోసం? ఎంత కుదించుకున్నా ఇంకా ఏవో వృత్తాలు గీసి అందులో బంధించాలనే తాపత్రయం. ఎప్పుడైనా సంపూర్ణంగా హృదయంలోకి ఆహ్వానిస్తాడా? పెళ్లికి ముందు లేడిలా గంతులేసిన అమ్మాయి పెళ్లి అయి ఏళ్లు గడుస్తుంటే స్తబ్దుగా మారిపోతుంది. క్రమంగా కళ్ల కింద పెద్ద పెద్ద చారలు తేలి ఆమె ఏపాటి సంతోషంగా ఉందో ప్రకటిస్తాయి. ఆఖరికి ‘రొటీన్‌’ లైఫ్‌ నుండి దూరం జరగడానికి భర్త నుండి దూరం జరగడమో లేక భర్తనే బయటికి పంపడమో చేయాల్సిన పరిస్థితి.

నగరంలో ఒక్క రోజును దొర్లించాలంటే ఎంత చిత్రవధ అనుభవించాలి?  దీనికి తోడు ఇంటికి చేరగానే ఏదో యుద్ధం ముందరి ప్రశాంతత. క్రమక్రమంగా భార్యా భర్తల మధ్య ‘డిస్టెన్స్‌’ పెరిగిపోతుంది. చిన్న చిన్న కోరికను, సరదాలను కూడా తీర్చలేనంత ఒత్తిడి. జీవితం ఎంత ‘నల్లకాలర్‌’ లా మసిబారిపోతున్నా తప్పనిసరి బతికి తీరాల్సిందే. కాని లోకం సజావుగా బతకనిస్తుందా? ‘‘ఈ లోకం చాలా కతర్నాక్‌ది. ఇక్కడ బతకడం చాలా కష్టం. రోజూ పని చేసి నాలుగు రూపాయలు సంపాదించి పెళ్లాం బిడ్డల పొట్ట పోసి ప్రాణాలు కాపాడుకోవడం ఇంకా కష్టం. ఆ ఒక్క సంగతి నాకు బాగా తెలుసు సార్‌. అది తెలిస్తే చాలదా? వేరేవి కూడా తెలియాలా? తెలుసుకొని ఏ నెత్తిన పెట్టుకునేది నేను. అరె… బతుకుదాం అంటే బతకనివ్వరేం సార్‌. ఎలాగోలా బతుకుదాం అంటే బతకనీరేం?’’ ఇది నగరంలో ఒక సామాన్యుడి బతుకుపోరాటం. నగరాల్లో స్త్రీలు ఉద్యోగాలు చేయడం ఎంత నరకం? ఉద్యోగం చేస్తే ఒక టార్చర్‌. చేయకపోతే జీవితం చూపించే చుక్కులు మరో వైపు. చివరికి ‘నిద్రాసమయం’లో కూడా అవే ఆలోచనలు. ఎంతో అటెన్షన్‌ ఉంటే కాని ఒక రోజు ఉద్యోగం పూర్తికాదు.

నగరాల్లో పురుషులు ఎక్కడ పడితే అక్కడా ఏ చాటు లేకపోతే ఏ కారు చాటుకో, లారీ చాటుకో పోయి మూత్రవిసర్జన కానిచ్చేస్తారు. మరి స్త్రీల సంగతి? రద్దీ ప్రదేశాల్లో కిలోమీటర్లు నడిచినా పబ్లిక్‌ టాయిలెట్లు కనిపించవు. అప్పుడు ఏ స్త్రీ అయినా ఎంత నిభాయించుకోవాలి. అందుకే  చాలా మంది స్త్రీలు బయటకు వస్తున్నారంటే నీళ్లు తాగడం మానేస్తారు. ఇట్లా పోను పోను నీళ్లు తాగడమే మర్చిపోయి కిడ్నీలు చెడిపోయి దవాఖానా చుట్టు తిరుగుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారం ఏది? ‘‘ఒన్నాట్‌ ఎయిట్‌ నొక్కితే ఆంబులెన్స్‌ వస్తుంది. ఇంకేదో నొక్కితే మొబైల్‌ టాయిలెట్‌ వస్తే? అది అచ్చంగా ఆడవాళ్ల కోసమే అయితే? అందులో పని చేసే వాళ్లంతా ఆడవాళ్లే అయితే? అలాంటివి ఒక వంద కొని సిటీలో తిప్పుతూ ఉంటే? ఎవరికి చెప్పాలి ఇది…’’ మూత్రవిసర్జనకే ఇంత సినిమా. ఇక మల విసర్జనకు ఎంత పెద్ద సినిమా చూడాలో! ‘ఈ దేశంలో ఆడవాళ్లు చాలా వాటికి ఏడుస్తున్నారు. దీనికీ ఏడిపిస్తూ ఉన్నారు.’’ ఏ ప్రభుత్వాలకైనా ఇంత పెద్ద విశాలమైన ఆలోచన ఉంటుందా?! ఈ ‘షీ’ కథ చదివితే డా. షాజహాన రాసిన ‘సండస్‌’ కథ గుర్తుకు వస్తుంది.

కనీసం బతకాలంటే ఎన్ని వస్తువులు కావాలి? ఎన్నో కావాలి. డి మార్ట్‌లు, వాల్‌మార్ట్‌లు, ‘మెట్రో’లు, బిగ్‌బజార్లు వచ్చాక, మనిషికి వస్తు సంస్కృతిని ఒంటికి ఎక్కించాక మధ్య తరగతి చాలా పెద్ద కంపనకు గురైంది. ఇన్ని వస్తువులు లేకుండానే మనం బతకును ఈడ్చుకొస్తున్నామా? ‘‘మనం బతుకుతున్నది అన్యాయమైన బతుకు కదా. అత్యాశ కాదండీ మామూలు ఆశ కూడా కాదు. కనీస కోరిక. చిన్న ఇల్లు…అవసరమైన మంచి వస్తువులు.. ఆ ఖర్మకు కూడా గతి లేకపోతే కనీసం కాలంతో పాటు కలిసి నడుస్తున్నామనే ఆనవాళ్లు… అవీ లేకపోతే ఏం బతుకండీ ఇదీ… దరిద్రమైన బతుకు…’’ అని కుమిలి కుమిలి చస్తోంది.

సెల్‌ ఫోన్‌ ఎన్నో కుటుంబాల్లో చిచ్చుపెడుతోందని ఎన్నోమార్లు రుజువైంది. ఎన్నో జీవితాలు కడతేరిపోయాయి కూడా. అయినా మనిషి మారడు. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మగవాళ్లయితే కనీసం పెళ్లాం ఇవాళ ఏ చీర కట్టుకుందో కూడా గమనించే స్థితిలో లేరు. ‘‘డబ్బులు వస్తున్నాయి అందరికీ అంతో ఇంతో. ఇల్లు  చూశాం. కారు కొన్నాం. అవసరానికి మించి మెట్రోస్టోర్లకు తీసుకెళ్లి వెచ్చాలు తెచ్చి పడేస్తున్నాం. ఇంకా ఏం కావాలి ఆడముండలకి అని అలుసు. వంట చేసుకుంటూ పిల్లల్తో గసపోసుకుంటూ, ఆ మిగిలిన కాసేపు రొచ్చు సీరియళ్లలో కూరుకుపోతే అమ్మయ్యా అని మీ పనుల్లో మీరుంటారు. అంతేగా? అదేమని అడిగితే ఇంట్లో ఉండేదానివే కదా అంటారు.’’ ఇదీ ఈ దేశంలో సగటు కుటుంబాల తీరు.

ముందుమాటలో రచయితే చెప్పుకున్నట్లు కథలు రాయాంటే చాలా శక్తి కావాలి. ఇలాంటి కథలు రాయాలంటే  ఎంతో నేర్పు పరిశీలనా శక్తి కావాలి. ఇందులో చాలా కథలు చాలా చిన్నవి. ‘నిండుగా ఫలాలు కాచే శక్తి ఉన్నప్పుడు పొట్టి వంగడం అయితే ఏమిటి?’ అని రచయిత ప్రశ్న. ‘జీరోబ్లడ్‌’, ‘సలికోటు’ కథలు చదివితే హృదయం కలచివేస్తుంది. ఆకలి, పేదరికం మనిషిని ఎంత హింసిస్తాయో ఈ కథలు చెప్తాయి. రచయితే అన్నట్టు ‘సలికోటు’ కథ మళ్లీ చదవలేం. దీన్ని చదవడానికి చాలా గుండె నిబ్బరం కావాలి. అపార్ట్ మెంట్‌ కల్చర్‌ రావడంతోని మనిషి పూలకుండీలోని మొక్కలా మారిపోతున్నాడు. ఎంతో స్వేచ్ఛగా, ఎంతో విశాలంగా మసలాల్సిన మనిషి తనను తాను గదిలో బంధించుకొని తలుపు మూసుకుంటున్నాడు. ఇందులోని చాలా కథలు కేవలం హైదరాబాద్‌ నగరంలోనే కాదు ఏ మెట్రో నగరంలోనైనా జరగడానికి ఆస్కారమున్న కథలు. పెన్సిల్‌ బాక్స్‌, నిద్రాసమయం, సలికోటు, థ్యాంక్యూ, ఉడ్‌వర్క్‌ కథలు ఎక్కడైనా జరగొచ్చు. నగరాల్లోనే జరగాలనే రూలేం లేదు. ఇవి ఏ ప్రాంతంలోనైనా జరగడానికి వీలున్న కథలు.

నగరమంటే విద్యుత్‌ లైట్లు, మెట్రో ట్రైన్లు, ఫ్లైవోవర్లు, అందమైన అమ్మాయిలు, క్యాబ్‌లు, షాపింగ్‌ మాల్సే కాదు. నిత్యం రాచపుండులా సలపరం పెట్టే ఒక నిత్యనూతన గాయం. ఎన్ని కోణాల్లో చెప్పినా ఇంకా ఎన్నో కోణాలు మిగిలే ఉంటాయి. ఆధునిక జీవితం ఎంత సంక్లిష్టంగా ఉందో ఈ కథలు కొంత మేర చెప్పాయి. కానైతే ఈ దిశగా ఇదొక గొప్ప అడుగుగానే భావించాలి. నగరాల్లో మనిషి మానసిక సంఘర్షణ అర్థం కావాంటే ఇలాంటి కథలు చాలా రావాలి. దేశ జనాభాలో 70 శాతం పల్లెల్లోనే ఉన్నా నగరాల్లో జీవిస్తున్న మిగిలిన 30 శాతం మంది ప్రజకున్నంత జీవన సంఘర్షణ వాళ్లకు లేదు. ఈ కథల ద్వారా ఖదీర్‌బాబు ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా మారిపోయాడు. కథకులు కాసేపు పల్లెలు, వ్యవసాయం, కుల, మత, ప్రాంత వివక్షను మర్చిపోయి నగరాల్ని కూడా పట్టించుకోవాలని, ఇక్కడి మనుషుల  జీవితపు మలుపులను కథీకరించాల్సిన అవసరముందని ఈ కథలు చెప్తున్నాయి. తెలుగు కథా సాహిత్యంలో ఈ కథలు నియాన్‌ లైట్లలా మెరిసిపోయే కథలు. దీపం కింది చీకటిని పట్టించుకున్న కథలు. నగర  మానవుడి అంతరంగ కథలు. నగరం ఉన్నంత కాలం  నిలిచిపోయే కథలు.

*

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి సమీక్ష శ్రీధర్ ! చానాళ్ళుగా నేను రాద్దామనుకుంటూనే బద్దకించా. ఖదీర్ ని చక్కగా అనువదించారు. ఖదీర్ నగరం ఆత్మని పట్టుకుంటే మీరు అతని ఆత్మని పట్టుకున్నారు. Well done, keep going.

  • చక్కని సమీక్ష శ్రీధర్….

  • Super అన్న
    బాగా రాసారు.
    చక్కని, చిక్కని విశ్లేషణ.
    ఖదీర్ గారి నగర స్త్రీల ఆత్మ ఆవిష్కరణ.
    ఇద్దరకీ అభినందనలు.

  • అవును సార్. తెలుగు కథకులు నగరంలోకి తొంగి
    చూడాల్సిన అవసరం ఉంది. చాలా చక్కని సమీక్ష

  • క‌థ‌కులు ఎక్కువ‌గా గ్రామీణ నేప‌థ్యాల నుండి రావ‌డం వ‌ల్ల తెలుగు క‌థ‌ల్లో ఆ జీవిత‌మే ఎక్కువ‌. కానీ, న‌గ‌రం పురా వాస‌న‌ల్నివ‌ద‌ల‌ని ఊడ‌ల‌మ‌ర్రి. దీన్ని అర్థం చేసుకోవ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌డుతుంది. ఉరుకుల ప‌రుగుల జీవితంలో ప‌ట్నం మీద క‌థ రాయ‌డం నిజంగా సాహ‌స‌మే అవుతుంది. కానీ, ఖ‌దీర్‌గారు న‌గ‌రం నాడీని ప‌ట్టుకొని న‌డిబ‌జారులో నిల‌బెట్టారు. న‌గ‌ర జీవితం తాలూకు అనేక కోణాల్ని, న‌గ‌ర మ‌హిళ‌ల ఆక్రంద‌ల్ని క‌థ‌ల్లో అద్భుతంగా ఒదిగించారు. మెట్రో క‌థ‌ల్లో న‌న్ను వెంటాడే క‌థ సెల్ఫీ. మంచి క‌థ‌ల విశ్లేష‌ణ‌ను అందిస్తున్న డా.వెల్దండి శ్రీ‌ధ‌ర్‌గారికి, సారంగ‌కు ధ‌న్య‌వాదాలు.
    -డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌

  • కథాకచ్చీరు బాగుంటుంది. శుభాకాంక్షలు.శ్రీధర్గారికి మరియు సారంగకు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు