ముస్కురాహట్

స్సు దిగి కాలేజీ వైపు కాళ్ళు కదులుతుంటే కళ్ళల్లో కలలు. డిగ్రీ పూర్తి చెయ్యల్ల, గ్రూప్స్ కొట్టల్ల. ఇదీ నాకల. ప్యూపా నుంచి బయటపడి సీతాకోకచిలుకలా ఎగిరిపోవల్ల. ఏ రోజూ కాలేజీ తప్పించలేదు. ఏ పరీక్షా తప్పలేదు. ఈ ఏడాది అయిపోతే డిగ్రీ చేతికొస్తుంది. ఇంకొంత కాలం కష్టపడితే ఉద్యోగమొస్తుంది. నడక కంటే ఆలోచనలు వేగంగా కదులుతున్నాయి.

*****

అప్పుడు నాకు ఐదేళ్లుంటాయేమో!

“అరె భలే ముద్దుగా ఉందీపిల్ల ఈ డ్రస్లో! ఎక్కడికెళ్ళి వస్తోందిది?” ఆంటీ ముఖంలో ఆ నవ్వంటే నాకు భలే ఇష్టం.

“మదరసాకి పోతాందిక్కా. కొరాన్ సదివేకి నేర్సుకుంటాంది.”

అమ్మ ఆంటీ వాళ్ళింట్లో పని చేస్తుంది. ఆంటీ పెద్ద ఉద్యోగంలో ఉందంట. పెద్ద జీతం వస్తుందని అమ్మ అప్పుడప్పుడూ చెప్తుంటుంది.

“ఎందుకు నూరీ పిల్లలకిప్పట్నుంచి ఇవన్నీ. పెద్దయ్యాక వాళ్ళే తెలుసుకుంటారు కదా!” ఆంటీ నవ్వుతూ అన్నది.

“వాళ్ళ నాయనంపిస్తాండడక్కా. అయినా మీ కిట్టూ గుడక ఇస్కాన్ కాడికి పోయి సోకాలు నేర్సుకుంటాండ్లా.”

“అవునవును, ఎవరి మతం వాళ్లకు గొప్ప.” ఆంటీ ముఖంలో అదే చిరునవ్వు.

కిట్టూ అన్న ఒకటో రెండో చదువుతున్నాడనుకుంటా.

“ఏం సోకాలు నేర్సుకుంటావన్నా నువ్వు?”

నా ప్రశ్నకు నెత్తిమీద మొట్టాడు కిట్టూ అన్న.

“సోకాలు గాదే పిచ్చి మొద్దూ. అవి భగవద్గీత శ్లోకాలు. నువ్వూ నేర్చుకుంటావా?” కిట్టూ అన్న ముఖం లోనూ అదే చిరునవ్వు.

“ఐ… భలే భలే… నేనూ నేర్చుకుంటా.” గంతులేశాను.

“సరే చెప్పు మరి.

త్వమేవ మాతాచ పితాత్వమేవ… త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ…”

“అంటే ఏందన్నా?” అన్న ఏం చెప్తున్నాడో నోరు తిరగలేదు, అర్థమూ కాలేదు.

“అవన్నీ అడగొద్దు. నేను చెప్పింది చెప్పు. త్వమేవ…”

“తమేవ…”

“అరె తమేవ, తోమేవా కాదు, త్వమేవ… త్వ… త్వ… త్వమేవ”

“తవమేవ…”

“నిన్నూ… త్వ… త్వ…” చిరాకు పడుతున్నా అన్న ముఖంలో నవ్వు చెదరలేదు.

“త్వ…”

“మేవ”

“మేవ”

“త్వమేవ”

“త్వ..మే..వ” ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ పలికాను.

“అంతే. గుడ్. మళ్ళీ చెప్పు.” నవ్వుతూనే నేర్పించాడు.

అన్నీ వంటబట్టకపోయినా రెండేండ్లు గడిచేసరికి నేనూ కొన్ని శ్లోకాలు నేర్చుకున్నాను. బడిలో చదువుతో పాటు, పొద్దునా, సాయంత్రం మదర్సాలో ఖురాన్ పఠనం తప్పనిసరి చేశాడు మా బాపూ. నేను కిట్టూ అన్నకు ఖురాన్ నేర్పించబోతే అమ్మ అడ్డుకుంది.

“రుక్ జా బేటీ. కొరాన్ అట్లా ఎప్పుడంటే అప్పుడు, ఎట్లంటే అట్లా సదవగూడదు.” నిజం చెప్పొద్దూ అమ్మ మీద భలే కోపం వచ్చింది. నా పరిజ్ఞానాన్ని నేర్పించే అవకాశం జారిపోయింది అమ్మ మూలంగా.

ఆరో క్లాసుకు కిట్టూ అన్నను హాస్టల్లోకేసినారు. అన్న పోతాపోతా భగవద్గీత పుస్తకం నాకిచ్చిపోయాడు. అన్న ముఖంలో అదే చిరునవ్వు.

*****

నాకిప్పుడు పద్నాలుగేండ్లు. మునిసిపల్ బళ్ళో తొమ్మిదో క్లాసులో ఉండా. మాయమ్మను పనిడిసిపెట్టిచ్చినాడు మాబాపు. వెల్డింగ్ పని చేస్తాడు బాపూ. నన్నూ బడి మానమని ఒకటే రావిడి. బాగా చదువుకొని, ఆంటీ తిన్న పెద్ద ఉజ్జోగం చెయ్యల్లని నాకు బలమైన కోరిక. బళ్ళో టీచర్లు కూడా నేను బాగా చదువుతానని మెచ్చుకుంటారు గూడాను.

“కొరాన్ సదివేది వస్తే సాల్లే. ఇంగా సదువేంటికి?” ఎందుకో బాపూ ముఖంలో నవ్వే ఉండదు.

“నేను బాగా చదువుకుంటా బాపూ. పెద్ద ఉజ్జోగం జేస్తా.”

నా ఏడుపు చూసి మా బాపూ కొంచం మెత్తబడ్డాడు.

“అట్లయితే తలనుంచీ కాళ్ళ దాకా, కండ్లు తప్ప ఇంగేం కనపరాకుండా బురఖా తొడుక్కొని పోవల్ల. బయట ఎవ్వరితోనూ మాట్లాడగూడదు. అట్లయితేనే పో.” ఎట్లైతేనేం బాపూ ఒప్పుకున్నాడు గదా అని సంబరమైంది.

దిన్నమూ పొద్దట్నుంచీ సాయంకాలం ఐదున్నర దాకా బురఖా లోపల ఊపిరాడలేదు నాకు. ఎండాకాలంలో అయితే నల్ల బట్టలకు విపరీతమైన వేడి. కానీ చదువుకోవాలన్న నా సంకల్పం కోసం అవన్నీ భరించాను. ఎప్పుడన్నా ‘బురఖా వద్దు బాపూ’ అంటే ‘అట్లయితే బడి మానుకొని ఇంట్లో కూచో.’ అనేవాడు. ఆ దెబ్బతో మళ్ళా ఎప్పుడూ అడగే ధైర్యం చేయలేదు.

పదో క్లాసు పరీక్షలకు ముందు సరస్వతీ పూజ, ఫేర్వెల్ పార్టీ పెట్టారు స్కూల్లో.

“అవునూ, ఎప్పుడూ సరస్వతీ పూజే ఎందుకు చేస్తారు?” నసీమా ప్రశ్న.

“ఎందుకంటే ఆమె చదువుల తల్లి అంట. వాళ్ళే ఎక్కువమంది ఉన్నారు గనుక చేస్తారు. మనకు పూజ కాదు కదా ముఖ్యం, ఫేర్వెల్ పార్టీలో మంచి డ్రస్ వేసుకొని ఎంజాయ్ చేద్దాం.”

పర్వీన్ సమాధానంతో అందరం కొత్త బట్టలు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాం. అమ్మను బతిమాలి తక్కువ ఖర్చులో కొత్త డ్రస్ కొనిచ్చుకున్నాను.

“రేపోక్క దినం బురఖా లేకుండా పోతా బాపూ. బళ్ళో ఫంక్షనుంది.” భయపడుతూనే అడిగాను.

“ఏం ఫంక్షను? సరస్వతీ పూజే గదా. ఆ పూజకు నువ్వేంటికి పోవల్ల?”

“ఇదే ఆఖరి సంవత్సరం గద బాపూ. ఫేర్వెల్ పార్టీ ఉంది. అందరూ కొత్త బట్టలు వేసుకొస్తారు. ఇదొక్కసరికీ వొప్పుకోవా?”

“అట్లంతా అయ్యేల్లేదు. పోతే నిండుగా బురఖా కప్పుకొని పో, లేదంటే మానుకొని ఇంట్లో పడుండు.”

ఇక వాదించే ఓపిక లేక కొత్త డ్రస్సు పైన బుర్ఖా బిగించుకొని బడికిపోయాను. నా తిన్ననే బుర్ఖాలో వచ్చిన పర్వీన్, గౌసియా, నసీమా బడికి రాంగానే అందరం మాట్లాడుకొని బుర్ఖా తీసి బ్యాగులో పెట్టుకున్నాము.

“భలే ఉందే నీ డ్రస్, ఎంత ఇది?”

“అరె ఈ గాజులెక్కడ కొన్నావు?”

సంబరంగా వీడ్కోలు పార్టీ పూర్తయింది. బడికి పక్కనే ఉన్న పర్వీన్ ఇంట్లో బుర్ఖా వేసుకుందాంలే అని అందరం కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము. పర్వీన్ ఇంటి ముందు వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ మా చాచా. నా గుండె గుభేల్మన్నది. చాచా మమ్మల్ని చూసేశాడు. ఏం మాట్లాడకుండా లోపలికి పోయి బుర్ఖా వేసుకొని మిగితా వాళ్ళతో పాటు బయటికొచ్చాను. బయట చాచా లేడు.

ఇంటికెళ్ళేసరికి అనుకున్నంతా అయింది. వాకిట్లో ఉగ్రరూపంలో బాపూ. ఆరోజు నా వంటి మీద వాతలు తేలినాయి. ఆ తర్వాత వాతలు కనబడకుండా ఉండటానికి బుర్ఖా కప్పుకోవాల్సివచ్చింది.

*****

మరో రెండేండ్లు గడిచిపోయాయి. బాపూకు అంతుపట్టని రోగమేదో వచ్చి పనికిపోలేకున్నాడు. అమ్మ నన్నూ, నాయన్నూ తన పుట్టినింటికి బెంగుళూరు తీసకపోయింది. మా మామ ఏదో చిన్న గ్యారేజ్ నడుపుకుంటున్నాడు. అందులో బాపూ చిన్న సాయం చేసేకి కుదురుకుంటే, అమ్మ మసాలా పొడులు తయారుచేసే ఫ్యాక్టరీలో పనికి కుదురుకుంది. చదువుమీద నాకున్న ఇష్టాన్ని చూసిన మామ కాలేజీలో డిగ్రీలో చేర్పించినాడు. కాలేజీలో యూనిఫాం ఉంది. అది కొనేకి తాహతు లేదు. కాలేజీ అయిపోయిన అక్కలనడిగి రెండు జతలు తెచ్చుకున్నా. ఆడాడ రోంత చినిగిపోయింటే కుట్టుకొని వేసుకుంటున్నా. నా అదృష్టం కొద్దీ కాలేజీలో బుర్ఖా వేసుకోవడానికి అభ్యంతరాలు లేవు. చినిగిన యూనిఫాం మీద ఇప్పుడు బుర్ఖా ఇష్టంగా కప్పుకొని, హిజాబ్ చుట్టుకొని పోతున్నా. నాలాగే ఇంకా కొందరు.

డిగ్రీ పూర్తి చెయ్యల్ల, గ్రూప్స్ కొట్టల్ల. ఇదీ నాకల. బురఖా ప్యూపా నుంచి బయటపడి సీతాకోకచిలుకలా ఎగిరిపోవల్ల. ఏ రోజూ కాలేజీ తప్పించలేదు. ఏ పరీక్షా తప్పలేదు. ఈ ఏడాది అయిపోతే డిగ్రీ చేతికొస్తుంది. ఇంకొంత కాలం కష్టపడితే ఉద్యోగమొస్తుంది. బస్సు దిగి కాలేజీ వైపు కాళ్ళు కదులుతుంటే కళ్ళల్లో కలలు.

“జై శ్రీరాం!” కేకలతో కలల్లో నుంచి బయటికొచ్చా. తలతిప్పి చూసేలోగా నా వొంటిపై బురద పడింది. కాషాయం కండువాలు భుజాల మీదేసుకొని బురద చల్లుతూ కొందరు కుర్రాళ్ళు. నివ్వెరపోయి చూస్తుండగా మరోసారి కేక. “విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధించాలి.” “జై శ్రీరాం!” బురద చల్లుతున్న మనిషిని చూసి స్థాణువై పోయాను. కిట్టూ అన్న. ఆ ముఖంలో నవ్వు లేదు. కోపంలో దవడలు బిగుసుకుపోయి ఉన్నాయి.

“అన్నా!” అనబోయి ఆగిపోయాను. సిగ్గుతో ముడుచుకుపోయి వెనక్కితిరిగి ఇంటికి వెళ్ళిపోయాను.

“ఏమయింది?” బాపూ ప్రశ్న.

“బయట అల్లర్లు జరుగుతున్నాయి. స్కూళ్ళల్లో, కాలేజీల్లో మతసంబంధ చిహ్నాలు వేసుకొని రాకూడదని దాడులు చేస్తున్నారు.” పక్కింటి అంకుల్ సమాధానం ఇచ్చాడు.

“అందుకే బేటీ మనకీ చదువొద్దని అన్నది. ఇంగనువ్వు కాలేజీకి పోవద్దు.” బాపూ మాట వినిపించుకోకుండా లోపలికెళ్ళి బుర్ఖా తీసేశాను. నా వొంటి మీద యూనిఫాం, మెళ్ళో ఐడీ కార్డు లక్ష్యాన్ని గుర్తు చేస్తున్నాయి. బుర్ఖా ఉతికి ఆరేశాను.

పెట్టెలో నుంచి కిట్టూ అన్న ఇచ్చిన భగవద్గీత బయటకి తీశాను. నోటుబుక్కు లోంచి ఒక పేపరు చించి రాయడం మొదలెట్టాను.

*****

మరుసటి రోజు యథాప్రకారం యూనిఫాం వేసుకొని బుర్ఖా తొడుక్కున్నాను. హిజాబ్ తలకు చుట్టుకొని, బ్యాగు తగిలించుకొని బయలుదేరా.

“వొద్దని చెప్పినా గదా, నా మాటంటే లెక్కలేదా?” బాపూ అరుస్తున్నాడు.

పట్టించుకోకుండా గబగబా బస్టాప్ వైపు నడిచాను. నా క్లాస్మేట్ హసీనా అప్పటికే బస్ కోసం ఎదురుచూస్తూ ఉంది.

“వొచ్చావా? నిన్నటి గలాటాల దెబ్బకు సగం మంది ఇళ్ళ దగ్గరే ఉండిపోయారు.”

“మా బాపూ కూడా పోవద్దన్నాడు. నాకు చదువుకోవడం ఇష్టం. అందుకే ఎదిరించి వచ్చేశాను.”

“అయినా మన బట్టల గురించి వీళ్ళ పెత్తనమేంటసలు? హిందువులు వాళ్ళ మతాలకు తగ్గట్లు డ్రస్ చేసుకుంటారు కదా. పంచెలు కట్టుకుని, పట్టు చీరలు కట్టుకొస్తే గొప్ప సంస్కృతి అని చాటుకుంటారు కదా. సరస్వతీ పూజ చేసినా, గణేశుని ప్రార్థన చేసినా మనమూ లేచి నిలబడుతున్నాం గానీ, ఎక్కడా అభ్యంతరపెట్టలేదు కదా. వాళ్ళకేంటి మన ముసుగుల తోటి? అసలు నువ్వు చూశావా, చాలా మంది హిందూ మహిళలు కూడా ముఖమూ తల కనబడకుండా ముసుగులేసుకుంటున్నారీమధ్య. అదేమంటే పొల్యూషన్ పెరిగిపోయింది అంటున్నారు. మనం మన మతాచారం పాటించడం తప్పెలా అవుతుంది? మీ బాపూను ఎదిరించడం కాదు, వీళ్ళను కూడా ఎదిరించాలి.” హసీనా మాట్లాడుతుండగానే బస్సొచ్చింది.

బస్సెక్కి కూర్చున్నాక నిన్న రాసిన కాగితం బయటకు తీశాను.

“కిట్టూ అన్నా,

మమ్మల్ని చదువుకోనివ్వండి. ఈ కవచం లేకపోతే మాకు చదువు ప్రాప్తం లేదు, మమ్మల్ని ఎదగనివ్వండి.”

చదువుకొని బ్యాగులో పెట్టాను. స్టేజీ రాగానే దిగి వడివడిగా కాలేజీ వైపు అడుగులేశాను. ఎదురుగ శాఫ్రాన్ స్కార్ఫ్ బ్యాచ్ అడ్డుకుంది.

“జై శ్రీరాం!” స్లొగన్స్ ఇస్తున్న వారిలో కిట్టూ అన్న. నేరుగా అన్న దగ్గరికి పోయి, బ్యాగు లోంచి భగవద్గీత తీసి చేతిలో పెట్టాను. అయోమయంతో పుస్తకం తెరిచి, తను రాసిన అక్షరాలు “బాగా చదువుకో…” చూస్తుండగానే నేను రాసిన పేపరు చేతిలో పెట్టాను. అందరి గొంతులూ “జై శ్రీరాం” అని అరుస్తుంటే అసంకల్పితంగా “అల్లాహో అక్బర్!” దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ కాలేజీ వైపు అడుగులేస్తూ, కిట్టూను చూశాను.

“ముస్కాన్…!” కిట్టూ అన్న ముఖంలో మళ్ళీ అదే ముస్కురాహట్!

*

ఎం.ప్రగతి

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రగతి గారూ.. నమస్తే
    కథ చాలా బాగుంది. చదువుకోసం ఒక పాప పడిన ఆరాటం, చేసిన పోరాటం బాగా చిత్రించగలిగారు. ప్రకృతిలోని, జీవన విధానాలలోని అంతర్లీనమైన ఏకత్వం కథలో చక్కగా వ్యక్తమైంది.
    కథ చివరన చిరునవ్వు కన్నీటిలో వెలిగిపోయింది. మంచికథ ఇచ్చారు..

  • కథ చాలా బాగుంది మేడం. హిజాబ్ కు బురఖా కు ఉన్న అన్ని కోణాలను చూపారు. హిజాబ్ మీద నాణ్యమైన కథ మీది. కథ మొత్తం ఒక్క ఫ్లో లో అయిపోయింది.
    అమ్మాయిపట్ల ఆర్ద్రతో కథ రాసారు. తనతో identify అయ్యారు. 🍀☘️👏👏 థాంక్యూ🙏

  • కథ చాలా బాగా రాశారు ప్రగతి గారూ! లైఫ్, సంఘర్షణ బాగా వచ్చింది!
    ముస్కాన్ అల్లాహు అక్బర్ అని కాకుండా జైభీమ్ అని నినదించి ఉంటే ఆ ప్రభావం దేశమంతా వేరుగా ఉండేది! వాస్తవంలో స్పాంటేనియస్ గా ముస్కాన్ అలా నినదించింది, కానీ మీరు దానిని గనక జైభీమ్ రాస్తే జైశ్రీరాం కి ప్రత్యామ్నాయంగా ఉంటుంది కదా!
    ముస్లిం పిల్లలు తండ్రిని బాపూ అంటారా? అని కూడా ఒక డౌటు..

    • Sky Baaba ధన్యవాదాలు సర్. నినదించింది ప్రగతి కాదు, ముస్కాన్! A typical Muslim girl who is highly ambitious for studies. ఇది మొదటి దశే కద, తర్వాతి దశ ఖచ్చితంగా జై భీమే! బాపూ అని మా ఇంటి చుట్టుపక్కల ముస్లిం కుటుంబాల్లో అంటుంటే విన్నాను. అన్నిచోట్ల అనకపోవచ్చు. అబ్బాజాన్ అంటారట.

  • Excellent narration.yes.we should come out of the shackles of old ideology.religion is personal.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు