మార్క్ ట్వేన్ కథ – “అద్దంలో బొమ్మ “వినండి

కళ్లు అంటే నావే. ప్రపంచం అంటే నేను చూసిందే.
శబ్దమైనా నిశ్శబ్దమైనా నేను విన్నదే.
చేదైనా తీపైనా ఆ రుచి నేను చూసిందే.
ఈ నిజాలని లోకం ఎందుకు ఒప్పుకోదూ?
మార్క్ ట్వేన్ కథ – అద్దంలో బొమ్మ
అనువాదం – ముక్తవరం పార్థసారథి

అద్దంలో బొమ్మ

మూలం: మార్క్ ట్వైన్ రచన – ఎ ఫేబుల్ (A Fable)

                           అనువాదం: ముక్తవరం పార్థసారథి

 

చిత్రకారుడు ఓ బొమ్మ వేశాడు. చాలా అందమైన బొమ్మ. అపురూపమైన బొమ్మ. ఆ బొమ్మ అందాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే దాన్ని కొంత దూరం నుంచి చూడాలి. అందుకోసం బొమ్మకెదురుగా ఓ నిలువెత్తు అద్దం పెట్టి, దూరం రెట్టింపైన బొమ్మ ప్రతిబింబాన్ని అద్దంలో చూసి తనే ముగ్ధుడయ్యాడు చిత్రకారుడు.

ఇంటింటి కబుర్లు సేకరించే పిల్లి ద్వారా ఈ బొమ్మ సంగతి కాస్తా అడవిలోని జంతువులకు తెలిసింది.

“ఎందరో చిత్రకారుల ఇళ్లు చుట్టివచ్చాను. కానీ అబ్బో, ఇలాంటి బొమ్మ ఇంతవరకూ చూడలేదంటే నమ్మండి. ఎంత అందమైన బొమ్మో! చూస్తే కళ్లు తిరిగిపోయాయి. ఆహా! ఆ రేఖల్లోని మార్దవం, ఆ రంగుల కలయిక. ప్రపంచంలో అంతకన్నా గొప్ప చిత్రం ఎవ్వరూ వెయ్యలేరు. ఆ చిత్రాన్ని చూడని కళ్లెందుకు” అంటూ కీర్తిగానం చేసింది పిల్లి.

‘అబ్బో… ఆహా…’ లాంటి మాటలు తప్ప జంతువులకు పిల్లి చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు.

“చిత్రమంటే ఏమిటీ?” అని అడిగాయి.

“చదునుగా ఉండే కాన్వాసు గుడ్డమీద రంగువేస్తారు. గుడ్డ ఎంత చదునుగా ఉంటుందనుకున్నారు! అబ్బో, చదునుగా లేకపోతే బొమ్మ వెయ్యలేరుగా. అసలు ఆ గుడ్డ చదును వర్ణించడానికే ఒకరోజు చాలదు. ఆ చదునే ఓ అందం” అంది పిల్లి.

పిల్లి ఏం మాట్లాడుతోందో, ఎందుకు పొగుడుతోందో, గుడ్డ ఏమిటో, ఎందుకు చదునుగా ఉంటుందో, ఏమీ బోధపడలేదు జంతువులకు. కానీ పిల్లి పొగడ్తలు వాటిలో ఉత్కంఠ రేకెత్తించాయి. అసలు విషయమేమిటో స్వయంగా చూసి తెలుసుకోవాలనుకున్నాయి.

“చదునైన గుడ్డ సరేకానీ, అంత అందమెక్కణ్నించి వచ్చింది?” అంటూ అడిగింది ఎలుగుబంటి అమాయకంగా.

“గుడ్డమీద తమాషా తమాషా రంగులుంటాయి. వాటివల్లే ఆ గుడ్డ అంత సమ్మోహనంగా అవుతుంది,” అంది పిల్లి మీసాలు మెలేసుకుంటూ.

జంతువులకు అర్థం కాలేదు. ఈ దొంగ పిల్లి మాటకొకసారి ‘అందం’, ‘అద్భుతం’ అంటోంది. దీని మాటల్లో ఎంత నిజం వుందో తేల్చుకోవాల్సిందే. “చూడని కళ్లేల?” అంటుందా! పెరిగిన ఉత్కంఠ వాటిని ఒక్క క్షణం కూడా నిలకడగా వుండనివ్వలేదు.

“అద్దమంటే ఏమిటి?” అని అడిగింది ఆవు నెమరువేసుకుంటూ.

“అద్దమంటే గోడకు చేసే ఓ కన్నం. అందులో చూస్తేనే నీకు బొమ్మ కనిపిస్తుంది. ఒక్కసారి చూశామంటే కళ్లు తిప్పుకోలేం. మనకే తెలియని ఉద్వేగాలు, స్వప్నాలు, అనిర్వచనీయమైన అనుభూతులూ కలిగిస్తుందా చిత్రం. మనసు తన్మయం చెంది మూర్ఛవస్తుందేమోననిపిస్తుంది. సర్వస్వప్నలోకాలకూ ప్రతీక ఆ చిత్రం. ఉద్రేకాన్నీ, ఉద్వేగాన్నీ మించిన భావోన్మత్త స్థితిలో మనల్ని మనం మరచిపోతాం” అంటూ కవిత్వం చదివింది పిల్లి.

ఈసారి అర్థంకాకపోటం మాత్రమే కాక, అయోమయం మరింత పెరిగింది జంతువులకు.

పిల్లి చేసిన కవితాగానాన్ని గాడిద నోరు మెదపకుండా వింది. ఏవో సందేహాలు మెదిలాయి దాని మెదడులో. అలాంటి బొమ్మ “నభూతో నభవిష్యతి” అట. ఆ అందం మత్తెక్కిస్తుందట. ఒక బొమ్మగురించి కుప్పలుతెప్పలుగా ఇన్ని ప్రశంసలు, వుత్ప్రేక్షలూ కురిపించిందంటే అదేదో తప్పక అనుమానపడవలసిన విషయమే.

“నమ్మశక్యం కావడం లేదు” అంది గాడిద.

గాడిదకు కలిగిన సందేహాల్లాంటివే మిగతా జంతువులకూ కలిగాయి. పిల్లి కోతలు కోస్తోంది. గాలి కబుర్ల పిల్లి.

తనను అనుమానంగా చూస్తున్నందుకు పిల్లికి జంతువుల మీద కోపం వచ్చింది.

“అసలు మీలాంటి మూర్ఖులకు గొప్ప విషయాలు చెప్పడం నాదే పొరబాటు” అంటూ అక్కసుతో, కోపంతో గెంతుతూ వెళ్లిపోయింది.

ఉత్కంఠ, అపనమ్మకం, అయోమయం. అన్నీ కలిసి జంతువుల్ని దీర్ఘాలోచనలో పడేశాయి. పరస్పరం కబుర్లు చెప్పుకోవడం కూడా మరచి దేనికదే మౌనంగా అంతర్మథనంలో పడ్డాయి. రెండురోజులు గడిచాయి.

కుతూహలం తగ్గలేదు సరిగదా, అసలు సంగతేమిటో తెలుసుకోవాలనే తపన తీవ్రతరమై పరాకాష్ఠకు చేరుకుంది.

జంతువులన్నీ కలిసి

“నమ్మటానికి లేదని ఎందుకన్నావే? నువ్వు చూసొచ్చావా? బొమ్మ నిజంగానే అంత అందంగా వుందో ఏమో! స్వయంగా చూసొచ్చి బాగోలేదని చెప్పు. అప్పుడు నమ్ముతాం. నీ నోటి దురదతో ఓండ్రించి నిష్కారణంగా పిల్లికి అలుక తెప్పించావుగదా” అంటూ గాడిదను తిట్టిపోశాయి.

“సరే, మొదట మీ చివాట్లను వెనక్కు తీసుకోండి. నేను వెళ్లి ఆ కన్నంలో చూసి వస్తాను. అప్పుడు తెలుస్తుంది. ఎవరు రైటో” అంటూ ప్రతిజ్ఞ చేసింది గాడిద.

గాడిద ధైర్యం జంతువులకు ప్రసన్నత కలిగించింది. “వెళ్ళమ్మా గాడిదా, త్వరగా వెళ్లి చూసి రా పో. నువ్వు చూసి వస్తే గానీ, మా అనుమానాలకు తెరపడదు,” అని ప్రాధేయపడ్డాయి.

గాడిద వెళ్లింది, చూసింది.

కాని, ఎక్కడ నిలుచుని చూడాలో తెలియలేదు. బొమ్మకూ, అద్దానికీ మధ్య నిల్చుని ప్రతిబింబాన్ని చూసింది.

ఫలితం – అద్దంలో కనిపించింది చిత్రకారుడు వేసిన చిత్రం కాదు.

హడావిడిగా రొప్పుతూ, వెనక కాళ్లు ఎగరేస్తూ పరిగెత్తివచ్చి,

“పిల్లి వట్టి అబద్ధాలకోరు. అది తన కల్లబొల్లి కబుర్లతో మనల్ని మోసం చేసింది. ఆ కన్నంలో ఏం కనిపించిందో తెలుసా?”

“ఆ ఏం కనిపించిందే, చంపక త్వరగా చెప్పు” అంటూ గొంతు కలిపి అరిచాయి జంతువులు.

“ఏం కనిపించింది? నా బొమ్మ. ఆ చదునుగా ఉన్న గుడ్డ, రంగులూ ఏవీ లేవు. నా బొమ్మ తప్ప. అఫ్ కోర్స్, నేను చాలా అందంగా ఉన్నాననుకో. అది వేరే విషయం.”

“సరిగ్గా చూశావా?  నీకు దృష్టిదోషమేమీ లేదుకదా? బాగా దగ్గరకెళ్లి, స్పష్టంగా చూశావా? బాగా గమనించావా?” అంటూ అడిగింది ఏనుగు.

“ఏనుగు బావా, నా ఏడుతరాల పూర్వీకుల మీద ఒట్టేసి మరీ చెబుతున్నాను.  స్పష్టంగా చూశాను. అంగుళం అంగుళం పరిశీలించి మరీ చూశాను. నేను ఎంత దగ్గరగా వెళ్లి చూశానంటే, ఇంకొక్క రవ్వ ముందుకు జరిగితే, ఆ కన్నంలోని గాడిద ముట్టె తగిలేది” అంటూ సత్యప్రమాణంగా పలికింది గాడిద.

“ఇదేదో వింతగా ఉందే” అంటూ సందేహించింది ఏనుగు. “పిల్లి ఇదివరలో అబద్ధాలు చెప్పినట్టుగా నాకైతే జ్ఞాపకం లేదు. మరో సాక్షి ద్వారా నిజనిర్ధారణ చేసుకుందాం. ‘ఎలుగూ ఎలుగూ, నువ్వెళ్లి కన్నంలో చూసి రాకూడదూ’ అంటూ కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది ఏనుగు.

ఎలుగుబంటి వెళ్లింది, వచ్చింది.

కోపంతో దాని కళ్లు ఎరుపెక్కాయి.

ఆవేశం ఆపుకోలేక రొప్పుతూ,

“పిల్లి అబద్ధాలకోరు అయితే, గాడిద పుండాకోర్. ఏమనుకుంటోందీ గాడిద? తను చెప్పే బూటకపు కబుర్లు నమ్మే దద్దమ్మలమా మనం! అసలు ఆ కన్నంలో ఉన్నది ఎలుగుబంటి. నాలాంటి ఎలుగుబంటి” అంటూ అరిచింది.

జంతువుల ఆశ్చర్యానికీ, అయోమయానికీ అవధుల్లేవు. ఒక్కొక్క జంతువే వెళ్లి అసలు విషయమేమిటో తమకు తామే తేల్చుకోవాలనుకున్నాయి.

మొదట వెళ్లింది ఆవు. చూసింది ఆవును.

పులి, పులి. సింహం, సింహం. చిరుత, చిరుత.

లొట్టిపిట్టకు కన్నంలో లొట్టిపిట్ట శరీరభాగం కొంత మాత్రమే కనిపించింది.

కానీ అసలు సత్యం తెలుసుకున్న ఏనుగుకు లోకం మీదే అపనమ్మకం ఏర్పడింది. ఈ అబద్ధాల లోకం ఉంటేనేం, కాలి బూడిదైతేనేం అంటూ ఓ విప్లవగీతం కూడా పాడింది. పట్టపగలే ఇంత మోసమా! పిల్లి అబద్ధాలకోరు అని నిందించిన మిగతా జంతువులు సత్యసంధులా? ఒక్కదానికీ అణువంతయినా నిజాయితీ లేదే! కన్నంలో ఉన్నది అసలు ఏనుగు బొమ్మ అన్న మౌలిక సత్యాన్ని ఏ ఒక్క జంతువూ ఎందుకు గుర్తించలేదు? అనుకుంది.

మిగతావి కూడా అలాగే అనుకుంటాయని దానికి తెలిసే అవకాశం లేదు.

*

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు