మానవీయత అంచు మీద నడిపించే కథ

కథంతా చదివి పుస్తకం మూసేసిన తరువాత అసలు కథ మన మెదడులో మొదలవుతుంది. మనం రద్దయిపోయి లోకనాథమే మనలోకి వచ్చి కూర్చుంటాడు.

   తెలుగు కథకు సరికొత్త శిల్పాన్నద్దిన విశిష్ట కథకులు ఆడెపు లక్ష్మీపతి. వస్తువు కోసమే కాదు శిల్పం కోసం కూడా ఆడెపు లక్ష్మీపతి కథలు ఎన్నదగినవి. రాసినవి తక్కువ కథలే అయినా రాసిన కథలు మాత్రం తెలుగు మేలిమి కథల్లో ముందు వరుసలో నిలబడే కథలు. 1972లో ‘ఆదర్శం’ కథతో మొదలుపెట్టి తాను రాసిన కథల్ని ‘నాలుగు దృశ్యాలు’ పేర సంపుటిగా తీసుకువచ్చారు. చాన్నాళ్లు కథా రచన మానుకొని సాహితీ విమర్శా వ్యాసాలు, అనువాద వ్యాసంగంలో మునిగిపోయి ఇటీవలే మళ్ళీ కథా రచన చేపట్టి అభావం అంచు మీద అనే కథను రాశారు. వారికి పలు అవార్డులు వచ్చాయి. కొన్ని కథలు ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి. ‘అభావం అంచు మీద’ కథ దక్కన్ ల్యాండ్ మాస పత్రికలో 2018 జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రచురింపబడింది.

లోకనాథం రిటైరైన ఉద్యోగి మూడు నెలల నుంచి పెన్షన్ రాకపోయేసరికి ఆఫీసుకు వచ్చి అక్కడి సిబ్బంది మీద తీవ్రంగా అరుస్తాడు. దీనికి తోడు మధ్యాహ్నపు ఎండ కూడా విపరీతంగా ఉండడంతో మరింత రుసరుసలాడుతాడు. అక్కడి సెక్యూరిటీ గార్డు ఏదో సముదాయించి పంపిస్తాడు. ఇంతలో అక్కడికి ఒక కారు వేగంగా వచ్చి ఆగుతుంది. దాని అద్దంలో పెరిగిపోయి నెరిసిన జుట్టును, సగం దాకా తెల్లబడ్డ మీసాలను, వడలిపోయిన తన రూపాన్ని చూసుకొని, కర్చీఫ్ తో తుడుచుకొని ఆలోచనలో పడ్డాడు…

ఆ రోజు ఉదయం ఏడున్నర గంటలకే హేర్ కటింగ్ సెలూన్ కు వచ్చి కూర్చున్నాడు లోకనాథం. తన పక్కన అదివరకే వచ్చి కూర్చున్న ఇద్దరు వ్యక్తులను చూసుకుంటూ ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగాడు మంగలిని లోకనాథం. ఇంకో గంటయినా పడుతుందంటాడు మంగలి. తరువాత లోకాభిరామాయణం మాట్లాడుతూ ఎవరికో కటింగ్ చేయడంలో మునిగిపోయాడు మంగలి. ఒక వైపు కస్టమర్లను మైమరపిస్తూ టీవీలో ‘కమనీయ’ దృశ్యాలు నిరంతరంగా వస్తూనే ఉన్నాయి. గంట గడిచి పోయింది లోకనాథంకు అసహనం పెరిగిపోయింది. ఇంకా ఎంత సేపయ్యా అంటాడు. మంగలి మరో గంట పడుతుందంటాడు. లోకనాథంకు చిర్రెత్తుకొచ్చింది. “నీ సెలూన్ లో అడుగు పెట్టడం నాదే బుద్ధి తక్కువ” అంటూ బయటకు నడిచాడు.

ఇంటికి వెళ్లడానికి బస్ కోసం బస్టాండ్ కు వచ్చి నిలబడ్డాడు లోకనాథం. మే నెల ఎండ మరింత చిటపటలాడుతుంది. దాహంతో నాలుక పిడుచ కట్టుకుపోయింది. వెంట తెచ్చుకున్న బాటిల్లోంచి రెండు గుక్కలు నీళ్ళు తాగాడు. కడుపులో మెల్లగా ఆకలి మొదలైంది. బస్ షెల్టర్ పక్కనే ఉన్న వేప చెట్టు నీడలో కూలీలు కొంత మంది భోజనాలు చేస్తున్నారు. చెట్టు కొమ్మకు వేలాడిన రేడియో నుంచి పాటలు వినిపిస్తున్నాయి. జామూన్ రంగు నేత చీర కట్టుకున్న ఓ నలభై ఏళ్ల ఆడ మనిషి రోడ్డు వైపు చూస్తూ ఎవరికోసమో ఎదురు చూస్తోంది. ఇంతలో ఎర్ర పూల లంగా, పసుపు పచ్చ ఓణి, తెల్ల జాకెట్టు వేసుకున్న పద్దెనిమిది ఇరవై ఏళ్ల అమ్మాయి నెత్తి మీద బిందె, చేతిలో బకెట్ తో నీళ్ళు తీసుకొని వచ్చింది. ఆమె అందం చుట్టూ పరీక్షగా చూశాడు లోకనాథం. “పెళ్లీడు కొచ్చిన పడుచు పిల్ల కూడా తన కుటుంబంతో కల్సి ఎర్రటి ఎండలో వొళ్ళు వంచి పని చేయాల్సిరావడం, దారినపోయే లక్షలాది మంది చెడు చూపుల తాకిడికి ఆమె మేని వంపు సొంపులు గురికావాల్సి రావడం ఎంతో బాధ కలిగించే సన్నివేశంలా తోచింది లోకనాథానికి… భోంచేస్తున్నవారి కంచాల్లోంచి ఆహార పదార్థాల వాసన కమ్మగా గాల్లో తేలివచ్చి లోకనాథం నోట్లో నీరూరింది. ఆకలితో పేగులు గుర్రుమన్నాయి. తను ఇల్లు చేరేసరికి ఇంకో గంటైనా పడుతుంది. బాటిల్లో ఉన్న నీళ్ళన్నీ గడగడా తాగేశాడు. వేళకు తిండి, వేళకు నిద్ర సమకూరితే అదృష్టమే. ఆట, పాట, ఆకలి, దప్పిక, అలసట.. జీవితంలో ఎన్ని మలుపులెదురైనా ఆ బయోలాజికల్ డ్రైవ్స్ ప్రకృతి సహజం. మరో ముఖ్యమైన బయాలాజికల్ డ్రైవ్… అణచుకోవాల్సిందేనా….?

అర్ధరాత్రి దాటాక ఎప్పుడో కరెంటు పోయింది. లోకనాథం లేచి కూర్చున్నాడు. చెమటకు బట్టలన్ని తడిసి పోయాయి. పక్కన తన భార్య వసుమతి పడుకొని ఉన్నది. చెదిరిన చీర, జారిన పైట లోకనాథాన్ని రెచ్చగొడుతాయి. వంగి భార్య పెదాలని ముద్దు పెట్టుకుందామనుకునేసరికి వసుమతి ఉలిక్కిపడి లేచి పెనిమిటిని మోచేత్తో పొడిచి దూరం నెట్టింది. పాల పొంగు మీద నీళ్ళు చల్లినట్లైంది లోకనాథంకు.

రేడియోలో పాటలు ఆగిపోయినై. “సార్ శానా సేపైంది ఎదురు చూడబట్టి ఇంగో అర్ధ గంట దాకా బస్సులు నడవవ్. డ్రైవర్లకు, కండక్టర్లకు అన్నాలు తినే టైం కదా ఇది. ఇట్లచ్చి నీడకు ఈ వేరు మీద కూసో…” అన్నాడు ఒక కూలి. లోకనాథం అలాగే చేశాడు. మెల్లగా సంభాషణ మొదలైంది. తమది పాలమూరని ప్రతి ఎండా కాలం ఇలా కూలి పనులు చేసి కాస్తో కూస్తో సంపాదించి మళ్ళీ వానా కాలం తిరిగి పోతామని చెప్పాడు ఆ కూలి. లోకనాథం ఎండిపోయిన చెట్టు కొమ్మను గమనించి “అరరే… ఆ కొమ్మ ఎప్పుడైనా విరిగి కింద పడుతుంది. జాగర్త..” అన్నాడు.

“అంతే… మూలాలు తెగితే ఏ చెట్టయినా ఎండిపోతుంది. మనుషులైనా అంతే కదా సార్..” అని వేదాంతిలా నవ్వాడు ఆ కూలి. ఇంతలో పని గుత్తకిచ్చిన మేస్త్రి వచ్చి చేసిన పని సరిగా లేదని దాన్ని సరిచేసి మిగిలిన పని తొందరగా పూర్తి చేయాలని, లోకనాథం వైపోసారి చూసి జాగ్రత్త అని హెచ్చరించి పోయాడు. వెంటనే కూలీలంతా పలుగు, పారలు అందుకొని పనిలోకి దిగిపోతారు. ఇంతలో బస్ వస్తే బస్ ఎక్కేశాడు లోకనాథం. బస్ ముందుకు పోతోంది. లోకనాథం ఆలోచనల్లోకి వెళ్ళాడు….

ఇంటి వోనరు ఎందుకో పిలిస్తే సంగతేమిటో తెలుసుకుందామని లోకనాథం ఇంటి వోనరు ఇంటికి వెళ్ళాడు. పోగానే ఇంటి ఓనరు కుక్క లోకనాథం చుట్టూ తిరిగే సరికి లోకనాథంకు అసహ్యం వేసింది. ఓనరు వచ్చి ఏవో పనికిమాలిన రూల్స్ అన్నీ చెప్పే సరికి లోకనాథంకు ఎక్కడ లేని కోపం వచ్చింది. “రోజుకో రూల్స్ చెప్పి మీరు మమ్ముల సతాయించుడు కూడా బాగాలేదు. మాకు ఇల్లు కావాలి. మీకు కిరాయి రావాలి. ఇది మనిద్దరి అవసరం ఔనా? కాదా?” అని ప్రశ్నించాడు. దీనికి ఇంటి ఓనరు ఏదేదో వాగాడు. దానికి లోకనాథం కూడా దీటుగానే జవాబిచ్చాడు. ఇంటి ఓనరుకు కోపమొచ్చింది. దవడ కండరాలు బిగుసుకున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచో ఫోన్ వస్తే ఆ వస్తున్నా అనుకుంటూ కాళ్ళకు అడ్డంగా పడుకున్న కుక్కను అదిలిస్తూ “జాకీ ఛల్ లే.. జరగమంటే తొవ్వలకెల్లి లేవమేమే.. తోలు మందం బేవకూఫ్! వయసైపోయినా నిక్కుడు, నీల్గుడు తగ్గలేదేమే నీకు. గేట్ బయట కట్టేస్తే నీ బతుకేందో తెలుస్తుంది. గుమ్మం దాటిన లోకనాథం ఆ మాటలు విని పళ్ళు కొరికాడు. డబ్బు మదంతో పులిసిపోయిన పంది వెధవ అని మనసులో తిట్టుకున్నాడు.”

లోకనాథం ఎక్కిన బస్ సడెన్ బ్రేక్ తో ఆగింది. వెనకాల చాలా వాహనాలు కీచుమంటూ ఆగిపోయాయి. దూరంగా యూ టర్న్ పాయింట్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఇద్దరు యువకులు గళ్లలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. చుట్టు పక్కల చాలా మంది ఉన్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయడం లేదు పైగా తలో మాట అంటున్నారు. ఇంకొంత మంది సెల్ ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు. ఇక ఉండబట్టలేక లోకనాథం బస్ దిగి వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళను విడిపించి గొడవను శాంత పర్చాడు. అంతా అయిపోయాక వెల్ డాన్ మాస్టారు అంటూ ట్రాఫిక్ పోలీసులు నెమ్మదిగా వచ్చారు. మెల్లగా వాహనాలు కదలడం మొదలైంది. తిరిగొచ్చి లోకనాథం మళ్ళీ బస్ ఎక్కాడు. బస్ నిండా జనం. కొద్ది దూరం పోయాక ముందు సీటు ఖాళీ అయింది. కండక్టర్ “ఆ సీటులో కూకోండి సార్” అన్నాడు. సీనియర్ సిటిజన్ సీటులో కూర్చోవాలా వద్దా అని ఆలోచించే లోపే ఇద్దరు ముగ్గురు జీన్స్, టీ షర్ట్ వేసుకున్న కుర్రాళ్ళు పోటీ పడ్డారు. “ఆ కుర్ర వాళ్ళు నిజమైన వృద్ధుల్లాగా కనబడ్డారు లోకనాథానికి”.

రిటైరైన ఒక ఉద్యోగి మానసిక సంఘర్షణను ఒక్క రోజులో ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ తో చూపించిన కథ ఇది. అంటే కథా కాలం ఒక్క రోజే. కథలో మొత్తం నాలుగు వర్తమాన సంఘటనలు, మూడు ఫ్లాష్ బ్యాక్ లు ఉన్నాయి. ఈ కథలో రచయిత సందర్భాను సారంగా ఎన్నో విషయాలను చర్చకు పెట్టాడు. ఒక వైపు అభద్రతా భావం, వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం, ఒక వయసు వచ్చాక అన్ని కోరికలను చంపుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి, మరో వైపు ముప్పై ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసినా రిటైరైన నాటికి కనీసం సొంత ఇల్లు కూడా లేని స్థితి, ఇంటి ఓనరు కిరాయిదారుని కుక్క కన్నా కడహీనంగా చూడడం, విపరీతమైన వేగంతో వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేయడం, పైగా ఆవేశాలతో రోడ్డు మీద పడి కొట్టుకోవడం, దీన్ని సెల్ ఫోన్లలో రికార్డ్ చేయడం, ఓపిక లేనితనం, మూలాలు తెగిపోయిన పాలమూరు కూలీలు పొట్ట చేత పట్టుకొని వలస పోవడం, వయసొచ్చిన ఆడపిల్లల్ని కూడా కూలి పనికి దింపాల్సిన దుర్భర స్థితి, కుళ్లు రాజకీయాల దీన స్థితి, సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో నలిగిపోతున్న యువత, తద్వారా తల్లిదండ్రులు, బినామీల పేరు మీద జరుగుతున్న రియలెస్టేట్ వ్యాపారం, అశ్లీల సినిమాలు, ఐటం సాంగులు, భారీకాయాన్ని తగ్గించుకోవడానికి పాటిస్తున్న ప్రకృతి వైద్యం, ఆహార నియమాలు… ఇలా వర్తమాన ప్రపంచమంతా కళ్ల ముందు కదలాడుతుంది ఈ కథలో.

కాలంతో పాటు కొనసాగి, మనం రోజూ చూస్తున్న వాస్తవిక లోకాన్ని కళాత్మకంగా తీర్చి దిద్దిన కథ. ఈ కథలో సగటు మనిషి లోపలి ఖాళీని అక్షరాలుగా కూర్చడం కనిపిస్తుంది. ప్రతి మనిషి ఎంత బాధ్యతగా మెలగాలో కూడా ఆచరణలో చూపెట్టిన కథ. ఇందులోని లోకనాథం దృక్కోణం నుండి ఈ ప్రపంచాన్ని గమనిస్తే ఒళ్ళు గగుర్పొడుతుంది. ఇప్పటికీ మనిషి ఎంత ఆటవికంగా బతుకీడుస్తున్నాడో చూస్తే ఇలాంటి సమాజంలోనా మనం జీవిస్తున్నది అని ఆవేదనకు, ఆందోళనకు గురవుతాము. ఒక మనిషి కనీస విలువలతో, కాసింత ఆత్మగౌరవంతో బతకడానికి ఎంత పెనుగులాడాలో అనుభవానికి వచ్చి గుండె భారమవుతుంది. లోకనాథం పాత్ర సమకాలీన సమాజంలోని ఒక ఆందోళనాపూరిత మనిషికి ప్రతీక. ఈ కథలోని ప్రతి పాత్ర తనదైన వృత్తంలో జీవిస్తుంది. ఆ వృత్తాన్నీ ఛేదించుకొని వచ్చాక మన దేహంలో ఏదో తెలియని కంపన మొదలవుతుంది. ఆబ్జెక్టివ్ కోణంలో రాసిన కథ. సన్నివేశ కల్పనా, సంభాషణల్లో రచయితకున్న అపారమైన పరిణతి కనిపిస్తుంది. కథంతా చదివి పుస్తకం మూసేసిన తరువాత అసలు కథ మన మెదడులో మొదలవుతుంది. మనం రద్దయిపోయి లోకనాథమే మనలోకి వచ్చి కూర్చుంటాడు. ఇక మనం ఎటు అడుగు వేసినా లోకనాథం పాత్రలాగే ఆలోచిస్తుంటాము. ఇలాంటి మార్పు తెచ్చే కథ మనల్ని ఎప్పుడూ వెంటాడుతుంది. ఒక్క మాటలో ఈ కథ ప్రతి మనిషిని వెంటాడి వేటాడే కథ. మానవీయతను గుండె నిండా వెదజల్లే కథ.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు