మనిషి పరిచయం – 10

మనుషుల్లో దేవుడు లేకపోయినా అప్పుడప్పుడు కనీసం మనుషులైనా ఉంటారా.?

                                                                                         12

ముక్త పెన్సెల్వేనియా హోటల్ లోని 72 వ అంతస్తులో కిటికీ దగ్గర నిలబడి.. దూరంగా కనిపిస్తున్న నది దిక్కు చూస్తూ ఆలోచిస్తోంది.

ఇంకో పావుగంటలో తను అతి పురాతనమైన ‘ పెన్సెల్వేనియా ‘ విశ్వవిద్యాలయ ‘ ఫిలాసఫీ ‘ డిపార్ట్ మెంట్ లో జరుగుతు న్న గాఢ తాత్విక అంశం ‘ ఎటెర్నిటీ అండ్ ఇమ్మోర్టాలిటి ‘ అన్న విషయం పై జరుగుతున్న ఒక కీలక అంతర్జాతీయ సింపోజియం కు హాజరు కావాలి.

ఒక గంట క్రితమే వచ్చింది ముక్త కొలంబియా నుండి. మొత్తం కొలంబియాలో నాలుగేళ్ల రెండు నెలల స్టే.. ఎక్కువగా గడిపింది ఎలిజబెత్ మార్వినో తోనే. ఏమైతే నేమి.. తమ బృందం జరిపిన జన్యువైవిధ్య ప్రయోగాల పరంపరవల్ల ఎలిజబెత్ మార్వినో తిరిగి తన పూర్వ యవ్వనాన్నీ, తన పూర్వ 28 ఏళ్ళ మానసిక స్థితినీ.. శారీరక దృఢత్వాన్నీ.. ఆ మాటకొస్తే ఇతరేతర యవ్వన శృంగార వాంఛలన్నింటిని కూడా పొంది.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. సంపూర్ణంగా టెస్ట్స్ చేయబడి విజయవంతంగా తిరిగి వెళ్ళిపోయిందికదా తన సాల్వెడార్ కు.

అంటే, శాస్త్రవేత్తలుగా.. తమ కార్డిరో, డేవిడ్ వుడ్ బృందం ‘ మృత్యువును జయించే ‘ కృషిలో ఉత్తీర్ణులైనట్టే గదా.

ఐతే మృత్యువు జయించబడ్తుంది.. ఒ.కె. కాని మనుషుల్లో ఉండవలసిన మానసిక చాంచల్యాల సంగతీ, స్వతహాగా వ్యక్తులలో ఉండే వేరే విషాదకర, స్వార్థ, వైషమ్య, అసూయా గ్రస్తత లక్షణాల సంగతేమిటి. జన్మతః మనిషికి సంక్రమించే ఈ నేరపూరిత అవలక్షణాలను ఎలా ఎవరు నియంత్రిస్తారు. ఒకవేళ ఈ దుర్మార్గ లక్షణాలున్న వాళ్లందరూ అమరులౌతే అప్పుడు మనుష్య జాతి ఏమౌతుంది. దొంగలూ, దోపిడీ దార్లూ, హంతకులూ, మోసగాండ్లూ.. అందరూ అమరులౌతే.. అసలీ మానవ సమాజం ఏమౌతుంది.

ఈ అతి ప్రమాదకర విషయం ఇంకా తను కార్డిరో తో గానీ, వుడ్ తో గానీ చర్చించలేదు.

ఒక వారంక్రితం ” నేను బాగా అలసిపోయిన కార్డిరో.. నాకు ఓ మూడు నెలల విశ్రాంతి కావాలి.. ప్లీజ్ ” అని అడిగి ఆయన్ను ఒప్పించి.. నేరుగా పెన్ న్సెల్వేనియాకు టికెట్ బుక్ చేసుకుని ఈ రోజే వచ్చింది ముక్త. వచ్చి టైం చూచుకుంటే ఎనిమిదీ ఐదు నిముషాలు. ఈ రోజు ఈ తాత్విక లోతులున్న ఈ విషయం పై విజ్ఞుల మాటలు విని.. రాత్రి ప్లైట్ కు ఇండియా.. బ్రిటిష్ ఏర్ వేస్ లో. చక్కగా ఢిల్లీ. అక్కడినుండి బై రోడ్ ఉత్తరాఖండ్ లోని ‘ ల్వారా ‘ అనే చోటికి.,

ఎందుకు.?

అన్వేషణ.. శోధన.

అన్వేషణా శోధనా ఒకటేనా.

లేనిదాన్నీ, తెలియని దాన్నీ తెలుసుకోవడం.. కనుక్కోవడం అన్వేషణ ఔతుందేమో.

ఉండీ తెలియని దాన్ని కనుక్కోవడం శోధన ఔతుందా.?

కిందినుండి ట్యాక్సీ వచ్చినట్టు మొబైల్ లో టెక్స్ట్ వచ్చింది చిన్న కదలికతో. అంతా రెడీగా ఉన్న ముక్త గబగబా తన సూట్ లోనుండి బయటకొచ్చి ఎలివేటర్ లో బయల్దేరింది. డెబ్భై రెండు అంతస్తులు నాలుగు నిముషాల్లో.

పది నిముషాల్లో పెన్ యూనివర్సిటీ.. లోపల.. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిలాసఫీ.. ప్రత్యేక సెమినార్ హాల్.

ఎంతో హుందాగా .. వాతావరణం.

అప్పుడే ఆరంభమై మొదటి వక్త మాట్లాడుతున్నాడు నైరోబీ నుండి.

ప్రపంచ వ్యాప్తంగా.. ‘ శాశ్వతత్వం.. అమరత్వం ‘ మీద ఉన్న అనేకానేక భావనలను ఏ ఏ దేశాల పురాణాల్లో, నాగరికతల్లో ఏమి ఉందో ఒక్కొక్కరు చెబుతూంటే ఆశ్చర్యంగా విచిత్రంగా ఉంది ముక్తకు. చాలా వరకు మనిషి మరణానంతరం పునర్జన్మలుంటాయనీ.. ఆత్మలు.. విశాల విశ్వంలో తమకు తుల్యతతో సంధానం కాగలిగే ఇతర శరీరాన్ని వెదుక్కుని అక్కడ స్థిరపడ్తాయనే భావనలే ఉన్నాయి. ఒక ఈజిప్షియన్ ప్రొఫెసర్ కూడా మృత దేహాలను భద్రపరిచి ఆత్మల పునః ప్రవేశానికి ప్రయత్నించవచ్చుననీ మమ్మీల ప్రస్తావనను తెచ్చాడు తన పేపర్ లో.

ముక్త కూడా ఆ అంశంపై విపులమైన భారతీయ తాత్విక చింతనను వినిపించింది.

అందుకు.. స్టీఫెన్ హాకింగ్ చెప్పిన హైపాతిసిస్ ను ప్రస్తావించిందామె. ఆయనేమన్నాడంటే ‘ మనిషికున్నట్టే నక్షత్రాలకు కూడా మరణముంటుందన్న విషయం సామాన్య ప్రజానీకానికి అర్థం కాదు. నక్షత్రం పతనమై ‘ కాలబిలం ‘ గా మారుతుంది. దీన్ని నేరుగా చూడలేము. దీన్నే ‘ హాకింగ్ రేడియేషన్ ‘ అని అంటారు. మనిషి చనిపోయిన తర్వాత విశ్వంలో కనిపించని తీరాలకు వెళ్ళుతాడని కొందరి భావన, ఈ రెండింటికీ కొంత సామ్యముంది. కాలబిలంలో ఏ వస్తువు పడినా అది మాయమై అంతిమంగా హాకింగ్ రేడిఏషన్ గా మారుతుంది ‘

హాకింగ్స్ బిగ్ బ్యాంగ్ సంభవించినప్పుడు ఈ విశ్వం ఆరంభమైందని విశ్వసిస్తాడు.

కాగా.. మనిషి మరణానికి ముందు.. మరణానంతర స్థితీ.. క్రయోజెనిక్స్.. ఈ దిశలో స్టీఫెన్ హాకింగ్స్ రాసిన ‘ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం ‘, ‘ బ్లాక్ హోల్స్ అండ్ బేబీ యూనివర్శ్ , ‘ నేచర్ ఆఫ్ స్పేస్ అండ్ టైం ‘, ‘ ద గ్రాండ్ డిజైన్ ‘, ‘ ద డ్రీంస్ దట్ స్టఫ్ ఈజ్ మేడాఫ్ ‘ వంటి సాధికారిక గ్రంథాలను ఉటంకించిందామె.

విపరీతమైన ప్రతిస్పందన వచ్చింది శ్రోతలనుండి.

అకడమీషియన్స్ అద్భుతమైన జ్ఞానసంబంధ విషయాలను ఎవరిద్వారా విన్నా.. తాము చెప్పినా మాటలకందని మహదానందాన్ని పొందుతారు.

అటువంటి అద్భుతానుభూతిని పొందుతూనే హోటల్ కు వెళ్ళి .. క్షణాల్లో ఖాళీ చేసి.. ఒక పది నిముషాల్లో ‘ ఫిలడెల్ఫియా ‘ ఏర్ పోర్ట్ కు బయల్దేరి.. మరో గంటలో బ్రిటిష్ ఏర్ వేస్ విమానాన్ని అందుకుంది ముక్త.

మనుషులకు ప్రపంచం చాలా చిన్నదైపోయింది.

ఫిలడెల్ఫియా నుండి ఢిల్లీ పద్దెనిమిది గంటలు. హోస్టేస్ ఇచ్చిన ఫుడ్ తిని ఒక ట్రాంక్విలైజర్ వేసుకుని పావుగంటలో నిద్రలోకి జారుకుంది ముక్త.

మధ్యలో హీత్రూ.. లండన్.. ఫ్లైట్ చైంజ్.. మారి మళ్ళీ పడుకుంది.. ఆరు గంటలు.. ఢిల్లీ.

కాలాన్ని వెంటాడుతూ మనిషి.. మనిషిని వెంటాడుతూ కాలం.

టైం చూచుకుంది ముక్త .

తేదీ 6 జూన్, 2018 సాయంత్రం 3.22 నిముషాలు.

దిగి కృష్ణ చైతన్య బుక్ చేసి పెట్టిన ఇన్నోవా క్యాబ్ ను పట్టుకుంది బయటకు రాగానే ‘ మేడం ముక్త ‘ అని ఒక ప్లకార్డ్ ను చూచి.

ఇక ఇన్నోవా బయల్దేరి.. ఒకటే పరుగు వంద స్పీడ్ తో.. ఘజియాబాద్.. మీరట్.. అలా.

కృష్ణ చైతన్య జ్ఞాపకమొచ్చాడు.. చాలా గమ్మత్తుగా పరిచయమైన తాత్వికుడు.. తత్వవేత్త.. రోదసీ శాస్త్ర నిపుణుడు.. మొన్న మొన్నటిదాకా ఇలాన్ మస్క్ కు సంబంధించిన ‘ స్పేస్ ఎక్స్ ‘ అనే ఒక ప్రైవేట్ అంతరిక్ష కేంద్రంలో అడ్వాన్స్డ్ డిజైనర్ గా పని చేసి ‘ రీ యూజబుల్ రాకెట్స్ ‘ ను రూపొందించి ప్రపంచ స్పేస్ సైంటిస్ట్ లను నివ్వెరపర్చి.,

‘ ట్విట్టర్ ‘ ద్వారా పరిచయమైన వ్యక్తి.,

మీది ఇండియా.. నాదీ ఇండియే, నువ్వు సైటిస్ట్ వు.. నేనూ సైటిస్ట్ నే, నువ్వు జీవితాన్ని లోతుగా, విసృతంగా చూచిన వాడివి.. నేనూ అంతే.. డిటో, ఈ రకంగా పరిచయమై.. పరిచయం స్నేహమై.. స్నేహం ఇష్టమై.. ఇష్టము సన్నిహితంగా మారుతున్న క్రమంలో.,

ఒక రోజు నెట్ లో తెలుగు పత్రిక ‘ ఈనాడు ‘ చూస్తోంది ముక్త కొలంబియా క్వార్టర్ లో. ప్రేమ తెలుగు భాష మీద.. తెలుగు పత్రికల మీద.. తెలుగు మాట్లాడుతూ ఎవరైనా తారసపడ్డా. ఆ రోజు ఆదివారం.. క్లాసిఫైడ్ యాడ్స్.. రెండున్నర పేజీలు. అట్లా చీమల బారులా చూపులను ప్రాకించుకుంటూ పోతూంటే.,

కనబడ్డది ఈ కృష్ణచైతన్య యాడ్.

‘ స్నేహితురాలు కావలెను ‘ అని శీర్షిక.

రెండు మూడు డాక్టరేట్ లు చేసి అపారమైన ఉద్యోగానుభవమూ, జీవితానుభవమూ ఉన్న 42 ఏండ్ల యువకునికి.. భారతీయ సంస్కృతిపట్లా, వారసత్వం పట్లా.. భారత పుణ్యభూమి పట్లా మనస్పూర్తి గౌరవమూ, ప్రేమా ఉన్న దాదాపు నలభై ఏండ్ల విద్యావంతురాలు స్నేహితురాలిగా కావలెను.

కింద కాంటాక్ట్ వివరాలు.

ఇదేదో కొత్తగా, గమ్మత్తుగా అనిపించి కాల్ చేసి.. ట్విట్టర్లో పలకరించి.. అట్లా మొదలైంది పరిచయం.

ఇప్పుడిలా.,

‘ ల్వారా ‘ ఒక అద్భుతమైన ప్రాంతం.. అలకానంద నది ఒడ్డున. అక్కడికి చేరుకునేసరికి సాయంత్రం ఐదయ్యింది. చుట్టూ అన్ని హిమాలయ పర్వత సానువులు. సముద్ర మట్టానికి ఏ రెండువేల అడుగుల ఎత్తుననో ఉందది. మొత్తం వాతావరణమే పూర్తిగా మారిపోయింది. అంతటా పచ్చగా పర్వతాలు.. కోనిఫర్ చెట్లు.. ఒంటి నిండా చలి ఉడుపులు ధరించిన గ్రామీణులు. అక్కడక్కడ ఒంటినిండా బాగా బొచ్చు ఉన్న గొర్రెలను మేపుతూ.. కాపరులు.

ప్రత్యేకంగా ఇటువంటి ప్రకృతినీ, వాతావరణాన్నీ ఇష్టపడే మనుషుల జాతి ఒకటుంటుందని గ్రహించిన ఎంట్రప్యునర్ ఎవరో ఇక్కడ ఈ ‘ రిసార్ట్స్ ‘ ను కట్టించినట్టున్నాడు.

” కమాన్..వెల్కం ” అని ఎదురొచ్చాడు కృష్ణ చైతన్య ఇన్నోవా దిగుతూండగా.

గడ్డం..కొద్దిగా అక్కడక్కడ తెలుపుతో.. తెల్లని ముఖం.. బక్కపలుచగా.. భుజాలపై శాలువా కప్పుకుని.. సింపుల్ గా.

దిగి.. రిసార్ట్ లోకి వెళ్తూంటే.. ‘ గెట్ రిఫ్రెష్డ్.. దెన్ కం.. అక్కడ ఆ చెట్టుకింద కూర్చుంటా.. ప్రక్కనే అలకానంద నది ఉంది.. నదితో మాట్లాడ్దాం కాస్సేపు ..ఊc .. ” అని వెళ్ళిపోయాడు.

ఎన్నాళ్ళనుండో బాగా పరిచయమున్న మనిషిలా అనిపించిండు కృష్ణచైతన్య.

ఒక పావుగంట తర్వాత ముక్త బయటికొచ్చి మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ ఆ కొండ ప్రాంతంలో అతని దగ్గరికి చేరుకుంది.

అప్పటికి ఒక చెట్టు బోదె కు ఒరిగి కూర్చుని, కళ్ళు మూసుకుని హరిప్రసాద్ చౌరాసియా మురళీ గానాన్ని వింటున్నాడు లీనమై.

అలికిడి విని.. కళ్ళు తెరిచి.. ” కూర్చో ” అన్నాడు. ” బహు వచనాలు మనుషుల మధ్య అపరిచయాన్నీ, దూరాన్నీ సూచిస్తాయని అనుకుంటా ”

మొబైల్ లో చౌరాసియాను ఆపేశాడు.

” నది సవ్వడీ.. వేణువు ధ్వనీ రెండూ కలగలిసి బాగున్నాయిగదా” అంది ముక్త అప్రయతంగానే.

” సూర్యుని అస్తమయ కిరణాలు స్వర్ణ ఛాయలో ఈ ప్రకృతిని ఇంకా అందంగా చూపెడ్తున్నాయిగదా ” అంది ఎందుకో.

” ఔను .. ”

మళ్ళీ నిశ్శబ్దం.

” నీ గురించి అంతా తెలుసు నాకు.. డెత్ ఆఫ్ డెత్.. జాస్ లూయిస్ కార్డిరో, డేవిడ్ వుడ్.. మీ కొలంబియా ప్రాజెక్ట్.. మీరు           ఇండియన్.. అంతా తెలుసుకున్నాను ” అన్నాడు కృష్ణ చైతన్య.

” మీ గురించి కూడా తెలుసు నాకు.. అంతా ” ప్రక్కనే ఇద్దరి సంభాషణలను వింటున్న అలకానంద లోకి చూస్తూ.,

” తెలుసా నీకు ఈ మానవ దుర్మార్గులు ఈ అలకానంద నది మీద మొత్తం ముప్పై ఏడు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ లు కడ్తున్నారు .. ఇది సహజ ప్రకృతి నియమాలకు విరుద్దమైన దుశ్చర్య. అందువల్ల ప్రకృతి విలపించి, విలయించి మనిషిని ధ్వంసం చేస్తుంది. గతంలో 13 నుండి 17 , 2013 వరకు కేదార్ నాథ్ పరిసర ప్రాంతాలన్నీ జలప్రళయంలో చిక్కుకుని 5700 మంది చనిపోయిన వినాశనాన్ని సృష్టించడం తెలుసుగదా మనకు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సునామీలన్నీ కూడా ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం వల్లనేనని ఈ మానవాథములు ఎప్పుడు గ్రహిస్తారో. ”

ముక్తకు అతని దృష్టి నచ్చింది.

మీరు చేస్తున్న ” మరణాన్ని జయిస్తున్న మనిషి ” ప్రాజెక్ట్ కూడా యాంటీ నేచర్. ప్రకృతి విరుద్ధ చర్య. స్టీఫెన్ హాకింగ్స్ ఏమన్నాడో తెలుసా.. ” ఐక్య క్షేత్రీయ సిద్ధాంతాన్నీ.. యూనిఫైడ్ ఫీల్డ్ థియరీనీ చెప్పి , సర్చ్ ఫర్ ఎక్స్ ట్రా టెర్రెస్ట్రియల్ ఇంటెల్లిజెన్స్ ” అని భూ గ్రహేతర జీవులుండవచ్చు నని భావించి.. ఎప్పుడైతే ఈ సృష్టి నియమాలనూ, ధర్మాలనూ తన అతి తెలివితో మనిషి నాశనం చేస్తాడో.. అప్పుడు ప్రకృతి విలయించి సర్వాన్నీ ధ్వంసిస్తుంది.” అని. అదంతా మాట్లాడుతున్నప్పుడు అతని గొంతులో ఒక స్థిరత్వం.. పూర్ణత.. లోతూ ధ్వనించాయి.

” మన భగవద్గీత.. సాంఖ్య యోగం లో కూడా.. శ్రీ కృష్ణుడు మనిషి ప్రకృతి నియమాలకూ, ధర్మాలకూ విఘాతం కలిగించిననాడు ఈ సృష్టి సమాప్తమౌతుందని సెలవిచ్చాడు గదా. ” అంది ముక్త నిలకడగా.

కృష్ణచైతన్య తలెత్తి ఆమె కళ్లలోకి చూశాడు సాలోచనగా.

” ఇక నేను నిర్ణయించుకున్నాను. జీవితంలో విద్యా దాహంతో చాలా చాలా చదువులే చదివాను. అనేక దేశాలు తిరిగాను. చాలా విజయాలను సాధించాను. కాని పుస్తకాలలో లేని అనుభవపూర్వకంగా తెలుసుకునే చదువు వేరే ఉందని నా మాతృభూమికి తిరిగొచ్చాను ముక్తా.. ఇక నేనీ పవిత్ర భూమి పైననే నా మనుషులకు ఉపయోగపడే కార్యాల్లో నిమగ్నమై తరించాలనుకుంటున్నాను. నేనిప్పుడు అతీతుణ్ణి.”

” నేను కూడా” అందామె.

కాస్సేపు గడిచిన తర్వాత.. ” నా గురించి తెలుసుకోవాలని లేదా మీకు ” అంది.

” అవసరం లేదు ”

” నాకూ అంతే ”

” నా గురించి తెలియజేసే ఒక నా కవితను నీకిస్తా.. చదువు” అని భుజానికున్న సంచీలోనుండి.. ఒక ఎ ఫోర్ సైజ్ కాగితాన్ని మడత విప్పి ఇచ్చాడు ముక్తకు.

ఆమె దాన్ని విప్పి చదవడం ప్రారంభించింది.

శీర్షిక ‘ మళ్ళీ మాతృగర్భంలోకి వెళ్ళాలని ..’

తలెత్తి అతనివంక భావశూన్యంగా చూచి.. చదవడంలో పడిపోయింది. అప్పుడామెను నిశితంగా గమనిస్తున్నాడతను.

ఒక పది నిముషాల తర్వాత..” నాక్కూడా సరిగ్గా ఇలాగే మళ్ళీ మాతృ గర్భంలోకి నిష్క్రమించాలని ఉంది.. ఈ నేలపై.. ఈ పవిత్ర భూమిపై.. ఇక్కడే .. ఈ గాలిలో..” ఇంకేదో అంటోంది ముక్త. అతను ఆమెకు దగ్గరగా జరిగి.. ఆమె భుజంపై సుతారంగా చేతిని వేసి చుట్టేశాడు.

వాళ్ళ సమక్షంలో అలకానంద నది ఒక నిశ్శబ్ద సాక్షివలె నవ్వుతూ ప్రవహిస్తోంది.

13

తేది 2 జూన్ 2018 :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేండ్లు.

తెలంగాణా భూభాగంలోని పాత పది జిల్లాలనూ.. తర్వాత 31 జిల్లాలుగా మారిన తర్వాత అన్ని ప్రాంతాలనూ ఒక ఫుల్ టైం కార్యకర్తగా విపరీతంగా తిరిగింది సుభద్ర. పార్టీలో ఎవరినడిగినా సుభద్ర పేరు చెబుతరు. ఎందుకంటే మనస్పూర్తిగా పార్టీకోసం రాత్రింబవళ్ళు పని చేస్తూ ఏ ఒక్కనాడూ ఏ పదవినీ.. ఏ కుర్చీనీ ఎవరినీ అడిగిన పాపాన పోలేదామె. ఎవరినీ ఏ పేవర్ చేయమనీ అడుగలేదు. గీ పైరవీ కోసం ఏ ఎమ్మెల్యే నో. ఎం పి నో అడిగిన ఉదంతమూ లేదు.

సుభద్రంటే.. పార్టీలో పెద్దోల్లను ” అన్నా..అన్నా” అనుకుంట .. చిన్నోల్లను ” అరే తమ్మీ.. తమ్మీ ” అని పిల్చుకుంట ఏ పార్టీ పనినైనా అద్భుతంగా , నమ్మకంగా చేసే మనిషని పెద్ద గుర్తింపు. ప్రతివానికీ, ప్రతి కార్యకర్తకూ తెలుసామె.

అమరవీరుని తల్లిగా ఆమెకు ప్రభుత్వం పది లక్షల రూపాయల సహాయం చేసిండ్లు. తీసుకున్నది. కుటుంబానికొక ఉద్యోగం ఇస్తానంటే తనే క్వాలిపై ఐ ఉన్నా.. పార్టీలనే ఒక ఫుల్ టైమర్ ఉద్యోగమిమ్మన్నది. ప్రభుత్వ సంస్థ ఒకదాంట్లో ఆమెను అపాయింట్ చేసి డిప్యుటేషన్ మీద పని చేసుకుంటున్నది. అదే ఆమె జీవనోపాధి.

మనిషి నిప్పు. మాట తూటా.. అని అందరంటరు.

వి. ప్రకాశ్ గారితో.. ” గా ఆర్ ఎస్ ఎస్ లో వలె మనదగ్గర కూడా ఒక ఫుల్ టైం మనుషుల సైన్యం వంటిదుండాలన్నా.. ఊళ్ళల్ల మనదనబడే క్యాడరుండాలె.. కాస్త చదువుకున్న నాలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఊరూరు తిరిగి కాన్ ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఇచ్చే వ్యవస్థ ఉండాలె. ” అని ప్రతిపాదిస్తది సుభద్ర ఎం.ఎ. వింటూంటే నిజమే ఆమె చెప్పేవన్నీ నిర్మాణాత్మకమైనవే అనిపిస్తది.

ఉత్తర తెలంగాణా అంతా తిరిగి మొత్తం నూటా ఎనభై ఊళ్ళ పార్టీ పొజిషన్ ను డైరెక్ట్ గా కేసీఅర్ కే ఇచ్చింది అతి విశ్వసనీయంగా. అందువల్ల సుభద్రంటే గౌరవంతో పాటు.. కొద్దిగా భయంకూడా ఉన్నది క్యాడర్ ల.

మొన్న మొన్న మూడున్నర సంత్సరాలు పూర్తయినప్పుడు పది కొత్త జిల్లాలను సుడిగాలివలె తిరిగి మొత్తం విలేజ్ వైజ్ రిపోర్ట్ లను , మొత్తం రెండు వేల పేజీలను తయారు చేసిచ్చింది పార్టీ ఆఫీస్ ల.. ముఖ్యమంత్రికి కూడా.

ప్రకాశ్ గారిక్కూడా ఒక కాపీనిచ్చింది.

పార్టీ ప్రతిష్టను విపరీతంగా పెంచిన ప్రభుత్వ పథకాలు 1) వృద్ధాప్య ‘ ఆసరా ‘ పెన్షన్ లు.2) మనిషికి ఆరు కిలోల బియ్యం 3) రైతులకు 24 గంటల నిరంతరాయ విద్యుత్తు. 4) దివ్యాంగుల రు 1500 స్కీం 6) సింగిల్ వుమన్ పెన్షన్ పథకం 7) ఏ అవరోధమూ లేకుండా ‘ షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి ‘ పథకం. 8) మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి ఉచిత నల్లా పథకం 9) మిషన్ కాకతీయ కింద ఊరి చెరువులను బాగు చేసి నీళ్ళతో నింపుడు పథకం 10) ఆడపడుచులకు ఉచిత బతుకమ్మ చీరల పంపకం.11) పాఠశాలలో, ఇంటర్ కాలేజ్ లలో కూడా మధ్యాహ్న భోజన పథకం 12) ముస్లిం గురువులకూ, బ్రాహ్మణులకూ వేతన స్కీం 13) ప్రతి కులానికీ ఆత్మ గౌరవ భవనాలను హైదరాబాద్ లో నిర్మించుట. 14) గురుకుల పాఠశాలలను అన్ని మతాల, కులాల వాళ్ళకు ఏర్పాటు చేయుట. ఇవన్నీ కింది స్థాయి ప్రజలకు వెంటనే అర్థమయ్యేటివి కాబట్టి.. తక్షణ ప్రశంస లభిస్తోంది. 15) కుటుంబ రేషన్ ను ఎక్కడ బడితే అక్కడ తీసుకునే ఏర్పాటు 16) బాగుపడ్డ గ్రామీణ రోడ్లు. 17) ఎనభై ఏండ్ల తర్వాత గ్రామాళ్ళో పంచాయితీలు తెగిపోయి ఖచ్చితమైపోయిన భూముల పాస్ బుక్కులు. 18) రైతుబంధు పెట్టుబడి సహాయ పథకం పంటకు రు 4000 వేలు. 19) పునరుజ్జీవనం పొందుతున్న తెలంగాణ గ్రామీణ కళలు. 20) తెలంగాణ సంస్కృతికి విస్తరిస్తున్న ఖ్యాతి.

కాని సామాన్య జనానికి ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాసల కోర్చి నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించిగానీ.. హైదరాబాద్ లో ప్రారంభించిన మెట్రో రైలు గానీ.. నగరాల్లో వేసిన అనేక కోట్ల విలువైన రోడ్లు గానీ ఓటర్లకు ఎక్కడంలేదు.

మొన్న ‘ జల వనరుల అభివృద్ధి సంస్థ ‘ చైర్మన్ వి.ప్రకాశ్ గారినడిగి ‘ కాళేశ్వరం ప్రాజెక్ట్ ‘ కు సంబంధించిన అన్ని ప్రాంతాలను నేనూ, నా ఐదుగురు సభ్యులతో పర్యటించేందుకు లెటర్ ను తీసుకుని పోయొచ్చినం ఐదు రోజులు.

అబ్బో..కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజంగానే ఒక ప్రపంచ వింత.

తెలంగాణ లోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రపంచంలోని అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా పేర్కొనబడింది, ఇది అనేక ప్రాంతాలను కలువైపుతూ రాష్ట్రంలోని నీటిదుఃఖం దూరం చేయడానికి రూపు దిద్దుకుంటోంది. మహారాష్ట్రలోని విదర్భ తర్వాత రైతుల ఆత్మహత్యలు రెండో అత్యధిక సంఖ్యలో నమోదయ్యే రాష్ట్రంలో తరచుగా రుతుపవన వర్షాలు లేదా నీటిపారుదల సౌకర్యాలు లేకపోవటం వల్ల సంభవిస్తున్నాయి, ఈ ప్రాజెక్టు తెలంగాణలోని విషాదకర కథను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు కూడా. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రైతులకు తన అతిపెద్ద ఎన్నికల వాగ్ధానాల్లో ఒకటిగా కాళేశ్వరం పథకం ఇది కెసిఆర్ ప్రభుత్వానికి మంచి మైలేజు ఇచ్చే ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. రికార్డు బద్దలు కొట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఇది.

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం వ్యయం రూ 80,000 కోట్లు. ఇంతవరకు దేశంలోనే మొదటి అత్యంత వ్యయంతో కూడిన రాష్ట్ర ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. కాలేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు 13 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల భూమిని పండించడం, మరో ఏడు జిల్లాలలో 17 లక్షల ఎకరాల స్థిరీకరణ – దాదాపు మొత్తం రాష్ట్రాన్ని కవర్ చేస్తుంది.

కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు రాష్ట్రంలోని అనేక పట్టణాలు మరియు నగరాలకు, ముఖ్యంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ యొక్క అత్యంత ముఖ్యమైన నగరాలకు త్రాగునీటిని అందిస్తుంది. అంతేకాక, అనేక రాష్ట్రాలలో పరిశ్రమలకు నీటిని ఈ ప్రాజెక్టు అందిస్తుంది. కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు నీటిని ఎలా సరఫరా చేస్తుంది మరియు ఎలా పంపిణీ చేస్తుందంటే, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు గోదావరితో మూడు నదుల సంగమం వద్ద నీటిని నియంత్రిస్తుంది. దీనికోసం జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని మేడిగడ్డలో ఒక డ్యాము నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి నీటిని ప్రధాన గోదావరి లోకి రివర్స్ పంప్ చేయబడుతుంది మరియు రిజర్వాయర్స్, నీటి సొరంగాలు, పైపులైన్లు మరియు భారీ కాలువలు మరియు సంక్లిష్ట వ్యవస్థలోకి మళ్ళించబడుతుంది.

కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు ఏడు లింకులు మరియు 28 ప్యాకేజీలుగా విభజించబడింది. దీనికోసం 13 జిల్లాలలో 20 జలాశయాలను త్రవ్వించాల్సిన అవసరం ఉంది, ఇది 145 టిఎంసి జలాల మొత్తం సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రిజర్వాయర్లన్నీ సుమారు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొరంగాల నెట్వర్క్ ద్వారా అనుసంధానించబడతాయి.

పొడవైన సొరంగం 21 కిలోమీటర్ల పొడవు మరియు మేడారం రిజర్వాయర్తో ఎల్లంపల్లి రిజర్వాయర్ను కలుపుతుంది. ప్రాజెక్ట్ కింద కాలువ నెట్వర్క్ 1832 కిలోమీటర్ పరిధిలో ఉంటుంది, మూలం నుండి 500 కిలోమీటర్ల వరకు నీరు తీసుకొనివెళుతుంది. గజవెల్ లోని కొండపొద్దమ్మ జలాశయం ప్రాజెక్టు ప్రధాన కేంద్రం 650 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రధాన సముద్ర మట్టం నుండి నీటిని తీసివేయబడుతుంది.

ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కాబోతోంది, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు 139 మెగావాట్ల మముత్ పంపులు 2 వేల మిలియన్ క్యూబిక్ అడుగుల (టిఎంసి) రోజువారీ నీటిని ఎత్తివేసేదాంట్లో ప్రపంచ రికార్డ్ను సృష్టిస్తుంది. 2 టి ఎం సి ల నీరు అన్నారం మరియు సుందిళ్ళ – రెండు బారెట్లను పంప్ చేయబడుతుంది. ఇక్కడ నుండి, నీరు ఎల్లంపల్లి రిజర్వాయర్కు వెళుతుంది. నీటి పంపిణీని ఎల్లంపల్లి నుండి గురుత్వాకర్షణ కాలువలు మరియు పైప్లైన్ల ద్వారా ప్రారంభిస్తారు. దీనికి అవసరమైన నీరు ప్రపంచంలోనే పొడవైన నీటిపారుదల సొరంగం 14.09 కిలోమీటర్ల భూగర్భ సొరంగం ద్వారా మేడిగడ్డ బారేజ్ నుండి వస్తుంది. గుహ మరియు సర్జ్ పూల్, పంప్ ఎక్కడ పనిచేస్తుందో అక్కడ నుండి 2 కోట్ల లీటర్ల నీటిని కలిగి ఉన్న సామర్ధ్యంతో ప్రపంచ రికార్డు కూడా ఉంది.

తెలంగాణ నీటిపారుదల మంత్రి టి హరీష్ రావు ఈ సంవత్సరం దసరా కి, 120 కిలో మీటర్ల పొడవైన లింక్, సొనాల్స్, కాలువలు మరియు పంపులు మేడిగడ్డ మరియు మిడ్ మానేర్ రిజర్వాయర్ల మధ్య సిద్ధంగా ఉన్నాయనీ, దీనితో 50 శాతం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయనీ అన్నారు.

మేము ఐదుగురు కార్యకర్తలం ఈ ఐదు రోజులలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మరియు ఎల్లంపల్లి ప్రాంతాలను చాలా సునిశితంగా పరిశీలించుకుంటూ వచ్చాం. నిజంగా మేము పొందిన ఆనందం వర్ణనాతీతం. ఇది నిస్సందేహంగా మన తెలంగాణా బిడ్డలందరూ ఎంతో గర్వించదగ్గ ప్రాజెక్ట్. ప్రపంచంలో మన కీర్తి కిరీటాన్ని ధగద్ధగాయమానం చేయగల మానవ నిర్మిత మహాద్భుతం.

‘ జై తెలంగాణ ‘ అని ఎలుగెత్తి నినదించడం కంటే మేము ఏమీ చెయలేము.

గర్విస్తున్నాము మేము ఈ వీర తెలంగాణ గడ్డపై పుట్టినందుకు.

కార్ వస్తూనే ఉంది ఆ రాత్రి కాళేశ్వరం నుండి.

తాడ్వాయి, గోవిందరావు పేట, ములుగు.. గూడెప్పాడ్.. అట్లా.

డైరీ రాసుకుంటున్న సుభద్ర ‘ ఇంకా టైముందిగదా. ఫినిష్ చేద్దాం ‘ అని రాస్తూనే ఉంది.

కాని ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పనిని సామాన్య ప్రజలు అర్థం చేసుకోరు. దాదాపు 1600 మంది ఇంజనీర్లు, టెక్నీషియన్లు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారక్కడ. ఎవరికోసం. మనకోసమేకదా అని అనుకునే జనం కావాలె.

సరే.. ప్రజలు ఎక్కడివాళ్ళైనా సరే.. కోడి సంస్కృతి ప్రబలిపోయింది. తినుడు.. ముక్కు నేలకు రాసి మరుక్షణమే మరచిపోవుడు. ఎవడు నాల్గు రూపాయలిస్తే వానికే జై అనుడు. నాయకులలో లేనట్టే ప్రజల్లో కూడా నీతి లేదు. ఏ రోటికాడి పాట ఆ రోటికాడనే.

రెండు విషయాలున్నై. ఒకటి: ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను బాగనే పెంచిందిగదా. మరి మళ్ళీ ప్రజల దగ్గరినుండి ఎగబడి లంచాలను తినుడెందుకు. ఎంత అవినీతో ప్రభుత్వ ఆఫీస్ లల్ల. అరికట్టలేనంత. రెండు: ప్రభుత్వం ఇస్తున్న ఈ సకల సౌకర్యాల వల్ల చిన్న నిమ్న కుటుంబాల మగోళ్లు.. ఇక పని చేసుడెందుకు .. హాయిగ ఉదయం పది రూపాయలు పెట్టి టిఫిన్ చేస్తే, మధ్యాహ్నం ఐదు రూపాయల భోజనాలు రెండు తింట పాంచ్ రూపాయ్ ల క్యాంటిన్ల , ఐదు రూపాయల చాయ్ లు రెండు తాగుత రోజూ, రాత్రికి 90 ఎమ్మెల్ ఆఫీసర్స్ చాయిస్ .. అరవై రూపాల్.. తాగి ఐదు రూపాయల భోజనం చేసి.. మంచిగ ఇంటికొచ్చి పెండ్లాం పక్కల పంట. బస్.. ఇగ పని చేసుడెందుకురా.. ‘ డబుల్ బెడ్ రూం ఇల్లు వస్తది గదా రేపో మాపో ‘

భారత దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశ పౌరులను ఒక మానవ వనరుగా మార్చుకోవలసింది పోయి.. అందిరినీ ‘ సోమరిపోతులుగా.. నిరర్థక మానవులుగా ‘ తయారు చేస్తున్నాయి.

వేదన.. ఆరని, తీరని వేదన.. ఆవేదన.

ఇంటికొచ్చింది సుభద్ర. రాత్రి తొమ్మిది దాటింది.

ఇంటికి రాగానే.. ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది.

ముందు హాల్లోనే ఒక సోఫాలో చెన్నకేశవులు గారు.. పడుకోనున్నారు. అటు ప్రక్కన రాజ్యలక్ష్మి అమ్మ. ఇటు కుర్చీలో ఫామీలీ ఫ్రెండ్ డాక్టర్ మురళీకృష్ణ గారు.

” ఏమైంది డాక్టర్.. ఏమైందమ్మా ” అంది సుభద్ర ఆతురతగా.

“పొద్దున్నే తెలిసిందిరా.. ఈయన పేపర్ ను తలకిందులుగా పట్టుకుని చదువుతున్నాడు.. పలకరిస్తే వెర్రి చూపులు చూస్తున్నాడు. అస్సలు నన్నే గుర్తు పట్టడంలేదు. కాఫీ తాగమంటే..కాఫీనే గుర్తు పట్టడం లేదు. వెంటనే మురళీకృష్ణ గారికి ఫోన్ చేసిన. నువ్వేమో కాళేశ్వరం వెళ్తివిగదా. డాక్టర్ గారు వచ్చి హాస్పిటల్ కు తీసుకెళ్ళి.. అన్ని పరీక్షలూ చేసి తేల్చిందేమిటంటే.. ఈయనకు ‘ డిమెన్షియా ‘ అట. మనుషులనూ, వస్తువులనూ, దేన్నీ గుర్తుపట్టలేరిక. అయ్యో భగవంతుడా.. ” అని తల బాదుకుంది.

పాపమనిపించింది. దుఃఖం కూడా పొంగుకొచ్చింది.

లేచి దగ్గరగా వెళ్ళి చూచింది సుభద్ర చెన్నకేశవులును.

“ ఒక ట్రాంక్విలైజర్ ఇచ్చామమ్మా. పడుకుంటాడు.. డిస్టర్బ్ చేయకండి “. పాపం చెన్నకేశవులు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.

సుభద్ర గబగబా ప్రక్కనున్న చెన్నకేశవులు బెడ్ రూం లోకి వెళ్ళి.. పెద్ద అట్టపెట్టెను పట్టుకొచ్చింది.

” అమ్మా.. ప్రతిరోజూ ఈ దిక్కుమాలిన దేశంలో జరుగుతున్న భయంకరమైన అవినీతినీ, దోపిడీలనూ, మోసాలనూ, దగాలనూ, అకృత్యాలనూ చూడలేక ఈ పేపర్ల నిండా మార్కర్ తో గీతలు గీస్తూ క్షోభ పడ్తున్నాడే.. ఇక ఆ అవసరం లేదు. అతనికి ఈ దేశం ఎవరిదో తెలియదు.. ఈ ప్రభుత్వాలూ, అవినీతీ, ఎవడెవడు ఎన్ని కోట్లు తింటున్నాడో తెలియదు. పాపం ప్రశాంతంగా ఉంటాడు. నీ మొర విని ఈయనకు దేవుడు ఒక పరిష్కారం చూపించాడు. ఈ డిమెన్షియా వ్యాధినిచ్చి.” అంది సుభద్ర చెన్నకేశవులు మీద పడి బిగ్గరగా ఏడుస్తూ వెక్కెక్కి .

కొద్ది నిముషాల తర్వాత అంది సుభద్ర రాజ్యలక్ష్మితో ” అమ్మా, అధైర్య పడకు. నేనున్నానుగదా నాన్నను కంటి రెప్పలా చూచుకోడానికి ” అని.

రాజ్యలక్ష్మి నిరామయంగా సుభద్ర వంక చూచింది.

మనుషుల్లో దేవుడు లేకపోయినా అప్పుడప్పుడు కనీసం మనుషులైనా ఉంటారా.?

( ఐపోయింది )

 

రామాచంద్ర మౌళి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు