మరో పదేళ్ళ మలుపు…

ఇప్పటికీ సారంగలో ముప్పాతిక వంతు రచనలు పూర్తిగా కొత్త తరం రచయితలవే అని మేం సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. కొత్తగా రాస్తున్న వాళ్ళు ఎలాంటి సంకోచమూ, సంశయమూ లేకుండా సారంగ కి తమ రచనలు పంపించే స్నేహ భావనని సారంగ కొనసాగిస్తూ వస్తోంది.

మార్చి మూడో తేదీ- సారంగ రెండో దశాబ్దంలోకి చేరుకుంది.

ఈ పదేళ్ళలో ఎన్నో మేలు తలపులు. ఇంకెన్నో మలుపులు. ప్రతి పదేళ్ళకోసారి సాహిత్యం మారుతోందంటే మనలో ఎంతమంది నమ్ముతారో లేదో తెలియదు గానీ, ఈ పదేళ్ళలో సారంగ సాక్షిగా ఎన్నో మార్పులు జరిగాయి, లేదా- ఎన్నో మార్పుల మలుపులకు సారంగ ఎంతో కొంత ప్రత్యక్షర సాక్షి. ఈ పదేళ్లని వొక అంచనా వేయాలంటే గత పదేళ్ళ సారంగ సంచికల్ని కొన్ని అయినా చూసి తీరాలన్న బలమైన ఆకాంక్షని వెలిగించిన వేదిక ఇది. అన్నిటికీ మించి, ఈ దశాబ్దంలో వెలుగు చూసిన ఎందరో కొత్త కవులూ, రచయితలూ, విమర్శకులకు తొలిదశలో ఇల్లూ వాకిలి ఇదే అంటే అతిశయోక్తి కాదు.

2013 మార్చి మొదటి వారంలో వారపత్రికగా మొదలైంది సారంగ.

అప్పుడు ప్రతి గురువారం సారంగ వారం అని రచయితలూ, పాఠకులూ గుర్తు పెట్టుకునే స్థితికి ఎదిగింది. తెలుగు సాహిత్య పత్రికలకు, పేజీలకు సంబంధించి ఈ వారాలు చాలా ముఖ్యం. సోమవారం అనగానే వివిధ దినపత్రికల సాహిత్య పేజీలు మనసులో రెపరెపలాడతాయి. ఆదివారాలు అనగానే కొత్త కథలూ, పుస్తక సమీక్షల ఎదురుచూపులు వుంటాయి. ఆ విధంగా గురువారం సారంగవారం అని స్థిరపడింది. కానీ, మాకున్న వుద్యోగ వొత్తిళ్ల వల్లా, ఊరు మార్పుల వల్లా, కుటుంబ బాధ్యతల వల్లా- ప్రతివారం సారంగ వెలువరించడం కష్టమైపోయింది. అసలు పత్రికే మూత పడేంత వ్యక్తిగత పనుల వొత్తిళ్ళల్లో కూరుకుపోయాం.

ఆ స్థితిలో పాఠకుల నుంచీ, రచయితల నుంచీ సారంగ మూత పడడానికి వీల్లేదన్న బలమైన ఆకాంక్ష వ్యక్తమైంది. మేం హైదరబాద్ వచ్చినప్పుడల్లా  అటు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల నుంచీ, ఇటు అమెరికాలోనూ యూరప్ లోనూ ఎటు వెళ్ళినా రచయితలు సమూహాలుగా వచ్చి కలిసి, మమ్మల్ని వొప్పించే ప్రయత్నాలు చేశారు. అవన్నీ మేం ఎప్పటికీ మరచిపోలేం. ఒక ఏడాది విరామం తరవాత సారంగ మళ్ళీ మొదలు పెట్టినప్పుడు సాహిత్యజీవుల  సంతోషానికి అవధుల్లేవు. దానికి తగ్గట్టుగానే- రెండో ఇన్నింగ్స్ లో సారంగ చదువరులూ, రచయితల సంఖ్య మూడింతలకు పెరిగింది. అది మేం ఏమాత్రం ఊహించని విజయం. మార్పు కూడా!

ఒకానొక కీలకమైన మలుపు దగ్గిర సారంగ ప్రయాణం మొదలైంది. పుస్తకం ముందు పెట్టుకొని చదివే స్థితి నుంచి వీలైతే లాప్ టాప్, డెస్క్ టాప్ కంప్యూటర్లూ, మరీ ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో సాహిత్యం చదివే తరం బలపడింది. టెక్నాలజీ లేని రోజువారీ జీవితాన్ని వొక్క క్షణం కూడా వూహించలేని కాలం వచ్చేసింది. కొంతమంది రచయితలూ, కవులూ మొబైల్ ఫోను తీసి, కవిత్వమూ కథలూ అక్కడే తిన్నగా రాసేసే దశ వచ్చేసింది. ఇంతకుముందు పేజీలు పేజీలు రాసి, కొన్ని పేజీలు చించేసి, ఇంకొన్ని పేజీలకు పేజీలు మార్చేసి, పది పన్నెండు సార్లు దిద్దుబాట్లు చేసుకునే కాలం ఒకటి వుందంటే నమ్మలేని రోజు వచ్చేసింది. ఈ మార్పు సృజనాత్మకతని బాగా మార్చేసింది.

ఈ మార్పులో సారంగ కూడా కొన్ని కొత్త సంగతులు నేర్చుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందులాగా రచయితలు ఎన్నో సార్లు తిరగరాసి, మార్పులు చేసిన ప్రతులు పంపిస్తారన్న నమ్మకం పోయింది. కొంతమంది నేరుగా టైప్ చేసేసి, కనీసం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా, సెండ్ బటన్ నొక్కేస్తున్నారని కూడా అర్థమైంది. ఈ దశలో సారంగ సంపాదకవర్గం బాధ్యత కచ్చితంగా మూడింతలు పెరిగింది. ఎలక్ట్రానిక్ యుగ రచయితకు తన ప్రతి తాను చూసుకునే తీరికా, ఓపికా ఎలాగూ క్షీణిస్తూ వచ్చేసింది కాబట్టి, సంపాదక వర్గమే రెండు మూడు సార్లు ఆ ప్రతిని చదివి, రచయితకు తిప్పి పంపే ప్రక్రియ అదనపు భారంగా మారింది. ఇలా సవరణల కోసం తిప్పి పంపడాన్ని మెచ్చలేని రచయితలు రెండు క్షణాల్లో ఆ రచనని ఫేస్ బుక్ లో పెట్టేసుకోవడమూ మొదలైంది. ఇందులో మళ్ళీ అనేక రకాల అపార్థాలూ, అనుమానాలూ, పొరపొచ్చాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ స్థితిని గట్టెక్కడానికి సారంగ మరోసారి పీర్ రివ్యూ ప్రక్రియ గురించి రచయితలకు తెలియజేసుకోవాల్సిన అవసరమూ ఏర్పడింది.

సారంగ లో గత పదేళ్లుగా మేం ప్రచురిస్తున్న ఏ రచన కూడా పీర్ రివ్యూ లేకుండా ప్రచురించలేదు. ఈ క్రమంలో ఇంతకుముందు కూడా ఇప్పుడు రచనల స్వీకరణ, ప్రచురణ రెండూ కూడా ఆలశ్యమవుతున్నాయి. ఇది సారంగ కి పెద్ద పనే అని అర్థం చేసుకున్న రచయితలు మాతో సహకరిస్తున్నారు. అర్థం చేసుకోలేని వాళ్ళు సారంగ కి దూరమవుతూ వస్తున్నారు. ఇది బాధపడాల్సిన విషయమే అయినా, ఇందులో మేం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదేమీ లేదు. నాణ్యత లేనందు వల్లనో, డ్రాఫ్ట్  సవ్యంగా లేకనో- ఈ పదేళ్ళలో చాలా సార్లు ప్రసిద్ధ రచయితల రచనలు కూడా అనేకం సారంగ తిప్పి పంపించిన ఉదాహరణలున్నాయి.

అయితే, ఆశ్చర్యంగా సారంగకి కొత్త రచయితలూ, కవులూ, పాఠకుల సహకారం ఈ పదేళ్ళలో బాగా పెరిగింది. ఇప్పటికీ సారంగలో ముప్పాతిక వంతు రచనలు పూర్తిగా కొత్త తరం రచయితలవే అని మేం సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. కొత్తగా రాస్తున్న వాళ్ళు ఎలాంటి సంకోచమూ, సంశయమూ లేకుండా సారంగ కి తమ రచనలు పంపించే స్నేహ భావనని సారంగ కొనసాగిస్తూ వస్తోంది.

వచ్చే పదేళ్ళు తెలుగు సాహిత్యంలో ఇంకెన్ని మలుపులూ, మార్పులూ రాబోతున్నాయో ఇవాళ్టి ఊహకేమీ అందకపోవచ్చు. కానీ, టెక్నాలజీ వాడకం మారుమూల ప్రాంతాల రచయితల్ని, పాఠకుల్ని కూడా మార్చబోతున్నదని మాత్రం కచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆ మార్పుకి తగ్గట్టుగా సారంగ మరో పదేళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటోంది. ఈ ప్రయాణంలో మీరంతా కలిసి వస్తారన్న నమ్మకం సారంగ కి వుంది.

సారంగ చదవండి. సారంగ కి రాయండి. సారంగలో రచనలకు తప్పకుండా మీ ప్రతిస్పందనలు రాసే ప్రయత్నం చేయండి. పదికాలాలు మనం అడుగులో అడుగు వేసి నడుద్దాం ఇలానే!

మీ

కల్పనా రెంటాల, అఫ్సర్ , రాజ్ కారంచేడు

*

ఎడిటర్

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సారంగకి,
    కల్పన, అఫ్సర్, రాజ్ కారంచేడు లకు అభినందనలు. పత్రికను ఇంత వైవిధ్యంతో, ఇన్ని శీర్షికలతో ఆనేక ఏళ్ల పాటు నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు.

    తెలుగు సాహిత్య పరిణామం పై అధ్యయనం చేయాలనుకునే పరిశోధకులు ఎవరైనా సారంగ సంచికల సాహిత్యం పై పరిశోధన చేస్తే బాగుంటుందేమో.
    విమల

  • ఈ ప్రయాణం మరింత విస్తృతంగా సాగాలని కోరుకుంటూ
    తెలుగు సాహిత్యంలో సారంగ ఇప్పుడొక బలమైన స్వరం

  • ఈ ‘ సారంగ ‘ రాగంలో ఒక్క స్వరం గా నైనా పలుకగలిగితే అదే అవార్డు గా అనుకుంటాన్నేను. మీ సంపాదక వర్గానికి ధన్యవాదాలు.స్నేహపూర్వక శుభాకాంక్షలు 💐 శుభాభినందనలు

  • మీ కృషి అభినందనీయం.
    రచనల వస్తువుపరంగా ఎంపికలో ఏకపక్షంగా కాకుండా అన్ని కోణాలకు సమ ప్రాధాన్యత ఇవ్వండి.

  • మీ కృషి అభినందనీయం. రెంటాల కల్పన గారికి, అఫ్సర్ గారికి, రాజ్ కారంచేడు గారికి ప్రత్యేక అభినందనలు. మారిన కాలమాన పరిస్థితుల్లో ప్రత్యేకించి సాహిత్యానికి మ్యాగజైన్ తేవడం అంటే ఏమంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. ప్రత్యేకించి మీరు సమయం కేటాయించుకొని చేస్తున్న కృషి అమోఘం. కొత్త రచయితలకు మీరిస్తున్న ప్రోత్సాహానికి..పాఠకులుగా మాలాంటి వాళ్లు రుణపడి ఉన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నం మరో దశాబ్దమే కాదు..సుదీర్ఘకాలం నిలిచి ఉంటుందని భావిస్తాను. అందరికీ మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు.

  • Congratulations to you all.
    I enjoy reading Saaranga.
    However, I am not sure, how to send to Saaranga.

    I have tried sending sometime ago. No acknowledgement received. In fact no communication at all. Can you confirm how to send articles to you please?

  • సారంగ పత్రిక రెండవ దశాబ్దములోకి అడుగిడిన సందర్భములో శుభాకాంక్షలు.మరెన్నో దశాబ్దాలు పత్రిక కొనసాగాలని ఆకాంక్షిస్తూ సంపాదక బృందం రెంటాల కల్పన గారు, అఫ్సర్ గారు, రాజ్ కారంచేడు గారు చేస్తున్న నిరంతర కృషికి అభినందనలు.

  • మీ టీం కి శుభాకాంక్షలు సార్.. ఒక పత్రిక ఇలా నడవడం కష్టమే. సంపాదకులుగా మీకు ఈ విషయం తెలుసు. పదబంధం రాస్తున్న కాలంలో నేను కూడా సారంగతో కలిసి కొన్ని నెలలు నడిచాను. అవకాశాన్ని ఆనాటి రోజుల్ని గుర్తు తెచ్చుకుంటున్నాను.

  • ఈ మలుపులో మీరు అస్సలు అలుపు లేకుండా మరింత శ్రమకోర్చి ముందుకు వెళ్లి తెలుగు సాహిత్యంలో సారంగను చిరస్థాయిగా నిలిచిపోయేలా చెయ్యాలని కోరుకుంటున్నాను. కల్పనా రెంటాల, అఫ్సర్, రాజ్ కారంచేడు గార్లకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాను. ఇదొక మంచి ప్లాట్ ఫామ్. దీన్ని నిర్విరామంగా కొనసాగించాలని మనవి చేస్తున్నాను. సారంగకి, సారంగ టీం అందరికీ మరోమారు అభినందనలు.

  • ఒక సాహిత్య పత్రికను దశాబ్ధం పాటూ నిర్విరామంగా నడిపించడం చిన్న విజయమేమీ కాదు సార్. మీ కృషికి సాహిత్య జీవులందరి తరుఫున అభినందనలు. ముఖ్యంగా కొత్త తరం వాళ్ళకి సారంగ ఇచ్చిన ప్రోత్సాహం చాలా విలువైనది

  • వాణిజ్య ప్రకటనలు లేకుండా మీ సమయాన్ని వెచ్చించి పత్రికని నడుపుతున్నందుకు అభినందనలు!

    “కొత్త తరం రచయితల”కి మీ నిర్వచనం ఏమిటో కూడా తెలిపితే బావుండేది.

  • మీరు కథా సాహిత్యంలో దశాబ్ద కాలంగా చేస్తున్న ప్రయాణం అపూర్వం. మీరు మరెన్నో కాలాలపాటు గొప్ప సాహిత్యాన్ని అందించాలని కోరుకుంటూ…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు