మనం ‘ఎవుడికంటే తక్కువ?’ కాదు

కథంతా ముగిసిన తరువాత దళితులు, స్త్రీలు ఇంకా ఎంత ఆత్మగౌరవంతో బతకాలో అర్థం అవుతుంది.

యేమి? నేను సెప్పులు కుట్టే దాన్ననా? మాదిగననా? నాకూ ఆత్మగవురవం వుండ బళ్ళే మంచిగ జెపితే నేను యిననా? నోటికి తింటుండమే! అంత పెడసరంగ అవమానిచ్చి మాట్టాడితే ఎట్టా కుదురుద్ది?

 

మాల మాదిగలు, బహుజనులు ఐక్యంగా లేనంత కాలం దేశంలో కేవలం అయిదు శాతం కూడా లేని ఆధిపత్య కులాల వాళ్ళు దళిత, బహుజనుల్ని చెప్పు కింద చీమల్లా తోక్కేస్తూనే ఉంటారు. అంతే కాదు “కులాలు పోకూడదండి. కొంత మంది ఇపుడు ప్రోగ్రెస్సివ్ థాట్స్ ఉండేటటువంటి వ్యక్తులం అని అనుకునేవాళ్లు కులరహిత సమాజాన్నినిర్మాణం చేస్తాము. అలాంటి సమాజం కావలి. (అంటున్నారు. అది) తప్పు. ఏ కులం పని ఆ కులం చేయాలి.” అని స్వామీజీలాంటి  వారు వేద కాలం నాటి నిచ్చెన మెట్ల సమాజం ఇంకా అలాగే ఉండాలని ఉద్బోధ చేస్తూనే ఉంటారు. ఇవన్నీ చూస్తుంటే స్వాతంత్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్నా కూడా ఇంకా డా. బి. ఆర్. అంబేద్కర్ కలలుగన్న సమ సమాజం రాలేదనిపిస్తుంది.

స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్ళలోనే ఎంతో ధైర్యంగా, ఆత్మగౌరవంతో, రెబల్ గా జీవించిన ఒక దళిత స్త్రీ కథ ఎవుడి కంటే తక్కువ. ఆమెకు కులం బలం లేదు కాని ఉంటే ఆ రోజుల్లోనే ఇందిరాగాంధీ అంతటి నాయకురాలు అయ్యేది. ఆమే కథకుని అత్త సరోజినత్త. ఆమె ఆ రోజుల్లోనే ఐదవ తరగతి చదివింది. కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. నెహ్రూ, మహాత్మా గాంధీ అంటే అత్తకు మహా భక్తి. అప్పుడే కానీ కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకుంది. “నేనేంది వొకడికి కట్నమిచ్చేది? నాకే వంద రూపాయలిచ్చిండ్లా? వోలి కింద. మొగోడినేంది డబ్బులిచ్చి కొనుక్కునేది? సిగ్గుండ బళ్లే కట్నం దీసుకోడానికి. కొడుకుల్ని గన్నోళ్ళు యాం జేస్తుండరు? కట్నాల కోసం ఎగబడుతుండరు. మనోళ్ళల్లో కట్నాల మాటున్నదా?… ఆడ కూతుళ్ళకి సుకం లేకుండా జేసింది ఈ కట్నం గదంటయ్యా! ఆడ కూతుళ్ళు గవురవంగా బతికినపుడే గదా ఇల్లైనా దేసమైనా కుసాలగుండేది. ఆడోళ్ళను దుక్కపెట్టి యే నా బట్ట  బాగుపడుతడు.” అని ఉరిమినట్టుగా చూస్తుంది.

ఊళ్ళో ఒక రెడ్డమ్మ “ఓ పిల్లో! వొసేయ్” అని పిలిచి తన తెగిపోయిన చెప్పుల్ని తీసుకొని పోయి సరోజినత్తను వాళ్ల మరిదికి ఇమ్మంది. “నా కాలి చెప్పు జూడు యెట్టుండదో! నా ఒక్క సెప్పు కరీదు లేదు నీ తెగిపొయ్యిన సెప్పులు. నన్ను దీసుకపొమ్మంటుండవా? బుద్దిలేకుండా మాట్టాడగాక. మరియాదగా బిలువు.” అని హెచ్చరించింది.

మన ఊర్లో పండిన పంటను వేరే వూరు వాళ్లకు ఎలా అమ్ముతావు? అని ఊరి ప్రెసిడెంట్ తోనే లొల్లి పెట్టుకొని “రేప్పొద్దు వోల్లొచ్చి జేస్తరా నీకు పని?” అని ప్రశ్నించింది.

సరోజినత్త ఇవన్నీ చెప్తుంటే కథకుడు ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. “అత్తా నువ్వు అయిదో తరగతి జదివి యింత గ్యానం సంపాయిచ్చుకుంటివే మన అడోల్లంతా నీ మాదిరి కొద్దో గొప్పో సదివుంటే మన కష్టానికి పలితం దక్కేది. సదువు లేకనే గదత్తా మన బతుకులు పుచ్చు బడినయ్యి” అని అన్నాడు.

“సుదయ్యా! దున్నేవోడికి బూముండదా? కులం లేనోడికి కడుపు నిండా తినే రాత లేదా నాయినా? రోజులు మారినయ్యిగాని మన బతుకులు మాత్తరం యింకా తెల్లార్లా” అన్నది. ఈ మాటలతో కథకుడి మొహం ఎర్రగా మారిపోయింది.

సరోజినత్త తెగువ, ధైర్యం, తిరుగుబాటు తత్వాన్ని చూపించడానికి కథకుడు రెండు దృశ్యాలను ఎన్నుకున్నాడు. 1. రెడ్డమ్మ తెగిన చెప్పులు తీసుకుపొమ్మని అమర్యాదగా మాట్లాడడం. 2. ఊళ్ళో పండిన తిండి గింజలను వేరే వూరు వాళ్లకు అమ్ముతున్నప్పుడు వద్దని చెప్పి ప్రెసిడెంటు మీదికి తిరగబడడం.

ఈ రెండు సంఘటనలేగాక వరకట్నానికి వ్యతిరేకంగా మాట్లాడేటపుడు, కథకుడి తండ్రి పట్నం పోయి కళ్ళు పోగొట్టుకున్నప్పుడు “పట్నంలో డబ్బులుంటయ్యి గానీ పేగులుంటయ్యా? ప్రేమలుంటయ్యా?” అని మాయదారి పట్నం మా దేవయ్యని మాయంజేసింది” అని బాధ పడుతుంది.

కథలో రెండే పాత్రలు.  ఒకటి కథకుడు. రెండు కథకుడి అత్త సరోజినత్త. ఇంకా కొన్ని పాత్రలుంటాయి కాని అవేవీ తెర మీదికి రావు. రెండు పాత్రలతోనే కథను ఆసక్తిగా, దళిత స్త్రీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేటట్టు నడపడంలో కథకుడు ప్రదర్శించిన శిల్పం అమోఘం. కథలో వాడిన భాష, శైలి సగటు పాఠకుడికి ఎంతో నచ్చుతాయి. సారాంశంలో ఎన్నో గొప్ప జీవన నైపుణ్యాలను తెలియజేస్తుంది ఈ కథ. స్త్రీ విద్య ఆవశ్యకత, వరకట్న నిషేధం, పట్నపు జీవితం మీద ఏవగింపు, దళిత స్త్రీకి ఉండాల్సిన ఆత్మగౌరవం, కష్ట కాలంలో ఊరికి అండగా నిలబడడం, దళితుడికి, మరీ ముఖ్యంగా దున్నేవాడికి భూమి ఉండాలని ఇలా ఎన్నో  చెప్తుంది సరోజినత్త.

కథంతా ముగిసిన తరువాత దళితులు, స్త్రీలు ఇంకా ఎంత ఆత్మగౌరవంతో బతకాలో అర్థం అవుతుంది. సరోజినత్త పాత్ర తిరుగుబాటు ధోరణి వాస్తవ జీవితంలో ఆచరణ సాధ్యమా? అనేది ఆలోచించాల్సిందే. అయినా కథకుడు కలగన్న జీవితం కనిపిస్తుంది ఈ కథలో.

మనం ‘ఎవుడికంటే తక్కువ?’ కాదు  అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించిన కథకుడు అచార్యు ఎండ్లూరి సుధాకర్. (1959-2022) ఈయన ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. తొలి నుంచి దళిత స్పృహ తో రచనలు చేస్తోన్న ఎండ్లూరి ఇప్పటిదాకా ‘వర్తమానం’, కొత్త గబ్బిలం’, ‘నల్ల ద్రాక్ష పందిరి’, ‘వర్గీకరణీయం’, ‘ఆటాజని కాంచె’, ‘గోసంగి’ తదితర పుస్తకాలు రాశాడు. ఎన్నో పురస్కారాలు పొందాడు. ఈ కథ 1999లో వచ్చిన  ‘మల్లె మొగ్గల గొడుగు’ కథ సంపుటిలో చోటు సంపాదించుకుంది.

(28 జనవరి 2022న అకాల మృత్యువాత పడిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారికి అశ్రు నివాళి)

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు