రాజుగోరి పుంజు

 “ కాసుకో. నీ కాడున్నది ఆ గోచి పాతేగా దాన్నిప్పి కాసేసుకో.” 

యామ్ కోడి. మై నేమీజ్ రాజు. హోల్ టోటల్ మొత్తం మీదండీ కోడిరాజండి. మాదెస్ట్  గోదారని అర్దమైపోయుంటాది మీకు. అందుకని మరి కనుక ఆ ఇవరాల్లోకి పోన్లెండి.   మా రాజు గోరు ఊరందరికీ రాజుగారండీ. నేనేమో మా రాజుగోరికి రాజానండి. ఆయన  మాటలాడే ఏ లాంగ్వేజైనా నాకు కొట్టిన పిండేనండి. శ్రీమాన్ కనకరామ లింగేశ్వర్రాజు గారంటే ఏమనుకున్నారండీమనుషులకే కాదుఆయన గురించి తెలియని కోడి పుంజు భూపెపంచకంలో వుండదంటే మొహానికి కోడి కత్తి దిగినట్టు అలా నిబిడాశ్చర్యంతో నిలబడిపోవద్దండి. సరే ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటేనండీ.. ఇది నా స్వగతం అండీ. నా ఆత్మకథండీ. సోది జెప్పకుండా పాయింటుకే వచ్చేద్దామండి. అదిగోండి మా రాజుగోరొత్తన్నారు. కొంచెం ఆగండే.  ఆయన లోపలకెల్లేక మళ్ళీ  మాహాడతాను.

రాజు గారు బుల్లెట్ బండిని మండువా లోగిలి లోపల కారు షెడ్డుకు ఆనుకుని వున్న  బైకుల షెడ్డులో పార్క్ చేసి సరాసరి లోపలికి వెళ్లకుండా కోడి పుంజు దగ్గరకొచ్చి..

“ ఏరా రాజా బయటెండ మండి పోతావుంది. నీళ్ళు తాగావాఅసలే చలికి చలీ..ఎండకి ఎండా బాగా వుండే  ప్రాంతం నుంచి వచ్చినోడివి. ఏంట్రా  నిన్నెక్కడ నుంచి తెచ్చేనో తెలుసేంట్రా?

“ రష్యా నుంచి.

ఈ సమాధానం వచ్చిన వైపు ఇటు కోడి రాజు..అటు రాజు గారు ఒకసారే తలతిప్పి  చూశారు. సింహద్వారం తలుపు వెనక ఏదో అలికిడైంది. నల్లంచు ఎర్ర చీర నీడ కనపడింది.

“ ఏంటే ఎటకారమా.. ఈ సారికి రాజస్థాన్ నుంచి తెచ్చాను కదా. మళ్ళీసారి రష్యా నుంచి  తెచ్చేది తెచ్చేదే.

 చాల్లెండి మంచోరే. ఏదో సరదాకన్నాన్లెండి. అన్నంత పనీ చేసినా జేస్తారు. ఎండనపడొచ్చేరు. కాస్త చన్నీళ్ళు ఆ మొహం మీదా కాళ్ల మీదా  జల్లుకు రండి. వేడి వేడిగా వడ్డించేస్తా. ఎర్ర రంగు నల్లంచు కాటన్  చీరలో అమ్మగారు వంట గది వైపుపొడుగు చేతుల తెల్ల చొక్కా తెల్ల ప్యాంటులో రాజు గారు బాత్ రూం వైపు వెళ్లారు. వెళుతూ వెళుతూ కోడి రాజుని చూసి.. ‘ ఒరే రాజా మీ అమ్మగారి ఎటకారం మాటలు పట్టించుకోకు. నువ్వుండగా నాకు రష్యా లేదు..అమెరికా లేదు. గుర్తెట్టుకో అర్థమైందా’  అని రాజుగారు కోడిరాజుని తల మీద నిమిరి మరీ వెళ్ళారు.

అదండీ. మా రాజుగోరింటో మన ప్లేసేంటో మీకీపాటికి అండర్ స్టాండింగ్ అయ్యుంటాదనుకుంటా.  .   సరే  ఇసయానికి వచ్చేత్తా. మా రాజు గోరు నన్ను రాజా అని పిలుస్తారన్నాను కదండీ. మా అమ్మ గోరు నన్ను తెల్ల బంగారూ అంటారండి. నేను తెల్లగా మెరిసిపోతా గదండీ అద్గదీ అందుకన్న మాట. నన్నో లుక్కెయ్యడానికి వచ్చేవోళ్ళు మాత్తరం  కోడిరాజు గారూ అని మా రెస్సెక్టిచ్చేత్తార్లెండి.  ఇదంతా మా రాజుగోరి పున్నె మే అనుకోండి. ఆయనగోరు నన్ను కన్న బిడ్డల కంటే కూసింత ఎక్కవే చూసుకున్నారండి మరి. నేను తినకుండా ఆయన ముద్ద ముట్టడంటే  నమ్ముతారు కదండీ. నమ్మకేం జేత్తారండి బాబూ. పెపంచకంలో వున్న బలవైన తిండంతా తెప్పించి నాకే పెడతారండి ఆయ్. ఏంటో ఆయన పక్కలో పడుకోను గానండినాకు మాత్తరం ఆయన నా పక్కనే పడుకున్నట్టుంటాదండి బాబయ్యా. ఏలల్లో చెప్పాలో..లచ్చల్లో చెప్పాలో తెలీదుగానండీనా మీద ఆయన పెట్టిన కర్సు ఆయన పిల్లల సదువుల మీదైనా పెట్టారో లేదో తెలీదండి.  నేను మాత్తరం తక్కువేం రుణవుంచుకోలేదులెండి. నువ్వా నేనా అన్న పందాలు ఏడు కొట్టి పారేసేనండి. నెత్తురు సుక్క సిందకండా బరిలో నేను నిలబడినప్పుడుమా రాజుగోరి మొకంలో ఎలుగు చూత్తేనండీ నా సామిరంగా పైన సూర్రుడు కూడా  పక్కకు తప్పుకు తీరాలండీ.  నేనేదో పందాలు కొట్టానని..లచ్చలు గెలిపించానని నన్నంత పేమగా సూత్తన్నారని మాత్తరం మీరనుకోకండే.   మా బందం అలా అయిపోయింది. కాలికి కత్తికట్టినప్పుడు గట్టిగా సుట్టీ సుట్టీ సుడతారు సూడండి..అలా ఎవరో నన్ను రాజుగోరికి కట్టి  ఎన్ని సుట్లు సుట్టేసేరో గానండిఇది ఒక పట్టాన తెంపుకుంటే తెగిపోద్దేటండి.  నన్ను మా రాజుగోరు చేతుల్లోకి తీసుకున్నారంటే సీజర్ కత్తిని చేతుల్లోకి తీసుకున్నంత సంబరపడిపోతారండయ్యా.

సరే ఇప్పుడీ గొడవంతా ఎందుకు సెప్తున్నానంటే నా మీద నాకే అసహ్హెం పుట్టిందండి. మా రాజుగోరికి నమ్మక ద్రోహం సేసేనండి. ఆయన నా మీద పెట్టుకున్న ఆశలన్నీ వేల మంది సూత్తుండగా పందెం బరిలో భళ్ళున బద్దలుగొట్టేసేనండి. నేనిప్పుడు లేనండి. కానీ వున్నానండి. అదంతా నా కతలో మీకే తెలుసుకొస్తాది లెండి. ఇప్పుడైనా  నా మనసులో మాటలు సెప్పుకోకపోతే ఎలాగండి. నిజంగా నా అంత వంచకుడు లేడండి. నా కంటే ఆ బ్రూటస్ గాడే నయం. స్వార్థంతో చేసేడు. నేనేంటండి. నమ్మిన బంటుని. అయినా ఇంత అన్నేయం చేసేను.  నన్ను దేవుడు కూడా సెమించడండి. పానానికి పానంగా చూసుకున్న రాజుగోరికి ఇంత అవమానం తెచ్చిపెట్టానండి. అదేదో కరోనా గిరోనా అన్నారు అదొచ్చి పోయినా ఒక లెక్కునుండేది. ఏదో కొన్నాళ్ళు రాజుగోరు దిగులు పెట్టుకోని మళ్ళీ కోలుకునేవోరు. ఇదేంటండి ఇలా సేసేసేనునాకేవర్దం కాటం లేదండి బాబూ. నెపోలియన్..చెంగిజ్ కాన్ ఎవరెవరో గొప్పగొప్ప ఈరులు గురించి చెప్పేవోరండి రాజుగోరు. ఒరే రాజా నువ్వుంటే నేను నెపోలియన్నేరా అనేవోరండి. అలాంటి మారాజు నేను లేకపోతే యావైపోతారో అని మాత్తరమే నాకు పెద్ద బెంగండి.

ఆగండి ఇక్కడో చిన్న బ్రేక్ తీసుకుందాం. అదిగో అటొత్తన్నాడు సూడండీ. ఆడే మా రాజుగోరికి నమ్మిన బంటు. పెద్దపాలేరు ఎంకన్న. పేరుకు పాలేరే గానండి. మా రాజు గోరింటో ఆడూ ఒక పార్టైపోయాడు. సూడండి ఆడేమంటున్నాడో..

రాజు గారండీ..రాజుగారండీ.!”.

ఏంట్రా..?

“ మరండే మరండే ఆ సర్రాజు గారండీ ఆళ్ళ పుంజుకి కొత్త మేత కనిపెట్టేరంటండే. “

ఏంటో ఆ మేత?”

“ గోదుం పిండి..సెనగపిండి..నువ్వులు పిండి..జొన్నపిండి..ఆవపిండి..బాదం పిండి..పిస్తా పిండి..ఇంకా ఏంటేంటో పిసికి పిసికి కొంచెంతేనె..కొంచెం..నెయ్యి..కొంచెం ఆవనూనె..కొంచెం మీగడ..కొంచెం గడ్డ పెరుగు..

“ ఒరేయ్ ఆపరా ఆపు. ఎదవ గొడవ..ఏం కలిపినా ఎవడూ మన రాజా తోక చివర ఈక కొసెంట్రుక ముక్క పీకలేరెహె. ఎవడైనా అలా కలగన్నాడా అంతే ఆడి పని  సివరికి పిసుక్కోవడమే. ఇంతకీ రాజా గాణ్ణి ఇవాళ షికారు తిప్పావా?”

“ లేదండి ఇప్పుడు తీసుకెల్తానండి.

“ తీసుకుపో తొందరగా చీకటి పడతాంది పోయిరా పో.!

……………………   ……………..

అద్గదండీ మా రాజుగోరికి నేనంటే యమ కాన్ఫిడెన్స్. రోజూ పొద్దగూకే ఏల ఎంకన్న నన్ను తిప్పడానికి తీసుకెల్తాడు. నన్ను చూసేరంటే  మనుషులు ఆగిపోతారండీ. కుక్కలు పారిపోతాయండీ.. అదండీ మా కెపాసిటీ. ఇక్కడ మీకు ఒక రగస్యం  చెప్పాలి. ఎంకన్న తిప్పినట్టే తిప్పి ఈది చివరెక్కడో వున్న ఆడి ఇంటికి తీసుకెళతాడండి. మనలో మాటండీ. మనసులోనే పెట్టుకోండి. అక్కడ నాకో లవర్ వుందండి. బంగారం రంగు మేలిమి సాయలో మెరిసిపోతాది. ఎవరికీ తెలీకుండా ఎంకన్న నన్ను దానితో జత కట్టించాడు. ఎంకన్న రాగానే ఆడి భుజం మీద ఎగిరి కూసోని హడావుడి పెట్టేత్తాను అందుకేనండి. ఈ ఇసయం మా రాజుగోరికి తెలిత్తే ఎంకన్న తలకాయి ఎప్పుడో తెగిపోయేది. పెట్టలతో కలిస్తే నా పట్టు తగ్గిపోద్దని రాజు గోరి పట్టుదల.  అంతా సీక్రెట్ గా జరిగిపోతావుంది. నేనూ దాని పేమలో పడిపోయానుకోండి. నేనెక్కడో వుండగానే నా బంగారు కొండ గింగిరాలు కొడతాదండి. అసలు మా సీక్రెట్  స్టోరీ సెపరేట్ గా చెప్పుకోవాల్లెండి.  అలా మా డేటింగో మీటింగో మీరనుకుంటారే అది   చాలా రోజులుగా సాగుతోందండి. తన పెట్ట కడుపున నా జాతి పుంజులు పుడతాయని ఎంకన్న ఆశ.

అసలు కతకే వచ్చేత్తానండి. నన్ను  పందేనికి తీసుకెళ్ళినప్పుడల్లా పెళ్లికొడుకులాగా అన్ని లాంచనాలతో ఎంటేసుకు ఎళ్ళేవోరు. అమ్మగారు కుంకమాది తిలకాలు..హారతులు..ముత్తైదువుల  ఎదురు  రాకలు..బాజా బజంత్రీలు..అయ్యబాబోయ్ ఒహటేంటండినా రాజబోగం ఈ సుష్టిలో ఏ జీవికన్నా దక్కిందో లేదో నాకైతే డౌటేనండి. ఈ సారి పందేనికి తెచ్చేటప్పుడు మాత్తరం బ్రామ్మల్ని పిలిచి పూజలు చేయించారు. పిల్లల నుంచి  పెద్దల దాకా అందరితో దిష్టి తీయించారు. ఇదంతా ఎందుకు చేసేరంటేనండీ.. ఇక్కడో మతలబుందండి. మా రాజుగోరుకి కొంచెం జాతకాలు పిచ్చుందిలెండి. పందానికి ఎల్లే పెతిసారీ జాతకం అడుగుతారు. ఏడో పందెం దెగ్గిర గండం వుందని సెప్పారు. అందుకే రాజుగారు ఏడో  పందేనికి శాన్నాళ్లు నన్ను తీసుకు పోలేదు. బ్రామ్మలు సెప్పినట్టు యజ్జెం సేయించికొల్లేటి పెద్దింటమ్మకు రెండు మేకలు బలిచ్చిసివరికి ఏడో పందేనికి కిందటేడు  తీసుకెళ్ళేరు. గండం వుందన్న అనుమానం  ఆయనకున్నాపందెం దగ్గర ఎనకడుగు ఎయ్యలేదు.  ఇంకా నాలుగు లచ్చలు ఎక్కువే కాసిపాతిక లచ్చలు పందెం కట్టారు. కత్తి కట్టిన తర్వాత ఒకసారి నన్ను చేతుల్లోకి తీసుకోని కన్నీరుతో ముద్దు పెట్టుకున్నారండీ. అది సూసి అక్కడున్నోల్లంతా ఏడ్సే వుంటారని నా పెగాడ ఇస్వాసం. సరే గానండి ఇసిత్రంగా బరిలోకి దిగిన మొదటి దెబ్బకే అవతలి కోడి పుంజుని మట్టి గరిపించేసేను. అప్పుడు సూడాలండి మా రాజుగోర్ని.. ఆయనొళ్ళంతా మీసాలు మొలిచేసినట్టే అనిపించందండోయ్. అదేదో సినిమాలో ఆ పిల్ల.. హీరోని పట్టుకుని ఎక్కడెక్కడో మీసం తిప్పినట్టు తిప్పి ఊ అంటావా అంటాది  సూడండిఅలాగ తిప్పేరండే రాజుగోరు మీసాల్ని.  ఎక్కడెక్కడి ఊళ్ళనుండో వచ్చిన జనం చప్పట్లుతో ఎక్కడో దూరాన్నున్న గోదారి నది కూడా పొంగిపోయిందంటే నమ్మండి. అదండీ అలా ఆ గండం గడిచింది కదండీ. మళ్ళీ జాతకం సూపిత్తే నీ పుంజుకి తిరుగులేదు రాజూదాన్ని తీసుకు వెళితే ఈ భూగోళాన్నే జయిస్తావోయ్ అన్నారంట సుట్టుపక్కల జోతీషం చెప్పే పండితులు. ఇంకేవుందండీ రాజుగోరికి ఇక ఆగలేదు. ఎప్పుడెప్పుడు సంకురాత్రా అని ఏ రాత్రీ నిద్దరే పోలేదండి. రానే వచ్చింది  సంకురాత్రి. ఎప్పుడూ పంచె కట్టని రాజుగోరు మైసూరు నుంచి పట్టు పంచె లాల్చీ తెప్పించుకున్నారు. ఇక నాకు అలంకారాలు సరేసరి. రాజు వెడలె రవి తేజములలరగ అంటూ బయలుదేరాం. ఇక్కడ ఇంకో బ్రేక్ తీసుకుందాం. మా ఎంకన్న ఆళ్ళ ఆడోళ్ళతో మాటాడిన మాటలు విందాం.

………………..   …………

“ ఏవే..ఏడో పందెం  గండం గడిసిపోయింది. ఇంక మన రాజుగోరి పుంజుకు తిరుగు లేదే.

“ అయితే నీకేంటయ్యా. నువ్వు మాత్తరం ఆ పుంజుని భుజం మీద మోసుకు తిరగాలి.  నీ నెత్తి మీద ఏ కిరీటవూ ఎవడూ పెట్టడు.

“ ఏడ్సేవులేవే..నేంజెప్పేదిను. రాజుగోరి పుంజుకు తిరుగు లేదు. ఈసారి ఎన్ని లచ్చల పందేనికైనా రాజుగారు సిద్దంగా వున్నారు.

ఉంటే వుండనియ్యి నీకేంటి దురద?”

“ అది కాదే. మన కట్టాలు గట్టెక్కిపోతాయి. అప్పులు తీరిపోతాయి. ఈ సారికి పెద్ద పెందెం నేను కూడా కాసేద్దామనకుంటున్నానే.

“ కాసుకో. నీ కాడున్నది ఆ గోచి పాతేగా దాన్నిప్పి కాసేసుకో.

“ ఏళాకోలం ఎందుకే బంగారం. మన పొలం తాకట్టు ఎట్టేద్దామనుకుంటున్నానే”.

అంతే సివంగిలా లేచింది ఎంకన్న పెళ్ళాం. ఎంకన్న జుట్టు పట్టి కింద పడేసి కుడి కాలు వాడి గుండెల మీద పెట్టి “నీ పానం తీసేత్తాను గాని ఆ పొలం  జోలికి పోనివ్వను. రాజు గోరిని చూసి నువ్వు కాలికి కత్తి కట్టుకుంటావా. ఏవన్నా తిరవుండి మాటాడతన్నావాఇగో  గుర్తెట్టుకో. ఒక్కగానొక్క కూతురు దాన్నీ నన్నూ అన్నేయం చేయకు. అంతకు మించి ఇంత ఇసమిచ్చి సంపేయ్.

భార్య కోపానికి ఎంకన్న మిన్నకున్నాడు. కానీ తాను చేయాల్సిన పని చేసేసేడు. పొలం పట్టాలు పట్టుకోని పెద నాయుడుగారి దగ్గర పెట్టి అయిదు లక్షలు తీసుకున్నాడు.

             ………………..    …………….

అదండీ మా ఎంకన్న గొడవ. ఇప్పుడు మళ్ళీ కతలోకొద్దాం.

బరిలో దిగాం. రాజు గారిని చూడ్డానికొచ్చేరో…నన్ను చూడ్డానికొచ్చేరో తెలీదు గానండి సుట్టు పక్కల ఇరవై ఊళ్ల నుంచి జనం తండోపతండాలు.నిజంగా ఆళ్ళకి దండాలెట్టాలి. మా రాజుగోర్నీ నన్నూ చూడ్డానికి జనానికి కళ్జు చాలడం లేదు. బరిలో నిల్చోబెట్టి పందెం ఏభై లక్షలు అని రాజా వారు పెకటించేరు. ఏలల్లో జనం మూతి మీద ఏలేసుకుని మౌనం వహించారు. బరి చుట్టూ యజమానుల చేతుల్లో  వున్న కోడి పుంజులు కూడా ఒక ఈక కదిపితే ఒట్టండి. రాజు గోరు చాలా సేపు చూసేరు. ఎవరూ ముందుకు రాలేదు. ఈ లోపు ఏదో పందెం మొగిసింది. ఆ పోటుగాడి పుంజులు  రెండూ కత్తులు దూసుకుంటుంటేజనమంతా కన్నుల్లో వొత్తులు పెట్టుకు సూత్తన్నారు. కాకినెమలి మద్దె పందెం జరుగుతోంది. రెండూ సమ ఉజ్జీల్లా వున్నాయి. హోరా హోరీగా పోరు సాగింది. ఎంతకీ తెమలదే. నాకు సిరాకేసుకొత్తా వుంది. రెండు మూడు సుట్లు ఎదుటి పుంజు ఎంత ఎగురుద్దో సూడాలి. ఆ లెక్కలు పోరాడతానే తేల్చుకోవాలి. ఒక అడుగు ఎనక్కేత్తే ఎదుటి పుంజు కంటే అడుగు పైకి ఎగరొచ్చు. ఆటికి సెప్పేదెవడునాకు మాత్తరం ఎవుడు సెప్పేడు గనకయుధ్ధ బూవిలోనే అన్నీ నేర్చుకున్నాను. దాని మీద కాసినోళ్ళు అది ఎగిరితే ఎగురుతున్నారు. దీని మాద కాసినోళ్ళు ఇది ఎగిరితే ఎగురుతున్నారు.

మీకు ఇప్పుడో మాట నా మనసులోది సెప్పాలనుందండి. ఇప్పుడు కాపోతే ఇంకెప్పుడు సెప్పగలనుఈ బూమ్మీద నా బాదం పిస్తాలు చెల్లిపోయాయి. రాజాలా బతికేను రాజాలానే పోయాననుకోండి . ఆ రెండు కోళ్ళూ పోరాడతా వుంటే నాకేదో మనసులో ఆలోచనలేంటేంటో ముసురుకున్నాయండి. యుద్ధమంటే ఏంటిఅది ఎవరి కోసం ఎవరు సేత్తారుఎవరి విజయం కోసం..ఎవరి ఆనందం  కోసం..ఎవరి రాజ్జాల కోసం.. ఎవరి బూవి కోసం..ఎవరి సరిహద్దులు కోసం ఎందుకీ యుద్ధంఇలా ఏంటేంటో లోపలేదో కత్తిపట్టుకుని ఎవరో కెలుకుతున్నట్టే అనిపించిందండి. ఇయ్యన్నీ నీకెలా తెలుసురా అంటారా. మా రాజుగోరు చెప్పిన చరిత్ర పాటాలు నేను చాలానే నేర్చుకున్నాన్లెండి. ఓ పాలి మా రాజుగోరు మాంచి ఇస్కీ మూడ్ లో ఉన్నప్పుడు అన్నారండీ..

‘“ఒరే రాజా ఈ బూమ్మీద ఎవడూ ఆడి కోసం ఆడు యుద్ధం చేయడురా. ఇంకెవడికోసమో  చేత్తాడురా. లేకపోతే మనిషితో మనిషెందుకు యుద్ధం  చేత్తాడ్రాకోడితో కోడెందుకు యుద్ధం చేత్తాదిరామనుషులు ఇంకో గోళం మీదున్న ఏరే జాతితో యుద్ధం చెయ్యాలి. కోళ్ళు మరో జీవితో యుద్ధం  చెయ్యాలి. ఎక్కడ నీ ఉనికికి ముప్పు వుంటుందో అక్కడ యుద్ధం జరగాలి.

‘ మరి నాకెందుకు యుద్ధం నేర్పారండి మహాప్రెబో’ అందామనుకున్నాను. ఆయన కనిపెట్టాసేడండి. “ ఒరే నేనూ మనిషినే కదరా. మనిషి బుద్ధి యుద్ధ బుద్ధి. తప్పని తెలిసి కూడా ఆ తప్పు పదే పదే చేసేవాడే మనిషి. ఒకడి ఓటమిలో ఇంకొకడి విజయం  వుంటుందనుకుంటాడు గానీ. ఒకడి విజయాన్ని మరొకడి విజయంగా మార్చే రహస్యాన్ని కనుక్కోలేకపోయాడురా మనిషి. కాబట్టి మనుషులున్నంత కాలం యుద్ధాలుంటాయి గుర్తుపెట్టుకో.  తెలుసా ఎర్రి మొగమా?” అన్నారండి. అని అటూ ఇటూ నా  బుగ్గల మీద చేతులాడించారు. ఆయన మూడ్ లో వున్నప్పుడు నేను తెలుసుకున్న ఇలాంటి ఇషయాలు ఏ మహానుబావుడన్నా రాస్తే గొప్ప బుక్కైపోద్దండి.

సరే ఇప్పుడే ఆ మాటలు గుర్తుకురావాలా నాకుఆ రెండు పుంజుల్ని చూశాక నాకేదో మనుషులంటారు చూడండి ఏదాంతం అని ! దీందుంప తెగ  అది పట్టేసుకుందండి. వైరాగ్గెం అని కూడా అంటారుకదండీ అది నరాల్ని చుట్టేసుకుందండి. అప్పటి దాకా నా సమ జోడీ ఎవడా అని చుట్టూ పరికించి చూసిన నేనుఈ రోజు మాత్తరం  ఇంకెవరో   ఇజయం కోసం నాతో పాటు నెత్తురు కురిపించే అమాయక పుంజు ఎవడా అని చూశాను. అదిగో ఇలా చింతా మగ్నుడినై వుండగానండీ.. ఒక్కసారి జనంలో కోలాహలం కనిపించింది. రాజు గారు ఎవరూ పోటీకి దిగటం లేదని నాలుగెక్కువ నాలుగెక్కువ అన్నారు. అంటే ఆయన గెలిస్తే నాలుగు లక్షలనుకోండి. ఎదుటి వాడు గెలిస్తే ఆయన ఐదులక్షలు ఇస్తాడు. ఆ తర్వాత ఆయన ఆరెక్కువ అన్నారు. అయినా చుట్టూ పౌరుసంగా నిలబడి వున్న   ఏ కోడి పుంజులోనూ నెత్తి మీద జుట్టులో ఒక ఎంట్రక కూడా కదల్లేదంటే లేదండి. ఇంక మా రాజుగోరికి సిరాకెత్తుకొచ్చిందండి. సగానికి సగం అంటే ఫిఫ్టీకి హండ్రెడ్  అని అనేసేరండి.

అదీ. ఆ దెబ్బతో జనంలో అలజడి మొదలైంది. ఒక పుంజుని పట్టుకోని ఎవరో పెద్ద మడిసి ఆకాసెం నుంచి ఎగిరొచ్చినట్టు బరిలోకి ఊడిపడ్డాడండి. నేను రెడీ అన్నాడండి. పందెం మొగిసింది. ఎదుటోడి పుంజు పర్ల. నేను తేతువ. నేను తెల్లగా వుంటాను. ఆడు నలుపుపసుపుపచ్చ రంగులతో వుంటాడు. నా మీద చాలా పొట్టిగా వున్నాడు. ఇలాంటి కురస సైజు పుంజు నాతో పోటీకి దిగడం ఇదే ప్రెదమం అండి. అయ్యో ఈడ్ని కొట్టాలంటే నాకు కత్తెందుకుకాలి గోరు సాలదా  అనిపించిందండి. రాజు గోరు ఓడిపోతే ఏబై లచ్చలివ్వాలి. ఈ పొట్టోడు పోతే మా రాజుగోరికి పాతిక లచ్చలు. ఇక సూసుకోండి. పై పందేలు జోరందుకున్నాయి. నాలుగెక్కువ..ఆరెక్కువ..సగానికి సగం పై పెచ్చు..వందా ఏభై..లచ్చా రెండు లచ్చలు.. ఇలా ఎవరికి తోచిన పందేలు వారు కాసుకున్నారు. పై పందాలే కోటి దాటిపోయాయి. మొత్తం మీద ఈ పందెం కోటిన్నరకు ఫిక్సయ్యిందండి. మరి ఎంకన్న కూడా మొత్తం కాసేసే వుంటాడు.

అటు కత్తి ఇటు కత్తి కట్టే కత్తి నిపుణులు రంగంలోకి దిగారు. కత్తులు తనికీ చేసుకున్నారు. కత్తులు కాళ్ళకి చుట్టారు. కత్తికట్టిన వాడిని నేనెప్పుడూ చూడను. మా రాజుగోరి కళ్లల్లోకే సూత్తాను. ఇప్పుడూ అలాగే చూశాను. ఆయనెంత దీమాగా వున్నాడంటే. లచ్చకి పదిలచ్చలు పెచ్చు పట్టమన్నా రెడీ అనేలా వున్నాడు. నీళ్ళు నోటి నిండా నింపుకుని నా గొంతు తెరిచి గట్టిగా తుంపర్లు ఊదిగాడు పందెగాడు. ఆ తుంపర్లు మా రాజుగోరి ఆనంద బాష్పాల ఆశీస్సులండోయ్.  అవతలా అదే తంతు. గ్లాడియేటర్  లాంటి కత్తి యుద్ధ వీరుల గురించి నాకు రాజుగోరు చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తుంటాయి. నేల మీదకి దింపారు. ఒకతూరి మా రాజుగోరొంక చూసేనండి. మూడో అలెగ్జాండర్ చక్రవర్తిలాగా ఎలిగిపోతున్నారు. అప్పుడు ఎదుటి పుంజుని చూశాను.ఆడూ నన్ను చూసేడు. కాసేపు అలా  చూసుకున్నాం. ఆడు ఎంతకీ ముందుకు రాటం లేదు. నేల మీదకి చూత్తా నన్ను చూత్తా ఏదో ఆలోచనలో  పడ్డట్టున్నాడు. ఎదుటి పుంజు కదలికను బట్టి నా ఎత్తులుంటాయి. నేనూ ఆడొంక  తదేకంగా చూత్తన్నాను. అందరూ ఏల మంది సుట్టూ పానాలుగ్గబట్టుకు నిల్చున్నారు.

సరిగ్గా అదే సమయంలో నాకు ఆ ఏదాంతం ఏదో లోపల అలికిడైందండి. ఆ పొట్టి పుంజు కూడా అదే ఆలోచిత్తోందాఅసలెందుకురా ఈ పోట్లాట మనకు అని అది కిందా మీదకి చూత్తా నాకేదో చెప్పాలని చూత్తందాలేకుంటే నేల మీద తనికింక ఎన్ని నూకలు మిగిలున్నాయో లెక్కబెడతందాఅర్ధం కాలేదు.  నేనూ కంగారు పడ్డం లేదు. అదీ కంగారు పడ్డం  లేదు. అక్కడ ఏ జీవి జాడే లేని దీవిలా ఒకటే స్మశాన సైలెన్సు. ఇలా కాదులే అని ఇద్దరినీ ఇరువైపుల పందెగాళ్ళూ ఒకతూరి  చేతుల్లోకి తీసుకున్నారు. వారికి తెలిసిన విద్దెలతో మమ్మల్ని ఉత్తేజ పరిచారు.  నెత్తురిని అత్తరులా  పూసుకునే సంబరానికి సిద్దం చేసేరు. ఈ సారి నేను తదేకంగా ఆ  పొట్టి పర్ల పుంజునే చూస్తున్నాను. మళ్ళీ ఏదో వైరాగ్గెం కమ్మేసింది. ఎలాగూ ఎవరో ఒకరం చనిపోతాం కదా ఇద్దరం కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటే పోలేదా అనిపించింది. అనుకోని రీతిలో పర్ల  నా మీదకి ఉరికింది. కొంచెంలో గురి తప్పింది. లేకుంటే మొదటి దెబ్బకే అయిపోయేవోడిని. అప్పుడు కొంచెం తేరుకున్నాను. సరే రణరంగంలో తత్త్వంతర్కం  పనికి రావని మా రాజుగోరు ఓపాలి సెప్పిన మాట గుర్తొచ్చింది. అలా చూత్తే మా రాజుగోరు నిలువెత్తు భగవద్గీతలా కనిపించాడు. అయినా ఎందుకురా మనకిది అవసరమాఓ సారి మొండికేసి ఈ యుద్ధాన్ని  ఆపేద్దామా అని ఆ పొట్టోడికి చెప్పాలని చూసేను. వాడెక్కడమళ్లీ నా మీదకి ఉరికాడు. నేను ఆదమరిచి వున్నానేమో ఆడి కత్తి నా కుడి పక్క డొక్కలో దిగింది. నెత్తురు కారింది. ఇంత అవమానకరమైన యుద్ధం నేనెప్పుడూ ఎరగను. చిర్రెత్తుకొచ్చి పైకి లేచాను. వాడి మీద రెండు మీటర్లు పైకి ఎగురుతున్నాను. కత్తి దింపకుండా ఆడిని ఆటపట్టిద్దామని నా ఆలోచన. ఎలాగైనా నా మాటలింటాడేమో కాసింత తగ్గుతాడేమో అని నా కల. ఆడు తగ్గేదే లే అంటన్నాడు. నాకు నెత్తురు కారతా వుంది. మరో సారి పందెగాళ్ళు చేతుల్లోకి తీసుకున్నారు. నాకేమైందో మా రాజుగోరికి అర్థం కావట్లేదు. నేనింక యుద్ధం  చేయలేను అని తీర్మానించుకున్నాను. నా చేతుల్తో ఎవరినీ చంపలేనని నిర్ణయించేసుకున్నాను. ఆ పొట్టోడు ఆగకుండా నన్ను కుమ్ముతానే వున్నాడు. అందరికీ ఆచ్చెర్యం. అప్పటికి నేను నిజంగా తలపడినా ఆ పొట్టోడిని మట్టి కరిపించేవోడినే. లేదు. అలా చెయ్యలేదు.నేలకు వాలిపోయాను. కొన ఊపిరి వుంది. నా మీద పందెం కాసినోళ్లందరికీ కన్నీళ్ళూ నెత్తురూ కలిసిన మట్టి మీద నా సెమాపనలు రాసుకున్నానుచుట్టూ పెద్ద పెద్ద స్క్రీన్లు. ఎవరెవరో కనిపిత్తన్నారు. ఆడెవడో ఏ పెళ్ళాం మెడలో మంగల సూత్రాలు తెంపుకొచ్చి నా మీద పందెం కాసేడో, తాగి తాగి వూగి వూగి నా ఓటమిని బరించలేక బరిలోకి ఉరికి నా పక్కనే పానాలు ఇడిసేసేడు. అలా ఎంత మందిని నేను మోసం చేశానో నాకే తెలీదు.

ఆకరిసారిగా రాజుగోరు నన్ను చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన కళ్ళలోకి చూశాను. ఏభై లచ్చలు పోయినందుకు కాదుఅలాంటి డబ్బెంతో గెలిచిపెట్టాను. నేను ఓడిపోయినందుకే ఆయన దుక్క పడ్డాడు. మామూలుగా గెలిచినోడే ఓడిన పుంజును కూడా పట్టుకుపోతాడు. కానీ రాజుగోరు పట్టుబట్టారు. నాకే ఇచ్చేయండి అని. అవతలి పార్టీ వారు కూడా ఏమీ అనలేదు. ఇంటికి తీసుకొచ్చి రాజుగోరు నాకు రాజ లాంచనాలతో అంతిమ సంస్కారం చేశారు. నన్ను  నమ్మి పందెంలో కొంపలు కొల్లేరు చేసుకున్న అలగా జనం  ఆ పూటకి తాగి తాగి చనిపోయినా పర్వాలేదన్నట్టు నా భౌతిక కాయం వెంట పెదర్శనగా నడిసొచ్చేరు.

    నా మూతబడ్డ కళ్ళలోంచే ఎంకన్న కోసం చూసేను. నా బంగారు ప్రియురాలని కూడా ఓ పాలి సూసుకోవాలనిపించింది. అసలే గర్భం దాల్చి గుడ్లు పొదిగిందని ముందు రోజే తెలిసింది.  ఎంకన్న జాడ లేదు. మర్నాడు ఆకాశంలో నేనూ ఎంకన్నా కలుసుకున్నాము. మోసపోయాను రాజా అన్నాడు. నేనే మోసం  చేసేను ఎంకా అన్నాను. ఎంకన్న ఇసం పుచ్చకు చచ్చిపోయాడన్న వార్తతో  కోడి పందేల్లో పుంజులన్నీ సమ్మె కట్టాయి. ఆకాశంలో ఎంకన్న భుజం మీద కూర్చుని, ఒరే నా బంగారం  ఎలా వుందిరా అని అడిగాను. రా చూద్దువు గాని అని ఆళ్ళ ఇంటి పెరటి వైపు తీసుకెళ్ళాడు. అప్పుడే గుడ్లు పగలదీసుకుని పది పన్నెండు పిల్లలు బయటకొచ్చి కువకువమంటన్నాయి. అన్నీ నాలాగే తెల్లగా మెరిసిపోతన్నాయి. మా రాజుగోరు అంత పొడుగు మనిసి నిటారుగా నిలబడితే ఆయన చేతికి తాకేటంత ఎత్తరిగాడిని నేను. నా పిల్లలు కూడా నా అంత అవుతాయేమో.  నా బంగారువొంటి మీద ఏయో సుక్కలు పడినట్టు ఒక్కసారిగా ఒళ్ళంతా దులుపుకుంది. అయ్యి నా కన్నీళ్ళు. అప్పుడప్పుడూ మా రాజుగోర్ని కూడా చూడ్డానికి నేనూ ఎంకా ఎల్తాం. నాకు పెద్ద పటం కట్టించి దాని ముందు కూసోని నన్ను సూత్తా ఏడుత్తానే వున్నాడు రాజుగోరు. అమ్మ గారు పదిరకాల మాంసాహార నైవేద్యం  పెడతారు నాకు.  నన్ను చూసినప్పుడల్లా రాజు గోరు మరో పెగ్గు ఎగస్ట్రా కొట్టేస్తన్నారు. చెప్పుకొనేదంటంటే రాజుగోరు పందేలకు తిలోదకాలు ఇచ్చేశారని ఊరంతా గుప్పుమంది. నా కుటుంబానికిమా ఎంకన్న కుటుంబానికి ఆదరువుగా నిలిచేరని తెలిసి  నేనూ ఎంకా  సంబరపడ్డాం.

 ఆగండి సివరగా చిన్న ట్విస్టుందండి. రాజుగోరు పందేలు మానేత్తారంటే కొందరు నమ్మేరు కొందరు నమ్మలేదండి. ఆ పుంజు పిల్లలు పెద్దయి కానీండి చూద్దాం అని పెద్ద చర్చ సాగిందండి.  అంతటితో ఆగిందా దాని మీద అటూ ఇటూ పందేలు కాసుకున్నారు. నోట్లు  రాసుకున్నారు.

 ఒరే ఎంకా ఇదేం గొడవరా మా రాజుగోరు మారారంటే ఈ జనాలు నమ్మరేంట్రా?

ఎలా నమ్ముతారండీ నాక్కూడా నమ్మకం లేదండి. వైరాగ్గెం కూడా ఒక రోగం లాంటిదే రాజా. అప్పుడప్పుడూ వత్తాది. అప్పుడప్పుడూ పోతాది.

 “అయితే నువ్వు నమ్మనంటావ్. పందెం కాస్తావా?
‘ కాసుకో రాజా’ అన్నాడు ఎంకన్న. ‘నేనోడిపోతే నా పెట్టని మీ రాజుగోరికి ఇచ్చేయమని మా ఇంటిదానికి కల్లో చెప్తాను’ ఇది ఎంకన్న పందెం.

 ‘నేనోడిపోతే నా పిల్లల్లో రెండు మూడు పిల్లల్ని మీ ఇంటావిడికి ఇమ్మని నేను కూడా మా రాజుగోరికి కల్లో చెప్పుతాన్రా ఎంకా’ ఇది కోడి రాజ పందెం.  అలా పై లోకంలో కూడా ఒక పై పందెం జరిగింది.

*

ప్రసాద మూర్తి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కోడి పందెల కొదికధ చాలా బావుంది ప్రసాదమూర్తి గారు. కధలో అన్నీ ట్విష్టులు పెట్టి బలేరాశారు సర్

  • చాలా బాగుంది . గోదావరి మాండలిక మే కాక, మనుషుల వ్యక్తిత్వాలని కోడి ద్వారా వ్యక్తీకరించటం, గెలిచిన కోళ్ల నే కాక చచ్చిన కోళ్ళతో చితికిపోయిన జీవితాలని కూడా వ్యక్తీకరించటం బాగుంది. కథ నడిపిన తీరు కవిత్వం లాగానే ఉంది

  • ఆహా అచ్చంగా మా గోదారి జిల్లాల్లో రాజుగారి చెరువు గట్టున కట్టిన పందెం కళ్ళారా చూసినట్టుంది.

  • చాలా మంచి కథ రాసారు మూర్తి గారు. ఒక పందెం కొడి మనసులోని బావాలన్ని అక్షరాలుగా చదివించారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు