మందిరం కాదు మరుగుదొడ్డి కావాలి

‘పరదా హఠాకే దేఖో’ అంటూ ముస్లింల జీవితాల్లోని చీకటిని, దుఃఖాన్ని అక్షరీకరిస్తూ వస్తోన్న షాజహానా కలం నుండి నఖాబ్ (2005), దర్దీ (2012) కవితా సంపుటాలు వెలువడ్డాయి. ‘తెలుగులో ముస్లింవాద సాహిత్యం’ అనే అంశంపై పిహెచ్.డి. చేశారు. వతన్ (ముస్లిం మైనార్టీ కథల సంకలనం), అలావా (కవిత్వ సంకలనం-2006) పుస్తకాలకు స్కైబాబతో కలిసి సంపాదకత్వం వహించారు. అలాగే స్కైబాబతో కలిసి ‘చాంద్ తార’ (2009) మినీ కవిత్వ సంపుటిని తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర విశిష్ఠ మహిళా పురస్కారంతో పాటు పలు అవార్డులు అందుకున్నారు. పలు అంతర్జాతీయ వేదికల మీద భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. వీరి రచనలు కొన్ని ఇంగ్లీష్, జర్మన్, హిందీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి. కుల, మత, జాతి వివక్షను, పితృస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ ఇప్పటిదాకా రాసిన పదకొండు కథలతో ‘లద్దాఫ్ని’ (2016) కథల సంపుటి తీసుకువచ్చారు. ‘సిల్ సిలా’, ‘దీవారే’,‘మనిషి పగిలిన రాత్రి’, ‘బిల్లి’ వంటి మంచి కథల్ని రాసిన షాజహానా కలం నుండి జాలువారిన మరొక మానవీయ కథ ‘సండాస్’! ఈ కథ మొదట 2004లో ‘వతన్’ కథా సంకలనంలో వచ్చింది. తర్వాత చాలా కథా సంకలనాల్లో చోటు చేసుకుంది.

ముస్లిం స్త్రీలు ఒకేసారి నలుదిక్కుల పోరాటం చేయాల్సి వస్తోంది. ఒక వైపు ముస్లిం మైనార్టీలుగా, ఇంకో వైపు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, మరోవైపు ముస్లిం మత ఛాందసాలకు వ్యతిరేకంగా, చివరికి పేదరికంతో. ముస్లిమేతర స్త్రీలకన్నా ముస్లిం స్త్రీలను పేదరికం ఎక్కువ పీడిస్తుంది. అందుకే మసీద్ ల ముందు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, రద్దీగా ఉండే రోడ్ల మీద యాచన చేస్తూ కూడా ముస్లిం స్త్రీలు కనిపిస్తారు. పల్లెల్లో అయితే ఆకలి బాధకు ఓర్చుకోలేక బుర్ఖాలను, పర్దాలను దాటి ఏ పనైనా చేయడానికి ముస్లిం స్త్రీలు సిద్ధంగా ఉన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు డెబ్భై అయిదేళ్లు కావస్తున్నా ఇంకా ప్రజలు కూడు, గూడు, గుడ్డ కోసం, రక్షిత మంచి నీటి కోసం చివరికి పరిశుభ్రమైన మరుగు దొడ్ల కోసం అంగలార్చాల్సి రావడం అత్యంత శోచనీయం.

షాజహానా రాసిన ఈ ‘సండాస్’ కథలో కూడా కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన షమీమ్ కు ఎక్కడా లెట్రిన్ కనిపించలేదు. “ఇంటెనక్కి పోయింది. అక్కడామెకు ఏం కనపడలే – చుట్టూ చూసింది. ఒక మూలాన నాలుగు కర్రలు పాతి ఉన్నయ్. వాటి చుట్టూ గోనె సంచులు, తాటి కమ్మలు కట్టి ఉన్నయ్. దానికి తలుపు లాగా కూడా అడ్డంగా ఒక కర్ర ఉన్నది. దానికి గోనె పట్టా ఎళ్ళాడబడ్తున్నది. అంతలో అందుల నుంచి గోనె సంచి జరుపుకుంట ఒకామే బైటకొచ్చింది లోటా బట్టుకొని.

‘జాతే? జావ్. మై యా ఖడేతిమ్ లేవ్!’ అని కొద్ది దూరంల ఎవర్రాకుంట నిలవడ్డది.

ఈమె చూడకుంటెనన్న ఎనక్కి తిరిగి పోయేడిది. ఇగ ముందుకే వెళ్లింది షమీమ్.

భయం భయంగా లోపలకడుగు పెట్టింది. ఒక్కసారే గుప్పుమని మురుగు కంపు కొట్టింది. పల్లుని ముక్కుకి అడ్డం పెట్టుకొని కళ్లని కిందికి తిప్పి చూసింది. కింద మలంతో నిండుకొస్తున్న గొయ్యి. దాన్నిండా లుకలుకలాడుతున్న పురుగులు… జిబజిబ.. దాని మీద కూర్చోడానికి వీలుగా రెండు చెక్కలు మట్టితో కప్పి ఉన్నాయి. ఆమెకి ఊపిరాడలేదు. వాసనకి ఎంటనే బయటకురికొచ్చింది. పేగులు లుంగ చుట్టుకొని భళ్ళున కక్కుకుంది.”

ఏం చేయాలో అర్థం కాదు. ప్రాణమంతా సుస్తి అయిపోతుంది. ఆ రాత్రి మళ్ళీ ఒక్కసారి దొడ్డికి పోవడానికి ట్రై చేస్తుంది. కానీ అందులో కూర్చోగానే కాళ్ళ మీద బొద్దింకలు, చీమలు, ఎలుకలు పాకుతున్నట్టు అవుతుంది. ఓ బొద్దింక మోకాలుదాక ఎక్కుతుంది. భయంతోని ఒక్క గెంతులో బయటకు వచ్చి పడుతుంది. జలీల్ (భర్త)కు చెప్దామంటే సిగ్గు.

పోనీ ఆరుబయటకు పోదామంటే వీల్లేదు. పైగా తను కొత్త దుల్హన్. లోపలున్న మలం బయటకు రాక, లోపల ఉండక ఒకటే కడుపు నొప్పి. ఇక లాభం లేదని అందరూ ఆశ్చర్యపోతుండగా పుట్టింటికి బయలుదేరి పోతుంది. అక్కడికి పోగానే లెట్రిన్ లోకి పరుగెత్తుకు వెళ్ళి తలుపేసుకొని కూర్చుంటే నొప్పితో రక్తపు విరేచనమవుతుంది. లెట్రిన్ కూడా సరిగా లేని అత్తగారిల్లును వదిలేసి భర్త ఇక్కడికే వస్తే మంచిగుండు అనుకుంటూ పడుకుంటుంది.

తెల్లవారి ఇల్లు ఖాళీ చేస్తున్న సప్పుడుకు మెలకువ వస్తుంది. ఇల్లెందుకు ఖాళీ చేస్తున్నారని అడిగితే పెళ్ళికి ఇల్లు అమ్మేశామని ఏడుస్తుంది షమీమ్ వాల్ల అమ్మీ.  చోటి బహెన్ “ఆపా! ఆపా! ఓ ఘర్ మే పాయ్ ఖానా భీ నై హై.. ఖాళీ సండాస్ హై” అంటుంది దిగులుగా.

దేశ అభివృద్ధి గ్రాఫ్ ను అద్దంలో చూపెట్టే కథ ఇది. ఇంత నాగరికంగా, సాంకేతికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన సమాజంలో నివసిస్తున్నా ఇంకా కొంత మందికి కనీసం మల విసర్జన చేయడానికి పరిశుభ్రమైన లెట్రిన్ లేనందుకు సిగ్గు కలుగుతుంది. పేదరికం తీవ్రత ఎంతగా బాధిస్తుందో ఈ కథ కళ్ళకు కడుతుంది. ఇన్నేళ్లలో మనం సాధించిన ప్రగతి ఎంత దూరం పోయిందంటే తలకొక్క సెల్ ఫోన్ కొనుక్కుంటున్నాం కానీ ఇంటికొక్క లెట్రిన్ ను నిర్మించుకోలేకపోయాం. అంటే మన జీవన ప్రాధాన్యతల్ని ఎవరు నిర్దేశిస్తున్నారు.

132 కోట్ల భారతదేశ జనాభాలో 53 శాతం మందికి మరుగుదొడ్లు అందుబాటులో లేవంటే నమ్మగలమా? గ్రామీణ ప్రాంతాలలో 66 శాతం మంది ఇప్పటికీ బహిర్భూమిలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. మహిళలైతే చీకటి పడే దాకా ఆగాల్సిందే. ఇదొక నరకం. ఇదే అదనుగా ఎన్నో అఘాయిత్యాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికీ చాలా పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేనేలేవు, ఒకవేళ ఉంటే వాటికి సరైన నీటి వసతి లేదు. ఒక స్కూల్లో నువ్వు అబ్బాయివైతే ఏం చేస్తావు? అని ఒక అమ్మాయిని అడిగితే “నేను అబ్బాయినయితే మూత్ర విసర్జన ఎక్కడైనా చేసుకోగలుగుతాను” అని సమాధానమిచ్చిందంటే మనమంతా సిగ్గుతో తల వంచుకోవాలి.

బహిరంగంగా చర్చించుకోవడానికి ఇష్టపడని అంశాల్లో మల మూత్ర విసర్జన కూడా ఒకటి. ఈ కథలో షమీమ్ కూడా అంతే. విషయం అటు భర్తకు చెప్పలేక, ఇటు మిగతా కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక మింగలేక కక్కలేక అవస్థ పడుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకే కాదు పట్టణ ప్రాంత మురికి వాడల ప్రజలకు కూడా ఇదొక తీవ్ర సమస్య.

ప్రపంచ వ్యాప్తంగా ఆరు బయట మల విసర్జన చేసే ప్రజల్లో 60 శాతం మన దేశానికి చెందినవారేనంటే మనం సాధించిన అభివృద్ధి ఏపాటో అర్థం అవుతుంది. ప్రజలకు వచ్చే రోగాల్లో సగం దాకా మరుగుదొడ్డి లేకపోవడం వల్ల, ఉన్నా అవి శుభ్రంగా లేనందు వల్లే వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆరోగ్య రక్షణ కంటే మించిన ప్రాథమిక హక్కు ఏముంటుంది?

దేహమే దేవాలయం అన్నారు. దేవునికి గుడి మన మనసులోనే కట్టుకోవచ్చు కానీ మరుగు దొడ్డి ఎక్కడ కడుతాం? మలాన్ని కడుపులో దాచుకోలేం కదా! ఈ కథలో షమీమ్ లాగా మన కూతురు, చెల్లెలు కూడా బాధపడొద్దు అనుకుంటే ముందు చూడాల్సింది పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు జాతకాలు కలిశాయా? అని కాదు. ఇంటిలో మరుగు దొడ్డి ఉందా లేదా? అని. షమీమ్ లాగే మధ్యప్రదేశ్ లోని అనిత నారే అనే యువతి పెళ్లి అయిన రెండు రోజులకే పుట్టింటికి వెళ్ళి పోయింది. మహిళల గౌరవాన్ని ఎక్కడ కాపాడుతున్నాం? కనీసం సరైన మరుగుదొడ్డి అయినా నిర్మించి వాళ్ళ రుణం కాస్తైనా తీర్చుకోవాలని చెప్పే కథ ఇది.

మనిషి జీవితంలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న వస్తువును ఎన్నుకోవడంలోనేగాక కథను నడిపించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వాతావరణ కల్పనలో రచయిత్రి విజయం సాధించిందనాలి. శైలీ, శిల్పాలేగాక ఉర్దూ కల్సిన తెలుగును ప్రయోగించడం కథకు అదనపు ఆకర్షణ. చాలా టెన్షన్ తో ప్రారంభమయ్యే కథ చివరికొచ్చే సరికి కళ్ళల్లో నీళ్ళు నింపి ముగుస్తుంది. ఈ జీవితాలిక మారవనే ఒక విర్వేదాన్ని కల్గిస్తుంది. షమీమ్ లాంటి పాత్రలు మనకు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మురికి వాడకు వెళ్ళినా దేశ దౌర్భాగ్యానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. నిత్య జీవితంలోని ‘సండాస్’లాంటి అత్యంత సాధారణ సమస్యను తీసుకొని కథగా మల్చడానికి చాలా ధైర్యం కావాలి. రచయిత్రి ఈ కథ రాయడం వల్ల మనలో చాలా ఏండ్లుగా గూడుకట్టుకున్న నిశ్శబ్దాన్ని భళ్లున పగులగొట్టి ఈ దేశంలో మల విసర్జన కూడా ఎంత ఇబ్బందికర సమస్యో మనమంతా చర్చించుకునేలా చేశారు. మన జీవితంలో ‘సండాస్’ ఉన్నన్ని రోజులు, మన పిల్లలు నిర్భయంగా శౌచాలయాలకు పోయే రోజు వచ్చేదాకా ఈ కథ బతికి ఉంటుంది.

*

సండాస్‌

                                                                                      -డా. షాజహానా

 

‘ఏమైందీ… వలీమా అయి ఒక్కరోజన్న కాలే, అప్పుడే పోవుడేంది? ఏ ఇంట్లనన్న ఉన్నదా గిసుంటి రీతి రివాజు?’ జలీల్‌ వాళ్ళ నానీమా పాన్‌దాన్‌ల ఊంచుకుంట అన్నది.

‘ఆ పిల్లకు కడుపుల నొప్పి తగ్గనే లేదు… ఏమన్నయితె ఎట్ల. పోతనంటె పంపిస్తున్న అమ్మీ’ అన్నది జలీల్‌ అమ్మీజీ.

‘గట్లనా… ఎందుకయ్యింది గట్ల…? జలీలేమన్న తొందర పడ్డడా ఏందీ…?’ చిన్నగ అన్నది నానీమా.

‘సాజిదా అడిగితే అలాంటిదేం లేదన్నదంట. మరెందుకట్లయితందో ఏమో… మెలికలు తిరగబట్టె. డాక్టరు కాడికి పోదమంటె వద్దంటున్నది’ అన్నది అమ్మీజీ.

ఈ మాటలన్ని చిన్నగ అర్రలున్న షమీమ్‌కు ఇనబడ్తనె ఉన్నయ్‌. నయీ బహూ.. అందరేమనుకుంటున్రో అని కళ్ళెంబడి గిర్రున నీళ్ళు తిర్గినయ్‌ షమీమ్‌కు. అప్పటికి ఆమె పుట్టింటికి పోనీకి మొత్తం తయారై కూసొనుంది.

జలీల్‌ ఆమె దగ్గరికొచ్చి ‘ఎట్లున్నది’ అన్నడు.

కళ్ళల్ల నీళ్లతోని చూసిందిగని ఏం మాట్లాడలె షమీమ్‌. ‘సరె, ఇగ లే పోదాం. మల్ల లేటయితె కష్టం’ అని సూట్ కేస్‌ పట్టుకొని ఆమె చెయ్యి పట్టుకు లేవదీసిండు. ఇద్దరు గల్సి బైటికొచ్చిన్రు.

ఇంక కొంతమంది దగ్గరి చుట్టాలు పోనేలేదు. పందిరి కింద అక్కడక్కడ చేరి మాట్లాడుకుంటున్రు. వాళ్ళంతా తన గురించే మాట్లాడుకుంటున్రో ఏమోనని షమీమ్‌కి ఒకటే ఏడుపు తన్నుకొస్తుంది.

అందరి దగ్గర అలాయిబలాయి తీస్కొని సలామ్‌ చేసి రోడ్డుమీది కొచ్చిన్రు. పక్కనున్న టౌన్‌కు పోతె అక్కడ్నుంచి షమీమ్‌ వాళ్ళూరుకు బస్సులు దొర్కుతయ్‌. ఆటో ఎక్కిస్తాన్కి అమ్మీజీ, సాజిదా, జలీల్‌ తమ్ముడు ఖలీల్‌ వచ్చిన్రు. ఆటో ఎక్కి టౌన్ల దిగేసరికి షమీమ్‌ వాళ్ళూరు బస్‌ తయారున్నది. ఎక్కి కండక్టర్‌ ఎనక సీట్ల కూసున్నరు. కళ్ళు మూతలు పడ్తున్నయ్‌ షమీమ్‌కు. ఆమె అవస్థ చూసి తన వళ్లో పడుకోబెట్టుకున్నడు జలీల్‌. ఆమెకు ఒక్కసారిగ దుక్కం పొంగుకొచ్చింది. ఆమె తల నిమురుకుంట కళ్ళు మూసుకున్నడు.

చిన్నగ కళ్ళు తుడుసుకున్న షమీమ్‌కు తమ ఇల్లు, బహెన్‌లు, అమ్మీ, దాదీమా అంతా గుర్తుకు రాసాగిన్రు. ఆమె మనసు ఒక్కొక్కళ్ళను పలకరించుకుంట ఒక్కోమెట్టు ఎక్కుకుంట ఆళ్ళింట్లకు పొయింది…

‘మా భాయి పెద్ద కూతురి నిఖా. అంటే ఖాన్‌దాన్‌లనే బడీ బేటీ! అందరం ఎళ్ళాలె. ఎల్లకుంటె బాగుండదీ, అన్నీ తయారు చెయ్యి’ భార్యకు ఆర్డరేసిండు షమీమ్‌ వాళ్ళ అబ్బాజాన్‌ సిరాజుద్దీన్‌.

‘షమీమ్‌ రాదంట అబ్బా’ ఫిర్యాద్‌ చేసింది పెద్ద చెల్లె ఫర్హానా.

‘కైకు నై ఆతీ? ఇంట్ల ఒక్కత్తె ఎట్లుంటదంట’ కోపంగన్నడు సిరాజుద్దీన్‌.      ‘గాల్లింట్ల పాయ్‌ఖానా దొడ్లు గలీజుగుంటయని రానంటుంది’ చెప్పింది ఫర్హానా.

‘ఒక్కరోజు కేమయితది. ఏం గాదు, అందరు తయారుకండ్రి, సమ్జయిందా’ గట్టిగన్నడు సిరాజుద్దీన్‌.

కిక్కురు మనకుంట అందరు తయారైపొయిండ్రు. బండెక్కినంక అందరు సీరియస్‌గ ఉన్నరని ‘దీన్ని అడుక్కునేటోడికిచ్చినా ఏమనదిగని ఇంట్ల పాయ్‌ఖానా మంచిగున్నోని కియ్యాలె’ అన్నడు.

అందరు నవ్వేసిన్రు. షమీమ్‌ వస్తున్న నవ్వుని ఆపుకుంట బలవంతంగా తల పక్కకి తిప్పుకుంది.

షాదీ కెళ్ళొచ్చిన్రు. అక్కడ బాగా ఏడ్చిన్రు. ఆ రాత్రి సిరాజుద్దీన్‌కు గుండెనొప్పి వచ్చింది. ఏడ్సుట్ల మొత్తుకొనుట్ల ఆయన అన్నదమ్ములందరు కల్సి దవాఖానల ఏసిన్రు గని ఆయన బతకలె. ఆ ఇల్లంత చీకటైపొయింది. అందరి మొఖాలు పాలిపొయ్యి, ఏదో జీవి రక్తం మాత్రం పీల్చేసినట్లు అయ్యిన్రు అంతా.

గట్ల గట్ల ఏడాది ఎల్లిపొయింది.

ఒకరోజు మర్దులిద్దరికీ, బావకి కబురుపెట్టి బిడ్డ షాదీ చెయ్యాల్నని, మళ్ళ వయసు ముదిరితె ఎవలు చేసుకుంటరని, ఎట్లాంటిదో ఒకట్లాంటిది సంబంధం చూడమని, పిలగాడు మంచోడయితే సాలని చెప్పి ఏడ్చింది ఖాజాబీ.

అప్పుడు వాళ్ళందరు కలిసి గీ సంబందం చూసిన్రు. కట్నం ఏబై వేలే, సైకిలు షాపు సొంతంగా నడుపుతున్నడని ఇంతకంటె మంచి సంబందం దునియాల ఏడ దొరకదని వాళ్ళు గట్టిగ చెప్పిన్రు. ఇగ చేసేదేం లేక ఆ సంబందాన్నే కాయం చేసుకున్నరు.

షాది మంచిగనె అయ్యింది. పిల్లెంబడి తోడుగ చెల్లెల్ని పంపిన్రు. తెల్లారి వలీమా రోజు అందరూ వచ్చి పొయ్యిన్రు. ఫర్హానా అక్కకి తోడుగ ఉండకుంట ఎల్లిపొయ్యింది.

లేవగానే చాయ్‌ తాగి బయికెళ్ళటం అలవాటు షమీమ్‌కి. చాయ్‌ అయితే తాగింది గని లెట్రిన్‌ ఎక్కడుందో తెలియక పాయె. ఆమె సనన్‌ (ఆడబిడ్డ)ను అడిగితే ఇంటెనకున్నది ఎళ్ళమని లోటాల నీళ్ళిచ్చింది.

లోటాల నీళ్ళెట్ల సరిపోతయ్‌ అన్పిచ్చి లోపలుండొచ్చులే అనుకుంట ఇంటెనక్కి పోయింది. అక్కడామెకు ఏం కనపళ్ళే – చుట్టూ చూసింది. ఒక మూలన నాలుగు కర్రలు పాతి ఉన్నయ్‌. వాటిచుట్టు గోనె సంచులు, తాటికమ్మలు కట్టి ఉన్నయ్‌. దానికి తలుపులాగ కూడా అడ్డంగ ఒక కర్రున్నది. దానిగ్గూడా గోనెపట్టా ఏళ్ళాడబడ్తున్నది.

అంతలో అందులనుంచి గోనెసంచి జరుపుకుంట ఒకామె బైటకొచ్చింది లోటా బట్టుకొని.

‘జాతే? జావ్‌. మైఁ యాఁ ఖడేతిమ్‌ లేవ్‌!’ అని అక్కడకు కొద్ది దూరంల ఎవర్రాకుంట నిలబడ్డది.

ఈమె చూడకుంటెనన్న ఎనక్కి తిరిగి పోయెడిది. ఇగ ముందుకే వెళ్ళింది షమీమ్‌.

భయంభయంగా లోపల కడుగుపెట్టింది. ఒక్కసారే గుప్పుమని మురుగు కంపు కొట్టింది. పల్లుని ముక్కుకి అడ్డం పెట్టుకుని కళ్లని కిందకి తిప్పి చూసింది. కింద మలంతో నిండుకొస్తున్న గొయ్యి. దాన్నిండా లుకలుకలాడ్తున్న పురుగులు… జిబజిబ… దానిమీద కూర్చోడానికి వీలుగా రెండు చెక్కలు మట్టితో కప్పి ఉన్నయి. ఆమెకి ఊపిరాడలేదు. వాసనకి ఎంటనే బయటకురికొచ్చింది. పేగులు లుంగజుట్టుకొని భళ్ళున కక్కుకుంది.

‘సండాస్‌మే కబ్బీ నయ్‌ గయే క్యావ్‌?’ అని అడిగింది బయట నిలబడ్డామె. కొద్దిసేపు చెవులు పట్టి తర్వాత మొఖం కడిగించి అర్రలకి తీస్కపొయ్యి ‘ఆరామ్‌ కరో బేటీ’ అని బయటకెళ్ళి పొయ్యింది.

కొద్దిసేపటికి స్నానానికి పిలిచింది సాజిదా. స్నానం చేసి మళ్ళ అర్రల కొచ్చి పడ్డది. లోపలికే అన్నం వచ్చింది. కొత్త దుల్హన్‌ని ఏ పని చేయనియ్యరు. అన్నం తిననని చెప్పింది జలీల్‌తో. అతను బలవంతంగ రెండు ముద్దలు తినిపించిండు. షమీమ్‌కి తన బాధ ఎవరికి చెప్పాల్నో సమజ్‌కాలె. ఏదైనా మాయ జరిగి పుట్టింట్ల పడితె బాగుండనిపించింది. అసలు వీళ్లయినా దాంట్లకే ఎట్ల పోతున్నరు! ఛోటీ సనన్‌ కాలేజ్‌ చేస్తుంది. ఆమె గూడ అందులకే ఎట్ల పోతున్నదో.. వెన్నముద్దల్లెక్క ఉన్న ముగ్గురు సనన్‌లు ఇన్ని రోజుల్నుంచి సండాస్‌లకే ఎట్ల ఎల్తున్రో ఏమో.. పాపం, అమ్మీజీ- షాదీ అయినకాణ్నించి అందులకే ఎల్తుందని తల్చుకుంటే బాధగావుంది. గరీబు ముస్లిం ఆడోళ్లందరి బతుకులు ఇంతేనా?! ఊర్ల ముస్లింలు కానోళ్లంతా ఊరి బైటికెళ్తరు గదా.. వీళ్లు గూడ ఎల్తేంది?? అని సోంచాయించుకుంట కూసుంది షమీమ్‌.

మద్యానం జలీల్‌ షమీమ్‌ ఉన్న అర్రల కొచ్చిండు. సుస్తుగున్న షమీమ్‌ను చూసి ‘క్యా బాత్‌ హై, అట్లున్నవేంది?’ అన్నడు.

‘ఏం లేదు. మంచిగనె ఉన్న’ అన్నది తలొంచుకొని షమీమ్‌. కొద్దిసేపు మాట్లాడి పెదాల్ని ముద్దు పెట్టుకొని బయికెళ్ళిండు జలీల్‌. సిగ్గుతో ముసుగులో మొహం దాచుకుంది షమీమ్‌.

సాయంత్రమైంది. మత్తు జల్లినట్లు చిన్నగ తెల్వకుండనె అంతట చీకట్లోచ్చినయ్‌. దీనికోసమే కాసుక్కూచుంది షమీమ్‌. చీకట్ల నయితె ఏం కనబడది, ముక్కు గట్టిగ మూసుకొని వెళ్ళొచ్చు అనుకుంట ఎనిమదయితంటె లోటా పట్టుకొని సండాస్‌ కెల్లి నడిచింది.

గోనెపట్టా పక్కకనుకుంట లోపల్కి పొయ్యి ముక్కు పల్లుతో మూస్కొని కూసుందో లేదో కాళ్ళనిండ ఏందో పారుతున్నట్టయింది. పరీక్షగా చూస్తె బొద్దింకలు… చీమలు… ఎలుకలు గూడ తిరుగుతున్నట్లుంది. ఆమె మోకాలు దాకా ఎక్కిందొక బొద్దింక.  దాన్ని విదిలించుకుంట భయంతోని ఒక్క గెంతుల బయటకొచ్చి పడ్డది షమీమ్‌. ఆ చీకట్ల అట్ల ఒంటరిగ కొద్దిసేపు నిలబడ్డది. ఏం చెయ్యాల్నో ఏమో అంతా అయోమయంగా అన్పించింది షమీమ్‌కి.

జలీల్‌కి చెప్దామంటే సిగ్గేసింది. పోనీ చెంబు పట్టుకొని ఆరుబైటికి ఎల్లాల్నంటె జనానా (ఆడవాళ్లు) అట్లా పోడానికి లేదు. అందులోనూ కొత్త దుల్హన్‌. ఆ రాత్రి అన్నం కూడ తినకుండ పండుకుంది షమీమ్‌.

తెల్లారి లేసి ఇక తప్పదన్నట్లు ప్రాణాల్ని అరచేతుల పెట్టుకొని ముక్కు మూసుకుని సండాస్‌ల కూసుంది ముళ్ళమీద కూసున్నట్లు. కాని ఎంతకీ దొడ్డికి రాలె.

రూంల కెళ్ళంగనె ఎక్కెక్కిపడి ఏడుపొచ్చింది షమీమ్‌కి. ఏడుపు విని ఏమైందేమైందనుకుంట అందరొచ్చిన్రు రూంలకు.

‘పేట్ మే దర్ద్‌ హోతాహై క్యా?’ అంది అమ్మీజీ.

ఏమనాలో సమజ్‌కాక ఏడ్చుకుంటనే తలూపింది షమీమ్‌.

‘దవాఖానాకు ఎళ్దామా?’ అడిగింది అమ్మీజీ.

‘మై నై ఆతీ యాఁ’ అంది షమీమ్‌.

‘ఫిర్‌ తుమారే గాఁవ్‌ మే జాతే క్యా?’ అన్నడు జలీల్‌.

ప్రాణం లేచొచ్చినట్లే గబగబ తలూపింది షమీమ్‌.

అందరేమనుకుంటరో అనుకుంటనే అమ్మీజీ తయారు చేసి పంపింది ఇద్దర్ని. అక్కడికీ నానీమా అడగనే అడిగింది. అందర్కి ఏదో సర్ది చెప్పింది అమ్మీజీ.

‘సోడా పీతే?’ జలీల్‌ తట్టి లేపి అడుగుతుండు. ఈ లోకంలో కొచ్చి ‘నక్కో’ అంది షమీమ్‌. ఇంకో గంటకు వాళ్ళూరొచ్చింది. బస్టాండ్‌ బయటకొచ్చి రిక్షా మాట్లాడుకుని ఇంటికి పొయిన్రు ఇద్దరు.

అందరికీ సలాములు చెప్పుకుంటనే ఇంటెనక లెట్రిన్‌లకి పొయ్యి తలుపేసుకుంది షమీమ్‌.

చాలాసేపికి నొప్పితో రక్తంతో విరేచనమయ్యింది. చాలా భయమేసింది షమీమ్‌కి. ఎప్పుడు ఇట్ల కాలె. ఇట్లెందుకయ్యింది? రెండ్రోజుల్నించి బయట కెళ్ళలె కదా అనుకుని నొప్పితోనే ఇంట్ల కొచ్చింది.

అందరు ఆదుర్దాగా ఎదురుచూస్తున్రు. నీర్సంగా నవ్వి ‘నాకే కొద్దిగ కడుపు నొప్పిగ అన్పిస్తే వచ్చినం అమ్మీ…’ అని చెప్పినంక అందరు హమ్మయ్య అని ఊపిరి తీసుకున్రు.

అమ్మి అన్నది,’నేను చాచాని పంపుదామనుకున్న పహెలీ జుమ్మాగీకి’

‘ఎట్లయితేందమ్మి, మేమే వచ్చినంగ’ అన్నది షమీమ్‌ నవ్వుకుంట.

సాలీలిద్దరూ భాయిజాన్‌ (బావ)ని మస్తుగ ఏడిపించిన్రు. ఇగ అన్నం తిని ఎక్కడోల్లు అక్కడ పండుకున్నరు. షమీమ్‌కి నిద్దర పడ్తలె- సైకిల్‌ షాపే కాబట్టి ఇక్కడ గూడ మంచిగనె నడుస్తది. ఇక్కడ్నయితె ఇల్లు, లెట్రిన్‌ అన్ని ఉన్నయ్‌. ఈడికొచ్చేస్తే మంచిగుండు. రేపు అమ్మీకి చెప్పి ఈనకి చెప్పిస్త.. ఆలోచన్లతోని అటుఇటు దొర్లబట్టింది.

ఇంతట్ల ఇంట్లనుంచి సప్పుళ్లు ఇనరాబట్టినయి. ఏందా అని సూడనీకి షమీమ్‌ ఎనక రూంలకు పొయ్యింది. చిన్న చెల్లె సజ్జపై నుంచి సామాను అందిస్తుంటే కింద ఉన్న పెద్ద చెల్లె ఫర్హానా అందుకుని అమ్మీకిస్తుంది. అమ్మీ వాటిని మూటలు కట్టి ఒక మూలకు పెడ్తుంది. షమీమ్‌కేం సమజ్‌కాలె.

‘కై కమ్మీ ఏ సోబ్‌?’ అనడిగింది.

అమ్మీ కొద్దిసేపేం మాట్లాడలె. అటెంక కళ్ళెంట నీళ్ళొత్తుకుంట,

‘ఏ ఘర్‌ బేచ్‌ దియేనా బేటీ! షాదీకి ఇల్లు అమ్మటం తప్ప ఏం చెయ్యాల్నొ తోచలె…!’ అని చిన్నపిల్లలా బోరుమని ఏడ్చింది.

షమీమ్‌కి కూడా ఏడుపొచ్చింది.

‘అరె అమ్మీ… నక్కోరో…’ అని సమ్జాయించుకుంట’ ఫిర్‌ అబ్‌ కాఁ రహేంగే?’ అనడిగింది.

‘గాఁవ్‌కే కోనేమే ఏక్‌ కిరాయిక ఘర్‌ మిలా బేటీ (ఊరి చివర ఒక కిరాయిల్లు దొరికింది బేటీ!)’ అంది అమ్మీ పల్లుతో ముక్కు తుడ్సుకుంట.

ఇద్దరు చెల్లెళ్ళు దగ్గర కొచ్చిన్రు.

బడీ బహెన్‌ ఫర్హానా ‘ఆపా! ఓ ఘర్‌ కవేలీకా భీ నై, టీనోంకా (రేకుల్ది). థోడా భీ అచ్ఛానై హై’ అంది.

ఛోటి బహెన్‌ ‘ఆపా! ఆపా ఆపా! ఓ ఘర్‌మే పాయ్‌ఖానా భి నై హై… ఖాలీ సండాస్‌ హై (ఉత్త సండాసే ఉంది)’ అంది దిగులుగ…

2004, ‘ముల్కి,’ ముస్లిం ప్రత్యేక సంచిక

2004, ‘వతన్‌’ ముస్లిం కథలు

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

12 comments

Leave a Reply to Bantu Anand Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది సార్ 👌 సార్ ఈ వెబ్ సైట్ లింక్ పంపించగలరు సార్

  • అవును మౌలిక వసతుల కల్పనలో మన ప్రభుత్వాలు ఇంకా వెనుకబడే ఉన్నవి.

  • శ్రీధర్ మాస్టర్! గారికి
    నమస్సులు🙏సండాస్ కథపై మీ విశ్లేషణ… హృదయాలను కదిలించేసింది.
    మన దేశంలో చాలా మందికి నేటికీ..
    మరుగుదొడ్ల విషయం లో… ఎలాంటి.. పరిస్థితులను ఎదుర్కొంటున్నారో… అద్దం పట్టింది..ఈ కథ..
    పాఠకుల ఆలోచనా శైలిని మార్చేవిధంగా
    సాగింది…
    ఇలాంటి కథలకు మీ విశ్లేషణ ద్వారా అంకురార్పణ జరిగిందనడంలో..
    సందేహం లేదు.
    ధన్యవాదాలు🙏👌

  • శ్రీధర్ మాస్టర్! గారికి
    నమస్సులు🙏సండాస్ కథపై మీ విశ్లేషణ… హృదయాలను కదిలించేసింది.
    మన దేశంలో చాలా మందికి నేటికీ..
    మరుగుదొడ్ల విషయం లో… ఎలాంటి.. పరిస్థితులను ఎదుర్కొంటున్నారో… అద్దం పట్టింది..ఈ కథ..
    పాఠకుల ఆలోచనా శైలిని మార్చేవిధంగా
    సాగింది…
    ఇలాంటి కథలకు మీ విశ్లేషణ ద్వారా అంకురార్పణ జరిగిందనడంలో..
    సందేహం లేదు.
    ధన్యవాదాలు🙏👌

  • “”ఆ కథను మీరు విశ్లేషించిన తీరు ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది,ఈ దేశ అభివృద్ధి అనే మాట ఎక్కడుంది అనే ప్రశ్న మనసున్న ప్రతివాడికీ కలుగుతుంది,ఇక “”షాజహానా “”గారి గురించి చెప్పాలంటే “ఇంకో “”తస్లీమా నస్రీన్ “”లాంటి అభ్యుదయ,మతాతీత కవులు,రచయిత్రులు ఉన్నారని చాలా సంతోషమేసింది,విశ్లేషించిన డా” వెల్దండి శ్రీధర్ “”నా సమస్సుమాంజలులు, మేడమ్ గారికి (షాజహానా) కూడా సమస్సుమాంజలులు…

  • డాక్టర్ షాజహానా గారి కవితలు చాలా చదివాను కానీ కథలు మాత్రం కొన్ని చదివిన జ్ఞాపకం. ఎంతో శక్తి వంతంగా, నిబద్ధతతో రాస్తున్న రచయిత్రిగా గుర్తుంచుకున్నాను. అలాగే ఈ “సండాస్” కథ గురించి ఎక్కడో విన్నట్లు గానో, చదివినట్లు గానో లీలగా గుర్తున్నది. ఇప్పటికీ పల్లెల్లో బడుగు, బలహీన వర్గాల ఇళ్లల్లో toilets ఉండవు. ఇది కేవలం ముస్లిం మహిళల సమస్యే కాదు పేద కుటుంబాల స్త్రీలందరి దయనీయావస్థ. వీరందరి సంకట ఇబ్బందినీ, దురవస్థనూ షమీమ్ పాత్ర ద్వారా రచయిత్రి ఎంతో బలంగా, మనసుల్ని తాకేలా రాస్తే, శ్రీ శ్రీధర్ గారు అంతకన్నా ఎక్కువగా సూటిగా, హృదయాలు ద్రవించేలా కథను విశ్లేషించారు. ముఖ్యంగా విశ్లేషణ ఎత్తుగడ ఎంతో గొప్పగా ఉంది. ఒక అర్థమైన కథను అద్భుతంగా ఎలివేట్ చేయడంలో శ్రీధర్ గారు 100% కృతకృత్యులయ్యారు. అందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు.

  • చక్కటి. విశ్లేషణ సర్…
    నేటి సమాజానికి మందిరం కన్న మరుగుదొడ్డే కావాలి… అభినందనలు….

  • షాజహాన కథ ‘సండాస్’ వెనుక పేదరికపు కోరలకు చిక్కి విలవిల్లాడే జీవితాల వ్యథ, వలవలా ఏడ్చినా తీరని వెత, అంతకంతకూ లోలోపలికి కూరుకుపోయే నిస్సహాయత ఉంది. సండాస్ లో గొయ్యి కూడా సరిగ్గా లేని దయనీయత సామాజిక వాస్తవాల్ని, దాని వెనకున్న రాజకీయార్థిక దుస్థితిని వెల్లడించింది. వెల్దండి శ్రీధర్ గారూ…, మీ సమీక్ష అర్థవంతంగా ఉంది. కథ ఉద్దేశ్యాన్ని, ఔచిత్యాన్ని విడమరచి చెప్పిన తీరు అభినందనీయం. ఇలాంటి మరిన్ని మంచి కథలకు మరిన్ని మీ నుండి సమీక్షలు ఆశిస్తున్నారు పాఠకులు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు