భారత్‌ బాబు అను నేను…

నా పేరు గురించిన అసంతృప్తిని, మరో పేరు కోసం వెదుకులాటను ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది. మన పేరు మనమే పెట్టుకోవలసివస్తే, అదెంత కష్టమో? సెలబ్రిటీలు కొత్తపేర్లతో ఎట్లా అలవాటు పడతారో అని ఆశ్చర్యం వేస్తుంది.

ష్టాయిష్టాలు కొంచెం కొంచెంగా ఏర్పడుతున్న బాల్యదశలో నాకు కలిగిన మొదటి అసంతృప్తి నా పేరు మీదనే అనుకుంటాను. ఆ అయిష్టానికి వెనుక ఏమి పనిచేశాయో నేనిప్పుడు చెప్పలేను కానీ నా పేరు మరేదన్నా అయి ఉంటే బాగుండేదని అనిపించేది. ఆ మాటకు వస్తే మా నాన్న పేరు, మా అన్నయ్య పేరు కూడా నాకు నచ్చేవి కావు. అవేవో ప్రత్యేకంగా ఉన్నందుకు కావచ్చు, మోటుగా ఉన్నట్టు లేదా పాతగా ఉన్నట్టు అనిపించి కావచ్చు. మా కుటుంబం శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందింది కాబట్టి  పేర్లు అట్లా ఉంటాయని వివరణ దొరికింది కానీ ఈ శ్రీవైష్ణవ జన్మ మాత్రం నేను కోరుకున్నదేమీ కాదు కదా?  పెరుగుతున్న కొద్దీ – మనల్ని కుటుంబం, సమాజం తీర్చిదిద్దుతున్నకొద్దీ – ప్రాప్తించిన ఉనికిలో ఇమిడిపోతాము. క్రమంగా ఆ పేరులో, ఆ ఇంటిపేరులో, ఆ కులంలో, కుటుంబంలో సంలీనమవుతాము.

నా పేరు కండ్లకుంట శ్రీనివాసాచార్యులు. ఇంటిపేరును పొడి అక్షరంలోకి కుదించి, నాజూకుగా మార్చుకున్నాను కానీ పేరు చివర ఈ  ఆచార్యులు ఎందుకో నాకు బరువుగా అనిపించేది. నాకు గుర్తుండి, ఐదో తరగతి తరువాత అంతా నా పేరు అడిగితే శ్రీనివాసు అని మాత్రమే చెప్పుకునేవాడిని. అయినా కొందరు టీచర్లు, స్నేహితులు నన్ను ‘చారి’ అని మాత్రమే పిలిచేవారు. మరి కొందరు ‘చార్యులు’ అని కూడా పిలిచేవారు. ఏం బాగుంది చెప్పండి!

ఇదేదో కులవ్యతిరేక భావాలు నాకు చిన్నప్పటి నుంచి ఉండేవి అని చెప్పడానికి కాదు. నా విముఖత  వెనుక అటువంటిది ఉన్నదని అనుకోవడం లేదు. మా మిత్రుల్లో భీమయ్య, వెంకటయ్య, మల్లయ్య, ఆంజనేయులు వంటి పేర్లున్నవారు ఉన్నారు. నాకు అటువంటి పేర్లుంటే బావుండేదని నేనేమీ అనుకోలేదు.  నా పేరు ఏ మురళీధరో, రాజశేఖరో, కృష్ణనో ఉండొచ్చు కదా, ఏ తోకలూ లేకుండా!  అనుకునేవాడిని. పోనీ, శ్రీనివాస్‌ అని మాత్రమే పెట్టినా బాగుండేది. నా పేరులో నేను కాస్త సర్దుకున్నది కేవలం శ్రీనివాస్‌తో మాత్రమే.

మా నాన్న పేరు సింగరాచార్యులు. అది నరసింహస్వామి పేరు. అన్నయ్య పేరు జ్వాలా నరసింహాచార్యులు. ఒక మామయ్య పేరు నరసింహాచార్యులు. మరో మామ పేరు మళ్లీ నరసింహాచార్యులే. ఒక పెదనాన్న పేరు లక్ష్మీ నరసింహాచార్యులు. ఆయన కుమారుడి పేరు వేదాద్రి నరసింహాచార్యులు. ఇంకో పెదనాన్న కొడుకుల పేర్లు యాదగిరాచార్యులు, గండ భేరుండ నరసింహాచార్యులు.. ఇట్లా మా బంధువుల్లో నరసింహులు ఎక్కువ. యాదగిరి నరసింహస్వామి మా కులదైవం. నాకు కూడా ఏదో ఒక నరసింహుడి పేరు పెట్టి ఉంటే? నాకు అస్సలు నచ్చి ఉండేది కాదు. మా అన్నయ్య పేరు కంటె కొంచెం ఆధునికంగా ఉన్న శ్రీనివాస నామం నాకు ప్రాప్తించడానికి కారణం ఏమిటని మా అమ్మను అడిగాను.  ఆమె చెప్పింది…

“నువ్వు కడుపులో ఉన్నప్పుడు డాక్టరు పరీక్షల కోసం ఖమ్మం గవర్నమెంటు ఆస్పత్రికి వెళ్లేదాన్ని. ఒకసారి పరీక్షల కోసమని వెళ్లినప్పుడు, ఒక లేడీడాక్టర్‌, ఒక మగడాక్టర్‌  ఇద్దరూ వంతుల వారీగా  గర్భిణీ పేషంట్లను చూస్తున్నారని తెలిసి నాకు భయం వేసింది. తీరా దగ్గరిదాకా వెళ్లి, మగడాక్టర్‌ చూడవలసి వస్తే, వద్దని వెళ్లిపోవడం బాగుండదు. చాలా ఇబ్బంది అనిపించింది. అప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నా, ఈ మగడాక్టర్‌ గండం తప్పితే, నీ పేరు పెట్టుకుంటా అని వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నా. చివరకు నన్ను లేడీ డాక్టరే చూసింది. నువ్వు పుట్టావు. వెంకటేశ్వరస్వామి పేరు పెట్టాలి కాబట్టి శ్రీనివాసు అని పెట్టాము.”

పేరు మనతో పాటే ఉంటుంది కాబట్టి, ఇక దాన్ని జీర్ణం చేసుకోక తప్పదు. వీలయినచోట్ల,  కె. శ్రీనివాస్‌ కింద కండ్లకుంట శ్రీనివాసాచార్యులను దాచిపెట్టి, వీలుకాని చోట్ల పూర్తిపేరును ప్రదర్శించుకుని ఎట్లాగో పేరుతో సామరస్యం  సాధించాను.

నేను ఏదన్నా రాస్తానని, రాసిన దానికింద నా పేరు ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. పదహారేళ్ల వయసులో మాకు పాఠంగా ఉన్న జయశంకర్‌ ప్రసాద్‌ హిందీ కథ ‘మమత’ను అనువదించి, స్రవంతి పత్రికకు పంపితే, వాళ్లు అచ్చువేశారు. అప్పుడే నేను కె. శ్రీనివాసాచార్యులు అన్న పేరును అచ్చులో చూసుకున్నాను. నా పేరు పడడం బాగానే ఉంది కానీ – పేరే ఇంకాస్త బాగుంటే బాగుండు అనిపించింది. మా కాలేజీ మేగజైన్లలో చేసిన రచనలన్నిటికీ పేరు అదే కొనసాగింది. కనీసం పేరును కుదించాలన్న ఆలోచన కూడా రాలేదు. రాస్తుండడం తరచుగా చేయవలసి రావడంతో, పేరు గురించి మళ్లీ ఆలోచనలో పడ్డాను. రచయితలకు కలం పేరు ఉంటుంది కదా… అంటే మనకుమనం ఒక కొత్తపేరు పెట్టుకోవచ్చును, తల్లిదండ్రులు చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకోవచ్చు.

అప్పుడు మొదలయింది కలం పేర్ల వేట.  పొడి అక్షరాల పేర్లు, కత్తిరించుకున్న పేర్లు, నక్షత్రాల పేర్లు, శిల్పకళా కేంద్రాల పేర్లు,  మార్మికమైన విప్లవాత్మకమైన పేర్లు – పెట్టుకున్న రచయితలందరినీ తలచుకుని పేరు కోసం వెదుక్కున్నాను.

ఆ అన్వేషణలో ఇష్టపడ్డ మొదటిపేరు ‘విద్యాధర’. మాకు హర్షుడి ‘నాగానంద’ నాటకం పాఠ్యంగా ఉండేది. అందులో కథానాయకుడు జీమూతవాహనుడు విద్యాధర గణానికి చెందిన రాకుమారుడు. విద్యాధరులు దైవశక్తులున్న ఒక గణం. ఆ నాటకం ప్రభావంలో ఆ పేరు ఎంచుకుని ఉంటాను.  ఒకటి రెండు రచనలు ఆ పేరుతో చేశాను.  ఆ పేరు కూడా సంతృప్తి నివ్వలేదు. పాతగా ఉందనిపించింది. ఆ రోజుల్లో ఒక చిన్న సాహిత్య పత్రికకు అనేకం రాయవలసి వచ్చేది. ఒకే పేరుతో బాగుండదు కాబట్టి, ఇంకొన్ని పేర్లు వెదుక్కున్నాను. అప్పుడే మొదటిసారిగా కె. శ్రీనివాస్‌ అన్న పేరును ఉపయోగించాను. అలాగే, కె. భారత్‌బాబు అన్న పేరుతో అనేక రచనలు చేశాను.  ఆ పేరును ఎందుకు ఇష్టపడ్డానో ఇప్పుడు చెప్పలేను. పేరు సెక్యులర్‌గా ఉందనుకున్నానో, దేశభక్తితో పెట్టుకున్నానో, చివరకు ఆ బాబు ఎందుకు తగిలించుకున్నానో తెలియదు. జర్నలిస్టు రచనలు కూడా అనేకం భారత్‌బాబు పేరుతో చేశాను.

అదే సమయంలో గడియారం శ్రీవత్స నన్ను ఆవరించిఉన్నాడు. 1970 ల చివర, 1980 ల మొదట్లో నన్ను ఊపరి సలపనివ్వని సాహిత్య, జ్ఞాన ఉద్వేగాలలో ముంచినవాడు అతను. ఇద్దరం కలిసి రాయడం మొదలుపెట్టాం. మా ఇద్దరి పేర్లు కలిసి శ్రీనివాస శ్రీవాత్సవ – అని పెట్టుకున్నాం. ఆయనకు ఇంకా అనేకం కలం పేర్లుండేవి. మేమిద్దరం రాసినవి రెండు మూడు పెద్ద పోయెమ్స్‌ ఆ పేర్లతోనే అచ్చయ్యాయి. వ్యాసాలు కూడా రాశాము. రెండుమూడు కథలు కూడా. ఒక కథ అదే పేరుతో 1980లో ఆంధ్రజ్యోతి వీక్లీలో అచ్చయింది.

1981 లో కళాసౌరభంలో ‘ప్రజలు తెలివైనవాళ్లు’ అన్న పోయెం రాశాను. మిత్రుడిగా ఉన్న ఒక కమ్యూనిస్టు విప్లవకారుడి ప్రత్యక్ష ప్రభావంతో, ఆయన అభిప్రాయాలకే కవితారూపం ఇచ్చిన సుదీర్ఘమైన రచన అది. ఆ విప్లవకారుడికి ఇష్టమైన మరో అమరవీరుడి పేరుతో ఆ పోయెం అచ్చయింది. బాగా వచ్చిన ఆ పోయెంలో నా కర్తృత్వపు ఆనవాలు లేకుండా పోవడం కించిత్తు బాధ కలిగించింది. పేరును వదులుకోవడం కష్టమే.

1984లో ప్రధాన స్రవంతి పాత్రికేయ జీవితంలోకి వచ్చాక, ఏదో ఒకటి రాయవలసిన అవసరం తరచు వచ్చింది. ఆ మధ్య కాలంలోనే నాకు జ్ఞానోదయం అయింది. పేరు మంచిగా ఉంటే ఫలితం ఏమీ ఉండదు, రాత బాగుంటే మంచి పేరు వస్తుంది, అదే మన పేరును కూడా వెలిగిస్తుంది అని తెలిసివచ్చింది. నా సొంత పేరునే నమ్ముకుందామని, కులం తోకను తీసేసి,  శ్రీనివాస్ లు అనేకమంది కాబట్టి గుర్తించడానికి వీలుగా ఇంటి పేరును ఇంగ్లీషు అక్షరంతో పెట్టుకుని కొనసాగాలని నిర్ణయానికి వచ్చాను. నన్ను కె. శ్రీనివాస్‌గా గుర్తించడం సమాజానికేమో కానీ నాకు మాత్రం అలవాటు కాసాగింది.

1989-1990 కాలంలో సామాజిక సంచలనాలు తీవ్రమవుతున్న కాలం. నేనప్పుడు ‘ఉదయం’ ఎడిట్‌ పేజి విభాగంలో పని చేసేవాడిని. ‘వీక్షణం’ అన్న సాహిత్య అనుబంధాన్ని కూడా నిర్వహించేవాడిని. ఎడిట్‌ పేజీలో అందుబాటులో ఉండిన స్పేస్‌, రామచంద్రమూర్తిగారు ఇచ్చిన స్పేస్‌ను సద్వినియోగం చేసుకున్న కాలం అది. నా మనసులోని మథనం, బయట జరుగుతున్న భావఘర్షణ కలిసి, నా చేత అనేక వ్యాసాలు రాయించాయి. ‘ముసుగులు తీస్తే అందరూ మనువులే’ అన్న వ్యాసం ఆ రోజుల్లో ఎక్కువగా చర్చలోకి వచ్చింది. దాన్ని కె. శ్రీనివాస్‌ పేరుతోనే రాశాను. కొన్ని స్వతంత్ర వ్యాసాలు, కొన్ని సమాచారాన్ని నా ఆలోచనలను కలిపి రాసిన వ్యాసాలు రకరకాల పేర్లతో అచ్చయ్యాయి. అప్పటి నా పేర్లు, రామ్‌ మనోహర్‌ (లోహియా పేరు), వింధ్యేశ్వరీ ప్రసాద్‌ (మండల్‌ పేరు). కబీర్‌దాస్‌ (ఒక మత సామరస్య భక్తికవి).  పత్రికలో నిర్వహణ బాధ్యతలో ఉండి తరచు నా పేరు కనిపిస్తే బాగుండదనే మొహమాటంతో కొన్నిసార్లు, రాసిన అంశానికి క్రెడిట్‌ తీసుకోవడంలో ఏదో సంకోచం ఉండి కొన్నిసార్లు మారుపేర్లతో రాశాను. అవి ఎక్కువగా ఒకసారి మాత్రమే వాడిన పేర్లు. ‘శేషం లక్ష్మీపతిరావు’ అన్న పేరుతో ‘కొత్త ప్రశ్నలకు కొత్త సమాధానాలు కావాలి’ అన్న వ్యాసం ఆంధ్రజ్యోతిలో రాశాను. ఆ వ్యాసం ప్రాధాన్యం ఎక్కువే అయినా నేను దాన్ని క్లెయిమ్‌ చేసుకోలేదు. మిత్రుడు కె.పి. అశోక్‌కుమార్‌ మారు పేర్లు, కలం పేర్లపై ప్రచురించిన ఒక పుస్తకంలో నా కర్తృత్వాన్ని బట్టబయలు చేశాడు.

నా పేరు గురించిన అసంతృప్తిని, మరో పేరు కోసం వెదుకులాటను ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది. మన పేరు మనమే పెట్టుకోవలసివస్తే, అదెంత కష్టమో ? తల్లిదండ్రులు ఏదో పేరు పెట్టారు కాబట్టి కానీ లేకపోతే, పేర్ల వేట ఎప్పటికీ తెమలదు. సినిమాస్టార్లు, సెలబ్రిటీలు కొత్తపేర్లతో ఎట్లా అలవాటు పడతారో అని ఆశ్చర్యం వేస్తుంది.

ఇప్పుడు నా పేరు నాకు ఇష్టంగానే అనిపిస్తుంది. ఎవరన్నా పూర్తిపేరుతో పిలిచినా ఏమీ ఇబ్బంది అనిపించదు. పేరులో మన పరంపర ఉంటుంది. చారిత్రకమయిన ఉనికి ఉంటుంది. అయినంత మాత్రాన ఆ పరంపరను, ఆ చరిత్రను కొనసాగించవలసిన అవసరమేమీ లేదు. మన పేరు స్ఫురింపజేసే నేపథ్య అంశాలకు మన బాధ్యత లేదు. అట్లాగే, మన జీవిత క్రమంలో సమకూర్చుకున్న వ్యక్తిత్వపు పరిమళం కూడా మన పేరుకు అంటుతుంది. అది గాఢంగా కమ్ముకున్న కొద్దీ  మన పేరు దాన్ని మాత్రమే వెదజల్లుతూ ఉంటుంది.

**********

కె. శ్రీనివాస్

కె. శ్రీనివాస్ సాహిత్య విమర్శకులు, తెలంగాణా సాహిత్య చరిత్ర గురించి ప్రామాణిక ప్రతిపాదనలు చేసిన సిద్ధాంత జీవి. పత్రికా రంగంలో నవీన యుగం జెండా ఎగరేసిన ప్రయోగవాది. "ఆంధ్ర జ్యోతి" దినపత్రిక ఎడిటర్.

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ” పేరు మంచిగా ఉంటే ఫలితం ఏమీ ఉండదు, రాత బాగుంటే మంచి పేరు వస్తుంది, అదే మన పేరును కూడా వెలిగిస్తుంది అని తెలిసివచ్చింది.” – నిప్పు లాంటి నిజం కదా 🙂
    పేరు వెనక ఇంట చరిత్ర … చాలా సరదాగా ఉంది సార్.

  • ఈ ముక్కలు యెవరన్నా చెప్తారేమో అని ఇన్నాళ్ళూ చూశాను. యెవరన్నా చెప్పి వుండి, నేను విని/చదివి వుండకపోతే అది వేరే విషయం. కాని ఇప్పుడు నిట్టూర్పు విడుస్తున్నా. తోకలు వదిలేసిన వాళ్ళు చాలా మందే వున్నారు, మరి ఆ వాసనలు పోయాయా అంటే అబ్బే. పోవాల్సింది పోయి, వుండాల్సింది వుండటమే కదా కావాల్సింది. What is in name అని నాటకకర్త అననే అన్నాడు కదా.

    నాకు నచ్చిన ఆ వాక్యాలు మీవి ఇవి:
    ” ఇప్పుడు నా పేరు నాకు ఇష్టంగానే అనిపిస్తుంది. ఎవరన్నా పూర్తిపేరుతో పిలిచినా ఏమీ ఇబ్బంది అనిపించదు. పేరులో మన పరంపర ఉంటుంది. చారిత్రకమయిన ఉనికి ఉంటుంది. అయినంత మాత్రాన ఆ పరంపరను, ఆ చరిత్రను కొనసాగించవలసిన అవసరమేమీ లేదు. మన పేరు స్ఫురింపజేసే నేపథ్య అంశాలకు మన బాధ్యత లేదు. అట్లాగే, మన జీవిత క్రమంలో సమకూర్చుకున్న వ్యక్తిత్వపు పరిమళం కూడా మన పేరుకు అంటుతుంది. అది గాఢంగా కమ్ముకున్న కొద్దీ మన పేరు దాన్ని మాత్రమే వెదజల్లుతూ ఉంటుంది. “

  • నాలాంటి సామాన్యులకే కాదు, మేథావులకూ పేర్ల గొడవ తప్పదన్నమాట.మీ పేర్లన్నింటిలో, ఈ ‘శేషం లక్ష్మీపతిరావు’ పేరు ఎందుకో బాగా గుర్తుంది.

  • “మన జీవిత క్రమంలో సమకూర్చుకున్న వ్యక్తిత్వపు పరిమళం కూడా మన పేరుకు అంటుతుంది. అది గాఢంగా కమ్ముకున్న కొద్దీ మన పేరు దాన్ని మాత్రమే వెదజల్లుతూ ఉంటుంది.”

    చాల బాగా చెప్పినారు.

    ఇలాంటి జీవన స్పర్శతో కూడిన వ్యాసాలు చాల బాగుంటాయి. జీవితం కేంద్రంగా సాగే రచనలు చేయడంలో రచయితకు చదువరికీ ఎంతో శాంతి. తనలోకి తాను తొంగి చూసుకుకోగల సౌలభ్యం ఒక అపురూప కానుక. ఆ రీడింగ్ ప్లెజర్ మనసును కమ్ముకుంటుంది.మీరు సందర్భం నుంచి ఇలా సమ్మోహం వైపు రావడం ప్రస్తుత రాజకీయ వార్థా వాతావరణంలో మాకు గొప్ప రిలీఫ్.

    బాగుందన్న.కృతజ్ఞతలు.

  • కె.శ్రీనివాస్ అన్న పేరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా అసలు పేరు కనకదండి శ్రీనివాస్. నాకు బారసాలలో తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీనివాస్. ఆ తరువాత మా తాత గారి పేరు కృష్ణమూర్తి కూడా చేరి శ్రీనివాస్ కృష్ణమూర్తి అయింది. మీరు మరో పేరు పెట్టుకున్నట్లైతే నేను కె.శ్రీనివాస్ గానే కంటిన్యూ అయివుండేవాడిని. ఇప్పటికైనా మించి పోయింది లేదు.

  • నేను చాలా కాలం కొట్టుకున్నా. ఐతే ఈ క్లారిటీ లేదు. అజ్ఞాతం లో కూడా ఆనందం ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది.

  • పేరు గురించిన సమస్య ఉందని తెలుసు, ఇది తెలుగు వాళ్లకే పరిమితం అనే ఆలోచన కూడా ఉంది. అందువల్లనే తెలుగు వాళ్లు తాతల పేర్లు తండ్రుల పేర్లు ఇంటి దేవుళ్ల పేర్లు సంతానానికి పెట్టే అలవాటు వదిలేసారు. పుల్లమ్మ అన్న పేరును ఫుల్లాక్షిగానూ మల్లమ్మ అన్న పేరుని మల్లీశ్వరి గానూ మా చెల్లెళ్లకే మార్చేసారు. బాలసారెలో రాసిన పేర్లు బడిలోకి వచ్చేసరికి మారాయి. కాకపోతే మీపేరు నచ్చకపోటం అనేది బాల్యదశలోనే ఆరంభమయిందని రాసారు. చిత్రం ఏంటంటే చాలామందికి నాతరం వాళ్లలో నా పిల్లల తరం వాళ్లలో కాస్తంత ఊహ రాగానే ఈ అయిష్టం కనిపించేది. ముఖ్యంగా అయ్యలు అమ్మలూ ఉన్నవాళ్లకి, పూర్వం పెంటారావు పిచ్చమ్మ దెయ్యాలమ్మ వంటివి బిడ్డలు పుట్టిపోతుంటే పెట్టేవారు. వీళ్లని అసలుపేరుతో పిలిచి ఏడిపించేవారు. మీరు పత్రికా సాహిత్యరంగాలలో ఉండటం వల్ల మారుపేర్ల అవసరం ుండటం ఆకథ వేరు, ఎందుకో ఈ వ్యాసం బలే టచ్ చేసింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు