బహుజనుల ఆయుధ పాఠం!

రంగల్ నుండి ఎదిగి వస్తున్న యువ కవుల్లో పుచ్చ కుమారస్వామి ఒకరు. వృత్తి రీత్యా జీవశాస్త్ర ఉపాధ్యాయులు. సల్ల పెరుగు గొంతు జారినంత సులువుగా వీరి కవిత్వం అర్థమవుతుంది. తన వ్యక్తిత్వం లాగానే చెప్పాలనుకున్న విషయం కూడా  స్పష్టంగా, సూటిగా ఉంటుంది. సరళత తన కవిత్వ తత్వం.
*
బాగుండు!
~
చేతి వృత్తులు
అంపశయ్యను దాటి
గ్రామాల్లో
పరిఢవిల్లితే  బాగుండు!
మంగలి
కత్తెర
వంకర బుద్దులను కత్తిరించి
‘క్రాపు’ చేస్తే బాగుండు!
కమ్మరి
కొలిమి
స్వార్థపు మలినాలను
కరిగించేస్తే బాగుండు!
కుమ్మరి
మట్టిలో
కుళ్లు నిండిన మెదళ్లను
కలిపి తొక్కేస్తే బాగుండు!
చాకలి
రేవు
ఆకతాయి ‘మరకలను’
ఉతికి ఆరేస్తే బాగుండు!
వడ్డెర
సుత్తె
మనిషికున్న ‘అహం’ రాళ్లను
తునకలు చేస్తే బాగుండు!
గంగపుత్రుల
వల
లంచావతారపు కలుపులను
కట్టి పడేస్తే బాగుండు!
ఎరుకలి
తట్ట
అవినీతి అన్యాయాల పెంటను
ఎత్తి పడేస్తే బాగుండు!
నేతమగ్గం
కీచకుల నరాలను
పడుగు పేకలు పేర్చి
తివాచీనేస్తే బాగుండు!
గీతకార్మికుని
కత్తి
‘ఆకలి చూపుల’ పొరలకు
మెర పెడితే బాగుండు!
వడ్రంగి
పెద్ద బాడిశ
మృగాళ్ల మర్మాంగాలను
కసిగా చెక్కేస్తే బాగుండు!
గొళ్ల కురుమల
గొంగడి
అర్థించే దీనులకు
వెచ్చని రక్షణైతే బాగుండు!
మేదరి
తడకలు
మానవత్వాన్నల్లుకుని
జగతికి నీడనిస్తే బాగుండు!
కంసాలి
కుంపటి
విలువలను మూసపోసి
మనిషికి మెరుగులద్దితే బాగుండు!
జాతికొక్క
నీతి
నీతి తప్పిన మానవజాతికి
వైద్యం చేస్తే బాగుండు!
*
వి ఆశిస్తున్నది ఏమిటి? నీతి తప్పిన మానవజాతి కి వైద్యం చేయాలనుకోవడం,  అందుకు పరికరాలుగా బహుజనుల చేతి వృత్తులను ఎంచుకోవడం. ఇక్కడ స్థానభ్రంశం (displacement of things)వల్ల కవిత్వం అవడం గమనించవచ్చు.
మంగలి కత్తెర ‘వంకర బుద్దుల’ను కత్తిరించడం లో, కమ్మరి కొలిమి ‘స్వార్ధపు మలినాలను’ కరిగించడంలో, కుమ్మరి ‘మట్టి లో కుళ్ళు నిండిన మెదళ్లను కలిపి తొక్కేయడం’ లో, చాకలి రేవు ‘ఆకతాయి మరకలను’ ఉతికి ఆరేయడంలో, వడ్డెర సుత్తి ‘మనిషికున్న అహం రాళ్లను తునకలు చేయడం’లో, గంగపుత్రుల వల ‘లంచావతారపు కలుపులను కట్టి పడేయడం’ లో, ఎరుకలి తట్ట ‘అవినీతి అన్యాయాల పెంటను ఎత్తిపడేయడం’ లో, నేత మగ్గం కీచకుల నరాలను పడుగు పేక లుగా పేర్చడం లో, గీత కార్మికుని కత్తి ఆకలి చూపుల పొరలకు మెర పెట్టడంలో, వడ్రంగి పెద్ద బాడిశ మృగాళ్ల మర్మాంగాలను కసిగా చెక్కడంలో… ఇలా క్రియా సమన్వయం పాటిస్తూ కవిత్వం   చేయడం చూడవచ్చు.
చేతివృత్తుల పునరుజ్జీవనం గురించి తపన పడుతూనే, రావాల్సిన సామాజిక మార్పునకు బహుజనుల ను సమాయత్త పర్చడం, వారి బాధ్యతను గుర్తు చేయడం అంతర్లీనంగా కవి ఉద్ధ్యేశ్యంగా భావించవచ్చు. “We have to talk about liberating minds as well as liberating society – Angela Davis”.
*
బలమైన తాత్త్విక పునాదిపై నిలబడి రేపటి కవిత్వాన్ని వాగ్ధానం చేస్తున్న కవి త్వరలోనే పుస్తకమై పలకరించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
*

బండారి రాజ్ కుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కుమారస్వామి కవిత బాగుంది. రాజ్ కుమార్ గారి పరిచయ వాక్యాలు, సమీక్ష బాగున్నాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు