ప్రతీక్ష

ఘాట్ మెట్లపై కూర్చున్న రాఘవ తన అరిగిపోయిన చెప్పుల వైపు దీక్షగా చూస్తూ, “ఇంకా రాలేదు…చెప్పిన టైం అయింది.. ఇక్కడే ఉండమన్నాడు.. అతను ఇంకా రాలేదు. వస్తాడా ఈ రోజు?” అని గొణిగాడు రాఘవ.. ఆగొంతులో ఏదో తెలియని నిరాశ.

పక్కనే కూర్చున్న శైలజ ప్రవాహం వైపు చూస్తూ, “ఎవరు?” అని అడిగింది. ఆమె ప్రశ్నలో ఆసక్తి కంటే అలసట ఎక్కువగా ఉంది.

“ఎవరైతే మనల్ని ఇక్కడ కలవాలని అన్నారో అతనే అన్నాడు రాఘవ.

శైలజ ఒక్కక్షణం ఆగి, తన చూపును కొండల పైకి మళ్లించి, “అసలు అతను  అన్నారా? లేక మనమే అలా అనుకుంటున్నామా?” అని గొణిగింది. ఆ మాటకు సమాధానం రాఘవ దగ్గర లేదు. ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ, వాళ్ళ పక్క నుండి మౌనంగా ఇద్దరు  నడుచుకుంటూ వెళ్లారు. వింత ఏమిటంటే, వారి అడుగుల శబ్దం కూడా వినిపించలేదు, కేవలం గాలి కదిలినట్టు అనిపించింది.

“చూడు, వాళ్ళు వెళ్తున్నారు. బహుశా వాళ్ళు కూడా  కలవాల్సిన వాళ్లేనేమో?” అని రాఘవ అనుమానంగా అడిగాడు.

శైలజ తల అడ్డంగా తిప్పింది. “కాదు రాఘవ, వాళ్ళు నిన్న కూడా ఇలాగే వెళ్లారు. రేపు కూడా వెళ్తారు. వాళ్ళ ప్రయాణం వేరు, మనం ఎదురు చూసేది వేరు.”

**

నదీ తీరంలోని  మెట్ల దగ్గర ఒక ఏకాంత ప్రదేశంలో శైలజ, రాఘవ్ కూర్చుని ఉన్నారు.

వారి చుట్టూ అడవి నుండి వీచే చల్లని గాలి సవ్వడి, ప్రవహిస్తున్న నీటి గలగలలు కలిసిపోయి ఒక అలౌకిక ప్రశాంతతను ఇస్తున్నాయి

అప్పుడే ఘాట్ మెట్ల మీదకు ఒక సాధువు, ఆయన వెనుక ఒక యువకుడు ప్రవేశించారు. సాధువు ముఖంలో ఒక వింతైన చిరునవ్వు ఉంది. ఆ యువకుడు మాత్రం చాలా ఆందోళనగా తన చేతిలోని గడియారాన్ని పదే పదే చూసుకుంటున్నాడు.

” మనం చాలా ఆలస్యం చేశాం. ఆ సమయం ఎప్పుడో దాటిపోయింది.”

“సమయం దాటిపోదు మనమే  వేగంగా పరుగెత్తాలని చూస్తాం. ఈ నదిని చూడు, ఇది ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది, కానీ ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది.”

రాఘవ వారి మాటలు విని అడిగాడు, ” మీరు కూడా ఎవరి కోసమైనా చూస్తూన్నారా?”

అతను రాఘవ వైపు చూసి, “నేను వెతకడం మానేసి చాలా కాలమైంది,” అని నడుచుకుంటూ వెళ్ళిపోయారు.

ఆకాశం రంగు మార్చుకుంటోంది. గోధూళి సంధి వేళ  అల్లంత దూరంలో లేస్తున్న దుమ్ము తప్ప, అడుగుల చప్పుడు వినిపించడం లేదు. కానీ రాఘవ  చూపు మాత్రం ఆ మసక వెలుతురులో ఒక ఆకారాన్ని వెతుకుతూనే ఉంది. రాక తప్పదు… వస్తాడనే నమ్మకం కాదు, రాకపోతే కాలం ఆగిపోతుందనే భయం.

“నీ భయాలేంటో నాకు తెలుసు. ఒకవేళ నువ్వు తట్టుకోలేకపోతే, దేనిగురించీ ఆలోచించకుండా నా వద్దకు వచ్చేయ్.. నీకోసం నేను ఎప్పుడూ వేచి ఉంటాను” అన్న,.అతనిని కలవడం ఎప్పుడూ అనిశ్చితే. వస్తానని చెప్పినా, సమయానికి రాడు, వచ్చినా ఏం మాట్లాడాలో అర్థం కాదు,” అనుకుంది శైలజ.

“అంతలో, పడవవాడు నెమ్మదిగా తాడు తో పడవను ఒడ్డుకు చేరుస్తూ, “బాబూ! అమ్మగారూ! అవతలి ఒడ్డుకు రావాలా?” అని పలకరించాడు.

“నిన్ను నేను ఇంతకు ముందు చూశాను, కదా?” రాఘవ అన్నాడు

“నాకు తెలియదు బాబూ.”

“నేను నీకు తెలియదా?”

“లేదు బాబూ.”

“నిన్న పడవ తీసుకుని వచ్చింది నువ్వు కాదా?”

“లేదు బాబూ.”

“ఇదే నీ మొదటి సారా?”

“అవును బాబూ.”

అక్కడ అంతా నిశ్శబ్దం. నది  అలల చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు

“అసలు విషయం చెప్పు.”

“ఆయన ఈ సాయంత్రం రాలేనని చెప్పమన్నారు. కానీ రేపు రాగలనేమో అన్నారు

“అంతేనా? ఇంకేమీ చెప్పలేదా?”

“లేదు బాబూ, అంతే.”

“ఏం పని చేస్తావు?”

“నేను పడవ నడుపుతాను, అప్పుడప్పుడు ఆయన పనులు  చూసుకుంటాను బాబూ.”

“ఆయన నీ పట్ల దయగా ఉంటారా?”

“అవును బాబూ, బాగానే ఉంటారు.”

“సరే, నువ్వు వెళ్ళవచ్చు.”

“ఆయనకు నేనేం చెప్పాలి బాబూ?”

“ఆయనకు చెప్పు… నువ్వు మమ్మల్ని చూశావని చెప్పు. ఖచ్చితంగా చూశావు కదా?”

“అవును బాబూ.”

పడవవాడు నవ్వు  ముఖంతో వింతగా నవ్వి, ” ఈ రోజుకు వెళ్ళిపొండి  ,” అన్నాడు.

“రేపు ,ఎప్పుడు వస్తారు ?” శైలజ అడిగింది.

“సూర్యుడు మళ్ళీ ఆ ఎత్తైన కొండల వెనుక నుండి వచ్చేటప్పుడు,” అంటూ పడవవాడు తన పడవను చీకట్లోకి మళ్లించాడు. అక్కడ నిశ్శబ్దం ఘనీభవించింది.

**

మరుసటి రోజు…

అదే ఘాట్, అదే మెట్లు. శైలజ ఒక రాయి మీద శిలలా కూర్చుని ఉండగా, రాఘవ నది లోకి  చిన్న చిన్న రాళ్లను విసురుతున్నాడు. ఎక్కడో  దూరంగా  మాటలు వినిపిస్తున్నాయి.

“అవునూ నిన్న  ఆ పడవవాడు ఏమన్నాడు? ఈ రోజు వస్తారని కదా! అన్నది ?” రాఘవ ఆశగా అడిగాడు.

“వస్తారని అనలేదు, ‘వస్తారేమో’ అన్నాడు. రెండింటికీ చాలా తేడా ఉంది,” అంది శైలజ.

అక్కడ మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. నిద్రపోతున్న శైలజ వైపు రాఘవ దిగులుగా చూశాడు.

“ఇతరులు ఇంతలా కష్టపడుతుంటే నేను ఇలా నిశ్చింతగా ఉండగలనా? అసలు ఇప్పుడు నేను నిజంగానే మేల్కొని ఉన్నానా.. లేక ఇదంతా ఒక కలనా?” అని తనలో తాను గొణిగాడు.

“రేపు నేను నిద్రలేచాక, ఈ రోజు గురించి ఏమనుకుంటాను? నా స్నేహితురాలు శైలజతో కలిసి, ఈ నదీతీరంలో చీకటి పడే వరకు అతను కోసం వేచి ఉన్నాననా? ఆ పడవవాడు, ఆ సాధువు మాతో మాట్లాడారని చెబుతానా? ఇవన్నీ నిజమే కావచ్చు.. కానీ ఈ నిజంలో అర్థం ఎంత?”

శైలజ నిద్రలో కదులుతూ తన చెప్పులను సరిచేసుకోబోయి విఫలమై, అలాగే మళ్ళీ నిద్రలోకి జారుకుంది. రాఘవ ఆమె వైపు నిశ్చలంగా చూస్తూ, “పాపం, తనకేమీ తెలియదు. రేపు నిద్రలేచాక తన కాళ్ళ నొప్పుల గురించి, పడ్డ కష్టం గురించి చెబుతుంది. నేను మళ్ళీ ఏదో ఒక ఆశ చూపిస్తాను. మనిషి పుట్టడమే ఒక పెద్ద పోరాటం. పుట్టిన దగ్గరి నుండి చనిపోయే వరకు ఏదో ఒక దాని కోసం నిరీక్షిస్తూనే ఉంటాం. అయితే, ఈ కష్టాలన్నీ పడటం మనకు అలవాటైపోయింది. అలవాటు అనేది మనిషిని మొద్దుబారేలా చేస్తుంది.

గూడు చెదిరిన పక్షిలా, ఘాట్ మీద ఆందోళనగా అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు.  పాదాల కింద రాళ్లు నిశ్శబ్దంగా కదులుతున్నాయి. హఠాత్తుగా ఒక చోట ఆగిపోయి, తన తల పట్టుకుని, “అసలు నేనేమన్నాను? ఏం మాట్లాడుతున్నాను?” అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. తన మాటల్లోని అర్థం తనకే అందడం లేదన్నట్టుగా, ఆ శూన్యంలోకి వెఱ్రిగా చూస్తూ ఉండిపోయాడు.

పట్టరాని కోపంతో మళ్ళీ పడవవాడిని పిలిచాడు. “ఓయ్! నువ్వు మాకు అబద్ధం చెబుతున్నావా? అసలు ఇక్కడికి ఎవరైనా వస్తారా?”

“రావడం, వెళ్లడం అన్నీ మీ కళ్లలోనే ఉన్నాయి .అతను  ఈ రోజు రానని చెప్పారు. రేపు కచ్చితంగా వస్తారట.”

“అతను  పూర్తి  పేరు తెలుసా?” శైలజ అడిగింది

“తెలియదు… అతను  వస్తాడు. కానీ  ఎలా  వస్తాడో తెలియదు  పోనీ  అనుకున్న సమయానికీ రాడు.’ అన్నాడు పడవవాడు ఆవలి వైపు కేసి చూస్తూ!

“మనం ఇక్కడికి వచ్చి ఎన్ని గంటలైంది?” అడిగింది శైలజ, నది లో  కొట్టుకుపోతున్న ఒక ఎండుటాకు వైపు చూస్తూ.

“గంటల గురించి అడగకు. ఇక్కడ కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఈ నీరు ఎంతకాలంగా ఇలాగే ప్రవహిస్తుందో, అలాగే మనం కూడా,” అన్నాడు రాఘవ్ నిట్టూరుస్తూ.

**

“బాబూ! అమ్మగారూ! ఇంకా ఇక్కడే ఉన్నారా?” పదవ వాడు అడిగాడు.

“అవును, ఆయన ఇంకా రాలేదు. ఇక్కడే  కూర్చున్నాం,” అన్నాడు రాఘవ.

పడవవాడు మెల్లగా నవ్వుతూ, “ఈ నది  వైపు చూడండి. ఈ నీరు ఇప్పుడు కనిపిస్తుంది, మరుక్షణం వెళ్ళిపోతుంది. మనుషులు కూడా అంతే. వస్తామని చెప్పిన వాళ్ళు రాకపోవచ్చు, అసలు వస్తారని ఊహించని వాళ్ళు ఎదురుకావచ్చు. జీవితం అంటేనే అది కదా,” అని తన పడవలో ఉన్న నీటిని బయటకు తోడటం మొదలుపెట్టాడు.

ఘాట్ మీద మనుషుల సందడి పెరుగుతోంది. ఒకవైపు భక్తులు నది లో దీపాలు వదులుతున్నారు , మరి కొందరు  ఫోటోలు దిగుతూ హడావిడి చేస్తున్నారు. కొందరు మౌనంగా నదికి నమస్కరిస్తుంటే, మరికొందరు తమ బాధలను ప్రవాహంలో కలిపేయాలని చూస్తున్నారు. . కానీ శైలజ, రాఘవ్ మాత్రం నిశ్చల విగ్రహాల్లా ఉండిపోయారు.

సూర్యుడు అస్తమిస్తున్నాడు . శైలజ నిద్రలేచి, రాఘవ దగ్గరకు వెళ్లి “పద, వెళ్ళిపోదాం”

“మనం దూరం వెళ్ళలేము శైలజా, ఎందుకంటే అతను  మళ్ళీ రేపు ఇక్కడికే రావాలి కదా”!  .

చీకటి పడుతుండగా, కొండల నీడలు నది మీద పడి నీరు నల్లగా కనిపిస్తోంది. పడవవాడు మళ్ళీ వారి దగ్గరకు వచ్చి, “ఈ రోజుకు ఆయన రారు అని చెప్పాను కదా చీకటి పడ్డాక నది లో ప్రయాణం ఆగిపోతుంది, ఆశలు కూడా కాసేపు నిద్రపోవాలి. రేపు పొద్దున్నే రండి, అప్పుడు చూడొచ్చు,” అన్నాడు.

“రేపు తప్పకుండా వస్తారా ?” శైలజ అడిగింది, ఆమె కళ్లలో నీడలు కదులుతున్నాయి.

పడవను ఒడ్డుకు లాగి, “తప్పదు మనం  ఎదురుచూడాల్సిందే. ఈ నది లాగే ప్రవాహంతో పాటు ముందుకు వెళ్ళండి  ఏదో ఒక ఒడ్డుకు చేరుకుంటారు,” అని చీకటిలోకి కలిసిపోయాడు

**

నది లో దీప  కాంతులు  నీటిలో ప్రతిబింబిస్తూ కోటి దీపాల్లా మెరుస్తున్నాయి.

మనుషులు వస్తూనే ఉన్నారు, వెళుతూనే ఉన్నారు.

రాఘవ్, శైలజ నెమ్మదిగా లేచి నిలబడ్డారు.

వెళ్లాలని ఉన్నా, కాళ్ళు అక్కడే ఆగిపోయినట్టు ఉన్నాయి.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

మణి వడ్లమాని

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.