వేసవి స్మృతి

 ‘అమ్మూ! లే తల్లీ!’

కిటికీ నుంచి లోపలికి వస్తున్న సూర్యకిరణాలను చూస్తూ విశ్వనాథం మనవరాలిని లేపాడు.  ‘ఐదు నిమిషాలు తాతయ్య’ అంటూ అమ్ము దుప్పటి ముసుగేసింది. ‘అభి అప్పుడే తయారయ్యాడు చూడు. గుడ్ గర్ల్ కదా! లేవాలి. స్కూల్‌కు టైమవుతోంది. ఈరోజు రిజల్ట్ డే. రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్. ఎంతసేపైనా పడుకోవచ్చు’ అన్నాడాయన నవ్వుతూ. అటు ఇటు కదిలి ఆవలిస్తూ లేచి ‘ఓకే తాతయ్యా’ అంటూ బాత్రూంలోకి వెళ్ళింది అమ్ము. విశ్వనాథం కూడా తయారవ్వడానికి తన రూమ్‌లోకి వెళ్ళాడు.

ముందు రోజే కొడుకు నందు, కోడలు అపర్ణ మాట్లాడుకున్నారు. స్కూల్లో మీటింగ్ అయిపోయాక అట్నుంచటే సమ్మర్ క్యాంపు జరిగే చోటికి వెళ్లి, అక్కడ సౌకర్యాలన్నీ చూసి నచ్చిన దాంట్లో పిల్లలను చేర్పిద్దామని వాళ్ల ఆలోచన. అందుకే విశ్వనాథాన్ని కూడా తమతో పాటు రమ్మని చెప్పారు.

అందరూ తయారయ్యి బయలుదేరారు. పిల్లలిద్దరూ కారులో నుంచి బయట కనిపిస్తున్న పెద్ద పెద్ద బిల్డింగ్స్, రోడ్డు మీద బిజీగా తిరుగుతున్న జనాలు, రోడ్డు పక్కనున్న ఐస్‌ఫ్రూట్స్ బండ్లను చూస్తూ హుషారుగా మాట్లాడుకుంటున్నారు. స్కూల్కు వెళ్లడానికి అరగంట పట్టింది. ఇద్దరి క్లాసుల్లోకి వెళ్లి, వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకున్నారు నందు, అపర్ణ. పిల్లలిద్దరూ ‘ఎ’ గ్రేడ్‌లో ఉండటం చూసి నందూ, అపర్ణ సంతృప్తిగా బయటికొచ్చారు.

“సమ్మర్  క్యాంపు ఈ స్కూల్లో లేదా నందూ?” అన్నాడు విశ్వనాథం కారు వైపు నడుస్తూ.

“లేదు నాన్నా! ఏవో రిపేర్లు ఉన్నాయని ఈసారి పెట్టడం లేదంట. ఇప్పుడు మనం వెళ్ళబోయేది నా ఫ్రెండ్స్ రికమెండ్ చేసిందే” అంటూ నందూ కారు స్టార్ట్ చేశాడు.

ఆ చోటికి చేరడానికి మరో అరగంట పట్టింది. కారు దిగుతూ అపర్ణ నందూతో “నువ్వు వెళ్ళగానే వెంటనే ఓకే చేయకు నందూ! ఏమేం ఫెసిలిటీస్, ఈవెంట్స్ ఉన్నాయో పూర్తిగా చూసి డిసైడ్ చేద్దాం” అంది. ‘సరే..సరే’ అన్నాడు నందూ.

విశాలమైన హాల్లోకి వెళ్లి కూర్చున్నారు. పిల్లల్ని చేర్చడానికి వచ్చిన తల్లిదండ్రులు 30 మంది దాకా ఉన్నారక్కడ. ఒక అమ్మాయి వచ్చి అప్లికేషన్స్ ఇచ్చి వివరాలు ఫిల్ చేయమని చెప్పింది. సమ్మర్ క్యాంప్ వివరాలన్నీ ఉన్న పాంప్లెట్ ఇచ్చి వెళ్లింది. ఇద్దరి కోసం అని చెప్పి ఇంకో సెట్ పత్రాలు తీసుకున్నారు. వివరాలు చూడటానికి అభి తాతయ్య పక్కన చేరితే, అమ్ము అమ్మానాన్నల మధ్యలో దూరింది. ఇండోర్, అవుట్‌డోర్ ఆటలు, పెయింటింగ్, మట్టిబొమ్మల తయారీ, పేపర్ ఆర్ట్, ఈత, మ్యూజిక్, డ్యాన్స్..ఇలా రకరకాల కార్యక్రమాలు ఓ 20 దాకా అందులో ఉన్నాయి. పిల్లలిద్దరికీ అవన్నీ బాగా నచ్చాయి. కానీ అది ‘రెసిడెన్షియల్ క్యాంప్’ అనగానే అందరి ముఖాలు కొద్దిగా మారాయి.

‘ఎవరూ లేకుండా చిన్న పిల్లలు ఒంటరిగా నాలుగు వారాలు అంటే కష్టం. వద్దులే నందూ! రోజూ ఇంటికి వచ్చి వెళ్లే డేస్కాలర్ క్యాంప్స్ ఏమైనా ఉంటే చూద్దాం’ అన్నాడు విశ్వనాథం మనవడి వైపు చూస్తూ.

“ఈవెంట్స్ అన్నీ చాలా చక్కగా  ఉన్నాయి. వీలైతే ఇక్కడే డేస్కాలర్ పర్మిషన్ ఇస్తారేమో అడుగుదాం” అంది అపర్ణ. ‘మంచి ఆలోచన’ అన్నాడు నందు.

పిల్లలిద్దరి ముఖాల్లోకి మళ్ళీ చిరునవ్వు వచ్చింది. అప్లికేషన్ ఫారాలు నింపి కూర్చున్నారు. తమ వంతు రాగానే లోపలికి వెళ్లి అడ్మిషన్ ఇన్‌ఛార్జితో డేస్కాలర్ పర్మిషన్ గురించి అడిగారు. ఆయన పాజిటివ్‌గా రియాక్ట్ అవుతూ “ఆర్గనైజర్స్ దృష్టికి తీసుకువెళ్తాను. ఇక్కడ చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు భయం అక్కర్లేదు. మీ ఇద్దరు పిల్లల్ని చేర్పిస్తున్నారు కాబట్టి ఫీజులో డిస్కౌండ్ కూడా ఉంటుంది” అని చెప్పాడు. అప్లికేషన్లు తీసుకొని ఏ విషయమూ రేపు ఉదయం చెబుతానన్నాడు. ‘సరే’ అంటూ అందరూ బయలుదేరారు.

వెనుక సీట్‌లో పిల్లలిద్దరూ తాతయ్యకు చెరోపక్క కూర్చున్నారు. కారు కదిలాక విశ్వనాథం  పిల్లలిద్దరి చేతుల్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని ‘అభి, అమ్ము! మీకు ఏదిష్టమో చెప్పండి. అక్కడే ఉంటారా? రోజూ ఇంటికి వస్తారా?’ అని అడిగారు.

“మూడు, నాలుగు రోజులైతే ఓకే తాతయ్యా! కానీ నాలుగు వారాలంటే కష్టమే. మిమ్మల్ని వదిలి ఉండలేం” అన్నాడు అభి. అమ్ము తలూపింది తప్ప పలకలేదు. పిల్లల మనసు అర్థం చేసుకున్న అపర్ణ “డేస్కాలర్ క్యాంపుకు ఒప్పుకుంటే సరి, లేకుంటే ఇంకోటి చూద్దాంలెండి” అంటూ సర్దిచెప్పింది.

ఇంటికొచ్చాక పిల్లలు తాతయ్య దగ్గర చేరి “నాన్నని ఎప్పుడైనా సమ్మర్ క్యాంపుకు పంపారా తాతయ్యా?” అని అడిగారు కుతూహలంగా.

‘లేదురా! అప్పుడు ఇలాంటివేమీ లేవు. సెలవుల్లో సబ్జెక్టు ట్యూషన్స్‌కు పంపేవాళ్లం’ అన్నాడు విశ్వనాథం. అభి పడుకునేముందు వాళ్ళ నాన్నతో “డాడీ! నువ్వు సమ్మర్ హాలీడేస్‌లో కూడా చదువుకునేవాడివట కదా!” అన్నాడు.

“నీకెలా తెలుసు?” అని అడిగితే “తాతయ్య చెప్పాడు” అని సమాధానమిచ్చాడు.

“నేను చదువులో ఎక్కడ వెనకబడిపోతానో అని మీ తాతయ్యకు చాలా భయం. అందుకే ట్యూషన్స్‌లో చేర్పించేవాడు” అన్నాడు నందూ నవ్వుతూ.

మరుసటి రోజు ఉదయం పేపర్లో వచ్చిన యాడ్ అతనికి చూపించింది అపర్ణ. ‘పిల్లలతోపాటు మొత్తం కుటుంబానికి మంచి వసతి సౌకర్యాలతో పాటు రకరకాల కార్యక్రమాలు’ అంటూ ‘ఫ్యామిలీ సమ్మర్ క్యాంపు’ గురించి ఒక ఆర్టికల్ ఉంది. కాన్సెప్ట్ కొత్తగా బాగుందనిపించింది. వెంటనే ఫోన్ చేసి ఆర్గనైజర్స్ తో మాట్లాడాడు నందూ. అందరినీ హాల్లోకి పిలిచి మొత్తం వివరించాడు. తమతోపాటు అమ్మ, నాన్న, తాతయ్య కూడా సమ్మర్ క్యాంప్‌కు వస్తున్నారని పిల్లలు గాల్లో తేలిపోయారు. విశ్వనాథం మాత్రం కొంచెం సంకోచిస్తూ, ‘ఈ వయసులో నాకెందుకురా ఇవన్నీ? నేను రానులే’ అన్నాడు. ‘మీరు రాకుంటే మేము అస్సలు వెళ్లం’ అని పిల్లలు, కొడుకు, కోడలు పట్టుబట్టడంతో ఆయన ఒప్పుకోక తప్పలేదు.

వారం తర్వాత వెళ్లే ఫ్యామిలీ సమ్మర్ క్యాంపు కోసం ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయాయి. ఇంట్లో అందరూ ఉత్సాహంగా తయారవుతున్నారు. కొత్త అనుభూతుల కోసం ప్రయాణం మొదలైంది. నగరాన్ని దాటాక రెండు గంటల్లో ఆ చోటికి చేరుకున్నారు. వాళ్లకి కేటాయించిన కాటేజ్‌లోకి వెళ్లారు. ప్రతి కాటేజ్‌లో ఒక హాలు, రెండు, మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి. అందరూ కాస్త రెస్ట్ తీసుకున్నాక ఒక అసిస్టెంట్ వచ్చి అందరూ మీటింగ్ హాల్లోకి రావాలని చెప్పి వెళ్ళాడు.

చాలా పెద్ద హాలు. అక్కడ కూర్చోవడానికి, మాట్లాడడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. పరిచయ కార్యక్రమాలయ్యాక మరుసటి రోజు ఉదయం 6 గంటలకు అందరూ హాలు దగ్గరకు రావాలని చెప్పారు.

పచ్చని ప్రకృతిలో నడకతో మొదటి రోజు మొదలైంది. ఉదయిస్తున్న సూర్యుడు, పక్షుల కిలకిలా రావాలు, స్వచ్ఛమైన గాలి మనసు నిండా ప్రశాంతతను నింపాయి. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక బొమ్మలు గీయడం, రంగులు వేయడం ప్రారంభమైంది. అంతవరకు ఎప్పుడూ రంగులు వేయని విశ్వనాథం ఒక మట్టి ఏనుగు బొమ్మను చేతిలోకి తీసుకుని దానికి రంగులు వేశాడు. అది చూసిన పిల్లలు చప్పట్లు కొడుతూ ఆయన్ని ఉత్సాహపరిచారు. భోజనాల వరకు ఈ సందడి కొనసాగింది. కొంచెం విశ్రాంతి తర్వాత ఇండోర్ గేమ్స్ మొదలయ్యాయి. ఒక మాస్టర్ వచ్చి “ఎటువంటి రక్తపాతం లేకుండా రాజును సైన్యంతోసహా వైరివర్గం ఓడించడం అన్నది ప్రపంచంలోనే ఎక్కువమంది ఇష్టంగా ఆడే ఆట. అది ఏ ఆటో చెప్పగలరా?” అన్నాడు. వెంటనే అభి ‘చెస్’ అని అరిచాడు.

చెస్ గురించి వివరిస్తూ “ఇది మేధావుల ఆట. ఏకాగ్రత, అద్భుతమైన వ్యూహాలతో ఆడి మీ ఐక్యూ, సృజనాత్మకత ఆత్మవిశ్వాసాలను పెంచుకోండి” అంటూ పిల్లల్ని ఉత్సాహంగా ఆడడానికి ప్రోత్సహించాడు. విశ్వనాథం నందూకు ఎత్తులు నేర్పుతుంటే, నందూ అభికి వాటిని నేర్పుతూ ఆ రోజంతా చదరంగంతో గడిచిపోయింది. సాయంత్రం ఆరుబయట నక్షత్రాల క్రింద కూర్చుని కథలు, ముచ్చట్లతో  భోజనం చేయడం అందరికీ అద్భుతమైన అనుభూతినిచ్చింది.

శారీరక మానసిక ఉల్లాసాలనిచ్చే యోగ, ధ్యానంతో రెండో రోజు మొదలైంది. తర్వాత సెషన్‌లో మట్టిబొమ్మల తయారీ. కుమ్మరి చక్రం మీద మట్టిపాత్రలు చేయడం చూసి అందరూ ముచ్చటపడ్డారు. రకరకాల ఆకారాలతో చేసిన తమ బొమ్మలను ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు. ప్రతి ఈవెంట్లో అసిస్టెంట్లు అందరికీ హెల్ప్ చేస్తున్నారు. తర్వాత పెద్ద లైబ్రరీకి వెళ్ళారు. ఎవరికి కావలసిన పుస్తకాలు వాళ్లు తీసుకొని బయటనున్న హాల్లోకి వెళ్లి చదువుతూ కూర్చున్నారు.

“ఈరోజు కూడా కథలు చెప్పమంటారేమోనని ఒక మంచి కథ చదివి పెట్టుకున్నానమ్మా” అన్నాడు అభి రాత్రి పడుకోబోతూ.

“ఫర్వాలేదు అభీ! ఇంటికి వెళ్ళాక మేము వింటాంలే” అంది అపర్ణ. ఇదంతా వింటున్న విశ్వనాథం “నేను వింటాను కదా! రా చెప్పు అభి” అంటూ మనవడిని దగ్గరకు తీసుకున్నారు.

టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆటలతో మూడో రోజు మొదలైంది. ఆ తర్వాత సెషన్‌లో  సంగీతం. అక్కడున్న అసిస్టెంట్లు సంగీత వాయిద్యాలను ఎలా ఉపయోగించాలో నేర్పుతూ సాయం చేస్తున్నారు. పాటలు, పద్యాలు, కీర్తనలతో క్యాంపు ఆవరణంతా హోరెత్తిపోయింది. అందరూ  కలిసి ఒకే పాటను బృందగానంలా పాడుతూ కాసేపు, గ్రూపులుగా విడిపోయి అంత్యాక్షరి ఆడుతూ కాసేపు ఆనందించారు.

నాలుగో రోజు అందరినీ దగ్గర్లోని ఫామ్ హౌస్‌కు తీసుకువెళ్లారు. పచ్చని పంటపొలాలు, పండ్లతోటల సందర్శన జరిగింది. అక్కడ విశ్వనాథం పాత రోజులు గుర్తుచేసుకొని భావోద్వేగంతో ఆ నేలను తాకాడు. నందూకు తన తల్లి జ్ఞాపకాలు, ఆ రోజుల్లో అమ్మ వైద్యం కోసం పొలాలు అమ్మేసిన విషయం గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తనలా వానాకాలం చదువు కాకూడదని వాళ్ళ నాన్న కుటుంబాన్ని దగ్గర ఉన్న టౌనుకు మార్చి, కొంతకాలం అటూఇటూ తిరుగుతూ మేనేజ్ చేశాడు. చదువు ఒక్కటే జీవితాన్ని మార్చగల ఆయుధమని, సమయం వృథా చేయొద్దని ఎంతో ప్రేమగా, సౌమ్యంగా చెబుతూ నందూను ఒక విజేతగా చూడాలని పరితపించారు. కానీ విధిరాత ఇంకోలా ఉంది. నందూ బంగారు భవిష్యత్తు చూడకుండానే వాళ్ళమ్మ వాళ్ళను వదిలి వెళ్లిపోయింది. అమ్మ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం ఉన్న పొలాలన్నింటినీ పోగొట్టుకోవాల్సి వచ్చింది. నందూకు తండ్రి, తండ్రికి నందూ మాత్రమే మిగిలారు. ఇల్లంతా నిశ్శబ్దం. ఇంట్లో పనులన్నీ చిందరవందర. వంటతో తంటాలు. ప్రతిక్షణం ఆమె లేని లోటు తెలిసేది. ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఏడ్చుకున్న క్షణాలు ఎన్నో.

ఆమె ఇంక రాదన్న విషయం వాళ్ల మనసులకు మెల్లమెల్లగా అర్థమయ్యింది. దుఃఖ తీవ్రత తగ్గుతూ కదులుతున్న కాలం వాళ్ల గాయాలను మానిపించింది. ఆమె జ్ఞాపకాలు వాళ్లని ముందుకు నడిపిస్తున్న సమయంలోనే అపర్ణ నందూ జీవితంలోకి వచ్చింది. ఆ తరువాత పిల్లలు, ఇప్పుడు వాళ్ల చదువు, వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్. ఆలోచిస్తూ తండ్రి భుజంపై ఓదార్పుగా చెయ్యి వేసి, ‘నీకు నేనున్నాను’ అన్నట్లు భరోసా ఇచ్చాడు నందూ. వాళ్లిద్దరినీ అలా చూసిన అపర్ణ కళ్ళు తడయ్యాయి.

సాయంత్రం అక్కడ 50ల నాటి క్లాసిక్ సినిమా ‘మల్లీశ్వరి’ ప్రదర్శించారు. పెద్దలతోపాటు పిల్లలు చాలా ఇష్టంగా ఆ సినిమా చూశారు. ఆ తర్వాత తాము ఏ ఊరిలో, ఎవరితో ఆ సినిమా చూశారో పాత రోజులు గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు.

ఆ తర్వాత రోజుల్లో ఈత, గుర్రపు స్వారీ, ఆర్చరీ, వాటర్ గేమ్స్, హిల్ స్టేషన్ సందర్శన, సరస్సులో బోటింగ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యావరణానికి హాని చేయకుండా జీవించడం, టెక్నాలజీని అవసరమైన మేరకు వాడుకోవడం, సమాజసేవ, సహకారం లాంటి పాజిటివ్ థింకింగ్‌ను పెంచే ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. పది రోజులు చాలా ఆనందంగా గడిచిపోయాయి. ప్రతి క్షణాన్ని ఒక అందమైన జ్ఞాపకంగా మలుచుకొని, ఇతర కుటుంబాలతో కలిసిపోయి, ఒకరి ఫోన్ నెంబర్లు మరొకరు ఇచ్చిపుచ్చుకొని కొత్త ఉత్సాహంతో ఇళ్లకు బయలుదేరారు.

విశ్వనాథం కుటుంబంతో కలిసి కారులో ఇంటికి వెళ్తున్నాడు. నందూ కారు నడుపుతున్నాడు. పక్కన కూర్చున్న అపర్ణ వెనక్కి తిరిగి పిల్లల వైపు చూసింది.

అమ్ము ఉత్సాహంగా “తాతయ్యా! నేను చేసిన కాగితం పువ్వులకు ప్రైజ్ వచ్చింది కదా! మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను. మనమందరం మళ్లీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే వద్దాం” అంది సంబరంగా.

“సరే! అలాగే వద్దాం. అభీ..నీకేమనిపించింది?” అన్నాడు నందూ డ్రైవింగ్ మిర్రర్‌లోంచి కొడుకు వైపు చూస్తూ.

“నాకసలు బోర్ కొట్టనే లేదు. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. అమ్మూ, నేను కలిసి ట్రెజర్ హంట్‌లో దాక్కున్న బొమ్మలన్నీ కనిపెట్టాం. మనమందరం కలిసి ప్రతి ప్రోగ్రామ్‌లో పాల్గొనడం నాకు బాగా నచ్చింది. నేను వాటర్ కలర్స్‌తో మన ఫ్యామిలీ పిక్చర్ వేశాను కదా, దాన్ని ఫ్రేమ్ కట్టించి మన హాల్లో పెట్టుకుందాం” అన్నాడు అభి ఉత్సాహంగా.

“మమ్మీ! మరి నీకెలా అనిపించింది?” అని తల్లి చేతిని పట్టుకుంటూ అడిగింది అమ్ము.

“అందరికంటే ఎక్కువ ఆనందించింది నేనే! ఈ పది రోజులు వంట, ఇంటి పనులు లేకపోయేసరికి చాలా టైం నాకోసమే ఉపయోగించుకున్నాను. మళ్ళీ నా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. నేను నీ డ్రెస్ మీద వేసిన డిజైన్ అందరికీ నచ్చడం, ఎన్నో రోజుల తర్వాత నాకు ఇష్టమైన కీర్తనలు తృప్తిగా పాడుకోవడం, అందరం కలిసి ఉండటం.. అన్నీ చాలా బాగున్నాయి” అంది అపర్ణ.

“నైస్..నైస్!” అంటూ అందరూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.

“ఇప్పుడు డాడీ చెప్పాలి!” అంటూ పిల్లలిద్దరూ నందూను ఆటపట్టించారు.

నందూ స్టీరింగ్ తిప్పుతూ “మనం చాలాసార్లు టూర్లకి వెళ్లాం. కానీ ఇలా అందరం కలిసి ఆడుకోవడం ఇదే మొదటిసారి. ఇది జస్ట్ సమ్మర్ క్యాంపు కాదు, మన బంధాన్ని పెంచిన ఒక ఫ్యామిలీ కనెక్ట్ సెషన్. నా చిన్నప్పుడు వేసవి సెలవులంటే గల్లీ క్రికెట్. ఆ తర్వాత ర్యాంకుల వేటలో స్పెషల్ కోచింగులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ వినోదంతోపాటు విద్యను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. చాలా రోజుల తర్వాత చాలా రిలాక్డ్స్‌గా..కొత్త ప్రపంచాన్ని చూసి వచ్చినట్టుగా ఉంది” అన్నాడు.

“తాతయ్యా! ఇప్పుడు నువ్వు చెప్పు” అని అభి, అమ్ము ఒకేసారి విశ్వనాథం భుజాలు పట్టుకొని అడిగారు.

విశ్వనాథం సీట్లో వెనక్కి ఆనుకుని, కిటికీలోంచి దూరంగా కనిపిస్తున్న మేఘాల వైపు చూస్తూ గతాన్ని తలచుకున్నాడు. కారు డాష్‌బోర్డ్‌పైన ఆయన రంగులు వేసిన ఆ మట్టిఏనుగు బొమ్మ అందంగా మెరుస్తోంది.

“మా కాలంలో ఈ సమ్మర్ క్యాంపు అనే మాటే తెలియదు. వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరు, ఎడ్లబండిలో ప్రయాణం, చెరువులో ఈతలు, చెట్ల కింద కుస్తీలు, రాత్రిపూట మిద్దె మీద పడుకొని నక్షత్రాలు లెక్కపెడుతూ, అమ్మమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోవడం. ఎన్ని దశాబ్దాలు గడిచినా మరచిపోలేని జ్ఞాపకాలవి. కానీ ఈ వయసులో మీ అందరితో కలిసి ఈ సమ్మర్ క్యాంపుకు రావడం మర్చిపోలేని అనుభూతి. చిన్నప్పటి పాటలు, పద్యాలు మళ్లీ నెమరు వేసుకున్నాను. ఈ వేసవి మనందరికీ ఓ కొత్త స్మృతిగా మిగిలింది” అన్నాడు.

వాళ్లందరి సంతోషంలో భాగమైనట్లుగా ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. వాన చినుకులు కారు అద్దాలపై టపటపా రాలుతూ చప్పట్ల స్వాగతం పలికాయి.

వానను చూడగానే విశ్వనాథం కళ్ళు వెలిగాయి. “ఆహా! వానను చూస్తే నాకు ముందుగా గుర్తొచ్చేది ఆ మట్టివాసన. మా చిన్నప్పుడు పొలాల్లోకి వెళ్లి వానలో తడుస్తూ ఆడుకోవడం ఒక సరదా” అన్నాడు పరవశంగా.

నందూ కిటికీ గ్లాస్ కొద్దిగా దించి చల్లటి గాలిని ఆస్వాదిస్తూ “నాకు మాత్రం వాన నీటిలో కాగితం పడవలు వదలడం, వాన పడ్డప్పుడు అమ్మ చేసే వేడి వేడి మిరపకాయ బజ్జీల రుచి గుర్తుకొస్తుంది నాన్నా” అన్నాడు భావోద్వేగంతో.

“డాడీ! వాన పడితే నాకు ఫోటోలు, స్లోమోషన్ వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం చాలా ఇష్టం” అన్నాడు అభి తన ఫోన్ కెమెరా ఆన్ చేస్తూ.

“నాకు మాత్రం రెయిన్‌కోట్ వేసుకొని వానలో డ్యాన్స్ చేయడం ఇష్టం” అన్నది అమ్ము సీట్లోంచి లేస్తూ.

అపర్ణ కారు అద్దాలపై పడుతున్న చినుకులను, పిల్లల ముఖాల్లోని ఆనందాన్ని చూస్తూ మురిసిపోయింది. తరం ఏదైనా..కాలం మారినా..వాన ఇచ్చే హాయి అందరికీ ఒకటే! అది మావయ్య పొలం కావచ్చు. నందూ కాగితం పడవ కావచ్చు. అభి ఫోటోగ్రఫీ కావచ్చు. వాన ఎప్పుడూ మనసును పలకరిస్తూనే ఉంటుంది. ఈ సమ్మర్ క్యాంపు ముగింపులో కురుస్తున్న ఈ తొలకరి జల్లులు మన కుటుంబంలో ఒక కొత్త ఆరంభానికి ఆహ్వాన గీతం” అనుకుంది తాత్వికంగా.

కారు ఇంటి ముందు ఆగేసరికి వేసవి కాలపు వేడి ధూళిని పూర్తిగా కడిగేస్తూ కురిసిన ఆ తొలకరి జల్లులు ఆ ఇల్లంతా మట్టి వాసనను నింపాయి. నూతన ఉత్సాహంతో మూడు తరాల కుటుంబం నవ్వుతూ ఇంట్లోకి అడుగుపెట్టింది.

*

ఆర్.మాధవి

వృత్తిరీత్యా జోగులాంబ గద్వాల జిల్లాలోని క్యాతూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌కు హెడ్మాస్టర్. కథలు, నవలలు చదవడం అభిరుచి. నివాసం కర్నూలు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.