ప్రయోగ శరణం “కశప”  

 కవిత్వానికి కాలం చెల్లుతున్న సందర్భం. నీతులు, విలువులు కాటికి కాలు చాచుకున్న సమయం. మానవ సంబంధాలన్నీ మరణశయ్య మీద నిదిరిస్తున్న రోజులు. చరిత్రకు చదలు పట్టిన వేళ, సాహిత్యం తనను తాను వెతుక్కుంటుంది. సృజనాత్మకత చాట్ జిపిటిలో ముసుగుతన్ని పడుకుంది. ఆలోచనలు అటకెక్కి, చైతన్యం వ్యాపారానికి కాపుకాస్తుంది. ఫేస్ బుక్ లు, వాట్సప్, యూట్యూబ్ లు స్వీయ నామాలకోసం, హోదాలకోసం పోటీపడుతున్నాయి. రియల్ అంతా రీల్స్ మయమై వాస్తవానికి, భ్రమకు మధ్య వస్తువై.. ఆనందాన్ని, ఉద్వేగాల్ని భ్రమాత్మకంగా మార్చేస్తుంది. మతం, కులం, ప్రాంతం, లింగం, అధికారం, రాజకీయం.. అందనంత ఎత్తున పెత్తనం చేస్తున్నాయి. ఇలాంటి అసమాన, అకృత్యాల, అవహేళనల మధ్య బి.వి.ఎన్. స్వామి ఇదిగో “కశప” అని రెండు పుస్తకాలు పట్టుకొని ధీమాగా మన ముందుకొచ్చి నిలబడ్డాడు. ఇవేమిటంటే..! “కథా శతక పద్యాలు” అని భుజం తట్టి మాట్లాడుతున్నాడు.

అంతో ఇంతో తెలుగుభాషతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ వేమన పద్యాన్నో, సుమతీ పద్యాన్నో వల్లె వేసే ఉంటారు. వాటిలోని నీతిని, రీతిని, చెంప చెల్లుమనిపించే మెరుపును చూసే ఉంటారు. మరి “కశప”లో ఏముంది అంటే! సమకాలీన సమాజాన్ని జల్లెడ పట్టి స్వామి వేసిన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలతో అల్లిన కథలున్నాయి. ఆ కథల్లో మనం ఉన్నాం. మన చుట్టూ జరుగుతున్న, జరిగిన అన్యాయాలు ఉన్నాయి. భక్తి పేరుతో మోసాలు, రాజకీయం పేరుతో అణగదొక్కడం ఉంది. తెగుతున్న కుటుంబ బంధాలు, నలుగుతున్న హృదయాలు, కనుమరుగవుతున్న ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. కుదేలవుతున్న కుటీర పరిశ్రమలు, అటకెక్కిన వ్యవసాయం, పొలం గట్లే రైతుల మరణశయ్యలవడం కనిపిస్తుంది. ఇంకా వెర్రితలలు వేస్తున్న ఆధునికత, టెక్నాలజీ, మృగ్యమవుతున్న మానవ సంబంధాలు, వాణిజ్యీకరింపబడుతున్న జీవిత శకలాలు, వెర్రితలలు వేస్తున్న కార్పొరేట్ విష సంస్కృతి.. ఒకటేంటి..! సమాజం మొత్తం మన ముందు ప్రత్యక్షంగా, పరోక్షంగా, విమర్శనాత్మకంగా, వివరణాత్మకంగా, సూటిగా, స్పష్టంగా, అస్పష్టంగా, హాస్యంగా, అద్భుతంగా, వినూత్నంగా దర్శనమిస్తుంది. విషాదాన్నో, సంతోషాన్నో, భయాన్నో, బీభత్సాన్నో.. ఏదో ఒకరసాన్ని మనలో పూయిస్తుంది.

కథ చిన్నదే..! ఒక్కోసారి అర పేజీ కూడా దాటకపోవచ్చు.! కానీ సత్యాన్ని ఆవిష్కరించి, మేల్కొలుపుతుంది. కొన్ని కథలు బుజ్జగిస్తాయి, కొన్ని కథలు ప్రేమతో చెప్తాయి. మరి కొన్ని కథలు బలవంతంగా నేర్పిస్తాయి. ప్రాచీన ఆలంకారికులు చెప్పినట్లు ప్రభు, మిత్ర, కాంతా సమ్మితాల్లా ప్రవర్తిస్తాయి. ఇంతకు ముందటి స్వామి కథా శైలికి, ఈ కథల శైలికి కొంత భిన్నత్వం ఉన్నా.. ఎక్కడా వాక్యం అవాక్యంలా అడ్డుపడదు. అడుగులకు దారి చూపుతూ, అక్షరాల వెంట నడిపిస్తుంది. ఈ కథల నిర్మాణంలో రచయితతో పాటు, బుంగి ప్రధాన పాత్రగా కనిపిస్తాడు. ఒక్కోచోట ఒక్కో అవతారమెత్తుతాడు. విద్యార్థి, మిత్రుడు, కొడుకు, వైద్యుడు, టీచర్.. ఏదైనా సరే కథను ముందుకు నడపడానికి, కథలోని నీతిని వ్యక్తం చేయడానికి కృషి చేస్తాడు. సర్వజ్ఞానిలా, సామాజిక తాత్వికుడిలా కనిపిస్తాడు. రచయిత బుంగిని అనుసరిస్తూ, అనుకరిస్తూ, వాదిస్తూ, విభేదిస్తూ, సర్దుకుపోతూ కథను ముందుకు తీసుకెళ్లడంలో సాయపడుతుంటాడు. ఇది స్వామి కథాశిల్ప శక్తికి ఉదాహరణ.

“కశప” అంటే “కథ శతక పద్యం” అని రచయితే చెప్పుకున్నాడు. అందుకు తగ్గట్టే కథకు తగిన శతక పద్యాన్ని పొందుపరిచాడు. శతకానికి తగిన కథ రాయడం కొంత సులువే. కానీ కథ రాశాక, తగిన పద్యాన్ని ఎంపిక చేసుకోవడం స్వామి చేసిన పని. ఇది అంత సులభమైన పని కాదు. శతకసాహిత్యంపై అవగాహన, అపారమైన పట్టు, అంతులేని పరిశోధనాశక్తి ఉండాలి. 12వ శతాబ్దానికి చెందిన మల్లికార్జున పండితారాధ్యుడు, బద్దెన, కవి చౌడప్ప, యధావాక్కుల అన్నమయ్య, పోతన, వంటి ప్రాచీన కవుల తోపాటు.. తెలంగాణలో శతకాలు రాసిన, రాస్తున్న ఆచార్య కె. రుక్నుద్దీన్, పబ్బ మురళి, తాటి జగన్నాధం, గోశిక్ నరహరి, మంగళంపల్లి సత్తయ్య, పరవస్తు సుందర్, మడిపెల్లి భద్రయ్య, సంగనభట్ల రామకృష్ణయ్య.. వంటి ఎందరి పద్యాలనో తన కథలకు అనుకూలంగా ఇచ్చాడు. తెలంగాణ శతకకవులను ఈ విథంగా పరిచయం చేసాడు.

“కశప -2” లో కథతోపాటు, పద్యాన్ని కూడా వీరే రాసారు. కథ రాయడం, ఆ కథలోని నీతిని బోధించేలా లేదా వ్యక్తపరిచేలా లేదా వివరించేలా పద్యాన్ని అల్లడం అంత సులువు కాదు. కానీ, స్వామిలోని పద్యకవి, కథకుడు కలిసి ఈ సృజనను అత్యద్భుతంగా, ప్రభావవంతగా చేసాడు. స్వామి రాసిన పద్యాలపై వేమన ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. వేమన “ఆటవెలది” లాగే వీరు “తేటగీతి”ని ఎంపికచేసుకోవడం, మూడో పాదంలో నీతిని చెప్పడం, సమాజ రుగ్మతల్ని ప్రశ్నించటం గమనించవచ్చు. అయితే, తన పేరు కన్నా “కశప” ప్రక్రియకే ప్రాధాన్యత ఇచ్చి “కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము” మకుటాన్ని వాడారు. ఎక్కడా గ్రంథిక పదాల జోలికి వెళ్లకుండా, వ్యవహారిక భాషను, నుడికారాలతో అత్యంత సుందరంగా ప్రయోగించాడు. అందుకే, ఈ పద్యాలు కేవలం పిల్లలకోసమే కాదు, యువత కోసం, పెద్దలకోసం కూడా..

కులం, మతం మనుషుల మధ్య ఎలాంటి విభేదాలు, వైషమ్యాలు, అరచకాలు సృష్టిస్తున్నాయో చూపించే కథ “గుడి”. ఈ కథకోసం రచయిత “ఒడలు, గుడి, యంతరాత్మయ / ఒడరుండను, పలుకు లుడిగి భక్తిని గుడియే / గుడియనియు లింగమూర్తియ / ఒడరుండని కొలువకునికి పాతకముశివా!” అని మల్లికార్జున పండితారాధ్యడు రాసిన “శివతత్త్వసారము” నుండి పద్యాని ఎంపికచేసుకున్నాడు. (కశప-1). “న్యాయం అందడం ఆలస్యమైతే దొరికేది స్మశానం” అంటూ కోర్టులు, లాయర్లు చేసే మోసాల గురించి చూపే కథ “బుకాయింపు”. ఈ కథా వస్తువును ప్రతిబింబించే “ఈ రోజులలో ఎవడికి / నోరుంటె వాడెరాజు నూరుచు మిరియాల్ / కారాలు, తెగ బుకాయిస్తే / రాజ్యాలేల వచ్చు సిరిసిరి మువ్వా” అని శ్రీశ్రీ “సిరిసిరిమువ్వా” శతకంలోని పద్యాన్ని అర్థవంతంగా ఇచ్చాడు. (కశప-1)

ఆధునికంగా ఆధ్యాత్మికత పాకుతున్న దృశ్యాల్ని కళ్ల ముందు నిలిపే కథ “కనుగొనలేని”. ఈ కథా వస్తువును వెల్లడించే “పూర్వ జన్మమందు పుణ్యంబునే జేయ / భువిని గలిగె నాకు పురుష జన్మ / కాని నిన్ను నేను కనుగొన లేనైతి / సబ్బిదేశవాస సాంబదేవ” అంటూ సబ్బిసాంబశివ శతకములోని పద్యాన్ని ఇచ్చాడు. (కశప-1). బతుకమ్మ పండుగలో దాగిన జననమరణ రహస్యాన్ని వివరిస్తుంది “వేడ్క” కథ. ఈ కథా వస్తువును స్పష్టంగా వివరించే “తెలంగాణ శతకం” (పద్యభారతి – ఇందూరు)లోని “బ్రతుకు నిచ్చేటి బ్రతుకమ్మ ప్రతిగృహమున / గునుగు తంగేడు విరులతో గూర్చిపేర్చి / వీధివీధి నూరేగించి వేడ్కగొనగ / నా తెలంగాణ కోటి రతనాల వీణ” పద్యాన్ని ఎంపిక చేసాడు. (కశప-1)

ప్రజాస్యామ్యానికి నాలుగో స్తంభం అయిన మీడియా నేడు ప్రజాభిప్రాయాన్ని తయారు చేస్తుందని, ఏ వ్యవస్థలోనూ సంపూర్ణంగా మంచి ఉండదని చెప్పే కథ “ప్రీతి”. ఈ కథా సారాన్ని స్వామి “కడుపు నిండని మనిషికి గడక కొరత / కూడు నెక్కువ మనిషికి కొరత నిదుర / రీతి తెలిసిన మనిషికి ప్రీతి కలుగు / కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము” పద్యంలో రాసాడు. (కశప-2) కాలేజ్ లలో దుస్తుల గురించిన హిజాబ్ గొడవని, ఉదారవాద రాజకీయాన్ని సంక్షిప్తంగా వివరించే కథ “ఒప్పిస్తే”. ఈ కథలోని సమస్యకు స్వామి “తెగువరకు లాగి చూసియు తెగినదెట్ల / యంటె ఎలామరి పద్ధతి యందరికని / చెప్పి యొప్పించ తొలగును చీడ పురుగు / కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము” పద్యంలో సామరస్యధోరణే సమస్యకు పరిష్కారం అని చూపించాడు. (కశప-2)

వలస బతుకుల వెతల్ని, సొంత ఊరు, ఇల్లు, మనుషుల జ్ఞాపకాల్ని సంభాషణాత్మకంగా చెప్పే కథ “కరుణ”. ఈ కథను “బతుకు తెరువున్న మనిషియు బతక లేక / రోగి వైదనగ్రస్తుడై రోజు లెక్క / కడుతు జీవింప సాగెను కరుణవిడిచి / కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము” అని ఉన్నచోటే బతకడంలోని సంతోషాన్ని, తోటి మనుషుల సహకారాన్ని వివరించాడు. (కశప-2) కామం, అంగాంగ ప్రదర్శన, శబ్దించే ముద్దులు, అలసిన దేహాలు, కోరికలు రేపే సంగీతం.. వంటి నేటి సినిమా పాటలను, ఆపాత మధురాలైన పాత సినిమా పాటలను తులనాత్మకంగా విశ్లేషించే కథ “విలువ”. ఈ కథలోని అంతస్సారాన్ని స్వామి “ఆకతాయి పనియగును ఆటవిడుపు / హాస్యమును మింగె నిట నపహాస్యమిటుల / కింది మీదల విలువల కిటుకు నిదియె / కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము” అనే పద్యంలో గుదిగుచ్చాడు. (కశప-2)

ఆధునిక సాహిత్యంలో నూతన ప్రక్రియలలో వినూత్న ప్రక్రియ ఇది. నీతిని, విలువల్ని, వ్యక్తిత్వ వికాసాన్ని అందించేవి శతకాలు. అలాంటి శతక పద్యాలకు, కథను జోడించి సమాజాన్ని చైతన్యం చేసే విధంగా ఈ కొత్త ప్రక్రియకు నాంది పలికాడు బి.వి.ఎన్.స్వామి. రెండు పాత్రలతో కథను వైవిధ్యంగా చెప్పాడు. అటు కథని, ఇటు పద్యాన్ని రాయగలిగి, ఆధునిక సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించ గలిగి, ప్రగతిని కాంక్షించే వాళ్లు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లగలుగుతారు. బి.వి.ఎన్. స్వామి శ్రీకారం చుట్టిన ఈ నూతన ప్రక్రియకు స్వాగతం పలుకుతూ… కవిత్వంలో హైకూలు, నానీలు, ప్రపంచపదుల్లా ముందుకు ఇదీ వెళ్లాలని, సాహిత్య చరిత్రలో స్థిరపడాలని ఆకాంక్షిద్దాం..

కశప -1, 2. (కథా శతక పద్యం) రచన: డా।। బి.వి.ఎన్. స్వామి. పేజీలు: 131, 111, వెల: 95, 125.

ప్రతులకు: 040-24224453/54, 9490099437/063.

ఎ.రవీంద్రబాబు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నమస్కారం
    చక్కటి విశ్లేషణాత్మక వ్యాసం.ప్రక్రియ అని తెలిపిన మీ హ్రుదయవైశాల్యానికి నమస్సులు.
    ప్రచురించిన అఫ్సర్ గారికి నిర్వాహకులకు ధన్యవాదాలు.
    పొత్తిళ్ళలోని కశపను పెంపు చేయవలసినది సాహిత్య సమాజమేనని నా ప్రగాఢ విశ్వాసం.

  • మంచి సమీక్ష రవీంద్ర గారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.