ఒక మహిళ “వద్దు” అని చెప్పిన తర్వాత కూడా ఆమె జీవితంలో భయం ఎందుకు మొదలవుతుంది? వివాహం ప్రేమకు ప్రతీకనా? లేక సమ్మతిని గౌరవించాలనే బాధ్యతనా? భార్య అనే ఒక్క పదంతో ఆమె శరీరంపై, మనసుపై, జీవితంపై హక్కు వస్తుందని ఎవరు నిర్ణయించారు? ఒక ఇంటి నాలుగు గోడల మధ్య జరిగిన హింసను “కుటుంబ విషయం” అని దాచిపెడితే, ఆ మౌనంలో చనిపోతున్నది ఒక మహిళ మాత్రమేనా? లేక మనిషితనమా?
ఈ నవలలో మహిమ అడిగిన ప్రశ్న ఒక్క మహిళది కాదు. ప్రతి స్త్రీ గుండెల్లో ఎన్నో ఏళ్లుగా నిశ్శబ్దంగా మిగిలిపోయిన ప్రశ్న. “వద్దు” అనే మాటకు విలువ లేని బంధాన్ని ప్రేమ అని ఎలా పిలుస్తాం? సమ్మతి లేని సంబంధాన్ని దాంపత్యం అని ఎలా సమర్థిస్తాం? ఈ నవల చదివిన తర్వాత మనం పాత్రలను కాదు, మన ఆలోచనలను ప్రశ్నించడం ప్రారంభిస్తాం.
పరిమళ, పావని, భువన కథలు వేర్వేరుగా కనిపించినా, వారి బాధ ఒకటే కాదా? ఒకరిని సంప్రదాయం పేరుతో, మరొకరిని కుటుంబం పేరుతో, ఇంకొకరిని పెళ్లి పేరుతో మౌనంగా బలి చేశారు. పేర్లు మారాయి. పరిస్థితులు మారాయి. కానీ హింస ఎందుకు మారలేదు? బాధితులు మారినా, బాధను సమర్థించే మాటలు మాత్రం ఎందుకు తరతరాలుగా అలాగే కొనసాగుతున్నాయి?
సుమైరా, నూరున్నిసా, మమత, జోయా, దరియా, విభాత… ఈ పాత్రలు మనకు ఒక చేదు నిజాన్ని చూపిస్తాయి. అన్యాయం ఎవరి మతం చూడదు. ఎవరి కులం చూడదు. ఎవరి లింగం చూడదు. కానీ సమాజం మాత్రం ప్రతి బాధను వేర్వేరుగా చూస్తుంది. నేరాన్ని ప్రశ్నించాల్సిన చోట బాధితులనే విచారించడం ఎందుకు మన అలవాటైంది? అవమానం చేసినవాడు నేరస్థుడు అయితే, అవమానాన్ని భరించినవారినే ఎందుకు నిందిస్తాం?
మహిమ ఈ నవలలో కేవలం ఒక పాత్ర కాదు. విరిగిపోయిని ఆత్మగౌరవానికి రూపం. రచయిత్రి ఆమెను కేవలం బాధితురాలిగా చూపించలేదు. తన శరీరంపై తనకే హక్కు ఉందని ప్రపంచం ముందు నిలబడి చెప్పిన మహిళగా తీర్చిదిద్దారు. ఆమె ప్రయాణం మనకు ఒక నిజాన్ని చెబుతుంది. బాధ మనిషిని ఓడించదు. కానీ ఆ బాధను సమాజం అర్థం చేసుకోకపోవడమే అసలు విషాదం.
చరణ్‌ను ఒక వ్యక్తిగా మాత్రమే చూడటం ఈ నవలకు అన్యాయం చేసినట్టే. అతడు పురుషాధిక్యాన్ని సాధారణంగా అంగీకరించిన మనస్తత్వానికి ప్రతీక. “భార్య అంటే హక్కు” అనే ప్రమాదకరమైన భావజాలం ఎలా ఒక మనిషిని నేరస్థుడిగా మార్చుతుందో చరణ్ చూపిస్తాడు. అందుకే ఈ నవల ఒక వ్యక్తిని కాదు, ఒక వ్యవస్థను ప్రశ్నిస్తుంది.
వరద, బిపిన్ చంద్ర ఈ నవలలో ఆశకు రెండు రూపాలు. వరద న్యాయం కోసం నిలబడే ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. బిపిన్ చంద్ర ప్రేమ అంటే అధికారం కాదు, గౌరవం అని చూపిస్తాడు. అంగీకారం లేని ప్రేమ హింసగా మారుతుందని, అంగీకారం కూడిన ప్రేమ మాత్రమే సంబంధానికి విలువ ఇస్తుందని ఈ రెండు పాత్రలు మనకు నేర్పిస్తాయి.
భువన మౌనం చదివితే మనసు బరువెక్కుతుంది. పరిమళ కన్నీళ్లు చదివితే గొంతు బిగుసుకుపోతుంది. పావని బాల్యం చదివితే కోపం వస్తుంది. సుమైరా అవమానం చదివితే మనిషిగా సిగ్గేస్తుంది. ఈ పాత్రలు మన కళ్లను తడపడానికి రాయలేదు. మన మనసాక్షిని మేల్కొలపడానికి రాశారు. వీరి గాయాలు కథలోనివి కావు. ఇంకా మన సమాజంలో బతికే గాయాలు.
ఈ నవలలో ప్రతి పాత్ర ఒక ప్రతీక. మహిమ ఆత్మగౌరవానికి ప్రతీక. చరణ్ పురుషాధిక్యానికి ప్రతీక. వరద ప్రతిఘటనకు ప్రతీక. బిపిన్ చంద్ర గౌరవప్రదమైన ప్రేమకు ప్రతీక. పరిమళ మౌనానికి ప్రతీక. భువన కనిపించని గాయాలకు ప్రతీక. పావని దోచుకున్న బాల్యానికి ప్రతీక. మమత సమాన గౌరవం కోసం సాగుతున్న పోరాటానికి ప్రతీక. ఈ ప్రతీకలన్నీ కలిసి సమాజం దాచిపెట్టిన క్రూరమైన చరిత్రను మన కళ్ల ముందుంచుతాయి.
‘విత్ యువర్ పర్మిషన్’ స్త్రీ శరీరానికి, ఆత్మగౌరవానికి, ఆమె ఇష్టానికి జరిగిన అన్యాయాన్ని నిలదీసింది. చర్చించాల్సినది. ప్రశ్నించాల్సినది. ప్రతి ఇంట్లో వినిపించాల్సిన స్వరం
ఈ నవలలో మహిమను మర్చిపోవచ్చు. కానీ ఆమె అడిగిన ప్రశ్నలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. పరిమళ, భువన, పావని, సుమైరా, మమత… వీళ్లు కేవలం పుస్తకంలోని పాత్రలేనా? లేక మన ఇళ్లలో, మన వీధుల్లో, మన సమాజంలో ఇంకా బతుకుతున్న జీవితాలా?
ఒక స్త్రీ “వద్దు” అనే ఒక్క మాటను కూడా గౌరవించలేని సమాజం, ప్రేమ గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి తెచ్చుకుంది? వివాహాన్ని అంగీకారం బదులు అధికారంగా భావించే ఆలోచనను ఇంకా ఎంతకాలం మోస్తాం? బాధితురాలి గాయాన్ని కాదు, ఆమె ప్రవర్తననే ప్రశ్నించే వ్యవస్థను ఇంకా ఎందుకు సహిస్తాం? మారాల్సింది మహిమలు కాదు. పరిమళలు కాదు. భువనలు కాదు. మారాల్సింది “భార్య అంటే హక్కు” అనే ప్రమాదకరమైన భావజాలం. మారాల్సింది మౌనాన్ని సంస్కారంగా, సహనాన్ని స్త్రీ లక్షణంగా బోధించే కుటుంబాలు. ఒక మహిళ తన శరీరంపై తనకే హక్కు ఉందని ఇప్పటికీ నిరూపించుకోవాల్సి వస్తే, అది ఆమె ఓటమి కాదు… మన సమాజం వైఫల్యం. ఇక ప్రశ్న ఒక్కటే. ఒక స్త్రీ “వద్దు” అనే మాటను గౌరవించలేని దేశం మనిషితనం గురించి మాట్లాడే అర్హత ఉందా? లేక నాగరికత అనే ముసుగులో హింసను దాచిపెట్టుకుంటున్నదా?
పుస్తకం : విత్ యువర్ పర్మిషన్
రచయిత్రి : డాక్టర్ గీతాంజలి భారతి
ప్రచురణ: అన్వీక్షికీ పబ్లిషర్స్ / అజు పబ్లికేషన్స్
బుక్ క్రెడిట్స్ : నరేష్కుమార్ సూఫీ
*








40 సంవత్సరాల క్రితం రంగనాయకమ్మ గారి జానకి విముక్తి నవల ఆధారంగా స్త్రీపురుష సంబందాలు, సమస్యలు టాఫిక్ పై ఎస్వీ యూనివర్సిటీలో ఎంఫిల్ ధీసెస్ కోసం పరిశోధన చేస్తున్నప్పుడు.. గురజాడ, చలం, కొకు వంటి మాన్యుల రచనా వారసత్వం జానకి విముక్తి నవలతో పరాకాష్టకు చేరుకుందని భావించాను. ఆ నవల చదివిన ప్రేరణతోనే కావచ్చు. ఆ కాలంలో నేను చదివిన వందలాది ఉత్తమ కథా, నవలా సాహిత్యం ప్రభావం కావచ్చు. నా పరిశోధనా కృషిని చివరలో వదిలేసి అడవుల బాట పట్టాను.. 15 సంవత్సరాల తర్వాత తిరిగి సమాజంలోకి వచ్చాక కూడా నేను ప్రయత్నించి సేకరించుకున్న పుస్తకాలలో జానకి విముక్తి నవల ఒకటి. ఇంత కాలం తర్వాత ఒక నిర్దిష్ట దృక్పథంతో, శ్రీశ్రీ అన్నట్లు సమస్త స్త్రీలు అనుభవిస్తున్న ఆ భయంకర బాధల పాటల పల్లవిలను ప్రపంచానికి మరోసారి వినిపించడానికే గీతాంజలి గారు ఈ నేల మీద పుట్టారా అనిపించింది ఆమె పుస్తకాలు చదివాక. డాక్టరుగా, సైకాలజి కౌన్సెలర్ గా 20 సంవత్సరాలకు పైగా తన వృత్తి అనుభవాన్ని రంగరించిపోసి, తన వద్దకు సహాయం కోసం వచ్చిన వందలాది మంది మహిళల అనుభవాలను పచ్చిగా, నగ్న వాస్తవికతతో రాసిన, రాస్తున్న ఒకే ఒక రచయిత్రి డాక్టర్ గీతాంజలి గారు. ‘ఒక మహిళ తన శరీరంపై తనకే హక్కు ఉందని ఇప్పటికీ నిరూపించుకోవాల్సి వస్తే, అది ఆమె ఓటమి కాదు… మన సమాజం వైఫల్యం. ఇక ప్రశ్న ఒక్కటే. ఒక స్త్రీ “వద్దు” అనే మాటను గౌరవించలేని దేశం మనిషితనం గురించి మాట్లాడే అర్హత ఉందా?’ అంటూ సమీక్షకురాలు అనూష గారు రాసిన చివరి వాక్యం ఈ సమాజం మొ్త్తానికి మహిళలు సంధించిన పొలికేక అని చెప్పాలి. ఓల్గా, మల్లీశ్వరి (జాజిమల్లి) వంటి పఠనీయతకే పాఠం నేర్పే మంచి రచయితల సరసన సగర్వంగా నిలబడుతున్న శిఖర స్థాయి రచనా శైలి గీతాంజలి గారిది. మన సమాజం ఇంతగా దిగజారిపోయిందా అని రారా గారు 50 ఏళ్లకు ముందే దిగంబర కవిత్వంపై రాసిన వ్యాసంలో విమర్సించారు. కాని నేటి సమాజం అంత కంటే ఘోరంగా కుళ్లిపోయిందని. ఎలాటి భావ, హేతు, అభ్యుదయ, విప్లవ భావజాల సాహిత్యాలు కూడా ఈ సమాజపు మురికి తెట్టును అణుమాత్రం కూడా కదిలించలేకపోయాయని గీతాంజలి గారి రచనలు విప్పి చెబుతున్నాయి. భావ విప్లవ కారుడు కొకు అని అప్పట్లోనే తెలుగు సాహిత్యం ఆయనను గుర్తించింది. ఆయన తర్వాత కూడా తెలుగునేలపై పుట్టిన, పుడుతున్న భా
వవిప్లవకారులు ఎందరో.. అందరికీ వినమ్రపూర్వక నమస్సులు..