అక్కడ గోడలకు ఎర్రటి అక్షరాలతో
నినాదాల వెల్ల వేశారు
జనం కోసం రక్తతర్పణం
చిందించడానికి రాసుంటారనుకున్నాను
ఆకుల అలసత్వం కింద
కళ్ళు తేలేసిన కర్తవ్యాన్ని
ఆ నిప్పురవ్వలు వేకువ నిద్ర లేపుతాయి
మైదానం మన మాట వినదు
రాజ్యం చల్లగా రక్తాన్ని చల్లబరుస్తుంది
డొల్లబోయిన వ్యవస్థలకు చెవిటితనం వస్తుంది
న్యాయం కళ్లు మూసుకొని నడుస్తుంటే
ప్రజాస్వామ్యం అనాథలా
కాలానికి కాపలా కాస్తుంటుంది
కకావికలమైన మానవ జీవితాలు
కళ్ళల్లో జవాసత్వాల్ని కోల్పోయి
బిగిసిన పిడికిళ్ళ మధ్య
ఆకలి అస్తిత్వాన్ని మింగేస్తుంటే,
న్యాయం కోసం అడవి ఆయుధాల్ని నమ్ముకుంది
రాజ్యం డ్రోన్లకళ్లతో అడవిని జల్లెడ పడుతుంది
అనివార్య యుద్ధంలో
మానవత్వం శవాలగుట్ట అవుతుంది
రాజ్యం కార్పొరేట్ ముఖంతో,
ఖాకీ కోరలతో సంబరాలు చేసుకుంటుంది
చావుని ఊహించని మలుపులో
చిరునామా లేని ఈ రక్తచరిత్ర
చివరి మాటగా నిన్ను గుర్తు పెట్టుకుంటూనే ఉంటుంది
ఆశయాల్ని తలకెత్తుకొని
చేసిన త్యాగాలను తలుచుకొంటూ
ఊరు ఊరంతా ఊరేగింపవుతుంది
ఆయుధం అమరత్వాన్ని ఇస్తుందేమో కానీ,
తిరిగి ఆయువును మాత్రం పోయలేదు
కార్పోరేట్ కనుసన్నల్లో పావుల్ని కదుపుతూ
కార్చిచ్చులో మండుతున్న ఆదివాసీల జీవితాలు
అడవి ఎప్పటికీ అలసిపోదు
అలసిన శరీరాల అలజడిలో
ఆశయాలు ఏదో ఒకరోజు రాలిపోతాయంతే!
మనసు విప్పి నవ్వుకోలేని మృత్యు నిశ్శబ్దంలో
మీరంతా బతుకుతున్నారు
నిర్మల నీలాకాశం మిమ్మల్ని పిలుస్తోంది
మనిషిలోని స్వేచ్ఛ మనసులో స్వేచ్ఛ
మానవ సంబంధాల మధ్య స్వేచ్ఛ
రక్త సంబంధాలు వేసే సంకెళ్ళు
స్వేచ్ఛగా మారి మీకోసం ఎప్పటికీ కాచుకొని
ఊరి చివర వేచి చూస్తుంటాయి
చుట్టూనూ నీలోనూ పరికించి చూడండి!
అడవి తర్వాత ఈసారి వంతు మీదే
నీలో అడవి తిరగబడి తగలబడుతోంది.
*








లహరి కవిత్వ పయనం లో ఈ కవిత మొదటి స్థానంలో నిలుస్తుంది
ఆకుల అలసత్వం కింద కళ్ళు తేలేసిన కర్తవ్యాన్ని హైలైట్