ప్రతి మగపాత్రలోనూ అతనేనా?!

మానసిక కోణాల వల్ల పరిమితమైన వ్యక్తులని చూసినప్పుడు, వారిని మరికొంత దయతో చూడాలనిపిస్తుందే తప్ప, విమర్శించాలని ఎందుకో అనిపించదు. అలాంటి కోణాలనుంచి చూడగలిగే విధంగా మనం ఎదగగలగాలి.

కథాంతరంగం – 3

ద డార్లింగ్

The Darling (1899)

by Anton Chekhov

Russian * 29.01.1860 – 15.07.1904

చెహోవ్ గురించి చెబుతూ రేమండ్ కార్వర్ ఒక మాట అన్నారు: “చాలా కొద్దిమంది రచయితలకే సాధ్యపడినట్టు చెహోవ్ చాలా కథలని రాయడమే కాకుండా, ఆణిముత్యాల లాంటి కథలని అతను ఎంత తరచుగా సృష్టించాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎలాంటి ఆణిముత్యాలు? మనతో మనకి రాజీ కుదర్చగలిగినవీ, ఆహ్లాదాన్నీ కదలికనీ ఏకకాలంలో కలిగించేవీ, మన భావోద్వేగాలని నగ్నంగా మనకు చూపించగలిగేవీ.”

కానీ అలా చకచకా ఆణిముత్యాలని ఇచ్చిన చెహోవ్ తన మరణానికి ముందు ఐదు సంవత్సరాలలో ఒక ఏడెనిమిది కథలు మాత్రమే రాయగలిగారు. దానికి రకరకాల కారణాలున్నా, అందులో ముఖ్యమైనది తన రచనల మీద హక్కుల్ని డెబ్భై అయిదు వేల రూబుల్స్‌కి ఎడాల్ఫ్ మార్క్స్ అనే పెద్దమనిషికి 1899లో అమ్మేయడం. కొంచెం తలబిరుసు మనిషైన మార్క్స్, తన పాత రచనలనన్నింటినీ చెహోవే ఒక్క చోటికి చేర్చాలనే నిబంధన కూడా పెట్టాడు. దానితో ఆ చివరి ఐదు సంవత్సరాలూ రాసినవన్నీ రివైజ్ చేసుకోవడంలోనే చెహోవ్‌కి గడిచిపోయింది. ఆ కాలంలో రాసిన కొద్ది కథల్లో ఒకటి ఈ ‘డార్లింగ్’.

ముందు కథని చదవండి.

ఆ తర్వాత విమర్శని చదివితే, కథని మరింతగా అర్థం చేసుకోవడానికి అది ఉపకరిస్తుంది. కథకి లింక్స్ ఇక్కడ ఉన్నాయి.

ఇంగ్లీష్ (వీలైతే ఇంగ్లీష్‌లో చదవండి):

The Darling

తెలుగు అనువాదం:

డార్లింగ్ (2)

***

“డాక్టర్‌ రచయితగా ఉండటం వల్ల అతనికి రెండురకాల సమస్యలున్నాయి. మొదటి సమస్య- జబ్బుపడ్డ లోకాన్నే అతను ఎక్కువగా చూస్తుంటాడు. అతనికి జీవితం బెడ్ మీద నిస్సత్తువుగా పడుకున్న రోగిలా కనిపిస్తుంది. రెండో సమస్య- రోగనిర్థారణ చేసే తత్వం అనుకోకుండానే అలవాటయిపోయి, జీవితాలూ మనస్తత్వాలూ భౌతికమైన జడపదార్థాల్లా కనిపిస్తాయి. ఈ కారణాలవల్ల, చెహోవ్‌ రచనల్లో ఆ డాక్టర్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. జీవితాల్లోని నమూనాలని పట్టుకుని, వాటికి కారణాలు అన్వేషిస్తూ ఉంటాడు. అసంతృప్త స్థితులలో, హాస్యాస్పదమైన పరిస్థితులలో దొరికిన నమూనా పాత్రలకీ, పరిస్థితులకీ చెహోవ్‌లోని రచయిత కొంత హాస్యాన్నీ, విషాదాన్నీ అద్దుతూ ఉంటాడు. జీవితం ఇంతే అన్న స్థిరీకరణకి ఈ విధంగా రావడం ఒకరకంగా చూస్తే రచనలకి బలహీనత అవుతుంది. ఈ స్థితులకీ, ఈ సమాజాలకీ, ఈ జీవితాలకి ఆవల ఇంకేదో ఉందన్న ఆశావహ దృక్పథాన్ని మరుగు పరుస్తుంది. బహుశా అందుకే ఈ ‘డార్లింగ్’ కథలో ముఖ్యపాత్ర ఎలాంటి మార్పుకీ గురికాదు. చిన్నప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు ఈ మలివయసులో కూడా అదే అవస్థలతో ఉంది. అయితే, ఒక రచయిత ఇలాంటి పంథాని అనుసరించడానికి వీల్లేదూ అని చెప్పలేము- ప్రత్యేకించి, ఆ రచయిత తన రచనల ద్వారా ప్రాచుర్యం పొందుతున్నప్పుడు.” అన్నారు వి.ఎస్. ప్రిచెట్, చెహోవ్ కథల గురించి. ఈయన ప్రస్తావించిన విషయాలు అక్కడక్కడా ఈ వ్యాసంలో కనిపిస్తాయి. వాటి గురించి విపులీకరణ కూడా ఉంటుంది.

చెహోవ్ కథలు ఎలా బతకడమో కాదు, ఎలా బతకకూడదో చెబుతుంటాయి! కథాసంవిధానం (plot) కంటే కూడా, పాత్రచిత్రణకే చెహోవ్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడని విమర్శకులు అంటారు కానీ, పాత్రచిత్రణకి కూడా సమాన ప్రాధాన్యతని ఇస్తాడు అనడం సమంజసంగా ఉంటుంది. ఈ కథలో ప్రతి వివరం, ప్రతి సంఘటనా, ప్రతి ఇతర పాత్రా కూడా ప్రధాన పాత్ర అయిన ఓల్గాని మనకి స్పష్టంగా చూపిస్తాయి.

చెహోవ్ గురించి ఒక సందర్భంలో టాల్‌స్టాయ్ అన్న మాటలు అక్షరసత్యాలు. “చెహోవ్ చాలా వింత రచయిత. అతను మాటల్ని యథాలాపంగా రాసేసినట్టు అనిపిస్తుంది, కానీ తీరా చూస్తే ప్రతి మాటా సజీవంగా ఉంటుంది. పైగా, ఎంత అవగాహన! అనవసరమైన వివరాలుండవు. ఇచ్చిన ప్రతి వివరమూ అవసరమైనదో, అందమైనదో కచ్చితంగా అయ్యే తీరుతుంది.” ఈ పరిశీలన నేపథ్యంలో కథని మరోసారి గుర్తుచేసుకుంటే- పుస్తోవలోవ్ మరణానికి ముందు, కథలో ప్రస్తావించిన వివరం ఒకటుంటుంది: అతను టీ తాగడం గురించి. ఆ వివరానికి కూడా ప్రాముఖ్యత ఉందీ అన్నది ఒక విమర్శ చదివితే తెలుస్తుంది. అలాగే, ప్రతి మరణం తర్వాత ఓల్గా రోదించే పద్ధతుల్లో ఒక ప్రత్యేకమైన వాక్యం ఉంటుంది. మానసిక విశ్లేషణ చేసిన ఒక విమర్శ చదివాక గానీ, ఆ వాక్యం ప్రాముఖ్యత బోధపడలేదు. ఇవన్నీ ఆలోచించుకునే చెహోవ్ ఇంత పకడ్బందీగా రాసివుంటాడా? బహుశా, కాకపోవచ్చు. సరీగ్గా ఇక్కడే, టాల్‌స్టాయ్ చెప్పిన ‘అవగాహన’ అనేది ముఖ్యమైన పరిశీలన అవుతుంది. తను రాస్తున్న జీవితం గురించీ, ప్రవేశపెడుతున్న పాత్రల గురించీ సంపూర్ణమైన అవగాహన ఉన్న రచయిత వాటిని ఆవహింపజేసుకుని రాసేదంతా సహజంగా ఉండితీరుతుంది. అవసరమైన సూక్ష్మ వివరాలు కూడా అప్రయత్నంగానే రచనలోకి వచ్చి చేరతాయి. అన్నట్టు, ఈ కథ గురించి టాల్‌స్టాయ్ చేసిన విమర్శ కూడా ఈ వ్యాసంలో ఉంటుంది!

కథాపరిచయం

కథ ప్రారంభంలో ఓల్గా తన ఇంటి వెనకాల గదుల్లో అద్దెకుంటున్న కుకిన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. నాటకాల ప్రదర్శనలు ఇస్తుండే కుకిన్ ఏకధాటిగా కురుస్తున్న వర్షాలని చూసి బాధపడుతుంటాడు- ఈ వర్షాలకి జనాలు రారు అని. అసలు నాటకాలు చూసి మెచ్చుకునేవాళ్లు కూడా కరువైపోతున్నారని వాపోతూ ఉంటాడు. మొత్తానికి ఓల్గా, కుకిన్ పెళ్లిచేసుకుంటారు. చివరికి వాళ్ల పెళ్లిరోజున కూడా వర్షం పడుతూనే ఉంటుంది. కుకిన్ మొహంలో ఆ నిస్పృహ అలాగే ఉంటుంది. పెళ్లి తర్వాత, ఓల్గా కూడా కుకిన్‌కి నాటక ప్రదర్శనల నిర్వహణలో సహాయం చేస్తూ ఉంటుంది. నాటకాల నిర్వహణ గురించి కుకిన్ ఏం మాట్లాడితే తనూ అదే మాట్లాడటం ప్రారంభిస్తుంది. కుకిన్ మాత్రం వర్షాల గురించీ, ప్రేక్షకుల గురించీ వాపోవడం ఆపడు. కుకిన్ ఒకసారి పనిమీద మాస్కోకి వెళ్లినప్పుడు ఓల్గాకి ఏం చేయాలో తోచక విలవిలలాడుతుంది. పని తెమలక కుకిన్ కొన్నిరోజులపాటు అక్కడే ఉండిపోవాల్సి రావడంతో అతను ఈస్టర్ సమయానికి తిరిగొస్తానని ఓల్గాకి వర్తమానం పంపిస్తాడు. కానీ దానికి ముందే అతను హఠాత్తుగా మరణించినట్టు ఓల్గాకి టెలిగ్రామ్ వస్తుంది. ఓల్గా పూర్తిగా విషాదంలో మునిగిపోతుంది.

మూడు నెలల తర్వాత ఒకరోజు చర్చ్‌నుంచి తిరిగివస్తున్నప్పుడు, ఆ చుట్టుపక్కలే ఉండే పుస్తోవలోవ్‌తో కలిసి నడవడం జరుగుతుంది. అతను ఒక కలప డిపో మేనేజర్. అతి త్వరలోనే ఒక పెద్దావిడ మధ్యవర్తిత్వంతో ఇద్దరూ పెళ్లిచేసుకుంటారు. పుస్తోవలోవ్‌కి సహాయంగా ఓల్గా కూడా కలప డిపో‌ పనుల్లో పాలుపంచుకుంటుంది. ఓల్గా అప్పట్నుంచీ కలప గురించి ఒకటే ఆలోచించడం, మాట్లాడటం! చివరికి కలల్లో కూడా ఆ కలప దుంగలే. పుస్తోవలోవ్‌కి వినోద కార్యక్రమాలంటే బొత్తిగా ఆసక్తి లేదు కనక, ఓల్గా కూడా ఆ విషయం పూర్తిగా మర్చిపోతుంది. థియేటర్‌ని చెత్త అనేంతవరకూ కూడా వెళ్తుంది. ఆరేళ్లు వాళ్లు హాయిగా కాపురం చేసాక, ఒకసారి అతనికి జలుబు చేసి, అది పెరిగి పెద్దదై, నెలరోజుల తరువాత మరణిస్తాడు. ఓల్గా మళ్లీ విషాదంలో కూరుకుపోతుంది ఓ ఆర్నెల్లపాటు.

ఇంటి వెనకాల గదుల్లో ప్రస్తుతం అద్దెకుంటున్న వెటరినరీ సర్జన్‌ స్మిర్నిన్‌తో అప్పుడప్పుడూ టీ తాగుతూ కనిపిస్తూ ఉండేది ఓల్గా. అతనికి పెళ్లైంది, ఒక పిల్లవాడు కూడా. అయితే భార్యకున్న ఓ వివాహేతర సంబంధం వల్ల ప్రస్తుతం వాళ్లు విడిపోయి ఉంటున్నారు. పిల్లవాడు తల్లిదగ్గరే ఉంటున్నాడు. ఆ తర్వాత కొంత కాలం పాటు ఓల్గా పశువుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలే మాట్లాడుతూ ఉండటంతో, చుట్టుపక్కల వాళ్లకి విషయం చూచాయగా అర్థం అయినట్టే అనిపించింది. అయితే, అనుకోకుండా బదిలీ కావడంతో స్మిర్నిన్ అక్కణ్ణుంచి వెళ్లిపోవాల్సివస్తుంది.

తన జీవితానికి అర్థం కల్పించే మగవాడి తోడు లేక, ఎవరి అభిప్రాయాలూ తన అభిప్రాయాలుగా చేసుకోలేక ఓల్గా శుష్కించిపోవడం ప్రారంభిస్తుంది. ఖాళీగా ఉండే ఇంటి ఆవరణ మాత్రమే ప్రస్తుతం కలల్లోకి వస్తోంది. ఇంతకుముందు అందరూ తనని ‘డార్లింగ్’ అని ముద్దుపేరుతో పిలిచేవారు. ఇప్పుడు ఎదురైనా పలకరించేవారే కరువైపోయారు.

అనుకోకుండా ఒక రోజున స్మిర్నిన్ తన భార్య, కొడుకుతో తిరిగి వస్తాడు. ఉద్యోగం నుంచి రిటైరయ్యాడు, భార్యతో రాజీ పడ్డాడు. వాళ్లకి ఓల్గా తను ఉంటున్న ఇల్లు ఇచ్చి, తను వెనక ఉన్న గదుల్లోకి మారిపోతుంది. స్మిర్నిన్, అతని భార్య మధ్య సఖ్యత ఎక్కువ రోజులు సాగక, ఆమె తన చెల్లెలి ఇంటికి వెళ్లిపోతుంది. స్మిర్నిన్ ఎప్పుడు చూసినా తన పనుల్లో తను బిజీగా ఉంటాడు. చిన్నపిల్లవాడు సాషాని పట్టించుకునేవాళ్లు లేకపోయారే అని ఓల్గా వాపోతుంది. ఆ పిల్లవాడిని తనే చూసుకుందామని నిశ్చయించుకుని, అక్కణ్ణుంచీ ఆ పిల్లాడే లోకంగా బతకడం మొదలెడుతుంది. ఇప్పుడు అన్ని ఆలోచనలూ ఆ పిల్లవాడి గురించే. అతనితోనే కలిసి తినడం, హోమ్‌వర్క్ చేయడం. చివరికి అతను స్కూల్‌కి వెళుతున్నప్పుడు కూడా అతని వెనకాలే వెళుతూంటుంది. ఇది పిల్లవాడికి ఇబ్బందిగా పరిణమిస్తుంది. బైటికి ఏమీ చెప్పకపోయినా, రాత్రిళ్లు నిద్రపోతున్నప్పుడు మాత్రం “చూపిస్తా, చూపిస్తానంటున్నానుగా! పో, బయటికి! వద్దు, గొడవొద్దు!” అని కలవరిస్తూంటాడు. ఇప్పుడు ఈ బంధం ఎన్నాళ్లు నిలుస్తుందో తెలీదు. అసలా అనుమానం ఓల్గాకి ఉందా లేదా అన్నది కూడా తెలీదు.

 

కథావిశ్లేషణ

స్వంత వ్యక్తిత్వం అంటూ లేకుండా, ఒక మగవాడి తోడులో అతన్ని ప్రేమిస్తూ జీవితం గడిపేయాలనే కోరికతో కొనసాగుతూ ఉండే ఓల్గాకి తను ప్రేమించడం అనేది అవసరంగా మారింది. ఆ ప్రేమల్లోంచి అభిప్రాయాల్నీ, తద్వారా ఒక స్వల్పకాలిక అస్తిత్వాన్నీ ఏర్పాటు చేసుకోగలుగుతోంది. ఈ అస్తిత్వపు ఉనికి మనిషికి అవసరం కాబట్టి, ఒక భర్త మరణించినప్పటికీ ఎలాంటి సంకోచమూ లేకుండా వెంటనే మరో సంబంధంలోకి వెళ్లిపోతూ ఉంది. సౌందర్యం అంతరించిన వయసు మళ్లినతనంలో ఒక చిన్నపిల్లవాడికి తల్లిప్రేమని పంచేందుకు సిద్ధపడింది. అయితే, ఓల్గా ప్రేమల్లో నిస్సహాయత, తన అవసరం తప్పించి ఎదుటివారికి హాని కలిగించే లక్షణం కనిపించదు (ఈ పరిశీలన ఇప్పటికి బాగానే అనిపించినా పునఃపరిశీలించాల్సిన అవసరం వస్తుంది ఇదే వ్యాసంలో!)

కథ ప్రారంభంలో ఓల్గా సౌందర్యమే ఆమెకి ఆభరణం. అందరూ ఆమెని ‘డార్లింగ్’ అని పిలవడమే దానికి నిదర్శనం. మగవారిని ప్రేమించగలగడమే తన అసలైన ఆభరణం ఆమె నమ్మింది. ఎందుకంటే, సౌందర్యం అదృశ్యమైపోయినా మిగిలిపోయే సౌశీల్యం ఇది. కానీ కథ ముగింపునాటికి ఆమెకి సౌందర్యమూ మిగలలేదు; తన ప్రేమని గుర్తించే మగవాడూ మిగలలేదు. ఒక విధంగా కథకి పెట్టిన “డార్లింగ్” అనే శీర్షిక ఒక ఐరనీ. ఏ రకంగానూ డార్లింగ్‌గా ఆమె మిగలకపోవడమే ఇందులోని వైచిత్రి. జీవితంలో మళ్లీ మళ్లీ అదే విషాదాన్ని ఎదుర్కొంటున్న ఓల్గా మీద పాఠకులకు సానుభూతి కలగడం సహజంగా, తక్షణ స్పందనగా జరుగుతుంది.

కథని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒక వైచిత్రి బయటపడుతుంది. ఓల్గా చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు మొదటసారి ప్రేమించింది తన ఫ్రెంచ్ టీచర్‌ని. ఇప్పుడు జీవితపు మలిసంధ్యలో ప్రేమించింది ఒక చిన్న పిల్లవాడిని! కానీ ఈ వైచిత్రిలో కించిత్ విషాదం కూడా కనిస్తుంటుంది.

ఓల్గాకి చేతనకి సంబంధించిన జీవితం (conscious life) లేకపోవడమే కాదు, అసలు అంతశ్చేతనకి సంబంధించిన జీవితం (sub-conscious life) కూడా లేదు. తన కలల్లో కూడా భర్త వ్యాపారం గురించీ, కలప చెక్కల గురించిన విషయాలే తప్ప, ఆమెకే సొంతమైన ఒక మానసిక ఆవరణ అంటూ ఉన్నట్టుగా కనిపించదు. తన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నందుకు ఆగ్రహించిన స్మిర్నిన్‌ని కౌగలించుకొని, ‘మరింకే విషయాల గురించి మాట్లాడమంటావు?’ అని అతన్ని అడుగుతుంది. విషాదాన్ని మరీ వాచ్యం చేయకుండా ఇలా సున్నితంగా చిత్రించడం చెహోవ్ ప్రత్యేకత.

ఓల్గాకి పిల్లలు లేరు. కథలో ఒకే ఒక్కసారి ఓల్గాకి ఆ కోరిక ఉన్నట్టు ప్రస్తావించబడుతుంది. పుస్తోవలోవ్‌తో ఉంటున్నప్పుడు ఒకసారి వాళ్లిద్దరూ కలిసి పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. మొదటి భర్తతోనే ఓల్గాకి పిల్లలు కలిగిఉంటే ఈ కథ ఇలానే ఉండేదా అనేది అనుమానాస్పదం!

కథ చదువుతున్నప్పుడు ఒక విషయం గమనించే ఉంటారు. కథలో ఓల్గా మొత్తం ముగ్గురితో ప్రేమలో పడుతుంది. అందులో ఇద్దరు చనిపోతారు. ప్రతి మరణం తర్వాత ఓల్గా స్పందించే పద్ధతి అతినాటకీయంగా, అత్యంత తీవ్రంగా ఉన్నప్పటికీ అందులోని నిజాయితీని శంకించాల్సిన అవసరం ఉన్నట్టు పాఠకుడికి అనిపించదు. కానీ, కొద్ది నెలలలోనే మరొకరితో స్థిరపడిపోవాలనుకోవడం చూస్తే ఈ ఏడుపులన్నీ నిజమైనవేనా అన్న అనుమానం మాత్రం పాఠకుడికి కలుగుతుంది. పోయిన మనిషిని కొత్తమనిషితో రీప్లేస్ చేయడం చూస్తే, మనిషి ఎవరన్నది ఓల్గాకి అసలు ముఖ్యం కాదేమో అనిపిస్తుంది. ఆ స్థానంలో ఎవరో ఒకరు కావాలి తన అవసరానికి- అంతే. చివర్లో సాషాతో అనుబంధం కూడా, అతన్ని తల్లిదండ్రులు వదిలివేసారు అన్న సానుభూతిలోనుంచి ఉదయించిందే. తనని అందరూ అలా వదిలేసారూ అని తనమీద తనే జాలిపడగలదు కనకనే సాషాతో ఐడెంటిఫై కాగలిగింది ఓల్గా.

ఈ కథలోని ప్రేమల మీద కూడా ప్రశ్నలు రేగుతాయి. ఓల్గా తనలోని డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికీ, ఇంకొకరి మీద ఆధారపడటానికీ ప్రేమిస్తోందే తప్ప, అది సహజమైన సహానుభూతిలోనుంచి జనించిన ప్రేమలాగా అనిపించదు. అసలు, తను ఎవరిని ప్రేమిస్తోందీ అన్న విషయం పట్ల ఆలోచన, ఎంపికా ఉన్నట్టు కనిపించదు. సొంతజీవితం లేకపోవడం వల్ల ఎవరంటే వారిని – ఒక థియేటర్ ఓనర్నీ, ఒక కలప వర్తకుడినీ, ఒక పశువైద్యాధికారినీ – వాళ్ల వాళ్ల వ్యక్తిత్వాల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండానే ప్రేమించింది. ఓల్గా దృష్టిలో ప్రేమ అంటే తన ఇంటి వెనక ఖాళీ ప్రదేశాన్ని నింపుకోవడం లాంటిది. అందుకే ఆమె కలల్లో కూడా అదే. ప్రేమ అంటే తనలో అనంతంగా ఉన్న డొల్లతనపు శూన్యాన్ని నింపే వస్తువు. దానికి ఇంకో మనిషి అవసరం- అది ఎవరైనా సరే. భావోద్వేగాల కోసం ఇంకొకరి మీద ఆధారపడితే తప్ప స్వంత అస్తిత్వపు స్పృహ స్ఫురణకి రాని పాత్ర ఓల్గాది.

ఆడవాళ్లు ఏడు రకాల మూసల్లో ఉంటారని అంటారు. ఆ స్టీరియోటైపింగ్ అనేది వేరే చర్చే కానీ, ఈ కథ సబ్మిసివ్ వైఫ్‌కి మంచి ఉదాహరణ. మొదటి భర్తతో “వానిచ్‌కా, నేనూ” అంటూ; రెండో భర్తతో “వాసిచ్‌కా, నేనూ” అంటూ ఇమిడిపోయిన ఓల్గా, మూడో వ్యక్తి (వెరైటీ కోసమో ఏమో కానీ ఇతనికి ఇంతకుముందే పెళ్లయిపోయింది!) కి కూడా ఓ ముద్దుపేరు పెట్టేసింది- “వోలోడిచ్‌కా” అని. ఇలా ఏ పాత్రలో అయినా సులువుగా ఇమిడిపోయే ఓల్గాని సమాజం చాలా ఆశ్చర్యకరంగా “డార్లింగ్” అని ముద్దుచేస్తూ ఉంటుంది. ఈ అసంబద్ధతని మనం చూడాలని బహుశా చెహోవ్ ఉద్దేశం అయివుండాలి. ఎలాంటి మార్పునైనా చాలా సహజంగా స్వీకరించే ఓల్గా ఒక విధంగా చెప్పాలంటే బతకనేర్చిన మనిషి.

కథ ముగింపులో గమనిస్తే, స్మిర్నిన్ మళ్లీ తిరిగివచ్చాక, ఓల్గా తనున్న ఇంటిని వాళ్లకి ఇచ్చేసి తను ఇంటి వెనక ఉన్న గదుల్లోకి మారిపోతుంది. ఓల్గా దృష్టికోణంలోని ఈ మార్పు, బహుశా ఆమె జీవితంలో రాబోయే మార్పుకి నాంది. ఈసారి చిన్నపిల్లవాడిని ప్రేమించడం కూడా ఆ మార్పు దిశగా తొలి అడుగు పడింది. అయితే, సాషాని అభిమానించడం కూడా తనకి మగతోడు కావలసిన అవసరం నుంచి జనించిన కారణమే. అతన్ని ఫాలో అవుతూ స్కూల్‌కి వెళ్లడం, రకరకాల తాయిలాలు ఇవ్వడం- ఇవన్నీ ప్రేమని పంచి తీరాల్సిన తన అవసరం తాలూకు ఆతురతని సంతృప్తిపరచుకోవడానికే. చివరికి ఈ అభిమాన ప్రదర్శన అంతా ఆ పిల్లవాడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రస్తుతానికి ఆలోచనల్లో ఆమెని తిరస్కరించడం మొదలుపెట్టాడు.

 

కథకుడి దృష్టికోణం, విమర్శకుల దృష్టికోణం

కథకుడి స్వరాన్ని బట్టి ఇది పంధొమ్మిదవ శతాబ్దంలో స్త్రీలకున్న పరిమితమైన పాత్ర గురించీ, మగవాళ్లకి అనుబంధంగా ఉండటం తప్పించి స్వతంత్రంగా వాళ్లకంటూ ఆలోచనలూ అభిప్రాయాలూ లేని పరిస్థితిని ఈ కథ సూచిస్తుందని కథని చదవగానే మనకి అనిపిస్తుంది. 1899లో ఈ కథని ప్రచురించినప్పుడు పాఠకులు, విమర్శకుల నుంచి విరుద్ధమైన అభిప్రాయాలు వెలువడ్డాయి. రష్యన్ స్త్రీలని ఆదర్శవంతంగా చిత్రించినందుకు కొందరు దీన్ని మెచ్చుకుంటే, స్త్రీల పరిస్థితిని దిగజార్చి చూపించినట్టుగా మరికొంతమంది ఆగ్రహించారు.

“మగవాళ్లంతా మూర్ఖులు, ఆడవాళ్లంతా అద్భుతమైన వ్యక్తులూ అన్నమాట,” అన్నారు కొందరు. “ఇది స్త్రీలని అవహేళన చేయడమే,” అన్నారు మరికొందరు.

అసలు, ఓల్గా అనే ముఖ్యపాత్ర పట్ల చెహోవ్ కథన దృష్టికోణం ఏమిటి? చెహోవ్ ఈ పాత్రని ఎగతాళి చేస్తున్నాడా, లేక మగవాళ్లతో అనుబంధాలకు అతీతంగా జీవితాలని ఏర్పరుచుకోలేని ఆడవాళ్లమీద విమర్శ చేస్తున్నాడా, లేక స్త్రీలల్లోని నిస్వార్థపూరితమైన మాతృహృదయాన్ని ఆదర్శీకరించి దానిని సందేశాత్మక ధోరణిలో ప్రదర్శిస్తున్నాడా, లేక ఆర్థిక స్వాతంత్ర్యం లేని స్త్రీలు దానికోసమే కాకుండా భావోద్వేగాల విషయంలోనూ మగవాళ్ల మీద ఆధారపడక తప్పదని హెచ్చరిస్తున్నాడా అన్న చర్చ ఈ కథ రేపుతుంది. హేళనా? సానుభూతా? ఆరాధనా? అనేదాని గురించి కథ రాసిన వందేళ్లకి కూడా చర్చ జరపవచ్చు అంటే ఆ వస్తువుకి ఇంకా ప్రాసంగికత ఉన్నట్టే లెక్క. శిల్పపరంగా చెహోవ్ అనిశ్చితమైన విషయాలని యథాతథంగా ప్రదర్శించి చర్చకి ద్వారాలు తెరిచే ఉంచాడు.

చెహోవ్ తను మొదలుపెట్టినదానిని తద్విరుద్ధంగా ముగించినందుకు టాల్‌స్టాయ్ ఈ కథని మెచ్చుకున్నాడు. ఆయన దృష్టిలో, ఆ కాలం నాటి ‘అసమంజసమైన దుష్ట స్త్రీవాద ఉద్యమాల’ మహిళలకి ప్రతీకగా చెహోవ్ ఓల్గాని సృష్టించాడు. కానీ, సాషాని అభిమానించే క్రమంలో ఆమెలోని సహజమైన మాతృగుణాన్ని చెహోవ్ స్పృశించి, తను అనుకున్న దానికి విరుద్ధమైన ప్రయోజనాన్ని సాధించాడు అని ఆయన అభిప్రాయం. “సాచిపెట్టి ఒక దెబ్బవేసినా కిక్కురుమనకుండా సౌమ్యంగా ఉండే బానిస ఓల్గా,” అన్నాడు మాక్సిమ్ గోర్కీ.

టాల్‌స్టాయ్‌గానీ, గోర్కీగానీ వాళ్ల వాళ్ల వాదాలని సమర్థించుకోవడానికి కథలోని కొన్ని అంశాలని మాత్రమే తీసుకుని మిగతావి విస్మరించారు. టాల్‌స్టాయ్ అయితే మరీనూ. ‘Readings for Every Day of the Year’ అని తను సంకలనం చేసిన కథల పుస్తకంలో ఈ కథని చేరుస్తూ, తన వ్యాఖ్యానానికి అనుకూలంగా లేని వాక్యాలని కథలోనుంచి తొలగించాడట. టాల్‌స్టాయ్ మాట్లాడే స్త్రీత్వం అంతా మగవాళ్ల దృష్టికోణంలోని స్త్రీత్వం. ఇంకా చెప్పాలంటే, అది టాల్‌స్టాయ్ దృష్టిలోని స్త్రీత్వం. స్త్రీలు భర్త పట్ల పరిపూర్ణమైన ఆరాధన కలిగివుండాలనీ, తన వ్యక్తిత్వాన్నీ అస్తిత్వాన్నీ మగవాడికి దాసోహం చేయగల దాస్యభావన ఉండాలనేది అతని భావజాలం. ఈ భావజాలానికి సరిపడే అంశాలని మాత్రం కథలోనుంచి తీసుకుని, ఓల్గా ఒక పరిపూర్ణ మహిళ అని తీర్మానించాడు. స్త్రీల వేదనల పట్ల సహానుభూతి ఉన్న గోర్కీ, ఈ కథలో ఓల్గా భర్తలవల్ల బాధితురాలు కాదనే విషయాన్ని విస్మరించాడు. మాససికంగానూ, శారీరకంగానూ ఎవరూ ఆమెని హింసించలేదు; ఒక చెంపదెబ్బ కూడా వేయలేదు; ఆర్థికంగా తను స్వతంత్రురాలు. కాబట్టి, బయటి ప్రపంచంలో స్త్రీలు ఉద్యమిస్తున్న సమస్యలలాంటివి ఓల్గాకి అసలు లేనే లేవు.

మానవ ప్రవర్తనలని వివిధ వ్యక్తులు వివిధరకాలుగా విశ్లేషిస్తారు కాబట్టి పాఠకులు, విమర్శకులూ ఈ కథ గురించి రకరకాలుగా అనుకోవడానికి ఆస్కారం లభించింది. అమాయకంగా ఉండే వాడిని చూసి జాలిపడేవారూ ఉన్నారు, అవహేళన చేసేవారూ ఉన్నారు. ప్రేమనందించే వారిని కృతజ్ఞతతో స్వీకరించేవారూ ఉన్నారు, పలుచన చేసి మాట్లాడేవారూ ఉన్నారు. అందిన ద్రాక్ష పుల్లన అనేవారూ ఉంటారు! మౌలికంగా ఓల్గా పాత్రని రచయిత సృష్టించిన ఒక వ్యంగ్య పాత్రగానూ అనుకోవచ్చు, ఒక కవితాత్మకమైన పాత్రగానూ అనుకోవచ్చు (చెహోవ్ దీన్ని ఒక హాస్యకథగానే భావించాడు. కానీ, చెహోవ్ విషయంలో సాధారణంగా జరిగినట్టుగానే ఈ కథ విషయంలోనూ జరిగింది. పాఠకులూ, విమర్శకులూ మాత్రం ఈ కథలో పైపైన కనిపించే పొరల కింద పరిశీలించవలసినన ఛాయలు ఉన్నాయని భావించారు.) ఒక విమర్శకుడు చెప్పినట్టు, కథ మొదట్లో వ్యంగ్యాత్మకంగా ఉన్న కథకుడి స్వరం, కథ చివర్లో గాంభీర్యాన్ని సంతరించుకుంటుంది. “ఎంత ప్రేమిస్తుంది తను వాణ్ణి! ఇంతకుముందు ఏ అనుబంధాల్లోనూ ఇంత లోతైనది లేదు; ఇంత నిస్వార్థంగా, అనాయాసంగా, ఇంత సంతోషంగా తన ఆత్మని సమర్పించలేదు. తలుచుకుంటూంటే ఆ మాతృప్రేమ తనని మరింతగా, ఇంతలింతలుగా దహించివేస్తున్నట్టుగా ఉంది. తన పిల్లాడు కాని ఈ పిల్లాడికి, అతని బుగ్గలమీద సొట్టలకి, ఆ కాప్‌కీ తన పూర్తి జీవితం సంతోషంగా, ప్రేమ నిండిన కన్నీళ్లతో ఇచ్చేయదూ? ఎందుకు? ఎందుకంటే ఎవరికి తెలుసు?” అనే భాగంలో ఓల్గా పాత్ర పట్ల కథకుడికి సంవేదనే ఉంది తప్ప, ఎలాంటి అవహేళనా ఉన్నట్టు కనిపించదు.

 ఈ కథలోని ప్రతి మగపాత్రలోనూ ఉన్నది చెహోవేనా?

ఈ కథలోని ప్రతి పాత్రలోనూ చెహోవే స్వయంగా తగుమాత్రంగా ఉండటం ఈ కథలోని ఒక విశేషం (అసలు చాలా కథల్లోకి చెహోవ్ తనని తాను ప్రవేశ పెట్టుకుంటాడు అని ఒక విమర్శకుడి అభిప్రాయం.) కథని ఈ దృష్టితో చూస్తే ఇది తన మీద తను రాసుకున్న పారడీనా అని అనుమానం వస్తుంది.

కథలోని మగపాత్రలని చెహోవ్ జీవితం ఆధారంగా చూస్తున్నప్పుడే, ఓల్గా కూడా ఈ మగపాత్రల పట్ల ఎలా స్పందించిందో గమనిస్తే, ఆమె వ్యక్తిత్వంలోని కొన్ని సూక్ష్మమైన అంశాలు కనిపిస్తాయి.

చెహోవ్ నాటిక ‘ద సీగల్’ తొలి ప్రదర్శన 1896లో జరిగింది. ప్రేక్షకులు, విమర్శకుల దృష్టిలో అది ఒక పెద్ద ఫ్లాప్. రచయిత శ్రమనీ, కళాకారుల శ్రమనీ అర్థం చేసుకోని ప్రేక్షకుల పట్ల చెహోవ్‌కి అంతర్గతంగా కొంత నిరసన ఉండివుండటానికి ఈ సంఘటన వల్ల ఆస్కారం ఉందని మనం అనుకోగలిగితే, ఆ నిరసన పెరసానిఫైడే ఈ కథలోని కుకిన్! రసహృదయం లేని ప్రేక్షకుల ముందు నాటకాన్ని ప్రదర్శించడం గురించి కుకిన్ ఎంతగా సణుగుతుంటాడో, అదంతా చెహోవేనని మనం అనుకోవచ్చు. కానీ, ఈ కథ రాసేనాటికి చెహోవ్ అదే పరిస్థితిలో ఉంటే, తన గురించి తను అలా రాసుకుంటాడా? కచ్చితంగా రాసుకోడు. జరిగిందేమిటంటే ఈ కథ (1899) రాసేలోపల, 1898లో అదే నాటకాన్ని మాస్కో ఆర్ట్ థియేటర్ వారు కొత్తగా ప్రొడ్యూస్ చేసి ప్రదర్శించారు. అది ఊహకందనంత విజయాన్ని సాధించింది. ఈ విజయం ఉండబట్టే, చెహోవ్ వెనక్కి తిరిగి చూసుకుని కుకిన్ పాత్రని అంత సహజంగా తీర్చిదిద్దగలిగాడు. తన ప్రయత్నలోపానికి కుకిన్ వర్షాన్ని తప్పుపట్టడం, అతని యాతనని ‘విధితో పోరాటం’ గా అభివర్ణించడం, చివరికి అతని పెళ్ళిరోజున కూడా పడుతున్న వర్షాన్ని చూసి మొహం మాడ్చుకోవడం – ఇలాంటి బలహీనతలని చెహోవ్ సమర్థవంతంగా చిత్రీకరించగలిగాడు. (ఓల్గా మాత్రం అతన్ని చూసి కరిగిపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ పాత్రలోని బలహీనతలని చూడలేకపోవడమే ఓల్గా వ్యక్తిత్వపు లక్షణం!)

రెండో భర్త పుస్తోవలోవ్, ఆర్థిక నిచ్చెన మెట్లు చకచకా ఎక్కి పైపైకి వెళ్లాలనే అభిలాష ఉన్నవాడు. చెహోవ్ ఆ పాత్రని రెండు మూడు వాక్యాలలో వర్ణించేసి (“నెత్తిమీద ఒక స్ట్రా హాట్ పెట్టుకుని ఉన్న పుస్తోవలోవ్, గోల్డ్ చైన్ ఉన్న వెయిస్ట్‌కోట్ వేసుకుని వున్నాడు. ఆ ఆహార్యంలో అతను వ్యాపారం చూసుకునే మేనేజర్‌గా కంటే, డబ్బున్న భూస్వామిలాగా కనిపిస్తూ ఉన్నాడు.”), ఆ పాత్రని మనం ఒక దృశ్యంలో చూస్తున్నట్టుగా చేస్తాడు. ఈ పాత్ర పునాదులు కూడా చెహోవ్ జీవితంలో ఉన్నాయి. 1861లో భూముల్లో బానిసలుగా పనిచేస్తున్న సెర్ఫ్‌లకి విముక్తి కల్పిస్తూ రష్యా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొని వచ్చింది. చెహోవ్ తాత కూడా, అలాంటి ఒక బానిసే. అయితే, ఈ చట్టం వచ్చే ముందే కొంత డబ్బు చెల్లించి ఆ దాస్యం నుంచి విముక్తి పొందాడు. చట్టం వచ్చిన తరువాత జరిగిన సాంఘిక సర్దుబాట్లలో, ఒక కొత్త వ్యాపారవర్గం తయారయింది. చెహోవ్ తండ్రి కూడా అలాంటి చిన్న వ్యాపారస్తుడు. సెర్ఫ్‌ల చట్టం రావడానికి ఒక్క సంవత్సరం ముందు చెహోవ్ పుట్టడం, అంతకు మునుపే తాత విముక్తిని పొందటం వల్ల, కొత్తగా ఏర్పడ్డ ఆర్థిక వర్గం తాలూకు ప్రయోజనాలు చెహోవ్ కొంతవరకూ పొంది, మెడిసిన్ చదవగలిగాడు. ఈ కథలోని పుస్తోవలోవ్ కూడా సరీగ్గా అలాంటి నూతన ఆర్ధిక వర్గానికి చెందినవాడు. నూతన వర్గం ఆర్థికంగా ఇంకా ఎదగాలనుకునే కోరికని మనం ఈ పాత్రలో చూస్తాం. అందుకే ఈ పాత్ర “అతను వ్యాపారం చూసుకునే మేనేజర్‌గా కంటే, డబ్బున్న భూస్వామిలాగా కనిపిస్తూ” ఉంటాడు. పుస్తోవలోవ్‌తో ఓల్గా పెళ్లి జరిగాక, ఓల్గా కూడా ఈ వర్గానికి చెందిన మనిషిలాగా మారిపోతుంది. వాళ్ల ఆహార్యం (“ఇద్దరి శరీరాలూ ఏవో సుగంధాలని వెదజల్లుతూ ఉండగా, ఆమె సిల్క్ డ్రస్ ఒరిపిడితో చిరుశబ్దాలు చేసేది”), ఆహారం (“ఇంట్లో మంచి మంచి బ్రెడ్స్‌తో టీలు తాగుతూ, పేస్ట్రీలు తింటూ ఉండేవాళ్లు. ప్రతిరోజు మధ్యాహ్నం వాళ్ల ఇంట్లోనుంచి బీట్‌రూట్ సూప్, మటనో ఫిష్షో వంటల ఘుమఘుమలు…”) గురించి చెప్పిన వివరాల్లో ఓల్గా కూడా ఆ వర్గానికి ఎంత తొందరగా అలవాటు పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

ఓల్గా ఎంచుకున్న మూడో వ్యక్తి స్మిర్నిన్- వెటరినరీ సర్జన్. ఈ పాత్ర ఓల్గా పట్ల దయతో ప్రవర్తించిన దాఖలాలే కథలో కనిపించవు. స్మిర్నిన్ మిత్రుల దగ్గర ఓల్గా మాట్లాడినప్పుడు అతనికి కోపం వస్తుంది (“ఆవిడ భుజం గట్టిగా పట్టుకుని కోపంగా బుసకొట్టేవాడు. ‘నీకు సరీగ్గా తెలియనివాటి గురించి మాట్లాడొద్దని ఇంతకుముందే చెప్పాను. వెటరినరీ సర్జన్స్ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో దూరొద్దు. చాలా చిరాగ్గా ఉంటుంది.’”). భుజం గట్టిగా పట్టుకోవడం, కోపంతో బుసకొట్టడం లాంటివి – ప్రత్యేకించి, ఓల్గా లాంటి ‘డార్లింగ్’ పాత్రతో – అతను నిర్దయగా ప్రవర్తించగలడూ అని సూచిస్తాయి. స్మిర్నిన్ భార్య మరొకరితో సంబంధం పెట్టుకుందీ అంటే, దానికి ఇతని ప్రవర్తన కూడా కారణం అయివుండగల అవకాశం లేకపోలేదు. చివరికి ఈ పాత్ర కన్నకొడుకుని కూడా వదిలేసి బయట తిరుగుతూ ఉంటాడు. ఇంత దయాదాక్షిణ్యాలు లేని పాత్రలో చెహోవ్ తనని తాను చూసుకున్నాడా అనేది అనుమానమే అయినా, స్మిర్నిన్ ఒక సర్జన్ కావడం, చెహోవ్ ఒక డాక్టర్ కావడం మధ్య కొంత సామ్యం ఉంది. ఇలాంటి స్మిర్నిన్‌ని నిస్వార్థంగా ఓల్గా ప్రేమించిందని చెప్పటం కూడా ఆమె పాత్ర మీద చేసిన వ్యాఖ్యానమే.

మగవాడు లేకపోతే జీవితం అర్థరహితం అనుకోవడం ఓల్గా ప్రాధమిక మానసిక నిర్మాణమే అయినా, ఈ పాత్రలలోని లోపాలని ఆమె చూడలేకపోవడం కూడా ఆ వ్యక్తిత్వంలోని లక్షణమే. బహుశా ఓల్గాకి ఉన్న బలమైన అవసరం ఈ లోపాలను ఉపేక్షించేలా చేసి ఉండవచ్చు. ఏది ఏమైనా, ఇలాంటి వ్యక్తులతో ఓల్గా సంతోషంగానే ఉందని కథకుడు మనకి నచ్చచెప్తూనే ఉన్నా, ఆయా పాత్రలని లోతుగా చూస్తూ ఉన్నప్పుడు- ఈ వ్యక్తులతో ఎవరైనా సంతోషంగా ఉండటం సాధ్యమేనా అన్న ప్రశ్న ఎదురవుతుంది.

స్త్రీవాద విమర్శ

ఓల్గాలోని అందమంతా, అక్కడక్కడా కనిపించే సౌందర్యపు విశేషాలు. బొద్దుగా ఉండటం, నున్నగా ఉండటం, తెల్లటి మెడ, దానిమీద ఒక అందమైన పుట్టుమచ్చ, గుండ్రటి భుజాలు వగైరా. సౌందర్యాన్ని ఇలా విడివిడి భాగాల సమాహారంగా చూపించి, ఆమెని తదేకంగా చూడగలిగిన వస్తువుగా, తాకిచూడాలనిపించే వస్తువుగా (కామోద్దీపన కలిగించగల అంశాలు) చిత్రిస్తుంది ఈ కథ. ఓల్గాతో పెళ్లాయ్యాక కుకిన్, “ఆమె మెడనీ, బొద్దుగా ఆరోగ్యంగా ఉన్న ఆమె భుజాల్నీ దగ్గరనుంచి పరిశీలనగా చూసిన అతను ఉద్వేగంతో, “ఓ, డార్లింగ్!” అంటాడు. ఆమె శరీరం బొద్దుగా, నున్నగా, గుండ్రంగా ఉండవచ్చు. కానీ, లోపల అంతా డొల్లగా ఉంటుంది. ఆ డొల్లతనం వల్లనే భావవ్యక్తీకరణ చేయలేని అశక్తత. దాన్ని మరికొంత ప్రతీకాత్మకంగా తీసుకుంటే, అది పునరుత్పత్తి చేయలేని అశక్తత.

జీవితంలో మగవాడి పాత్ర లేనప్పుడు ఓల్గా మానసికంగానూ, భౌతికంగానూ చాలా యాంత్రికంగానూ నిరాశాపూరితంగా ఉంటుంది. కథ ప్రారంభంలో, ఇంటికి యువరాణిలాగా ఉన్న ఓల్గా, “ఇంటివెనక ఆవరణలో కూర్చుని దీర్ఘాలోచనలో పడిపోయి ఉంది. వాతావరణం చాలా వేడిగా ఉంది; పైగా ముసురుకొని విసిగిస్తున్న ఈగలొకటి. ఇక త్వరలోనే సాయంత్రం కాబోతూందన్న ఆలోచనే ఆహ్లాదకరంగా ఉంది.” సాయంత్రం కాబోతోందన్న ఆలోచనా స్థాయికి మించి ఆ మెదడులో మరేమీ జరగడం లేదు. కుకిన్ మాస్కోకి వెళ్లినప్పుడు ఓల్గా ఆలోచనల స్థాయి ఇలా ఉంటుంది: “తనని తాను కోడిపెట్టలతో పోల్చుకుంది. పుంజు లేనప్పుడు అవి ఎంత ఆందోళనగా ఉంటాయి కదా అనుకొంది.” భర్తలు మరణించినప్పుడు, వాళ్లు తనని కావాలని వదిలేసి వెళ్లినట్టు ఆమె ఏడ్చే ఏడుపులు కూడా తంతుకి తగ్గట్టుగా ఉంటాయి కానీ, ఆమెలో హుందాతనం ఉందని చూపించడానికి ఏరకంగానూ ఉపకరించవు.

ప్రారంభంలో తను ఎంతగానో ప్రేమించే తండ్రి కథ మధ్యలో ఎక్కడో మరణిస్తాడు (“నిజానికి ఆమె ఇప్పుడు చాలా ఒంటరి అయిపోయింది. ఆమె తండ్రి చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఆయన వాడుతూ ఉండే పడకకుర్చీ ఒక కాలు విరిగి అటకమీదకి చేరి ప్రస్తుతం దుమ్ము కొట్టుకుపోయి ఉంది.”). కుకిన్‌తో పెళ్లయ్యాక అతను మాత్రం “ఇంకా సన్నగా అయిపోతూ, ఇంకా ఇంకా పాలిపోతూ…” ఉండేవాడు. పుస్తోవలోవ్ కూడా ఆకస్మికంగా మరణించినట్టు కథలో ఉంటుంది కానీ, నిజానికి అతను కలప డిపోలో ఓల్గా చేసిచ్చిన “…వేడి టీ తాగి, కలప డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన పుస్తోవలోవ్‌కి జలుబు పట్టుకుని, జబ్బుపడ్డాడు.” అందంగా అమాయకంగా కనిపించే ఓల్గాలో ఇలాంటి మంత్రగత్తె తాలూకు ఛాయలున్నట్టూ, ముగ్గురి మరణానికి చాలా చాలా పరోక్షంగా అయినా సరే కారణం అయినట్టూ కథనాన్ని జాగ్రత్తగా చదివితే అనిపిస్తుంది. ఇలాంటి ఓల్గాకి ఒక నల్లపిల్లి ఉండటం కూడా గమనించవచ్చు! అయితే, పాత్ర తాలూకు ఈ ఛాయలన్నీ, ‘డార్లింగ్’, ‘చిట్టి హృదయం’ అనే పదాల కింద కప్పెట్టబడి ఉంటాయి (ఈ కథకి రష్యన్ శీర్షిక dushechka. రష్యన్ భాషలో dusha అంటే ఆత్మ. dushechka అంటే చిన్నఆత్మ అని. ఆలంకారికంగా చిట్టిహృదయం అని అర్థం చెప్పుకోవచ్చు). ఈ కోణంలోనుంచి చూస్తే, మగపాత్రలతో తనని తాను ఐడెంటిఫై చేసుకునే ఓల్గా తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం లేదు. ఇతరుల అస్తిత్వాలలోకి ప్రవేశిస్తోంది, వాటిని ఆక్రమిస్తోంది, అంతిమంగా వాటిని కబళించివేస్తోంది.

ఫ్రెంచ్ ఫెమినిస్ట్ Hélène Cixous ప్రకారం, స్త్రీశక్తి (భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, లైంగిక శక్తులు)ని – దీనికి ఫ్రెంచ్‌లో ఆవిడ వాడిన పదం jouissance – అణిచివేయడం ద్వారా వాళ్ల గొంతుల్ని కూడా నొక్కేయవచ్చు. ఆ శక్తి తలెత్తి ప్రశ్నించినచోటా, విమర్శించిన చోటా దానికి హిస్టీరియా అని పేరు పెట్టడం కూడా పితృస్వామ్య సంస్కృతి అలవరచుకున్న అణచివేత ఆలోచనే. ప్రత్యక్షమైన హింసో, లేక పరోక్షంగా లౌక్యంగా మాతృమూర్తి అనే కిరీటాలు తగిలించడం ద్వారానో ఈ శక్తిని అణచివేయడానికి పితృస్వామ్యం మార్గాలు కనిపెట్టేసింది. దురదృష్టవశాత్తూ, ఆ తరహా ఆలోచనా విధానం స్త్రీల మనసుల్లో కూడా తరతరాల సాంస్కృతిక వారసత్వంగా జీర్ణించుకుని పోయింది. ఈ కథలోని ఓల్గా, తన jouissance ని మళ్లించుకోవడానికి, పితృస్వామ్య సమాజం ఆమోదముద్ర ఉన్న మాతృస్థానం దక్కించుకుంది. “ఎంత ప్రేమిస్తుంది తను వాణ్ణి! ఇంతకుముందు ఏ అనుబంధాల్లోనూ ఇంత లోతైనది లేదు; ఇంత నిస్వార్థంగా, అనాయాసంగా, ఇంత సంతోషంగా తన ఆత్మని సమర్పించలేదు. తలుచుకుంటూంటే ఆ మాతృప్రేమ తనని మరింతగా, ఇంతలింతలుగా దహించివేస్తున్నట్టుగా ఉంది. తన పిల్లాడు కాని ఈ పిల్లాడికి, అతని బుగ్గలమీద సొట్టలకి, ఆ కాప్‌కీ తన పూర్తి జీవితం సంతోషంగా, ప్రేమ నిండిన కన్నీళ్లతో ఇచ్చేయదూ? ఎందుకు? ఎందుకంటే ఎవరికి తెలుసు?” పై సైద్ధాంతిక వివరణతో “ఎందుకు?” అన్న ప్రశ్నకి సమాధానం ఊహించడం పెద్ద కష్టం కాదు. తన jouissance ని మళ్లించడానికి అంతిమ సాధనం – తల్లి అనే హోదా – ఇప్పుడు దక్కింది కాబట్టి, ఆమె శోధన పరిసమాప్తమయ్యింది. అందుకు. ఈ హోదాకి గౌరవమూ ఉంది; ఇంకొకరి భాషని మాట్లాడినా ఇప్పుడు దాన్ని ఎవరూ అవహేళన చేయని వెసులుబాటూ ఉంది.

కథలోని ఈ భాగంలో భాష మారింది. కవితాత్మకమైన భాష అని కాదు ఉద్దేశం. మొదట్లో చెప్పిన రష్యన్ శీర్షిక చిన్న ఆత్మ/చిట్టి హృదయం (దానికి చేసిన ఇంగ్లీష్ అనువాదం ‘డార్లింగ్’. కానీ కాసేపు దాన్ని మర్చిపోదాం. చిన్న ఆత్మ/చిట్టి హృదయం అనే అనుకుందాం, గొప్ప అనువాదం కాకపోయినా!) అనేది ‘డార్లింగ్’ రూపంలో కథ అంతా కొనసాగుతూనే ఉంది. కథలోని ఈ భాగంలోనే మొట్టమొదటిసారిగా ‘ఆత్మ’ అనే మాటని రచయిత వాడాడు- “ఇంత సంతోషంగా తన ఆత్మని సమర్పించలేదు.” కథనంలో తొలుత వాడిన భాషాసూత్రం ఇక్కడ మారి, పాత్ర/కథనంలోని మార్పుని పట్టి ఇస్తుంది. ఓల్గా ఇప్పుడు స్వీకర్త స్థానం నుంచి దాత స్థానానికి మారింది.

దూరం నుంచి వినోదం చూస్తున్నవాడిలా మొదట్లో కథనం చేసిన కథకుడు, ఓల్గాకి తనదైన భాష లేదని పరోక్షంగానే హేళన ధ్వనింపజేసిన కథకుడు, కథ చివర్లో ఓల్గాకి కొత్త సొంతభాషని చేకూర్చాడు. అయితే, ఈ భాష నిజానికి కొత్తదేమీ కాదు. పితృస్వామ్యపు భావజాలం నిర్దేశించిన మాతృత్వపు ప్రేమభాషని ఓల్గా మాట్లాడుతున్నందుకు ఇది కవితాత్మక రూపంలో పితృస్వామ్యం అందించే ప్రశంస మాత్రమే.

‘పరిపూర్ణ’ స్తీగా మారి, ‘మాతృ’భాష మాట్లాడుతున్న ఓల్గా, అటుపక్కనుంచీ ఇటుపక్కనుంచీ కూడా మాట్లాడగల చెహోవ్ లౌక్యాన్ని బైటపెట్టడం ద్వారా ఒకరకంగా తన నిరసన తెలియజేసింది!

ఇలాంటి కథల్లో స్త్రీని ఇలా చిత్రించిన చెహోవ్, కథని ఆబ్జెక్టివ్‌గా చెబుతాడని ఎలా నమ్మడం అని ప్రశ్నించే స్త్రీవాదులు ఉన్నారు. చెహోవ్ స్త్రీపాత్రలని పరిశీలించి వాటిని ప్రశంసించినవాళ్లూ ఉన్నారు. చెహోవ్‌కి ఉన్న సాంస్కృతిక మూలాలనీ, అతని వ్యక్తిత్వలక్షణాలనీ పరిగణనలోకి తీసుకోకుండా ఆ ప్రశంసలని ఆయా విమర్శకులు చేసారని అవతలి పక్షం విమర్శకుల ఫిర్యాదు.

అంతిమంగా, చెహోవ్ స్త్రీపక్షపాతి కాకపోవచ్చు గానీ, స్త్రీద్వేషి అయితే మాత్రం కాదు అనిపిస్తుంది. సాంస్కృతిక వారసత్వాన్ని మౌనంగా అందుకుని, అది అలాగే కొనసాగేలా బహుశా ఒక నిమిత్తమాత్రపు పాత్రని ధరించాడేమో అనిపిస్తుంది!

 

మానసిక విశ్లేషణ: The “as-if” personality

మానసిక శాస్త్రవేత్తలు నాలుగు దశాబ్దాల తర్వాత గమనించిన విషయాన్ని చెహోవ్ ముందే తన కథలో ప్రవేశపెట్టాడంటే, మానవ మనస్తత్వాల గురించి అతని పరిశీలనకి ఎంత విస్తృతి ఉందో అర్థమవుతుంది. ఈ కొత్త సిద్ధాంతం వెలుగులో కథని పునర్మూల్యాంకనం చేయగలిగిన అవకాశం ఉంది.

సిగ్మండ్ ఫ్రాయిడ్‌తో కలిసి పనిచేసిన హెలెనె డాయిచ్ అనే మానసిక విశ్లేషకురాలు 1940లలో భావతీవ్రతల ఒడిదుడుకులకు సంబంధించి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం కొంతమందికి తమ తమ జీవితాలతో ఉన్న సంబంధం పైకి మామూలుగానే కనిపిస్తూనే ఉన్నా, ఆ జీవితం సంపూర్ణంగా ఉన్నట్టు భ్రమ కలిగిస్తునే ఉన్నా, అంతర్గతంగా అందులో ఒక నిజాయితీ లోపించి ఉంటుంది. ఇలాంటి స్థితి ఉన్న వాళ్లని “as-if” personalities అంటారు. వీళ్లకి ప్రేమల విషయంలో ఒక వెలితి ఉంటుంది. ఇతరులతో తమని ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా వాళ్లతో ఒక మిథ్యాసంబంధాన్ని ఏర్పరచుకుంటారు. అలాంటి సంబంధంలో అవతలి వాళ్లని అనుకరించగలగడం లోనే వీళ్లకి వాస్తవం తాలూకు స్పృహ కలుగుతూ ఉంటుంది. ఈ అనుకరించడం అనేది వాళ్లకి కావలసిన మిథ్యాసంబంధం కోసం చేస్తారు తప్పించి, అవతలి వాళ్ల విలువల పట్ల ప్రత్యేకమైన గౌరవం ఉండటం వల్ల కాదు. ఈ డొల్లతనం, భావోద్వేగ రాహిత్యం బయటపడినప్పుడు, సంబంధంలోని అవతలి వాళ్లు వీళ్లతో తెగతెంపులు చేసుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు, ఈ “as-if”’ వ్యక్తులు వెంటనే ఒక కొత్త సంబంధాన్ని వెతుక్కుంటారు. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది, ఒక కొత్త ఐడెంటిఫికేషన్ కోసం అన్వేషణ జరుగుతూనే ఉంటుంది.

ఇలాంటి సంబంధాల మీద కొనసాగేవాళ్లు దానినుంచే శక్తిని పుంజుకుంటూ ఉంటారు. కుకిన్‌తో పెళ్లయ్యాక, “ఓలెంకా కొద్దిగా ఒళ్లు చేసింది. లోపల నిండిపోయివున్న సంతృప్తి ఆమె శరీరానికి ఒక ప్రకాశాన్ని ఇచ్చేది. కుకిన్ మాత్రం ఇంకా సన్నగా అయిపోతూ, ఇంకా ఇంకా పాలిపోతూ, విపరీతమైన నష్టాలు వస్తున్నాయని వాపోతూ ఉండేవాడు…”. ఈ సంబంధం ఓల్గాకి పనికివచ్చినట్టుగా పాపం కుకిన్‌కి కలిసిరాలేదు. కుకిన్ చనిపోయాక ఓల్గా ఏడుస్తూ, “.. ఇప్పుడీ ఓల్గాకి ఎవరు దిక్కు?” అని ఏడుస్తుంది. (“To whom can your poor unhappy Olenka turn to now?” అనే వాక్యం Ann Dunnigan చేసిన అనువాదంలో ఉంటుంది. Richard Pevear అనువాదంలో గానీ, Constance Garnett అనువాదంలో గానీ ఈ వాక్యం కనిపించదు!) కుకిన్ మరణవార్త తెలియగానే, మరో సంబంధం వెతుక్కోవాల్సిన అవసరం గురించి ఓల్గా నోటివెంట అప్రయత్నంగానైనా సరే వెలువడటం ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం. అనుకున్నట్టుగానే మూడునెలల్లోనే పుస్తోవలోవ్‌తో ఓల్గా పరిచయం, పెళ్లి జరిగిపోతాయి.

అతి త్వరలోనే పుస్తోవలోవ్‌తోనూ, కలపతోనూ ఓల్గా పెంచుకున్న అనుబంధం (కలప దుంగలు ఆమె కలలలోకి వచ్చేటంతగా) చూస్తే- తమ అస్తిత్వానీ, బాహ్యప్రవర్తననీ పరిస్థితులకి అనుగుణంగా మార్చుకుంటానికి ఈ ‘యాజ్-ఇఫ్’ వ్యక్తులు ఎంత సిద్ధంగా ఉంటారో అర్థమవుతుంది. కుకిన్ ఉన్నప్పుడు థియేటర్‌తో ఎంత పెనవేసుకుపోయిందో, దాన్నంతా చాలా తేలిగ్గా విస్మరించి (ఆ తర్వాత దాన్ని విమర్శించి కూడా. “అసలయినా, ఆ థియేటర్ల వల్ల ఏమిటి ప్రయోజనం?”), అవకాశం దొరికిన మరుక్షణం ఇంకో ఓల్గాగా మారిపోయింది. దురదృష్టవశాత్తూ, పుస్తోవలోవ్ కూడా మరణించాక, ఓల్గా రోదన మళ్లీ అదే: “Whom can I turn to, my darling?” (ఈ వాక్యం కూడా Ann Dunnigan అనువాదంలోనే ఉంది).

తరువాతి దశలో పరిచయం పెరుగుతూ ఉంది అనుకుంటున్న సమయంలో స్మిర్నిన్ కూడా వెళ్లిపోయినప్పుడు, ఓల్గాకి ఆధారపడదగిన వ్యక్తి దొరక్క, వాస్తవ స్పృహ పూర్తిగా పోతుంది. “…ఇప్పుడు ఆమెకి ఏ అభిప్రాయాలూ లేవు. తన చుట్టూ ఉన్న వస్తువులని చూస్తూనే ఉంది, తన చుట్టూ జరుగుతున్నవి చూస్తూనే ఉంది, కానీ వాటి గురించి ఆమెకి ఎలాంటి అభిప్రాయాలూ లేవు; వాటిగురించి ఏం మాట్లాడాలో కూడా తెలీదు. అసలు ఎలాంటి అభిప్రాయమూ లేకపోవడం ఎంత దారుణం! ఉదాహరణకి, నీకు అక్కడో సీసా కనబడుతోంది, లేదూ వర్షం పడుతోంది, లేదూ ఎవరో రైతు ఎడ్లబండి తోలుకుంటూ వెళుతున్నాడు అనుకుందాం. ఆ సీసాకానీ, ఆ వర్షం కానీ, ఆ బండి కానీ ఆయా పరిస్థితులలో ఎందుకున్నాయీ, అవి నీకు ఎలాంటి వాస్తవిక స్పృహని కలగజేస్తున్నాయీ అన్నవి నువ్వేమీ చెప్పలేకపోతున్నావన్నమాట. కుకిన్ ఉన్నప్పుడూ, పుస్తోవలోవ్ ఉన్నప్పుడూ, చివరికి వెటరినరీ సర్జన్ స్మిర్నిన్ ఉన్నప్పుడు కూడా ఓలెంకా అన్నింటి గురించి వివరించగలిగేది, దేనిగురించైనా సరే అభిప్రాయం చెప్పగలిగేది. కానీ ఇప్పుడు ఆమె ఆలోచనల్లోనూ, ఆమె హృదయంలోనూ ఆ ఇంటివెనక ఖాళీస్థలంలో ఉన్నలాంటి ఖాళీతనమే ఉంది. అసలంతా చేదుగా, వగరుగా ఉంది.” అని కథకుడు చెప్పిన ఈ కథనంలో ఆ స్పృహ కోల్పోవడం గురించి సమగ్ర ప్రస్తావన ఉంది!

కథలో ఎక్కడా ఓల్గా తల్లి గురించిన ప్రసక్తి ఉండదు. కథలో ఓల్గా తండ్రిని ప్రస్తావించిన రెండుసార్లూ అతని జబ్బు గురించే చెప్పబడుతుంది. బహుశా తల్లిదండ్రుల ప్రేమ పొందలేకపోయిన ఓల్గా, సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకోలేక, ఇతరుల మీద ఆధారపడటానికి అలవాటు పడింది. అందులోనే తన అస్తిత్వాన్ని వెతుక్కోవడం ప్రారంభించింది.

మానసిక కోణాల వల్ల పరిమితమైన వ్యక్తులని చూసినప్పుడు, వారిని మరికొంత దయతో చూడాలనిపిస్తుందే తప్ప, విమర్శించాలని ఎందుకో అనిపించదు. అలాంటి కోణాలనుంచి చూడగలిగే విధంగా మనం ఎదగగలగాలి.

 కొసమెరుపు

Ralph E. Matlaw సంకలనం చేసిన Anton Chekhov’s Short Stories (Norton Critical Edition) అనే పుస్తకంలో, చెహోవ్ గురించి మాక్సిమ్ గోర్కీ రాసిన ఒక మంచి వ్యాసం ఉంటుంది. చెహోవ్‌తో తన అనుభవాలు కొన్నింటిని ఈ వ్యాసంలో పేర్కొన్నాడు గోర్కీ.

టాల్‌స్టాయ్ ఈ కథని చాలా మెచ్చుకుంటూ, “ ఒక పనిమంతురాలు అల్లిన లేస్‌లాగా ఉంటుంది ఈ కథ. పాతకాలంలో అలాంటి అమ్మాయిలు ఉండేవాళ్లు- తమ జీవితకాలపు కలలని ఆ అల్లికలలోకి ఇష్టంగా చొప్పించేవారు. అలాంటి అల్లిక ఈ కథ….” అన్నాడు చెహోవ్‌తో- చాలా ఉద్వేగంతో, కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా.

చెహోవ్‌కి ఆ రోజు కొంచెం జ్వరంగా ఉంది. మొహం కూడా మారిపోయి, అలా తలదించుకుని తన కళ్లజోడు తుడుచుకుంటూ కూర్చున్నాడు. కాసేపు ఏమీ మాట్లాడలేదు. చివరికి ఒక నిట్టూర్పుతో, కొంచెం నెమ్మదిగా ఇబ్బందిగా అన్నాడు.

“ఆ కథలో చాలా అక్షరదోషాలున్నాయి.”

చెహోవ్ అన్న ఆ ఒక్క వాక్యానికీ చాలా అర్థాలు చెప్పుకోవచ్చు. మళ్లీ అదో వ్యాసం అవుతుంది. మనం చదివిన అనువాదం అక్షరదోషాలు సరిదిద్దిన మూలకథ నుంచే చేసారని మాత్రం ప్రస్తుతానికి ఆశిద్దాం!

*

కథలోని వివిధ కోణాలని గుర్తించడానికీ, వ్యాసం రాయడానికీ ఈ క్రింది విమర్శకుల వ్యాసాలు తోడ్పడ్డాయి:

Beverly Hahn • Donald Rayfield • Harold Bloom • Irina Kirk • James Wood • Leo Tolstoy • Liz Brent • Maxim Gorky • Milla Bayuk • Nadya Peterson • Priscilla Long • Renato Poggioli • Robert Lynd • Seymour Lainoff • Svetlana Evdokimova • Thomas G. Winner • V.S. Pritchett

ఎ.వి. రమణమూర్తి

సాహిత్యం, ముఖ్యంగా కథాసాహిత్యం అంటే అభిమానం. వాటికి సంబంధించిన విమర్శ కూడా!
ముప్ఫై యేళ్ల బాంక్ ఉద్యోగం నుంచి ఐ.టి. మేనేజర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత, సాహిత్యాన్ని మరింత దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. గత ఐదారేళ్లుగా వర్తమాన కథాసాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తూ, దానిలో భాగంగా కథాసాహితి వారి కథ-2015 కి గెస్ట్ ఎడిటర్‌‌గా వ్యవహరించారు. శ్రీకాకుళం 'కథానిలయం' కోసం సాంకేతిక సహకారం అందిస్తున్నారు. అడపాదడపా పత్రికల్లో వ్యాసాలూ, సమీక్షలూ. హైదరాబాద్‌లో నివాసం.

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రమణమూర్తి గారు
    మీ వ్యాసం ఒక బహుముఖ వ్యాయామం…కథ చదివే వారికి…
    మంత్రగత్తె రోల్ తప్ప మిగిలినవి కాస్త అర్థం అయ్యాయి అండీ…as if మనస్తత్వాలు ఎదురు పడినా, తెలిసినా, ఇదమిద్ధంగా వర్ణించలేని category. మొత్తానికి భలే కొత్త విషయాలు తెలిసాయి. మీకు ధన్యవాదాలు…వందనం…

    • థాంక్స్, శైలజ గారూ! Witch అనే భావన కొంత నెగటివ్‌గా ఉండటం వల్ల, ‘ఇలా కూడా ఆలోచించవచ్చా?’ అన్న విస్మయంతో ఆ వాదన తొందరగా జీర్ణం కాదు!

    • ఆ వ్యాసం ఆన్‌లైన్‌లో ఎక్కడా ఉన్నట్టుగా లేదు, రామయ్య గారూ! దాన్ని నేను ఉదహరించిన పుస్తకంలో చదివాను…

  • విశ్లేషణకి ముందు, కథ చదువుతున్నపుడే మంత్రగత్తె తత్వం లీలగా తోచింది. ఇంత చదివీ ఏం కానట్టు ఓల్గాతో ప్రేమలో పడిపోయాను

    • పైన శైలజ గారి కామెంట్‌కి రిప్లైలో చెప్పినట్టు, ఆ witch అనే కాన్‌సెప్ట్‌ని అంగీకరించాలనిపించదు. కానీ విమర్శలో అదో కోణం! 🙂

  • చాలా విస్తృతమైన పరిశీలనకు ధన్యవాదాలు!

    కప్పిపుచ్చుకోవడం ఇంకొకళ్ళ కోసం, నింపుకోవడం తనకోసం అన్న అర్థంలో, ఆమె మగవాడి ఆలంబనకోసం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నది తనలోని ఖాళీని నింపుకోవడానికి అని మాత్రమే అని నాకు అనిపించింది తప్ప డొల్లతనాన్ని “కప్పిపుచ్చుకోవడానికి” అని మాత్రం కాదు.

    “మంత్రగత్తె” పరిశీలన మీరు ఉటంకించిన వ్యాసాల్లో ఎక్కడయినా ఉన్నదా?

    • కాలగమనాలు వదిలేస్తే చాలా సాధారణ కథ లా అనిపించింది మొదట. కానీ మీ మీరు ఉటంకించిన రివ్యూలు, మీరు జత చేసిన మీ అభిప్రాయాలతో ఒక పాత్రని ఇంతలా dissect చేసి analyse చేయొచ్చా అని ఆశ్చర్యపోయా. చాలా కొత్తవిషయాలు తెలుసుకున్నాను. చాలా మంచి రచన. ధన్యవాదాలు.

      • మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు, స్వప్న గారూ!

    • థాంక్స్, శివకుమార శర్మ గారూ! ఈ ‘witch’ అనే కాన్‌సెప్ట్‌ని Nadya Peterson రాసిన “The Languages of ‘Darling'” అనే వ్యాసంలో చదివాను.

  • Enjoying this column Ramanamurthy gaaru.
    Tongue-in-cheek: sometimes Russians overanalyse too much, especially if they think it is ‘art’ 🙂 🙂
    in general, there is a kind of very deep, and very specific “ontological pain” in their art. perhaps it is because as a culture they could not entirely surrender their ‘psyche’ to the idea of “sin” – again, probably because the anatolian/greek orthodox church used to be quite strong in Russia. Both Gurdjeiff and Ouspensky have written about this.

    talking about the concept of “witch” in this story – in the first two cases, the men allowed her to become their image, and they encouraged her – and so, her “tea” works on them, whereas in the third case, the doc., used her, but did not give his “little soul” to her, it was only his shadow that she could possess, and therefore he survived 🙂 🙂

    but, to me, this sentence is the key (which throws a completely different light on the story):
    “An island,” he read, “is a piece of dry land surrounded on all sides by water.”
    thanks
    nagaraju

    • థాంక్స్ నాగరాజు గారూ – మీకు నచ్చుతున్నందుకూ, సమయం తీసుకుని నాలుగు మాటలు చెప్పినందుకూ!

      Psyche, Sin ల పట్ల మీ పరిశీలన బాగుంది. ముందుముందు, ఈ దృష్టితో చదవగలననుకుంటున్నాను. మీరు ఉదహరించిన ఇద్దరు విమర్శకుల రచనలు చదవాలి- వీలైతే.

      ఐలెండ్ గురించీ, కథ ముగింపు గురించీ Nathan Rosen రాసిన ఒక వ్యాసం ఉంది. సాషా కలవరిస్తున్నది అసలు ఓలెంకాకి వ్యతిరేకంగా కాదు, అది అతను స్కూల్లో ఎవరితోనో పడ్డ గొడవ గురించీ అన్నది ఈ విమర్శ అభిప్రాయం. “Ia ttebe! Poshël von! Ne deris’!” అనే ఒరిజినల్ రష్యన్ ముగింపుని తీసుకుని Nathan Rosen రాసిన విశ్లేషణ బాగుంటుంది. కానీ వ్యాసవిస్తరణభీతిచేత అవన్నీ ఈ వ్యాసంలో చేర్చలేదు.

      ధన్యవాదాలు, మరోసారి!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు