ప్రతి ఉద్యమం వెనుక వెంటాడే పశ్చాత్తాపం 

నేను రాసిన కథల్లో నాకు చాలా ఇష్టమైన కథలున్నాయి. అయితే రచయితగా “ఆహా! కథ ఏం రాసాన్రా” అని గర్వపడ్డది మాత్రం ఈ కథ రాసినప్పుడే. అతితక్కువ టైంలో రాసిన కథ కూడా. ఈ కథ రాయడానికి రెండు రోజులే పట్టింది. ఇందులో నన్ను ఎక్కువగా ఎక్సైట్ చేసిన అంశం నేను కథ చెప్పడానికి ఉపయోగించిన సింబాలిజం. నేను అనుకున్న అర్థాన్ని ఇచ్చేందుకు ఎంచుకున్న ఒక మెటాఫర్. ఆ మెటాఫర్‌నే కథకు మకుటంగా పెట్టాను.

2020 సెప్టెంబర్‌లో మోదీ ప్రభుత్వం మూడు నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చింది. ఈ చట్టాలు భారతీయ వ్యవసాయ రంగాన్ని మారుస్తాయని, పది లక్షల మంది రైతులను శక్తివంతం చేస్తాయని ప్రధాని పేర్కొన్నారు. కానీ వీటిపై బోలెడంత వ్యతిరేకత వచ్చింది. ఇవి రైతులకు హానికరమైనవని కొందరు ఆర్థికవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ ఛత్తీస్‌గడ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం నొక్కి పెట్టే ప్రయత్నం చేసింది. రైతుల మీదకు బాష్పవాయువు ప్రయోగించింది. పోలీసులు విచక్షణ లేకుండా రైతులను బాది చెదరగొట్టారు. ఆ పనిలో చాలాసార్లు వాళ్ళు విజయం సాధించారు. ఈ క్రమంలో కొంతమంది చనిపోయారు. చివరకు కేంద్రం ఆ చట్టాలను రద్దు చేసింది. ఇదంతా అందరికీ తెలిసిందే!

ఈ వార్తలన్నీ పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లోనూ చూస్తూ ఉన్నాను. అందులో నన్ను ఎక్కువగా ఆలోచింపజేసింది ఒకటే. ఉద్యమం చేసే వాళ్ళని నిలువరించి ఉద్యమాలను చంపేసి విజయగర్వంతో నిలబడ్డ పోలీసులు. వాటి గురించి అందమైన తప్పుడు కథలల్లే మీడియా. వీళ్లు తమ మనస్సాక్షికి ఎలాంటి సమాధానం చెప్పుకుంటారు? తాము చేసేది సరైనదే అని వాళ్ళు భావిస్తున్నారా? మరి ఉద్యమం చేస్తున్న ప్రజలంతా చేస్తున్నది ఏంటి?

ఎవరు రైట్? ఎవరు రాంగ్?

“సారంగ పత్రికలో రచయితల కోసం కొత్తగా ఒక శీర్షిక ప్రారంభిస్తున్నాము. దానికి నువ్వు కథ రాయాలి” అని సాయివంశీ అడిగాడు. ఆ శీర్షికకు తొలిగా నా కథతో తోరణం కడుతున్నారు. నాక్కూడా ఉత్సాహం వచ్చింది. అది 2020 డిసెంబర్ చివరివారం. క్రిస్మస్ పండక్కి ఊరికి వచ్చాను. ఏం రాయాలి అని ఆలోచిస్తున్నా.

“పొగ” కథ ఇక్కడ చదవండి.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమంపై నా భావాలను చర్చకు పెట్టాలి అనుకున్నాను. మనసులో అస్పష్టంగా తిరుగుతున్న విషయాలకు రూపం రావడం మొదలైంది. ‘కథలో ముఖ్యపాత్రని అతని పశ్చాత్తాపం పొగ రూపంలో వెంబడిస్తుంది’ అనుకోగానే వాక్యాలు చకచకా సాగిపోయాయి. అదే ‘పొగ’ కథగా రూపుదిద్దుకుంది. 2021లో జనవరి ఒకటో తేదీ సారంగపత్రికలో ‘కథలపొద్దు’ శీర్షికలో మొదటి కథగా వచ్చింది. 

ఈ కథ కేవలం రైతుల ఉద్యమం గురించి కాదు. వ్యవస్థలో భాగమైన వాళ్ళ సైద్ధాంతిక దృక్పథం గురించి. ప్రతి అంశంలోనూ దేశ నిర్మాణం కోసం నిలబడి, కలబడే వాళ్లను చిత్తశుద్ధితో చెదరగొడుతున్న అధికారుల భావజాలాల గురించి. ఒక దుర్మార్గచర్యను దేశభక్తిగాను, గొప్ప పనిగానూ భావిస్తే జరిగే అనర్థాన్ని గురించి రాసింది ఈ కథ. అలా భావించిన ఈశ్వర్ పాత్రను అతనిలోని పశ్చాత్తాపం పొగ రూపంలో వెంబడిస్తూ ఉంటుంది. ఈ కథ సారమంతా ఆ పొగలోనే ఉంది. 

ఈ కథ నాకు నచ్చడానికి కారణం ఇది రాసిన పద్ధతి. కథనంలో నేను వాడిన టెక్నిక్. మామూలుగా ఎత్తుగడ(Starting), చర్య(Event), పరిణామం(Consequences), ముగింపు (Conclusion)… ఇలా సాగాలి. కానీ ఈ కథలో చివరి భాగం ముందు చెప్పాను. అంటే మొదట పరిణామం, ఆ తర్వాత చర్య, ఆ తర్వాత ఎత్తుగడ.. ఇలా ఉంటుంది వరుస. అంటే ఒకటి, రెండు, మూడు అని కాకుండా, మూడు, రెండు, ఒకటి అన్నమాట! అయినా అయోమయం లేకుండా ఈ కథ చెప్పగలగడం నా మొదటి విజయం. ఇందులో నాకు నచ్చిన వాక్యం “ఆ కరపత్రం వీపు మీద అతని(పోలీస్ ఆఫీసర్) బైక్ టైర్ వాతలు వేస్తూ పోయింది.” కథలో జరిగిన ముఖ్య సంఘటనను గుర్తు చేస్తూ బాగా రాశాననిపించింది.

కొందరు ఈ కథ సరిగా అర్థం కాలేదన్నారు. ‘ఎంతసేపూ ఆ పొగ వాడిని వెంబడిస్తుంది. దాంట్లో నుంచి దెయ్యం రాదేంటి?’ అని ప్రశ్నించినవాళ్లూ ఉన్నారు. కథ మీద చిన్నపాటి చర్చ మాత్రమే జరిగింది. ఈ కథని రైతు ఉద్యమం అనే ఈవెంట్‌కి మాత్రమే పరిమితం చేస్తూ అర్థం చేసుకోవడం ఒక కారణం కావొచ్చు. దాన్ని దాటి చూస్తే ఈ కథ ఇంకా బాగా అర్థమవుతుంది.  

కథాసాహితి వాళ్లు ఆ ఏడాది చదవదగ్గ మంచి కథల జాబితాలో ఈ కథను చేర్చారు. వేంపల్లి షరీఫ్ గారి సంపాదకత్వంలో ఆన్వీక్షికి ప్రచురణ సంస్థ వెలువరించిన ‘యువ 40 కథలు’ పుస్తకంలో ఈ కథను తీసుకున్నారు. ఒక క్లిష్టమైన అంశాన్ని వైవిధ్యంగా రాయగలిగాను. నా రచనాశైలిమీద మరింత నమ్మకాన్ని పెంచిన కథ ఇది.

*

చరణ్ పరిమి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు