పేరు కనిపించకపోతేనేం…అయినా చెరగని ముద్ర –రాజేంద్ర!

రాజేంద్ర గారు ఇండియా టుడే తెలుగు విభాగం ఎడిటర్ మాత్రమే కాదు, తెలుగు కథకు గొప్ప ప్రోద్బలం!

రగొండలో విద్యార్థిగా వున్నప్పుడే చురకత్తిలాంటి కుర్రాడనిపించుకున్నాడనిపించుకున్నాడు రాజేంద్ర. అల్లసాని పెద్దన అందలమెక్కునాటికి కొంటె విద్యార్థిగా వుండిన  రామరాజభూషణుడిలాగా సభాగారు పత్రికలకు రాస్తుంటే చూశాడు. ఈ పత్రికల విశేషమేమిటో తెలుసుకోవాలనుకున్నాడు. దొరికిన ప్రతి పత్రికా ఉత్సవ విగ్రహంలా కనిపించగా, వాటికి మూలవిరాట్టుల వంటి పత్రికాకార్యాలయాలు మదరాసులో వున్నాయని తెలిసి , ఆ నగరాన్ని కోటినదుల ధనుష్కోటి గా భావించాడు. మదరాసు తండియార్పేటలోని “మాతృసేవ” లో పనిచేసి పత్రికల బాగోగుల్ని గురించి క్షుణ్ణమైన పరిజ్ఞానం గడించాడు. వ్రాయడానికి అవసరమైన అర్హత పత్రికల గురించి తెలుసుకోడం గాదనీ, సాహిత్యమన్నది లైబ్రరీల్లో నిక్షిప్తమై వుందనీ తెలియడంతో ఆ లైబ్రరీల అంతు గూడా తేల్చుకోదలచుకున్నాడు.

లైబ్రెరియన్ గా  శిక్షణకోసం విశాఖపట్నం వెళ్ళాడు. విశాఖ రచయితల సాహచర్యం రాజేంద్రను రచయితగా తీర్చిదిద్దింది. తిరిగివచ్చి గ్రంధాలయాల్లో పనిచేస్తూ తన ఓపిక అనుమతించినంతలో మంచికథలు కొన్ని రాసాడు. (గొడుగులాంటి మనిషి, పిల్ల మెచ్చినవాడు) చిరాకుపుట్టి ఆ రాయడంగూడా  తగ్గించేశాడు. చిత్తూరులో వుండగా రాజేంద్ర చేసిన ఒక మంచి పని జిల్లా రచయితల సంఘాన్ని నడపడం. ఈ జిల్లా రచయితల సంఘానికి  ప్రత్యేకించి అధ్యక్ష స్థానమంటూ ఒకటి, కార్యదర్శి అంటూ ఒకరూ , యింకా కార్యవర్గం మొదలైన బాదరబందీలేవీ లేవు. దాని స్విచ్చి రాజేంద్ర చేతిలోనే వుంది. అప్పుడు బుద్ది పుట్టి ఆన్ చేశాడు. యిప్పుడు వీల్లేక మిన్నకున్నాడు.

యెంతటి స్నేహితుడినైనా వాడి పరిధిలో వాడిని వుండనిచ్చి తాను తన పరిధిలో వుండిపోగల గడసరితనం రాజేంద్ర సొత్తు. నాలుగైదేండ్లతర్వాత ఉన్నట్టుండి హైదరాబాదు అబిడ్సు రోడ్డులో కలుసుకున్నాసరే కొద్ది నిమిషాలక్రితమే విడిపోయినవాడిలా మాట్లాడతాడు. అప్పట్లో అతడ్ని జారవిడుచుకుంటే మళ్ళీ కొన్ని యేండ్లదాకా కనిపించడు. కొన్ని సంవత్సరాల కృషి చేసిన తర్వాత రాజేంద్ర వ్రాయడం సాధ్యమేనని నిరూపించాడు. ఇటీవల కొన్ని సంవత్సరాలనుంచీ వ్రాయకుండా వుండడంకూడా సాధ్యమేనని నిరూపిస్తున్నాడు. మళ్ళీ యేనాటికైనా బుధ్ధిపుడితే సొంతంగా ఒక పెద్ద నవల వ్రాసి పూర్తిచేస్తాడు. ఇచ్చాశక్తితో మనస్సును తన చెప్పుచేతల్లో వుంచికోగలిగినట్టే , రాజేంద్ర ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని గూడా  ఇచ్ఛ వచ్చిన చొప్పున మలచుకోగలుగు తున్నాడు.

   (చిత్తూరుజిల్లా సాహిత్య చరిత్ర –మధురాంతకం రాజారాం)

సరిగ్గా యాభైరెండు సంవత్సరాల క్రితం , 1967లో రాజేంద్ర గారు 30 యేళ్ళ యువకుడుగా వున్నప్పుడు ప్రచురించబడిన ‘చిత్తూరు జిల్లా సాహిత్య చరిత్ర అనే పుస్తకంలో రాజేంద్రగారి గురించి మా నాన్న గారు రాసిన మాటలవి. 50 పేజీలు మాత్రమే వున్న ఆ చిన్న పుస్తకంలో వో పేజీనంతా ఒక యువ రచయిత కేటాయించుకోగలడం చిన్న విషయం గాదు.

అర్ద శతాబ్దం తర్వాత రాజేంద్రగారు భౌతికంగా ఈ ప్రపంచానికి దూరమైన మూడు రోజుల తర్వాత నేనిలా ఆయనని గురించిన జ్ఞాపకాల్ని మననం చేసుకుంటుంటే మనస్సంతా చీకాకుగానూ బెంగగానూ ఉంది. మా చిత్తూరు జిల్లాలో మరణించాడు అనడానికి కాలమైపోయాడు అంటారు. పల్లెటూళ్ళ జానపదుల అభినివేశానికి ఆ మాట గొప్ప ఉదాహరణ. కాలం జీవితాన్నీ , ప్రపంచాన్నీ శాసించే పెను శక్తి. కాలంలో లయించుకుపోయినవాళ్ళను గురించి తలచుకోవడం, మరచిపోలేకపోవడం కంటే చిత్రమైన జీవలక్షణం మరొకటేముంటుంది?

ఫ్రపంచాన్నంతా అతలాకుతలం చేస్తున్న భయంకర కరోనా మృత్యు రాక్షసి ని తనదైన పద్దతిలో నిరసిస్తూ రాజేంద్రగారు, (తనకంతగా నమ్మకంలేని హిందువుల నమ్మకం ప్రకారం) సహస్ర చంద్ర దర్శనం కూడా పూర్తి చేసుకుని , పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి , సహజంగా, నిబ్బరంగా, ఠీవిగా కాలమైపోయారు.

రాజేంద్రగారు  నా సాహితీజీవితంలో మూడు ముఖ్యమైన సంధర్భాలకు అధ్యక్షత వహించారు.

1965లో చిత్తూరుకు యిరవై కిలోమీటర్ల దూరంలో పాకాల అనే చిన్న బస్తీలో మా నాన్న ఆరేడునెలల పాటూ వెల్ఫేర్ హాస్టలుకు వార్డనుగా పనిచేసారు. ఆప్పుడు రాజేంద్ర గారక్కడే లైబ్రేరియన్ గా పనిచేసేవారు. రోజూ చిత్తూరునుంచీ వచ్చి పోతూవుండేవారు. ఆ రోజుల్లో మా నాన్నా, ఆయనా దాదాపుగా ప్రతిరోజూ కలిసేవాళ్ళు. ఒక రోజు మాయింట్లో కూర్చుని మాట్లాడుకుంటూ వున్నప్పుడు రాజేంద్ర గారు” మీ పెద్దబ్బాయి రచయిత అవుతాడు. చిన్నవాడేమో చిత్రకారుడు” అన్నారు. అది ఆయన యధాలాపంగా అన్నమాటే అయినా అది అప్పటి ఆ యెనిమిదేళ్ళ పిల్లాడి మనస్సులోకి యెంతగా యింకి పోయిందో యిప్పుడయితే నేను చెప్పలేను. మూడురోజులముందు రాజేంద్ర గారికలేరని మా అమ్మతో చెపుతూనే వెంటనే ఆమె ఆమాటే గుర్తు చేసుకుంది. అయితే ఆ తర్వాతి రోజుల్లో ఆ చిన్నకొడుకు చిత్రకారుడు మాత్రమే గాకుండా కథకుడూ, కవీ, నవలారచయితా అయినప్పుడు ఆయన మనఃస్ఫూర్తిగా  సంతోషపడేవుంటాడు.

1993లో రాజేంద్రగారు ఇండియాటుడే తెలుగు పత్రికకు సంపాదకుడుగావున్నప్పుడు నేను రాసిన కథ “నాలుగుకాళ్ళ మంటపం” అందులో ప్రచురితమయింది. దానికి ఆయేడాది డిల్లీ కథ పురస్కారం వచ్చింది. ఆయేటి తెలుగు కథల యెంపిక సంపాదకుడు అల్లం రాజయ్య గారు. డిల్లీ కథ సంస్థ ఆయేడు కథ ప్రచురించిన పత్రికకు గూడా అవార్డు యిచ్చినట్టు గుర్తు. అప్పుడు రాజేంద్రగారు ఆ కథగురించి సంపాదకీయం గూడా రాసారు.

1999లో నేను నా మొదటి కథలసంపుటి “కుంభమేళా” తీసుకొచ్చినప్పుడు ఆ పుస్తకం వెనకపేజీలో బ్లర్బ్ గా ఆయన మాటల్నే వాడుకున్నాను. నా కథారచనకదో స్నాతకోత్సవం. అప్పుడాయన రాసిన మాటలు:

“నరేంద్ర ఇతివృత్తాన్ని ప్రజల జీవితంలోంచీ యెంచుకొనడంలోనూ, కథాశిల్పంలోనూ నిష్ణాతుడు. జీవన వైవిధ్యాన్ని సాహిత్యంలో ప్రతిబింబించడంలో నరేంద్ర ప్రదర్శిస్తున్న ప్రతిభ అచ్చెరువు గొల్పుతుంది.”

అది నేనందుకున్న పట్టా. ఆ స్నాతకోత్సవానికి కులపతి రాజేంద్ర గారు.

రాజేంద్రగారు ఆంధ్ర ప్రభలోనూ, ఇండియాటుడే లోనూ సంపాదకుడిగా వున్న రోజులు తెలుగు కథకో స్వర్ణయుగం. ఆయన ప్రతిసంచికలోనూ ప్రచురించిన ప్రతికథా ప్రత్యేకమైనదిగావుండేది. తెలుగుకథకు గొప్ప విలువనూ, వైభవాన్నీ తీసుకొచ్చిన ఒకరిద్దరు సంపాదకులలో ఆయన ముఖ్యుడు. ఇండియాటుడే లో రాజేంద్ర గారితోబాటూ రాజశుక, రెంటాల జయదేవ, మల్లపల్లి ధూర్జటి– అదొక గొప్ప టీం.

రాజేంద్రగారు 1972 ప్రాంతంలో పొలికేక అనే వార పత్రికనూ, జ్యోత్స్న అనే మాస పత్రికనూ స్థాపించి రెండుమూడేళ్ళపాటూ నడిపారు. ఫ్రచురణ అనే వ్యాపారానికీ ఆయనకూ కుదరదని తెలుసుకున్నాక మానేసారు. ఆయన చేసిన పని మాత్రమే కనబడేది. ఆ పని ఆయన చేసినట్టయినా యెవరికీ కనబడకుండా ఆయన చాలా జాగ్రత్తపడేవాడని యిప్పుడు తెలుస్తోంది.

ఇటీవల ఫేస్ బుక్ లో ఆయనని గురించి రాస్తూ కల్లూరి భాస్కరం గారు రెండు ముఖ్యమైన విషయాలు చెప్పారు.   మొదటిది:

‘’చిత్తూరుజిల్లాలోని ఒక రైతుకుటుంబంనుంచి వచ్చిన రాజేంద్రగారు తన కులం ఏమిటో తనతో పనిచేసినవారికి కూడా తెలియనివిధంగా ఇన్నేళ్లపాటు ఉండగలగడం గొప్ప ఫీటే.’’

రాజేంద్ర గారు తన ఆధార్   కార్డు చూసిన వాళ్ళకు ఆయన కులం తెలియకుండావుండడంకోసం తండ్రి పేరు  గోవిందరెడ్డి కి బదులుగా గోవిందయ్య అని రాయించుకున్నారు.  పురుషులందు పుణ్యపురుషులు వేరయా అనే వేమనమాట గుర్తుకు రావటం లేదూ?

భాస్కరం గారు చెప్పిన రెండో విషయం:

రాజేంద్రగారు తనమిత్రులతో, సన్నిహితులతో “దేనినీ మనసులో పెట్టుకోకూడదు. క్షమించేస్తూ ముందుకుపోవాలి” అనేవారట. అనడమే గాకుండా అలా జీవించి చూపినవాడాయన. ఆయన ఇచ్చాశక్తితో మనస్సును తన చెప్పుచేతల్లో వుంచుకోగలిగాడని యాభైయేళ్ళ ముందే మా నాన్న రాసారు.

క్షమాగుణం, మనోనిబ్బరం అనే ఈ గొప్ప బైరాగుల లక్షణాలు ఆయనలో సహజాతాలనిపిస్తోంది. అందుకే ఆయన పత్రికారంగంలోనూ తామరాకుపైన నీటి బొట్టులా జీవించగలిగారు. కర్మయోగిలా తన పని తాను నిష్కామకర్మగా చేసుకుపోయారు. లౌకిక సంపదలకోసమూ, పేరుప్రఖ్యాతులకోసమూ వెంపర్లాడకుండా తనదైన పనిని చిత్తశుద్దిగా చేసి, పనిపూర్తవుతూనే మౌనంగా తప్పుకున్నారు.

ఆయన చేసిన పనులపైన ఆయన పేరు కనిపించకపోయినా, వాటి ప్రభావాలు మాత్రం ప్రపంచపు సౌమనస్య సంగీతంతో మృదుమధురంగా శృతి కలుపుతూ కలిసిపోయాయి.

*

మధురాంతకం నరేంద్ర

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తెలుగు కధ కి *ఇండియా టుడే* లో పెద్ద పీట వేశారాయన! మద్రాసులో వున్నరోజుల్లో అప్పుడప్పుడు కలిసేవారం!

  • Chala bagundi,ayana inti varandalo kurchuni aayanani chustu,kalamaipoyina ayanani ippudu telsukunnattu.
    Thanks Narendra garu

  • పురుషులందు పుణ్యపురుషులు వేరయా ! దీనికి పరిపూర్ణ ఉదాహరణగా టి.రాజేంద్ర గారిని మా తరానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు నరేంద్ర గారు..

  • నరేంద్ర గారు ఆయన గురించి ఆసక్తికరమైన కథలా రాసారు. ఇలాంటి వాళ్ళు కూడా మనకు ఉన్నారా అని ఆశ్చర్యపోయాను .. అటువంటి వారు ఒక్కొక్కరు పోతున్నారే అన్న బాధ వేధించింది. నరేంద్ర గారికి అభినందనలు.

    ముకుంద రామారావు
    హైదరాబాద్

  • నిజమైన కర్మయోగి రాజేంద్ర గురించి బాగా రాశారు మధురాంతకం గారూ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు