పల్లిపట్టు నాగరాజు కవితలు రెండు

పల్లిపట్టు నాగరాజు-
పుట్టింది మే 22 1987న చిత్తూరు జిల్లా, సత్యవేడు మండలం,రంగనాధపురం మిట్టిండ్లు.పల్లిపట్టు భూలక్ష్మి, రాఘవయ్యలు అమ్మా నాన్నలు.
ప్రస్తుతనివాసం సత్యవే డు మండలం వెంకటాపురం(రాజగోపాలపురం).ఇక్కడే పాఠశాలవిద్యపూర్తిచేసి, ప్రభుత్వ జూనియర్ కాలేజి సత్యవేడులో ఇంటర్,తిరుపతిఎస్ జి ఎస్ ఆర్ట్స్ కాలేజిలో డిగ్రీ (స్పెషల్ తెలుగు) చదివి,కర్నూలు I.A.S.E కాలేజీలో తెలుగు పండిట్ శిక్షణ పూర్తి చేశాడు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖలో ఎం.ఏ తెలుగు పాసై,ప్రస్తుతం ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారి వద్ద పరిశోధక విద్యార్థిగా వుంటున్నారు.
తిరుపతిలోని ప్రైవేటు విద్యాసంస్థలలో కొంతకాలం పనిచేసి,జూన్ 2016న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికై, శాంతిపురంమండలం,
64పెద్దూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులగా పనిచేస్తున్నాడు. పల్లిపట్టు యాలై పూడ్సింది పేరుతో తొలి వచనకవితా సంపుటిని 2020 డిసెంబరులో తీసుకు వచ్చారు.
1
మతం ముల్లు
——————-
అటుగా గొడ్లు మలేస్తున్నప్పుడు
అనుకోకుండా గుచ్చుకున్న ముల్లు తాలూకా నొప్పితో
నువ్వు కుంటుకుంటూ నడుస్తున్నప్పుడు
మతంముల్లు గుచ్చుకుని
కుంటుతూ నడుస్తున్న వర్తమానమే కానొస్తోంది.!
ముందే ఊహించి కూడా
బలస ముల్లులానో
తుమ్మ ముల్లులానో
లోతుగా దిగుబడినప్పటి బాధవంటిబాధ
నొప్పివంటి నొప్పి
రాజకీయ ములుకుల దిగుబడి
దేశం ఎంతలా రోదిస్తోందో కదా.!
కళ్ళలా మూసుకుంటే చాలు
మూల మూలా
మూలాల మట్టిపాదాల గాయాల మూలుగులే
గుంపులై వినిపిస్తున్నాయి
రోడ్డువారగా దట్టెమైపడున్న కుక్క శవంమీద ఈగల్లా
శతాబ్దాల అవమానాలపుండ్లు కండ్ల చుట్టూతా
జుమ్మని మూగుతున్నాయి
ఏం..బా..!
నీ కాలికి గుచ్చుకున్న ముల్లునైతే
దిరసాని చెట్టునీడలో కూకొని
వొళ్ళు నీ కాలుపెట్టుకుని ప్రేమెంగిలితో తుడిచి
కవిత్వం నేర్పిన నీకళ్లలోకి చూస్తూ
ఒడుపుగా పిన్నీసుతో తియ్యగలిగాను గాని…
ప్రియదేశపు పాదాల్ని
ఈతముల్లులా భాధిస్తున్న మతంముళ్ళునెలా తీయాలో ..?
మగ్గిపోతున్నాను
ఒకమాట చెప్పూ
నాకు ఇష్టమైంది నీకూ ఇష్టమేనని ఎన్నిసార్లు
ఆలింగనాల ఆశలై అల్లుకున్నాం..!
నా చేతులుమాత్రమే సరిపోని సందిగ్ధంలో వున్నాను
చేయి కలుపుతావా.?
మతంముళ్ళు చీల్చిన గాయాలతో
నేలంతా బొబ్బలుతేలి  పెడబొబ్బలు పెడతావుంది
భక్తిమురుగు పెరిగిపోయి
పెనుచీము నెత్తురులో దేముడు మునకలేస్తున్నాడు
ముండ్లు తొలగించి
దేశం కండ్లు తుడవడానికి
నీ చేతులు తోడిస్తావా.?
నా పాదాలై తోడొస్తావా.?
పల్లెరుగాయలు వంటి పరమ ధర్మభూమిలో
మనమంటే కుమిలి కుమిలైనా నడుస్తున్నాం గాని
రేపు మనపిల్లలెలా నడుస్తారో చెప్పూ
రేపు మన పిల్లల దేశమెలా వుంటాదో చెప్పూ..!
*
2.
యుద్ధం@useless fellow.com
———————————————
గాయపరుచుకోవడం
ఎవరికి నచ్చుతుందో చెప్పూ
నిను నువ్వో
నీ ఎదుటివాన్నో
భూగోళం మీద గాయాలపక్షిని చేసి విసిరేయడం
ఎవరు కోరుకుంటారో చెప్పూ?
భూమి ముఖంమీద గాయాలు చేసే యుద్ధాన్ని
నేల గుండెల్లో నెత్తుటికోరవంటి యుద్ధాన్ని
వికసించే ఏ విజ్ఞానపు మెదడైనా ఒప్పుకుంటుందా
మనసుగూగుల్లో ఎంత వెదికినా
యుద్ధానికి పరాకాష్ట
ఎర్రి మెదళ్ల ఇగో సాటిస్పెక్షన్ మాత్రమేనని అరుస్తోంది
పువ్వులు చేతికిస్తే
ప్రేమను కురిపించే రోజులు పోయి చాలాకాలమైంది
పావురాలెగరేసి శాంతిని పాడితే
గొంతులుకలిపే ఆకాశాలు కరువైపోయిన కాలమిది
అందుకే
ఇప్పుడు యుద్ధాలు ఏ దేశానికి క్షేమం కాదని
యుద్ధం @ యుస్లెస్ పెలో డాట్ కమ్ చెవుల్లో
వేల వేల మెయిళ్ళుమై అరుద్దామంటున్నా..!
తప్పుల్ని ఎవరు గిల్లరు.?
మనతప్పులగోళ్లతో రేపటితరాలను చిదిమేయడం
మనగొప్పల రీళ్లతో వర్తమానాన్ని మురికి చేయడం
ఏ నవతరం హర్షిస్తుందో చెప్పూ..?
ఏ గ్రేటా భేటీ క్షమిస్తుందో చెప్పు..?
యుద్ధాలు విదిల్చిన విషాదగీతకల్ని విన్నపుడల్లా
చెవులు మూసుకుంటున్న పూలచేతుల్ని చూస్తూ
మానవ ఆంబోతుల్లా కాలుదువ్వి
బతుకు మైదానంలో యుద్ధపు రంకెలెందుకు?
విమానాల నోళ్ళతో బాంబులు కక్కడంమెందుకు.??
కారణాలు కోటి ఉండచ్చుగాక
కన్నీటి గుండంలో కాలుతున్న కనుగుడ్లును మిగిల్చే
రణన్నినాదాలు కావడమే కొండంత విషాదం!
కుట్రల తుఫానల్లో
కూలిన ఇళ్లముందు కుదేలైన కుటుంబాల్ని చూసావా
కూలీనాలి చేసి కూడబెట్టుకున్న బతుకులెలా
నిలువునా కాలిపోతున్నాయో
ఆ దుఃఖపు పెనుమంటలను వింటున్నావా.!
కేవలం సానుభూతి నూసెన్స్
ఏ సమస్యను పరిష్కరించలేవు.!
యుద్ధం @ యూస్లెస్పెలో డాట్ కమ్ గాడి
ఇన్బాక్స్ నిండిపోయేలా…
యుద్ధం పికివాళ్ళ చేష్టని
యుద్ధం అవివేకులు ఆడే ఆటని
కోటానుకోట్ల నిరసన మెయిళ్ళమై నిందిద్దాం పదా
విద్వేషాలు ఎగదోయడం మాని
యుద్ధపు వాకిళ్ళముందు శాంతిముగ్గులేద్దాం నడూ
వినిపిస్తోందా..!?
*
Don’t shut up..!
నిరసనకు సరిహద్దుల్లేవు
*

పల్లిపట్టు నాగరాజు

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శిష్యా పల్లె పట్టు నీలో పట్టున్న కవిత్వం చదవడం నాకు చాలా సంతోషంగా ఉంది.నీ కవిత్వంలో వస్తువు వాస్చాతవానికి దగ్గరగాను చాలా లగువుగా ఎత్తుగడ చిక్కగా చక్కగానూ ఉంటుంది ఆశీస్సులు.

  • మతం ముళ్ళు… యుద్ధం… కవితలు దేనికవే గొప్పగా వున్నాయి.ప్రజా కవిత్వం మీద పట్టున్న కవి పళ్ళిపట్టు. ఇప్పుడు వుమ్మడి తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని మా కవి.

  • నాగరాజు గారు మీ కవిత్వం అద్భుతంగా ఉంది.వస్తువు ఊపిరిపోసుకుని శ్రోతలను ఊగిపోయేలా చేస్తుంది.వాస్తవంగానూ,కరుణరసపూరితంగానూ,చురకలంటిస్తూ చక్కగా సాగుతుంది.కంగ్రాట్స్ సార్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు