పరాయి దేహం

కులు కప్పుకున్న ఆదిమ మానవి
కూతుర్ని కనకుండా ఉండాల్సిందని కన్నీరు పెడుతున్నట్టుంది,
కాలం మసిబారి నల్ల కల్లోలమైంది.
హాయిగా ఆడుకునే పసిపాప దేహం
తడిమిన వేళ్ళ నడుమ
ఆడబిడ్డకింత వెలుగు కప్పలేని ఆకాశంలో
గ్రహణ కాలం పొడచూపింది.
తల్లడిల్లే తల్లి పక్షుల అరుపులతో లోకం ఘోషిస్తోంది.
బడి గంటలు చిన్నారి ఏడుపై
మారుమోగుతూ,
గాలిని చీలుస్తాయి.
ఆట స్థలం ప్రహరీ గోడ తలని
బంతిలా మొత్తుకుంటుంది.
తరగతిగదిలో మేజా బల్లలు
విరిగిన కాళ్ళతో ఎదురుచూస్తుంటే,
పాఠాలు ముళ్ళపొదలై అలుముకున్నాయి.
చంటి బిడ్డ నెత్తుకున్న భుజాలను
అనుమానంతో చూడాల్సిన బాధకి
కళ్ళు దీనంగా విలపిస్తాయి .
ప్రతి మహిళ గుండెలో నమ్మకం సమాధై,
కమిలిన చిన్నారి చర్మం సాక్షిగా,
ఆత్మన్యూనత ఊపిరాడనీయదు.
వేవేల మొండిచేతులు క్రూరంగా చుట్టుముట్టాక,
మొదలు నరికిన మానులా
ధైర్యం చెదరిన ఆడతనం
దిగాలు పడుతోంది.
ఇప్పుడు ప్రతి స్త్రీ ఒంటి మీది బట్టా,
పరాయైపోతున్న దేహాన్ని వెక్కిరిస్తున్నట్టుంది.
*
చిత్రం: బీబీజీ తిలక్

శైలజ కాళ్ళకూరి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మనసున్న ప్రతి మనిషినీ కలచి వేసిన సంఘటణకు అక్షరరూపమే ఈ కవిత .అవును, చదువుతూ ఉంటే ఎవరికళ్ళైనా దీనంగా విలపిస్తాయి .మానవ
    కుసంస్కారాన్ని వెక్కిరిస్తూ నడివీధిలో దోషిగా నెలబెట్టిన మీ అక్షరానికి వందనం .

  • మానవ కీకారణ్యంలో జరుగుతోన్న అమానవీయ సంఘటణలకు కుంగిపోని మానవి ఉంటుందా ? మానవ కుసంస్కారాన్ని నడి వీధిలో దోషిగా నిలబెట్టిన మీ అక్షరానికి వందనం .

  • కళ్ళెంబడి నీరు ఆగడంలేదు. దిగులేస్తోంది రేపటిరోజు ఏంవింటామో!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు