నీడనివ్వని చెట్టు

నాటా- సారంగ కథల పోటీలో విజేత

డినెత్తిన సూరీడు పండిన తాటిపండులాగున్నాడు. ఆకాశానికేసిన నల్లటి నిచ్చెనలా తాటిచెట్టు. చెట్టెక్కుతున్నాడు సూరప్పడు…..  ఎవరో కట్టేసినట్టుగా  నడుముకు మోకు, కాళ్లకు గుది… ఎక్కలేక… ఎక్కలేక   చెట్టెక్కుతున్నాడు…. కాలుతున్న తాటికమ్మలా ఎండ దంచేస్తోంది. మోగమ్మల్లోకి చేరుకోవాలి…. అలసిపోతున్నాడు ….చెట్టెక్కడమే తప్ప దిగే అవకాశం లేదు.  కిందకి చూస్తే తాటిచెట్టు మొదలు  పాతాళంలోకి వుంది, చివర ఆకాశంలోకి వుంది….  చెట్టెక్కుతుంటే ఇంతవరకు నడుముకున్న బల్లచెక్క మోకుకు తగిలి ‘టక్… టక్’ మని చప్పుడు వినిపించేది. ఇప్పుడు  తన గుండె చప్పుడు తప్ప మరేమి వినిపించడం లేదు.

చెట్టుకి అతుక్కుపోయినట్టు కాళ్ళు ముందుకు కదలటంలేదు. ఒళ్ళంతా చెమటతో తడిసిపోతుంది. దాహం…దాహం…అంతటా దాహం.

సూరప్పడి ఒంటి నుండి కారుతున్న చెమటచుక్కలు తాగి దాహం తీర్చుకోవాలన్నట్టు కింద తుప్పల్లోంచి నోరెళ్ళబెట్టి తొండ చూస్తోంది.

చేతులు పట్టుతప్పిపోతున్నాయి…కాళ్ళు వణికుతున్నాయి.  అలసిపోయి పైనున్న  మోగమ్మలు వైపు కిందనున్న నేలవైపు చూస్తున్నాడు…కళ్ళు తిరుగుతున్నాయి. నోరు పిడచకట్టుకు పోయింది. ఒంటోలోని వున్న శక్తినంతా  బయటికి తోడేసినట్టు అయిపోయింది.  ఒక్కసారిగా తాటిచెట్టు అనకొండలా… నోరుతెరిచింది. పట్టుతప్పి పడిపోతాడనుకునేసరికి అమాంతంగా, అతడిని కాళ్ళు నుండి నడుము వరకు మింగేసింది.

తుళ్ళిపడి లేచాడు సూరప్పడు. ఒక్కక్షణం కాళ్ళు… చేతులాడలేదు. మనిషి మొత్తం మంచు గడ్డయిపోయాడు. ‘ఇదంతా కలా…’ అని మనసులో అనుకొని ఒక్కసారిగా  ఊపిరి పీల్చుకున్నాడు. ఈమధ్య  ఇదే కల సూరప్పడుని అదేపనిగా వెంటాడుతుంది. మంచం కిందనున్న ముంతను చేతుల్లోకి తీసుకోని,  నీళ్లన్నీఒక్క గుక్కలో తాగేశాడు. మంచం దండెపై వున్న చుట్టని తీసి ముట్టించుకున్నాడు. మంచం పక్కనే నేలపై  తన భార్య అప్పలనర్సమ్మ పడుకుంది.  ఆ అగ్గిపుల్ల వెలుగులో పైగడపలో పడుకున్న కోడలి బోసి నుదుటిపై తాండవిస్తున్న చీకటి కనబడింది. కోడలి పక్కనే మనవలు ముడుచుకు పడుకున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన సూరప్పడి  కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి. తువ్వాలుతో కళ్ళొత్తుకున్నాడు. గుండెలనిండా పొగ పీల్చి కాస్త మనసును కుదుటపరుచుకున్నాడు. పంచనున్నమంచంపైనుండే బయటికి చూసాడు. పక్కనున్న పాకలో ఆవు గడ్డిని నెమరువేసుకుంటుంది. బయట  చీకటి ఈనడానికి సిద్ధంగున్న సూడి పందిలాగుంది .

* * *

తొలకరి వర్షాల కాలం. గట్లుమీద పచ్చగా గడ్డి మొలుచుకొచ్చింది. మడుల్లో వ్యవసాయముంది.  సూరప్పడు గట్టుమీద జాగ్రత్తగా ఆవును మేపుతున్నాడు.  పదే పదే తన కొడుకు కళ్లముందు కదులుతున్నాడు. మనసు కలతగా ఉంది. చిన్నతనం నుండే ఎంత సాయంగుండేవాడు తనకు. తను కల్లుగీసే కాలంలో వాడు పందులు కాసేవాడు. కల్లమ్ముకుని వాళ్ళమ్మ ఇంటికొచ్చేసరికి పందులను దొడ్డిలో పెట్టేసి గెంజినీళ్ళు మరగబెట్టేసేవాడు. మిగిలిపోయిన కల్లును పందులుకేసేవాడు. లేక లేక కలిగిన ఒక్కగానొక్క  కొడుకు.  ఇరవైయేళ్ల కిందటి సంఘటన సూరప్పడు కళ్ళముందు కదలాడింది.

ఆరోజు ఇంటికొచ్చేసరికి దుఃఖంతో గడ్డ కట్టిన కొడుకు ముఖం కనబడింది సూరప్పడికి.

‘ఏటయ్యిందిరా నాయినా … అలాగున్నావ’ని అడిగాడు.

కాసింత సల్లగాలి తగిలితే కురిసిన మేఘంలా భళ్ళున ఏడ్చేసాడు…  సత్యం. వయస్సు తొమ్మిదేళ్లుంటుంది. చూడడానికి సన్నగా కత్తి కీడుకున్న కర్రలాగుంటాడు.

‘ఇకనుంచి నాను కాయను పందులను’ మోచేయతో ముక్కుతుడుచుకుంటూ అన్నాడు.

‘ఏటయ్యిందిరా..’  అన్నాడు సూరప్పడు.

‘బడెనకాల పందులు మేపుతున్నాను. ఆ పక్కనే పెద్దింటోళ్ల  పొలాలున్నాయి  సూసుకోనేదు నేను.  బడిలో పెద్దింటోళ్ళ పిల్లలు  పద్యాలు పాడుతున్నారు. అవి ఇనడానికి బాగున్నాయని సెప్పి చెవొగ్గేసి పందులను మరిసిపోనాను. మన పెద్ద పంది నేదు… దుక్కది .. పొలంలో  గొప్పెట్టేసింది. ఎక్కడనుండి సూసాడో…ఆ పొలంగలోడు…  పరిగెట్టికొచ్చేసాడు…కళ్ళు  దెం…. యేటిరా…. అని నోటికొచ్చిన తిట్లన్నీ  తిట్టాడు. పందులను తరిమేసి, అక్కడనుండి భయంతో పరిగెడుతున్న నన్ను  మట్టిపెల్ల ఇసిరి కొట్టాడు… సూడు..వీపు  ఎలా నొప్పెడుతుందో’ చెప్పేసి మరలా ఏడవడం మొదలెట్టాడు సత్యం. ఆడు ఏడుస్తుంటే ఆడి  దుఃఖంతో పాటు చీముడు కూడా కారేసింది.

దుఃఖమంతా దిగిపోయిన తరువాత మరిసిపోయినిదేదో గుర్తుకొచ్చినవాడిలా   ‘అయ్యా… మనం సదువుకోగూడదేటిరా…?’ అన్నాడు.

సూరప్పడు ఇదివరకు చాలా ప్రశ్నలు విన్నాడు సత్యం నుండి. తాటిచెట్లు గురించి, కల్లు గురించి, పందులు గురించి.  వీటన్నింటికి సమాధానం చెప్పిన సూరప్పడు తన కొడుకునుంచి ఇలాంటి ప్రశ్న వస్తుందని ఊహించలేకపోయాడు.

ఎవరో కేకేసినట్టు అనిపిస్తే తుళ్ళిపడి  ఈ లోకంలోకి వచ్చాడు సూరప్పడు. చుస్తే ఆవు గట్టు దిగి వ్యవసాయంలోకి వెళ్ళిపోతుంది. కుంటుకుంటూ గబ గబ రెండు అడుగులేసేసరికి  సూరప్పడి మక్క…నొప్పి ఎక్కువైపోయింది.

 

సాయియంత్రం యాతవీధ చిల్లుపడిన కల్లుకుండలాగుంది. దూర ప్రాంతాలకు సిమెంట్ పనులకు వెళ్లిపోవడం వలన కొన్ని ఇళ్లకు తాళాలు వేలాడుతున్నాయి. కొన్ని ఇళ్లకు పైకప్పులుగా ఎండిన తాటికమ్మలున్నాయి. మట్టిపొయ్యలు పక్కన ఖాళీ కల్లు కుండలు బొమ్మళ్లించి ఒకదానిపై ఒకటి దొంతరేసి వున్నాయి. సీకేసిన తాటిపండులాంటి జుట్టేసుకొని దిసమొలలతో ఆడుకుంటున్నారు చిన్న పిల్లలు.  స్కూలునుంచి వచ్చిన ఆడపిల్లలు ఇంటి పనులు చేస్తున్నారు. ఓ ఇంట్లో  ఇంటర్మీడియట్ చదువుతున్న  అమ్మాయి పుస్తకం ముందేసుకుని శ్రద్దగా చదువుకుంటుంది. ఆవుకు గడ్డేసి వచ్చి మంచంపై కూర్చున్నాడు సూరప్పడు. తన ఇంటి ముందు వచ్చి నిలుచున్న వ్యక్తిని చూసి  చూసి ‘ఎవులు బాబూ మీరు’ అని అడిగాడు.

తానెవరో చెప్పి. ఇంతకు ముందు  ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయాన్ని గుర్తుచేశారు  సూరప్పడుకి మాస్టారు.

సరిగ్గా ఆరు నెలల క్రితం….  సాయింత్రం రోడ్డు పక్కన కల్లుపాకలో కూర్చుని  కల్లమ్ముతున్నాడు సూరప్పడు. మాసిన పంచెను ముడుకులు పైవరకు లాగి గోచీ పెట్టుకున్నాడు. భుజంపై ఓ తువ్వాలుంది.  పాకలో కూర్చున్న వాళ్ళకి కల్లు పోస్తున్నాడు.  పాక ముందు ఓ బండాగింది. వచ్చిన వ్యక్తేవరో తెలియక కల్లు తాగుతారేటి బాబు అని అడిగాడు సూరప్పడు. ఆగిన వ్యక్తి తమ ఊరి స్కూలు మాస్టారు, బండి రిపేర్ అవ్వడం వలెనే తన పాక ముందు ఆగారని తెలుసుకొని, మరేటి అనుకోకండి బాబు అని చెప్పి, అదే స్కూలులో చదువుతున్న తన మనవడి వివరాలను మాస్టారుకు చెప్పాడు సూరప్పడు. మాస్టారు తమ వృత్తి గురించి చాలా ప్రశ్నలు అడిగారు ఆరోజు సూరప్పడిని . దానికి సమాధానంగా- పశువులు పెంచుకునే వాళ్లకు ఆవులు, గేదెలు ఎలాగో మాకు తాడిచెట్టు, ఈతచెట్టు అలాగని, తాడిచెట్లలో పోతుచెట్టు మొదటి మూడు నెలలు కల్లు ఇస్తే ఆడచెట్టు తరువాతి మూడు నెలలు కల్లు ఇస్తుంది. పిలకలెక్కువుండడం వలన పోతుచెట్టు కంటే ఆడచెట్టుకు కల్లుగీయడం చాలా కష్టం. తన చిన్నతనంలో తాటిపెండ్లు ఎక్కువగా ఉండేవని, బోర్లొచ్చి నాలుగు పంటలు పండినాక  గట్లు మీద తాడిచెట్లుంటే వ్యవసాయానికి అడ్డు అని తీసేస్తున్నారని, భూములు వ్యాపారమొచ్చినాక కనుచూపుమేర తాడిచెట్టు కనబడటంలేదని తనకు తెలిసిన వివరాలన్నీ సూరప్పడు ఆరోజు మాస్టారుకు చెప్పాడు.

ఈరోజు అదే వ్యక్తి మళ్ళీ తన ఇంటికొచ్చారు.  ఆ వీధిలోని తన స్కూలు పిల్లలతో మాట్లాడుతున్నారు. ఆ పిల్లలో రాంబాబు కూడా వున్నాడు.

‘ఏటి బాబు ఇలాగొచ్చారు’ అని అడిగాడు సూరప్పడు.

రాంబాబు ఈమధ్య సరిగా స్కూలుకి రాకపోతే  కారణం ఏమిటా అని తోటిపిల్లల ద్వారా  తెలుసుకుని వచ్చానని సూరప్పడికి చెప్పారు .

‘ఎలా జరిగింది తాతా… ‘ అని అడిగారు.

చుట్టూ వాతావరణం మబ్బు పట్టింది. ఏదో క్షణంలో వర్షం కురిసే సూచన కనిపిస్తుంది.

కాసేపటి మౌనం తరువాత …..

‘ఏటి సెయ్యమంతారు బాబూ … మా గాచ్చారం అలాగుంది. మంచి ఎండల్లో మాకు నీడనిస్తుందనుకున్న చెట్టే  నా కొడుకును మింగేసింది. నా మనవళ్లను దిక్కులేని పచ్చులను సేసింది. ఆరోజు పొద్దున్నే అన్నాడు బాబు నాతో… ఈ పని మానేసి వేరే పని సూసుకుంటానని… పట్నం ఎల్లిపోతానని.  ఆ విషయం మీద ఇద్దరికీ మాటా.. మాటా… పెరిగింది.’ అంటూ తనకి తన కొడుక్కి మధ్య జరిగిన సంభాషణను మాస్టారుకి చెప్పుకొచ్చాడు సూరప్పడు.

‘అంత దూరం ఎందుకు నాయినా … తల్లి నలుగురం ఒకదగ్గరుండి…ఉన్న ఊర్లోనే  కలిగిన కాడికి తలా కాసిన్ని గెంజి నీళ్లయినా తాగి బతుకుదాం.  తాతల నాటి కానుండి చేస్తున్న పని… తప్పదు కద నాయనా …’ అన్నాడు సూరప్పడు, కొడుకు సత్యంతో.

నాలుగు రోజుల క్రితమే  ఎవరో  ఊరి చివరనున్న కల్లుపాకలు తగలెట్టేసారు. ఊర్లో అందరూ తాగుడుకు బానిసలై పోతున్నారని అందుకే  సొసైటీ కుర్రాళ్లే ఈ పని చేశారని  కొందరు అనుకుంటే. ఊర్లో బెల్టు షాపులల్లో మందు అమ్మిన వాళ్ళే కడుపుడుకులతనంతో ఈ పని చేశారని మరికొందరు అనుకున్నారు. ఒకపక్క తన కల్లుపాక కాలిపోయిందన్న కోపం మరోపక్క ఎన్నాళ్లీ పని చేసినా బతుకు గొర్రెతోక బెత్తుడన్న చందంగా ఉందన్న అసహనం రెండూ కలిసిపోయి కకావికలాంగా వున్న సత్యం ‘ఏమి ఊరే ఇది …’ అంటూ తండ్రి మీదకి సర్రున లేసిపోయాడు.  ఆ ఊపున సత్యం ఆడిన మాటలకు అంతులేదు.

‘ఏమి పనే  యిది … బాడుకో…దెం…  పని.  పొద్దల్లా కల్లు గీకాల.  కల్లు సెల్లడానికి పొద్దయ్యేసరికి మన  ఆడాళ్ళను అందంగా ముస్తాబు చేసి కల్లుపాకల దగ్గర కూకుండబెట్టాలా!.  ”అనువొడి పెళ్ళాం ఊరందరికీ మరదల” న్నట్టు కల్లు తాగడానికొచ్చి మన ఆడోళ్లను పరాచికాలాడినా  పడాలా… యాతోడి కత్తికి పదునుండాల గాని పౌరుషం ఉండగూడదు అని ఆ దేవుడు మన నుదుటున ఎప్పుడో రాసిపెట్టినట్టున్నాడు’ అన్నాడు.

సత్యం అంత కోపంగా మాట్లాడేసరికి ‘ఒరే…పొద్దున్నే తాగేసినావేటిరా?’అన్నాడు సూరప్పడు.

‘అవునే…తాగాను… నువ్విచ్చిన కట్టలు కరుసెట్టలేక తాగాను. నువ్వు సంపాదించిందంతా సెల్లబెట్టేద్దామని తాగాను. ఇదా నువ్విచ్చిన మూటలు…ముడులిప్పలేకపోతున్నాను. గవినేరువు కదా మరి’ అంటూ చిరిగిన హాఫ్ నిక్కరు జేబును బయిటికి తీసి చూపించాడు సత్యం.

‘నాదగ్గరేటుందిరా నీకివ్వడానికి… కాలూ… చెయ్యాడితేనే గాని… కుండాడనోడిని. సెట్టుమీంచి జారి మక్క ఇరిగినాక.. నా కాలూ …. చెయ్యాడక,  నీ దగ్గరుండి,  నువ్వెట్టిన మెతుకులు తింటన్నామనే కదా ఇన్ని మాటలంటున్నావు. అయినా ఊరకనే ఎడతున్నావేటి? పొద్దల్లా కల్లుపాక దగ్గర కూకుంటే కదా ఆ కాసిన్ని గెంజినీళ్లయినా ఎత్తన్నావు’ కాస్త కోపంగానే అన్నాడు.

‘అవును మరి…కూకొని తిందామనుకున్నావు గల!… నన్ను ఎమ్మే.. బీయేలు… సదివించినావు కదా…  గవర్నర్ గిరీ సేస్తున్నాను  … నిన్ను కూకుండబెట్టి కూడెడతాను మరి … మాటనడానికి సిగ్గేసింది కాదు…నా  చిన్నతనమంతా  పందులు కాయించినావు… నీ మక్క ఇరిగిపోయినాక… కల్లుగీసుకోరా కొడకా అని… ఇదా… ఇదా… సేతికి  ఈ కత్తి, నడుముకు మోకు, కాళ్ళకు గుది… సుట్టేసినావు.  ఇక అక్కడనుంచి ఒకటే బతుకు. చెట్టెక్కడం చెట్టు దిగడం. ఆయుసుపు నేదు ప్రాణానికి’  ఎన్నాళ్ళు నుంచి దాసుకున్నదో కడుపులోని ఇమడని కల్లులా తన బాధనంతా కక్కేసాడు సత్యం.

‘నిన్ను సదివించడానికి నాను  …పెద్దింటోడినేటిరా ….కల్లుగీక్కున్నోడిని. అయినా సదివించడానికి నా దగ్గర  మణులు, మాణిక్యాలున్నాయా… మడిసెక్కలున్నాయా…. కులవృత్తుని నముకున్నోడిని.

మరేటిసెయ్యమంతావు… నీతోని పందులు కాయిస్తే గాని ఆరోజు నాదినం దీరింది కాదు.  ఆ పందులే…. మీయమ్మకు జబ్బు సేసి మంచమెక్కినప్పుడు బాగుసేయించడానికి నాను సేసిన అప్పులు తీర్సినాయి. ఉట్టి పున్నాన్నే అంటారా!  “పందులు పాతప్పులు తీరుస్తాయని”.   అదే నిన్ను సదివిత్తే వున్న నా గోసిగుడ్డ ఊడిపోను’. జరిగింది చెప్పుకుంటూ సూరప్పడు ముఖాన్ని అరచేతులలో పెట్టుకున్నాడు.

నాలుగు చినుకులు దబ దబమని పడి ఆగాయి. ఓ చినుకు మాస్టారి చెంపపై కూడా వాలింది. పెద్ద వీధిలోకి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు వచ్చి ఆగింది. దానిలోంచి సడ సడమని పెద్దింటోల్ల పిల్లలు దిగుతున్నారు.

మరలా చెప్పడం మొదలెట్టాడు సూరప్పడు.

‘మండువేసవిలో మూడుపూటలా సెట్టెక్కడమంటే మాటలా బాబు… ప్రాణం… కాళ్ళ పిక్కల్లోకి జారిపోతాది. ముట్టుకుంటే తాటిమాను నిప్పులపై పెట్టిన కుండలాగా కాలిపోతాది. సెట్టెక్కినాక మోగమ్మలలో కూర్చుంటేనే కాస్త ప్రాణం కుదుటపడినట్టుంటాది. ఒకోసారి మోగమ్మలలో తేలుండొచ్చు… పాముండొచ్చు… అక్కడ ఎవుడు దిక్కు బాబు.  ఆరోజు మధ్యాహ్నం కళ్ళమ్మడానికి పాక దగ్గర కూర్చున్నాను. రెండు రోజుల్నుంచి ఆడి గుండెల్లో కోపం, కడుపులో కల్లుచుక్కలు తప్ప మరేటిలేవు. ఆరోజు ఆడన్న మాటలకు నా మనసు కల్లుకుండలో పడ్డ ఈగలాగ కొట్టుకుంది. అంతడేసి సెట్లు అవలీలగా ఎక్కి దిగేసినోడు. ఆ ఆఖరి సెట్టే దిగలేపోనాడు. మరి మాకు కాకుండా పోనాడు’. వణుకుతున్న గొంతుతో  సూరప్పడు మరి మాట్లాడలేకపోయాడు.

మౌనమే మనసులను తేలికపరుస్తుందని అనుకుని కాసేపు మౌనంగా ఊరుకున్నారు మాస్టారు.

దుఃఖంలో తడిసిన పిట్టపిల్లలా సూరప్పడి మనవడు రాంబాబు, మాస్టారి వైపు బిక్కు బిక్కుమని  చూస్తున్నాడు.

అక్కడినుండి లేస్తూ  ‘రేపటి నుంచి బడిస్తావు కదరా…. రాంబాబు’   అన్నారు మాస్టారు.

‘నానెలాగూ నాకొడుకును సదివించలేకపోయాను. నాకొడుకు ఆడి కొడుకును బాగా సదివిద్దామనుకున్నాడు. కాని ఇదిగో ఇలా జరిగింది. ఏదోలాగ బాధపడతాం కాని నా మనవడిని సదివిత్తాం బాబు…. రేపటి కానుంచి ఆడు బడికి వచ్చేస్తాడు’ సమాధానమిచ్చాడు సూరప్పడు.

మళ్ళీ చినుకులు మొదలయ్యాయి. పడుతున్న చినుకులతో ఇంటి ముంజూరుపైనున్న తాటికమ్మలు మాట్లాడుకుంటున్నాయి. ఎక్కడో పిడుగు పడుతుందనడానికి సూచికగా దూరంగా ఆకాశం ఉరుముతుంది. ఉరుముతున్న ఉరుము కంటే  ఓ ఇంట్లోని టి.వి.లోంచి వస్తున్న కార్పోరేటు స్కూలుకి సంబందించిన ప్రకటనే గట్టిగా వినబడుతుంది.

*

 

 

మొయిదా శ్రీనివాస రావు

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మిత్రమా… కథ చాలా బాగా నడిపించావు….కవి కధకుడైతే… ఎంత అందమైన ప్రతీకలు కథలోకి తొంగి చూస్తాయో… అనిపించడానికి ఈ కథే నిదర్శనం….యాత వీధిలో ఆర్తిని కళ్ళ ముందు దృశ్యీకరించావు…మంచి ముగింపు…. అభినందనలు

  • Hi bava garu, e story lo 3 generations ni kaluputhu meeru rasina teeru amogham, and indhulo characterisation and dialogues between them are awesome….At last the conclusion is ultimate,,,,🤗🙏

  • Really extraordinary writing and can Say one of the best writings comes out from you….. You depicted the real life of palm wine salers …. Main thing is that the style of writing and expression is good….
    Well done ….

  • మిత్రమా‌;
    యాతవీధి మనుషుల వెతలు కతలు గా రాస్తే ఇది కత కాదు వారి జీవన యానపు నిజ ప్రతిబింబం అని అందరికీ తెలిసేలా కథా కథనం ఆద్యంతం అద్భుతంగా వుంది.
    నీ పరిశోధన కు గీటురాయి గా ఇది ఓ మచ్చుతునక.
    ఇటువంటి మరెన్నో ఆణిముత్యాలు నీ కలం నుండి జాలువారాలని ఆకాంక్షిస్తూ
    మీ అభిమాని
    భోగాపురపు శ్రీనివాసరావు.

  • కథ బాగుంది.కార్పోరేట్ విద్య కై మొత్తం సమాజం అర్రులు చాస్తున్నవేళ ప్రభుత్వ పాఠశాలలకు కూడా తమ పిల్లలను పంపలేని స్థితి ఉన్న సమూహాలు మనమథ్యనే అనేకం ఉన్నాయి.వాటిని గుర్తించడానికి పరిశీలన ,పరిశోధన అవసరం. ఈ కథలో రచయిత ఆ పనిచేసాడని తెలుస్తోంది.కనుకనే అనాదిగా వస్తున్న కులవృత్తి లో బతుకులేని తనాన్ని గుర్తించిన సత్యం, ఆ వృత్తిని ఒదులుకోవడానికి ఇష్టపడని సూరప్పడు పాత్రలు సజీవంగా మనకళ్లెదుట నిలబెట్టి గలిగాడు.

    రచయిత ఆ జీవితాన్ని బాగా పరిశీలించి ఉండకపోతే వారితో మమేకం కాకపోతే కథని ఇంత వాస్తవికంగా,ఆత్మీయంగా,చెప్పగలిగివుండేవాడు కాదు. టెక్నిక్ పరంగా కూడా జరిగిన సంఘటనను చెప్పకుండానే చెప్పిన తీరు బాగుంది. కథ ఆశావాదం తోనే ముగిసింది.
    కానీ ఆధునిక లేదా అభివృద్ధి కర భావాలున్న సత్యం పాత్ర మరణించకుండా మరోవిధంగా కధ చెప్పి వుంటే మరింత బాగుండేదేమో అని నాకనిపించింది
    శ్రీనివాస్ కి అభినందనలు

  • కథ చాల బాగుంది . చదవడం కాదు వారి జీవితాలను దగ్గరుండి చూసిన అనుభూతి కల్గింది . మీకు అభినందనలు .
    ఎక్కడ అతిశయోక్తులు లేకుండా అద్భుతంగా చిత్రించారు . మీ రచన విధానం ఆకట్టుకుంది .
    చక్కని సందేశాన్ని ఇచ్చింది .

    మన్నె ఏలియా .

  • తొలి కథగా మంచి ప్రయత్నం. రాబోయే కథలో కథచెప్పే విధానం మీద ద్రుష్టి పెట్టండి. పోటీలకు కథలు రాయకండి. రాసి పెట్టుకున్నవి పంపించండి.

  • కథపై స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇది నా మొదటి కథ. ఇంతవరకు కవిత్వం రాసే నన్ను కథ రాసేలా చేసింది మాత్రం ఈ కథలోని ప్రధాన పాత్రయినటువంటి ‘రావాల సూరప్పుడు’.
    అంతవరకు నేను చూసిన నా చుట్టూ వున్న జీవితంలోంచే కవితలు రాసుకుంటున్న నాకు… విద్యాసాగర్ గారి ‘పల్లెను మింగిన పెట్టుబడి’ పరిశోధనా గ్రంధం చదివిన తరువాత, నేను పనిచేస్తున్న గ్రామాన్ని పరిశీలించడం, వివిధ శ్రేణులకు చెందిన వ్యక్తులతో మాట్లాడటం జరిగింది.
    ఈ క్రమంలోనే రావాల సూరప్పుడు, ముంత అప్పలనర్సమ్మలు మరియు మరో అయిద కుటుంభాల వద్ద నుంచి ఆ వృత్తికి సంబందించిన వివరాలను సేకరించాను. వాటిని కథగా రాసే ప్రయత్నం చేశాను అయితే ఇది కథ కాబట్టి దీని నిడివి రీత్యా చాలా విషయాలను చేర్చలేకపోయాను.
    ఈ కథలో ఏమాత్రం తడి వున్నా అది రావాల సూరప్పడి లాంటి వారి కళ్ళలోనిదే. మొదటి కథకు వున్న లోటుపాటులన్నీ నా కథలోనూ వుంటాయిని నాకు తెలుసు. తరువాత కథలలో వాటిని తగ్గించుకుంటానని తెలియజేస్తూ… నన్ను ఈ వేదిక ద్వారా మరియు వ్యక్తిగతంగా అభినందించిన అందరికీ మరోసారి ధన్యవాదాలు.

  • మాస్టారు మీరు రాసిన కథ మా ఊరిలోది లాగా ఉంది.అటువంటి కథలు మీరు వేర్వేరు వ్రృత్తులు నుండి సేకరించి ఇంకా ఎక్కువ మంచివి రాయాలి అని కోరుకుంటున్నాను. మీరు రాసిన కథ అచ్చు తెలుగు భాష లో చాలా బాగుంది.ఇంకా మీ ఊహని కూడా జోడించి మంచి ముగింపు ఇచ్చి ఉండాల్సింది.ఎందుకంటే ఊహ అనేది జరిగిన సంఘటనని మరియు జరగబోయే సంఘటనలను జోడిస్తుంది.మీరు రాసిన కథలో మీరు పోల్చిన పోలికలు చాలా బాగున్నాయి.ఏమయినా తప్పు గా చెప్పి ఉంటే నన్ను క్షమించండి.

    • Thank you sreeja. ఇది వల్లాపురం ఊరిలోని యాత కుటుంభీకులతో మాట్లాడిన తరువాత రాసిన కథ. నిజమే నువ్వన్నట్టు వివిధ వృత్తులకు సంబంధించి చాలా కథలున్నాయి అక్కడ. వాస్తవాలు కళ్ళెదురుగా వున్నప్పుడు ఇక ఊహతో పనేముందని వాడలేదు. చిన్నదానివైనా మంచి సూచన చేశావు ధన్యవాదాలు.

  • అయ్యా, మీ కథ చాలా బాగా నచ్చింది. మీకు శుభాభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు