నిద్రపోనివ్వదు , మెలకువగా వుండనివ్వదు!

కథలు కల్పితాలే ఐనా.. కవిస్వరంలోని జీవం కొన్ని పాత్రల గొంతుల్లోఅలా అమృతం పోసేస్తుంది.  గోవైనా.. గడ్డిపూవైనా..  ఏ అనంతామాత్యుడో, రాయప్రోలో  పూనుకుంటే.. ఇదిగో.. ఇలాగా.. మన ప్రస్తావనల్లో నిత్యస్మరణులౌతాయి.

కసారి  బీజంపడితే చాలు కాల్చిందాకా కవిని వదిలిపోని నైజం కవిత్వానిది. కవిత్వం అబద్ధం కావచ్చేమో కానీ… అది చేసే గాయం మాత్రం పచ్చినిజం. నిద్రపోనివ్వదు. మెలుకువగా ఉండనీయదు. అదోరకమైన అర్థస్వప్నజాగృతావస్థ . అనుభవించేవారికే తెలిసే అవస్థ.

ఇక భాషందామా! ప్రతీకలు, పరోక్ష సూచనలు.. పీకల్దాకా మునిగిపోయిన పిల్లకాయల  తొలిప్రేమ తంతే అంతా.  రోణంకి అప్పలస్వామిగారిని ఓసారి ఎవరో కుర్రాడు ‘కవిత్వం రాయాలంటే ఏం చెయ్యాలో చెప్ప’మని సలహా అడిగితే  ‘ఎవర్నయినా పిల్లను చూసి ప్రేమించేసెయ్‌’ అని   పెంకి సలహా ఇచ్చార్ట . ‘ప్రేమిస్తే జ్వరమొస్తుంది కానీ కవిత్వ మెందుకొస్తుందా? అని కదా సందేహం? వస్తుంది. ఆ అమ్మాయి కనిష్టంగా ఏ సినీస్టార్ అంత అందంగా వుండుంటుంది కదా!  తెలివైనదీ  అయివుంటుందేమో కూడా!

ఇన్నీ వుంటే, తనని  నువ్వొక్కడివే ఎందుకు తగులుకుంటావ్! ఇంకో వందో రెండొందలమందో   క్యూలో తగలడుంటారు కదా! వాళ్ళందరూ వట్టి దొంగ సన్నాసులనీ.. నువ్వొక్కడివే శ్రీరామచంద్రుడి పక్కింటి  పెద్దాసామివనీ  నమ్మించటానికి నువ్వూ ఎన్నో   తంటాలు పడతావ్!  మంచాన పడతావ్! నీది నిఝమైన ప్రేమ కాబట్టి  రాత్రీ, పగలూ.. తిండీ తిప్పలూ.. నిద్రా నిప్పులూ లేకుండా  తన గురించే నలిగిపోతో.. నరకయాతన పడుతో వంటిమీదకు చలిజ్వరం కూడా తెచ్చేసుకుంటావ్. ఆ వణుకునూ.. వేదన్నంతా పొల్లుపోకుండా ఓ కాగితం మీద కనక పెట్టి చూసుకున్నావనుకో.. అదే ఓ ‘కృష్ణపక్ష’మై కూర్చుంటుంది.. అధమ పక్షం నువ్వో అభినవ కృష్ణశాస్త్రివై పోతావ్” అన్నార్ట ఆ పెద్దాయన.

ఆ సరదా సంఘటన్ని ఇంకొద్ది సీరియస్ గా తీసుకుంటే కవిత్వం అంతస్సారం కొంతైనా  తలకెక్కుతుంది.  ప్రేమించే పిల్ల స్థానంలోకి .. ప్రపంచమొచ్చిందనుకోండి.. శ్రీశ్రీ.  వైరాగ్యమొస్తే వేమన.

‘కవిత్వం నాకు కన్ను మూతపడని జ్వరం/ .. ఒక్క కవితా వాక్యం/ ఈ గుండె లోతుల్లోంచి/ పెల్లుబికి రావాలంటే/ ఎన్ని రాత్రుల నిద్రని తాకట్టు పెట్టాలో”/ అని కవి’ రాధేయ’ వూరికే అంటాడా?!

‘కవిహృదయం ఉన్నవాడు ఒక ఉన్నతమైన మానసికస్థితిలో ఉన్నప్పుడు వెలికొచ్చేదంతా కవిత్వమే!’– అన్నాడు    కోల్ రెడ్జ్.  నన్నపార్యుని నుంచీ దర్భశయనం శ్రీనివాసాచార్యుల దాకా.. ఎంతోమంది ఇంతకుముందే ఆ ‘ఉన్నతమైన మానసికస్థితి’ అంతు  చుడాలని   ఎంతో ప్రయాస  పడ్డారు.. పడుతున్నారు.  ఇంట్రస్టంటూ ఉండాలే కానీ ఇంటర్నెట్లో..  అరిస్టాటిల్ నుంచీ అద్దేపల్లివారి వరకు.. ‘ఫ్రం శామ్యుల్ జాన్సన్ టు ఎడ్గార్ ఏలన్ పో’ ఈ అంతస్సారాన్ని అరటిపండులా వలిచి నోట్లో  పెట్టేందుకు మౌస్ క్లిక్ దూరంలో  మనకూ రెడీ.

సాదీ మహాకవి ‘జ్ఞానవంతులకు పచ్చనిచెట్టు ప్రతిపత్రం  ఒక్కో జ్ఞానక్షేత్రమే’ అంటారు.   కవికి సరిగ్గా అతికినట్లు సరిపోయే అతిగొప్ప నిర్వచనమది. చెట్టుకవి ఇస్మాయిల్  భాషలో చెప్పాలంటే   ‘తెరుచుకొన్న పద్యాలను’ కూర్చే వాడే అచ్చమైన కవి.

‘సెలయేరా సెలయేరా/ గలగలమంటో నిత్యం/ఎలా పాడ గలుగుతున్నావు?’

‘చూడు, నా బతుకునిండా రాళ్లు/పాడకుంటే ఎలా?’ – ఇది ఇస్మాయిల్ కవిత. ఇందులోలా ముగింపు  పాఠకుడి మనసు  కొనసాగింపుగా ఐతేనే ఏ కవితకైనా  ఇంపూ సొంపు. ”

‘రూపం..భాష’- చర్చ  ఆనక.. మంచికవిత్వం రాయాలంటే  ముందు జీవితాన్నిగాఢంగా ప్రేమిచాలి” అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు/నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు/నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’-అని సంకల్పం చెప్పుకోబట్టే  తిలక్ అంత మంచి కవితలు అల్లగలిగాడు! ‘చూసే కళ్ళుండాలే కానీ చుట్టూతా బృందావనమే’అని కవి జ్ఞానేశ్వర్ బోధ.

అట్లతదియ పండగకి వయసులో ఉన్న ఆడపిల్లలు ఊరి బయట తోటల్లో  మోకుల్తో ఉయ్యాలలేసుకొని ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అని పాడుకుంటూ  పోటాపోటీగా ఊగే ఆచారం ఒకప్పుడు మన  పల్లెపట్టుల్లో బాగాప్రచారంలో ఉండేది. మామూలు కంటికది ఓ మనోహర దృశ్యం మాత్రమే కావచ్చు పింగళి సూరన బోటి  రసపిపాసి కంటికి   ‘కొమరుంబ్రాయపు గబ్బి గుబ్బెతల యంఘ్రుల్ చక్కగా జాగి మిం/టి మొగంబై చనుదెంచు’ ఠీవి.

‘కళాపూర్ణోదయం’  రాస్తున్నప్పుడు  సందర్భం చూసుకుని     వయసులో ఉన్న అందమైన ఆడపిల్లలు  అలా కాళ్ళు ఆకాశం వైపు బారలు చాస్తూ పైకి లేపటాన్ని   స్వర్గధామంలోని   దేవతా స్త్రీల మీద చేసే యుద్ధంగా ఉత్ప్రేక్షించి  రసహృదయాలకు చక్కలిగింతలు పెట్టేసాడు కవి. అన్వేషించే ఆసక్తి ఉండాలే కానీ మన మానసాంతరాలను కాంతివంతం చేసే  మణిమాణిక్యాలు విశ్వసాహిత్యంలో   బోలెడన్ని.

కన్నవారికి, కట్టుకున్న దానికి మనస్తాపం కలిస్తున్నాడని కబురంది.. పుట్టింటి వ్యవహారాలు చక్కబెట్టేందుకని  వచ్చిన ఓ అక్కగారు.. చెట్టంత  తమ్ముడిని.. నేరుగా నిలదీయలేక ‘ఏరా తమ్ముడ! నన్నుజూడ జనుదే వెన్నాళ్ళనో యుండి చ/క్షూరాజీవ యుగంబు వాచె నిను గన్కోకుంకి’  అంటో గడుసుగా యోగక్షేమాలు ఆరంభించిన కథ తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యం నిగమశర్మోపాఖ్యానంలోఉంది. ఇన్నేళ్ళు గడిచినా మనమింకా ఆ పద్యాలనే తలుచుకుని మురుస్తున్నామంటే.. కవి ఆ అక్కపాత్రకి ఆపాదించిన  ఆప్యాయతలే ముఖ్య కారణం.

కథలు కల్పితాలే ఐనా.. కవిస్వరంలోని జీవం కొన్ని పాత్రల గొంతుల్లోఅలా అమృతం పోసేస్తుంది.  గోవైనా.. గడ్డిపూవైనా..  ఏ అనంతామాత్యుడో, రాయప్రోలో  పూనుకుంటే.. ఇదిగో.. ఇలాగా.. మన ప్రస్తావనల్లో నిత్యస్మరణులౌతాయి.

కల్హణుడు అందుకే  కవి గొప్పతనాన్ని శ్లాఘిస్తో ఓ చక్కని శ్లోకం చెప్పాడు. ‘కో~న్యః కాలమతి క్రాంతం నేతుం ప్రత్యక్షతాం క్షమః। కవి ప్రజాపతీన్  త్యక్త్వా రమ్యనిర్మాణ శాలినః॥’-రమ్యనిర్మాణ సమర్థులు కవిబ్రహ్మలు కాక అతిక్రమించిన కాలాన్ని దృష్టిగోచరం కావించే సమర్థులింకెవరు?..అని శ్లోకార్థం.

సత్కవుల  అనుగ్రహం  సన్నగిల్లితే  సకలైశ్వర్యాలు అనుభవించే సామ్రాట్టులైనా  కాలందృష్టిలో  చట్టుబండలే. వాల్మీకి చేతిచలవ వల్లే రాముడు  దేవుడయ్యాడు.  కవులెంత భాగ్యవంతులో చెబుతూ ఇస్మాయిల్ అంటారూ.. ‘కిటికీ లోంచి వాలి టేబుల్ పై పుస్తకాన్ని, పెన్నుని ఇంకు స్టాండుని మంత్రించే సూర్యకిరణం ఖరీదెంత! కవికి మాత్రమే దొరికే ఈ ప్రాకృతిక  అనుభవానంద సంపద  ఎంతెత్తు  ధనరాసి ధారపోస్తే జడ్డికి లభిస్తుంది!’-అని.

నిజమే. కవిత్వానికి కాసుతో నిమిత్తం లేదు. ధనమే ప్రధానమనుకునే వారిని కవిత్వం కనికరించదు.  ‘నిధి చాల సుఖమా..రాముని సన్నిధి చాల సుఖమా’ అన్న ప్రశ్న ఎదురైనప్పుడు త్యాగయ్యలాగా కవితారాముణ్ణి చేరతీసిన వారినే  కాలం  కీర్తికిరీటంతో సత్కరించేది.

‘అక్కయ్యకు రెండో కానుపు/తమ్ముడికి మోకాలి వాపు/చింతపండు ధర హెచ్చింది/చిన్నాన్నకు మతి భ్రమించింది’- అని నిద్ర లేచిన క్షణంనుంచీ రోకలి కింద నలిగే గోరుచుట్టు  సలుపులా  ఈతిబాధలు సామాన్యుణ్ణెప్పుడూ సతాయించేవే! ఏడుపు ఎలాగూ తప్పదని తెలిసినప్పుడు.. ఆ వెక్కిళ్ళ మధ్యలోనే  ఏ కృష్ణశాస్త్రిలాగానో  ‘నా నివాసమ్ము తొలుత గంధర్వలోక/ మధుర సుషమా సుధాగాన మంజువాటి’ అంటూ  రెక్కలు విప్పుకుని  ఎగిరిపోవటం మొదటి మార్గం. విన్నకోట అనే ఓ నేటి కవి చెప్పినట్లు  ‘దేహం విల్లుకి ప్రాణాన్ని సంధించి లాగినట్లు/మరుక్షణంలో మరణావరణాన్ని దాటబోతుండగా/ పక్కింటి వాడికివ్వాల్సిన చేబదులు గుర్తొచ్చి/ వార్నీ అనుకుంటూ వెందిరిగి నడిచి’వచ్చే  లౌకిక మార్గం రెండోది.  రెండూ కవితామార్గాలే ఐనా.. భావకవిలాగా ‘దిగి రాను దిగి రాను దివి నుంచి భువికి’ అని మొరాయించటం  పలాయనవాదం అవుతుంద. దేశమంటే మట్టి కాదోయ్/దేశమంటే మనుషులోయ్’ అంటో గురజాడవారు చెప్పిన గేయం తాలూకు  మనుషులు ‘మనీపర్సులు ప్లస్   మనీషులు’ కాబట్టి.. సందర్భాన్నిబట్టి    రాజీబడి  ‘ఆకులందు అణగిమణగిన/కవితకోకిల’ లాగా కూయటం ఉత్తమకవి లక్షణం.

అల్లసానివారికి మల్లే ‘ నిరుపహతి స్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క/ప్పుర విడె మాత్మకింపయిన భోజనముయ్యెల మంచం’ లాంటి గొంతెమ్మ కోర్కెలు పెట్టుకోకుండా ‘గుండె గొంతుకలోన కొట్లాడినప్పుడు’ మాత్రమే చప్పుడు చేయడం  మంచి కవి లక్షణం.

అలాగని ‘నువ్వు/నన్ను చూసి/అలా నవ్వుతూనే ఉండు/నీ గుండెల్లో ఎప్పుడో/గోలీ వేస్తాను/నా పదకవితల/రంగోలీ వేస్తాను’ అని రాసేసి జంధ్యాల సినిమాలో శ్రీలక్ష్మి లాగా ‘నేను కవిని కాదన్నా వాణ్ణి కత్తితో పొడుస్తా!’అంటో బాకు బోడ్లో దోపుకుని తిరగడమూ   క్షేమం కాదు.

అసలే కవిత్వం సోమరుల సత్రమనీ, ఈ సత్రంలో కవిత్వం నల్లమందు  కొల్లలు కొల్లలుగా  దొరుకుతుందని.. తదౌషధ  మాహాత్మ్యం వల్ల మాడిన పోపుఘాటు టైపు ఊపిరి సలపని   తుమ్ముల్లా   కవిపుంగవుల  కలాల్నుంచీ  కవిత్వం  పొంగిపొర్లి వాతావరణమంతా కంగాళీ కాలుష్యమయమై పోతోంద’ని కొంతమంది కళావిద్వేషులు    కలవర పడుతుంటారు.   శతావధాని వేంకటశాస్త్రిగారి ‘కథలూ-గాథలే’ సాక్ష్యమని బుకాయిస్తారు. కాని ఆ అవధానిగారే  అనారోగ్యంతో  ఆసుపత్రిలో పడున్నప్పుడు వైద్యులెంత వద్దని  వారిస్తున్నా    కట్టిపెట్టలేక పోయారు  ఈ కవితావ్యాసంగాన్ని!  ‘లోపల్నుంచి ఇది (కవిత్వం) బైటికి పోకపోతే ఆ బాధ మీకేం తెలుసునర్రా!’ అంటో ఆయన పెట్టిన గగ్గోలు పొయిట్రీకున్న డిసెంట్రీ  పవరేంటో తెలియచేస్తుంది.

తెలుగువాళ్ళ చేత ఆస్కారు  చిత్రాలు తీయించటమెంత  ‘అప్-హిల్ టాస్కో’.. తెలుగునాట కవిత్వాన్ని కట్టడిచేయడం  అంతకన్నా రిస్క్. కవితాద్వేషులు హాలుని కాలంనుంచీ అలా హాహాకారాలు చేస్తూనే ఉన్నారు . వాళ్ళ గగ్గోలులో  కూడా గోళీకాయంత సత్యమేమైనా ఉందేమో.. ఔత్సాహిక కవులూ కొంత అంతశ్శోధన చేసుకోవడం శ్రేయస్కరం.

‘హింసన చణ/ధ్వంస రచన’ ఎవరికీ మంచిది కాదు. ‘కదిలేది.. కదిలించేది.. మును ముందుకు సాగించేది..పెను నిద్దర వదిలించేది..’అని అన్నాడు కానీ..’బాధతో పెడబొబ్బలు పెట్టించేదీ.. భయంతో పరుగులు పెట్టించేది’ నవకవితా లక్షణమని మహాకవి శ్రీశ్రీ కూడా  ఎక్కడా అన్నట్లు  గుర్తు లేదు.

తనను కలిసిన  అభిమానులు కొందరు కవిత చెప్పమని వత్తిడి చేస్తే.. తట్టుకోలేని  ఆ మహాకవే ఎప్పుడు పడితే అప్పుడు   కవిత్వం చెప్పడం  ఎంతటి  ఇబ్బందో అప్పటికప్పుడు   ఆశువుగా ఓ కవితలో చెప్పుకొచ్చారు. ‘కవనానికీ వచనానికీ నడుమగల/సరిహద్దులు చెరిగిపోయిన ఈనాడు/శబ్దాన్ని నిశ్శబ్దంతో తర్జుమా చెయ్యగల/శక్తివంతమైన యంత్రాలున్నఈనాడు/శవత్వం పాశవత్వం పెరిగి/నవత్వం తరిగి/దానవత్వం సర్వత్రా/దంష్ట్రలు కొరుకుతున్న నేడు/యువత్వం వెనుకంజ వేస్తున్న ఈ రోజున/కవిత్వం చెప్పడమంటే మజాకాలా?’ అంటో ముక్తాయించారు. మహాకవిగారినే ముప్పతిప్పలు పెట్టించిన ఈ కవితామతల్లి మీద హాస్యాలు  మానేసి ఒకింత  సీరియస్ గా పరికించి చూద్దాం .

రవి వీరెల్లి  ‘దూప’ కవితా సంకలనం ‘ఎదురు చూపు’ లో కవిత్వాన్ని గురించి చెప్పిన మూడు మంచి ముక్కలతో ఇక ముగిద్దాం.

‘నీ తలపు

ఎక్కడో పచ్చికబయల్లో పారేసుకున్న మన పాత గురుతులని

ఎదకు ఎరగా వేసి పద పదమని పరుగు పెట్టిస్తుంది

 

నీ ధ్యాస

స్మృతుల శ్రుతిలో స్వరాలాపన చేస్తున్న నా హృదయ లయను

గమకాల అంచుల్లో తమకాల ఉయ్యాలలూపుతుంది

 

నీ ఊహ

మొగ్గలా ముడుచుకున్న జ్ఞాపకాలని బుగ్గరించి విరబూయించి

అనుభవాల రెక్కల చిరుజల్లుగా చిలకరిస్తుంది’

ఒక భావోద్వేగంలో పుట్టిన పదాలు .. కొన్నాళ్ళు గడిచిన  తరువాతా.. కవిని మళ్ళీ అదే ఎమోషనల్ ప్లేన్ లోకి మళ్ళించగలిగితేనే  .. అది అసలైన కవిత్వానికి గీటురాయి- అని కవి దిద్ధతుల  ఉవాచ.

అందుకే ‘ఒక కన్నీటికణం బరువుకి చిగురుటాకులా ఒదిగిపోయి-ప్రపంచ దుఃఖాన్నంతా అట్లాస్ లా భుజాలకెత్తుకోగలిగే’  దాకా  మన అక్షరాలకు మన మానసాంతరంగ భావవ్యాయామశాలలో శిక్షణ ఇస్తూనే  ఉందాం!

***

చిత్రం: రాజశేఖర్ చంద్రం

 

కర్లపాలెం హనుమంతరావు

1 comment

Leave a Reply to Karlapalem Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు