నిజంగా అది చిన్న మాటేనా?

వ్యాపార చిత్రాలు అని మనం పిలుచుకునే చిత్రాలలో చాలా వరకూ వొకే మూసలో వుంటాయి. కొంచెం తేడాలతో. నాయికా నాయకులు ప్రేమించుకుంటారు. కులమో, మతమో, అంతస్తో, మరొకటో కారణంగా అది వివాహానికి దారి తీయదు. చాలా ఘర్షణలనంతరం పరిస్థితులు సర్దుకుని, వారి వివాహం అవుతుంది. ఆ తర్వాత వొక గ్రూప్ ఫొటో, శుభం అనే అక్షరాలమీద తెర దిగడం. ఇంగ్లీషులో అంటారుగా ఆ తర్వాత వాళ్ళిద్దరూ జీవితాంతం సుఖంగా బతికారు అని, అలాంటి మూడ్ లో సినేమా ముగుస్తుంది. నిజంగా అంతేనా. వైవాహిక జీవితంలోని చిక్కుముళ్ళు, క్లిష్టతలు ఇంకా సవాలక్ష అనుభవాలను సినెమా పట్టించుకోదు, తెరకెక్కించదు.

నా శరీరం అని చెప్పుకుంటున్న ఈ శరీరంలో నిజం చెప్పాలంటే సగం కంటే తక్కువ భాగం నా అనతగ్గ కణాలున్నాయి. మిగతాదంతా నివాసమున్న పలురకాల సూక్ష్మ జీవరాశులు. కాబట్టి నేను అన్నప్పుడు నేను నాతో పాటు వాటిని కూడా కలుపుకుని మాట్లాడుతున్నాను. మరి అలాంటి జీవులలో శరీరానికి మేలు చేసేవీ, కీడు చేసేవీ రెండూ వున్నాయి. శరీరంలో వొక సమతుల్యతను సదా నెలకొల్పడానికి ముందుగానే అవసరమైన ప్రణాళికలు సిధ్ధంగా వున్నాయి. మరి శరీరంలో భాగమైన మెదడు పరిస్థితి కూడా అంతేగా.

ఇక పోతే మన చిత్రాలు ప్రేమ అన్న పదాన్ని చాలా పవిత్రంగా, దైవికంగా, మహా అనుభవంగా, బలంగా చూపిస్తారు. కాని వొక కుటుంబం అనుకూలంగా, జయప్రదంగా పరిణమించాలంటే ప్రేమ వున్నా లేకపోయిన పరస్పర గౌరవ మర్యాదలూ,పరస్పర స్థిర నమ్మకమూ వుండాలి. అలాంటి సున్నితమైన విషయాలన్నీ చూస్తామిందులో.

రజత్ కపూర్ మనకున్న మంచి నటులలో, దర్శకులలో వొకడు. ఈ పేరుతో ఇద్దరున్నారు. అప్పట్లో టీవీ సీరియల్ వచ్చేది వ్యోమకేశ్ బక్షీ అని. అందులో నటించిన అతను కాదు. మరో రజత్ కపూర్. మిథ్య, రఘు రోమియో, భేజా ఫ్రై లాంటి చిత్రాలు తీసినతను. ప్రధాన శ్రవంతి సినెమా పట్టించుకోని, తాకని అంశాలను తీసుకుని సశక్త చిత్రాలు తీశాడు. వాటిలో మిక్సడ్ డబల్స్ వొకటి.

రణవీర్ షౌరి, కొంకొణా సెన్ శర్మ ల వివాహమై పదేళ్ళయ్యింది. యేడెనిమిదేళ్ళ కొడుకు. భార్యా భర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుంటారు. రణవీర్ వయసు 37. మొదట్లోనే రాత్రి భోజనం ముగించి అతను సోఫాలో పుస్తకం చదువుతూ కూర్చుంటాడు. కొంకొణా రొమాంటిక్ మూడ్ లో దగ్గరికొచ్చి అతన్ని తన వైపుకు లాగుదామని చూస్తుంది. విసుక్కుంటాడు. ఈ వొక్క అధ్యాయం పూర్తయ్యాక వస్తాను, నువ్వెళ్ళి పడుకో అంటాడు. ఆమె మొహం వేలాడదీసి వెళ్ళి పడుకుంటుంది. ఆమె పడుకున్న తర్వాత అతను నెమ్మదిగా వెళ్ళి పక్కన మేను వాలుస్తాడు. మర్నాడు ఆఫీసులో స్నేహితులతో చర్చ. అంగ స్తంభన కు సంబంధించి. వొక మిత్రుడు వయాగ్రాను సూచిస్తాడు. అంత తీవ్రమైన సమస్య కాదు. కలుగుతుంది, అయితే కావలసినప్పుడు కాదు, అన్ని తప్పుడు సందర్భాలలో అంటాడు. భార్యా భర్తలు ముఖా ముఖీ ఈ విషయం చర్చించుకోలేక రకరకాల అనుమానాలతో అలమటిస్తారు. నేనిప్పుడు అతనికి అందంగా కనబడట్లేదా అని ఆమె, ఆమె నన్ను వో శక్తిలేనివాడిగా భావిస్తుందేమో అని అతను. అలాంటప్పుడు వాళ్ళ స్నేహితులైన వొక జంట అమెరికా నుంచి వస్తారు. బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు రణవీర్ తన మనసులో మాట చెబుతాడు. దానికి ఆయన చెప్పింది విని షాక్ తింటాడు రణావీర్. అతను చెప్పేది యేమిటంటే పడక గదిలో ఉత్సాహాన్ని నిలుపుకోవడానికి వొక్కో సారి కొత్త పోకడలు పోవాలి. అమెరికాలో స్వింగింగ్, స్వాపింగ్ మామూలే. తాము కూడా ఆ పని చేస్తారు. అందుకే ఇప్పటికీ కుర్రవాడిలా ఫీలవుతానంటాడు. ఆ క్షణంలో ఒక పురుగు రణవీర్ మెదడులో దూరి తొలుస్తూ వుంటుంది చివరిదాకా. ముందు అలాంటి మేగజైన్ సంపాదిస్తాడు, ఎందులోనైతే అలాంటి జంటలు ప్రకటనలు ఇస్తారో. వొక పక్క అలాంటి వాళ్ళతో సంభాషణ నెరపడానికి ప్రయత్నిస్తూ, మరో పక్క భార్యను మానసికంగా సంసిధ్ధం చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఆమె ససేమిరా అంటుంది. బలవంతం పెరిగే సరికి పెట్టే బేడా సర్దుకుని, కొడుకుతో తల్లి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిన బాధ కంటే మెదడులో తొలుస్తున్న పురుగు ఎక్కువ కలవరపెడుతుంది అతన్ని.

నాటకమాడి, బీపీ పెరిగిందని చెప్పి ఆసుపత్రిలో జేరి, స్నేహితుని చేత కబురు పంపిస్తాడు. తల్లీ కూతుళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. డాక్టర్ సలహాలలో భాగంగా అతనికి మానసిక వొత్తిడి రాకుండా చూసుకోండంటాడు. ఈ సారి అతని ప్రతిపాదనను అతని ఆరోగ్య దృష్ట్యా ఆమె అయిష్టంగానే వొప్పుకుంటుంది. రెండో జంట రజత్ కపూర్, కొయల్ పూరిలది. నాలుగేళ్ళ ప్రేమ జీవితం, ఆనక పెళ్ళి, మరో నాలుగేళ్ళ సాహచర్యం. అలా వాళ్ళు ఎనిమిదేళ్ళుగా వొకరికొకరు తెలుసు. పిల్లలు లేరు. ముందే అనుకున్నట్టుగా రణవీర్ జంట రజత్ ఇంటికి వెళ్తుంది. భోజనాలనంతరం ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్తారు. కోయల్ రణవీర్ తో చాలా ఆటలాడించి, తను అలసి పోయి నిద్రపోతుంది. నా ఖర్మ అనుకుంటూ నిరుత్సాహంతో అతను కూడా నిద్ర పోతాడు. ఇవతల రజత్ కొంకొణాలు రాత్రంతా కూర్చుని మాట్లాడుకుంటారు. ఆమెకు ఇష్టం లేదని తెలుసుకుని అతను మెదలకుండా వూరుకుంటాడు. అలా తెల్లారిపోతుంది. రణవీర్ కొంకొణాలు కారేసుకుని ఇంటికి బయలుదేరుతారు.

దారిలో ఇద్దరి మధ్యా గొడవా. అతను గుచ్చి గుచ్చి అడుగుతాడు, రాత్రి అసలు నిద్రపోయావా అని. ఆమె ఏమీ చెప్పదు. ఏం చేశారు రాత్రంతా అంటాడు. నువ్వు దేనికి తెచ్చావో మరిచిపోయావా అంటుంది. అంతే అతనిలో పురుషాహంకారం బుసలు కొడుతుంది. నీ మీద నమ్మకం పెట్టుకుంటే నువ్వు చేసింది ఇదా అంటాడు. నువ్వు మాత్రం అంటుంది. నేనేం చెయ్యలేదు, కాసేపు ఆటలాడుకున్నాక ఆమె నిద్ర పోయింది అంటాడు. ఆమె నిద్ర పోయింది కనుకనే ఏమీ చెయ్యలేదు అని దెప్పి పొడుస్తుంది. అతను కోపంగా కారును తంతాడు. నా మీద కోపం నా కారుమీద యెందుకు చూపుతావు అంటుంది. దీని నెలవారి కిస్తులు మూడేళ్ళనించీ నేనే కడుతున్నాను, ఇది నాది అంటాడు. మరి మొదట్లో కట్టాల్సిన down payment చేసింది నేనే అంటుంది. కాసేపు గొడవలు పడి కారు స్టార్ట్ చేసి బయలు దేరుతారు. కొంకొణా అమ్మ ఇంట్లోంచి నిద్రపోతున్న కొడుకును ఎత్తుకుని బయటికొస్తాడు రణవీర్. తర్వాత ఇల్లు జేరతారు. అక్కడ వొక స్టాటిక్ షాట్. కెమెరా ముందు ముఖ్య ద్వారం, లోన passage, ముందుకెళ్తే ఎడంవైపు దారి వంటగదికి, కుడివైపు దారి బెడ్రూంకి. తిన్నగా వెళ్తే వాష్రూం. రణవీర్ నిద్రపోతున్న బాబును ఎత్తుకునే వున్నాడు. అతని పేంటు జేబులోంచి తాళం చెవి తీసి తలుపు తీస్తుంది. ఇద్దరూ లోపలికెళ్తారు. అతను బాబును పడుకోబెట్టి మరలా బయటికి వచ్చి బూట్లు విప్పుతాడు, అక్కడ పడున్న దినపత్రిక తీసుకుని లోపలికెళ్తాడు. ఆమె తన పర్సును లోన పెట్టి బయటికి వచ్చి పాల పేకెట్లను తీసుకుని వంటగదిలోకెళ్తుంది. అవక్కడ పెట్టి dustbin తీసుకుని వచ్చి బయట పెడుతుంది. రణవీర్ ఆమె దగ్గరికొచ్చి అంటాడు, టీ పెడుతున్నాను, నువ్వూ తాగుతావా అని. తాగుతానంటుంది. ఆ తర్వాత టైటిల్స్.

మెదడులో పురుగు దూరి తొలిస్తే యెలాంటి పరిణామాలు సంభవమో చూశాం కదా. ఆ పురుగు దూరిన క్షణం నుంచీ అతను కాలు కాలిన పిల్లిలా అయిపోతాడు. జత కాగల మరో జంట అన్వేషణలో ప్రతిసారీ అత్యుత్సాహంగా, తొందరపాటుగా వ్యవహరిస్తాడు. భార్యను వొప్పించడానికి మాయ మాటలు చెబుతాడు, పన్నాగాలూ పన్నుతాడు. ఈ వొక్కసారికి వొప్పుకో, నేను తప్పుగా ఎంచను, నువ్వు కూడా ఆత్మ న్యూనత పెట్టుకోవద్దు అన్న మనిషి చివరికి టిపికల్ ఎంసీపీ గా బయటపడతాడు. ఇక ఆ చివరి దృశ్యం అంత వివరంగా ఎందుకు చెప్పానంటే నిలకడ అయిన నిజాన్ని వొకే షాట్లో బయటినుంచి వారిని చూపించి మరలా తమ పూర్వపు స్థితికి చేరుకున్నట్టు చూపించాడు. ఇదివరకటికీ, ఇప్పటికీ తేడా వుండొచ్చు గాక, కాని ఆ ఇద్దరినీ కలిపి వుంచిన విషయం ఇంకా సజీవంగానే వుంది కాబట్టి అలా.

వివాహానంతరం సంవత్సరాలు గడిచేకొద్దీ సంసార జీవితం వొక రొటీన్ గా మారడం, దాని పరిణామం పురుషుల మీద వొకలా పడటం, మనసు విప్పి మాట్లాడుకోకపోవడం వల్ల సమస్య జటిలమవడం ఇవన్నీ చూస్తాము. మనిషి కోతి నుంచి వచ్చాడంటారు. కాబట్టి ఇలాంటి పురుగులు మనిషి మెదడులో దూరి కోతి ని ఆడించినట్టు ఆడిస్తాయి. దాని పరిణామాలూ చూస్తాం. నిజ జీవితంలో ఇలాంటి విషయాలను చూసి చూడనట్టు నటిస్తుంది ప్రధాన స్రవంతి సినెమా. కాని రజత్ కపూర్ దాన్ని తీసుకుని హాస్యం మేళవించి మంచి చిత్రం అందించాడు.

కచ్చితంగా శారీరిక ఆకర్షణా, కోరికా కాకపోయినా మనసుకు సంబంధించిన రొమాంటిక్ వూహలు వో పడుచు పిల్ల మనసును ఎలా ఆడిస్తాయో రజనీ గంధాలో చూస్తాము. అమోల్ పాలేకర్, విద్యా సిన్‌హాలు ప్రేమికులు. వొక ఇంటర్వ్యూ నిమిత్తం విద్యా బొంబాయి (ఇప్పటి ముంబై) కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ అనుకోకుండా కాలేజి రోజుల నాటి మిత్రుడు కలిసి ఆమె వున్నన్నాళ్ళూ ఆమెతోనే వుండి అవసరమైన సహాయం చేస్తాడు. ఆ రోజుల్లో ఆమె అతని మీద మనసు పడింది. కాని బయట పెట్టుకోలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ కలిసి ఆ పాత తీయటి వూహల్లో డోలాయమానమవుతుంది ఆమె మనసు. అతని మనసులో ఏమీ వుండదు. కేవలం ఆమెకు తెలియని వూళ్ళో సహాయం చేయడమే. పని ముగిసాక ఆమె తిరిగి తన వూరుకు చేరుకుంటుంది. రజనీగంధా (నేల సంపెంగలు) తీసుకుని వచ్చిన అమోల్ పాలేకర్ ను అల్లుకు పోయి, ఇదే నిజము, ఇదే నిజము అని మనసులో అనుకుంటుంది. మనసులో కాసేపటికోసం అల్లుకున్న చాంచల్యం చాలా సున్నితంగా చూపించాడు దర్శకుడు. ఆమె కూడా తొందరగానే తన పొరపాటు తెలుసుకుని నేల మీద నిలదొక్కుకుంటుంది.

ఈ అంశం మీద, ఈ చిత్రం మీద చర్చించాల్సింది చాలానే వుంది. కాని మీరు కూడా చూసి మీ వంతు స్పందనలు పంచుకోండేం.

*

 

 

పరేశ్ దోశి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి పరిచయం! మంచి విశ్లేషణ! ఎంత సేపూ ఊహాలోకాల్లో విహరించె సినిమాలే! నిజ జీవితం! ఆ జీవితంలోని సమస్యలు! ఎంత ప్రాముఖ్యం! నేను మీ article s చదవలేదు. ఇక అన్నీ చదువుతాను.ధన్యవాదాలు పరేశ్ గారు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు