నా చెప్పుల కథ!

ఏంటో చెప్పులతో నాకు ఒక పురాతనమైన తాత్విక అనుభవం.

యూనివర్సిటీలో సీటు వచ్చేసిందనే ఆనందంలో హైదరాబాదు బయలుదేరడానికి చొక్కాలకు గుండీలు, ఊసిపోయిన ప్యాంట్లకు రంగులు వేయించుకొని, అలాగే నా దగ్గరున్న పారగన్ చెప్పులు కాకుండ ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నపాపులర్ బ్రాండ్ చెప్పులు కొనుక్కొవాలన్నఆత్రం ఎక్కువైంది. అందుకు ముందుగ నాయన్ని తరవాత అమ్మని అడిగి లేదనిపించుకొని అక్క దగ్గరకు వెళ్ళి బతిమిలాడి, ఆమె దగ్గరా లేక చివరికి ఆమె కమ్మలను కుదువ పెట్టి ఆ వచ్చిన డబ్బులతో లెదర్ చెప్పులు కొనుకున్న.

రేటెంతొ కచ్చితంగా గుర్తుకు లేదు గాని, 300 లేక 350 రూపాయలు ఉండొచ్చు. హైదరాబాదుకు పోయే రెండు రోజులముందే కొనుకున్నా, వేసుకోకుండ, పోయేరోజు రాత్రి మాత్రమే వాటిని అట్టపెట్టెలోంచి తీసి ఏదో సాధించాననే గర్వంతో అవేసుకొని గూడూరు రైల్వే స్టేషన్ లో పద్మావతి ఎక్స్ ప్రెస్ ఎక్కాను.

ఏదో తెలియని అనుభవం, కొత్త చెప్పులు, కొత్త జీవితానికి, కొత్త లోకానికి, ఆశలకు, ఆశయాలకు జీవన మనుగడలు ఒకదానితో ఇంకొకటి పెనవేసుకున్నట్టు కడుపులో ఒకటే గిలిగింతలు. యూనివర్సిటీలో సీటువచ్చిందనో, లేకపోతే హైదరాబాదుకి పోతున్నందుకో, కొత్త చెప్పులు కొనుకున్నందుకో తెలియదు కానీ, నా మనస్సు పదివేల వోల్టుల కాంతితో వెలిగిపోతుంది. అది ఆర్ధం చెప్పలేని ఒక అనిర్వచనీయమైన అనుభూతి, ఏదోక ఆంటొలాజికల్ రిఫ్లెక్షన్(ontological reflection). అప్పుడేమనిపించలేదు, అంత అర్దం కూడ కాలేదు గాని, వెన్నక్కితిరిగి ఇప్పుడాలోచిస్తే, అంటే, ఓ పది, పదహారు సంవత్సరాల తర్వాత ఇమాజిన్ చేస్తే అదంతా ఫిలసాఫికల్ inscribed మూలాల వల్లనేమే అనిపిస్తితుంది.

జనరల్ బోగిలో కిటికీ పక్కన సీటు దొరికితే కూచొని చెప్పులను జాగ్రత్తగా కిందకొదిలి (ఏదో దాచుకొన్నట్టు) కాళ్ళను సీటుపైన పెట్టుకొని కొంతసేపు, ఏసుకొని కొంతసేపు, అల అనుభవిస్తున్న ఆ మార్మికమైన సంబంధాన్ని(అనుభూతిని) బ్రేక్ చేస్తూ నిద్ర తన్నుకొచ్చింది. నిద్ర పోతున్నవాడిని మధ్య మధ్యలో ఎవరో చెంపమీద కొట్టి “చూడ్రా చెప్పులున్నాయా లేవా చూడు’ అని అరిచినట్టు అనిపిస్తే లేసి కళ్ళు తెరిసి చూసుకుని, ఉన్నాయన్న తృప్తితో మళ్ళి పడుకున్న.

అట్లా లేస్తూ పడుకుంటూ మళ్ళీ లేస్తూ మధ్యలో వాటిని చూసుకుంటూ మురిసిపోతూ చివరికి సికింద్రాబాద్ వచ్చిందని తెలిసి ఆ మగత నిద్రలోంచి లేసి చూసుకుంటే కద… చెప్పులున్నాయి కానీ అయి నాయి కావు. గుండెకాయ చేతుల్లోకి వొచ్చింది. ఒళ్ళంత చల్లబడింది. నా చెప్పులున్నచోట వేరేవరివో, బాగా పాతవి, చినిగిపోయి సిమెంటు ఇసుక కలిసిపోయి నా కాళ్ళ సైజు కన్నా పెద్దవిగా ఉన్నాయి. చాలా ఏడ్పొచ్చింది. అవేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ, చివరికి ఆ ఆలోచనల్తో కూడ రాజీ పడిపోయి అవే యేసుకొని కాళ్ళని వాటిని ఈడ్చుకుంటు బేగంపేటకి బయలుదేరాను అక్కోళ్ళింటికి .

అక్కేమో నన్ను నా చెప్పులను ఎగాదిగా మార్చి మార్చి చూసి మీ స్థాయింతే రా !! అన్నటు తిరస్కారంగా చూసి ఆ చెప్పులను బయటే వదిలి రమ్మంది. చెప్పులు పోయాయన్న బాధకన్న ఆ చూపులు నన్నింకా ఎక్కువగా బాధపెట్టాయి. కొత్త చెప్పులు కొనుక్కోవాలన్న ఆశ నాకోస్రం కాదని సమాజం కోసమని, అందులో ఆమే కూడా భాగమని ఆమె దగ్గర నుండి అంగీకారం, గుర్తింపు కోసమేనని అప్పుడు నాకర్ధమయింది. ఇదే కదా Karl Marx చెప్పిన false consciousness. ఈ అంగీకారం కులం నుంచి మాత్రమే కాదు అని, సాంస్కృతిక, ఆర్ధిక పరమైన అంగీకారం కూడ అని ఆ తర్వాతర్వాత చాలా రోజులకి అర్దమయింది. ఇవన్ని ఒకదానిపైన ఒకటి ఉంటాయి. అంటే మన శరీరంలో ఉన్న హేలిక్క్స్ ఎలా పెనెసుకుందో ఆ మాదిరగన్నమాట.

సరే ! ఇప్పుడు నేను బేగంపేట నుండి హెచ్.సి.యు.కి ఎమ్ఎ అడ్మిషన్ కోసం వెళ్ళాలి. అయితే చెప్పులో ? కొనుక్కున్నవి ఎవరో కొట్టేశారు. వేసుకోచ్చినవి బయటేవొదులు ఆ శెనంత మా ఇంట్లోకేందుకు అని అమెంది. మరిప్పుడు నేనెల్లెదేలా? అట్లా ఆలోచిస్తూ, ఆ ఆలోచనల గజిబిజిలో అన్ని కాలకార్యక్రమాలు పూర్తిచేసుకొని ఇక పోదామనే లోపల అక్కొచ్చి బావ చెప్పులేసుకెళ్లు అంది. నేనేమోతను తను దార్లో కొత్తచేప్పులు కొనుక్కో అంటాదేమో అనుకున్ననుగాని, అనుకున్నవన్నీ జరగవు కదా. Life is so unpredictable (జీవితం చాల అనూహ్యమైనది).

నాకాళ్ళ పాదాలకన్న డబుల్ సైజు ఉన్న అయన చెప్పులేసుకొని HCU కి బయలేర్ధాను. దారంతా చెప్పుల గురించే నా ఆలోచన. క్యాంపస్ మెయిన్ గేటు నుండి అడ్మషన్ హాల్ వరకు నడిస్తే 10-15 నిమిషాలు పట్టొచ్చు. కానీ నేనా చెప్పులేసుకొని ఎవరైనా చూస్తున్నారేమోననుకొని, తొందరగా నడవలేక అలాగని మెల్లిగాను నడవాలేక ఎలాగోల హాల్ వరకు చేరాను. గురుబక్ష్ సింగ్ మైదానం కి చేరిన తర్వాత అక్కడ ఉన్న అంతమందిని చూసి ఒకవైపు ఆనందం మరియు ఇంకొకవైపు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అంత మంది, అన్ని జతల కళ్ళు నన్ను కాకుండ నా చెప్పులనే చూస్తున్నాయని ఒక అనుమానం మొదలైంది. అంతటితో ఆగక అది కాంప్లెక్స్ లాగా మారింది. నేనేసుకున్న బెల్ బాటమ్ ప్యాంట్ సాధ్యమైనంతగా కిందికి లాగి చెప్పులను కన్పించకుండా దాచే ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయినా కాని ఆ ఆత్మన్యూనతభావం (inferiority complex), ఎవరో ఒకరు చూస్తున్నారనే భావన మాత్రం నాతోనే ఉండిపోయింది. సాయంత్రం వరకు, HCU వదిలి తిరిగి ఇంటికి వచ్చేవరకు, ఇప్పటి వరకును… ఏంటో చెప్పులతో నాకు ఒక పురాతనమైన తాత్విక అనుభవం.

       *

image: Amitav Kumar

సతీష్ చెన్నూర్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Hi Satish garu, I felt you just recaped my past experience, when I was in college and post college when I joined my first job, there I had similar situation and complexe.
    Nice keep writing , best of luck.

  • Hi Sathish Kumar Garu,

    Super article it’s inspired by me because when you start your with fear with career but now you have more knowledge in society and how to behiour in society. And you sharing you all knowledge to people and to students it’s really great… Keep moving on.

  • కొన్ని వేలమంది జీవిత అనుభం, వందల సంవత్సరాల అనుభవం, ఎప్పటికీ మరచిపోలేని చెప్పుల తాత్విక అనుభవం.

  • Nice narration, when we were in nbkr you used to wear welcome chappals I liked most that company I too want buy that chappals. So we together went to Gudur to buy that chappals. Do you remember…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు