నారాయణస్వామి వెంకటయోగి కవితలు రెండు

1

ఇప్పుడీ కథ చెప్పాల్సిందే .. 

ఇప్పుడో కథ చెప్పుకోవాలి
వెలుతురు బదులు
నల్లని నెత్తురు కమ్మేసిన
దేశం కథ
ఉదయం బదులు
పొడిచే కత్తుల కథ
చిగుళ్లకు బదులు
చెట్లకు వేళ్ళాడుతున్న
తెగిన వేళ్ళ కథ
తోరణాలు బదులు
తలుపులను అలంకరిస్తున్న
ఖండిత శిరస్సుల కథ
ఇప్పుడీ కథ చెప్పుకోవాల్సిందే
నది నీళ్లు నల్లనైన చోట
పొలాల మట్టి ఎముకలయిన చోట
వనాలు భీతావహ చీకటి గుయ్యారాలైన చోట
ఈ కథ చెప్పక తప్పదు
ఇప్పుడైనా చెప్పకపోతే
రేపు
ఇంకెవ్వరమూ మిగలం
కథలుగా కూడా

2

రాలిపోతున్నయన్నీ

ఆకులు రాలుతున్న క్రూరమైన
కాలమిది
అన్నీ రాలిపోవడమే ఈ ఋతుధర్మం
అన్నీ వాడి పడిపోవడమే ఈ కాల లక్షణం
చలిరాత్రి వెన్నెల రాలిపడుతుంది
చీకటి చితి మీద
మౌనం రాలిపడుతోంది చుట్టూ పర్చుకున్న
శ్మశానం లో
మాటలు మిగలని ప్రపంచంలో
కాలం రాలిపడుతోంది ఖండితక్షణాలై
ముందుకు కదలలేని దారుల్లో
కన్నీళ్లు రాలిపడుతున్నాయి చెలిమెల్ని తోడేస్తూ
పగిలిపోయిన చెంపల మీద
మనుషులు రాలిపోతున్నారు ధూసర శిథిలాలై
కూలిపోయిన గోడల మధ్య
పైకప్పు చితికిపోయి ఆకాశం రాలుతుంది ముద్దలు ముద్దలుగా..
నెత్తురు ముద్దలుగా
ఏ చెట్టు మొదట్లోనే రాలిపడుతోంది
గతమంతా
జీర్ణపత్రాలై
జ్ఞాపకాలు రాలిపడుతున్నాయి కొమ్మలమీంచి
వాటికంటిన చిరునవ్వులన్నీ
ఇగిరిపోయి
మిగిలిపోతాం మనమొక్కరమే
సామూహికంగా
శూన్యం పిలిచే నిశ్శబ్ద ఊళల్లో
నక్షత్రాలు ఆత్మహత్య చేసుకున్న
ఆకాశం అంచుల్లో
మిగిలిపోతాం మనందరం ఒంటరిగా
సున్నితత్వపు సమాధులపై
రాలిపోయిన
చివరి ఊపిర్లుగా …
*
చిత్రం: సృజన్ రాజ్

నారాయణ స్వామి వెంకట యోగి

3 comments

Leave a Reply to Narayanaswamy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు