నలభై ప్రాణాల సాక్షిగా

నలభై ప్రాణాల గురించి మాట్లాడదాం

దుర్భర దుర్గంధ సరిహద్దుల్లో

విగతజీవులయ్యే మనుషుల గురించి మాట్లాడదాం.

 

నాగరిక మానవుల రక్షణ కోసం

సకలాయుధాలూ ధరించి దగ్ధమయ్యే

త్యాగాల గురించి మాట్లాడదాం.

 

అదే నాగరిక మానవుల శుధ్ధత కోసం

యే రక్షణ లేకుండా గోదాల్లోకి

దిగే మనుషుల గురించి మాట్లాడదాం.

మరణించినవాడెవడైనా శవమే

శరీరమున్నోడిదెవడిదైనా ప్రాణమే

నీ రక్షణ కోసం ప్రాణాలర్పించేవాడూ

నీ పరిశుభ్రత కోసం దేహాన్నిచ్చేవాడూ

ఎవడైనా మనిషే కాసేపు మనిషి గురించి మాట్లాడకుందాం.

 

భద్రతను సరిహద్దుల్లోకి కుదించి

దేశాన్ని భౌగోళికతలోకి అనువదించి

దేహపరిత్యాగాన్ని భక్తికి వొదిగించి

కురచబార్చిన వాదాల గురించి మాట్లాడదాం.

 

మొదట భక్తి యేమిటో తేలితే

దానిపై అనురక్తికి ఆదేశమేమిటో తెలిస్తే,

మానవ అభివ్యక్తి లేని దేశభక్తి యేమిటో తేలుద్దాం.

 

కాసేపు దేశభక్తి గురించి మాట్లాడదాం.

అడవిదారుల వెంట నలిపేసిన

అందమైన పూల వంటి శవాల గురించి కాదు.

గడ్డకట్టే సరస్సులపై కష్టించే అసహాయ జనంపై

కవాతుజేస్తూ నేలకొరిగిన నలభై శవాల గురించి మాట్లాడదాం.

 

సామాజిక వ్యర్థాలు నింపి పాచి పట్టించిన

నిలువనీటి మడుగు యీ దేశం

చాయ్ కొట్ల వద్ద

వ్యర్థ ప్రసంగాలు వినీ వినీ వూదరగొట్టబడిన

బడుగుచెవులదీ యీదేశం.

ఆత్మలో దివాలా తీసిన

దేశదేహ సరిహద్దుల వద్ద

పరిరక్షణ చేసేవాడైతేనేమీ

పరిశుభ్రం చేసేవాడైతేనేమీ

భరోసాగా బతికేందుకేమీ లేక శవాలయ్యే ప్రజలది యీ దేశం.

 

ఇప్పుడు నలభై శవాలెవరివో మాట్లాడకుందాం.

బతుకుదెరువుకు సాహసాన్ని ధరించి

మంచుకొండల్లోనో మురికి వూబుల్లోనో

గడ్డకట్టిన కరుడు నాయకుడి గుండెల్లాంటి హిమనీనదాలపైనో

వొళ్లంతా కళ్లై శ్రధ్ధను కర్పూరంలా

కరిగించే వీరజవాన్లను జైకొడితే కాదంటామా?

 

మలినరాశుల మధ్య లద్దతట్టలుమోస్తూ

నరమానవుడు దిగలేని కూపాల్లోకి దిగీ

నిహతులయ్యే పారిశుధ్య వీరుల గురించి

యెన్నడన్నా పట్టించుకున్నావా అని అడగక వూరకుంటామా?

 

సాహసం సరిహద్దుల్లోనే ఆగుతుందా

జనజీవన స్రవంతిలో

అడుగడుగునా యెదురయ్యే ఆగడాలను యెదురించడం లోకిరాదా?

 

పుట్టలమీద

బతికే గిరిజనుడు జీవీస్తుంది పడగనీడలో కాదా?

సాహసానికున్న వేలరూపాల్లో

ఏ రూపాన్ని తూచుదాం

ఏ రూపాన్ని పొగడుదాం

ఏ రూపానికి హారతులిద్దాం.

ఇప్పుడు

ముష్కరుల దుస్సాహసానికి బలైన నలభై ప్రాణాల గురించి మాట్లాడదాం.

ఏ వైఫల్యాల వల్లనైతేమి

గాలిలో కలిసిన దీపాల కంటిదీపాలను పట్టించుకుందాం.

నలభై ప్రాణాలకు ప్రతీకారంగా

ఇంకొన్ని

రెట్ల ప్రాణాలు పరిహారం కావడాన్ని ఆపుదాం.

ఇప్పుడు

ముష్కరత్వానికి సరిహద్దుల్లేవని గుర్తిద్దాం.

సరిహద్దుల కటూయిటూ ముష్కర ఆలోచనలకు అడ్డుకట్ట వేద్దాం.

*

వెంకట కృష్ణ

ఇంటర్మీడియట్ చదివే రోజులనుండి కవిత్వం రాస్తున్నా.నా తరం అందరిలాగే శ్రీశ్రీ ప్రభావం నామీదుంది.అయితే పుస్తకాలు చదివే అలవాటు వల్ల రా.వి.శాస్త్రి రుక్కులూ, రంగనాయకమ్మ బలిపీఠం హైస్కూల్ దినాలకే చదివున్నాను.యండమూరీ,చందూసోంబాబు,తదితర కమర్షియల్ సాహిత్యం కూడా ఇంటర్ రోజుల్లో విపరీతంగా చదివున్నా సీరియస్ తెలుగు సాహిత్యం తోనే నా ప్రయాణం కొనసాగింది.1994 నవంబర్ నెలలో మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో అచ్చైంది . అప్పటిదాకా రాసుకున్న అచ్చు కాని కవిత్వాన్ని 2000 సంవత్సరం లో లో గొంతుక గా నా మొదటి కవితా సంపుటి.1994నుండీ 2000 దాకా నెమ్మదిగా రాసాను.2000 తర్వాత రెగ్యులర్ గా రాస్తున్నా.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అవును. కచ్చితంగా ఇదే సమయంలో మనం పారిశుద్ధ్య వీరుల, గిరిజనులు గురించి మాట్లాడదాం. కచ్చితంగా ఇదే సమయంలో నలభై ప్రాణాలకు ప్రతీకారం తీర్చుకోని అత్యంత మానవతావాదం గురించి మాట్లాడదాం. ఇవి చేయలేదు కాబట్టి ఆ నలభై పోయిన ప్రాణాలకి విలువలేదు.

    ఇక కష్మీర్ ని పాకిస్తాన్ కి, బెంగాల్ ని బంగ్లాదేశ్ కి, అరుణాచల్ ప్రదేశ్ ని చైనాకి యిచ్చేసి సైన్యాన్నే రద్దు చేద్దాం. ఎందుకంటే, కేవలం మనదేశంలో మాత్రమే అమానవీయ విలువలు, నాయకులు, ప్రభుత్వాలు, చాయ్ కొట్ల నినాదాలు వున్నాయి. మన చుట్టూ వున్న దేశాలు పరమ పవిత్ర పరిశుద్ధాత్మలు. కేవలం మన వివక్షా పూరితమై విద్వేష ప్రవర్తన వల్లనే అవి మనమీద ఉగ్రదాడులు చేస్తున్నాయి. (కనీసం ఆ దేశంలోవాళ్లు కూడా ఈ విషయాన్ని ఒప్పుకోరు)

    120 కోట్ల మంది వున్న దేశంలో జరిగే అన్ని అకృత్యాలకూ కారణం మనువాదం, పెట్టుబడిదారీ విధానం, హిందూమతోన్మాదం, అగ్రకులాలు మాత్రమే. మిగతా మతాలు, కులాలు, మతానుయాయులు పరమ పవిత్రమైన మానవత మూ్ర్తీభవించినవారు.

    సానుభూతి చూపించలేకపోతే పోయె. కనీసం ఆ బలిదానాన్ని వేరే విషయానికి ఇదే సమయంలో ముడిపెట్టి మన మానవతను నిరూపించుకోవాలనుకోవడమే మన దేశ భావదారిద్ర్యం.

    మానవతా సంస్కర్త, ప్రగతిశీల, అభ్యుదయ, సిక్యులర్, లిబ్ టార్డ్
    మేధావులారా, దయచేసి ఒకనైనా మీ ఏకపక్ష, పరిమిత అవగాహన, ఉద్వేగ చోదిత స్పందనల వల్లనే సామాన్యుడిలో ఉన్మాదం పెరుగుతోందని గ్రహించండి.

  • “నీ రక్షణ కోసం ప్రాణాలర్పించేవాడూ

    నీ పరిశుభ్రత కోసం దేహాన్నిచ్చేవాడూ

    ఎవడైనా మనిషే కాసేపు మనిషి గురించి మాట్లాడకుందాం.

    భద్రతను సరిహద్దుల్లోకి కుదించి

    దేశాన్ని భౌగోళికతలోకి అనువదించి

    దేహపరిత్యాగాన్ని భక్తికి వొదిగించి

    కురచబార్చిన వాదాల గురించి మాట్లాడదాం.”

  • మనిషిని గురించి మాట్లాడే నెపంతో రక్షణ విషయాన్ని ప్రక్కదోవ పట్టించే కురచబారిన వాదాల గురించి మాట్లాడుకుందాం. మనిషిని గురించి మాట్లాడాలంటే మనకున్న పాక్షిక దృష్టి, రాజకీయ రాగద్వేషాలు, భావోద్వేగ చోదిత రెటోరిక్ ప్రక్కన బెట్టాలి. పైన నేను చెప్పినట్లుగా కొన్ిన కులాలే పరిశుద్ధాత్మలు, కొన్ని మతాలే శుద్ధపూసలు, కొన్ని వాదాలే మూర్తీభవించిన మానవతలు, మనదేశం తప్పితే అన్నీ దేవుని రాజ్యాలే అనే గిడసబారినతనం నుండి బయటపడి, ఏ మతంలోనైతే కాఫిర్ కాన్సెప్ట్ వుందో, ఏ మతంలో నైతే విగ్రహారాధకులని నిర్మూలించాలని వుందో ఆ మతాల ప్రేరిత ఉగ్రవాద దాడులని సమష్టిగా ఎదుర్కొందా. ఈ పోరాటాన్ని దారిమళ్లించే సర్వమానవ శ్రేయస్సువాదాన్ని ప్రస్తుతానికైనా మూసి లోపల పెడదాం. సమస్య మనదాకా వచ్చేదాకా ఆగకుండా స్పందిద్దాం. ఉగ్రదాడిని ఖండిస్తే మన మానవతా కీర్తికిరీటాల మణులు రాలిపోతాయాన్న చింతను వీడుదాం.

  • సరిహద్దుల కటూయిటూల ముష్కర ఆలోచనలకు అడ్డుకట్ట వేద్దాం
    అంటున్న ప్రియమైన వెంకట కృష్ణుడూ!

    కర్నూలు లోని వేణయ్య కు ( కాశీభట్ల వేణుగోపాల్ గారికి ) నీ ఆక్రందన వినిపించావా ? !

    నాగరిక మానవుల రక్షణ కోసం;
    అదే నాగరిక మానవుల శుధ్ధత కోసం;
    ప్రాణాలర్పించేవాడూ ఎవడైనా మనిషే !

    అవును సుమా, నీవన్నది నిజం సుమా!! కాసేపు మనిషి గురించి మాట్లాడకుందాం. మానవ అభివ్యక్తి లేని దేశభక్తి యేమిటో తేలుద్దాం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు