దూదిమేఘానివై ఒక్కసారి తాకిచూడు…

“గవ్వలాట వద్దులే ఇష్టం లేకపోతే. పాడుకుందామా కాసేపు?”

“ఊహూ, నాకు పాడటం రాదు”

“పోనీ నవ్వడం వచ్చుగా. నవ్వించే మాటలు చెప్పనా?”

“అసలు ఎవరు నువ్వు?”

“నాక్కూడా తెలీదు, నాకీ పని అప్పజెప్పి పంపారు, అంతే తెలుసు.”

“పంపిన వాళ్ళెవరు?”

“వాళ్ళు ఒకచోట ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక నిర్మానుష్యమైన మైదానంలో ఉన్నారు. యేళ్లకేళ్ళు పేరుకున్న మంచుని తొలిచేసి, నేలంతా చదును చేసి వస్తారు.”

“దేనికోసం?”

“గుర్తు తెలీని కాలంలో ఆ నేల అడుగున ఎవరో ఒక విత్తనాన్ని పాతిపెట్టారంట. అది ఇక ఏ క్షణమైనా మొలకెత్తవచ్చని వాళ్ళ ఆశ.”

“నిర్జీవం లోనుంచి జీవాన్ని పుట్టిద్దామనా?”

****

ఒకదానికి ఎదురుగా ఒకటి – రెండు నిలువుటద్దాలు.

ఒకటే బింబం, లెక్కలేనన్ని ప్రతిబింబాలు. మనసులోని శాంతి చుట్టూ ఉన్న వస్తువుల మీద, చెట్ల మీద, మనుషుల మీదా  ప్రసరించి, వాటి ప్రతిస్పందన తిరిగి నామొహం మీదకే చిరునవ్వుతో ప్రతిఫలించినప్పుడు…

“సగం దూరం  ప్రయాణించాను ఇప్పటికి”

“అర్ధ చక్రభ్రమణం పూర్తయిందనమాట”

“అంటే ఈ దారి సరళరేఖ కాదా?….. ప్రయాణం చివర్లో ఎక్కడికి చేరతాను?”

“ఇంకెక్కడికి, బయల్దేరిన చోటికే”

కొన్ని మన్వంతరాల క్రితం విస్ఫోటించిన నక్షత్రశకలం ఇప్పుడు నా కళ్ళెదురుగా దిక్కుల్ని వెలిగిస్తూ ఉంది. కాలవృత్తం మధ్యలో కేంద్రబిందువుగా రాలిపడ్ద ఒకానొక ధూళికణాన్నేనా నేను? మరొక సమాంతర ప్రపంచంలో పాడటం ఆపి, యుగానికొకసారి తంబుర తీగని శృతి చేస్తున్నది నువ్వేనా?

***

వానకి నానిపోయిన బండరాయి మీద నాచు దానంతట అదే మొలిచినట్టు…

“ఏం చెయ్యట్లేదు. ఊరికే చూస్తూ ఉన్నాను”

“చూపులకే చేమంతులు పూస్తాయా?

“మౌనంలో ముత్యాలు రాలిపడ్డాయిగా మరి?”

“అంటే నిష్క్రియ లోనుంచే క్రియ…”

“చెప్పానుగా, ఆలోచన వద్దు. సంధ్యాకాశం సప్తవర్ణాల్నీ నిశ్వాసిస్తుంది. దూదిమేఘానివై ఒక్కసారి తాకిచూడు.”

 ***

స్వాతి కుమారి

1 comment

Leave a Reply to Giri Prasad Chelamallu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు