కథ – దాదాపీర్ జైమన్
అనువాదం – డివి శుభశ్రీ
రోజూ నన్ను లేపడానికి పాట్లు పడే అమ్మీ, నానాకి ఆ రోజు ఆ కష్టం లేకుండా కప్పుకున్న దుప్పటిని తోసేసి, చీర తెరలోంచి పుసులుకళ్ళు నులుముకుంటూ నేరుగా స్నానాలగదికి వెళ్ళా. పోయినేడాది బడేమీ కొనిచ్చిన బేబీ బ్రష్ మీద పళ్ళల్లోని కీటాణువులను తరిమిగొడుతుందని ప్రకటనలో చూపిస్తున్న డిశుమ్ డిశుమ్ పేస్టుని బఠాణి అంత వేసి పళ్ళు తోముతూ గుడిసె బయటకి వచ్చేసరికి అమ్మీ వాకిలి అలుకుతూ కనిపించింది. కాసేపు ఆమెనే చూస్తూ నుంచున్నా. వీపు వెనకాల నానా పెడుతున్న గురక వినపడతోంది. నిన్న రాత్రే సందు చివరున్న కెంచత్త ఇంటి నుంచి తెచ్చిపెట్టుకున్న ఆవుపేడని అమ్మీ ఎప్పటిలా తదేకంగా, ఏదో లోకంలో మునిగిపోయినట్టు అలుకుతోంది. అమ్మీ అలవాటే నాక్కుడా వచ్చినట్టుంది. బడిలో నన్ను కూడా మా మిస్సు “ఎక్కడ మునిగిపోయావురా ఇమ్ము? ధ్యాస పెట్టి పాఠం విను” అని తిడుతూ ఉంటుంది. నేనిలా ఆలోచిస్తూండగా పక్క గుడిసెలోని నా వయస్సువాడే పరుస నన్ను చూడగానే ‘ఇమ్రన్ పమ్రన్ ఇమ్రక్ గుమ్రన్ కస్తూరి కమ్మరన్’ అని ఏడిపించి తన రెండు చిన్ని చేతుల్ని పిచుక రెక్కల్లా కణతకు పెట్టి ‘వెవెవెవెవె’ అని ఎక్కిరించేటప్పటికి, చేతిలో స్టీలు బిందె పట్టుకుని తేరు చక్రాలకి నీళ్ళు పొయ్యడానికి వెళ్తున్న అతన్ని నేను కూడా ‘పరుస గురుస పరుసక గురుస కస్తూరి కరుస’ అని ఏడిపిద్దామనుకున్నా కానీ నోట్లో కీటాణువులతో డిశుమ్ డిశుమ్ యుద్ధం జరగడం వల్లో లేదా ఆ రోజు తేరు ఉండడం వల్లో వద్దనుకుని ఊరుకున్నా. పరుస వెనకాలే వాడి అక్క రూపీ కూడా చిన్న బిందెతో తేరుచక్రాలకి నీళ్ళు పొయ్యడానికి వెళ్తోంది. అది అప్పటికే తలస్నానం చేసి, జుట్టు విరబోసుకుని, చిన్న క్లిప్పుతో ముందు రోజు కట్టిన మల్లెపూలూ, వాళ్ళింటి ముందున్న బట్టలుతికే బండ పక్కన పెరిగిన కామకస్తూరి ఆకొకటి తల్లో పెట్టుకుంది. టీవీలో వచ్చే ధారావాహిక హీరోయిన్ లా ఉంది. పేడ అలుకుతున్న అమ్మీ నన్ను చూడగానే,
“అలెలెలెలె… ఇంతొరగా లేసేసిందే బంగారీ. మా నాయనే… బడబడ పళ్ళు తోమి, లోపల చెంబు తీస్కని పాలు తెచ్చేసే ఇమ్ము. ఈ పొద్దు మీ బడేమీ వస్తుంది కదా. తేరు జమ్మి పెట్టుకునే పాదగట్టికి ఇవతల బస్సు ఆగదు. చా సేస్తాను. చా బిస్కత్ తినేసి, జనం ఎక్కువయే ముందే తీస్కొచ్చేద్దాం సరేనా?” అంది.
“హూ… మీ” అని పేస్టు నురగ నోట్లోనే పెట్టుకుని నేరుగా గుడిసె లోపలున్న బచ్చలికి వెళ్ళి ఉమ్మేసి, మొహం కడుక్కుని, లోపల్నుంచి చెంబు పట్టుకొచ్చి, పాలకెళ్ళే ముందు, “అమ్మీ… దొడ్డమ్మ వచ్చాక నేను కూడా తేరు చక్రాలకి నీళ్ళు పోయడానికి వెళ్ళనా?” అనడిగా.
“పక్కసందులో మన కులం సాబ్లంతా మనల్ని పింజి పింజి అని ఎగతాళి సేసి నవ్వుతానే ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇదొక్కటీ సేసావంటే కులం నుంచి గెంటేస్తారంతే” అని వాకిలి అలుకుతూనే అంది. ఏం కులమో ఏమో గానీ మేముండే వీధిలో అన్ని పండగలకీ తీపి వంటలు చేసుకుని తినడం మాత్రం మానేది కాదు. అంతా తినేసి ఇప్పుడు నా నోరు మూయించడానికి కులం అనే బాణాన్ని ప్రయోగిస్తున్న ఈ అమ్మీయే ప్రతి ఏడాది మా ఊరి పక్కనున్న బెళదేర హనుమప్ప గుడికి పళ్ళు, పూలు చెల్లించడానికి తీస్కెళ్ళేది. “ఈ హనుమప్ప మన ఇంటి దేముడు, మనింట్లోనే మట్టికుండలో వెలిసాడు!” అని ఏవో కతలు చెప్పేది. నాకు మొహం మీదంతా అమ్మోరొచ్చినప్పుడు ఊరమ్మ గుళ్ళో మొక్కుకుని వచ్చేది. ప్రతి అమావాస్యకి గుళ్ళో గోధుమ పాయసం ప్రసాదం ఇచ్చేవాళ్ళు… దానిక్కూడా తెల్లవారుజామే లేపేసి, ప్రసాదం తినిపించి ‘జేజేకి దణ్ణం పెట్టు, అప్పి’ అని దణ్ణం పెట్టించేది. మొహర్రం పండగప్పుడు దేవుడు చనిపోయే ఆఖరి రోజైతే దేవుడి వొళ్ళు కడిగేవరకు చివరి దాకా తీస్కెళ్ళొచ్చేది. రంజాన్ పండక్కి చాతైనంత రోజా చేసేది. అలాంటి అమ్మీ ఒక్కొక్కసారి ఇలా కులం గిలం, మడి మైలు అని మాట్లాడ్డం నాకైతే అస్సలు అర్థమయ్యేది కాదు.
మేము పాదగట్టి దగ్గిర చలువాదేరుల సందులో ఉండేవాళ్ళం. ఆ వీధిలో ఉన్న ఒకే ఒక్క పింజారుల ఇల్లెవరిదంటే మాదే. మేముంటున్న ఇల్లూ, స్థలం మా బడి దగ్గరున్న ఒక పెద్ద డబ్బున్న ఇంటిగలాయనది. ఆయన ఏడాదికింత అని బాడిగ తీసుకునేవాడు. మా ఇంటి పక్కనున్న మిగతా ఇళ్ళకి కూడా ఇలాగే బాడిగ ఉండేది. ఇంట్లో నేను, అమ్మీ, నానా ఉన్నాం అంతే. నానా మొదట్లో కర్రలు విరక్కొట్టే మిల్లులో రాత్రిళ్ళు పనికి పోయేవాడు కానీ ఈ మధ్య ఒంట్లో బాలేక మంచం పట్టాడు. “నేను గట్టిగా ఉన్నన్నాళ్ళు నిన్ను ఇంకోళ్ళ ఇళ్ళకి ఇంటిపనికి, అంట్లపనికి పంపించనే, పిల్ల” అనే నానా ఇప్పుడు నిస్సహాయంగా పడుకుని ఉన్నాడు. వేరే దారి లేక అమ్మీ మా సందు చివర శెట్రు ఇంట్లో పాచిపనికెళ్ళేది. రాత్రిపూట పూలు కట్టేది. నేను పూలు జతపెట్టిచ్చేవాణ్ణి. మల్లెపూలు, కనకాంబరాలు, దసరా దీపావళి అప్పుడు బంతిపూలు, ఇలా రాత్రిపూట మా గుడిసెలో ఒక వైపు నుంచి సముద్రపు అలలా పూల సువాసన వచ్చి, వేలాడుతున్న లాంతరు వెలుగుతో నదిలా హాయిగా కలిసిపోయి ఇంట్లో ఒక దివ్యమైన వాతావరణం సృష్టించేది.
మా ఇల్లెదురుగా ప్రకాశి ఇల్లు ఉండేది. ప్రకాశి, నేను ఒకే బడికి వెళ్ళేవాళ్ళం. ప్రకాశి వాళ్ళ అవ్వ నన్ను వాళ్ళింట్లోకి రానిచ్చేది కాదు. దానికి అమ్మీ, “వాళ్ళు కురుబలు… కలుపుకోరు, అదంతే. నువ్వేం బేజార్ కాకు…” అనేది. అమ్మీ పక్కనున్న శెట్రు ఇంటికి పనికెళ్ళేది కాబట్టి వాళ్ళు నన్ను టీవీ చూడనిచ్చేవారు కానీ వంటింట్లోకి మాత్రం రానిచ్చేవారు కాదు. అమ్మీ కూడా చలువాదేరు కులం వాళ్ళైన పరుస, రూపీ, అలాగే సందు చివరింట్లో ఉన్న కొట్ర—ఒక్కళ్ళంటే ఒక్కళ్ళనీ ఇంట్లోకి రానిచ్చేది కాదు… కానీ రంజాన్ పండక్కి మాత్రం అందరిళ్ళకి వెళ్ళి సేమియా ఇచ్చొచ్చేది. ఇలా కులంతో, మతంతో, ఇంటికి కుడిపక్క ఉన్న కాలవలో దోమలతో సామరస్యంగా ఎలాగోలా సర్దుకుపోయేవాళ్ళం.
“బడేమీ వచ్చాక నేను ఆమెనే అడిగి తేరు చక్రాలకి నీళ్ళు పోయడానికి వెళ్తాను,” అని కళ్ళు పెద్దవి చేసి అన్నా.
“మీ బడేమీకేమి? ఊ అంటది. తర్వాత జమాత్ కి జవాబు చెప్పుకోవాల్సింది మనమే. నువ్వు అలాంటిదేమన్నా సేసావో నీకుంటది, రేపు మీ మదరసాలో చెప్పి కాళ్ళు ఇరగ్గొట్టిస్తా.”
ఆ మాట వినగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మదరసాలో దెబ్బలు గుర్తుచేసుకుంటే ఉచ్చపోసుకోవాలనిపిస్తుంది!
ఇలా నాకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు…
“బడేమీ రానీ… ఆమెకి చెప్పి నీ కాలు కూడా విరగ్గొట్టిస్తా… వెవెవెవెవె” అని వెక్కిరించి పరిగెత్తుకెళ్ళి తేరు వీధి చేరుకున్నాను.
“చాలా బురద బురదగా ఉంటది తేరు వీధి. చూస్కొని పో” అని అమ్మీ హెచ్చరిక నా చెవులపై పడినా అమ్మీ మీద కోపం దాన్ని నిర్లక్ష్యం చేసేలా చేసింది. తేరు సాగే వీధికి నీళ్ళట్యాంకర్ తో నీళ్ళు పోస్తున్నారు. దారంతా బురదగా, రొచ్చురొచ్చుగా ఉన్నా ఆ రోజు వీస్తున్న గాలి ఎందుకో హాయిగా, ఆహా అనిపించేలా ఉంది. అదే రొచ్చుదారిలో ఎగురుకుంటూ ఎగురుకుంటూ నేరుగా తేరు దగ్గరకి వెళ్ళి నుంచుని అంత ఎత్తున్న తేరుని మెడెత్తి చూసా. ఆ తేరు మా మూడో క్లాసు కన్నడ పాఠంలో ఉన్న గలివర్ కంటే పెద్దదిగా అనిపించింది. తేరు చాలా ఘనంగా, గంభీరంగా, ఎత్తుగా, రంగురంగుల బట్టలు కట్టుకుని కొత్త పెళ్ళికూతురిలా నుంచుంది. చూసేవాడికి కొంచెం భయం కూడా వేసింది! కానీ అలా చూస్తూ నిలబడితే కాసేపటికి భయం పోయి ఇంత పెద్ద తేరుని ఇంతందంగా ఎలా కట్టారా అనిపించింది. ఒక్క నిమిషం తేరు ఊరేగబోయే వీధిని చుట్టూ చూసా. వేరేవేరే ఊళ్ళ నుంచి భక్తులు పాదయాత్ర చేసి వస్తున్నారు. ఆ తేరువీధిలో ఒక పక్కకి నుంచున్న వేరే ఊళ్ళ నుంచి వచ్చిన ఎడ్లబండ్లు, ఎడ్లకు చేసిన అలంకారం, అక్కడే పోయ్యి వెలిగించి వండుతున్న గోధుమ హుగ్గి ఘుమఘుమలు, రివ్వున వీచే చలిగాలి, ఇవన్నీ నాకు బాగా నచ్చడం మొదలెట్టి నా బయం గియమంతా ఎగిరిపోయేలా చేసాయి. నేను రోజూ తేరు నుంచున్న కుడిపక్క సందులో చివరి ఇంటి నుంచి పాలు తెచ్చేవాణ్ణి. తేరు నాలుగు చక్రాలకి జనం నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టడం చూసి రూపీ అక్కడేమైనా కనిపిస్తుందేమోనని చూసా. రూపీ తప్ప ప్రపంచమంతా తేరు చక్రానికి నీళ్ళు పోసి, టెంకాయ కొట్టడంలో నిమగ్నమైయ్యుంది. అప్పుడు నేను కూడా బడేమీని బతిమాలి ఒకసారి ఇక్కడికి వచ్చి చక్రానికి నీళ్ళు పోసి టెంకాయ కొడుతున్నట్టు ఊహించుకున్నాను. అంతలోనే మళ్ళీ ఏదేమైనా అమ్మీ మాత్రం మదరసాకి వచ్చి మౌల్వీకి చెప్పకుండా ఉంటే అదే చాలు అని మనసులోనే మొక్కుకున్నాను.
🛞🛞🛞
నేనూ, అమ్మీ పాదగట్టి దగ్గరకి చేరేటప్పటికి అప్పుడే ఒక బస్సు వచ్చి నుంచుని అందులోంచి ప్రయాణికులు దిగుతున్నారు. బడేమీ రావడమంటే పెద్ద షాదీకి అయ్యేంత సామాను వస్తున్నట్టే. మూడు రోజులు ఉండడానికి ఎనిమిది జతలు బట్టలు. నీళ్ళు మారితే జలుబు, జ్వరం చేస్తాయని ఊరి నుంచే తెచ్చుకున్న మంచినీళ్ళ బాటిళ్ళ సంచి. బొబ్బట్ల కోసం మైదాపిండి, బెల్లం. ఇవి కాక అటుకులు, పళ్ళు, కాయలు మొదలైన బ్యాగులన్నీ మోసుకుని వచ్చేది. ఈసారి కూడా అవన్నీ దిగాయి. బడేమీని చూసినప్పుడైతే నాకు అచ్చంగా మా బడిలో సునందా హెడ్మిస్ ని చూసినట్టే అనిపిస్తుంది. బడేమీ కూడా పైటకి ఎప్పుడూ పిన్ను పెడుతుంది. చీరకొంగుని నడుములో దోపుతుంది. రెండు చేతుల్లో రెండు బంగారం గాజులు, చెవులకి కమ్మలు. ఒక్కటే తేడా, సునందా మిస్ కుంకుమ పెట్టుకుంటారు, మా దొడ్డమ్మ పెట్టుకోదు అంతే… బడేమీ బస్సు దిగుతూనే పాదగట్టికొకసారి, దానికి ఎదురుగా దూరంగా కనపడుతున్న తేరుకొకసారి నుంచున్న చోటు నుంచే “యప్పా… సామీ…భగవంత, కాపాడు నాయనా” అని చేతులు జోడించింది.
అది చూసి అమ్మీ కిసుక్కున నవ్వేసరికి,
“అందరు దేవుళ్ళు ఒకటే పోవే పిచ్చిదానా… నువ్వు కూడా చేతులు జోడించరా ఇమ్ము. కొడుతుందా ఏంటి!” అని నా చేత కూడా దణ్ణం పెట్టించింది.
“బడేమీ…నువ్వెంత మంచిదానివి! అమ్మీ ఊరికే అది చెయ్యద్దు, ఇది చెయ్యద్దు అంటూ ఉంటుంది,” అని చాడి చెప్పాను.
“దానికర్థం కాదులే. నీకొకసారి ఎంత జ్వరం అంటే అంత జ్వరం. ఈ సామికి మొక్కాకనే తగ్గింది. ఇది అదంతా మర్చిపోయింది.”
అమ్మీ సామాను మోసుకుని ముందు వెళ్తూ ఉంటే, బడేమీ ఒక చేత్తో అల్లిన చిన్న బ్యాగు పట్టుకుని, మరొక చేత్తో నా చేయి పట్టుకుని అందరం నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాం. ఆరోజైతే బడేమీ దారి పొడుగునా తేరు గొప్పతనాన్ని వల్లిస్తూనే ఉంది. “మా తండ్రి, మా నాయన ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా మూలానక్షత్రాలు కలిసిరావాల. ఒకళ్ళు చావాల ఒకళ్ళు పుట్టాల. హరిజన్ల ఇంట్లో ఆవు ఈనాల, దాని జున్ను చేతికిరావాల. వాళ్ళ ఆడపడుచొకత్తి హారతిస్తే కానీ తేరు ముందుకి సాగదు. అతని ముందు ఎవరూ పెద్ద కాదు, ఎవరూ చిన్న కాదు, చూడు ఇమ్ము. అలా కాదంటే మరి ఇంతింత దూరాల నుంచి చూడ్డానికొస్తారా?” అని దేవుడి భజన చేస్తూనే ఉంది. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అమ్మీ ఇవన్నీ ఎందుకు చెప్పదు? సుద్దమొద్దు మా అమ్మీ, అని ఆమె మీద కోపమొచ్చింది… బడేమీ కాంతులీనే మాటలు వింటూ అడుగులు వేసే లోపే ఇల్లొచ్చేసింది. ఆరోజెందుకో రూపీ ఇంటి ముందు మా సందులోవాళ్ళంతా గుమిగూడి ఉన్నారు. బడేమీ వాళ్ళనలా గుంపుగా చూసిందో లేదో రూపీ ఇంటి వైపుకి పరిగెత్తింది. నేను కూడా కుతూహలంతో ఆమె వెనకే పరిగెత్తాను.
అక్కడ జరిగిందేమిటంటే: రూపీ, పరుస కలిసి తేరు చక్రాలకి నీళ్ళు పోసి టెంకాయ కొట్టి వద్దామని వెళ్ళినప్పుడు దూరంగా ఇంకో వీధిలో ఉండే పైజాతి పరమేశి, “ఇలాంటివాళ్ళు వచ్చి టెంకాయ కొడితే మైల అవుతుందనే జ్ఞానం కూడా లేదు!” అని వంకరమాటలు మాట్లాడాడట. దానికి రూపీ గుడ్లలో నీరు కుక్కుకుని టెంకాయ కొట్టకుండానే ఇంటికి పరిగెత్తుకొచ్చి ఏడుస్తూ కూర్చుందట. దాంతో ఎడ్లబండి తోలుకునే, పెళ్ళిళ్ళలో సన్నాయి వాయించే హాలప్పమామ మండిపడి, “అలా అన్నాడా ఆ పిచ్చినా కొడుకు… వాడెవడడ్డం వస్తాడో నేనూ చూస్తా, రా… ఏ చెల్లమ్మా, ఇంకో రెండు మూడు కాయలు తీస్కరా!” అని రోషంతో రూపీ చేయి పట్టుకుని తేరు దగ్గరకి వెళ్ళి తనే అడ్డం నుంచుని టెంకాయ కొట్టించాడట! అక్కడే పక్కన నుంచున్న పరమేశి హాలప్ప వాలకం చూసి కోపగించుకుని తానిచ్చిన పాత అప్పు గుర్తుచేసి, రెచ్చగొట్టి, గొడవపడి, మూతిపగలగొట్టి పంపించాడట. అంతా తనవల్లే అయ్యిందని ఒక పక్క రూపీ ఏడుస్తూ ఉంటే, మరో వైపు హాలప్ప మామ జరిగిన అవమానానికి ఏమి తోచక కూర్చున్నాడు.
“ఏ, అయిందేదో అయ్యింది. పోనిలే వదిలే హాలప్ప. కుక్క మొరిగితే దేవలోకమేమైనా పాడవుతదా? రా, నేను కూడా పొర్లుదండాలు పెట్టి ధీనమస్కారం చెయ్యాలి. నీ సన్నాయి లేందే దానికి కళే లేదు. ఇక లేచి రా,” అని కెంచత్త మొగుడు అన్నప్పుడు హాలప్పమామ, “గుంపులో గోవిందా అంటూ దొంగల్లా కళ్ళుకప్పి గుళ్ళో దూరడమే మన ఖర్మ! తలపైకెత్తి ఏ పిచ్చినాకొడుక్కి భయపడకుండా రారాజులా వెళ్ళడం మన దీంట్లోనే లేదు చూడు” అని గుడిసెలో ఒక మూలని చూస్తూ కూర్చున్నాడు.
అప్పుడు బడేమీ “అందుకేనప్పా… మనలాంటోళ్ళని చూసి పలకరించడాన్కి ఆ సామి ఏడాదికోసారి తేరెక్కి వస్తాడు. ఆ దేవుడి మీద ఎందుకు కోపగించుకుంటావ్, లేలే” అని జులుం చేసింది. అమ్మీ ఓ పక్కకి ఏం మాట్లాడకుండా నుంచుంది. ఇలాంటప్పుడు నాకు మా అమ్మీ మీద చాలా కోపమొచ్చేది. ఎందుకంటే ఆమె తనకేం సమ్మందం లేనట్టు ఉండిపోయేది. బడేమీ మాటకి విలువిచ్చో ఏమో గానీ హాలప్పమామ లేచి తనింట్లో ఉన్న బట్టల ట్రంకు మీద జాగ్రత్తగా పెట్టిన సన్నాయి తీసుకుని నేరుగా కెంచత్త ఇంటి ముందు వెళ్ళి నుంచుని వాయించడం మొదలెట్టాడు. బడేమీ, కెంచత్త, రూపీ వాళ్ళమ్మ, హాలప్ప అందరి కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయి మెరుస్తూండడం చూసి నా కళ్ళలో కూడా నీళ్ళు తిరిగాయి. అమ్మీ వైపు చూసాను. అమ్మీ కళ్ళు కూడా మెరుస్తున్నాయి…
🛞🛞🛞
మధ్యాహ్నం సుమారు మూడున్నరకి మొత్తం వీధిలో జనమంతా కాలువగట్టు అంచు మీద నుంచుని తేరు సాగే సమయం కోసం వేచిచూస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి కెంధూళి లేచింది. తేరు మెల్లగా రాజగాంభీర్యంతో సాగుతోంది. తేరువీధికి ఇరుపక్కలా నుంచున్న వాళ్ళందరూ అరటిపళ్ళు విసిరి భక్తిపారవశ్యంలో మునిగితేల్తున్నారు. ముందు నందికోలువాళ్ళు నాట్యం చేస్తున్నారు. తేరు వంద మీటర్లు సాగిందో లేదో కనుమరుగవుతున్న తేరు చక్రం అంచు విరిగి ధప్పని పడిపోయింది… జనంలో అలజడి బయల్దేరింది. బడేమీ “అయ్యో! ఏడు లోకాలు ఏలేవాడా! ఏమైయింది? మా తప్పేమైనా ఉంటే క్షమించేసేయ్ తండ్రీ! ఏం చెడ్డ శకునమో ఏమో?” అని శాంతం పాపం చేసింది. జనసమూహంతా గందరగోళంగా ఉంది. తేరుని చూడ్డానికి మేడల మీద నుంచున్న డబ్బున్నోళ్ళు వెంటనే తమ మొబైళ్ళలో ఆ దృశ్యాన్ని బంధించారు. వీధిలోవాళ్ళు కొందరు పరిగెత్తుకుని వెళ్ళి చూసొచ్చి, “నయం…సామి మహిమ. తేరుకింద పడి ఎవరూ చావలా. మన తండ్రి గొప్పవాడు” అంటూ వచ్చారు. అమ్మీ సాయంత్రం శెట్రు కిరాణాకొట్టు నుంచి నెయ్యి తెచ్చి మా పింజార ఇంటి దేవుడి మూల దీపం పెట్టి దణ్ణం పెట్టుకుంది.
రూపీ ఆ రోజు ఇంట్లో నుండి బయటకే రాలా. ప్రకాశీవాళ్ళ అవ్వ ఇదంతా ఆ హాలప్ప వల్లే జరిగిందని వంకర మాటలు మాట్లాడితే బడేమీ ఉండలేక, “బే ముసల్దానా, నాలికుంది కదాని ఎందుకలా మాట్లాడతావ్? హాలప్పకి అవమానం జరిగిందనే తేరు పడింది, అంతే” అని గట్టిగా సమాధానమిచ్చి ముసల్దాని జవాబు వినడానికి ఆగకుండా నా చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీస్కొచ్చేసింది.
ఇది జరిగిన మర్నాడే గుడి ముందుభాగంలో పశ్చాత్తాప యాగం చేసే హోమగుండం అగ్నిలో ఐదుతలల పాము ప్రతిబింబం కనపడిందని వార్తలు వచ్చాయి. గుడిలో పెద్దపూజారి “కోరినదాన్ని ప్రసాదించే మనూరి ఈశ్వరుడు, పవాడపురుష దేవుడు, గుడిలో మొఘల్ చక్రవర్తి బహూకరించిన మణిఖచిత పాన్పు మీద ఆసీనమై భక్తుల కష్టాలను పరిహరించబోతున్నాడు. గురు, లింగ, జంగమ, పాద, ప్రసాద, విభూతి, రుద్రాక్ష, పత్రి అనే అష్టావరణలకీ 5 మార్లు పూజ, 3 క్రియలు ఎప్పటిలాగే జరుగుతాయి. ప్రాయశ్చిత్త హోమం చేసాము. మన తప్పులను ప్రభువు మన్నిస్తాడనే నమ్మకముంది” అనే పత్రిక వార్తను కాలేజీకి వెళ్తున్న చలువాదేర గోపణ్ణ బడేమీకి చదివి వినిపించాడు. ఆ ఏడాది జాతర జరగలేదు. ఆ ఏడాది నేను జెయింట్ వీల్ లో, రైలులో బడేమీతో కలిసి ఆడతాననే కలా నిజం కాలేదు.
ఆ పక్కరోజు నేను తీపి తినాలని ఆశపడ్డానని అమ్మీ బొబ్బట్లు చేస్తోంది. బడేమీ చక్క మంచం మీద అడ్డంగా పడుకుని విసనకర్రతో విసురుకుంటూ, పైన వెదురు బొంగుల కప్పుని తదేకంగా చూస్తూ, “లే నూరీ… ఎవరి జీవితమూ పక్కాగా బాగుంటదని చెప్పడానికే లేదు సూడు. నీ మొగుడనే భాడ్యా ఇమ్ము కడుపులో ఉన్నప్పుడే వదిలిపోయాడు. నా మొగుణ్ణి చూస్తే పెద్దముండ తగల్కున్నట్టు ఆ బేబీ తగల్కుంది… వీడు దాన్ని ఊరికే ఉంచుకుంటే ఎట్టాగన్నా చావని అనుకునేదాన్ని! కానీ ఈళ్ళిద్దరూ ప్రేమ దోమ అని నన్ను నట్టేట ముంచేసిపోతే? నా బతుకు తేరు కూడా పడతదేమో అనిపిస్తోంది… నేను రేప్పొద్దున్న బస్సుకి ఎళ్ళిపోతా” అంది.
ఆ రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా అమ్మీ నన్నూ, బడేమీనీ తీస్కెళ్ళి తను కూడబెట్టిన డబ్బుతో రెండు డజన్ల ఎర్రటి, పచ్చటి గాజులు వేయించుకునొచ్చింది. దారిలో సావకారు భార్య కనపడింది. నానా ఆరోగ్యం గురించి అడిగింది. బాడిగ బాకీ అడగలేదు కానీ వచ్చే ఏడాది మేముండే చోట్లో వాళ్ళకి కాంప్లెక్స్ కట్టే ప్లాన్ ఉందని మళ్ళీ గుర్తుచేసింది. దానికి అమ్మీ ప్రతిసారి అన్నట్టు, “హూ” అని, మళ్ళీ మరచినట్టు “వచ్చే ఏడాది కదక్కా…ఇంకా చాలా టైముంది” అంది. ఇంటికి వెళ్తున్నప్పుడు అమ్మీ మొహం సప్పబడిపోయింది. వటవట మాట్లాడే బడేమీ కూడా ఎందుకో ఏం మాట్లాడలేదు. మర్నాడు నేను పాలు తెచ్చా. తేరు పడిన అవశేషాలు అక్కడక్కడ చిందరవందరగా కనబడుతున్నాయి. భయమేసింది. పాలు తెచ్చేటప్పుడు హడావిడిగా పాలన్నీ చిమ్ముకుంటూ నేరుగా ఇంటికొచ్చేసా. ఇంటికొచ్చేసరికి కొంచం పాలే మిగిలాయి. ఆశ్చర్యమేంటంటే ఆ రోజు అమ్మీ తిట్టలేదు…
బడేమీని తొమ్మిది గంటల బస్సెక్కించాము. బడేమీ కిటికీ పక్కన కూర్చుని అమ్మీతో “ముందు ఇమ్ముని బా చదివించవే, నూరీ” అంది. అమ్మీ తలాడించింది. అమ్మీ ఎందుకో తటపటాయిస్తోంది. బస్సు బయల్దేరింది. బడేమీ టాటా చేసింది. నేను కూడా సంతోషంగా టాటా చేసా. అమ్మీ ఏమరపాటుగా చెయ్యి ఊపింది. బస్సు బయల్దేరి ముందుకి పోతోంది. అమ్మీ బరువుగా అడుగులు వేస్తూ ఇంటి వైపు తిరిగి నా చెయ్యి పట్టుకుని ఓడిపోయినదానిలా అడుగులు వేసింది. ఒక్క యాభై అడుగులు వేసామో లేదో వెనక నుంచి బడేమీ “నూరీ” అని అరుస్తూ బస్సుని ఆపించి, దిగి పరిగెత్తుకుని వచ్చింది. అమ్మీ మొహంలో వెంటనే ఒక మెరుపు మెరిసినట్టయ్యి మొహం విచ్చుకుని తను కూడా నా చెయ్యి వదిలేసి బస్సు వైపు పరిగెత్తింది… నేనూ “టైరో మీ” అంటూ పరిగెత్తా.
“నీకివ్వాలనే తీస్కొచ్చా. ఆ బోసడీ బేబీ చింతలో మర్చేపోయా. బాడిగ బాకీ ముందు కట్టే, మిగిలింది ఇమ్ము చదువుకీ, నాన్న మాత్రలు, టానిక్కుకీ, నీ ఖర్చుకీ సరిపోతుంది” అని తెల్ల ప్లాస్టిక్లో మూటకట్టిన డబ్బు ఇచ్చింది… దాంట్లో నుంచి గాంధీ తాత బోసినవ్వులు నవ్వడం నేను చూసా. వెనక నుంచి బస్సు కండక్టరు “రామ్మో జల్దీ… లేట్ అవుతోంది” అన్నాడు. మళ్ళీ ధడ్ ధడ్ అని నడిచి బస్సు ఎక్కింది బడేమీ. బస్సు బయల్దేరింది…
అమ్మీ ఒక చేత్తో నోట్లకట్టని పిడికిలితో గట్టిగా బిగించిపట్టుకుని, ఇంకో చేత్తో నా చెయ్యి పట్టకుని తేరువీధిలో రాజఠీవితో సాగిన తేరులాగా సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో అడుగులేసింది…
*








[…] View all posts బెదిరింపులు ఏవీ నా ప్రయాణాన్ని ఆపలేవు! దాదాపీర్ జైమన్ కథ – తేరు […]
dhanam mulam idam jagat
తేరు కథ చాలా బాగుంది. శుభ శ్రీ గారి అనువాదం కూడా చక్కగా అమరింది. కథ చదువుతున్నంత సేపూ, నా చిన్నప్పుడు నెల్లూరు లో రంగనాయక స్వామి తేరు (రథోత్సవం) చూడడానికి రంగనాయకుల పేట వీధుల్లో తూర్పు వైపు వీధి పక్క ఇళ్ళ ముందర ఎదురు చూడడం, రంగుల రాట్నం ఎక్కి తిరగడం, చెరుకు గడలు, ఖర్జూరం పండ్లు, పాలైసు కొనుక్కుని తినడం, మట్టి బుడ్డీలు కొనుక్కోవడం, ఎక్కువ బొమ్మలు కొనుక్కోవడానికి మా అమ్మని డబ్బులు అడిగి, ఇచ్చేదాక ఏడవడం అన్నీ గుర్తుకు వచ్చాయి. రహీమ్ తాత భక్తిగా సీత రాముల బొమ్మలకు రంగులు వేయడం కూడా గుర్తుకు వచ్చింది. రచయితకు, అనువాదకుల కు అభినందనలు
ధన్యవాదాలండి.