తెలుసుకోవాల్సిన డాక్టర్ల కథ

ఈ నవల డాక్టర్లను దేవుళ్లుగా చూపించలేదు, రాక్షసులుగా కూడా చూపించలేదు. ఆ వృత్తిలో వాళ్ళు ఎలా నలిగిపోతారో, ఎటువంటి ఒత్తిడులు ఎదుర్కొంటారో, వ్యవస్థ మధ్యలో నలిగిపోయే మనుషులుగా మాత్రమే చూపిస్తుంది.

న జీవితంలో వైద్యుల అవసరం ఎప్పుడో కాని రాదు. శరీరం పూర్తిగా కుదేలయ్యే వేళలో, నొప్పి భరించలేని స్థాయికి చేరినప్పుడు, లేదా మనవారిలో ఎవరో ఒకరు ప్రాణాంతక పరిస్థితిలో ఉన్నప్పుడే వారి అవసరం మనకు అర్థమవుతుంది. ఆ క్షణంలో మన భయం, అసహాయం, ఆశ అన్నీ ఒకే దిశగా చూస్తాయి. వారే వైద్యులు. కానీ ఆ క్షణం దాటిన తర్వాత, వారి మీద మళ్లీ మనకు కోపం, అనుమానం, విమర్శలే మిగులుతాయి. అవసరమైనప్పుడు దేవుడిలా, అవసరం తీరిన తర్వాత నిందితుడిలా చూడడం మన సామాజిక మనస్తత్వం.

డాక్టర్ అనగానే కేవలం వైద్య శాస్త్రం చదివిన వ్యక్తి అనే భావన మనకు ఉంటుంది. కానీ ఆ పదం వెనుక నిద్రలేని రాత్రులు, ఆగని పని గంటలు, కుటుంబం నుంచి దూరం, ప్రశంసలకన్నా ఎక్కువగా ఎదురయ్యే విమర్శలు, తప్పులకు మన్నింపు లేని పరిస్థితులు దాగి ఉంటాయి. ముఖ్యంగా “జూనియర్ డాక్టర్లు”, వీళ్ళు ఇంకా వైద్యవిద్య నేర్చుకునే క్రమంలో ప్రాణాలు కాపాడే బాధ్యతలు మోయాల్సిన స్థితిలో ఉంటారు. పని సరిగ్గా చేస్తే గుర్తింపు ఉండదు, తప్పు జరిగితే మాత్రం శిక్ష తప్పదు. అయినా వాళ్ళు చేసే పని ఆపలేని స్థితిలో ఉంటారు వీళ్ళు.

ఈ నేపథ్యాన్ని కేంద్రంగా చేసుకుని డా. శ్రీకాంత్ మిర్యాల గారు రాసిన నవలే “జూనియర్ డాక్టర్”. తెలుగు సాహిత్యంలో వృత్తి ఆధారిత నవలలు అరుదు. అందులోనూ వైద్యవృత్తిని కేంద్రంగా చేసుకుని, భావోద్వేగాలకే పరిమితం కాకుండా వ్యవస్థను ప్రశ్నించే నవలలు మరింత అరుదు. ఆ కోణంలో “జూనియర్ డాక్టర్”  ప్రత్యేక స్థానం సంపాదిస్తుంది.

ఇది కేవలం ఒక వృత్తి కథ కాదు, ఒక వ్యవస్థలో నలిగిపోతున్న మనుషుల కథ. స్టెతస్కోప్ వెనుక దాగి ఉన్న అలసటను, వైట్ కోట్ వెనుక దాగి ఉన్న అనిశ్చితిని, రోజువారి విధినిర్వహణలో వాళ్ళు పడే కష్టాలను, ఎదురయ్యే అనుభవాలను, వాళ్ళు తీసుకునే ఒక్కో నిర్ణయం ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు లేదా తీసేయవచ్చు అన్న ఒత్తిడిని ఈ నవల నిజాయితీగా ఆవిష్కరిస్తుంది. జూనియర్ డాక్టర్ల అంతరంగాల్లో జరిగే యుద్ధాన్ని బయటపెడుతుంది.

గౌతమ్ అనే జూనియర్ డాక్టర్ పాత్ర ఈ కథకు కేంద్రం. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా విధుల్లోకి నియామకం అవ్వటం కోసం వచ్చిన గౌతమ్, అక్కడి స్నేహితులు శేఖర్, బిలహరి, అతను ఇష్టపడే జూనియర్ డాక్టర్ నిహారిక, వాళ్ళ మధ్య జరిగే ఆసక్తికర సంఘటనలు, వైజాగ్ చుట్టుపక్కల హాస్పిటల్లో విధినిర్వహణలో వాళ్ళు చేసే వైద్యం, సింహాచలం గుడి, వైజాగ్ బీచ్… వీటన్నిటి చుట్టూ జరిగేదే ఈ నవల వృత్తాంతం.

వైద్యవృత్తిలో జరిగే సంఘటనలతో పాటు విశాఖపట్నాన్ని కూడా కథలో ఒక పాత్రగా చూపించారు. బీచ్ రోడ్డు, సింహాచలం గుడి, నేవీ క్వార్టర్స్ ఇలా ఆ ఊరిని కూడా కథ చెప్పటానికి ఉపయోగించిన తీరు బాగుంది. అంతర్లీనంగా విశాఖపట్నం వీధుల్లో మనం కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.

మొదట్లో సేవా భావంతో ఉన్న గౌతమ్, క్రమంగా బాధ్యతా భారంతో నలిగిపోతూ, వ్యవస్థ వైఫల్యాల మధ్య కఠినంగా మారే వ్యక్తిగా మారతాడు. ఈ పాత్ర పరిణామమే నవల అంతర్గత బలం. ఈ మార్పు ఒక్క గౌతమ్‌దే కాదు, ఈ వ్యవస్థలోకి అడుగుపెట్టే ప్రతి యువ వైద్యుల మానసిక ప్రయాణం. బిలహరి’ నవ్వుల వెనక దాగి ఉన్న విషాదం, ‘బార్కోడ్ బ్రూస్లీ’ లాంటి పాత్రల ద్వారా వైద్యుడూ ఒక సాధారణ మనిషేనన్న సత్యాన్ని రచయిత బలంగా గుర్తుచేస్తాడు. వీరంతా హీరోలు కాదు, విలన్లు కాదు. వ్యవస్థ మధ్యలో చిక్కుకున్న వ్యక్తులు మాత్రమే.

గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లేమి, ఆ పరిస్థితుల్లో జరిగే ప్రసవాలు, అప్పుడే పుట్టిన శిశువుల ఆరోగ్య సమస్యలు, సంతాన ప్రాప్తి కోసం దంపతులు చెప్పే అమాయక కారణాలు, వరకట్న వేధింపుల హత్యలు, టీనేజ్ కుర్రాళ్ళ నిర్లక్ష్యానికి చెల్లించాల్సిన మూల్యం, డాక్టర్లపై జరిగే దాడులు, రేబీస్ లాంటి వ్యాధుల ప్రమాదం, మానసిక వైద్యంపై ఉన్న అపోహలు, పీజీ మెడికల్ ఎంట్రన్స్ మాఫియా… ఇలా అనేక సామాజిక, రాజకీయ అంశాలను ఈ నవల స్పృశిస్తుంది.

నవలలోని కొన్ని వాక్యాలు హాస్యంగా కనిపించినా, లోతైన విమర్శను దాచుకుని ఉంటాయి. “పోలీసులు, వైద్యులు తీర్చలేని బాధను ప్రభుత్వం సారా అమ్మి తీరుస్తుంది” అనే వాక్యం నవ్వు పుట్టిస్తూనే వ్యవస్థ వైఫల్యాన్ని మొహం మీద కొడుతుంది. ప్రతి అధ్యాయానికి పెట్టిన వైద్య సంబంధ శీర్షికలు ‘గుండె మార్పిడి’, ‘విరిగిన ఎముక’ లాంటివి కేవలం సాంకేతిక పదాలు కాక, గౌతమ్ జీవితంలోని భావోద్వేగ స్థితులకు సరిపోయే రూపకాలుగా నిలుస్తాయి.

భాష పరంగా ఈ నవల బలంగా నిలబడుతుంది. వైద్య వృత్తిలోని పదజాలం సాధ్యమైనంతవరకు తెలుగులోనే ఉపయోగించాలన్న ప్రయత్నం అభినందనీయం. సిరులు, ధమనులు, కాలేయం, రక్తనాళాలు ఇలా చాలా వరకు వైద్య సంబంధిత పదజాలం తెలుగులో వాడటం బాగుంది. వ్యంగ్యాన్ని మితంగా ఉపయోగిస్తూ, అనవసర వర్ణనలు లేకుండా సూటిగా చెప్పే శైలి పఠన వేగాన్ని పెంచింది. అచ్చుతప్పులు తక్కువగా ఉన్నాయి. పాత్రల మధ్య సంభాషణలు పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్లా ఉండటం కాస్త ఇబ్బందిగా అనిపించినా కథన ప్రవాహం దాన్ని కప్పేస్తుంది. వైద్యవృత్తిలో జరిగే పరిణామాలపై అవగాహన లేని పాఠకులను కూడా ఆకట్టుకునేలా ఉంది ఇందులోని కథనం.

ఈ నవల డాక్టర్లను దేవుళ్లుగా చూపించలేదు, రాక్షసులుగా కూడా చూపించలేదు. ఆ వృత్తిలో వాళ్ళు ఎలా నలిగిపోతారో, ఎటువంటి ఒత్తిడులు ఎదుర్కొంటారో, వ్యవస్థ మధ్యలో నలిగిపోయే మనుషులుగా మాత్రమే చూపిస్తుంది.

వైద్యవృత్తి ఇతివృత్తంతో తెలుగు సాహిత్యంలో ఇప్పటికే చాలా రచనలు వచ్చినప్పటికీ, ఈ నవల ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా చూపించడంలో సఫలం అయ్యింది. రచయిత శ్రీకాంత్ గారు స్వతహాగానే వైద్యులైన కారణాన ఇందులో చెప్పిన సంఘటనలు, విషయాలు ప్రామాణికత సంతరించుకున్నాయి. ఇందులోని కొన్ని అంశాలు (పీజీ మెడికల్ ఎగ్జామ్ మాఫియా, మానసిక వైద్యం) కచ్చితంగా చర్చించాల్సిన అవసరం ప్రస్తుతం మనందరికీ ఉంది.

ఈ నవల చదివితే కేవలం ఆ వైద్యవృత్తిని అర్థం చేసుకోవడమే కాదు, దాని వెనకున్న మనిషి అంతర్గతం మనకు అర్థమవుతుంది. వైద్యవృత్తిని అర్థం చేసుకోవాలనుకునేవారికే కాదు, మన సమాజాన్ని అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ నవల అవసరం.

మన మధ్యే ఉన్నా, మనం గమనించని డాక్టర్ల కథే ఈ “జూనియర్ డాక్టర్”.

జూనియర్ డాక్టర్ (నవల) – డా. శ్రీకాంత్ మిర్యాల

అజు పబ్లికేషన్స్ ప్రచురణ

170 పేజీలు

₹ 220

అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం

అమెజాన్ లింక్ – https://amzn.in/d/hhOH4Hl

 

అజహర్

2 comments

Leave a Reply to Maruthi Powrohitham Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు