తెలంగాణ కథ నేర్పుతున్న “నెనరు”

రంది , తన్లాట , అలుగు , కూరాడు, దావత్ , రివాజు ,రూబిడి, బుగులు…ఇవన్ని కేవలం తెలంగాణ పదాలు మాత్రమే కాదు గత 9 సంవత్సరాలుగా తెలంగాణ నుండి వచ్చిన కథల్లో కొన్ని ఉత్తమమైనవి తీసుకొని ఒక సంకలనంగా తీసుకొస్తూ, వాటికి పెట్టిన పేర్లు. ఇప్పుడు తెలంగాణ కథ-2021 కి పెట్టిన పేరు “నెనరు”. 13 ఉత్తమ కథలతో  “నెనరు’”హైద్రాబాద్ బుక్ ఫేర్లో ఈ నెల 26న ఆవిష్కరణ జరిగింది. ఈ పనిని చాలా సమర్థవంతంగా చేస్తున్నారు డా.సంగిశెట్టి శ్రీనివాస్ ,డా.వెల్దండి శ్రీధర్. “నెనరు”కు ఎంపికైన కథకులు పంచుకున్న మాటలివి…

‘కొత్త దొరలు’

కాలం తెస్తున్న మార్పులకు అనుగుణంగా సమాజం మారుతుందా లేక దాన్లోంచి మనుషులు మారుతున్నారా అని ఆలోచిస్తే సంఘర్షణ పరిస్థితులను ఎదిరించిన బడుగులు, సంఘాల ఆశలతో తమ తమ కులాలలో గాని సామాజిక జీవితంలో గాని,ఎంతో కొంత మార్పు సాధించుకున్నారు.

అయితే అధికార దర్పం, అవకాశవాదం, ధన బలంతో మారినట్లుగానే అనిపించే ఆధునిక దొరలు వాళ్ల మనస్తత్వం మాత్రం కొత్తకోణంలో ఆవిష్కరింపబడటమే ఈ ‘కొత్త దొరలు‘. ఈ కథలో సమస్యలన్నీ ఆధునిక వ్యవసాయంలో దొరలు తమ తమ తరాల నుంచి వచ్చిన పీడిత మనస్తత్వాన్ని, వారసత్వంగా వచ్చిన భూముల్లో పాలేర్లతో పనులు చేయించుకుంటూనే మళ్లీ జీతాలు చెల్లించకుండా దొంగతనంగా భూముల్ని అమ్ముకొని వెళ్తున్నారు. అందులో ఆత్మవిమానాన్ని దెబ్బ కొట్టి, కుట్రలు చేసి మరి వెళ్ళిపోతున్నారు. అలా అటు దొరల నుంచి తప్పించుకొని , ‘వ్యవసాయం చేయడం కంటే ఊరోదులుకోవడం మేలు‘ అని అనుకొని సిటీ కి వచ్చినా  అక్కడ కూడా అణగదొక్కేది పాలేరులనే. ఎటు తిరిగినా లాభపడేది ‘కొత్తదొరలే’.

⁃ తమ్మెర రాధిక

‘అంగడి’

గ్రామాల్లో ఆధిపత్య వర్గాల పోరు, పని కోసం పెనుగులాట, అంగడంగడి అవుతున్న బహుజన జీవితాలకు ఉదాహరణ నా కథ. ఎర్ర కొమురడు, భాగ్యలక్ష్మి, వైకుంఠం తెలంగాణ పల్లెల నుంచి నడిచి వచ్చి నా కథలో పాత్రలుగా నిలుచున్నారు. వాళ్ళ జీవితాల్లో నిండిన కల్లోలాన్ని, అచ్చమైన తెలంగాణ తెలుగులో చెప్పడానికి ఈ కథలో ప్రయత్నించాను. వడ్రంగి ‘సంగడి’ పట్టినంత జాగ్రత్తగా ఈ కథ అల్లుకుంటూ పోయాను. ‘అంగడి’ని చదవడం అంటే ఒక పల్లె జీవి బతుకు తన్లాటను అక్షరాలతో గుండెలోకి తీసుకోవడం.

⁃ డా. వెల్దండి శ్రీధర్

‘కుక్క సద్ది’

గొల్లోల బతుకుల్లోని విషాదాన్ని చూపే కథ ఇది . గొర్ల మందను కాపాడే కుక్కకు ఆహారంగా  పాచి పోయిన, మాడిపోయిన, మిగిలిపోయిన పదార్థాలు వేసినా  కూడా అది  విశ్వాసాన్ని చూపే కథ. మందను కాసే కుక్క కంటే కూడా హీనమైన, దీనమైన బతుకులు బతుకుతున్న గొల్లవారిని చిత్రించిన కథ. గొర్ల కాపల కుటుంబంలో చదువుకొని ప్రయోజకుడు అయిన వ్యక్తి కూడా తన చిన్నతనంలో దొర కుక్కలు తినే కూడు కూడా తాను తినలేని స్థితిలో ఉన్న ఒక సామాజిక పరిస్థితిని చిత్రించిన కథ ‘కుక్క సద్ది’.

                                                                                                                                                                               ⁃ కాలువ మల్లయ్య

‘ఏం జరిగింది’

మానవ సంబంధాలు మృగ్యమై పోతున్న రోజులు ఇవి. తమ గురించి తప్ప పక్కవారిని గురించి ఏ మాత్రం పట్టించుకోని రోజులు. పల్లెలు కూడ చాలా మారుతున్నాయి. కానీ ఎంతో కొంత ప్రేమ, మానవ సంబంధాలు ఉంటున్న మనుషులు ఇంకా ఉన్నారు. అందుకు సంబంధించినదే ఈ ‘ఏం జరిగింది’ కథ.

తన మనసుల ఉన్నదానిని డైరెక్ట్ గానో, ఇండైరెక్టు గానో బయటకు వెళ్లగక్కుతుంది – ఇందులోని పాత్ర (జనరల్ గా పల్లె జనం). అనడం వరకే కానీ మనసులో పెట్టుకుని కుట్రలు చెయ్యడం తెలియదు ఆ పాత్రకు. తెల్లవారితే అన్నీ మర్చిపోయి తానే ఒకటికి రెండుసార్లు మాట కలుపుతుంది. (నిజానికి ఈమె ఆస్తిని అవతలివారు తీసుకుంటారు. తన కుటుంబం వారి వల్ల ఇబ్బందులు పడతది. ఆ ఆక్రోశాన్నే వెళ్లగక్కుతాది). పల్లెల్లోని మానవ సంబంధాల గురించిన కథ ఇది.

⁃ తాయమ్మ కరుణ

‘ఆమె పేరు హంపి’

సాదా సీదాగా నడిచే జీవితం కొన్నిసార్లు నిర్వచనాలకు, కట్టుబాట్లకు లొంగదని, అంత కాలం నమ్మిన సమాజ నిర్మిత నియమాలను విసిరిగొట్టేలా, కొన్ని స్థల కాలాలు మనుషుల్ని ప్రమాదకరంగా జంతు ప్రవృత్తి వైపు నడిపిస్తాయనీ… చెప్పటం ఈ కథ ఉద్దేశం. ఆ క్షణాన అదే సహజమా, లేక నాగరికత నేర్పిన విలువలు ముఖ్యమా అనే ప్రశ్న మనకు వినిపిస్తుంది.

                                                                                                                                                                                     ⁃ కిరణ్ చర్ల

అనిశ్చితికి ప్రతిబింబం 

అనిశ్చితీ సందిగ్ధతా భయాలూ–వొక్కో తరాన్ని వొక్కో విధంగా బాధిస్తాయి. మిలీనియల్ తరం ఇంకాస్త భిన్నంగా ఆ uncertainty నీ, బతుకు భయాన్నీ అనుభవిస్తోంది.
ఏ రకంగా వాదించినా ఆ uncertainty ని పరిష్కరించే సాధనాలు తక్కువే! కొన్నిసార్లు బలమైన స్నేహాలు కూడా ఆ పెనుగాలి ముందు బలహీనమైపోతాయి. చివరికి అంతుపట్టని disappointment మిగిలిపోతుంది..”ఐ” ని అర్థంచేసుకోలేక!!
me, me –“నేను” నేను” తప్ప ఈ తరానికి ఇంకోటేదీ తెలియదని అంటాం కానీ, ఆ “నేను” వెనక వుండే చిత్రహింసని ఎవరు చూస్తారు?! ఈ కథ వొక అనుభవ శకలం మాత్రమే! ఇందులోనూ అర్థసత్యమే వుండచ్చు!

—- అఫ్సర్

‘తక్కెడ’

జీవితమే ఒక తక్కెడ…ధైర్యమే నిలబెట్టేది. తక్కెడ…. అంటే తరాజు(త్రాసు). మా చిన్నప్పుడు నాన్నమ్మ, తాతలు తక్కెడ అనే పిలిచేవాళ్ళు. అలాగే తక్కెడ ఒక కొలమానం గా కూడా వాడేవాళ్ళం. ఒక తక్కెడ మిరపకాయలు, తక్కెడ చింతపండు అనే వాళ్ళు. సుమారు రెండున్నర కేజీల బరువు తక్కెడతో సమానం.

లక్షల రూపాయలు ఖర్చు పెట్టే మనుషులు కూడా… కూరగాయల దగ్గరకు వచ్చే సరికి బేరం ఆడుతారు. రోజంతా కష్టపడే వాళ్ళ కి ఒక ఐదు రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి గీసులాడతారు. సంతల మీద ఆధారపడి బతికేవారు ముఖ్యంగా కరోనా టైం లో…వాళ్ళు అనేక కష్టాలు పడ్డారు. ఒకరోజు వంద రూపాయలు ఉండే టమాటా, ఉల్లిపాయల ధర…. కొన్ని సార్లు ఐదు రూపాయలు కూడా ఉండదు. డిమాండ్ సప్లయ్ ని బట్టి….తక్కెడలో తూకం అటూఇటూ మారుతుంది. జీవితం కూడా ఒక తక్కెడ లాంటిదేననీ… కష్టసుఖాలను సమానంగా తీసుకుని…. ధైర్యంగా పోరాడాలని చెప్పిన ఒంటరి మహిళ కథే ఈ తక్కెడ.

⁃ చందు తులసి

‘గోధుమరంగు పాము’

మా యాదాద్రి భువనగిరి ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా మలిచిన కథ అది. నిజానికి ఆ కథలోని బాధిత వ్యక్తి నాతో స్వయంగా పంచుకున్న అతని కుటుంబ విషాదాన్ని నేను కాస్త కల్పనను జోడించి కథగా రాసుకున్నాను. డ్రగ్స్ మత్తులో యువత నిర్వీర్యమైపోతున్న ఒక కాల సందర్భం నన్ను పూర్తిగా కలచి వేసింది. తాత్కాలికంగా ఒక చోట మాటల సందర్భంలో పరిచయమైన వ్యక్తి తన దుఃఖాన్ని తనతో పంచుకున్న సన్నివేశానికి శాశ్వతత్వాన్ని కల్పించే ఉద్దేశంతో అతని విషాదాన్ని కథగా రాశాను. అదిలా తెలంగాణ కథావార్షికకు ఎంపిక కావడం చాలా ఆనందాన్నిచ్చింది. చిత్తశుద్ధితో సమాజానికి అద్దం పట్టే ఏ కథకైనా ఎప్పటికైనా చరిత్రలో గుర్తింపు దొరుకుతుందనటానికి నా ఈ ‘గోధుమరంగు పాము’ కథే మంచి ఉదాహరణ.

⁃ చిత్తలూరి సత్యనారాయణ

‘చెల్లని మొహం’

మన భారతీయులమంతా, కులమతాలకతీతంగా, రాగద్వేషాలకు తావివ్వకుండా, తారతమ్య భేదాలు మరిచి, వావివరసలు విడిచి, బంధుప్రీతిని బహిష్కరించి, ఒకే తాటిపై, చేయి చేయి కలిపి ఒక్క మాటకై కట్టుబడి ఉన్నామంటే అది కేవలం అవినీతిలో, అన్యాయంలో, ఆక్రమంలో, అనైతికంలో ఇంకా ఇలాంటివాటిల్లో మాత్రమే. అంతటి ఐకమత్యం మనది. ఇందులో చేరనివారు చాలా అంటే చాలా కొద్దిమందే.
సంఘాన్ని తప్పుపడతాం మనం. ముందుగా అందులోని సభ్యులం మనం. ఎదుటివారిని వేలెత్తి చూపించే ముందు మనల్ని మనం శల్యపరీక్ష చేసుకుందాం.
అలా ఉండకూడదనుకుంటే ముందు మనందరం మననించి మొదలుపెడదాం. ఈ ‘చెల్లని మొహం’ నా వంతు ప్రయత్నం.

⁃ కొట్టం రామకృష్ణారెడ్డి

‘కే.టీ’

ఫార్మా ఇంజినీరింగ్ రంగంలో, మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం వచ్చిన మార్పుల్లో ఎక్కువ గా చూసినవి స్టార్టప్స్ నెలకొనడం. వాటికోసం ఇక్కడి ప్రభుత్వం టీ-హబ్, వీ-హబ్ లాంటివి పెట్టడం కూడా జరిగింది. అయితే ఈ అంకుర సంస్థలు పెడ్తున్న వారి ఆలోచనలు, వారు వచ్చిన ఇన్స్టిటూట్ బ్యాక్ గ్రౌండ్ గా ఎలా హెల్ప్ అవుతున్నాయి, ఇప్పుడున్న యువతకి జాబ్ ప్రెషర్తో ఉన్న ఆలోచనల్ని కలగలిపి రాసిందే ‘కే.టీ’ కథ. ఇన్నోవేటీవ్ ఇంకుబేషన్ల గురించి చేసిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఈ కథకు చాలా వరకు హెల్ప్ అయ్యింది.

⁃ మన్ ప్రీతమ్

‘దూరం’

ఎడారిలో చెట్లు కూడా పూలనే ఉయ్యాలనుకుంటాయి. కానీ ప్రతికూల పరిస్థితులే వాటిని పూలకు బదులుగా ముండ్లను పూచేలా చేస్తాయి. ఆ ఊరిలో రహీం కూడా అంతే. ఊరి అభివృద్ధిలో అతని భాగస్వామ్యం ఉంది. ప్రతి పని వెనుక అతడున్నాడు. కానీ ఊరే అతడిని దూరం పెట్టింది. దూరం పెట్టిన చోటనే అస్తిత్వం కోసం అతను చేసిన పోరాటమే కొందరికి వరంగా మారింది. తాను ఈ దేశ పౌరుడిగా నిరూపించుకోవడానికి ఏం చేయాలి అని అడిగిన తీరు ప్రతి పౌరుడికి ఒక ప్రశ్ననే. రంజాన్ కు సెంట్ సీసాను, దసరాకు బంగారాన్ని ఆత్మీయంగా పంచుకునే ఆ రెండు కుటుంబాల మధ్య దూరం ఎందుకు పెరిగింది. పావని ఫాతిమాగా ఎందుకు మారింది. ఏ కాలనీ లేనిచోట ఇస్లాం నగర్ ఎందుకు వెలిసింది. తినే తిండి మీద చేసే పూజల మీద ఆంక్షలు ఎవరు పెట్టారు. సున్నితమైన అంశాన్ని లోతుల్లోకి వెళ్లి విశ్లేషించిన కథనే ఈ దూరం. ఇందులో రహీంలు రాములు పంతులు మౌలానాలు అందరూ పాత్రధారులే.

⁃ పెద్దింటి అశోక్ కుమార్

‘మోకు దెబ్బ’

ఈ కథలో రామగౌడు కష్టపడి గీసిన కల్లుని అహంకారంతో ఓ వ్యక్తి రోజు కల్లుని ఉచితంగా పొందుతూ అతనిని బెదిరిస్తూ ఉంటాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఓ రోజు రామగౌడు అతన్ని ఎదిరిస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇన్ని రోజులుగా తన శ్రమను దోపిడీ చేసిన వ్యక్తిపై కోపంతో అతని దగ్గర ఉన్న ‘మోకు’ తో కొడతాడు. అలా కొట్టంతో తనకు ఓ సామాన్యుడు ఎదురుతిరగడం  నామోషి  అవుతుందని ఆ వ్యక్తి ఊరు విడిచి వెళ్ళిపోతాడు. చాలా  గ్రామాల్లో కొన్ని వర్గాల వ్యక్తులు కొంతమంది శ్రమను దోచుకుంటారు. అలా దోచుకుంటున్న వ్యక్తికి ఎదురు తిరిగితే ఎలా విముక్తి దొరుకుతుంది అనే కోణంలో రాసిన కథ ఇది.

⁃ జాలిగామ భానుప్రసాద్ గౌడ్

‘అర్బన్ అన్టచబులిటి’

ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఏ విధంగా కులవివక్ష వెంటాడుతుందో నా స్వీయ అనుభవం ‘అర్బన్ అన్టచబులిటీ‘ కథలో చెప్పాను. ఈ కథలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ప్రతి సంఘటన ప్రతి క్యారెక్టర్ వాస్తవం. కులం అనేది ఎలా రూపాంతరం చెందిందో ఈ కథలో చెప్పే ప్రయత్నం చేశాను. పైకి ముట్టుకున్నా, మనసులో  ఉన్న అంటరానితనం రూపు మారాలి అంటే మనం మారాలి అని చెప్పే ప్రయత్నం చేశాను.

⁃ డా.గాదె వెంకటేష్

*

మన్ ప్రీతం

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథకుల కథ వెనుక కథని కొండను అద్దంలో చూపారు. సంపాదకులకు, కథకులకూ హృదయపూర్వక అభినందనలు .

    • ఏం జరిగింది? కథ పిడిఎఫ్ ఉంటే పంపించగలరు.

  • కథకులు అందరికీ అభినందనలు 💐💐💐. నెనరు సంపాదకులకు ధన్యవాదాలు.
    సారంగ సంపాదకులకూ….మన్ ప్రీతమ్ కి కూడా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు